ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label జూనియర్ లెక్చరర్స్. Show all posts
Showing posts with label జూనియర్ లెక్చరర్స్. Show all posts

Saturday, 19 November 2011

జూనియర్ లెక్చరర్స్ పరీక్షలో తెలుగు!


జూనియర్‌ లెక్చరర్స్‌ ఉద్యోగ నియామకాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. డిసెంబరు 3న పరీక్షలు జరుగనున్నాయి.

తెలుగు అధ్యాపకుల పోస్టుల కోసం రాతపరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సూచనలూ, సలహాలూ ఇస్తున్నారు... పోటీపరీక్షల నిపుణులు డా. ద్వా.నా. శాస్త్రి


ఇప్పటివరకూ సాహిత్యం, వ్యాకరణం, కావ్య విమర్శ, భాషాశాస్త్రం, సంస్కృతం అంశాలకు సంబంధించి జేఎల్‌ అభ్యర్థులుగా బాగా చదివివుంటారు. శిక్షణ తీసుకున్నా తీసుకోకపోయినా కృషిచేసివుంటారు.

ఇప్పుడు గ్రహించవలసినవి:
* కొత్తపుస్తకాలు, మరొక 'మెటీరియల్‌' కోసం ఆరాటపడటంగానీ, చదవటం కానీ సమంజసం కాదు.
* చదివినవి పునశ్చరణ చేసుకోవాలి.
* పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. అయితే వాటిలో తెలియనివి ఉంటే గాభరా పడకూడదు.
* వీలైతే ఓ ఇద్దరు కలిసి అధ్యాయాలవారీగా ప్రశ్నలు వేసుకుని సిద్ధం కావటం మంచిది.
* ఆత్మవిశ్వాసాన్ని అలవరుచుకోవాలి.

పరీక్షలో సాహిత్యానిదే సింహభాగం అని మర్చిపోవద్దు. ప్రతి అంశం నుంచీ ప్రశ్నలుంటాయి కాబట్టి దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. అయితే కొన్ని ముఖ్యమైన అంశాలపై మరింత శ్రద్ధ వహించాలి.
* ప్రబంధం
* శతకం
* ఆధునిక ఉద్యమ కవిత్వాలు ఇవి చాలా ముఖ్యం.

వచన ప్రక్రియలలో కథ, నవల చాలా ముఖ్యం. వీటికి సంబంధించిన విషయాలను పదేపదే అధ్యయనం చేయాలి. ప్రాచీన కవిత్వం నుంచి, ఆధునిక కవిత్వం నుంచి 'కొటేషన్లు' వస్తాయి.

* 'ఆంధ్రావళి మోదముంబొరయ..' రాస్తానన్నదెవరు? * 'సత్కవుల్‌ హాలికులైననేమి' అన్నదెవరు?* 'నా కవిత్వంబు నిజము కర్ణాట భాష' అని చాటినదెవరు?* 'ఏ గతి రచించిరేని సమకాలపువారలు మెచ్చరే గదా?' అన్న కవి?* 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని పలికిన కవి?
* 'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు' అన్న కవి?

(సమాధానాలు: తిక్కన, పోతన, శ్రీనాథుడు, చేమకూర వేంకటకవి, దాశరథి, తిలక్‌)

సాహిత్యం తర్వాత కావ్య విమర్శ, వ్యాకరణాలు కీలకమైనవి. వీటి నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కావ్య నిర్వచనాలు, కావ్యాత్మ, రసం, ధ్వని వంటి అంశాలే కాకుండా అలంకార శాస్త్ర గ్రంథాలూ, వాటి రచయితల పేర్లూ గుర్తుంచుకోవాలి.

వ్యాకరణపరంగా...
వ్యాకరణంలో ముఖ్యంగా బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణాల తులనాత్మక పరిశీలన ప్రధానం. సూరి చెప్పనివీ, బహుజనపల్లి చెప్పినవీ, ఇద్దరూ విభేదించినవీ గుర్తుంచుకోవాలి. ద్రుతము, అవ్యయము, డుమంతము, క్త్వార్థము, స్త్రీ సమము, జ్నిత్తు, నిపాత వంటి పారిభాషక పదాలను మళ్ళీ మళ్ళీ చదవాలి. కవ్వడి, కెందోయి, చిట్టెలుక, ఎయ్యది వంటి సంధి రూపాల నిష్పత్తి, సమాస కారకాలపై దృష్టి సారించాలి.
'రసం' అధ్యాయంలో రస భేదాలు, రసాల స్థాయీ భావాలు, అనుభావాలు, సంచారీ భావాలు కూడా గుర్తుంచుకోవాలి.

భాషాశాస్త్రం
భాషా శాస్త్రానికి మూడో ప్రాధాన్యం ఇవ్వాలి. ద్రావిడ భాషలు, మాండలికాలు, అర్థ విపరిణామం, అన్య భాషాపదాలు అనేవాటికి ప్రాధాన్యం అవసరం. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. సంస్కృతం గురించి ఎక్కువమందికి ఆందోళన ఉంటుంది. ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆరేడు ప్రశ్నల కంటే దీన్నుంచి వచ్చే వీలు లేదు. వీటిల్లో నాలుగైదు కవులు- కావ్యాల గురించి ఉంటాయి. కాబట్టి సంస్కృతం పట్ల దిగులు చెందకుండా మిగిలిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తే ఇందులో ఒకవేళ సమాధానాలు గుర్తించకపోయినా వాటిని సాహిత్యంలో గుర్తించవచ్చు.
1) గ్రంథ రచయితలు- గ్రంథాల మారుపేర్లు (ఉదా: ఉన్నవ లక్ష్మీనారాయణ- మాలపల్లి- సంగ విజయం)
2) తొలి రచనలు (తొలి దండకం- భోగినీ దండకం ; తొలి నాటకం- మంజరీమధకరీయం)
3) విమర్శలు (భావ కవిత్వంపై విమర్శ గ్రంథం- నేటికాలపు కవిత్వం; విమర్శకాగ్రేసర బిరుదు గలవారు కాశీభట్ట బ్రహ్మయశాస్త్రి) ఇలాంటివాటిని పునశ్చరణ చేయాలి.

ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో...
జేఎల్‌ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో సమాధానాలు గుర్తించాలి కాబట్టి ఈ సందర్భంగా కొన్ని అంశాలను గుర్తించాలి.

* ప్రశ్నపత్రం చదువుతూనే తెలిసినవాటికి సమాధానం గుర్తిస్తూ సాగాలి. తెలియనివాటికోసం మళ్ళీ మొదటికి రావాలి.
* సమాధానం తెలియనపుడు ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకూడదు.తర్వాతి ప్రశ్నకి వెళ్ళాలి.
* ప్రశ్నను పూర్తిగా చదవాలి.
ఉదా: 'కిందివానిలో శ్రీనాథుని రచన కానిదేది?' అని ఇస్తే గతంలో కొందరు అభ్యర్థులు శ్రీనాథుని రచనను గుర్తించారు.

ఇలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తే విజయం తథ్యం!

Tuesday, 8 November 2011

డీఎల్‌ బాటలోనే జేఎల్‌!


జె.ఎల్‌. పరీక్ష అభ్యర్థుల్లో చాలామంది ప్రైవేటు కళాశాలల్లో తమ సబ్జెక్టును ఇంటర్‌, డిగ్రీ స్థాయుల్లో బోధిస్తూనే ఉన్నారు కాబట్టి వారి సబ్జెక్టుపరంగా వారికి ఇబ్బంది ఉండదు. కానీ సమస్య అంతా జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌) పేపర్‌తోనే. దీన్లోని సబ్జెక్టులన్నీ వారికి కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా జె.ఎల్‌. సైన్సు, మ్యాథ్స్‌ అభ్యర్థులతో పాటు తెలుగు, ఇంగ్లిషు సాహిత్య అభ్యర్థులకు కూడా ఈ జీఎస్‌ కష్టమనిపిస్తూ ఉంటుంది. సబ్జెక్టు పేపర్‌కి 300 మార్కులు ఉన్నప్పటికీ జీఎస్‌కు కేటాయించిన 150 మార్కులే అంతిమంగా విజయాన్ని నిర్ణయించేవి!

ప్రైవేటు కళాశాలల్లో పనిచేసే అభ్యర్థులంతా సాధ్యమైనంతవరకు ఎక్కువ రోజులు సెలవుపెట్టి చదివితే బాగుంటుంది. పరీక్ష తేదీకి ముందు కనీసం 15 రోజులైనా సెలవు తీసుకుని ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాలి. లేకుంటే పునశ్చరణకు సమయం చాలక ఒత్తిడికి గురవ్వాల్సివస్తుంది. అందుకే గంటల వారీగా ప్రణాళిక రూపొందించుకుని సన్నద్ధం కావాలి.

గత ప్రశ్నపత్రాల ప్రాతిపదికేనా?
ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జీఎస్‌ సిలబస్‌ ఇంచుమించు ఒకే రకంగా ఉండటంతో గత ప్రశ్నపత్రాలను అంశాల వారీగా అధ్యయనం చేయాలి. ఫలితంగా సగానికంటే ఎక్కువ ప్రశ్నలను సులువుగా పూర్తిచేయగలుగుతారు. ఇటీవల జరిగిన D.A.O's,డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌, లైబ్రేరియన్స్‌, A.E.Es, A.S.Os, గ్రూప్‌-2 మొదలైన పరీక్షల్లోని జీఎస్‌ పేపర్ల ప్రశ్నల సరళిని పరిశీలించి, దానికనుగుణంగా ఈ 25 రోజులలో సిద్ధమవ్వాలి.

డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌ పరీక్షలో చాలావరకు ప్రశ్నలు సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష ప్రశ్నలను పోలివున్నాయి. అంతేకాక ఇటీవలి ఏపీపీఎస్సీ పరీక్షలన్నింటిలోనూ వర్తమాన విషయాల ప్రశ్నలు 2008 నుంచి 2010 వరకు జరిగిన సంఘటనల నుంచి ఎక్కువగా వచ్చాయి. జె.ఎల్‌. పరీక్ష సన్నద్ధత సమయంలో ఇది విస్మరించకూడదు.

ప్రస్తుతం మిగిలిన కాలం 25 రోజులు. రోజుకు 12 గంటల చొప్పున చదివితే 300 గంటల సమయం అందుబాటులో ఉంది. దీనిలో సగం కాలం సబ్జెక్టుకి కేటాయిస్తే, మిగిలిన సమయం 150 గంటలు. జీఎస్‌లో మొత్తం అంశాలు ఆరు. ఒక్కొక్క అంశానికి 25 గంటలు వెచ్చించవచ్చు. కాబట్టి ప్రతిరోజూ అన్ని అంశాలను పునశ్చరణ చేసుకునే బదులు ముందుగా ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులు సమగ్రంగా చదవాలి. భారతదేశ చరిత్ర, భూగోళ శాస్త్రం, భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థిక వ్యవస్థలను ఇలా చదివితే వాటి నుంచి దాదాపు 75-85 ప్రశ్నలు వస్తాయి. అయితే సబ్జెక్టు క్లిష్టత, అందులోని మార్కుల ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకొని సమయపాలన చేసుకోవలసి ఉంటుంది. మధ్యమధ్యలో మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలను అభ్యాసం చేస్తే కాస్త రిలీఫ్‌గా కూడా ఉంటుంది.
భారతదేశ చరిత్రతో పాటు ఆంధ్రుల చరిత్ర
మొదట సింధులోయ నాగరికత నుంచి భారత స్వాతంత్య్రం వరకు అంటే 1947 వరకు స్థూలంగా చదవాలి. ఆపై రాజకీయ చరిత్రలో గొప్ప రాజులు, రాజ్య విస్తరణలో వారు చేసిన కీలక యుద్ధాలు; నాటి సామాజిక పరిస్థితులలో మతపరమైన అంశాలు; సాహిత్యం, పేరెన్నికగన్న గ్రంథాలు, గ్రంథకర్తలు; కళలకు సంబంధించిన వాస్తు శిల్పం, ప్రముఖ కట్టడాల గురించి లోతుగా చదవాలి. రాజకీయంగా నాటి పరిపాలనా విధానం మొదలైన అంశాలపై పరీక్షలో రాదగిన ముఖ్య ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి పునశ్చరణ చేయండి.

ఆధునిక భారత చరిత్రలో గవర్నర్‌ జనరల్స్‌, వారి పరిపాలనా విధానం, సంస్కరణలు.. ముఖ్యంగా భారత స్వాతంత్రోద్యమ సంఘటనలను అనగా 1857 నుంచి 1947 వరకు సమగ్రంగా చదవాలి. చరిత్ర మొత్తం ప్రశ్నలలో ఎక్కువ భాగం ఆ కాలం నుంచే వస్తాయని గుర్తుంచుకోవాలి. ఇక ఆంధ్రుల చరిత్ర నుంచి కూడా ఏడెనిమిది ప్రశ్నల వరకు ఉంటాయి. శాతవాహనుల నుంచి మొదలుకొని నేటివరకు చరిత్ర సంస్కృతులను ప్రస్తుత కాలానికి అన్వయించుకుని చదవాలి.

భూగోళ శాస్త్ర, మారిన ప్రశ్నల సరళి
ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలన్నింటిలో ప్రపంచ భూగోళ శాస్త్రం నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రపంచ పటాన్ని ముందుంచుకొని ఖండాల వారీగా వాటి ఉనికిని పరిశీలిస్తూ ఆయా దేశాల ఎల్లలను, నైసర్గిక స్వరూపాలను, ఖండాలు దేశాల మధ్య విస్తరించి ఉన్న మహా సముద్రాలను, సముద్రాలను, అగాథాలను, కాలువలను పరిశీలించండి. పాఠ్య పుస్తకాలలో చదివినదానికంటే మ్యాప్‌ రీడింగ్‌ చేయడంతో చాలా ప్రభావవంతంగా మనసుకు హత్తుకునేలా అధ్యయనం చేయవచ్చు.

ఆ తరవాత ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి వివిధ భౌగోళికాంశాలను ముఖ్యంగా ఇటీవల వార్తలలోకి ఎక్కిన విషయాలను దృష్టిలో పెట్టుకొని చదవాలి. భారతదేశ భౌగోళికాంశాలలో కూడా వివిధ సహజ వనరులు, వాటి విస్తరణ, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి అవసరం. ఇక కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాల నుంచి కూడా వస్తాయని గమనించండి. భారతదేశ భౌగోళికాంశాలను చదివేటప్పుడు వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ అంశాలను కూడా ఏక కాలంలో చిత్రపటాలను ముందు పెట్టుకొని అధ్యయనం చేయవలసి ఉంటుంది.

పాలిటీలో ఏం అడుగుతారు?
భారతదేశ రాజకీయ వ్యవస్థకూ, రాజ్యాంగానికీ సంబంధించి నిర్మాణాత్మక విషయాలు, ఇటీవల జరిగిన పరిణామాలపై దృష్టి సారించాలి. ఉదాహరణకు కొత్త రాష్ట్రాల ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు మొదలైన వాటిలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నలు ఉండే అవకాశాలుంటాయి. ఇక పాలిటీలో ఇటీవల మారిన ప్రశ్నల ధోరణి ఎక్కువగా ముఖ్యమైన ప్రకరణాలపై ఉంటుంది. కాబట్టి ఈ దిశలో కొన్ని ముఖ్యమైన ప్రకరణాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా చదివితే ఎక్కువ ప్రయోజనకరం.

ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ప్రశ్నలేమిటి?
భారత ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ప్రశ్నలు ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలపై ఉంటాయి. 2011-2012 వార్షిక బడ్జెట్‌, 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు- మధ్యంతర సమీక్షకు చెందిన ప్రశ్నలుంటాయని గమనించండి. ఇక ఎప్పటికప్పుడు ప్రకటించే ద్రవ్య విధానంలోని అంశాలూ ముఖ్యమే. స్థూలంగా భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికలన్నింటినీ, ప్రత్యేకించి 11వ పంచవర్ష ప్రణాళికను అధ్యయనం చేయవలసి ఉంటుంది. దీనికి తాజా ఆర్థిక సర్వేల అధ్యయనం అవసరం.

జనరల్‌ సైన్స్‌లో ప్రశ్నలిలా
జనరల్‌ సైన్స్‌లో ఎక్కువ ప్రశ్నలు వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి, నిత్య జీవితంలో వాటి వినియోగంపై ఉంటాయి. ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందిన అంతరిక్ష పరిశోధనా, కంప్యూటర్‌ పరిజ్ఞానం సమాచార విప్లవంపై ఉంటాయి. అయితే వీటిని చదివేముందు సైన్స్‌లో అన్ని విషయాల్లోని మౌలిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఈ మధ్య వార్తల్లోకెక్కిన వ్యాధులు, వ్యాధి కారకాలు, వ్యాధి నిర్థారణ పరీక్షలు మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. రసాయన శాస్త్రంలో విధిగా కొన్ని ప్రశ్నలు రసాయన నామాలు, వాటి సాధారణ నామాలపై ఉంటాయి. మరికొన్ని ప్రశ్నలు భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలపై, భారతదేశ ప్రముఖ శాస్త్రజ్ఞులపై ఉంటాయి.




- ఎ.ఎం. రెడ్డి