ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 28 February 2012

గ్రూప్ -2 ఇంటర్వ్యూ కిటుకులు



గ్రూప్‌-2 రాతపరీక్షలో మెరిసిన అభ్యర్థులు మరో అంచెను విజయవంతంగా దాటితే ఉద్యోగం సాధించినట్టే! కీలకమైన ఇంటర్వ్యూ దశలో ప్రతిభావంతంగా నెగ్గటానికి ఏయే అంశాలు గమనించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏపీపీఎస్సీ తన నిర్వహణ శైలిలో చేపట్టిన సంస్కరణలు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ ప్రక్రియ) లో కూడా ప్రతిఫలిస్తున్నాయి. పక్షపాత రహిత, వ్యక్తిత్వ పరిశీలన ప్రధాన లక్ష్యాలుగా ఇంటర్వ్యూ అసలైన స్ఫూర్తి ఇప్పుడు కన్పిస్తోందని చాలామంది అభ్యర్థుల భావన. ఇటీవల జరిగిన గ్రూప్‌-1, ఎ.ఎం.వి.ఐ. మొదలైన ఇంటర్వ్యూలన్నింటిలోనూ ప్రదర్శితమైన ఈ ధోరణిని బట్టి గ్రూప్‌-2 ఇంటర్వ్యూల సరళి కూడా అదే విధంగా ఉండవచ్చు.

A.నూతనత్వం ఏమిటి?
అభ్యర్థుల నుంచి పొందిన సమాచారం మేరకు... గతంలో అభ్యర్థికి సంబంధించిన మొత్తం సమాచారం (ప్రాంతం, కులం, మతం, చేస్తున్న ఉద్యోగం, విద్యార్హతలు మొదలైనవి) ముందుగానే బోర్డు సభ్యులకు చేరేవి. అందువల్ల ఆ బయోడేటా అంశాల ఆధారంగా ఇంటర్వ్యూ జరిగేది.

ఇప్పటి పద్ధతిలో అభ్యర్థి పేరు, చిరునామా, విద్యార్హత తప్ప మిగతా సమాచారం ఏదీ చేరడం లేదు. ఏపీపీఎస్సీ నిష్పాక్షికంగా వ్యవహరించేందుకు ఇలా చేస్తోందని తెలుస్తోంది.



B. ఎదుర్కోవడం ఎలా? గరిష్ఠ మార్కులు సాధ్యమేనా?
బయోడేటా బలంగా నిర్మించండి
బోర్డు వద్ద ఎలాంటి ముందస్తు సమాచారం ఉండటం లేదు కాబట్టి, తప్పనిసరిగా అభ్యర్థిని 'అడిగి' తెలుసుకున్న సమాచారం కీలకంగా మారింది. అందువల్ల 'మీ గురించి చెప్పండి?' అనే ప్రశ్న అనివార్యం.

ఈ ప్రశ్న అడిగినపుడు ఎలాంటివి ప్రస్తావించాలి? కుటుంబం గురించీ, విద్య, ప్రొఫెషనల్‌ కెరియర్‌ గురించీ ఏం చెప్పాలి... ఇలాంటివాటికి స్పష్టంగా సిద్ధమైతే మొదటి అంశం ముగిసినట్లే! మీ పైన మీకు స్పష్టత ఉందనే అభిప్రాయానికి బోర్డు వస్తే చాలు. నోకియా, ఫిన్‌లాండ్‌లో ఉన్నతోద్యోగిగా ఉంటూ నెలకు రెండున్నర లక్షల రూపాయలు సంపాదించే శిరీష డీఎస్పీగా ఎంపికవడంలో ఇలాంటి బయోడేటా నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. 'సినీ డైరెక్టర్‌' డీఎస్పీగా మార్పు చెందడం కూడా ఈ అవగాహనకి సంబంధించినదే.

సామాజిక పునాదుల 'బలం'
ఆప్షనల్‌ సబ్జెక్టు ఉన్న ఇంటర్వ్యూలు తప్ప మిగతా అన్నింట్లోనూ అభ్యర్థి లోతును పరిశీలిస్తారు. అందుకే సామాజిక పునాదులైన 'వర్ణ వ్యవస్థ', 'మను ధర్మశాస్త్రం' 'ఫండమెంటలిజం' మొదలైన అంశాలే ప్రశ్నలుగా దూసుకొస్తున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా గత నలభై ఏళ్లలో పాశ్చాత్యీకరణ ప్రభావం, డేటింగ్‌, సహజీవనం, సరగొసీ, వివాహేతర సంబంధాలు లాంటివన్నీ కూడా ఇంటర్వ్యూ అంశాలుగా మారాయి. వీటికోసం 'షార్ట్‌ ఆన్సర్స్‌'తో సిద్ధమైతే చాలు.

ముఖ్యంగా మహిళా, మైనార్టీ, దళిత అభ్యర్థులను ఆ వర్గాల స్థితిగతులపై ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి అంశాలపై స్పందించాలంటే సామాజిక పునాదుల అవగాహన అనివార్యం.

వర్తమానాంశాలే వర్త్‌ఫుల్‌...
ప్రతి ఇంటర్వ్యూలో కూడా 'వర్తమానా'న్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం, జిల్లాస్థాయి ప్రశ్నలు వస్తున్నాయి. ఇరాన్‌, సిరియా, మధ్యాసియా, పాకిస్థాన్‌, అమెరికా, జర్మనీ, చైనా మొదలైన దేశాల్లో జరుగుతున్న పరిణామాల గురించి సాధారణ అవగాహన అయినా ఉండాలి.

2జీ, ఎమ్మార్‌, లోక్‌పాల్‌, ఎన్‌.సి.టి.సి., ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆహార భద్రత, ప్రియాంక గాంధీ, రాహుల్‌ రాజకీయ భవితవ్యం, కాగ్‌, సుప్రీంకోర్టు క్రియాశీలత, జాతీయ సమైక్యత లాంటి అంశాలపై పట్టు అవసరం. గనుల కుంభకోణం, పారా సిండికేట్లు, ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, క్రాప్‌ హాలీడే, పార్టీ ఫిరాయింపులు, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు, ఉపఎన్నికలు, ఏపీ బడ్జెట్‌... (ఇటీవల జరిగిన ఎ.ఎం.వి.ఐ. ఇంటర్వ్యూలో కూడా రవాణా శాఖకు కేటాయించిన బడ్జెట్‌ అంశాలపై ప్రశ్నలు అడిగారు).

సూచన: జిల్లా స్థాయి ప్రశ్నలకు అవకాశం ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాకి సంబంధించిన వర్తమానాంశాలను చదవాలి.



తులనాత్మక పరిశీలన
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలు అన్నింట్లోనూ తులనాత్మక (comparative) సమాధానాలకు ప్రాధాన్యమిచ్చారు.
* భారత ప్రధానులలో మీకు బాగా నచ్చిన వారెవరు? ఎందుకు?
* నెహ్రూ, ఇందిరల మధ్య తేడా ఏమిటి?
* కాంగ్రెస్‌, కాంగ్రెసేతర పాలనలలో ప్రధాన భేదాలు ఏమిటి?
* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులలో నచ్చినది ఎవరు? ఎందుకు?
* ఎన్టీ రామారావు పాలనలో నచ్చినది/ నచ్చనిది ఏమిటి?
* ప్రస్తుత ముఖ్యమంత్రులలో మోడల్‌ సీఎం ఎవరు?
* మన్మోహన్‌సింగ్‌ని తొలగించాల్సివస్తే ప్రత్యామ్నాయం ఎవరు?
* తదుపరి రాష్ట్రపతిగా ఎవరుంటే బాగుంటుంది?

శరీర భంగిమ, కదలికలు... ఎదుట ఉన్నవారికి ఒక అభిప్రాయం ఏర్పరుస్తాయి. 'ప్రవేశించే దశ' నుంచి  నిష్క్రమించే దశ' వరకు ప్రతి దశలోనూ శరీరపు కదలికలుంటాయి. వాటిలో వృథా కదలికలు చాలా ఉండవచ్చు. వాటిని తగ్గించాలి. 'అనుకూలత'ను అందించే కదలికలు పెంచాలి. బిగుసుకుపోయి కూర్చునే స్థితి నుంచి, ఆహ్లాదం కలిగించే దిశలో కదలికలు ఉండటం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు.

ముఖ్యంగా ముఖకవళికల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఇలాంటివన్నీ సాధన ద్వారా వస్తాయి కాబట్టి ఇంటర్వ్యూ సన్నద్ధతలో భాగంగా ఈ అంశాలపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడు గరిష్ఠ మార్కులు వాటంతట అవే వస్తాయి.


C.సమాధానాల్లో ఉండాల్సినవి
* సూటిగా సమాధానాలు చెప్పాలి. వ్యాసాల్లో మాదిరిగా ఉపోద్ఘాతాలు లాంటివి వద్దు.
* గణాంక సమాచారం గుప్పించవద్దు. ఇంటర్వ్యూ అనగానే ముఖ్యంగా ఆర్థిక గణాంకాల కోసం పరిగెడ్తున్నారు. కేవలం స్థూల సమాచారం ఉంటే చాలు.
* ప్రముఖుల వ్యాఖ్యానాలు, విధానాలను కోట్‌ చేయదల్చుకుంటే ఆ ప్రముఖుని గురించి ముందుగానే సమాచారం సంపాదించుకోవాలి.
* సుదీర్ఘ వచనాలు వద్దు. వాడుక పదాలు వాడుతూ భావవ్యక్తీకరణ జరిగేలా చూసుకుంటే చాలు.
* సామెతలు, నానుడులూ వాడితే మంచిదే కానీ, అలా చేసేటపుడు వాటిపై పట్టు ఉండటం మంచిది.

- కొడాలి భవానీ శంకర్

Monday 20 February 2012

వైద్య విద్యకు విభిన్న మార్గాలు!

జాతీయస్థాయి ఉమ్మడి వైద్య ప్రవేశపరీక్ష- (NEET ) వచ్చే ఏడాది రంగప్రవేశం చేసే అవకాశముంది. ఈ సంవత్సరానికి మాత్రం వైద్యవిద్య చదవాలనుకునేవారు వివిధ రకాల ప్రవేశపరీక్షలకు యథావిధిగా సిద్ధమవ్వాల్సిందే. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకోవలసిన విషయాలూ, పాటించాల్సిన సూచనలూ... ఇవిగో!

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ విభాగంలో ఉన్న విద్యార్థులకు ఎన్ని అవకాశాలున్నాయో బైపీసీ వారికి కూడా అంతకంటే అధిక అవకాశాలే ఉన్నాయి. అయితే బైపీసీ విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ కేవలం ఎంబీబీఎస్‌ దృష్టితోనే ఉంటున్నారు కాబట్టి అవకాశాలు పరిమితమనే అభిప్రాయం వ్యాపించింది.

ఈ గ్రూపు తీసుకుంటే విద్యాభ్యాసానికీ, 'సెటిల్‌' అవటానికీ చాలాకాలం పడుతుందనే అభ్యంతరం తల్లిదండ్రుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంబీబీఎస్‌ ఐదున్నర ఏళ్ళ తర్వాత సూపర్‌ స్పెషాలిటీతో కలిసి మొత్తం 11 సంవత్సరాల వరకూ చదవాలి కాబట్టి. కానీ వీరి కెరియర్‌ ప్రారంభం ఆలస్యం కావొచ్చు కానీ పదవీ విరమణ కూడా లేటుగానే ఉంటుంది కదా?

వీరు స్థిరపడినంతగా ఇంజినీర్లు లేదా ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో ఉండే విద్యార్థులు స్థిరపడే అవకాశాలు తక్కువ. ప్రారంభంలో ఒక ఇంజినీర్‌ ఐదేళ్ళలోనే స్థిరపడి సంపాదించడం ప్రారంభించవచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత ఒక డాక్టరు ఆదాయంలో ఇంజినీర్‌ ఆదాయం సగం కూడా ఉండకపోవచ్చు. సంపాదన కంటే కూడా వృత్తిలో పొందే సంతృప్తి ఒక వైద్యుడు పొందినట్లుగా మిగిలిన ఏ వృత్తిలో ఉన్న ఉద్యోగి కూడా పొందకపోవచ్చు.

మెడికల్‌ విభాగంలో కూడా విద్యార్థులను కొంతవరకూ సంతోషంగా ఉంచడానికి మెడికల్‌ కోర్సును నాలుగున్నర ఏళ్ళకు కుదించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ మెడికల్‌ (NEET)ప్రారంభించిన తర్వాత అన్నిటికీ ఉమ్మడి సిలబస్‌ ఏర్పడుతుంది కాబట్టి మెడికల్‌ విద్యార్థులు ఒక ఏడాది ఆదా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

ఈ సంవత్సరం సంగతేమిటి?
వైద్యవిద్య ప్రవేశపరీక్షలు రాసే విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయం- వీరు మొదట ఎంసెట్‌లో కచ్చితంగా సీటు సాధించగలమని నమ్మకం ఏర్పడితేనే మిగిలిన ప్రవేశపరీక్షల గురించి ఆలోచించడం మేలు. ఎందుకంటే మిగిలిన ఏ ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ అయ్యే సీట్లతో పోల్చుకున్నా మన ఎంసెట్‌- మెడికల్‌ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ.

2011 అడ్మిషన్ల ప్రకారం- మన రాష్ట్రంలో మొత్తం 37 వైద్యకళాశాలలున్నాయి. వీటిలోని సీట్ల సంఖ్య 4950. (ప్రభుత్వ కళాశాలల సీట్లు 1800 + ప్రైవేటు కళాశాలల్లో 3150.)

ఎయిమ్స్‌లాంటి సంస్థలో మొత్తం సీట్లు 45 లోపే. ఎ.ఎఫ్‌.ఎం.సి.లో బాలికలకు రిజర్వ్‌ చేసిన 25 సీట్లతో కలిపి మొత్తం ఉన్నవి 130 సీట్లే. వాటిమీద ఎక్కువ దృష్టి పెట్టేకంటే దాదాపు 5000 మెడికల్‌ సీట్లు భర్తీ చేసే మన ఎంసెట్‌ ర్యాంకు మీదే అధిక శ్రద్ధ వహించటం తెలివైన పని కదా? దీనిలో కచ్చితంగా సీటు సాధించగలమని ధీమా ఏర్పడిన తర్వాతే మిగిలిన ప్రవేశ పరీక్షల గురించి ఆలోచించాలనేది అందుకే!


వెటర్నరీ సైన్స్‌ (బీవీఎస్‌సీ) చదివినవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువ. మన రాష్ట్రంలో సుమారు నాలుగువేలమంది పశువైద్య నిపుణుల కొరత ఉంది. రాష్ట్రంలో బీవీఎస్‌సీ అందించే కళాశాలలు మూడున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎంసెట్‌ ద్వారా, జాతీయస్థాయిలో ఆలిండియా ప్రీ వెటర్నరీ టెస్ట్‌ (ఏఐపీవీటీ) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. అయితే ఎంసెట్‌ రోజునే ఏఐపీవీటీ కూడా నిర్వహిస్తున్నారు!

ప్రణాళిక ఎలా?
డాక్టరు కావడానికి అవకాశమిచ్చే (ఇంతకుముందు పేర్కొన్న) అన్ని కోర్సులకూ ప్రవేశం ఎంసెట్‌ ద్వారానే. ఎంసెట్‌ మే 12న కాబట్టి ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యేవరకూ కేవలం ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలపైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఎంసెట్‌ గురించి ఆలోచించడం మేలు.

అనంతరం సుమారుగా 55 రోజులుంటాయి. 10 గ్రాండ్‌ టెస్టులు 20 రోజుల్లో పూర్తిచేయగలిగితే మిగిలిన 35 రోజులూ సమగ్ర సన్నద్ధతకు ఉపయోగపడతాయి. ఆ సమయంలో ప్రథమ సంవత్సర సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి.

జాతీయస్థాయి పరీక్షల్లో బయాలజీ ప్రాధాన్యం తగ్గుతుంది. ఇంగ్లిష్‌ లేదా ఆప్టిట్యూడ్‌ లాంటి అదనపు విభాగాల్లో సాధన చేయాల్సివుంటుంది. MGIMS పరీక్షలో గాంధీయ చింతన (గాంథియన్‌ థాట్స్‌)పై మూడు గంటల పరీక్ష అదనం. జాతీయప్రవేశపరీక్షలన్నిటిలో సీట్ల సంఖ్య చాలా తక్కువ, అదనంగా కొంత సన్నద్ధం కావాల్సివుండటం వల్ల మన విద్యార్థులు ఈ పరీక్షల్లో కొంత వెనకబడివున్నారు. ఈ పరీక్షల్లో విజేతలు కావాలంటే ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌లలో అభ్యాసం తప్పనిసరి.

ఈ వివిధ రకాల పరీక్షలభారం ఈ ఏడాదితోనే ముగియవచ్చు. 2013 నుంచి దేశమంతటా NEETప్రారంభిస్తే విద్యార్థులపై ఈ అదనపు భారం, ఒత్తిడి తగ్గిపోతాయి.

భవితను తీర్చిదిద్దుకునేలా...
ఎంపీసీ విద్యార్థులు కానీ, బైపీసీ విద్యార్థులు కానీ వృత్తి విద్యలకు ఇచ్చే ప్రాధాన్యం బేసిక్‌ సైన్సెస్‌కు కూడా ఇస్తే మేలని విద్యావేత్తల అభిప్రాయం. నేడు బేసిక్‌ సైన్స్‌లలో ఎంఎస్సీ చేసిన అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా కనపడుతోంది.
ఎంఎస్‌సీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (5 సంవత్సరాలు)
డిపార్ట్‌మెంట్‌ అటామిక్‌ ఎనర్జీ వారు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (NEST)ద్వారా కింది ప్రసిద్ధ సంస్థల్లో విద్యావకాశం కల్పిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌, భువనేశ్వర్‌; సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌, ముంబాయి; విశ్వభారతి, శాంతినికేతన్‌. గత ఏడాది నుంచి ఐఐఎస్‌సీ, బెంగళూర్‌లో కూడా బేసిక్‌ సైన్సెస్‌ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో బీఎస్‌, ఎంఎస్‌లను ప్రారంభించారు.

వీటికి ఎంత గిరాకీ ఉందంటే ఈ కోర్సుల్లో చేరినవెంటనే అంటే ప్రథమ సంవత్సరం నుంచే స్త్టెపెండ్‌ రూపంలో రూ.5వేలు, సంవత్సరానికి అదనంగా రూ.20 వేలు ఇస్తారు. ఒకసారి ఈ సంస్థల్లో చేరినవారు ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను ప్రారంభించారు. వీటిలో అధికశాతం కోర్సులు 2007 తర్వాతే ప్రారంభమయ్యాయి. కొన్నిటిని 2011లోనే ఆరంభించారు. కాబట్టి వీటిపై చాలామందికి సరైన అవగాహన లేదు.

NEST సంగతులు
ఈ పరీక్ష మే 27న జరుగుతుంది. ఇది మొత్తం ఐదు భాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో జనరల్‌ ప్రశ్నలుంటాయి. ఇవి విద్యార్థులందరూ రాయాల్సిందే. మిగిలిన విభాగాలు- బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌. ఈ నాలుగింటిలో ఏవైనా మూడు విభాగాలు రాయాల్సివుంటుంది. అన్ని విభాగాలకూ మార్కులు సమం.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే! కానీ కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు కూడా ఉండొచ్చు. తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులుంటాయి. పరీక్ష ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్‌, విశాఖపట్నాల్లో ఉన్నాయి. ఇంటర్లో 60 శాతం మార్కులు వచ్చివున్నవారు మాత్రమే పరీక్ష రాయటానికి అర్హులు. సిలబస్‌ సీబీఎస్‌ఈ 12 తరగతిది మాత్రమే. పరిశోధన ఆసక్తి ఉన్న విద్యార్థులకూ, అధ్యాపక వృత్తిలో రాణించదలిచినవారికీ చక్కటి అవకాశం.

ఇంకా ఇతర కోర్సులు
బైపీసీ వారు మన రాష్ట్రంలో చదవటానికి అవకాశమున్న ఇతర కోర్సులు- బీఫార్మసీ, బీటెక్‌ (బయోటెక్నాలజీ), బీఎస్‌సీ హార్టికల్చర్‌, అగ్రికల్చరల్‌ బీఎస్‌సీ, ఫిజియోథెరపీ, బీఎస్‌సీ నర్సింగ్‌, మెడికల్‌ మైక్రో బయాలజీ, మెడికల్‌ బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్‌, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ... ఇలా చాలా ఉన్నాయి.

హార్టికల్చర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధిస్తున్నవారిలో ఎక్కువశాతం అగ్రికల్చర్‌ బీఎస్‌సీ నుంచే వస్తున్నారు. కాబట్టి బైపీసీ వారికి ఎంబీబీఎస్‌ అనేదే కాకుండా ఇతర అవకాశాలూ ఎక్కువే.

- పి.వి..ఆర్.కె. మూర్తి.

Thursday 16 February 2012

బ్యాంకు కొలువుకు తుది సోపానాలు

    ఐబీపీఎస్‌ నిర్వహించిన ఉమ్మడి రాతపరీక్ష ఫలితాలు వెలువడి, వివిధ జాతీయ బ్యాంకులు పి.ఒ. నియామకాలకు నోటిఫికేషన్లు జారీచేసే ప్రక్రియ మొదలయింది. దీని ప్రకారం అభ్యర్థులు ఈ నెలలో నిర్వహించే మౌఖిక పరీక్షకు హాజరుకావాల్సి వుంటుంది. కీలకమైన ఈ దశలో నెగ్గి ఉద్యోగం సాధించేదెలాగో పరిశీలిద్దాం!

మ్మడి రాతపరీక్షలో వచ్చిన మార్కులూ, మౌఖిక పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు అవసరాన్ని బట్టి బృందచర్చ (Group Discussion) కూడా నిర్వహించే అవకాశం వుంది.

మౌఖిక పరీక్షకు ముందు
* విద్యార్హతలు, వయసు, కులం, ఆదాయం మొదలైనవాటి ధ్రువీకరణ పత్రాలు ముందే సిద్ధం చేసుకోవాలి.

* పరీక్షా కేంద్రానికి వీలైతే ఒకరోజు ముందే వెళ్ళి చూసిరావడం మంచిది. దీనివల్ల ఆ వాతావరణం కొత్తగా అనిపించకుండా వుండి నూతన ప్రదేశాలకు వెళ్ళినపుడు వుండే ఇబ్బంది, ఆందోళనలను దూరం చేస్తుంది. ఆత్మస్త్థెర్యం పెంచుతుంది.

* మౌఖిక పరీక్షలో తరచుగా అడిగే ఈ కింది ప్రశ్నలకు సిద్ధం కండి.

a) మీ గురించి పేర్కొనండి
b) మీరు ఈ ఉద్యోగానికి ఏ విధంగా సరిపోగలనని అనుకుంటున్నారు?
c) రానున్న 10 సం|| కాలంలో మీరు ఎక్కడ ఏ స్థానంలో వుండగలనని అనుకుంటున్నారు?
d) మీ బలాలు/బలహీనతలు

వీటిలో b) ప్రశ్నకు మీ బలాలు అంటే hard working, communication skills, adaptability, quick learningమొదలైనవి చెప్పి, అందువల్ల ఈ ఉద్యోగానికి సరిపోగలనని పేర్కొనాలి.

c) ప్రశ్నకు మీరు పేర్కొన్న మీ బలాల వల్ల ఈ బ్యాంక్‌లోనే ఒక ఉన్నత స్థానంలో వుండగలనని నమ్మకంగా పేర్కొనాలి.

బలహీనతలు ఎప్పుడూ అభ్యర్థి బలహీనతలు నేరుగా పేర్కొనేలాగా (అంటే communication skills లేకపోవడం, ఇంగ్లిష్‌లో పట్టులేకపోవడం..) వుండకూడదు. అవి పరోక్షంగా బలాన్ని తెలియజేసేలాగానే వుండాలి. అంటే విషయాలను త్వరగా నేర్చుకోవడానికి అత్యుత్సాహం చూపించడం, పని పూర్తిచేసే క్రమంలో కాలాన్ని పట్టించుకోకపోవడం లాంటివి. ఇటువంటివాటిని బలహీనతలుగా పేర్కొన్నప్పటికీ అవి పరోక్షంగా బలాన్నే తెలియజేస్తాయి.

పరీక్ష సమయంలో
* హాల్లోకి ప్రవేశం కోరుతూ సభ్యులను అభ్యర్థించండి. సభ్యులందరికీ విష్‌ చేయండి. ఒకవేళ మహిళా సభ్యురాలు వుంటే ముందుగా ఆమెకు విష్‌ చేయండి.

* ఇంటర్వ్యూను ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మొదటి 2, 3 నిమిషాల సమయం చాలా ముఖ్యమైనది. చాలామంది సభ్యులు మొదటి కొద్దినిమిషాల్లో అభ్యర్థి ప్రవర్తించే తీరు, ఇచ్చే సమాధానాలు ఆధారంగా అభ్యర్థిపై positiveగా కాని negativeగా కాని ఒక అంచనాకు వస్తారు. అందుచేత ఆ సమయం చాలా కీలకం.

 * శారీరక హావభావాల ద్వారా ఉత్సుకతను ప్రదర్శించండి. అందువల్ల అభ్యర్థి తను activeగా వుండే personగానూ, ఆ బ్యాంక్‌లో పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా నూ సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.

* అభ్యర్థి హాల్లో ఉన్న సమయమంతా చిరునవ్వును ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. ఇది అంతర్లీనంగా వుండే ఆందోళనను బహిర్గతపరచకుండా దాచిపెడుతుంది.

* సభ్యుల ప్రశ్నలను జాగ్రత్తగా వినండి. మధ్యలో వారిని అంతరాయపరచవద్దు.
* మీరు జవాబులను ఇచ్చేముందు ఆలోచించి మాట్లాడండి.

* ఒక ప్రవాహంలా మధ్యలో ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడం సరికాదు. అవసరమయినచోట కొంచెం ఆగటం, వ్యవధినివ్వటం చేయాలి. స్వరంలో హెచ్చు తగ్గులను సందర్భాన్ని బట్టి ప్రదర్శించగలగాలి. మాట్లాడుతున్నదాన్ని recordచేసి దాన్ని విని అవసరమైనచోట మార్పులు చేర్పులు చేసుకొని సాధన చేయడం ద్వారా చక్కగా మెరుగుపరుచుకోవచ్చు.

* మీ సమాధానాలు నిజాయతీగా ఉండాలి.
* సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండాలి. చుట్టుతిరుగుడుగా మాట్లాడకూడదు.
* కేవలం 'అవును' 'లేదు/ కాదు' అనటం కాకుండా అవసరమైనచోట ఉదాహరణలతో వివరించండి.

* మీరు గతంలో సాధించిన achievements పేర్కొనండి. దీనివల్ల ఉద్యోగంలో మీరు విజయం సాధించడానికి మీకున్న సామర్థ్యం, నిబద్ధతలను వారికి తెలియపరచినట్లవుతుంది.

* మిమ్మల్ని ఈ ఉద్యోగంలో నియమిస్తే, మీరు బ్యాంక్‌కు ఏ విధంగా అదనపు విలువ సంతరించగలరో పేర్కొనండి. అంతేకానీ మీకు ఈ ఉద్యోగం ఎందుకు అవసరమో తెలియజేయకండి.

* సభ్యుల జాలి (sympathy) పొందే ప్రయత్నం చేయవద్దు.
* Basic concepts మీద దృష్టి సారించండి. ఒక్కొక్కసారి సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంలోనే ఇబ్బంది పడవచ్చు.

* ఆహార్యం విషయంలో జాగ్రత్తగా వుండండి. దుస్తులుformalగా వుండాలి. ముదురు రంగు దుస్తులు వేయకుండా వుంటే మంచిది. ప్రసన్నంగా, ఆకర్షణీయంగా ఉన్నట్లు కనబడాలి.
* సభ్యులతో ఎప్పుడూ వాదనకు దిగవద్దు.
* సూటిగా చూస్తూ మాట్లాడండి. ప్రశ్న ఎవరు అడిగినా జవాబును సభ్యులందరినీ చూస్తూ చెప్పండి.
* జవాబు తెలియకపోతే 'తెలియదు' అని చెప్పడానికి సంకోచపడవద్దు. సరైన సమాధానం కంటే మనం జవాబు చెప్పే తీరు ముఖ్యమని గ్రహించండి.

మౌఖిక పరీక్షలో అడగడానికి అవకాశం వున్న అంశాలు
* లోక్‌పాల్‌ బిల్‌
* ముల్లా పెరియార్‌ అంశం
* రూపాయి విలువ తగ్గుదల
* ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ చర్యలు
* బంగారం విలువ పెరుగుదల
* ఆర్థికశాఖ fiscal policy
* ఆర్‌బీఐ మానిటరీ పాలసీ
* స్టాక్‌ మార్కెట్‌, సెన్సెక్స్‌
* DI, FII, Definations, వాటిమధ్య భేదం
* బ్యాంకింగ్‌ రంగంలోని మార్పులు
* రాష్ట్రాల ఎన్నికలు
* ఆర్థిక రంగ తాజా పరిణామాలు

- జి.ఎస్. గిరిధర్

Wednesday 15 February 2012

ఉజ్వల భవితకు... ఇంజినీరింగ్‌ దారులు!

     
ఇంజినీరింగ్‌ ప్రవేశానికి జాతీయస్థాయిలో ఒకే ఉమ్మడి పరీక్ష ప్రవేశపెట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవి ఓ కొలిక్కివస్తే వచ్చే ఏడాది నుంచి ఒకే పరీక్ష విధానం అమల్లోకి రావొచ్చు. ఈ ఏడాది మటుకు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలకు సిద్ధం కావాల్సిందే. దీనికి సమర్థమైన ప్రణాళిక ముఖ్యం. ప్రధాన ప్రవేశపరీక్షల తీరుపై స్థూల అవగాహన కూడా అవసరమే!


2012లో ఐఐటీ-జేఈఈ తోపాటు ఎంసెట్‌ రాయదల్చుకున్నారా? ఏప్రిల్‌ 8 వరకూ కేవలం ఐఐటీ-జేఈఈపై దృష్టి కేంద్రీకరించండి. తర్వాత మే 12 వరకూ ఎంసెట్‌ అభ్యాసం చేయండి.

విద్యార్థులు ఇంటర్‌ పూర్తిచేస్తూనే పదికి పైగా రాష్ట్ర, జాతీయస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు రాయాల్సివస్తోంది. మార్చి నుంచి జూన్‌ వరకూ వీటి మూలంగా విశ్రాంతే ఉండక ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

ఇంజినీరింగ్‌కు సంబంధించి ఎన్ని పరీక్షలు రాసినా చేరే కోర్సు ఒకటే. చేరబోయేది ఏదో ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలోనే. అటువంటప్పుడు అన్ని పరీక్షలు రాయాల్సిరావటం సహేతుకం కాదు కదా? ఇన్ని పరీక్షలతో విద్యార్థులను ఇబ్బంది పెట్టేబదులు అన్నింటికీ ఒకే పరీక్షను నిర్వహించాలనే చిరకాల ఆకాంక్ష ఆచరణలోకి రాబోతోంది. ఐఐటి, ఎన్‌.ఐ.టి. డైరెక్టర్లు సంయుక్తంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. 2013 నుంచి ఒకే పరీక్ష విధానానికి ప్రారంభం జరగాలని ఆలోచించి, విధి విధానాలు ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రకటించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదే జరిగితే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎంతో ఊరట లభించినట్లే. ఎందుకంటే ఐఐటీ జేఈఈ, ఏఐఈఈఈ, ఎంసెట్‌, విట్టీ.. వంటి ప్రతి పరీక్షకూ సిద్ధమవ్వాల్సిన ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది కాబట్టి! అంతేకాదు, ఐఐటీ-జేఈఈ, ఎఐఈఈఈ..- ఇలా ప్రతి పోటీ పరీక్షకూ వేరువేరుగా కోచింగ్‌ అవసరం లేదు. ఒకే కోచింగ్‌ తీసుకుని, ఒకే ప్రవేశ పరీక్ష రాస్తే సరిపోతుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా ఏ ఇంజినీరింగ్‌ సంస్థలోనైనా సీటు సాధించే అవకాశం ఉంటుంది.

విధివిధానాలు ప్రకటిస్తే మేలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష విధి విధానాలు వెంటనే విడుదల చేస్తే 2013కు తయారయ్యే విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టవుతుంది. వారు నూతన పరీక్ష పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు.

ఈ ఉమ్మడి పరీక్ష విధానానికి వస్తే ఇంటర్‌ మార్కుల నుంచి 50, 60 శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఇంగ్లిషులో కనీస మార్కులు సాధించాలన్న నిబంధన గానీ, అన్ని లాంగ్వేజెస్‌లో కలిపిన మొత్తం మార్కుల్లో యాభై శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశం గానీ లేకపోలేదు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఉమ్మడి ప్రవేశపరీక్షను మొదట 2013 నుంచి నిర్వహించి, 2014 నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంగా మార్చి విద్యార్థులు రెండు సార్లు రాసుకునేలా వీలుకల్పించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. సబ్జెక్టుతో పాటు (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మాథమెటిక్స్‌) ఆప్టిట్యూడ్‌పై కూడా ప్రశ్నలు ఉండేలా ఉన్నాయి. ఆంగ్లంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలున్నాయి.

మార్పులు నిశ్చయమే
2013 నుంచి ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి ప్రవేశ పరీక్షల్లో మార్పులు జరగబోతున్నాయి. పరిగణనలోకి తీసుకునే ఇంటర్‌ మార్కుల వెయిటేజీ విద్యార్థి ఇంప్రూవ్‌మెంట్‌ రాసినట్లయితే తొలి మార్కుల ప్రాతిపదికగా ఉంటుందా అనేది చర్చలో ఉన్న అంశం. ఇంటర్‌, ఆప్టిట్యూడ్‌, సైన్సెస్‌ 40:30:30 నిష్పత్తిలో ఉండాలని కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా 2013 నుంచి జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష జరిగే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి.


ఈ ఏడాది సంగతేమిటి?
2012లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు అధిక పరీక్షలు రాయాల్సిందే. అయితే కన్పించిన ప్రతి పరీక్షకూ దరఖాస్తు చేస్తే ప్రతి వారం ఏదో ఒక పరీక్షకు సిద్ధపడాల్సిందే. వాటి విధి విధానాల తేడా వల్ల ప్రతి వారం వేర్వేరు పరీక్షలకు తయారవుతూ వెళితే, ఏ పరీక్షపైనా పట్టులేక నష్టపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలను రెండు భాగాలుగా విభజించుకొని తయారు కావటం సులభం, ప్రయోజనకరం.


ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, బిట్‌శాట్‌ లాంటి పరీక్షలు ఒక విభాగంగా; ఎంసెట్‌, మహీ లాంటి పరీక్షలు రెండో విభాగంగా పరిగణించవచ్చు.

ఎందుకంటే...

* ఏఐఈఈఈ లాంటి పరీక్షల్లో ప్రశ్నల సంఖ్య చాలా తక్కువ కాబట్టి విద్యార్థిపై కాల ఒత్తిడి ఉండదు. కేవలం చదివిన అంశాలను అనువర్తింపచేసుకోవడాన్ని అభ్యసిస్తే సరిపోతుంది. ఏఐఈఈఈ/ బిట్‌శాట్‌లలో గంటకు జవాబులు గుర్తించే ప్రశ్నల సంఖ్య 30- 40 లోపే కాబట్టి ఏ జవాబును కూడా కంఠతా చేయాల్సిన అవసరం ఉండదు.

* ఎంసెట్‌ లేదా మహీ లాంటి పరీక్షల్లో గంటకు 60- 100 ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టుపై అవగాహనకు తోడుగా వాటిని వేగంగా సాధించగలిగిన అభ్యాసం కూడా తప్పనిసరి. అంత వేగం కనబరచాలంటే కచ్చితంగా కొన్ని ప్రశ్నల జవాబులను కంఠతా చేయాలి. షార్ట్‌కట్‌ మెథడ్స్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ తరహా జ్ఞాపకశక్తి మెలకువలు ఐఐటీ-జేఈఈ/ ఏఐఈఈఈ/ బిట్‌శాట్‌లకు ఉపయోగపడవు.

ఇదీ ఆచరణీయ ప్రణాళిక
2012లో ఐఐటీ-జేఈఈ తోపాటు ఎంసెట్‌ రాయదల్చుకున్నారా? ఏప్రిల్‌ 8 వరకూ కేవలం ఐఐటీ-జేఈఈపై దృష్టి కేంద్రీకరించండి. తర్వాత మే 12 వరకూ ఎంసెట్‌ అభ్యాసం చేయండి. ఇలా కాకుండా ఐఐటీ ప్రవేశపరీక్షకు ముందే ఎంసెట్‌ సన్నద్ధత ప్రారంభిస్తే మానసిక ఒత్తిడికి లోనై అనుకొన్నస్థాయిలో రాణించలేకపోవచ్చు.

ఆన్‌లైన్‌ సాధనపై శ్రద్ధ
ఇంజినీరింగ్‌ విభాగంలో ఈ ఏడాది కొన్ని ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఉన్నాయి. వీటికోసం నమూనా పరీక్షలు తప్పకుండా సాధన చేయాలి. సాధారణ ప్రశ్నపత్రంలోనైతే అన్ని ప్రశ్నలను ఏకకాలంలో ముందుకు లేదా వెనుకకు ఏ వైపునకయినా తిప్పి చూడవచ్చు. జవాబు గుర్తించాలనుకునే ప్రశ్నకు వెంటనే వెళ్లవచ్చు. అదే ఆన్‌లైన్‌ పరీక్షయితే ఒక సమయంలో మానిటర్‌పై ఒకే ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు- జరిగిపోయిన ప్రశ్న జవాబు మరలా గుర్తించాలంటే అన్ని ప్రశ్నలనూ వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాలి. దీనివల్ల సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించాలంటే ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువ రాయాలి.

ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈల ద్వారా సీట్లు వచ్చే అవకాశాలున్న విద్యార్థులు వాటిపైనే అధిక శ్రద్ధ పెడితే మంచిది. వాటిపై ఏదైనా అనుమానం ఉంటే మిగిలిన పోటీ పరీక్షలన్నిటి గురించి ఆలోచించే బదులు ఎంసెట్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టటం శ్రేయస్కరం.అప్పుడు మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరే అవకాశం ఉంటుంది.



- - - - పి.వి.ఆర్.కె. మూర్తి

Monday 6 February 2012

డీఎస్‌సీలో విజయానికి మెలకువలు!



భావి పౌరులను తీర్చిదిద్దే సదవకాశం; ఒత్తిడికి దూరంగా విధుల నిర్వహణ; వేతనాలూ, సెలవుల పరంగా ఆకర్షణ... కలగలిపితే ఉపాధ్యాయ కొలువు! దాదాపు మూడేళ్ళ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటన వెలువడింది. ఉద్యోగార్థుల ఎదురుచూపులు ఫలించాయి. వీరి తక్షణ కర్తవ్యం- మే 2,3 తేదీల్లో జరిగే డీఎస్‌సీ రాతపరీక్షలో గరిష్ఠ మార్కుల సాధన. దీనికోసం దృఢ సంకల్పంతో అధ్యయనం ప్రారంభించాలి!




ఎస్‌జీటీ... తక్కువే పోటీ
టెట్‌లో దాదాపు 45 వేలమంది ఉత్తీర్ణత సాధించారని అంచనా. ప్రభుత్వం నియమించనున్న ఎస్‌జీటీ ఉద్యోగాలు 11,602. ఈ పోస్టులకు డి.ఇడి అభ్యర్థులు మాత్రమే అర్హులు కాబట్టి పోటీ చాలా పరిమితంగానే ఉంటుంది. అంటే 1:10 కంటే తక్కువే. ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటే వెంటనే మూడు నెలల ప్రణాళిక రచించుకుని ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.
ఎస్‌జీటీ పరీక్షా పద్ధతిలో గణనీయమైన మార్పులు చేశారు. ముందుగా మారిన పరీక్షా పద్ధతినీ, అందులోని సబ్జెక్టుల ప్రాధాన్యాన్నీ తెలుసుకుని దీనికనుగుణంగా సిద్ధం కావాల్సివుంటుంది.

ఉపాధ్యాయ అభ్యర్థులు ఇప్పటికే టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో ఉత్తీర్ణత సాధించివుంటారు కాబట్టి జరగబోయే డీఎస్‌సీ వీరికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కారణం- టెట్‌ సిలబస్‌కూ, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) సిలబస్‌కూ కొద్దిపాటి తేడా తప్ప చెప్పుకోదగ్గ మార్పులు లేవు.

కొత్తగా ఎస్‌జీటీకి ప్రిపరేషన్‌ కొనసాగించే అభ్యర్థులు జి.కె., వర్తమాన అంశాలు, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌లపై సిద్ధం కావాల్సివుంటుంది.

'పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌' డి.ఇడి సిలబస్‌లో పేపర్‌-4గా అభ్యసించినదే. మిగిలిన తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్‌, సోషల్‌ కంటెంట్‌ (1-8 తరగతులు, రాష్ట్ర సిలబస్‌), మెథడాలజీ, డి.ఇడి సిలబస్‌ను సునిశితంగా అధ్యయనం చేయాలి.

డీఎస్‌సీ పరీక్ష కోణంలో...
* టెట్‌లో చదివిన అనేక అంశాలను మళ్ళీ డీఎస్‌సీ పరీక్ష కోణంలో చదవాలి. టెట్‌ సిలబస్‌లో లేని అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

* గత డీఎస్‌సీలో కంటెంట్‌ 7వ తరగతి సిలబస్‌ వరకే ఉండేది. ఈసారి 8వ తరగతి సిలబస్‌ కూడా చదవాలి. టెట్‌ ప్రశ్నపత్రంలో జ్ఞానాన్ని పరీక్షించేవి మాత్రమే కాకుండా అవగాహన, అనువర్తనలకు సంబంధించిన ప్రశ్నలూ అడిగారు. కాబట్టి డీఎస్‌సీ సన్నద్ధత కూడా ఆ కోణంలో ఉండేలా జాగ్రత్త వహించాలి.

* కంటెంట్‌ కోసం... ఇప్పటికే టెట్‌ కోసం అభ్యసించిన విషయాలను ఇప్పుడు డీఎస్‌సీ పరీక్ష కోణంలో చదవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల తీరు అవగాహనకు వస్తుంది.
* కఠినమైన/కొత్త అంశాలకు తగిన సమయం కేటాయించి చదవాలి.
* మెథడాలజీ కూడా టెట్‌లో చదివిందే కాబట్టి గతంలోని పొరపాట్లను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.

పదో తరగతి స్థాయి వరకూ...
* తెలుగు, ఆంగ్లం భాషలకు సంబంధించి భాషా ప్రావీణ్యం, భాషాంశాలు, భావప్రసారం, భాషణ నైపుణ్యం, భావావగాహన సామర్థ్యాలను పదోతరగతి స్థాయి వరకూ అభ్యసించాలి.
* బోధనా పద్ధతుల కోసం ఏపీ రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన డి.ఇడి సిలబస్‌ దృష్టిలో ఉంచుకుని వివరణాత్మకంగా, సమగ్రంగా అభ్యసించాలి.
* సిలబస్‌ 8వతరగతి వరకే అయినప్పటికీ ప్రశ్నల స్థాయి పదో తరగతి వరకూ ఉంటుంది. అంటే ప్రశ్నల కఠినతా స్థాయి కొంత ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్నీ అంశాల వారీగా, విశ్లేషణాత్మక ధోరణిలో చదవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. తొలిదశలో ప్రేరణను పరీక్ష జరిగేవరకూ నిలుపగలిగి సాధన చేస్తే ఎస్‌జీటీ ఉద్యోగం మీ సొంతమే!