ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 14 May 2012

మీరు టెట్ రాస్తున్నారా?

టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఈ సారి ఉద్విగ్న భరితంగా జరగనుంది. టెట్‌ కేవలం అర్హతా పరీక్షే కాకుండా డీఎస్సీలో 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. తద్వారా డీఎస్సీలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది టెట్‌ స్థాయిలోనే అభ్యర్థులకు దాదాపు తెలిసిపోతుంది. మరో 17 రోజుల్లో టెట్‌ పరీక్ష జరగబోతుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉండటం సహజం. ఈ కొద్దిపాటి సమయాన్ని టెట్‌లో గరిష్ఠ మార్కులు సాధించడానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

చాలామంది అభ్యర్థులు టెట్‌లో అర్హత మార్కులు 'ఎలాగోలా' వస్తే చాల్లే అని, స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి శక్తియుక్తుల్ని వినియోగించరు. నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన ధోరణి కాదు. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలో 'ఎలాగోలా బతికేద్దాం అని ఇక్కడికి రాలేదు' అని హీరో అంటాడు చూడండి, అలాగే మీరు కూడా ఉన్నత లక్ష్యంతో టెట్‌ యుద్ధానికి సిద్ధమవండి. డీఎస్సీలో ప్రభావం చూపే టెట్‌లో మీ మార్కుల లక్ష్యం పైన పట్టికలో చూపించిన విధంగా ఉండాలి.

పేపర్‌ కఠినత్వం సగటు స్థాయిగా ఉందనుకుంటే... మొత్తం మీద 115 - 120 మధ్య స్కోరు చేయగల్గితే డీఎస్సీలో మంచి వెయిటేజీ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్థాయిలో మీ ప్రిపరేషన్‌ ఉంటే విజయవంతం అయినట్లే. లేకుంటే ఈ 17 రోజుల్లో ఏమి చేసి లక్ష్యం సాధించాలో తెలుసుకుందాం.

శిశు వికాసం - పెడగాజి
సిలబస్‌ కింద చాలా అంశాలు ఉండటంతో ఈ విభాగంపై అభ్యర్థులు సాధారణంగా కొంత వ్యతిరేకత పెంచుకుంటారు. 2012 జనవరి టెట్‌లో పెడగాజి (10 ప్రశ్నలు), అభ్యసనం (8), శిశువికాసం (8), వైయక్తిక భేదాలు (2), మూర్తిమత్వం (2) ప్రశ్నలు అడిగారు. పాఠ్యాంశాల విభజన మళ్లీ దాదాపుగా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ విభాగంపై ఇంకా సరైన పట్టు దొరకలేదు అనుకునేవారు, ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టడం మంచిది.

* పెడగాజిలోని సిలబస్‌ని జనరల్‌గా చదవండి. అక్కడక్కడ మెథడ్స్‌ అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్ని కూడా అనుసంధానం చేసుకొని చదివితే రెండు విధాలుగా ప్రయోజనం లభిస్తుంది.

* 'అభ్యసనం' విభాగంలో ప్రశ్నలు అన్నీ బీఎడ్‌ / డీఎడ్‌ పుస్తక సమాచారంలోనివే కాబట్టి, అకాడమీ పుస్తకాల సహాయంతో అభ్యసన భావనలు బాగా చదవాలి.

* 'శిశువికాసం' విభాగంలో... వికాసం - పెరుగుదల ప్రధానాంశాలుగా కన్పిస్తున్నాయి. ఈ విభాగంలో 1-5 పాఠాలను క్షుణ్నంగా చదివి, 6, 7, 8 పాఠాల్ని సాధారణ స్థాయిలో చదివితే సరిపోతుంది.

* తరగతి గది, పాఠశాల, ఉపాధ్యాయుడు, పిల్లలు, పరిసరాలు మొదలైన అంశాలను, వాటి గురించి ఊహించుకుంటూ చదివితే పెడగాజిలో మార్కులు సులభంగా సాధించవచ్చు.

తెలుగు భాష
2011 టెట్‌ పేపర్‌ చూసి చాలామంది అభ్యర్థులు ఈ విభాగాన్ని సులభంగా భావించారు. కానీ 2012 (జనవరి) పేపర్‌ చూసి కారణాలు ఏవైనప్పటికీ బాగా ఒత్తిడికి లోనయ్యారు. నిజానికి 'తెలుగు భాష' కింద ఇచ్చిన 30 ప్రశ్నలలో అత్యధిక ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. కాకపోతే వ్యాకరణ ప్రశ్నల్ని కంటెంట్‌ ఆధారంగా అడగటం (సాధారణ ఉదాహరణలలో కాకుండా), వాడుకలో లేని పదాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒత్తిడికి లోనై ఉంటారు. 'శిశు విషాణం' అర్థం, బహువ్రీహి సమాసానికి ఛాయిస్‌లో ఇచ్చిన పదాలు, 'ఉప్పు' కోసం ఇచ్చిన పొడుపు కథ... ఇబ్బందులు కలిగించాయని భావించవచ్చు. ఏది ఏమైనా టెట్‌లో అత్యధిక స్కోరు సాధించటం లక్ష్యం కాబట్టి అభ్యర్థులు కింది అంశాలపై దృష్టి పెట్టాలి.
* సిలబస్‌లో పేర్కొన్న పాఠ్యాంశాల అధారంగా పద్యాల్ని తెలుగు వ్యాకరణ అంశాలతో అనుసంధానం చేసుకొని అధ్యయనం చేయాలి. నేరుగా వ్యాకరణ అంశాలు చదవకూడదు.

* పెడగాజి కింద 6 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వ్యాకరణం చదివి, 'అంతా చదివేశాం' అనుకోకుండా భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు తెలుగు పండితులకు ఉండాల్సిన లక్షణాలపై కూడా పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ భాష
అధికశాతం అభ్యర్ధులు ఈ విభాగాన్ని సహజంగా కష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్ధులు దీని గురించి ఒత్తిడికి లోనవుతారు. కంటెంట్‌లో ఎక్కువ మార్కులు సాధిద్దామని ఇంగ్లిష్‌ భాషను దాదాపు వదిలేస్తారు. ఇప్పటికే బాగా ప్రిపేరై ఉంటే మంచిదే. ఇంకా సరైన పట్టు సాధించకుంటే అందుబాటులో ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టి కనీసం 10 మార్కుల వరకు అదనంగా పొందే అవకాశం ఉంది. ముందుగా 2012 (జనవరి) ప్రశ్నల్ని పరిశీలిస్తే, ఎగ్జామినర్‌ పెట్టుకున్న ప్రమాణాలు ఇలా ఉన్నాయి.

వాడుకలో ఉపయోగించే పదాల్ని కాకుండా క్లిష్ట పదాల్ని ఎక్కువగా వినియోగించటం వల్ల ప్రశ్నే అర్థం కాకపోవటంతో అభ్యర్ధులు బాగా మార్కులు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే అభ్యర్థులకు ఇంగ్లిష్‌ పేపర్‌, చందమామ (జూనియర్‌) లాంటివి చదివే అలవాటు ఉండాలి. ఈ 17 రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి... ఇచ్చిన సిలబస్‌ సంబంధిత పాఠ్యగ్రంధాల్ని రోజూ కనీసం ఓ గంట పెద్దగా చదవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. చదివేటప్పుడే అర్థం కాని పదాలుంటే డిక్షనరీ ద్వారా అర్థం తెలుసుకోవాలి. ఈ అర్థాలను ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటూ పునశ్చరణ చేయటం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. గత పరీక్షను పరిశీలిస్తే..

* నేరుగా పదాలకు వ్యతిరేక, సమానార్థాలు అడగకుండా ఒక వాక్యంలో ఏదో ఒక పదం ఎంచుకొని పరిశీలించడం జరిగింది. పైన పేర్కొన్న మెలకువ దీనికి కూడా ఉపయోగపడుతుంది.

* గ్రామర్‌ అంశాలపై ఆధారపడిన ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. అందువల్ల పరీక్ష వరకు రోజుకో అంశానికి 1 గంట సమయం కేటాయించి సాధన చేయడం అవసరం.

* పెడగాజి కింద ఇచ్చిన 6 ప్రశ్నలు సాధారణ స్థాయివే. అభ్యర్థి తాను టీచర్‌ అయితే బోధన చేయడానికి ఎలాంటి మెలకువలు పాటించాలి అని ఆలోచిస్తూ అధ్యయనం చేస్తే చాలు. కొద్దిపాటి శ్రమతో ఈ విభాగం నుంచి 4-5 మార్కులు సులభంగా సాధించవచ్చని మరవద్దు. 10 గంటల సమయం కేటాయిస్తే ఈ విభాగంపై పట్టు కచ్చితంగా ఏర్పడుతుంది.

టెట్‌ పేపర్‌ 1 రాసినా, పేపర్‌ 2 రాసినా, ఈ విభాగాల ప్రిపరేషన్‌ని ఇదే శైలిలో అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

 ఈ 17 రోజుల్లో చేయాల్సినవి...
* ప్రతి విభాగంపై స్థూల అవగాహనని పెంచుకునే దిశలో చదవాలి.
* కీలక పాఠ్యాంశాలకే పరిమితం అవ్వండి.
* కీలక పాఠ్యాంశాలపై పట్టు ఉంటే మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి.
* 14, 15 తేదీలలో ఒకట్రెండు నమూనా పరీక్షలు రాయండి. మార్కులు బేరీజు వేసుకొని, లోపాల పరిష్కారం కోసం మిగతా 15 రోజుల్ని కేటాయించండి.
* 'చదివింది బాగుంది' అని స్వీయ ప్రేరణ పొందుతూ అసంతృప్తిని దూరం చేయండి.
* పరీక్షకు వారం ముందు ఎలాంటి నమూనా పరీక్షలు రాయవద్దు.

* 'ఇవి తరువాత చదువుదాం' అనే వాయిదాలు వద్దు. ఇదే ఆఖరి రివిజన్‌ అనుకుంటూ ఒక్కో అంశం ముగించేయండి.
* కీలక అంశాలు కాకపోతే కొత్త పాఠ్యాంశాలు చదవడం ఈ దశలో వద్దు.
* ఇతరులతో పోల్చుకుంటూ ఒత్తిడికి లోనై, జ్ఞాపకశక్తికి ఇబ్బందులు కలగజేయవద్దు.

* మార్కెట్లో దొరికే అనేక పుస్తకాలలో విస్తృత సమాచారం ఉంది. ఆ సమాచారం చూసి 'ఇది చదవలేదు, అది చదవలేదు' అని టెన్షన్‌కు గురికావద్దు. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమి పుస్తకాలకే ప్రస్తుతం పరిమితం అవ్వండి.

* ఇంపార్టెంట్‌ బిట్స్‌ అంటూ వాటిని చదవద్దు. బిట్‌బ్యాంక్‌ లాంటివి పునశ్చరణకు ఉపయోగించాలే కాని వాటిని ప్రధానంగా చదవద్దు.

పూర్తి కథనం కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.

No comments:

Post a Comment