ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label ఇంజినీరింగ్. Show all posts
Showing posts with label ఇంజినీరింగ్. Show all posts

Tuesday, 9 July 2013

నేనో ఐఐటియన్‌ని... కానీ అందుకు గర్వపడటంలేదు!

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు   తెచ్చుకున్నంతమాత్రానే భవిత ఉజ్వలంగా మారిపోయినట్టు కాదు. డ్రాపవుట్లుగా మిగిలే ప్రమాదం... పొంచే వుంటుంది! విద్యార్థులు అక్కడి క్యాంపస్‌ జీవితం గురించి ముందస్తుగానే ఒక అవగాహనతో ఉండటం మేలు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ రూర్కీ ఐఐటీలో పేపర్‌ అండ్‌ పల్ప్‌ టెక్నాలజీ చదువుతున్న నూతక్కి శరత్‌ తమ క్యాంపస్‌ పరిస్థితులను ఇలా విశ్లేషిస్తున్నాడు...


నదేశంలో ప్రాముఖ్యం కలిగిన, ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఐఐటీలు. అందులో ప్రవేశించాలనేది ఎందరో విద్యార్థులు స్వప్నించే విశేషం. ఆ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి కఠినమైన శిక్షణ పొందుతారు. నేను జేఈఈలో సఫలమైన వాళ్ళలో ఒకణ్ణి. ఈ ప్రవేశపరీక్ష ప్రాతిపదికగా సీట్లు కేటాయించే సంస్థలు పదిహేడు. అందులో పదిహేను ఐఐటీలు. మిగతా రెండు కూడా వీటితో పోలిస్తే ఇంచుమించు అదే స్థాయిలోనివే. ఈ సంస్థలు విద్యార్థులకు అత్యున్నత సదుపాయాలు, మంచి ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులను అందిస్తాయి. ఇవన్నీ నిజాలే అయినప్పటికీ, విద్యార్థులూ, తల్లిదండ్రులూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకా వేరే ఉన్నాయి.

పైన ఉన్న శీర్షిక నేనేమి రాయబోతున్నానో చెబుతుంది. అవును, సాధించినదానికి నేనేమీ గర్వపడడం లేదు. అందరిలాగే నేనూ ఈ ప్రవేశాన్ని ఒక కలగా భావించాను. క్యాంపస్‌లోకి ప్రవేశించేవరకు అంతా బాగానే ఉంది. నిజానికి నాకు ఎన్‌ఐటీ, జంషెడ్‌పూర్‌లో ఇంకో అవకాశం ఉంది. అది ఉపయోగించుకోలేకపోయాను.

'ఐఐటియన్స్‌ అందరికీ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి' అని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. ఈ అభిప్రాయం సరైనది కాదు. అది కేవలం మన బ్రాంచి మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి 'ఐఐటియన్లందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయి' అనేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే అనేక ఇతర ప్రైవేటు కళాశాలల విషయంలో కూడా ఇదే నిజం.

ఏ బ్రాంచి అయినా సరే, ఐఐటీల నుంచి ఉద్యోగాలు పొందిన వారు సగటున సంవత్సరానికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. 'అమృత' లాంటి ప్రైవేటు కళాశాలల్లో చదివినవారు కూడా దాదాపుగా ఇంతే సంపాదిస్తున్నారు. మీరు వినే- సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయల ఉద్యోగాలు వందలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దానికోసం మన జీవితాన్ని పణంగా పెట్టలేము, అవును కదా?

కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌ (ఈసీఈ) ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఈ బ్రాంచుల్లో ఉంటేనే అందరూ గొప్పగా అనుకునే ఐఐటియన్‌ కింద లెక్క. నేను ఈ సంస్థలు నాణ్యత లేవని చెప్పటం లేదు. కానీ ఎక్కువగా ఆశించి నిరాశ పడవద్దని మాత్రమే చెబుతున్నాను. నా అభిప్రాయాలు ప్రతికూలంగా ఉన్నట్లు మీకు అనిపించినా, నియామకాలకు సంబంధించి నేను చెప్పదలచుకున్నదీ, నాకు అనిపించిందీ మాత్రం ఇదే!

అత్యున్నత వసతులు
ఇక క్యాంపస్‌ జీవితానికి వస్తే భారతదేశంలోని మిగతా ఇంజినీరింగ్‌ కళాశాలల కన్నా అత్యున్నత సౌకర్యాలున్న మాట వాస్తవం. ఇక్కడ విద్యార్థులకు 'ఇంటర్న్స్‌' ఇంకా బాగుంటాయి.

వ్యక్తిగత, వ్యక్తిత్వ అభివృద్ధికీ, నైపుణ్యాలను పెంచుకోవడానికీ ఇక్కడ అనంతమైన అవకాశాలుంటాయి. రకరకాల హాబీల క్లబ్బుల్లో పాల్గొనటం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఆ సంగతి చాలామందికి వాళ్ల కోర్సు పూర్తి అయ్యాక కానీ అర్థం కాదు. అదృష్టవశాత్తూ నాకది అర్థమైంది. పోటీపడిన ప్రతి అంశంలోనూ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. కేవలం పాల్గొన్నందుకు కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. అవి తరువాత మన రెజ్యూమె తయారు చేసుకునేటప్పుడు ఉద్యోగావకాశాలకు చాలా సహాయకరంగా ఉంటాయి.

బోధనను అధికంగా ఆశించకండి
ఇక ఉపాధ్యాయుల విషయం. ఈ విషయంలో కూడా ఎక్కువ ఆశించనవసరం లేదు. ఎవరికి వారు చదువుకోవాల్సిందే. సబ్జెక్టు వరకూ చూస్తే వాళ్లు అత్యున్నత ప్రమాణాలు కలవారే అనడంలో సందేహం లేదు. కానీ వాళ్లలో కొందరికి బోధించడంలో నైపుణ్యం లేదు. మీరు దక్షిణ రాష్ట్రాలవారై ఉండి హిందీ అర్థం కానివారైతే, ఇలాంటి విద్యార్థులు ఉత్తర రాష్ట్రాల్లో చేరకముందే హిందీ నేర్చుకోవడం మంచిది. మీ ప్రొఫెసర్‌ అర్థం చేసుకోగల ఇంగ్లిషు మాట్లాడతారనీ, కనీసం ఇంగ్లిషయినా మాట్లాడతారని మాత్రం ఆశించవద్దు.

నా ఇంటర్‌ను ఓ కార్పొరేట్‌ కళాశాలలో పూర్తిచేశాను. అక్కడ చదివిన మిగతావారిలాగే అదొక విద్యాసంస్థలా కాక జైలులాగే నాకు అనిపించేది. అలాంటి వాతావరణం నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా వాతావరణంలోకి రావడంతో నాకు వూపిరి ఆడినట్లయింది. అక్కడ ఇరవై నాలుగు గంటలు చదువు, ఇక్కడ కావాల్సినంత స్వేచ్ఛ. ఏమైనా చేసే అవకాశం ఉందిక్కడ. అది కొంతమందిని తప్పుదారి పట్టిస్తుంది. ఐఐటీ డ్రాప్‌ అవుట్ల విషయంలో మన ఆంధ్ర విద్యార్థులు పేరు తెచ్చుకున్నారని అందరికీ తెలిసిన విషయమే.

ఇక్కడ లభించే స్వేచ్ఛను నేను తప్పు పట్టడం లేదు. అక్కడి జైలులాంటి జీవితాన్ని మాత్రమే తప్పు పడుతున్నాను. ఇంటర్‌లో పడిన పునాది జేఈఈని విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా సహాయపడింది. అందులో సందేహం లేదు. కానీ జీవితానికి అదే సరిపోదు కదా!

రూర్కీ విషయానికి వస్తే ఒక మిడ్‌టర్మ్‌ పరీక్ష మాత్రమే ఉంటుంది. 25 శాతం మార్కులు క్లాస్‌వర్క్‌ సెషనల్స్‌కి కేటాయిస్తారు. ఇది ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోలాగా ఉంటుంది. కానీ 25 శాతం అనేది సగటు సంఖ్య. తుది పరీక్షలకు 50 నుంచి 40 శాతం మాత్రమే కేటాయిస్తారు.


ఏ ఐఐటీలో అయినా గ్రేడ్స్‌ సాపేక్షిక ప్రాతిపదికన కేటాయిస్తారు. A+ అంటే పది పాయింట్లు. దానిని అనుసరించే A, B+, B, C+, C, D, F ఉంటాయి. అంటే 9, 8, 7, 6, 5, 4, 0 పాయింట్లు. ప్రతి సబ్జెక్టుకూ క్రెడిట్లు ఉంటాయి. ఉదాహరణకు లెక్కలకి నాలుగు క్రెడిట్లు. లెక్కల్లో B+ వస్తే దాని పాయింట్లు 8, క్రెడిట్ల చేత గుణీకరించి ఆ సబ్జెక్టు క్రెడిట్లు 8x4= 32 వస్తాయి. ఈ సబ్జెక్టు క్రెడిట్లు అన్నీ కూడి మొత్తం క్రెడిట్లతో భాగిస్తే చివరి సీజీపీఏ వస్తుంది. మనకొచ్చిన బ్రాంచితో సంతృప్తి చెందనివారికి బ్రాంచి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్లాసులో టాప్‌ 2% సీజీపీఏ స్కోరులో ఉండాలి.

విఫలమైతే పీడకలే
బ్యాక్‌లాగ్స్‌- ఐఐటీయన్‌ జీవితంలో భయోత్పాతం కలిగించే సంగతి ఇది. బ్యాక్‌లాగ్‌ లేకపోతే జీవితం ఇక్కడ సాఫీగా నడిచిపోతుంది. కానీ ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యావంటే అది ఒక పీడ కల అయిపోతుంది. బ్యాక్‌లాగ్‌ అసలేవీ లేకపోతే ఉపయోగమా అంటే అదీ కాదు. ఒక సబ్జెక్టులో ఉత్త D తో పాసైతే ఉపయోగం ఉండదు. D అంటే 10కి 4 సీజీపీఏ వచ్చినట్లు లెక్క. ప్లేస్‌మెంట్‌ దొరకాలంటే కనీసం C+ తెచ్చుకోవాల్సి ఉండగా, ఏ బ్యాక్‌లాగూ లేకుండా ఉత్త D తెచ్చుకుంటే ఫలితం ఏముంటుంది గనక?

చివరగా- మిమ్మల్ని కేవలం జేఈఈ పరీక్షకు మాత్రమే కాకుండా ఐఐటీ జీవితానికి కూడా తయారుకమ్మని నా సలహా. ఒక టర్మ్‌లో మీరు ఏమైనా చెయ్యండి. ఏమి చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కనీసం పరీక్షలకు ఒక వారం ముందు చదవటం మొదలుపెట్టినా B కానీ B+ కానీ తెచ్చుకోవచ్చు. అలాగే ఐఐటీలో ఏ బ్రాంచి అయినా మంచిదే అనేది అపోహ మాత్రమే. పాత ఎన్‌ఐటీల్లో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో సీటు వస్తే గనక అది ఐఐటీల్లో చిన్న బ్రాంచి కంటే చాలా మెరుగు.

నా అభిప్రాయాలు మీలో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తూ... సెలవ్‌. 

Monday, 24 June 2013

ఎలా సాధించారు... ఈ టాపర్లు?

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు తెచ్చుకోవటమే గొప్ప విజయం. అలాంటిది ఆ ప్రవేశపరీక్షలో అందరికంటే ముందు నిలిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించటం మామూలు విషయం కాదు! దేశవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించే జేఈఈ  అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో- భావనలపై స్పష్టత, లోతైన అవగాహన, అనువర్తన సామర్థ్యాలు ప్రధానం. వీటి సమ్మేళనంతో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను కైవసం చేసుకున్న సాయి సందీప్‌, రవిచంద్రలు 'చదువు'తో తమ అనుభవాలు పంచుకున్నారు!


కల నిజమైంది!
రాష్ట్రస్థాయి ఎంసెట్‌లో స్టేట్‌ టాపర్‌... జాతీయస్థాయి ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆలిండియా టాపర్‌! విశిష్టమైన ఈ 'డబుల్‌' సాధించిన పి. సాయిసందీప్‌రెడ్డి 'మొదటి నుంచీ నా గురి ఐఐటీపైనే' అని ముందే సంకల్పం ప్రకటించాడు. తన కలను అపురూప స్థాయిలో నిజం చేసుకున్నాడు. తన విజయప్రస్థానం ఎలా సాగిందో అతడి మాటల్లోనే...

 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు ముందుగా వూహించిందే! ఫలితం తెలిశాక ఆరు సంవత్సరాల కష్టం ఫలించిందని సంతృప్తి కలిగింది. అయితే ఇదంతా ఇష్టపడే చదివాను.

జేఈఈ మెయిన్స్‌కు వారం ముందునుంచీ నా ఆరోగ్యం బాగా లేదు. దీంతో పరీక్ష సరిగా రాయక ఫలితం ఆశించినట్టు రాలేదు. విచారంగా అనిపించింది. ఇలాంటి సమయంలో నిరాశతో కుంగిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకవసరమైన ప్రోత్సాహాన్ని ఆ సమయంలో అమ్మా నాన్నా అందించారు. దీంతో పట్టుదలగా నెలన్నర చదివాను.

మ్యాథ్స్‌లో ఒక జవాబును తప్పుగా బబ్లింగ్‌ చేశాను. అది గమనించినప్పటికీ బాల్‌పెన్‌ వాడాలనే నిబంధన వల్ల ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం లేకుండాపోయింది. ఐదు మార్కులు పోయాయి. బాధ వేసినా 'పోతే పోయింది' అని సమాధానపర్చుకున్నాను. ఆ ప్రభావం మిగతావాటిపై పడకుండా జాగ్రత్తపడ్డాను. ఫస్ట్‌ర్యాంకు వచ్చాక మాత్రం ఆ లోటు పోయింది!

ఈ ర్యాంకు సాధించటానికి నా సరదాలన్నీ పూర్తిగా త్యాగం చేశాననుకోవద్దు. రెండు వారాలకో సినిమా చూసేవాణ్ణి. హారీపోటర్‌ కథల పుస్తకాలు ఇష్టంగా చదివేవాణ్ణి.

గుడివాడ విశ్వభారతిలో ఏడోతరగతి నుంచే ఈ ఐఐటీ ప్రయాణానికి తొలి అడుగులు పడ్డాయి. నాకు అబ్దుల్‌కలామ్‌ స్ఫూర్తి. ఇంజినీర్‌ని కావాలని మొదట్నుంచీ లక్ష్యంగా ఉండేది. అందుకే స్కూల్‌ రోజుల్లో కూడా గణితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాణ్ణి. ఇక ఐఐటీ ప్రవేశపరీక్షకు అసలైన కృషి శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం నుంచీ మొదలైంది.

కృషే ప్రధానం
ర్యాంకుల మీద మొదట్లో నాకేమీ దృష్టి లేదు. సిలబస్‌ మొత్తం పూర్తిగా అర్థం చేసుకోవాలి. చేతనైనంత వరకూ బాగా కృషి చేయాలి అనేదే ప్రధానంగా ఉండేది. ఏ విద్యార్థికైనా సెకండియర్‌కి వచ్చేటప్పటికి ఒక అవగాహన వస్తుంది. ఏ టాపిక్‌ రిఫర్‌ చేయాలి, ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, రివిజన్‌కు ఎంత సమయం కేటాయించాలి... ఇవన్నీ తెలుస్తాయి.

నా ఉద్దేశంలో ఐఐటీ ప్రవేశపరీక్షలో విజయానికి పాత్ర వహించే బోధన, ప్రిపరేషన్ల నిష్పత్తి 10: 90. అంటే సరైన మార్గదర్శకత్వంలో విద్యార్థి చాల సాధన చేయాలి. ఐఐటీ ప్రవేశపరీక్షలో కెమిస్ట్రీ స్కోరింగ్‌.. ముఖ్యంగా ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ సమయం దీనికి కేటాయించి చదివాను.

ఐఐటీలో పరీక్షావిధానం వూహించినట్టుగా ఉండదు. అనూహ్యమైన తీరులో ప్రశ్నలు వచ్చినా, దానికి సిద్ధంగా ఉండాలి. భయపడకుండా, ఒత్తిడికి గురవకుండా ఆ పరిస్థితికి తగ్గట్టుగా తయారై పరీక్ష రాయాలి.

ఆశావహుల సంగతి
ఐఐటీకి గురిపెడితే ఎంసెట్‌ లాంటి పరీక్షల్లోనైనా ర్యాంకు వస్తుందని ఐఐటీకి సన్నద్ధం కావడం మంచిది కాదు. అప్పుడు రెంటికీ దూరం కావాల్సివస్తుంది. ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేసుకుని దేనికి సన్నద్ధం కావాలో నిర్ణయించుకోవాలి.

ఐఐటీ ప్రవేశపరీక్షకు సిద్ధమవ్వాలనుకున్నవారికి కనీస స్థాయి తెలివితేటలు, కష్టపడే తత్వం అవసరం. సగటున రోజుకు 12 గంటలు చదవగలగాలి. మొదట లక్ష్యం పెట్టుకుని, టాపిక్‌వారీగా ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి. లోతుగా చదవాలి. పూర్తి ఏకాగ్రత అవసరం.

మొదటి సంవత్సరంలో సిలబస్‌ అన్ని అంశాలూ చదవాలి. తర్వాత కొన్ని టాపిక్స్‌ మీద కేంద్రీకరించి లోతుగా అధ్యయనం చేయాలి. ఏ విద్యార్థికైనా కొన్ని కాన్సెప్టులు అర్థం కాకపోవచ్చు. అది మామూలే. ఆ సందేహాలను అధ్యాపకుల దగ్గర తీర్చుకోవాలి. స్పష్టత తెచ్చుకోవాలి. గ్రాండ్‌ టెస్టుల ద్వారా తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ కృషి చేయాలో తెలుసుకోవచ్చు.

ఎలా చదివానంటే..
ఐఐటీ ప్రవేశపరీక్షకు ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు సరిపోవు. వాటిలో ప్రాథమికాంశాలుంటాయి. వాటినే ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ కోసం లోతుగా అధ్యయనం చేశాను. కళాశాల వారిచ్చిన మెటీరియల్‌కు అదనంగా కొన్ని పుస్తకాలు చదివాను.

మ్యాథ్స్‌: ఆర్‌.డి. శర్మ, ఎంటీజీ పబ్లికేషన్స్‌ సిరీస్‌ ఫిజిక్స్‌: హెచ్‌సీ వర్మ, ఐ.ఇ. ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: అట్కిన్స్‌, వేడ్‌ జూనియర్‌, జేడీ లీ

పాత ప్రశ్నపత్రాలను సాధన చేశాను. అన్ని సబ్జెక్టులకూ క్లుప్తంగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. రివిజన్‌లో- చాలా వేగంగా ఓసారి చూసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడింది.

ఏమిటి తేడా?
ఇంటర్మీడియట్‌లో/ ఎంసెట్‌లో తెలిసినవే వస్తాయి. చదివిన అంశాలను అప్త్లె చేయాల్సిన అవసరం ఉండదు. ఐఐటీ ప్రవేశపరీక్ష అలా కాదు. దీనిలో అప్లికేషన్‌ ప్రధానం. చదివిన కాన్సెప్టుల్ని అప్త్లె చేయగలగాలి.

ఇంటర్మీడియట్‌ తరహా పరీక్షకు అలవాటు పడటంవల్లనే విద్యార్థులకు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఎంతో క్లిష్టం అనిపిస్తోంది. నిజానికిది అంత కష్టం కాదు. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఈ కంటే తక్కువే. చక్కని ప్రణాళికతో సమయం వృథా చేయకుండా కష్టపడితే ఎవరైనా ఐఐటీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించవచ్చు.

saisandeep192@gmail.com



కోరిక తీరింది!
ఎంసెట్‌లో తొమ్మిదో ర్యాంకు...  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మరింత ముందుకు దూసుకువెళ్ళి ద్వితీయ ర్యాంకును సాధించాడు అద్దంకి రవిచంద్ర. వివిధ ప్రతిభా పరీక్షల్లో ఉపకార వేతనాలూ, అవార్డులూ, స్వర్ణ పతకాలూ పొందటం ఇతడి ప్రత్యేకత. ఐఐటీ ప్రవేశపరీక్షలో మేటి ర్యాంకు తెచ్చుకోవాలన్న చిరకాల లక్ష్యం చేరుకున్న రవిచంద్ర సన్నద్ధత తీరు... ఇతర విశేషాలూ తన మాటల్లోనే తెలుసుకుందాం!


నా ఐఐటీ ప్రయాణం హైదరాబాద్‌ నల్లకుంటలో శర్మ ఇన్‌స్టిట్యూట్‌లో ఎనిమిదో తరగతి నుంచి మొదలైంది. సీరియస్‌గా మాత్రం ఇంటర్మీడియట్‌ నుంచే...! ఐఐటీ ప్రవేశపరీక్షలో టాప్‌ టెన్‌లో ఏదో ఒక ర్యాంకు తెచ్చుకోవటం మొదట్నుంచీ నా లక్ష్యంగా ఉండేది. దీనికి ఉపాధ్యాయుల, అధ్యాపకుల ప్రోత్సాహం కారణం.
ఐఐటీ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవటం కష్టమనిపించలేదు. ఎందుకంటే సరదాగా చదివాను. సబ్జెక్టు మీద అమిత ఇష్టంతో చదివాను. టీవీ, ఇంటర్నెట్‌లు చూడటం తగ్గించాను. జేఈఈ మెయిన్స్‌లో మార్కులు తగ్గి టాప్‌ టెన్‌లో నాకు ర్యాంకు రాలేదు. దీంతో నిరాశ పెరిగి, ప్రేరణ మందగించింది. ఈ సంకట పరిస్థితిలో నా మిత్రులూ, తల్లిదండ్రులూ చక్కని వాతావరణం కల్పించారు. అడ్వాన్స్‌డ్‌కు మిగిలిన మిగతా ఒకటిన్నర నెలలూ బాగా చదవటానికి తోడ్పడ్డారు.

రెండు పరీక్షల భేదాలు
ఐపీఈకీ, ఐఐటీ ప్రవేశపరీక్షకూ తేడా చెప్పాలంటే... మొదటిది చదువుకుని, కొన్ని గుర్తుంచుకుని రాస్తే చాలు. జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కానీ ఐఐటీ ఎంట్రన్స్‌కు జ్ఞాపకశక్తి మరీ అంత ఎక్కువ అవసరం లేదు. ఆలోచించగల సామర్థ్యం కావాలి. దీనిలో అనువర్తన (అప్లికేషన్‌) భాగం ఎక్కువ పరీక్షిస్తారు. ఎంసెట్‌కు వేగం కావాలి. అన్ని ప్రశ్నలూ అందరూ జవాబులు రాయగలరు. కానీ సమయం సరిపోకపోవటమే సమస్య. ఐఐటీ ఎంట్రన్స్‌కు అంత వేగం అక్కర్లేదు.

ఐపీఈకి సిద్ధమై ఐఐటీ ప్రవేశపరీక్ష రాయాలంటే కష్టం. దీనిలో చాలా లోతుగా చదవాలి కాబట్టి. ఐపీఈలో ప్రాథమికాంశాలను బట్టీకొట్టి రాసి మార్కులు తెచ్చుకోవచ్చు. ఐఐటీ కోసం జరిగే పరీక్షలో ఆ అంశాలను నిజజీవిత పరిస్థితుల్లో అనువర్తించగలగాలి.

శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థ వారిచ్చిన మెటీరియల్‌ 80 శాతం ఉపయోగపడింది. అది కాకుండా చదివినవి...

మ్యాథ్స్‌: టీఎంహెచ్‌ పబ్లిషర్స్‌- మ్యాథ్స్‌ ఫర్‌ ఐఐటీ జేఈఈ ఫిజిక్స్‌: ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: బహదూర్‌, హిమాంశు పాండే, గోపీ టాండన్‌

ఇష్టముంటే సులభమే
ఐఐటీలో సీటు సాధించాలనుకునేవారికి సబ్జెక్టు మీద ఆసక్తి ఉండాలి. రోజూ సగటున 6-7 గంటల సమయమైనా సాధన చేస్తుండాలి. టాపర్‌గా నిలవాలంటే మాత్రం 10 గంటలు చదవాల్సిందే. దీంతో పాటు మంచి మార్గదర్శకత్వం ఉండాలి. సబ్జెక్టుకు సిద్ధమవటాన్ని ఇష్టంగా ఆస్వాదించాలి. అప్పుడు తెలియకుండానే సులువుగా అనిపిస్తుంది.

ఈ పరీక్షలో విజయానికి బోధన ప్రాముఖ్యం 20 శాతం మాత్రమే. మిగతా 80 శాతం విద్యార్థి సన్నద్ధత మీదే ఆధారపడివుంటుంది. పూర్వ ప్రశ్నపత్రాలు 5-6 సంవత్సరాలవి సాల్వ్‌ చేయాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో విశ్లేషించుకోవాలి. వాటిని సవరించుకోవటానికి అధ్యాపకుల సహాయం తీసుకోవాలి. 'ఎంత చదివాం' అన్నది కాదు. 'ఎంత సాధన చేశాం' అన్నదే ముఖ్యం. పరీక్షలో భయం, ఓవర్‌ యాంగ్జయిటీ ఉండకూడదు. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి.

ravichandra.addanki95@gmail.com

Sunday, 24 March 2013

గేట్ టాపర్ ఏం చెప్తున్నాడు?

జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అగ్రశ్రేణిలో నిలవటం అనిర్వచనీయమైన అనుభూతి! లక్ష్యం సాధించి, ఆ స్థాయికి చేరుకోవటానికి పాటించిన క్రమం, పడిన కష్టం గుర్తుచేసుకోవటం ఎంతో మధురంగా ఉంటుంది. ఉజ్వల భవితకు ముఖద్వారమైన 'గేట్‌' (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)లో జయకేతనం ఎగురవేసిన సుజీత్ కుమార్  (ఈసీఈ ) ఆ విశేషాలను ఇలా పంచుకున్నాడు..


'ఆత్మవిశ్వాసం' నా విజయంలో ప్రధాన పాత్ర వహించింది. కానీ ఈ నమ్మకం నాకు ఆఖరిదశలో... పరీక్ష రాసేరోజు మాత్రమే పూర్తిగా ఏర్పడింది. అనుకున్నట్టు కాకుండా రివిజన్‌ కొద్దిగా తగ్గిందని తెలుసు కానీ దాని గురించి ఆలోచించలేదు. కాన్సెప్టులు నాకు స్పష్టంగా ఉన్నాయని తెలుసు. అదే ధైర్యం!
... అయినా కొంత ఉత్కంఠ, టెన్షన్‌... తెల్లారి పరీక్ష. తెల్లవారుఝామున 2 గంటలదాకా చదువుతూనే ఉన్నాను. నిజానికి పరీక్ష ముందు ఇంతసేపు మేలుకోవటం మంచిది కాదు. ఆరుగంటలకే మెలకువ వచ్చేసింది. టెన్షన్‌తో ఉదయం 9 గంటలదాకా ప్రిపరేషన్‌ ఆపలేదు. వదిలేసిన మ్యాథ్స్‌ రివిజన్‌ కూడా పూర్తయ్యాక.. అప్పుడు- ఆ ఆఖరి సమయంలో- వచ్చేసింది ఆత్మవిశ్వాసం!

'ఈసారి పరీక్ష కష్టంగా ఉండి, సరిగా రాయకపోయినా పర్లేదు, మరోసారి రాయగలను. ఎందుకంటే... నాకు కాన్సెప్టులపై స్పష్టత ఉంది కాబట్టి'!- ఈ నమ్మకం వచ్చాక ఇక టెన్షనే లేదు. పరీక్షకు హాజరై, ప్రశాంతమైన మనసుతో రాయటం మొదలుపెట్టాను. తేలికైనవి ముందు రాసేశాను, కష్టమైనవి రెండో రౌండుకు వదిలేసి. అందుకే జనరల్‌ ఆప్టిట్యూడ్‌తో పాటు 1.45 గంటల్లోనే సగం పేపర్‌ పూర్తిచేశా.

మళ్ళీ ప్రశ్నపత్రం చూసుకున్నాను. ఒక ప్రాబ్లమ్‌ అయితే పూర్తి పేజీ నిడివి ఉంది. చూడగానే దాన్ని అంతకుముందు వదిలేశా. ఇప్పుడు తరచిచూస్తే విచిత్రంగా అది చాలా తేలిక సమస్య! భయపెట్టటానికి ఇంత నిడివితో ఇచ్చివుంటారు.

పట్టు వదలకుండా...
నా ప్రిపరేషన్‌ గురించి చెప్పాలంటే- చదివినంతవరకూ బాగా చదివాను. కాన్సెప్టులపై అస్పష్టత ఉంటే దాన్ని క్లారిఫై చేసుకునేదాకా వదల్లేదు. ఏదైనా ప్రాబ్లమ్‌ రాకపోతే సొల్యూషన్‌ తెలిసేవరకూ దానిమీదే ఉన్నాను. ప్రిపరేషన్‌ విషయంలో కష్టమైన అంశాలనే ముందు ప్లాన్‌ చేసుకోవాలి. వాటికి ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి. తర్వాతే తేలికైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే చివర్లో మనకు వ్యవధి సరిపోకపోవచ్చు. పరీక్ష ముందు రివిజన్‌ పెండింగ్‌ లేకుండా చూసుకుంటే ఆత్మస్త్థెర్యం పెరుగుతుంది.

గేట్‌లో నాకిది మూడో ప్రయత్నం. మొదటిసారి అసలేమీ చదవకుండా రాశాను. మార్కులు 42/100, గేట్‌ ర్యాంకు 5,898! రెండో ప్రయత్నంలో బాగా చదివాను. కొన్ని కాన్సెప్టులు అంత క్లియర్‌గా లేవు. సమయం లేక ప్రాబ్లమ్స్‌ సాధన చేయలేకపోయాను. మార్కులు 32/100 మాత్రమే. కానీ 3,360 ర్యాంకు! ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఇవ్వటం దీనికి కారణం. దీనిబట్టి తెలిసేదేమిటంటే... ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంకు వస్తుంది. ఇతరుల గురించి పట్టించుకోకూడదు.

మూడోసారి గేట్‌ రాసినపుడు బాగా చదివాను. కాన్సెప్టులు క్లియర్‌గా ఉన్నాయి. ప్లాబ్లమ్స్‌ కూడా సాధన చేశాను. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా, వాటిని చివరి నిమిషం వరకూ సవరించుకుంటూ వచ్చాను. మొదటి రెండు సార్లూ సమయం లేక తేలికైనవి కూడా వదిలేశాను. ఇప్పుడలా కాకుండా తేలికైన ప్రశ్నలకు ముందు జవాబులు గుర్తించాను. దీనివల్ల జరిగే ప్రయోజనం ఆత్మస్త్థెర్యం రావటం! పేపర్‌ సులువుగా ఉంది కాబట్టి మార్కులశాతం 88.67 వచ్చింది. ర్యాంకు తెలిసిందే కదా? మొదటి ర్యాంకు!

నిరాశపడకూడదు
గేట్‌ కోసం రోజుకు 8 గంటల చొప్పున చదివితే ఆరు నెలల సమయం సరిపోతుంది. సన్నద్ధతకు తప్పనిసరిగా ఒక ప్రణాళిక అనుకోవాలి. దాన్ని పాటించటానికి నిర్దిష్ట వ్యవధి పెట్టుకోవాలి. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు ప్రణాళిక సరిగా పాటించటం లేదని నిరాశపడిపోకూడదు. 'అయిందేదో అయింది. ఉన్న సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేయాలి' అనుకోవాలి. పరిస్థితిని బట్టి డైనమిక్‌గా దాన్ని మార్చుకోవటం కూడా అవసరం. ఏది ఏమైనా ప్రిపరేషన్‌ సకాలంలో పూర్తవుతుందనే ఆత్మవిశ్వాసం ఉండాలి.

గేట్‌ రాసేవారు తమ కళాశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటే సందేహాలు వచ్చినపుడు వివిధ పుస్తకాలను సంప్రదింంచే వీలుంటుంది. చదువుకునే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.

క్రమం పాటిస్తే సులువు
గేట్‌లో సాధారణంగా అన్ని సబ్జెక్టులకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. పాత పేపర్లు సాధన చేస్తే వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. ఆ ప్రకారం సిద్ధమవ్వొచ్చు. కానీ టాప్‌ ర్యాంకు రావాలంటే మాత్రం సిలబస్‌ మొత్తం కవర్‌ చేయాల్సిందే. ఇంజినీరింగ్‌ మ్యాథ్స్‌కు మార్కులు తక్కువని దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి సరిగా సన్నద్ధమైతే ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు చదివేటపుడు సమయం బాగా ఆదా అవుతుంది. మ్యాథ్స్‌లో పునాది సరిగా ఏర్పరచుకోకపోతే ప్రిపరేషన్‌ సమయం చాలా పెరుగుతుంది!

ఎలక్ట్రో మాగ్నటిక్‌ థియరీ లాంటి కొన్ని సబ్జెక్టుల్లో మొదటి కొన్ని చాప్టర్లు మిగతావాటికి ఆధారంగా ఉంటాయి. ఇంటర్లో చదివినవాటికి కొనసాగింపు కొన్ని ఉంటాయి. సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ తర్వాత కమ్యూనికేషన్స్‌ చదవటం; ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌, ఎనలాగ్‌ సర్క్యూట్స్‌ వరసగా, ఈ రెంటికీ ముందు నెట్‌వర్క్‌ థియరీ చదవటం ... ఈ క్రమం చక్కని అవగాహననిస్తుంది.

ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) ఎంత బాగా చదివితే సబ్జెక్టు అంత సులభం. సమస్యల సాధనలో ఎక్కువ పేజీలు రాయటం బీటెక్‌కు పనికిరావొచ్చు కానీ, గేట్‌కు క్లుప్తంగా సాల్వ్‌ చేయటమే ప్రధానం. మ్యాథ్స్‌లో పట్టుంటేనే ఇది సాధ్యం!

ఉపయోగపడే సైట్లు
నేనైతే పరీక్షకు ఒక్కణ్ణే సిద్ధమయ్యాను గానీ, 'కంబైన్డ్‌ స్టడీ' చాలా ఉపయోగకరమే! ఒకే రకమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు ముగ్గురు కలిసి చదివితే అద్భుతాలు సృష్టించవచ్చు. సొంతంగా సన్నద్ధమయ్యేటపుడు ఎక్కడైనా చిక్కుముడి ఏర్పడితే సమయం వృథా అవుతుంటుంది. ఇలాంటపుడు సమయం ఉంటే http://nptel.iitm.ac.in/వెబ్‌సైట్‌లో నిపుణులైన అధ్యాపకుల బోధనలున్న వీడియోలు చూస్తే సందేహనివృత్తి అవుతుంది. తర్వాత పాఠ్యపుస్తకాలు చదివితే అర్థమవుతుంది. www.coursera.org వెబ్‌సైట్‌లో విదేశీ ప్రొఫెసర్ల పాఠాలు ఉచితంగా చూడొచ్చు. ఇవి చాలా ఉపయోగం.

మాక్‌ టెస్టులు నిర్దిష్ట సమయం పెట్టుకుని రాయటం మంచిది. రాసి, ఎక్కడ, ఏమేం తప్పులు చేశామో బేరీజు వేసుకోవాలి. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. నేను పరీక్ష ముందు రెండు టెస్టులు రాశాను. సరైన మైండ్‌సెట్‌, సమయ నిర్వహణ వీటితో అలవడతాయి. పాత పేపర్లు 8 నుంచి 10 సంవత్సరాలవి సాల్వ్‌ చేయటం మేలు.కాన్సెప్టుల విషయంలో 'నాదే కరెక్టు' అనే ధోరణి సరికాదు. ఇవి సుస్పష్టంగా (క్రిష్టల్‌ క్లియర్‌) ఉండాలి. నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండాలి. ఎంత చదివినా రివిజన్‌ ఉండాలి. తప్పులు తెలుసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్‌నూ సాల్వ్‌ చేసేలా ఉండాలి. పరిష్కరించకుండా దేన్నీ వదలకూడదు. ఏ సమస్య అయినా చేయలేకపోయామంటే ఆ కాన్సెప్ట్‌పై పూర్తి అవగాహన రాలేదని అర్థం!

నేను హైదరాబాద్‌ 'ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ'లో కోచింగ్‌ తీసుకున్నాను. అనుభవజ్ఞులైన అధ్యాపకులు మన సమయం తగ్గిస్తారు. కోచింగ్‌ లేకుండా కూడా గేట్‌కు సిద్ధం కావచ్చు. అయితే దీనికి సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది.

ఇంజినీరింగ్‌ ఫైనలియర్లో కీలకమైన ప్రాజెక్టు, పరీక్షలూ, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లూ ఉంటాయి. వీటి మధ్య గేట్‌కు సన్నద్ధమవటం పరీక్షే. అందుకే రెండో సంవత్సరం నుంచీ గేట్‌మీద దృష్టిపెట్టటం మంచిది. సబ్జెక్టులో కష్టంగా ఉన్నవాటిని నోట్స్‌గా రాసుకోవాలి. గేట్‌ సన్నద్ధతలో అవి ఉపయోగపడతాయి. సమయం కూడా బాగా ఆదా అవుతుంది.

Friday, 22 February 2013

ఎంసెట్‌ నగారా


ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్రుతతో ఎదురు చూస్తోన్న ఎంసెట్‌ ప్రకటన వెలువడింది. ఎంపీసీ విద్యార్థుల విషయంలో స్పష్టతతో, బైపీసీ విద్యార్థులకు సంశయం కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్‌ రూపొందింది. మంచి భవితకు బాట కోసం ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధన అత్యవసరం. దీనికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాల్సిన తరుణమిది!

పోటీ పరీక్ష ఏదైనా దానికి తయారయ్యే విధానం, మానసిక సంసిద్ధత.. ఈ రెండు అంశాల మేరకే ఫలితాలుంటాయి. కష్టపడి చదవడం తప్పనిసరే కానీ, నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడటం ముఖ్యం. అప్పుడే గెలుపు సులభమవుతుంది. కానీ చాలామంది విద్యార్థులు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వక నష్టపోతున్నారు.

ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఎందుకో ఒక్క ఉదాహరణ ద్వారా చూద్దాం.
ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని అనుకుందాం. ఒక విద్యార్థి హిందీలో 90 మార్కులు, మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 92 మార్కులు తెచ్చుకున్నాడని అనుకుందాం. వేరొక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 99 లేదా 100 మార్కులు తెచ్చుకుంటూ ఒక సబ్జెక్టులో హిందీ కాకుండా 90 మార్కులు సాధించాడని అనుకుందాం.

ఈ ఇద్దరిలో మొదటి విద్యార్థికి 10 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 10/10, రెండో విద్యార్థికి 9.8 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 9.8/10 వచ్చినట్లు అవుతుంది. మార్కులపరంగా చూస్తే మొదటి విద్యార్థి మార్కులు కేవలం 550/600. మరి రెండో విద్యార్థి మార్కులు 590/600 వరకూ ఉండే అవకాశముంది. మరి ఈ ఇద్దరిలో తేడా అంటే ప్రణాళిక మాత్రమే.

మారిన గ్రేడింగ్‌ విధానం అర్థం చేసుకుని ప్రాధాన్యం గుర్తించి చదివిన విద్యార్థి 10/10 తెచ్చుకుంటే అవగాహన లేక ప్రణాళిక లేకుండా చాలా కష్టపడి కూడా రెండో విద్యార్థి తెచ్చుకున్నది 9.8/10 మాత్రమే. కాబట్టి మార్కులు సాధించాలంటే కష్టపడాల్సిందే. అయితే అవగాహనతో సరైన ప్రణాళికతో కష్టపడి చదివితే కచ్చితంగా మేటి ర్యాంకుకు అవకాశం ఉంటుంది.


ప్రకటన ప్రకారం...
ఇంజినీరింగ్‌, మెడికల్‌, డెంటల్‌, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌, ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతిల ప్రవేశానికి ఎంసెట్‌ ర్యాంకు ఉపయోగపడుతుంది.

ఈ పరీక్ష రాయడానికి నిబంధనలు చూస్తే... భారతీయులై, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు లేదా సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు. రిజర్వేషన్‌ కేటగిరీలలో ఉన్న విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి.

* బయోటెక్నాలజీలో చేరాలంటే బైపీసీ విద్యార్థులు లెక్కలులో బ్రిడ్జి కోర్సు పరీక్ష పాసై ఉండాలి.
* ఇంజినీరింగ్‌, ఫార్మసీలైతే విద్యార్థికి డిసెంబరు 31, 2013 లోపు 16 సంవత్సరాలు పూర్తి అయివుండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు.

* మెడికల్‌ విభాగంలో అయితే డిసెంబరు 31, 2013లోపు విద్యార్థి 17 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి. అలా కాని పక్షంలో ప్రవేశ అర్హత లభించదు. అలాగే గరిష్ఠ వయః పరిమితి జనరల్‌ కేటగిరి అయితే 22 ఏళ్ళు, రిజర్వేషన్‌ కేటగిరి అయితే 25 సంవత్సరాలు.

ఎలా సంసిద్ధమవ్వాలి?

ఇంటర్‌ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆఖరు తేదీ మార్చి 19 వరకూ ఇంటర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది.

ఇంటర్‌లో మూడు రకాల ప్రశ్నలుంటాయి. LAQ, SAQ, VSAQవీటిలో సాధారణ విద్యార్థులు LAQ, SAQలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదువుతారు. కచ్చితంగా మంచి మార్కులు లేదా నూరు శాతం మార్కులు సాధించాలనే ధ్యేయంతో ఉన్నవారు అధికంగా VSAQలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే అకాడమీ పుస్తకాలు చదవడంతో బాటు ఆబ్జెక్టివ్‌ ఓరియెంటేషన్‌లో కూడా తయారీ కావాలి.

అకాడమీ పుస్తకాలు చదవడం అంటే చివర్లో ఉన్న ప్రశ్నలు జవాబులు మాత్రమే కాకుండా పాఠ్యాంశం కూడా పూర్తిగా కనీసం ఒక్కసారైనా చదివి ఉండాలి. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యేవరకూ ఈ సిలబస్‌కు పరిమితమై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళాలి.

కాలవ్యవధి స్వల్పంగా ఉంది కాబట్టి రాని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవడం సరికాదు. దానికి బదులు- వచ్చిన అంశాలనే ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటూ వెళితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలో కూడా వేగం పెరుగుతుంది.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల తర్వాత ఎంపీసీ విద్యార్థులు అయితే జేఈఈ- మెయిన్స్‌కు తయారవుతుంటారు. 10 రోజుల్లో జూనియర్‌ సిలబస్‌ పూర్తి చేసుకుని మిగిలిన వారం రోజులూ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించుకోవడం మేలవుతుంది.

ఆ తర్వాత ఎంసెట్‌, బిట్‌శాట్‌ రెండు పరీక్షలకూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ రెండింటినీ పునశ్చరణ చేసుకుంటూ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా రాయాలి. ఎంసెట్‌లో రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి జవాబు తెలియనప్పటికీ ప్రతి ప్రశ్నకూ ఏదో ఒక జవాబు రాసే చాన్స్‌ తీసుకోవచ్చు. ఏప్రిల్‌ ఆఖరు వారం నుంచి గ్రాండ్‌ టెస్టులు రాయడం ప్రారంభించాలి.

బైపీసీ విద్యార్థులు అయితే మార్చి 19 తర్వాత కనీసం 20 రోజులు ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణ చేసుకోవాలి. సిలబస్‌ను చిన్న భాగాలుగా విభజించి నమూనా పరీక్షల రూపంలో అభ్యాసం చేయాలి. బయాలజీ విద్యార్థులు అధికశాతం నష్టపోవడానికి కారణాలు.. సబ్జెక్టుపై అవగాహన లేక కాదు! వాటిని ప్రశ్నల రూపంలో తర్ఫీదు పొందకపోవడమే. అందుకే వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ఇక్కడ కూడా రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు గుర్తించకుండా వదిలి వేయాల్సిన అవసరం లేదు.

ఎంపీసీ లేదా బైపీసీ ఏ విభాగం అయినా మన అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైనా ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన తయారీ ఏ విద్యార్థికయినా విజయం సాధించిపెడుతుంది!

(పూర్తి కథనం కోసం www.eenadu.net లో చదువు విభాగం చూడండి..)

Wednesday, 9 January 2013

మే 10న ఎంసెట్‌


ఈనాడు హైదరాబాద్‌ :ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సుల ప్రవేశపరీక్షల తేదీలతోపాటు ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ నిర్వహణ, తరగతుల ప్రారంభం తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఇలా జరగడం ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం.

సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్‌ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్‌ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్‌(పీజీఈసెట్‌) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్‌సెట్‌(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్‌), న్యాయవిద్య(లాసెట్‌, పీజీలా) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం(ఈసెట్‌) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్‌, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయప్రకాష్‌రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు.



2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్‌ఆర్‌సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్‌జైన్‌, జయప్రకాష్‌రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్‌ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.


Monday, 29 October 2012

ఐఐటీ బాటలో మెలకువగా... మెరుగ్గా!

ఐఐటీ ప్రవేశపరీక్షలో 2013లో ప్రవేశ పెడుతున్న మార్పులను తల్చుకుని బెంబేలు పడటం కంటే వాటిని సవ్యంగా అర్థం చేసుకోవాలి. తగినట్టుగా సంసిద్ధమవాలి. ఇదే విద్యార్థుల కర్తవ్యం!
 

‘ఐఐటీ ప్రవేశపరీక్ష కొరకరాని కొయ్యే', 'ఐఐటీల్లో సీటు సాధించటం మరింత కఠినం', 'ఐఐటీ ప్రవేశపరీక్ష అందని ద్రాక్ష'- ఇలాంటి వ్యాఖ్యలు ఇటీవల తరచూ వినపడుతున్నాయి. వీటినిచూసి చాలామంది అధైర్యం పెంచుకుంటున్నారు కూడా. ఇది సరి కాదు. పరీక్ష నిర్వహణలో కొత్త మార్పులు ప్రవేశపెట్టినపుడు వాటిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అయోమయం, ఆందోళన తగ్గిపోతాయి. పరీక్షను దీటుగా, మెరుగ్గా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది.

ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రవేశపెడుతున్న మార్పులు- పరీక్ష నిర్వహణ పద్ధతిలో జరుగుతున్నవే తప్ప పరీక్ష నమూనాలో కానీ, సిలబస్‌లో కానీ జరుగుతున్న మార్పులు కావు. సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుకుని, భావనలపై అవగాహన పెంచుకునే విద్యార్థులు ఈ మార్పుల కారణంగా నష్టపోయేదేమీ లేదు. అందుకని వారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!

నాటి పరీక్షలే...
ఇంతవరకూ ఉన్న ఏఐఈఈఈ లాగా జేఈఈ-2013 మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. అలాగే ఇంతవరకూ ఉన్న ఐఐటీ-జేఈఈలాగా జేఈఈ-2013 అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది. కాకపోతే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ముఖద్వారం (గేట్‌వే) అవుతుంది. ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈలు ఎంతోకాలంగా విద్యార్థులు రాస్తున్న పరీక్షలే కాబట్టి ఇంక ఆందోళన దేనికి?

అయితే ఇంటర్మీడియట్‌ మార్కులకు ప్రాధాన్యం పెరిగిందనేది గమనించాలి. ఈ ఒక్క విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకుంటే ఐఐటీల్లో ప్రవేశం ఏమంత కష్టం కాదు. ప్రవేశపరీక్షలో జరగబోతున్న మార్పులు అర్హతా నిబంధనలకు సంబంధించిన సాంకేతికపరమైనవే కానీ సబ్జెక్టు పరమైనవి కాదు!

ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే...
1) ఇంటర్‌ లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులైన టాప్‌ 20 పర్సంటైల్‌ విద్యార్థుల్లో ఉండాలి.
2) జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకు సాధించాలి. అంతేకాకుండా మొదటి లక్షా యాబైవేలమందిలో ఒకడవ్వాలి.
3) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ర్యాంకు సాధించాలి.

తుది పరీక్ష అయిన అడ్వాన్స్‌డ్‌లో సాధించే ర్యాంకు ఆధారంగానే సీటును కేటాయిస్తారు. మొదటి రెండూ eligibility conditions గానే ఉంటాయి. అంటే జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు, ఇంటర్‌ మార్కులకు ఐఐటీలో సీటు కేటాయించడంలో ప్రాధాన్యం ఉండదు.

అర్హతా నిబంధనల్లో తేడా
ఈ పరీక్షలన్నిటికీ చదివే సిలబస్‌ ఒకటే అయినా బహుముఖ వ్యూహం అవసరం. ఇక్కడ విద్యార్థులు గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ; ఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ ఉన్న అర్హత నిబంధనల్లో వ్యత్యాసం!

ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికి బోర్డు పరీక్షలో టాప్‌ 20 పర్సంటైల్‌ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంస్థల్లో సీటు కేటాయించడం కోసం ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌ మార్కుల వెయిటేజీ నార్మలైజేషన్‌ జరిగిన తర్వాతే ఉంటుంది.

ఐఐటీల్లో సీటు పొందడానికి ఇంటర్‌ మార్కులతో, జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. కానీ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిలో మొదటి లక్షాయాబైవేలమందిలో, ఇంటర్లో ఉత్తీర్ణులైనవారిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి. ఇవీ అర్హతా నిబంధనలు. వీటిని అర్థం చేసుకుని తగిన ప్రిపరేషన్‌ వ్యూహం రూపొందించుకోవాలి.

సబ్జెక్టుపరంగా ప్రాధాన్యం
మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యమే ఉంది. అయితే సబ్జెక్టుపరంగా ఆలోచిస్తే- భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు మన రాష్ట్ర విద్యార్థులకు కఠినంగా ఉంటాయి. అందుకనే వీరు దీనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.

గణితం స్కోరింగ్‌ సబ్జెక్టని తెలిసిందే. మంచి ర్యాంకు సాధనకు ఈ సబ్జెక్టును నమ్ముకోవాల్సిందే. మూడో ప్రాధాన్యం రసాయనశాస్త్రానిది. ఎందుకంటే- మిగిలిన రెండు సబ్జెక్టుల్లో ఎక్కువగా కాల్‌క్యులేషన్‌ ఆధారిత ప్రశ్నలుంటే దీనిలో కంటెంట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాల్‌క్యులేషన్లలో పొరపాట్లు జరిగే అవకాశం అధికం. ఇక ఇంటర్‌ పరీక్షలో కూడా టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి.

లాభం... నష్టం
తగిన ప్రతిభా సామర్థ్యాలు లేకున్నా కోచింగ్‌ బలంతోనో, ఊహించి సమాధానాలు రాసి తమ అదృష్టబలంతోనో ఐఐటీల్లో సీటు పొందాలనుకున్న విద్యార్థులకే ఈ మార్పుల వల్ల నష్టం. సబ్జెక్టును చదివే ప్రతిభావంతులకు మాత్రం ఎలాంటి నష్టమూ ఉండదు.

ఐఐటీ-జేఈఈ సన్నద్ధతలో పడి ఇంతవరకూ విద్యార్థులు ఏఐఈఈఈని నిర్లక్ష్యం చేసేవారు. అటు ఐఐటీల్లో సీటు రాక, ఇటు ఏఐఈఈఈ సరిగా రాయక రెండు రకాలుగానూ నష్టపోయేవారు. ఇప్పుడా ప్రమాదం లేదు. ఎందుకంటే ఏఐఈఈఈ (జేఈఈ-మెయిన్స్‌), ఐఐటీ-జేఈఈ (జేఈఈ-అడ్వాన్స్‌డ్‌)కి స్క్రీనింగ్‌ పరీక్ష మారింది. ఇది కూడా విద్యార్థులకు లాభదాయకమే. ఈ మార్పుల వల్ల ఇంటర్‌ మార్కులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనివల్ల తాము నష్టపోకుండా ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

ఎక్కణ్ణుంచి ఆరంభించాలి?  www.eenadu.net లో చదువు పేజీని చూడండి.

Thursday, 19 July 2012

బ్రాంచి ఎంపికలో... మొగ్గుఎటు?

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు ముందుగానే బ్రాంచి ఎంపికపై అవగాహన ఏర్పరచుకోవడం తప్పనిసరి. పరిశ్రమల విస్తృతికి తగ్గట్టుగా ఎన్నో రకాల బ్రాంచిలు విద్యార్థులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తితో శ్రమించి చదివితే ఏ బ్రాంచి ద్వారానైనా ఉన్నతమైన కెరియర్‌ను అందుకోవచ్చు. విద్యార్థి కెరియర్‌ లక్ష్యాలు, అభిరుచి, భవిష్యత్తులో అవకాశాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని బ్రాంచీలు మీ ఆసక్తికి, లక్ష్యసాధనకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వాటిని ఎంచుకుంటే మంచి కెరియర్‌కు మార్గం సుగమం అవుతుంది.


జాతీయ, అంతర్జాతీయ  ఆర్థిక వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, తదితర సాంప్రదాయ అధ్యయన అంశాలను కోర్‌ బ్రాంచీలుగా పిలుస్తున్నారు. ఆధునిక పారిశ్రామిక రంగం ఆవిర్భావంతో కంప్యూటర్స్‌, ఐటీ, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, బయోటెక్నాలజీ, మెకట్రానిక్స్‌, తదితర బ్రాంచీలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థి తన ఆసక్తి, విద్యానేపధ్యం, స్థిరపడాలనుకుంటున్న రంగం, మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్రాంచీలను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఈసీఈకి నిరంతర డిమాండ్‌
ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచికి విద్యార్థుల నుంచి విపరీతంగా డిమాండ్‌ ఉంది. ఈసీఈ సంబంధిత పారిశ్రామిక, సేవా రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా టెలికాం రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం వృద్ధి చెందుతోంది. అనుకున్న సమయం కంటే వేగంగా, లక్ష్యానికి మించి ఫలితాలు ఈ రంగంలో కనిపిస్తున్నాయి. టెలికాం రంగంలో జరిపే పరిశోధన, అభివృద్ధి ఫలితాలు తక్షణం సాధారణ ప్రజానీకానికి చేరువలోకి వస్తున్నాయి. 3జీ, 4జీ, ఎల్‌టీఈ (లాంగ్‌ టర్మ్‌ ఎవల్యూషన్‌) లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుంది. వినియోగదారుల మార్కెట్‌ విస్తృతంగా ఉండటం, రోజురోజుకూ ఇది వృద్ధి చెందుతుండటం వల్ల ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి.

టెలికాం రంగంతోపాటు అనేక ఇతర పరిశ్రమలు, విభాగాలు ఈసీఈ విద్యార్థులకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, మైక్రోవేవ్‌, శాటిలైట్‌, టెరెస్ట్రియల్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ లాంటి అనేక రకాల కమ్యూనికేషన్‌ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రభుత్వ రంగంలోని బీఈఎల్‌, ఇస్రో, ఈసీఐఆర్‌, డీఆర్‌డీఓ లాంటి కంపెనీల్లో కూడా స్థిరపడవచ్చు. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సంబంధిత విభాగాల్లోకి కూడా ఈసీఈ విద్యార్థులు ప్రవేశించవచ్చు. తద్వారా ఉద్యోగ అవకాశాల పరిధిని పెంచుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా...
ఈసీఈ విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌పై కూడా పట్టు ఉంటుంది. సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచి విద్యార్థులకు తీసిపోని రీతిలో ప్రోగ్రామింగ్‌ సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. తద్వారా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో కూడా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. అవకాశాలతోపాటు ఈసీఈ చదివే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులే మంచి అవకాశాలను పొందే పరిస్థితి ఉంది.

పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఈసీఈ విద్యార్థులకు విద్యావకాశాలు విస్తృతం. ఎం.టెక్‌. లేదా ఎం.ఎస్‌.లో వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, టెలి కమ్యూనికేషన్స్‌, సీఎస్‌ఈ, ఐటీ, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ సిస్టమ్స్‌, అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రానిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, రాడార్‌, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్‌, ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, తదితర స్పెషలైజేషన్‌లను ఎంచుకోవచ్చు. మనదేశంలో, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులు చేసినవారికి అవకాశాలు బాగుంటాయి.

నిత్య జీవితంలో సివిల్‌

మనిషి నిత్యజీవితంతో ముడిపడి ఉన్న సబ్జెక్టు సివిల్‌ ఇంజినీరింగ్‌. మనం నిరంతం చూసే, ఉపయోగించే రోడ్లు, భవనాలు, పరిశుద్ధమైన నీరు, ప్రాజెక్టులు, వంతెనలు, ఎయిర్‌పోర్టులు, తదితరాలన్నీ కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫలాలే. ఇతర ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి సివిల్‌ ఇంజినీర్లు మానవ జీవితాన్ని సుఖవంతం చేయగలుగుతారు. దీనిలో భాగం కావాలంటే సివిల్‌ ఇంజినీరింగ్‌ చదవాలి. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చేపట్టే ప్రాజెక్టుల్లో పనిచేయడం ద్వారా వివిధ సమస్యలకు సృజనాత్మక రీతిలో పరిష్కారాలు కనుక్కోవడం సివిల్‌ ఇంజినీర్లకు సాధ్యమవుతుంది. మేథ్స్‌, సైన్స్‌, టెక్నాలజీ పరిజ్ఞానం ఈ అభ్యర్థులకు అవసరం. ఉన్నత విద్యలో అభ్యర్థులు తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వీలుంది.

సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎప్పటినుంచో కొనసాగుతోన్న సాంప్రదాయ సబ్జెక్టు. నిర్మాణాల ప్రణాళిక, రూపకల్పన, అమలు ఇందులో కీలకం. ఈ సబ్జెక్టు ద్వారా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌, అంచనా, సంబంధిత అంశాల్లో గట్టి పునాది ఏర్పడుతుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు బీటెక్‌ తర్వాత మనదేశంలో లేదా విదేశాల్లో ఉన్నత కోర్సులు చేయవచ్చు. స్ట్రక్చరల్‌, వాటర్‌ రిసోర్సెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌, కన్‌స్ట్రక్షన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌, తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.

* బీటెక్‌ తర్వాత ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం, రైల్వేలు, రక్షణ, పీడబ్ల్యుడీ, తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలోని వ్యవసాయ, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, భూగర్భ జలవనరుల విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
* ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఓఎన్‌జీసీ, సెయిల్‌, జిందాల్‌ గ్రూప్‌ కంపెనీలు కూడా సివిల్‌ ఇంజినీర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. స్వయంగా కన్సల్టింగ్‌ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి అనువైనది


(ఇతర ముఖ్య బ్రాంచిల విశేషాలను eenadu.net లో చదువు పేజీ విభాగంలో చూడండి.)

Monday, 11 June 2012

ఐఐటీల కంటే బిట్స్‌ కే ఎక్కువ పోటీ !

నాణ్యమైన సాంకేతిక విద్యకు ప్రసిద్ధి చెందిన సంస్థ బిట్స్‌ పిలానీ. బిట్స్‌లో ఈ ఏడాది సగటున ఒక్కో సీటుకు 68 మంది పోటీ పడుతున్నట్టు అంచనా. ఐఐటీల్లో ఒక్కో సీటుకు 54 మంది పోటీలో ఉన్నారు.

విలువలతో కూడిన సైన్స్‌, ఇంజినీరింగ్‌ విద్యను అందించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, అత్యధిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించడం బిట్స్‌ పిలానీ ప్రత్యేకతలు. బిట్స్‌కు పిలానీతోపాటు గోవా, హైదరాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్‌ (బి.ఇ. ఆనర్స్‌), సైన్స్‌ (ఎం.ఎస్‌సి.) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలు వడింది. బిట్‌శాట్‌లో స్కోరు సాధించిన అభ్యర్థులు ప్రిఫరెన్స్‌లు ఇవ్వడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోరుకున్న బ్రాంచిలో సీటు లభిస్తుంది.

బిట్స్‌ సంస్థల్లో బి.ఈ. (ఆనర్స్‌), బి.ఫార్మసీ (ఆనర్స్‌), ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌) కోర్సులున్నాయి. బిట్స్‌ పిలానీలో 800 సీట్లు, గోవాలో 600 సీట్లు, హైదరాబాద్‌లో 700 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
* బీఈ (ఆనర్స్‌)లో కెమికల్‌, సివిల్‌, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలు ఉన్నాయి.

* ఎం.ఎస్‌సి. (టెక్‌)లో ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌; ఎం.ఎస్‌సి. ఆనర్స్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, ఎకనమిక్స్‌ కోర్సులున్నాయి.

అనర్హతలు: 2011కి ముందే +2 పరీక్ష పాసైనవారు; మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో సబ్జెక్టువారీ 60 శాతం, సగటు 75 శాతం రానివారు; జూన్‌ 30లోగా +2 ఫలితాలు, మార్కుల జాబితాలు రానివారు; కేవలం కొన్ని లేదా ఒకటే సబ్జెక్టులో ఇంప్రూవ్‌మెంట్‌ రాసినవారికి బిట్స్‌లో ప్రవేశానికి అర్హత లేదు.

దరఖాస్తు నింపడంలో జాగ్రత్తలు
బిట్స్‌లో ప్రవేశం కోసం నిర్దేశించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులో 3 భాగాలు ఉంటాయి. అభ్యర్థి అప్లికేషన్‌ నంబర్‌ను క్లిక్‌ చేసిన వెంటనే ఇదివరకే బిట్‌శాట్‌ 2012కి నింపిన అప్లికేషన్‌లోని వివరాలన్నీ 1వ భాగంలోకి వాటంతట అవే వస్తాయి. 2వ భాగంలో అభ్యర్థి చదివిన కాలేజీ పేరు (+2), ఎగ్జామినేషన్‌ బోర్డు పేరు, పరీక్షకు హాజరైన / పాసైన సంవత్సరం, పరీక్ష ఫలితం వచ్చిన తేదీ, +2లో (ఇంటర్‌ సెకండియర్‌) కెమిస్ట్రీ (90కి), ఫిజిక్స్‌ (90కి), మేథమేటిక్స్‌ (150కి), ఇంగ్లిష్‌ (100కి)లో వచ్చిన మార్కుల్ని, పర్సంటేజీని కరెక్టుగా నింపాలి. అప్లికేషన్‌ నంబర్‌ ఇవ్వాలి.

* ఎంతో కీలకమైన 3వ భాగంలో విద్యార్థి తల్లి / తండ్రి సంతకం, రూ.200లకు తీసిన డీడీ (బిట్స్‌, పిలానీ పేరుతో ఎస్‌బీఐ/ యుకో/ ఐసీఐసీఐ/ ఎస్‌బీబీజే బ్యాంకులో) వివరాలను నింపాలి. దీనిలో క్రమ సంఖ్య, కోర్సు, క్యాంపస్‌ల వివరాలు ఉంటాయి.

దేశంలోని అన్ని బిట్స్‌ సంస్థల్లో కలిపి 2100 సీట్లు ఉంటాయి. కానీ బిట్‌శాట్‌ 2012కి సుమారు 1.35 లక్షల మంది పోటీపడ్డారు. అందులో 29 శాతం మంది మన రాష్ట్రం నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు 700 మంది (33 శాతం) బిట్స్‌లో సీట్లు సాధిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో సీట్లు పొందేవారి సంఖ్య 2 శాతంలోపే ఉంది. రాష్ట్రాల బోర్డు టాపర్లకు నేరుగా కావాల్సిన కోర్సులో ప్రవేశం కల్పించడం వల్ల ఏటా 20 నుంచి 30 మంది ఇలా బిట్స్‌లో చేరుతున్నారు.

ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ కీలకం
పరీక్ష రాసిన వెంటనే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు స్కోరు చేయడం ఒక ఎత్తయితే, ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ని తయారు చేయడం మరో ఎత్తు. విద్యార్థికి కోర్సులపై తగిన అవగాహన లేకపోయినా, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉన్నా నష్టపోయే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఒక విద్యార్థి ఐఐటీ జేఈఈలో 1000వ ర్యాంకు సాధించి కూడా ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ని సరిగా ఇవ్వకపోవడంతో తాను కోరుకున్న కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచిలో సీటు పొందలేకపోయాడు. ఇదే పరిస్థితి బిట్స్‌, ఏఐఈఈఈ విషయంలో కూడా పునరావృతమవుతూ ఉంది. అందువల్ల అభ్యర్థులు ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ ఇవ్వడంలో కొన్ని మెలకువలు పాటించాలి...

* విద్యార్థులు, తల్లిదండ్రులు... బిట్స్‌లో చదువుతున్న విద్యార్థుల్ని సంప్రదించి కోర్సుల వివరాలు, క్యాంపస్‌లో ఏ కోర్సుకు ఎలాంటి ప్లేస్‌మెంట్లు వస్తున్నాయి, మీ స్కోరుకి సీటు లభించే అవకాశం ఉన్న కోర్సులు, ప్రిఫరెన్స్‌ ఇవ్వడం గురించి ఆరా తీయాలి.

* ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ సరిగా ఇవ్వడం అనేది కష్టంతో కూడుకున్నప్పటికీ, ఎంతో తెలివిగా చేయాల్సిన పని. పథకం ప్రకారం ప్రిఫరెన్స్‌ ఇస్తే స్కోరు తక్కువ వచ్చినవారికీ కోరుకున్న కోర్సులో సీటు దక్కవచ్చు.

* ఒకే స్కోరు సాధించినవారు ఎక్కువమంది ఉంటే ముందుగా మేథ్స్‌, తర్వాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ +2 మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

* విద్యార్థి ఆశించిన కోర్సులో సీటు రావడం, రాకపోవడం అనేది ఆ కోర్సుకి ప్రిఫరెన్స్‌ ఇచ్చిన విద్యార్థుల సంఖ్య, మీ బిట్‌శాట్‌ స్కోరు, ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌లు, ఆ కోర్సుకు ఉండే డిమాండ్‌, గతంలో ప్లేస్‌మెంట్లపై ఆధారపడి ఉంటుంది.

 కటాఫ్‌లను పరిశీలిస్తే...
బిట్స్‌లో ఏ క్యాంపస్‌లో, ఏ కోర్సు చేసినా దాదాపు అందరికీ మంచి ప్లేస్‌మెంట్లు లభిస్తాయి. కటాఫ్‌ తక్కువగా ఉందని బి.ఫార్మసీని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు కావాల్సిన కోర్సులో గతంలో సీట్లు ఎంతవరకు వచ్చాయో కటాఫ్‌లను పరిశీలిస్తే అర్థమవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను దూరం పంపడానికి ఇష్టపడరు. అలాంటివారు క్యాంపస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యాంపస్‌ల వాతావరణ పరిస్థితుల్ని కూడా తెలుసుకోవడం అవసరం.

* ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌లు ఒకే క్యాంపస్‌కి పరిమితమైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మన స్కోరుకి ఏయే కోర్సులు రావచ్చో గత నాలుగేళ్ల కటాఫ్‌ స్లోర్లని బట్టి అంచనా వేసుకోవచ్చు. అన్ని కోర్సులకూ గత నాలుగేళ్లలో కటాఫ్‌ల మధ్య తేడా 5 నుంచి 10 మధ్యే ఉంటోంది.

* కటాఫ్‌ బోర్డర్‌లో ఉండేవారు కీడెంచి మేలెంచడం మంచిది. మరిన్ని మెలకువలు తెలుసుకొని కోర్సుల ప్రాధాన్యతా క్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ క్రమాన్ని ఒకసారి ఇచ్చాక మళ్లీ మళ్లీ మార్చడం కుదరదు.

* విద్యార్థికి అభిరుచి ఉన్నది ఒక కోర్సులోనే అయినా, పది రకాల కోర్సుల ప్రాధాన్యతా క్రమాన్ని కటాఫ్‌లకు అనుగుణంగా తయారు చేసుకోవాలి. ఉదాహరణకు 310 మార్కులు వచ్చినవారు, తమకు 300 మార్కులే వచ్చాయనుకొని ప్రోగ్రామ్‌ల ప్రాధాన్యతా క్రమాన్ని తయారు చేసుకోవడం చాలా ఉత్తమం.

* ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నా బిట్స్‌లో చదవలేమనే బెంగ వద్దు. ఇక్కడ చదివేవారికి విద్యారుణం ఇవ్వడానికి అనేక బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. బ్యాంకులు అడ్మిషన్‌ల సమయంలో నేరుగా క్యాంపస్‌లకే వస్తాయి. ఇంకా 30 శాతం మందికి బిట్స్‌లో మెరిట్‌, మెరిట్‌ కమ్‌ నీడ్‌ లాంటి రకరకాల ఉపకార వేతనాలు అందుబాటులో ఉన్నాయి.

ఇటరేషన్లలో పాల్గొనవచ్చు
విద్యార్థులు ఇచ్చిన ప్రాధాన్యతా క్రమంలో పైపైకి మళ్లీ మళ్లీ (మొత్తం 4 సార్లు) వెళ్లడాన్ని 'ఇటరేషన్‌' అంటారు. మీరు కోరుకున్న కోర్సు దక్కలేదని నిరుత్సాహపడకుండా 4 ఇటరేషన్లలో పాల్గొనడం మంచిది. ఇటరేషన్లలో పైకి జరగడం అనేది వేర్వేరు క్యాంపస్‌లు, కోర్సుల్లో చేరే లేదా మానేసే విద్యార్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.
* మీకు ఇష్టమైన కోర్సు రాకున్నా వేరే కోర్సులో చేరి రెండో సంవత్సరంలో కావాల్సిన కోర్సుని దక్కించుకోవచ్చు. ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌)లో పిలానీలో ఎకనమిక్స్‌ కావాలనుకున్న వారికి అది రాకపోతే ప్రస్తుతానికి బయాలజీలో చేరవచ్చు. మొదటి సంవత్సరం కష్టపడి మంచి సీజీపీఏ సాధించి రెండో ఏడాది ఎకనమిక్స్‌లోకి మారవచ్చు. ఇంకా సులభంగా బి.ఇ. ఆనర్స్‌లోకి మారవచ్చు.

* బి.ఇ. (ఆనర్స్‌)లో ఒక కోర్సు నుంచి మరొక కోర్సు (ఉదాహరణకు.. సివిల్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌కి వెళ్లడం)లోకి మారాలంటే చాలా ఎక్కువ సీజీపీఏ తెచ్చుకోవాలి.

* చాలామంది విద్యార్థులు ఎం.ఎస్‌సి. (టెక్‌) ఐదేళ్ల కోర్సు అనీ, ఐటీ కోర్సు అనీ భ్రమపడతారు. నిజానికి ఇది నాలుగేళ్ల కోర్సు, కంప్యూటర్‌ సైన్స్‌ (బి.ఇ)కి సమానమైన కోర్సు.

* అవసరం ఉన్నా, లేకున్నా 40 ప్రిఫరెన్స్‌లు ఇవ్వడంలో నష్టం లేదు. అయితే మొదటి 10 ప్రిఫరెన్స్‌ని చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకా సందేహాలు ఉంటే బిట్స్‌కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ముఖ్యమైన తేదీలను గమనిస్తూ ఉండాలి.

* 30 జూన్‌: రూ.200 డీడీ, అటెస్ట్‌ చేసిన టెన్త్‌, +2 / ఇంటర్‌ మార్కుల మెమోలు, 3 పేజీల ప్రింటెడ్‌ దరఖాస్తు The Admissions Office, BITS Pilani - 333031 కి స్పీడ్‌ లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా చేరడానికి చివరితేదీ.

* 1 జులై: అడ్మిషన్‌ లిస్ట్‌ ప్రకటన (ఇటరేషన్‌ -1)

* 10 జులై: అడ్వాన్స్‌ ఫీజు చెల్లించడానికి గడువు.

* 11 జులై: ఇటరేషన్‌ 2 అడ్మిషన్ల ప్రకటన

* 18 జులై: ఇటరేషన్‌ 2 అభ్యర్థులు మిగతా ఫీజు చెల్లించడానికి చివరితేదీ

* 19 జులై: ఇటరేషన్‌ 3 అడ్మిషన్ల ప్రకటన

* 31 జులై: ఇటరేషన్‌ 4 అడ్మిషన్ల ప్రకటన.

-  ANS  శంకరరావు

Monday, 30 April 2012

అభిరుచితో అందలం...ఇంజినీరింగ్‌


ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. తమ కుమారుడు / కుమార్తెను ఏ కోర్సులో చేర్చితే వారి భవిష్యత్తు బాగుంటుంది, విదేశాల్లో ఉపాధి అవకాశాలకు వీలుంటుంది అనే అంశాలపై తల్లిదండ్రులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 


ప్రాంగణ నియామకాలు (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌) జరుగుతున్న కళాశాలల గురించి తెలుసుకుంటూ, వాటిలో సీటు దక్కాలంటే ఏ స్థాయి ర్యాంకు సాధించాలో పిల్లలకు గుర్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ, వారి ఆలోచనల మేరకు ఇంటర్‌ వరకు చదివినా... ఉపాధికి కీలకంగా భావిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యలో మాత్రం విద్యార్థుల అభిరుచికి ప్రాధాన్యం తప్పనిసరిగా ఇవ్వాలని వివిధ రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించవచ్చు? ఉన్నత జీవనానికి విద్యార్థి దశ నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలపై దిగ్గజ కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఏమంటున్నారు?

దేశ భౌగోళిక పరిస్థితులు, అత్యధిక జనాభా రీత్యా సదుపాయాల మెరుగుకు ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవారంగాలు (ఐటీఈఎస్‌), ఆటోమేషన్‌, టెలీ కమ్యూనికేషన్‌ వ్యాప్తి అధికమవుతోంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాల్లో టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పాస్‌పోర్ట్‌ దరఖాస్తు కూడా ఇ-సేవాకేంద్రాల్లో చేస్తున్నామంటే టెక్నాలజీ విస్తృతి వల్లే. ఈ పరిణామాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఇతర రంగాల్లోనూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కొరత ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

* మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున సివిల్‌ ఇంజినీర్లకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
* తయారీ రంగంలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ నిపుణుల అవసరం ఉంటుంది. ఏరోస్పేస్‌ రంగంలోనూ డిజైనింగ్‌ నిపుణులకు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.
* అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రవేశం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సులు చదివిన వారు కూడా ఐటీ ఉద్యోగాల్లో ఇమిడిపోతున్నారు.
* రోజువారీ పనులను మొబైల్‌ సాయంతో చేయగలిగే టెక్నాలజీ, కంప్యూటర్‌ నిర్వహణ ఖర్చులు తగ్గించే క్లౌడ్‌ విస్తృతి పెరుగుతోంది. కాబట్టి ఐటీ రంగంలో రాబోయే 2 దశాబ్దాలలోనూ మంచి ఉపాధి అవకాశాలే లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి సామర్థ్యాలు కావాలి?
దేశంలోని ప్రధాన ఐటీ సంస్థలకు అత్యధిక ఖాతాదారులు విదేశాల్లో ఉంటారు. వారికి కావాల్సిన ప్రాజెక్టులను ఐటీ కంపెనీలు ఇక్కడే రూపొందిస్తుంటాయి. అందుకే ఐటీ ఉద్యోగుల్లో 80 శాతం మంది ఇక్కడ పనిచేస్తుంటే, 20 శాతం మంది ఖాతాదారులకు సమీపంగా విదేశాల్లో పనిచేస్తుంటారు. విదేశీ సంస్థలకు ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అక్కడి బాధ్యులతో సమాచారం ఇచ్చి, పుచ్చుకునే (కమ్యూనికేషన్‌) బాధ్యత ఆ ప్రాజెక్టు చేపట్టిన బృంద సభ్యులే వహించాలి. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. వారి హావభావాలకు అనుగుణంగా స్పందించవచ్చు. కనీసం ఆ వ్యక్తి ఎలా ఉంటారో కూడా తెలీకుండా ఫోన్‌, ఇ మెయిల్‌, ఛాటింగ్‌ పద్ధతుల్లో సమాచార మార్పిడి జరగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుంది. ఎదుటివారిని ఆకట్టుకునేలా కమ్యూనికేషన్‌ ఉండాలి. అందుకే భావ ప్రకటనా సామర్థ్యం ఐటీ రంగంలో అత్యంత ముఖ్యం.

* ఏం చేస్తున్నాము, ఇంకా ఏమి కావాలి అనే అంశాలను వివరంగా, తడబాటు లేకుండా విశ్లేషించగలగాలి. సాంకేతికంగా అభ్యర్థిలో ఎంత నైపుణ్యం ఉన్నా, చెప్పలేకపోతే ఫలితం ఉండదు.
* వ్యాకరణ దోషాలు లేకుండా ఇంగ్లిష్‌లో సమాచారాన్ని పంపగలగాలి.
* ఒక్కో ప్రాజెక్టు ఒక్కో దేశంతో చేయాల్సి రావచ్చు. జర్మనీ, జపాన్‌, అమెరికా.. ఇలా ఒక్కో దేశానికి ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారితో మెలగాల్సి ఉంటుంది.
* జావా, ఎస్‌ఏపీ, డాట్‌ నెట్‌ లాంటి 20 రకాల కంప్యూటర్‌ లాంగ్వేజీలపై ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌లో అభ్యసించిన టెక్నాలజీతో పాటు ఎప్పటికప్పుడు కొత్త సామర్థ్యాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీలను త్వరగా గ్రహించగలగాలి.
* ఫలానా దేశం ప్రాజెక్టు వచ్చింది, వచ్చే వారంలో వెళ్లాలి అని కంపెనీ సూచించినప్పుడు, వెంటనే బయలుదేరగలగాలి. ఇంజినీరింగ్‌ దశలోనే దీనికి పునాది వేసుకోవాలి. సొంత ఇల్లు / బంధువుల వద్ద ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చే వారికంటే, హాస్టల్‌లో ఉండేవారు కొత్తవారితో త్వరగా కలిసిపోతారని, ఎక్కడికైనా వెళ్లేందుకు సంకోచించరన్నది కంపెనీల అభిప్రాయం.
* దేశాలతో పాటు ఖాతాదారుల రంగాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. బ్యాంకింగ్‌, తయారీ, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌ వంటి రంగాలకు ప్రాజెక్టులు చేయాల్సి రావచ్చు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొని అప్పగించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయగలగాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఇది సాధ్యం. విద్యార్థి దశ నుంచే దీనిపై దృష్టిపెట్టి వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి.

కళాశాలల పాత్ర కీలకం
వ్యక్తిగత మేథావితనం (బ్రిలియన్స్‌) కంటే ఒక బృందంగా విజయవంతం అయితేనే ఐటీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ప్రాజెక్టు పరిమాణానికి అనుగుణంగా ఒక్కో బృందంలో 5, 10, 50 మంది వరకు సభ్యులుగా ఉండవచ్చు. వీరంతా బృందంగా పనిచేస్తేనే ప్రాజెక్టు సక్రమంగా పూర్తవుతుంది. కళాశాలల్లో వ్యక్తిగత మూల్యాంకనానికే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పద్ధతిలో మార్పు అవసరం. కొన్ని కళాశాలలు మాత్రమే విద్యార్థులు బృందాల్లో పనిచేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిపెడుతున్నాయి.

ఎంతో ఒత్తిడి ఉండే ఐటీ ఉద్యోగంలో రాణించాలంటే మానసిక, శారీరక ఆరోగ్యం అత్యంత కీలకం. 20-30 ఏళ్ల వయస్సులో ఒత్తిడి తట్టుకుని పనిచేసినా, అనంతరం బీపీ, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మొబైల్‌, ల్యాప్‌టాప్‌పై పనిచేస్తున్నందున, ఎక్కడ ఉన్నా విధులకు అందుబాటులో ఉంటారు. దీనివల్ల కార్యాలయ విధులు, ఇంటి బాధ్యతల మధ్య విభజన చెరిగిపోతోంది. 24 గంటలూ ఫోన్‌ / కంప్యూటర్‌కు అతుక్కుపోకుండా, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఉండే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. యోగా, వ్యాయామం లాంటి వాటికి సమయం కేటాయించాలి. ఆఫీసు, వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సంరక్షణకు సరైన రీతిలో ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి దశ నుంచే దీన్ని అలవరచుకోవాలి.

* రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. విద్యార్థి దశలో రాత్రి 10-5 గంటల మధ్య నిద్రపోవాలి. విధుల్లో చేరాక నైట్‌షిఫ్ట్‌ ఉన్నా, అనువైన సమయంలో 7 గంటలు నిద్ర మానకూడదు.
* ఇంజినీరింగ్‌ నుంచే అభిరుచులను 1-2 అంశాలకు పరిమితం చేసుకోవాలి.
* మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ వినియోగించకుండా రోజులో కనీసం గంట లేదా అరగంట సమయం కుటుంబసభ్యులు లేదా సన్నిహితులతో నాణ్యంగా, ఆహ్లాదంగా గడపడం అలవర్చుకోవాలి.

కంప్యూటర్స్‌తో తేలిగ్గా ఉపాధి
బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణతతోనే ఐటీ రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో అయితే మంచి కళాశాలల్లో పీజీ చేస్తేనే ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. అందుకే ఇతర కోర్‌ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు కూడా చాలామంది ఐటీలో ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

* విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం కూడా ఐటీ ప్రాధాన్యం పెరగడానికి మరో కారణం. ప్రారంభ వేతనాలు కూడా ఈ రంగంలోనే అధికం. కానీ ఇవే కీలకమని భావించి, విద్యార్థికి ఇష్టం లేకుండా కంప్యూటర్‌ సైన్స్‌ / ఐటీ కోర్సులో చేరితే ఇబ్బందులు ఎదురుకావచ్చు.
* వేగంగా విశ్లేషించగలగడం, సత్వర నిర్ణయాలు తీసుకునే చాతుర్యం, గణితంపై ఆసక్తి ఉన్నవారు ఐటీ రంగంలో రాణిస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ చదివిన వారికి ఈ రంగం అనుకూలిస్తుంది.

ఎంపిక పద్ధతులివీ...
ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో జరిగే ప్రాంగణ నియామకాలతో పాటు కోర్సు పూర్తయ్యాక కూడా రాత పరీక్ష, బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌), ఇంటర్వ్యూ ద్వారా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులకు ఎంపిక చేసుకుంటున్నాయి.

* రాత పరీక్షలో ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంతో పాటు లాజికల్‌, క్విక్‌ థింకింగ్‌, మ్యాథ్స్‌పై ప్రశ్నలుంటాయి. కొన్ని కంపెనీలు మాత్రం తమకు అవసరమైన టెక్నాలజీలో కనీస నైపుణ్యాలు ఉన్నాయో లేదో కూడా పరీక్షిస్తున్నాయి.
* ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న అంశాలను ఎదుటివారితో ఎలా పంచుకుంటారనే విషయాన్ని పరీక్షించేందుకు బృంద చర్చ నిర్వహిస్తున్నారు.
* ఇంటర్వ్యూల్లో విద్యార్థులను టెక్నాలజీపై మరీ లోతుగా ప్రశ్నలు అడగరు. వారు చేసిన ప్రాజెక్టు వివరాలను ఆత్మవిశ్వాసంతో వివరించగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యంగా పరిశీలిస్తారు.

ఎంత శాతం మార్కులు అవసరం?
ప్రాంగణ నియామకాలు జరిగే వివిధ కళాశాలల్లో, అక్కడ ఎంపిక చేసుకునే విద్యార్థుల సగటు మార్కులు మారిపోతుంటాయి. కనీసం 65 శాతం మార్కులకు పైగా ఉన్నవారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.

దిగ్గజ కంపెనీలు ప్రాంగణ నియామకాలను అత్యున్నత విద్యాసంస్థలతో ప్రారంభిస్తాయి. ఐఐటీలు, ఐఐఎస్‌సీ, బిట్స్‌, నిట్‌, యూనివర్సిటీ ప్రాంగణ కళాశాలలు, పేరొందిన ప్రైవేటు కళాశాలలు.. ఈ క్రమంలో కళాశాలలకు వెళ్తాయి. ప్రైవేటు కళాశాలల ఎంపికలో, స్వతంత్ర సంస్థలు ఇచ్చే ర్యాంకులను, అక్కడి మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏటా కొత్త కళాశాలలను జత చేస్తుంటారు.

* ఒక కళాశాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల పనితీరును ఏడాది తరవాత పరిశీలిస్తారు. వారి పనితీరును ప్రామాణికంగా తీసుకుని, మరుసటి ఏడాది ఆయా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరపాలో, వద్దో నిర్ణయించుకుంటారు.


కంపెనీలు అభ్యర్థుల్లో  గమనిస్తున్న లోపాలు ....  www.eenadu.net లో చూడండి.

Tuesday, 17 April 2012

ఎంపీసీ విద్యార్థులూ... మీ కోసమే!


    ఎంపీసీ విద్యార్థులు ఒక్కొక్క ప్రవేశపరీక్షను పూర్తి చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. ఐఐటీ- జేఈఈ రాసిన అనుభవ సారాన్ని మిగతా పరీక్షలకు ఎలా అన్వయించుకోవాలి? పకడ్బందీగా ఏ విధంగా సన్నద్ధం కావాలి? పరిశీలిద్దాం!
త నాలుగైదు సంవత్సరాల పేపర్లతో పోలిస్తే ఉదయం జరిగిన ఐఐటీ-జేఈఈ పేపరు- 1 సులభంగా ఉంది. కానీ, మధ్యాహ్నం జరిగిన పేపరు - II ని అభ్యర్థులు క్లిష్టంగా భావించారు. దీంతో ఈ పోటీలో ఎక్కడ ఉంటామో అనే ఒక సందిగ్ధావస్థలో పడిపోయారు.

మొదటి పేపరు బాగా సులభంగా ఉంది కాబట్టి జేఈఈలో మరీ ఇంత సులభమైన ప్రశ్నలు ఇవ్వరని ఎక్కువగా ఆలోచించి కొన్ని తప్పులు చేశారు. అదేవిధంగా పేపరు - II బాగా క్లిష్టంగా ఉండటంతో అక్కడ కూడా అధికంగానే తప్పులు చేశారు.

ఈ పోటీ పరీక్షలన్నిటిలో ర్యాంకు సాపేక్షంగానే ఉంటుంది. పరీక్ష ఏ విధంగా ఉన్నా అభ్యర్థి వాటిని తీసుకునే పద్ధతి ఒకే విధంగా ఉండాలి. అప్పుడు ఇంకా జరగబోయే ఏఐఈఈఈ, ఐశాట్‌, బిట్‌శాట్‌ లాంటి పరీక్షల్లో కూడా అనుకొన్న ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.

1. ప్రశ్న సులభంగా ఉంటే దానిని విపరీత అర్థాలు తీసి తప్పు జవాబులు గుర్తించకూడదు. ఉదా. భౌతికశాస్త్రంలో ఫిజికల్‌ ఆప్టిక్స్‌లో మొదటి పేపరులో ఇచ్చిన ప్రశ్న సాధారణ విద్యార్థి కూడా చాలా సులభంగా చేయగలది. దానిని అంత సులభంగా ఇవ్వరు, ఎక్కడో ఏదో మెలిక ఉంటుందని చాలామంది తప్పుగా గుర్తించారు.

అదేవిధంగా అకర్బన రసాయన శాస్త్రంలో పాఠ్యపుస్తకంలోని వ్యాఖ్యలను యథాతథంగా ఇచ్చినప్పటికీ చాలామంది తప్పు గుర్తించారు.

2. ఒక్కోసారి పేపరు కష్టంగా ఉందని అనిపించవచ్చు. 'ఇది సాపేక్ష పరీక్ష కాబట్టి మిగిలిన విద్యార్థుల కంటే ఒక ప్రశ్న అదనంగా చేయగలిగినా సీటు సాధించినట్లే' అనే దృక్పథంతో ఆలోచించాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి ర్యాంకు సాధించుకోవచ్చు.

ముందుగానే 'కటాఫ్‌' ప్రకటన
ఐఐటీ-జేఈఈ ప్రారంభమయిన తర్వాత ఫలితాల ముందే కటాఫ్‌ ప్రకటించడం అనేది తొలిసారి ఈ ఏడాదే జరిగింది. జనరల్‌ కేటగిరీలో సబ్జెక్టు కటాఫ్‌ 10 శాతంగా, మొత్తం కటాఫ్‌ మార్కులు 35 శాతంగా నిర్ణయించారు. ఓబీసీలో అయితే జనరల్‌ కేటగిరిలో 90 మార్కులు కటాఫ్‌గా, ఎస్‌.సి./ఎస్‌.టి./వికలాంగుల కేటగిరీ అయితే జనరల్‌ కేటగిరీ కటాఫ్‌లో 50 శాతం మార్కులు వీరి కటాఫ్‌గా ప్రకటించారు.



ప్రతి సబ్జెక్టులో 136 మార్కుల చొప్పున మొత్తం రెండు పేపర్లలో కలిపి 408 మార్కులకు పరీక్ష జరిగింది. ఈ కటాఫ్‌ మార్కుల పైన వచ్చిన ప్రతి అభ్యర్థికీ ర్యాంకు వస్తుంది. కానీ ఐఐటీలలో సీటు సాధించుకునే ర్యాంకు అంటే మాత్రం జనరల్‌ కేటగిరీలో 170 మార్కులపైనే సాధించవలసి ఉంటుంది.

ఏ మార్కుకు ఏ ర్యాంకు?
ఐఐటీ-జేఈఈలో సుమారుగా ఏ మార్కుకు ఏ ర్యాంకు వచ్చే అవకాశం ఉందో ఓ అంచనా ఇక్కడ చూద్దాం. ఇది కేవలం విద్యార్థి అవగాహన కోసమే కానీ కచ్చితమైన నిర్థారణ కాదు.



ఈ విశ్లేషణలో అర్థం చేసుకోవలసింది- పేపరు సులభంగా ఉంటే సీటు సాధించుకోవడానికి సాధించవలసిన మార్కు పెరుగుతుంది. పేపరు క్లిష్టంగా ఉంటే ఆ మార్కు తగ్గుతుంది. కానీ సాపేక్షంగా విద్యార్థి స్థాయి మారదు. ఈ విషయం అర్థం చేసుకుని పరీక్ష కాల వ్యవధిలో ఒక అవగాహనతో తెలిసిన ప్రతి ప్రశ్నకూ తప్పు లేకుండా సమాధానాలు గుర్తించగలగాలి. అప్పుడు పరీక్ష ఏదయినా కచ్చితంగా నెగ్గినట్లే!

ఏఐఈఈఈ సంగతి?
ఏఐఈఈఈ ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 29నే కాబట్టి ఈ మిగిలిన పది రోజుల్లో కొత్త అంశాలను చదవడానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. వీలైనన్ని నమూనా గ్రాండ్‌ టెస్టులు రాస్తుండాలి. ప్రతి పరీక్షలో చేసిన తప్పులు విశ్లేషించుకోవాలి.

ఈ పరీక్ష రాసే ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకోవాల్సిన అంశం- ప్రశ్నపత్రంలో అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయాల్సిన అవసరం లేదు. నేర్చుకున్న అంశాలను తప్పు లేకుండా సక్రమంగా గుర్తించగలిగితే సరిపోతుంది.

*  అధికశాతం రెండో సంవత్సర సిలబస్‌లోనే ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందుకే ద్వితీయ సంవత్సర సిలబస్‌కు సమయం ఎక్కువ కేటాయించుకుంటే మేలు.
*  ఆన్‌లైన్‌లో పరీక్షకు దరఖాస్తు చేసివున్నట్లయితే వీలైనన్ని నమూనా పరీక్షలు కంప్యూటర్‌పై అభ్యాసం చేయాలి. 65 శాతం పైన మార్కులు సాధించగలిగితే మంచి ఎన్‌.ఐ.టి.లో సీటు సాధించినట్లే!


బిట్ శాట్ సంసిద్ధమయ్యే  తీరు తెలుసుకోవడానికి  ఈ వారం ఈనాడు ‘చదువు’ ఇంటర్నెట్ ఎడిషన్ చూడండి-    http://archives.eenadu.net/04-16-2012/Specialpages/chaduvu/chaduvuinner.aspx?qry=topstory1

Wednesday, 15 February 2012

ఉజ్వల భవితకు... ఇంజినీరింగ్‌ దారులు!

     
ఇంజినీరింగ్‌ ప్రవేశానికి జాతీయస్థాయిలో ఒకే ఉమ్మడి పరీక్ష ప్రవేశపెట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవి ఓ కొలిక్కివస్తే వచ్చే ఏడాది నుంచి ఒకే పరీక్ష విధానం అమల్లోకి రావొచ్చు. ఈ ఏడాది మటుకు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలకు సిద్ధం కావాల్సిందే. దీనికి సమర్థమైన ప్రణాళిక ముఖ్యం. ప్రధాన ప్రవేశపరీక్షల తీరుపై స్థూల అవగాహన కూడా అవసరమే!


2012లో ఐఐటీ-జేఈఈ తోపాటు ఎంసెట్‌ రాయదల్చుకున్నారా? ఏప్రిల్‌ 8 వరకూ కేవలం ఐఐటీ-జేఈఈపై దృష్టి కేంద్రీకరించండి. తర్వాత మే 12 వరకూ ఎంసెట్‌ అభ్యాసం చేయండి.

విద్యార్థులు ఇంటర్‌ పూర్తిచేస్తూనే పదికి పైగా రాష్ట్ర, జాతీయస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు రాయాల్సివస్తోంది. మార్చి నుంచి జూన్‌ వరకూ వీటి మూలంగా విశ్రాంతే ఉండక ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

ఇంజినీరింగ్‌కు సంబంధించి ఎన్ని పరీక్షలు రాసినా చేరే కోర్సు ఒకటే. చేరబోయేది ఏదో ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలోనే. అటువంటప్పుడు అన్ని పరీక్షలు రాయాల్సిరావటం సహేతుకం కాదు కదా? ఇన్ని పరీక్షలతో విద్యార్థులను ఇబ్బంది పెట్టేబదులు అన్నింటికీ ఒకే పరీక్షను నిర్వహించాలనే చిరకాల ఆకాంక్ష ఆచరణలోకి రాబోతోంది. ఐఐటి, ఎన్‌.ఐ.టి. డైరెక్టర్లు సంయుక్తంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. 2013 నుంచి ఒకే పరీక్ష విధానానికి ప్రారంభం జరగాలని ఆలోచించి, విధి విధానాలు ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రకటించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదే జరిగితే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎంతో ఊరట లభించినట్లే. ఎందుకంటే ఐఐటీ జేఈఈ, ఏఐఈఈఈ, ఎంసెట్‌, విట్టీ.. వంటి ప్రతి పరీక్షకూ సిద్ధమవ్వాల్సిన ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది కాబట్టి! అంతేకాదు, ఐఐటీ-జేఈఈ, ఎఐఈఈఈ..- ఇలా ప్రతి పోటీ పరీక్షకూ వేరువేరుగా కోచింగ్‌ అవసరం లేదు. ఒకే కోచింగ్‌ తీసుకుని, ఒకే ప్రవేశ పరీక్ష రాస్తే సరిపోతుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా ఏ ఇంజినీరింగ్‌ సంస్థలోనైనా సీటు సాధించే అవకాశం ఉంటుంది.

విధివిధానాలు ప్రకటిస్తే మేలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష విధి విధానాలు వెంటనే విడుదల చేస్తే 2013కు తయారయ్యే విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టవుతుంది. వారు నూతన పరీక్ష పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు.

ఈ ఉమ్మడి పరీక్ష విధానానికి వస్తే ఇంటర్‌ మార్కుల నుంచి 50, 60 శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఇంగ్లిషులో కనీస మార్కులు సాధించాలన్న నిబంధన గానీ, అన్ని లాంగ్వేజెస్‌లో కలిపిన మొత్తం మార్కుల్లో యాభై శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశం గానీ లేకపోలేదు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఉమ్మడి ప్రవేశపరీక్షను మొదట 2013 నుంచి నిర్వహించి, 2014 నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంగా మార్చి విద్యార్థులు రెండు సార్లు రాసుకునేలా వీలుకల్పించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. సబ్జెక్టుతో పాటు (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మాథమెటిక్స్‌) ఆప్టిట్యూడ్‌పై కూడా ప్రశ్నలు ఉండేలా ఉన్నాయి. ఆంగ్లంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలున్నాయి.

మార్పులు నిశ్చయమే
2013 నుంచి ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి ప్రవేశ పరీక్షల్లో మార్పులు జరగబోతున్నాయి. పరిగణనలోకి తీసుకునే ఇంటర్‌ మార్కుల వెయిటేజీ విద్యార్థి ఇంప్రూవ్‌మెంట్‌ రాసినట్లయితే తొలి మార్కుల ప్రాతిపదికగా ఉంటుందా అనేది చర్చలో ఉన్న అంశం. ఇంటర్‌, ఆప్టిట్యూడ్‌, సైన్సెస్‌ 40:30:30 నిష్పత్తిలో ఉండాలని కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా 2013 నుంచి జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష జరిగే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి.


ఈ ఏడాది సంగతేమిటి?
2012లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు అధిక పరీక్షలు రాయాల్సిందే. అయితే కన్పించిన ప్రతి పరీక్షకూ దరఖాస్తు చేస్తే ప్రతి వారం ఏదో ఒక పరీక్షకు సిద్ధపడాల్సిందే. వాటి విధి విధానాల తేడా వల్ల ప్రతి వారం వేర్వేరు పరీక్షలకు తయారవుతూ వెళితే, ఏ పరీక్షపైనా పట్టులేక నష్టపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలను రెండు భాగాలుగా విభజించుకొని తయారు కావటం సులభం, ప్రయోజనకరం.


ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, బిట్‌శాట్‌ లాంటి పరీక్షలు ఒక విభాగంగా; ఎంసెట్‌, మహీ లాంటి పరీక్షలు రెండో విభాగంగా పరిగణించవచ్చు.

ఎందుకంటే...

* ఏఐఈఈఈ లాంటి పరీక్షల్లో ప్రశ్నల సంఖ్య చాలా తక్కువ కాబట్టి విద్యార్థిపై కాల ఒత్తిడి ఉండదు. కేవలం చదివిన అంశాలను అనువర్తింపచేసుకోవడాన్ని అభ్యసిస్తే సరిపోతుంది. ఏఐఈఈఈ/ బిట్‌శాట్‌లలో గంటకు జవాబులు గుర్తించే ప్రశ్నల సంఖ్య 30- 40 లోపే కాబట్టి ఏ జవాబును కూడా కంఠతా చేయాల్సిన అవసరం ఉండదు.

* ఎంసెట్‌ లేదా మహీ లాంటి పరీక్షల్లో గంటకు 60- 100 ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టుపై అవగాహనకు తోడుగా వాటిని వేగంగా సాధించగలిగిన అభ్యాసం కూడా తప్పనిసరి. అంత వేగం కనబరచాలంటే కచ్చితంగా కొన్ని ప్రశ్నల జవాబులను కంఠతా చేయాలి. షార్ట్‌కట్‌ మెథడ్స్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ తరహా జ్ఞాపకశక్తి మెలకువలు ఐఐటీ-జేఈఈ/ ఏఐఈఈఈ/ బిట్‌శాట్‌లకు ఉపయోగపడవు.

ఇదీ ఆచరణీయ ప్రణాళిక
2012లో ఐఐటీ-జేఈఈ తోపాటు ఎంసెట్‌ రాయదల్చుకున్నారా? ఏప్రిల్‌ 8 వరకూ కేవలం ఐఐటీ-జేఈఈపై దృష్టి కేంద్రీకరించండి. తర్వాత మే 12 వరకూ ఎంసెట్‌ అభ్యాసం చేయండి. ఇలా కాకుండా ఐఐటీ ప్రవేశపరీక్షకు ముందే ఎంసెట్‌ సన్నద్ధత ప్రారంభిస్తే మానసిక ఒత్తిడికి లోనై అనుకొన్నస్థాయిలో రాణించలేకపోవచ్చు.

ఆన్‌లైన్‌ సాధనపై శ్రద్ధ
ఇంజినీరింగ్‌ విభాగంలో ఈ ఏడాది కొన్ని ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఉన్నాయి. వీటికోసం నమూనా పరీక్షలు తప్పకుండా సాధన చేయాలి. సాధారణ ప్రశ్నపత్రంలోనైతే అన్ని ప్రశ్నలను ఏకకాలంలో ముందుకు లేదా వెనుకకు ఏ వైపునకయినా తిప్పి చూడవచ్చు. జవాబు గుర్తించాలనుకునే ప్రశ్నకు వెంటనే వెళ్లవచ్చు. అదే ఆన్‌లైన్‌ పరీక్షయితే ఒక సమయంలో మానిటర్‌పై ఒకే ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు- జరిగిపోయిన ప్రశ్న జవాబు మరలా గుర్తించాలంటే అన్ని ప్రశ్నలనూ వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాలి. దీనివల్ల సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించాలంటే ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువ రాయాలి.

ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈల ద్వారా సీట్లు వచ్చే అవకాశాలున్న విద్యార్థులు వాటిపైనే అధిక శ్రద్ధ పెడితే మంచిది. వాటిపై ఏదైనా అనుమానం ఉంటే మిగిలిన పోటీ పరీక్షలన్నిటి గురించి ఆలోచించే బదులు ఎంసెట్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టటం శ్రేయస్కరం.అప్పుడు మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరే అవకాశం ఉంటుంది.



- - - - పి.వి.ఆర్.కె. మూర్తి

Saturday, 7 January 2012

బిట్స్‌ సీటుకు ఎంత స్కోరు అవసరం?

నదేశంలో ఇంజినీరింగ్‌ కోర్సులకు ఐఐటీలతో సరితూగగల ప్రతిష్ఠాత్మక సంస్థ... బిర్లా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌), పిలానీ.

దీనికి గోవా, హైదరాబాద్‌లలో క్యాంపస్‌లున్నాయి. ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తోన్న ఈ సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష బిట్‌శాట్‌.

బిట్‌శాట్‌కు ఏటా దాదాపు లక్ష మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. వీరిలో బిట్స్‌ అందిస్తోన్న వివిధ కోర్సులకు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య 2 శాతానికిలోపే ఉంటుంది. ఇంజినీరింగ్‌లో ఆనర్స్‌ కోర్సులను అందించడం బిట్స్‌ సంస్థల ప్రత్యేకత. బీఈ + ఎం.ఎస్‌సి. ఆనర్స్‌ కోర్సులు కూడా చేయవచ్చు. బిట్‌శాట్‌ 2012 ఆన్‌లైన్‌ పరీక్ష 10 మే 2012 నుంచి 9 జూన్‌ 2012 వరకు జరగనుంది. గత ఏడాది బిట్‌శాట్‌ కటాఫ్‌లను పరిశీలించడం ద్వారా బిట్స్‌ క్యాంపస్‌లలో సీటు సాధించడానికి ఎంత స్కోరు అవసరమో అవగాహన చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర స్థాయి బోర్డులు నిర్వహించే +2, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారికి నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఈ అభ్యర్థులు బిట్‌శాట్‌ రాయాల్సిన అవసరం లేదు. వీళ్లు తాము కోరుకున్న కోర్సులో చేరవచ్చు.


పరీక్ష ఎలా ఉంటుంది?
బిట్‌శాట్‌ కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష. వ్యవధి మూడు గంటలు. పరీక్షలో మొత్తం 4 భాగాలుంటాయి.
* పార్ట్‌ 1: ఫిజిక్స్‌ - 40 ప్రశ్నలు
* పార్ట్‌ 2: కెమిస్ట్రీ - 40 ప్రశ్నలు
* పార్ట్‌ 3: ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ - 25 ప్రశ్నలు
* పార్ట్‌ 4: మేథమేటిక్స్‌ - 45 ప్రశ్నలు

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. సరైన సమాధానానికి 3 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు తీసేస్తారు. అభ్యర్థి నిర్దిష్ట సమయానికి ముందే అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, ఇంకా సమయం మిగిలిపోతే అదనంగా మరో 12 ప్రశ్నలు రాయడానికి అవకాశం ఇస్తారు. ఇది పూర్తిగా అభ్యర్థి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అదనపు ప్రశ్నలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌ నుంచి నాలుగేసి చొప్పున ఉంటాయి.

* అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే... అదనపు ప్రశ్నలు ఎంచుకున్న తర్వాత మొదట్లో గుర్తించిన 150 ప్రశ్నల్లో సమాధానాలు మార్చుకోవడానికి అవకాశం ఉండదు.

* సాధారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు మొదటి 150 ప్రశ్నలు సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోతుంది. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అదనపు ప్రశ్నల దశ వరకు వెళ్తారు. అదీగాక నెగటివ్‌ మార్కులు ఉంటాయి కాబట్టి ఊహించి సమాధానాలు గుర్తించి, తెచ్చుకున్న మార్కులు పోగొట్టుకోవడం సరైన పద్ధతి కాదు.

బిట్‌శాట్‌ ప్రశ్నపత్రాన్ని ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల సిలబస్‌ ఆధారంగా రూపొందిస్తారు. బిట్‌శాట్‌ వెబ్‌సైట్‌లో సిలబస్‌ పూర్తి వివరాలు లభిస్తాయి. ఆన్‌లైన్‌ పరీక్ష రాయగానే స్కోరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సరైన సమాధానాలు, తప్పు సమాధానాల సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. ఒక ఏడాదిలో ఒక్కసారి మాత్రమే బిట్‌శాట్‌ రాయడం వీలవుతుంది.

* మనరాష్ట్రంలో బిట్‌శాట్‌ హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలో జరుగుతుంది. బిట్స్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో కూడా పరీక్ష కేంద్రం ఉంది.

కోర్సుల వివరాలు...
బిట్స్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కోర్సులను ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అంటారు. బిట్‌శాట్‌ స్కోరు ఆధారంగా బీఈ (ఆనర్స్‌), ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌), ఎం.ఎస్‌సి. (టెక్‌), బి. ఫార్మ్‌ (ఆనర్స్‌) కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. బిట్స్‌ సంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సులు...

* బీఈ (ఆనర్స్‌): కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌.
* బి.ఫార్మ్‌ (ఆనర్స్‌)
* ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌): బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనమిక్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌.
* ఎం.ఎస్‌సి. (టెక్‌): ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, జనరల్‌ స్టడీస్‌.

అర్హతలు, దరఖాస్తు విధానం
2011 లేదా 2012లో మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 / ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే బిట్‌శాట్‌ 2012కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పై సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం, సగటున కనీసం 75 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు అవసరం.

బిట్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు బిట్‌శాట్‌ వెబ్‌సైట్‌ ద్వారా నమూనా టెస్ట్‌లను సాధన చేయవచ్చు.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2012
* బిట్‌శాట్‌ 2012: 10 మే నుంచి 9 జూన్‌ 2012 వరకు.

Tuesday, 20 December 2011

ఇంజినీర్లూ... స్వాగతం!

'సాఫ్ట్‌వేర్‌, ఇతర ప్రైవేటు ఉద్యోగాల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే మేలు' అనుకునే ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు రాష్ట్ర విద్యుత్‌సంస్థ తాజా ఉద్యోగ ప్రకటన వరంలాంటిది.

ఏపీ జెన్‌కోలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఏపీ ట్రాన్స్‌కో నుంచి నోటిఫికేషన్‌ రాబోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బి.ఇ./బి.టెక్‌/ ఎ.ఎం.ఐ.ఇ.లలో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచిల వారికి ఇదో చక్కని అవకాశం.

రాష్ట్రంలో అతి పెద్ద విద్యుదుత్పాదనతో భారతదేశంలో రెండో అతి పెద్ద హైడల్‌ సామర్థ్యాన్ని కలిగిన సంస్థ ఏపీ జెన్‌కో. ఈ సంస్థ  ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగ నియామకాలకు ప్రకటన జారీ చేసింది. ఇందులో 61 ఖాళీలు పరిమిత నియామకానికి (limited recruitment) సంబంధించినవి. 350 ఖాళీలు సాధారణ నియామకానికి (general recruitment ) సంబంధించినవి.

వెరసి మొత్తం 411 పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

2011 డిసెంబరు 1 నాటికి అభ్యర్థుల వయసు 34 సంవత్సరాలు మించివుండకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితిలో ఐదేళ్ళ సడలింపు ఇస్తారు. అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు పదేళ్ళ సడలింపు ఉంటుంది.

జీతం స్కేలు: రూ.23115-955-25025-1115-30600-1280-35720

ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తులను పూరించి పంపించాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం- ఇంటర్‌నెట్‌పై దరఖాస్తులను పంపే విధానంపై అవగాహన లేనివారు స్నేహితుల, లేదా ఈ ప్రక్రియపై అవగాహన ఉన్నవారి సహాయం తీసుకోవాలి.

ఎందుకంటే ఉద్యోగ దరఖాస్తుకు ఇది తొలిమెట్టు, అత్యంత కీలకఘట్టం. దరఖాస్తులో నింపే సమాచారంలో ఎలాంటి పొరపాట్లు దొర్లినా, మీ సర్టిఫికెట్ల సమాచారంతో ఆన్‌లైన్‌ సమాచారం సరిపోకపోయినా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. తద్వారా ఉద్యోగావకాశం చేజారుతుంది. అందుకని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యమూ పనికిరాదు.

దరఖాస్తు చేసేదెలా?
ఏపీ జెన్‌కోలో ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేయగోరే అభ్యర్థులుhttp:// www.apgenco.gov.in వెబ్‌సైట్‌ లోకి లాగిన్‌ అయ్యి Apply Online పై క్లిక్‌ చేయాలి. లేదా నేరుగా http://apgenco.cgg.gov.in లోకి లాగిన్‌ అవడం ద్వారా నోటిఫికేషన్‌, దరఖాస్తు వివరాలను పొందవచ్చు. డిసెంబరు 20 నుంచి జనవరి 3 వరకూ ఆన్‌లైన్‌ దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తుదారుల్లో ఓసీ అభ్యర్థులు/ ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సివుంటుంది. (దీనిలో రూ.350 పరీక్ష ఫీజు+ రూ.150 దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు). బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, అంగవికలురు రూ.150 చెల్లించాలి. ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. జనవరి 3, 2012 మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఈ ఫీజు చెల్లించాల్సివుంటుంది. భర్తీ చేసిన దరఖాస్తులు జనవరి 3, 2012 రాత్రి 11.59 గంటలలోపు పంపించవచ్చు.

ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసే ఇంజినీరింగ్‌ అభ్యర్థులు సంబంధిత బ్రాంచిలలో డిసెంబరు 1, 2011 నాటికి విద్యార్హతను సాధించివుండాలి.

ఎంపిక విధానం
ఏపీ జెన్‌కో ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షను జనవరి 22న నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో రెండు విభాగాలుంటాయి.

సెక్షన్‌ 'ఎ'లో 70 మార్కులకు కోర్‌ సబ్జెక్టుపై, సెక్షన్‌ 'బి'లో 30 మార్కులకు ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు. వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచిలకు నిర్దేశించిన సిలబస్‌ను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


రాత పరీక్షలను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో మాత్రమే నిర్వహిస్తారు. సాధారణంగా పరీక్ష హాల్లోకి కాల్‌క్యులేటర్లను అనుమతించరు. గతంలో జరిగిన GATE, ఇంజినీరింగ్‌ పరీక్షా పత్రాల నుంచి చాలావరకూ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముంది. ఇంజినీరింగ్‌లోని ప్రాథమిక అంశాల (Basics ) నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగవచ్చు. అందుకే వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి.

రెండు గంటల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సివున్నందున సమయ నిర్వహణ ఎంతో ముఖ్యం. గత పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు లేవు. ఈసారి పరీక్షలో నెగిటివ్‌ మార్కులకు సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. అందుకే పరీక్షకేంద్రంలో ప్రశ్నపత్రంపై ఉండే సూచనలను జాగ్రత్తగా చదివి పాటించాలి.

రెండు విభాగాల్లోనూ సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. కనీస అర్హత మార్కులు: ఓసీ: 40 శాతం, బీసీ : 35 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ, పీసీ: 30 శాతం. నియామకం పొందాక, శిక్షణ సమయంలో అభ్యర్థులు అర్హతకు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లనూ కంపెనీకి సమర్పించాల్సివుంటుంది.

- వై.వి. గోపాలకృష్ణమూర్తి

Monday, 31 October 2011

ఏఐఈఈఈ కి పెరిగింది ప్రాధాన్యం!


ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, మరికొన్ని ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష... ఆలిండియా ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఈఈఈ).

11వ ఏఐఈఈఈ పరీక్ష 29 ఏప్రిల్‌ 2012న జరగనుంది.

దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు రాసే ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఇది. దీన్ని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. పరీక్ష మీద సరైన అవగాహనతో సిద్ధమైతే ఇందులో విజయం సాధించి మంచి సంస్థలో సీటు దక్కించుకోవడం సులభం!


గత ఏడాది సుమారు పదిన్నర లక్షల మంది విద్యార్థులు ఏఐఈఈఈ రాశారు. ఏఐఈఈఈ 2011 ద్వారా వివిధ రకాల ఇంజినీరింగ్‌ కాలేజీల్లో దాదాపు 28 వేల సీట్లు భర్తీ అయ్యాయి. ఏఐఈఈఈ 2012కు తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్ష రెండు పద్ధతుల్లో జరగనుంది. అవి...

1) పేపర్‌-పెన్‌ పద్ధతిలో జరిగే ఆఫ్‌లైన్‌ పరీక్ష:

ఇది 29 ఏప్రిల్‌ 2012న మనదేశంలోని 63 పట్టణాల్లో, దుబాయ్‌, రియాద్‌లలో జరగనుంది.

2) కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష:
ఇది 7 మే 2012 నుంచి 25 మే 2012 వరకు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 22 నగరాల్లో జరగనుంది. మనరాష్ట్రంలో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలున్నాయి.

ఏఐఈఈఈ 2012 (ఏ పద్ధతిలోనైనా) రాయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. పరీక్ష ఫీజును డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా గానీ, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా గానీ చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపడంలో ఏమైనా ఇబ్బందులెదురైతే గత ఏడాది ఏఐఈఈఈ 2011 అప్లికేషన్‌లు విక్రయించిన సహాయ కేంద్రాల్లో సంప్రదించవచ్చు. ఆ కేంద్రాల్లో దరఖాస్తుల విక్రయం ఉండదుకానీ, ఆన్‌లైన్‌లో నింపడానికి సహాయం లభిస్తుంది.

ఏఐఈఈఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఇంజినీరింగ్‌ కోర్సులైన బీఈ/ బీటెక్‌లలో చేరదలచుకున్న విద్యార్థులు పేపర్‌-1ను, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో చేరదలచుకున్నవారు పేపర్‌-2 రాయాలి. పేపర్‌-1లో మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో సమాన ప్రాధాన్యత గల ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. పేపర్‌-2లో మేథమేటిక్స్‌, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లలో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు, డ్రాయింగ్‌ పరీక్షలుంటాయి. పరీక్ష విధానానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసంwww.cbse.nic.inలేదా www.aieee.nic.in వెబ్‌సైట్‌ చూడగలరు.

పెరుగుతోన్న ప్రతిష్ఠ
ఇటీవలి కాలం వరకు ఐఐటీ జేఈఈ తర్వాత రెండో ప్రాధాన్యత గల పరీక్షగా ఏఐఈఈఈకి పేరుంది. గత కొన్నేళ్ల నుంచి, ఐఐటీ - జేఈఈతో సమాన ప్రాధాన్యం గల పరీక్షగా ఏఐఈఈఈ గుర్తింపు తెచ్చుకుంది. 2006వ సంవత్సరం నుంచి ఐఐటీ జేఈఈ పరీక్ష ప్రతిష్ఠ క్రమేణా తగ్గుతూ వస్తోంది. పూర్తి ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షగా మారడం, పరీక్షలో సుమారు 50 శాతం ప్రశ్నలకు నెగటివ్‌ మార్కులు లేకపోవడం, ప్రశ్నల స్థాయి బాగున్నా, ఊహించి సమాధానాలు రాసే విద్యార్థులకు కూడా ర్యాంకు వచ్చేలా పరీక్ష రూపాంతరం చెందడం లాంటి విషయాలు జేఈఈని నిపుణుల విమర్శకు గురిచేశాయి.


మరోవైపు ఏఐఈఈఈకి క్రమేణా ఖ్యాతి పెరుగుతోంది. ప్లస్‌ 2 స్థాయిలోనే నాణ్యమైన ప్రశ్నలను రూపొందించడం, ప్రతి ప్రశ్నకు నెగటివ్‌ మార్కింగ్‌ ఉండటం వల్ల ఊహించి సమాధానాలు రాయడానికి అవకాశం లేకపోవడం, పరీక్షను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించడం లాంటి అంశాలు ఏఐఈఈఈ ప్రతిష్ఠను పెంచాయి. అంతేగాక, ఐఐటీల సంఖ్యను రెండింతలకుపైగా పెంచినా కొత్త ఐఐటీలకు సరైన భవనాలు, బోధనాసిబ్బంది, వసతులు లేకపోవడం వల్ల... ఐఐటీ-జేఈఈలో 3000 పైన ర్యాంకు సాధించిన విద్యార్థులు, కొత్త ఐఐటీల్లో చేరడానికి బదులు, పేరున్న ఎన్‌ఐటీలు, ఐఐఐటీలలో చేరడానికే ఇష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఐటీలతో సమానంగా ఈ సంస్థలకు కూడా గుర్తింపు ఉండటం వల్ల విద్యార్థులు ఏఐఈఈఈకి కూడా జేఈఈతో సమానమైన ప్రాధాన్యం ఇచ్చి సంసిద్ధులవుతున్నారు.

మనరాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐఈఈఈ పరీక్షపై అవగాహన తక్కువనే చెప్పాలి. రాష్ట్రం నుంచి జేఈఈలో మంచి ర్యాంకులు సాధించినవారికే ఏఐఈఈఈలో కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయిగానీ, జేఈఈలో విజయం సాధించని అభ్యర్థులకు ఏఐఈఈఈలో కూడా మంచి ర్యాంకు రావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఐటీ జేఈఈలో ఏ ర్యాంకూ రాని విద్యార్థులు ఎందరికో ఏఐఈఈఈలో మంచి ర్యాంకులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే... అక్కడి విద్యార్థులు, ఐఐటీ జేఈఈ స్థాయి తమకు లేదనుకుంటే, ఆ పరీక్ష జోలికి వెళ్లకుండా, పదో తరగతి తర్వాత రెండేళ్లూ ప్రత్యేకంగా ఏఐఈఈఈ కోసం తయారవుతున్నారు. మన రాష్ట్రంలోని విద్యార్థులకు తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అంచనా వేసుకోకుండా ఐఐటీలపై మోజుతో జేఈఈ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఓ ఏడాది గడచిన తర్వాత నిరాశ చెంది ఏఐఈఈఈ వైపు దృష్టి సారిస్తున్నారు. సమయం వృధా కావడం వల్ల, విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడినట్టుగా తయారవుతోంది.

జేఈఈ, ఈఈఈ మధ్య వ్యత్యాసం
ఐఐటీ- జేఈఈ, ఏఐఈఈఈ రెండూ దాదాపు ఒకే సిలబస్‌ మీద ఆధారపడిన ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షలే అయినా, ప్రశ్నల రూపకల్పనలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. జేఈఈలో సబ్జెక్టు లోతుల్లోని భావనలపై, చిక్కుముడి ఉన్న ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు సాధారణంగా మార్కెట్‌లో లభించే పుస్తకాల్లో ఉండవు. కాబట్టి పరీక్ష హాల్లో విద్యార్థి తనకు సబ్జెక్టుపై ఉన్న అవగాహనతో, తాను చదువుకున్న భావనలను ఉపయోగించి, సమాధానం కనుక్కోవలసి ఉంటుంది. రెండేళ్లూ కష్టపడి సబ్జెక్టులను క్షుణ్నంగా, ఏ మూలా వదలకుండా అధ్యయనం చేసిన విద్యార్థులే ఇలాంటి ప్రశ్నలు సాధించగలుగుతారు.

ఏఐఈఈఈలో ప్రశ్నలు సబ్జెక్టు మూలాలపై ఆధారపడి ఉంటాయి. జ్ఞాపక శక్తి, వేగాన్ని పరీక్షించే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రశ్నలు, మార్కెట్లో లభించే పుస్తకాల్లోని ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయి. అందువల్ల ఏఐఈఈఈకి ప్రిపేరయ్యే విద్యార్థులు సబ్జెక్టు లోతులకు వెళ్లకుండా, బేసిక్స్‌, ఫండమెంటల్స్‌ను బాగా చదువుకొని, వాటిపై ఆధారపడిన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. సరైన సాధనతో, ప్రణాళికా బద్దంగా ప్రిపేరైతే సగటు విద్యార్థి కూడా ఏఐఈఈఈలో మంచి ర్యాంకు సాధించవచ్చు.

Friday, 28 October 2011

మీ లక్ష్యం ఐఐటీనా?

మీరు ఐఐటీల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో  కష్టపడి చదువుతున్నారా?

అయితే మీరు కిందటి సంవత్సరం ఎన్ని మార్కులకు  ఏ ర్యాంకు వచ్చిందో,  సబ్జెక్టువారీగా  కటాఫ్ మార్కులు ఎంతో తెలుసుకోవాల్సిందే. 

చదువులో వచ్చిన ఈ కథనం పరిశీలించండి.

































హుషారుగా ఇలా తయారు
ఐఐటి-జెఇఇ కష్టమయినదే కానీ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ఒక నిర్ణీత ప్రణాళికతో తయారయితే సాధించవచ్చు. ఏ పోటీ పరీక్షకయినా విద్యార్థి మొదట ఏర్పర్చుకోవల్సింది ఆత్మవిశ్వాసం కాబట్టి ఈ పరీక్ష రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసం ఏర్పర్చుకోవాలి. అది ఏర్పడాలంటే బోధించే అధ్యాపకులపై నమ్మకం పూర్తిగా ఏర్పర్చుకోవాలి. విశ్వాసంతో సాధన చేస్తే సమయం వృథా కాదు.

* 2011 పరీక్ష పేపరు విశ్లేషిస్తే కెమిస్ట్రీలో దాదాపు 85 శాతం ప్రశ్నలు NCERT XI, XII పుస్తకాల నుంచి, ఫిజిక్స్‌లో 60 శాతం పైన, మాథమెటిక్స్‌లో 35 శాతం వరకు వచ్చాయి. కాబట్టి విద్యార్థి ఎక్కువ పుస్తకాలు చదవటం కంటే చదివిన పుస్తకాల పునశ్చరణ ద్వారా పరీక్ష బాగా రాసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కెమిస్ట్రీ పూర్తిగా NCERT పుస్తకాలు, ఫిజిక్స్‌ హెచ్‌.సి. వర్మ, మాథమెటిక్స్‌ తను కోచింగ్‌ తీసుకుంటున్న సంస్థలోని మెటీరియల్‌కు లోబడి దానివరకు పూర్తిగా తయారుకాగలిగితే చాలు.

* రిజర్వేషన్‌ ఉన్న విద్యార్థులు సీటు సులభంగా సాధించడానికి కొన్ని నిర్ణీత చాప్టర్లకు పరిమితమైతే మేలు. ఉదాహరణకు ఫిజిక్స్‌లో గత సంవత్సరం పేపరు- 1, 2 లలో దాదాపు 50 శాతం ప్రశ్నలు యాంత్రిక శాస్త్రం నుంచే వచ్చాయి. అదేవిధంగా కెమిస్ట్రీలో ఫిజికల్‌ కెమిస్ట్రీ విభాగం నుంచి 45 - 50 శాతం వరకు ప్రశ్నలు వచ్చాయి. మేథమాటిక్స్‌లో వెక్టర్‌ ఆల్‌జీబ్రా, మాట్రిసస్‌, డిటర్‌మెంట్స్‌ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి.

అక్టోబరు 10 'చదువు' సంచికలో ఐఐటీ-జేఈఈ 2011 ప్రశ్నపత్ర విశ్లేషణ ఇచ్చాం. ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనేది దీనిలో సంపూర్ణంగా ఇచ్చాం కాబట్టి దాని ఆధారంగా కొన్ని అభ్యాసాలకు పరిమితమైనా సీటు సాధించవచ్చు. పరిమితమైన అభ్యాసాలను క్షుణ్ణంగా చదువుతూ మిగిలిన అభ్యాసాలలో ప్రాథమిక అంశాల వరకయినా చదవాల్సిన అవసరం ఉంటుంది.

* తుది పరీక్ష ఆరుగంటలు జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆ విధంగా తయారుకావడం ప్రారంభించాలి. అంత సుదీర్ఘ సమయం ఏకాగ్రతతో పరీక్ష రాయడానికి కచ్చితంగా కొంత అభ్యాసం తప్పనిసరి.

* గత సంవత్సరం రుణాత్మక మార్కులు బాగా తగ్గాయి కాబట్టి కొంతమంది విద్యార్థులు ఈ సంవత్సరం కూడా పరీక్ష అదే తరహాతో ఉండవచ్చు అనే అపోహతో ఉన్నారు. రుణాత్మక మార్కులు అధికంగానే ఉంటాయనుకొని తయారుకావడం శ్రేయస్కరం.

* ఇంటీజర్‌ టైపు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. కానీ వివిధ సంస్థల మెటీరియల్‌లో కానీ, మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాల్లో గానీ ఈ తరహా ప్రశ్నలు చాలా తక్కువ. వీలైనంతవరకూ వీటిని అభ్యసించడం మేలు.

* మ్యాట్రిక్స్‌ మ్యాచింగ్‌, పేరాగ్రాఫ్‌ తరహా ప్రశ్నల్లో విద్యార్థులు తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. పరీక్షల్లో వీలైనంతవరకూ ఈ రకమైన ప్రశ్నలపై అధిక శ్రద్ధ చూపాలి.

* 2011 ప్రశ్నపత్రానికి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థి అన్ని రకాల ప్రశ్నలనూ అభ్యసించాలి. అలాగే ప్రశ్నపత్రం ఏ సబ్జెక్టుతో ప్రారంభించినా రాసేవిధంగా ఉండాలి. 2010లో సబ్జెక్టుల క్రమం మారిందని సరిగా రాయలేకపోయామని చెప్పిన విద్యార్థులు చాలామందే ఉన్నారు. ఒక్కో పరీక్షలో ఒక్కో సబ్జెక్టుతో ప్రారంభిస్తూవుంటే తుది పరీక్షలో ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాదు.