ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label పీజీ. Show all posts
Showing posts with label పీజీ. Show all posts

Thursday, 12 April 2012

పీజీలో ప్రవేశానికి ఇవీ పరీక్షలు

    రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌లు వెలువడ్డాయి.

మొత్తం 25 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యూనివర్సిటీలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్‌)ల ద్వారా పీజీ, పరిశోధన కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర, ఓయూ, ఏయూ, కాకతీయ యూనివర్సిటీలు తమ పరిధిలోని ఇతర యూనివర్సిటీలకు కూడా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. క్యాంపస్‌ కాలేజీలతోపాటు వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో సీట్లను కూడా ఈ ఎంట్రన్స్‌ల ఆధారంగా భర్తీ చేస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీ గతవారం పీజీసెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ప్రకటనలు విడుదల చేసినట్లయింది. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, నాగార్జున, కృష్ణా, ఉస్మానియా, నన్నయ యూనివర్సిటీలు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 26న ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే ఆసెట్‌ పరీక్ష జరగనుంది. అప్పటి నుంచి జూన్‌ చివరి వరకు వివిధ యూనివర్సిటీలు పీజీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నాయి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకడమిక్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే పీజీ ఎంట్రన్స్‌లకు సిద్ధం కావాలి.

బేసిక్‌ సైన్సెస్‌, ఆధునిక బయాలజీ, లాంగ్వేజెస్‌ (ముఖ్యంగా ఇంగ్లిష్‌) కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటోంది. బేసిక్‌ సైన్సెస్‌లో కెమిస్ట్రీ, మేథ్స్‌, ఫిజిక్స్‌; ఆధునిక బయాలజీలో బయో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, నానో టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, తదితర సబ్జెక్టులకు ఆదరణ ఎక్కువగా ఉంది. మిగతావాటితో పోల్చుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ సైన్సెస్‌లో చాలా స్పెషలైజేషన్లు అందిస్తోంది.
 


క్యాంపస్‌ కాలేజీల్లో...
రాష్ట్ర యూనివర్సిటీల్లో ఎంఏ, ఎం.ఎస్‌సి., ఎం.కాం, ఎంసీఏ, ఎంబీఏ, ఇంటెగ్రేటెడ్‌ పీజీ కోర్సులతోపాటు ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ పరిశోధన కోర్సులు ఉన్నాయి. పీజీసెట్‌ల ద్వారా ఎం.ఎ., ఎం.ఎస్‌సి., ఎం.కాం., ఇంటెగ్రేటెడ్‌ పీజీ, తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మిగతా కోర్సులకు విడిగా ప్రవేశ పరీక్షలు ఉంటాయి. సైన్సెస్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ సబ్జెక్టుల్లో పీజీ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. మంచి మౌలిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ అందుబాటులో ఉండే యూనివర్సిటీ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో సీట్లు సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకోవాల్సిందే. క్యాంపస్‌ కాలేజీల్లో మంచి లైబ్రరీలు, ఇంటర్నెట్‌ సౌకర్యం, ఇంకా ఉన్నత కోర్సులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అవసరమైన పుస్తకాలు, గైడెన్స్‌ అందుబాటులో ఉంటాయి.

* పీజీ ఎంట్రన్స్‌లలో విజయం సాధించాలంటే అభ్యర్థులకు సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన తప్పనిసరి. తాము ఎంచుకున్న సబ్జెక్టులో ఇంటర్మీడియట్‌ స్థాయిలోని అంశాల నుంచి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.

* తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. తద్వారా సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. వీటిని అప్పుడప్పుడు పునశ్చరణ చేస్తుండాలి. వివిధ అంశాలను అన్వయించడం నేర్చుకోవాలి. డిగ్రీ చదివేటప్పుడే పీజీ ఎంట్రన్స్‌లపై అవగాహన పెంచుకుంటే లక్ష్యసాధన సులువవుతుంది.

ప్రవేశ పరీక్షల తీరు...
దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎం.ఎస్‌సి. ప్రవేశ పరీక్షలను ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నాయి. యూనివర్సిటీ లైబ్రరీల్లో ప్రవేశ పరీక్షల గత ప్రశ్నపత్రాలు లభించవచ్చు. నగరాల్లోని ప్రముఖ బుక్‌షాప్‌లలో కూడా ప్రయత్నించవచ్చు. ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లకు సిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా ప్రశ్నపత్రాల స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకోవాలి. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు సాధారణంగా ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఇంగ్లిష్‌లో ఉండే నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం సాధారణంగా తెలుగులో కూడా ఇస్తారు.

* ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సులకు కలిపి ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. దీనిలో కెమిస్ట్రీ పేపర్‌ అందరికీ కామన్‌గా ఉంటుంది. బీఎస్సీలో చదివిన ఏదైనా ఒక బయాలజీ ఆప్షనల్‌ను అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. బయాలజీ విద్యార్థులు తాము ఎంచుకున్న స్పెషలైజేషన్‌, కెమిస్ట్రీలో మంచి మార్కులు తెచ్చుకుంటే సీటు సాధించవచ్చు. కామన్‌ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తే తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌లో ఎం.ఎస్‌సి. చేయవచ్చు.

* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఎంట్రన్స్‌ పరీక్షల్లో బయాలజీ సబ్జెక్టుకు వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఏయూ ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లలో నెగటివ్‌ మార్కులు ఉంటాయి. అందువల్ల కచ్చితమైన సమాధానం తెలిస్తేనే జవాబు గుర్తించడం మంచిది.

* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే మైక్రోబయాలజీ, కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌లలో సాధారణంగా కెమిస్ట్రీ ప్రశ్నలు అడగరు.

* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ ఎంట్రన్స్‌ రాయబోతున్న విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే... గత ఏడాది నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ 4వ పేపర్‌ సిలబస్‌ను ఎంట్రన్స్‌ పరీక్షల సిలబస్‌కు కొత్తగా చేర్చారు. దీనిలో మెటీరియల్‌ సైన్స్‌, గ్రీన్‌ కెమిస్ట్రీ, మాలెక్యులార్‌ స్పెక్ట్రోస్కోపి, పెరిసైక్లిక్‌ చర్యలు, డ్రగ్స్‌, పెస్టిసైడ్స్‌, సపరేషన్‌ టెక్నిక్స్‌, తదితర అంశాలు ఉంటాయి.

* ఎస్వీయూ, ఎస్కేయూ, యోగి వేమన, పద్మావతి, రాయలసీమ, విక్రమ సింహపురి, ద్రవిడియన్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎస్వీయూఆర్‌పీజీసెట్‌ బాధ్యతను ఈ ఏడాది శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ తీసుకుంది.

యూనివర్సిటీల పరిధిలో వివిధ సబ్జెక్టులకు ఉన్న పోటీని బట్టి చూస్తే, కనీసం 60 నుంచి 70 శాతం మార్కులు సాధించిన వారికి ఆయా కోర్సుల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుంది. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రోజూ కనీసం 6-7 గంటలు శ్రమించడం తప్పనిసరి. యూనివర్సిటీల్లో స్థానిక విద్యార్థులకు 85 శాతం, నాన్‌ లోకల్‌ విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు తమ లోకల్‌ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తే సీటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించే పీజీ కోర్సుల్లో అన్ని ప్రాంతాల విద్యార్థినులు ప్రవేశం పొందవచ్చు. యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి నిర్దిష్ట నిష్పత్తిలో అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

హెచ్‌సీయూ, ఇఫ్లూలలో పీజీ
రాష్ట్రంలోని ప్రముఖ సెంట్రల్‌ యూనివర్సిటీలు... యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ), ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) కూడా పీజీ నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. ఇవి రెండూ జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థలుగా పేరుపొందాయి. హెచ్‌సీయూలో సైన్సెస్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, మేథ్స్‌, ఏనిమల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, తదితర పీజీ కోర్సులున్నాయి. కొన్ని కోర్సులకు రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ప్రవేశం లభించిన విద్యార్థులు అందరికీ ఫెలోషిప్‌ లభిస్తుంది. ఇఫ్లూలో ఇంగ్లిష్‌, ఇతర విదేశీ భాషల్లో పీజీ చేయవచ్చు. ఆయా సంస్థల్లో ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ల ద్వారానే భర్తీ చేస్తారు.

 - ఎస్. కిరణ్ కుమార్

Saturday, 24 December 2011

ఐఐటీ మద్రాస్‌లో ఎం.ఎ.


ఇంజినీరింగ్‌కు ప్రసిద్ధిచెందిన ఐఐటీ మద్రాస్‌, అదే స్థాయి నాణ్యతతో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌లో ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను నిర్వహిస్తోంది.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి 'హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌' (హెచ్‌ఎస్‌ఈఈ 2012) పేరుతో జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది.

ఇంటర్‌ డిసిప్లీనరీ స్వభావం గల ఈ కోర్సుల ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

కోర్సుల వివరాలు...

*  ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎ. (ఇంగ్లిష్‌ స్టడీస్‌)
*  ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎ. (డెవలప్‌మెంట్‌ స్టడీస్‌)

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కోర్సులను ఐఐటీ మద్రాస్‌ రూపొందించింది. రెండు ప్రోగ్రామ్‌లలో ఎకాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, స్టాటిస్టిక్స్‌, మేథమేటిక్స్‌, ఐటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో బేసిక్‌ కోర్సులు ఉంటాయి. ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషలను అధ్యయనం చేస్తారు. మొదటి రెండేళ్లు రెండు ప్రోగ్రామ్‌ల అభ్యర్థులకు ఒకే సబ్జెక్టులు ఉంటాయి. మూడో ఏడాది నుంచి ఎంచుకున్న స్పెషలైజేషన్‌ల వారీగా అభ్యర్థులను విభజిస్తారు.
ఇవి రెండూ ఐదేళ్ల కోర్సులు.

ఒక్కో కోర్సులో 23 సీట్లు చొప్పున మొత్తం 46 సీట్లు ఉంటాయి. ట్యూషన్‌ ఫీజు సెమిస్టర్‌కు రూ.4500. హాస్టల్‌, ఇతర ఫీజులు సెమిస్టర్‌కు 15-16 వేల రూపాయల వరకు ఉంటాయి.

కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు విద్యారంగం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని కంపెనీలు, పరిశోధన సంస్థలు, ఎన్‌జీఓలు, ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి.

పరీక్ష పద్ధతి
పరీక్ష వ్యవధి 3 గంటలు. పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్‌-1 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పరీక్ష. దీని వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ (స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థ, భారతీయ సమాజం, రెండో ప్రపంచ యుద్ధానంతరం సమకాలీన ప్రపంచ వ్యవహారాలు), ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్‌, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీకి ఒక్కోదానికి 25 శాతం మార్కులు, జనరల్‌ స్టడీస్‌కు 50 శాతం మార్కులు కేటాయించారు.

* ఇంగ్లిష్‌లో రీడింగ్‌ స్కిల్స్‌, గ్రామర్‌, వొకాబ్యులరీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
* ఎనలిటికల్‌ ఎబిలిటీలో నంబర్స్‌, ఆల్జీబ్రా, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం, బేసిక్‌ స్టాటిస్టిక్స్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, బ్రెయిన్‌టీజర్స్‌, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
* పార్ట్‌-2లో వ్యాస రచన ఉంటుంది. దీని వ్యవధి అరగంట. ఇందులో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన అంశాలపై వ్యాసం రాయాలి.

దరఖాస్తు విధానం
హెచ్‌ఎస్‌ఈఈ రాయడానికి ఇంటర్మీడియట్‌ / 10+2 ప్రధాన అర్హత. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు అవసరం. చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అడ్మిషన్‌ సమయంలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఐఐటీ మద్రాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ప్రక్రియ 20 డిసెంబరు 2011 నుంచి ప్రారంభమవుతుంది. పరీక్ష మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: 20 జనవరి 2012
* దరఖాస్తు ప్రింట్లు చేరడానికి చివరితేదీ: 31 జనవరి 2012
* హెచ్‌ఎస్‌ఈఈ 2012 తేదీ: 6 మే 2012
* ఫలితాల విడుదల: 4 జూన్‌ 2012.
   

Saturday, 8 October 2011

‘టిస్’ లో పీజీ కోర్సులు

నదేశంలో సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యం ఇస్తోన్న అతికొద్ది కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ప్రముఖమైనది... టాటా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌).

సామాజిక రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టిస్‌ అత్యుత్తమ ప్రమాణాలతో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులను అందిస్తోంది. సోషల్‌ వర్క్‌, ఎడ్యుకేషన్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సమాన ప్రాధాన్యం ఇస్తోంది.

2012-14 సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి టిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

టిస్‌ అందిస్తోన్న కోర్సులు చేసినవారికి సామాజిక సేవా సంస్థలు, కంపెనీల సీఎస్‌ఆర్‌ విభాగాలు, స్వచ్చంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

సామాజిక రంగానికి అవసరమైన సమగ్ర కోర్సుల రూపకల్పన, శిక్షణలో టిస్‌ దేశంలోనే అగ్రశ్రేణి సంస్థ. అనేక పీజీ కోర్సులకు ప్రవేశాల సమయంలో అర్హతల కంటే అభ్యర్థుల ఆసక్తికి టిస్‌ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అందించే కోర్సులు మినహాయిస్తే, మిగిలిన కోర్సులకు గ్రాడ్యుయేట్లందరూ అర్హులు.

టిస్‌ అందిస్తోన్న పీజీ కోర్సులు...
* ఎం.ఎ.:  సోషల్‌ వర్క్‌/ సోషల్‌ వర్క్‌ ఇన్‌ డిసెబిలిటీ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌/ చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీస్‌/ క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌/ గ్లోబలైజేషన్‌ అండ్‌ లేబర్‌/ హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్‌/ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌/ కౌన్సెలింగ్‌/ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌/ ఎడ్యుకేషన్‌ (ఎలిమెంటరీ)/ విమెన్స్‌ స్టడీస్‌/ మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌/ సోషల్‌ వర్క్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌/ దళిత్‌ అండ్‌ ట్రైబల్‌ స్టడీస్‌/ మెంటల్‌ హెల్త్‌/ పబ్లిక్‌ హెల్త్‌ మొదలైనవి.

* మాస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌
* మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌
* మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌ హెల్త్‌ పాలసీ, ఎకనమిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌
* మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌ సోషల్‌ ఎపిడెమియాలజీ
* ఎం.ఎ./ ఎం.ఎస్‌సి.: డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌

ఎంపిక విధానం
వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి టిస్‌ నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టిస్‌ నెట్‌)ను నిర్వహిస్తోంది. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి పాటించే వడపోత విధానాన్ని టిస్‌ సామాజిక శాస్త్రాలకు అనుసరిస్తోంది. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో రెండు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో జనరల్‌ అవేర్‌నెస్‌, ఎనలిటికల్‌/ లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. రెండో విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెకుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రోగ్రామ్‌ను బట్టి ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 170 మార్కులకు ఎంపిక పరీక్షలు ఉంటాయి. ఇంటర్వ్యూకు 70 మార్కులు, గ్రూప్‌ డిస్కషన్‌కు 30, రాత పరీక్షకు 70 మార్కులు కేటాయిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌లు లేని ప్రోగ్రామ్‌లకు రాతపరీక్షకు 100 మార్కులు, ఇంటర్వ్యూకు 70 మార్కులు కేటాయిస్తారు.

* ఏదైనా గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం కోర్సు చదువుతున్న అభ్యర్థులు స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సులు తప్ప మిగతావాటికి అర్హులు.

*  అభ్యర్థులు గరిష్ఠంగా ఏవైనా మూడు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే రాతపరీక్ష కేంద్రం ఉంది.

*  అభ్యర్థులు టిస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: 29 అక్టోబరు 2011.

*  రాత పరీక్ష తేదీ: 4 డిసెంబరు 2011.

Tuesday, 27 September 2011

ఐఐటీలో పీజీ 'జామ్‌' జామ్ గా!

ఐటీ జామ్‌ 2012 పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది.

ఈసారి జామ్‌ పరీక్షలో గమనించాల్సిన మార్పు ఏమిటంటే... గతంలోకంటే మూణ్ణెల్లు ముందుగా పరీక్షను నిర్వహించనున్నారు.

ఏటా సాధారణంగా మే నెలలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 12, 2012న దేశవ్యాప్తంగా జామ్‌ జరగనుంది. దీనివల్ల డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయం లభిస్తుంది. మంచి ప్రణాళికతో, సమయపాలనతో చదివితేనే జామ్‌లో మంచి ర్యాంకు దక్కించుకోగలరు.

ఏటా ఏదో ఒక ఐఐటీ కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ బాంబే కెమిస్ట్రీలో ఎం.ఎస్సీ - పీహెచ్‌డీ డ్యుయల్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. నాలుగేళ్ల ఎం.ఎస్సీ ఫిజిక్స్‌ - ఎం.టెక్‌. మెటీరియల్‌ సైన్స్‌ (నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో) కోర్సును కూడా ఐఐటీ బాంబే ప్రవేశపెట్టింది. ఐఐటీ బాంబేతోపాటు ఢిల్లీ, హైదరాబాద్‌, గౌహతి, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, రూర్కీ ఐఐటీలు జామ్‌ ద్వారా ఎం.ఎస్‌సి., ఎం.ఎస్‌సి- పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ, ఇతర ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కల్పిస్తున్నాయి.


పరీక్ష ఎలా ఉంటుంది?
ఐఐటీ జామ్‌లో మొత్తం 8 పేపర్లుంటాయి. అవి... బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, మేథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌. వీటిలో ప్రతిభ ఆధారంగా మొత్తం 33 రకాల పీజీ, డ్యుయల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అభ్యర్థులు ప్రవేశం కోరుకుంటున్న కోర్సును బట్టి ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవాలి. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష వ్యవధి మూడు గంటలు. బయోటెక్నాలజీ, ఎంసీఏ కోర్సుల ప్రశ్నపత్రాలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ పేపర్‌లు ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఈ పేపర్లలో 30 శాతం ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, 70 శాతం సబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. తప్పు సమాధానాలకు (ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు) నెగటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. అందువల్ల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు కచ్చితంగా సరైన సమాధానం తెలిస్తేనే రాయడం మంచిది.

* బయోటెక్నాలజీ ఎంట్రెన్స్‌ పేపర్‌లో 44 శాతం ప్రశ్నలు బయాలజీ, 20 శాతం కెమిస్ట్రీ, 18 శాతం ఫిజిక్స్‌, 18 శాతం మేథమేటిక్స్‌ ప్రశ్నలుంటాయి. మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ కోర్సును బాంబే, రూర్కీలోని ఐఐటీలు మాత్రమే అందిస్తున్నాయి. అందువల్ల ఈ బయోటెక్నాలజీ సబ్జెక్టుకు పోటీ అధికంగా ఉంటుంది.

* ఇతర పేపర్లకు 30 శాతం మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. వీటికి ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. ఈ ప్రశ్నల మొత్తానికి 90 మార్కులు వెయిటేజ్‌ ఉంటుంది. మిగిలిన 70 శాతం ప్రశ్నలు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. వీటికి 210 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

ఏ ఐఐటీలో ఏ కోర్సు?
* ఐఐటీ బాంబే ఎనర్జీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

* ఐఐటీ ఖరగ్‌పూర్‌ కెమిస్ట్రీ, జియోఫిజిక్స్‌, జియోలాజికల్‌ సైన్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌లలో ఎం.ఎస్సీ, పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

* ఐఐటీ హైద్రాబాద్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో ఎం.ఎస్‌సి. కోర్సును నిర్వహిస్తోంది.

* ఎంసీఏ ప్రోగ్రామ్‌ను ఐఐటీ రూర్కీ మాత్రమే అందిస్తోంది.

* ఐఐటీ బాంబే గత ఏడాది నుంచి బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌లో ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది.

ఇతర ఐఐటీల్లో ప్రోగ్రామ్‌లు, వాటికి అవసరమైన అర్హతల వివరాలు జామ్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

ప్రాథమిక అంశాలపై పట్టు...
కోర్సులతోపాటు ప్రవేశ పరీక్షల్లో కూడా ఐఐటీలు ఉన్నత ప్రమాణాలు పాటిస్తాయి. జామ్‌ ప్రశ్నపత్రాలు విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్ధ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన అభ్యర్థులు జామ్‌లో విజయం సాధించడం తేలిక. అభ్యర్థులు ముందుగా 10+2 సిలబస్‌తో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రాథమిక భావనలపై అవగాహన కోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలుగు అకాడమీ పుస్తకాలను చదవచ్చు. తర్వాత బీఎస్సీ సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ ఎంట్రెన్స్‌లో ఎంబైపీసీ నేపధ్యం గల విద్యార్థులు ఎక్కువగా మంచి ర్యాంకులను సాధిస్తున్నారు. బయాలజీతోపాటు మేథ్స్‌ మీద కూడా వీరికి పట్టు ఉండటం దీనికి ప్రధాన కారణం. అందువల్ల బయాలజీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీతోపాటు మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులను కూడా బాగా నేర్చుకోవాలి. బీఎస్సీలో బీజడ్‌సీ చదివిన అభ్యర్థులు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ఒకవేళ డిగ్రీలో ఆధునిక బయాలజీ స్పెషలైజేషన్లు (బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ మొదలైనవి) తీసుకున్నట్లయితే, బోటనీ, జువాలజీ సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి.

* బయోటెక్నాలజీ పరీక్ష సిలబస్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ అభ్యర్థులు ఇతర పరీక్షలు రాసేవారికంటే అధికంగా సమయం కేటాయించాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు రోజూ కనీసం ఐదారు గంటలు తప్పనిసరిగా ఏకాగ్రతతో చదవాలి.

* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ రాసే విద్యార్థులు ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీతోపాటు మేథ్స్‌లో ఇచ్చిన సిలబస్‌ను కూడా అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. ఫిజిక్స్‌ పేపర్‌ రాసే అభ్యర్థులు ఫిజికల్‌ ఆప్టిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆసిలేషన్స్‌ అండ్‌ వేవ్స్‌, క్వాంటమ్‌ ఫిజిక్స్‌, స్పెక్ట్రోస్కోపీ, న్యూక్లియర్‌ అండ్‌ అటామిక్‌ ఫిజిక్స్‌, హీట్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌ సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. మేథమేటిక్స్‌ రాసే అభ్యర్థులు మేట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాలిక్యులేషన్స్‌, వెక్టార్‌, త్రికోణమితి, కోర్డానేట్‌ జామెట్రీ సబ్జెక్టులను బాగా సాధన చేయాలి. సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా చదవడం, అన్వయించడం చాలా ముఖ్యం.

ప్రణాళికతో ప్రారంభం...
జామ్‌ ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో ఐఐటీలు దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో అమల్లో ఉన్న సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల రాష్ట్రంలోని అభ్యర్థులు కేవలం డిగ్రీ కోర్సుల సిలబస్‌ మీదనే ఆధారపడితే సరిపోదు. జామ్‌ సిలబస్‌ను డిగ్రీ సిలబస్‌తో పోల్చి చూసుకోవాలి. డిగ్రీ సిలబస్‌లో లేని కొత్త అంశాలను వాటికి సంబంధించిన మెటీరియల్‌ను కూడా సేకరించి చదువుకోవాలి.

* దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ ఉంటే జామ్‌లో సులభంగా విజయం సాధించవచ్చు. డిగ్రీ మొదటి ఏడాది నుంచే ప్రాథమిక భావనలపై దృష్టిపెడుతూ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలి. మౌలిక భావనలను అర్థం చేసుకుంటూ దాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించుకోవడం అలవాటు చేసుకోవాలి.

* డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంటే, ముందుగా పరీక్ష స్వభావాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, సబ్జెక్టులో బలాబలాల ఆధారంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.

* డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు మార్చి- ఏప్రిల్‌లో బీఎస్సీ పరీక్షలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచీ జామ్‌ ప్రిపరేషన్‌కు కొంత సమయం కేటాయిస్తే మంచిది. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిమీద పట్టు సాధించాలి.


సాధన తప్పనిసరి...
జామ్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రంలోనే జవాబులు రాయడానికి కూడా నిర్దిష్ట స్థలం కేటాయిస్తారు. ఆ కేటాయించిన స్థలంలోనే జవాబును సమగ్రంగా రాయాలి. అందువల్ల మీరు నేర్చుకున్న అంశాలను సంగ్రహంగా నిర్దిష్ట స్థలంలో రాయడం సాధన చేయాలి. తక్కువ పాయింట్లతో ఎక్కువ సమాచారాన్ని పొందుపరచడం నేర్చుకోవాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివిన విద్యార్థులు అనేకమంది జామ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అందువల్ల మాధ్యమం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయడం, వ్యాసరూప ప్రశ్నలు రాయడం నేర్చుకుంటే సరిపోతుంది.

* ఎంత సమయం చదివారనే దానికంటే, సబ్జెక్టును ఇష్టపడి ఏకాగ్రతతో చదవడం ముఖ్యం. సానుకూల దృక్పథంతో శ్రమిస్తే తప్పనిసరిగా జామ్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చు.

ఈ మెలకువలను అందించిన రచయిత... ఎస్‌.కిరణ్‌కుమార్‌.

Friday, 16 September 2011

రెండేళ్ళలో ఎంటెక్, ఎంఎస్సీ!

ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు జేఎన్‌టీయూ కాకినాడ, బీటీహెచ్‌ (స్వీడన్‌) సంయుక్తంగా డబుల్‌ డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (సిగ్నల్‌ ప్రాసెసింగ్‌) కోర్సును అందిస్తున్నాయి.

దీని ద్వారా రెండేళ్లలో ఎం.టెక్‌., ఎం.ఎస్‌సి. డిగ్రీలు అందుకోవచ్చు.

వీటిలో...
 

* ఎంటెక్‌ డిగ్రీని జేఎన్‌టీయూ కాకినాడ,
* ఎం.ఎస్‌సి.ని బీటీహెచ్‌ ప్రదానం చేస్తాయి.


జేఎన్‌టీయూకే - బీటీహెచ్‌ అందిస్తోన్న ఈ కోర్సులో మొత్తం సీట్లు 10. విదేశాల్లో ఉన్నత విద్య, మంచి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కోర్సును రూపొందించారు.

కోర్సు వ్యవధి 4 సెమిస్టర్లు (24 నెలలు). అభ్యర్థులు బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ చదివుండాలి. ఈసీఈ, ఈఐఈ, ఏఎంఐఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌), ఏఎంఐఈటీ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలిమేటిక్స్‌ ఇంజినీరింగ్‌) బ్రాంచిలు చదివుండాలి.

* అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు అవసరం. కోర్సులో భాగంగా సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ పేపర్‌ చదివుండాలి.

 కోర్సు ఫీజు రూ.1,50,000.

*  అభ్యర్థులు మొదటి సెమిస్టర్‌ మాత్రమే జేఎన్‌టీయూలో చదవాల్సి ఉంటుంది. మిగిలిన మూడేళ్లు బీటీహెచ్‌, స్వీడన్‌లో చదవాలి. చివరి సెమిస్టర్‌లో థీసిస్‌ వర్క్‌ ఉంటుంది.

* దరఖాస్తులను జేఎన్‌టీయూ కాకినాడ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 17 సెప్టెంబరు 2011.

* కౌన్సెలింగ్‌ తేదీ: 19 సెప్టెంబరు 2011

Tuesday, 13 September 2011

ఖాళీగా ఉన్న ఎమ్మెస్సీ సీట్లు!

ప్రసిద్ధ విశ్వవిద్యాలయం జేఎన్‌టీయూ (హైదరాబాద్) కొన్ని పీజీ కోర్సులకు విద్యార్థులను వెతుక్కుంటోంది.

ఎమ్మెస్సీ కి సంబంధించిన  ఒక్కో కోర్సులో 25 సీట్లు ఉంటే అందులో సగం నిండటం కష్టమవుతోంది.

ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా ఫీజు కట్టి కోర్సులో చేరవచ్చని చెబుతున్నారు.

ఈ వివరాలన్నీ ఇవాళ ఈనాడు హైదరాబాద్ ఎడిషన్లో ప్రచురించిన ఈ కథనంలో చూడండి...