ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label ఏపీపీఎస్ సీ. Show all posts
Showing posts with label ఏపీపీఎస్ సీ. Show all posts

Monday, 31 December 2012

మంచి ర్యాంకు సాధించేదెలా? .. యండమూరి వీరేంద్రనాథ్ సూచనలు!



విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్‌ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే వాస్తవ సమస్యలేమిటి? వాటిని తొలగించే ఆచరణాత్మక సూచనలేమిటి? 

ప్రసిద్ధ రచయితా, వ్యక్తిత్వ వికాస నిపుణుడూ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం!


విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం!
ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది.

పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్‌ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.

తెలివీ... మార్కులూ
తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడైవుండొచ్చు.

గణితం, అకౌంట్స్‌ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్‌ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.

వాయిదా పద్ధతుంది...
చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. ఈ academic procrastinators 'సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా'మంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి!

ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:

* ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండండి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోండి.

* విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్‌ ర్యాంకర్‌ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే I am proud of youభావంతో!

* ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టండి (గ్రూప్స్‌, సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు).

ఆహ్లాదకర వాతావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...

కళ్ళు: టేబుల్‌ లైట్‌ కింద చదవండి. ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండండి.

సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. నా అనుభవంలో సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్‌)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.

ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్‌ ఫూడ్‌, చికెన్‌ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్‌ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి.

ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోండి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.

వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించండి. అమితాబ్‌, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్‌నూ, పైథాగరస్‌నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!


యాబైశాతం సన్నద్ధత
మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే!
* స్టడీ టేబుల్‌/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి. కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.

* రాత్రివేళ మీ రీడింగ్‌ టేబుల్‌ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది.

* చదివేటపుడు గది తలుపులు మూసివేయండి. ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టండి. తాజా గాలి పీల్చుకుని, గదిలోనే పచార్లు చేయండి... చదవటమే ఈ పచార్లకంటే మెరుగనిపించేదాకా!

* ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్‌ డీటెయిల్డ్‌ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది. చదవటం విసుగనిపిస్తే రాయండి. లేకపోతే గణితం సాధన చేయండి. రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.

* కష్టమైన కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్‌ సూత్రాలూ గోడమీద అంటించుకోండి. (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి). వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయండి. విశ్రాంతి తీసుకోవటానికి (రిలాక్స్‌) మ్యాపులను పరిశీలించటం ఓ చక్కని చిట్కా.

* ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్‌ లేకుండా, చదివే పోర్షన్‌ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోండి.

* విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.

* కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోండి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు.

* గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోండి. పోచుకోలు కబుర్లకు అవకాశమున్న కంబైన్డ్‌ స్టడీ అంత ఉపయోగకరం కాదు.

* ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టొద్దు. ఐదు నిమిషాల విరామం ఇవ్వండి. దీన్ని 'మైండ్‌ హాలీడే' అంటారు.

* సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు.

* ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. సెలవు రోజు కూడా. సెలవులకు మీ తాతగారి వూరికి వెళ్ళినపుడు కూడా. కనీసం అరగంటైనా చదవాలి. ఇలా చేస్తే చదవటం మీ అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.


ఏం చదివినా గుర్తుండటం లేదా? 
సమయం సరిపోదు.. ఎందుకని? 
ఏకాగ్రత కుదరటం లేదా? ...

www.eenadu.net లో చదువు విభాగం  చూడండి.

Monday, 17 December 2012

మార్పులకు తగ్గ వ్యూహం!


గ్రూప్‌-2 కార్యనిర్వాహక పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగార్థులకు కొత్త సవాలు ఎదురయింది. రెండు పరీక్షలు రాయాల్సిరావటమే కాదు; ప్రధాన పరీక్ష లక్ష్యాత్మక (ఆబ్జెక్టివ్‌) పద్ధతి నుంచి వివరణాత్మక (డిస్క్రిప్టివ్‌) విధానంలోకి మారిపోయింది. ఈ మార్పులకు తగిన వ్యూహం రూపొందించుకోవటం తక్షణ కర్తవ్యం!
ప్పటివరకూ గ్రూప్‌-1 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్‌-1 (ఎ)గా; గ్రూప్‌-2 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్‌-1 (బి)గా మారుస్తున్నట్లు (జీవో ఎంఎస్‌ నంబర్‌ 622) ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రూప్‌-1 రాతపరీక్ష ద్వారా ఎంపిక జరిగే ఉద్యోగాల పరిధి బాగా విస్తృతమయింది. కానీ ఇప్పటివరకూ గ్రూప్‌-2పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు డీలా పడ్డారు.మారిన పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధత వ్యూహాన్ని మార్చుకోవాలంటే ఈ పరీక్షల స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి.ఏ రకమైన డిగ్రీ అయినా శ్రేణి, శాతంతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులైతే దరఖాస్తుకు అర్హులే.

కొత్త అభ్యర్థులు
గత పరీక్షానుభవం లేకపోయినా కొత్త అభ్యర్థులు ప్రతి నోటిఫికేషన్లోనూ భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. 2008, 2011 నోటిఫికేషన్లలో తొలిసారే పరీక్ష రాసినప్పటికీ 50 శాతానికి పైగా ఉద్యోగాలను వారే సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరీక్షా విధానం, మారుతున్న ప్రశ్నల ధోరణి సీనియర్‌, జూనియర్‌ల మధ్య పెద్ద తేడాను సృష్టించటం లేదు. అందువల్ల కొత్త అభ్యర్థులు సైతం గ్రూప్‌-1 ఉద్యోగానికి ధీమాగా ప్రయత్నించొచ్చు.
* సన్నద్ధత సమయంలో 2/3 వంతు సమయాన్ని ప్రిలిమినరీకి కేటాయించాలి. పరీక్షకు నెలరోజుల ముందునుంచీ 100 శాతం సమయం ప్రిలిమినరీకి కేటాయించాలి.

* ఇప్పుడే ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే మిగిలిన 1/3 వంతు సమయాన్ని మెయిన్స్‌లో కనీసం 3 పేపర్లకు కేటాయించాలి.

* 'ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌ సన్నద్ధత' ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా అనుసరణీయం.

* బీటెక్‌/ గణిత నేపథ్యం ఉన్నవారు పేపర్‌-1,2,3,4 లను ఇప్పటినుంచే ప్రిలిమినరీతో కలిపి చదవటం మంచిది.

* ఆర్ట్స్‌ నేపథ్యమున్న అభ్యర్థులు పేపర్‌-1,4,5లపై బాగా దృష్టి పెట్టవచ్చు.

* ముఖ్యంగా వ్యాసరచన (పేపర్‌-1) కృషిని ఇప్పటినుంచే మొదలుపెడితే మిగిలిన పేపర్లలో వ్యాస సంబంధిత అంశాలను ఎలా అనుసంధానించుకోవచ్చో అర్థమవుతుంది. ఫలితంగా గ్రూప్‌-1 స్థాయికి తగిన భావనల పునాది ఏర్పడి 250-300/750 మార్కులకు సిద్ధమైనట్లే!

గ్రూప్‌-2 నుంచి గ్రూప్‌-1కి మారేందుకు మెలకువలు
* గ్రూప్‌-2 ప్రిపరేషన్లో భాగంగా జనరల్‌స్టడీస్‌ (పేపర్‌-1) చదివేవుంటారు కాబట్టి ప్రస్తుతం ప్రిలిమినరీ గురించి ఆలోచించవద్దు. ఈ పరీక్షకు 45 రోజుల ముందునుంచి చదివితే సరిపోతుంది.

* ప్రస్తుత సమయాన్ని మెయిన్స్‌ సన్నద్ధతకు వినియోగించండి.

* ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనిస్తే ప్రిపరేషన్‌ని ఎలా కొనసాగించాలో దిశానిర్దేశం ఏర్పడుతుంది. అందుకే 2008, 2011, 2012 సంవత్సరాల ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలించండి.

* మెయిన్స్‌ 2,3,4 పేపర్లలోని ఒక మార్కు ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన (2,3,4 మార్కుల) ప్రశ్నలను గ్రూప్‌-2 స్థాయిలో తయారైన అంశాల ద్వారా ఎదుర్కోవచ్చు. ఇలాంటి వ్యూహంతో విజయానికి కావాల్సిన 65 శాతంలో 30 శాతం మార్కులు సాధించవచ్చని గమనించాలి.
ఉదా:
1. భారతదేశ దేవాలయ నిర్మాణ శైలికి ఉదాహరణలు?
2. భారతదేశ ఎన్నికల సంఘ అధికారాలు, విధులు?
3. సంస్కరణల అమలు అనంతరం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల సాపేక్ష వాటాలు
4. ఏపీ చిన్నతరహా పరిశ్రమల సమస్యలు
5. టెలి మెడిసిన్‌ అంటే?
6. కార్డోశాట్‌-2 రిజల్యూషన్‌ ఎంత?
7. అణుశక్తి నిర్వచనం
8. సామాజిక అడవులు- ఉపయోగం

* మెయిన్స్‌లో అనేక ప్రశ్నలకు సరైన జవాబులు రాయాలంటే ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) తెలిసుండాలి. వీటిపై పట్టున్న అభ్యర్థులే గతంలో కూడా రాణించారు. ఇప్పటివరకూ గ్రూప్‌-2 కోసం సిద్ధమైన ప్రాథమికాంశాలు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి.

గ్రూప్‌-1 సీనియర్‌ అభ్యర్థులు
* గతంలో కూడా చాలామంది సీనియర్‌ అభ్యర్థులు ప్రిలిమినరీ కూడా పాసవని సందర్భాలున్నాయి. గ్రూప్‌-2 వారు 'ప్రాక్టీస్‌' కోసం ప్రిలిమినరీ రాయటం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం. గత గ్రూప్‌-2 అభ్యర్థులు ఇప్పుడు శ్రద్ధగా గ్రూప్‌-1 రాస్తారు కాబట్టి ప్రిలిమినరీ గట్టెక్కటం మరింత క్లిష్టంగా మారనుంది. అందుకు తగిన రీతిలో సిద్ధపడాలి.

* మెయిన్స్‌లో చేసిన తప్పిదాలను గతానుభవాలతో సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వస్తోంది. ప్రిలిమినరీకి రోజూ 2 గంటల సమయం కేటాయించి మెయిన్స్‌పై శ్రద్ధ పెట్టండి.

గ్రూప్‌-1 ఉద్యోగార్థులందరికీ...
* ప్రతిరోజూ వార్తాపత్రికల అధ్యయనం గ్రూప్‌-1లో రాణించేందుకు బాగా ఉపయోగపడుతుంది. 2012 గ్రూప్‌-1లో దినపత్రికల అధ్యయనం ద్వారా దాదాపు 280 మార్కులకు జవాబులు రాయగల్గిన పరిస్థితి ఏర్పడింది.

* సమాధానాలను సంక్షిప్తీకరించటం/ విపులీకరించటం చేయగల సామర్థ్యాలున్నవారు ఎగ్జామినర్లను మెప్పించగలుగుతున్నారు. తద్వారా ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారు.

* ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి సమయం కేటాయింపు ఉండాలి. పేపర్‌-2,3,4లలో సమయం చాలని సమస్య ఎదురవుతోంది. వీలైనన్ని నమూనా ప్రశ్నలను సమయ నియంత్రణతో రాయటం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి.

* చాలామంది జిరాక్స్‌ నోట్సులూ, కోచింగ్‌ నోట్సులూ బట్టీ పడుతున్నారు. ప్రశ్న తీరు మారగానే జవాబు రాయలేకపోతున్నారు. సిలబస్‌లో ప్రతి అంశాన్నీ సమాజానికి అన్వయించటం, దాన్ని సమాధానంలో పొందుపర్చటం ముఖ్యం.

* ఒక పేపర్‌ ముఖ్యం, మరోటి అంత ముఖ్యం కాదు- ఇలాంటి భావనలు పెంచుకోకుండా అన్ని పేపర్లలోనూ సగటు మార్కుల కంటే కనీసం 5 మార్కులు (ఒక్కో పేపర్‌లో) తెచ్చుకుంటే విజయం తథ్యం!


స్త్థెర్యంతో సాగాలి

గ్రూప్‌-2 పరీక్షకు మాత్రమే సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్‌-1 అభ్యర్థులతో సమానంగా పోటీపడలేమనీ, గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులన్నీ గ్రూప్‌-1 అభ్యర్థులే దక్కించుకుంటారనీ భయపడుతున్నారు. ఇది వాస్తవమే. కానీ పరీక్షకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా తయారై, గ్రూప్‌-1 పోస్టులనే సాధించగలమనే స్త్థెర్యంతో ముందుకు సాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గ్రూప్‌-2 అభ్యర్థులంతా పరీక్షా పద్ధతి ఎలా ఉన్నా ముందుగా పాత పద్ధతిలోని మూడు పేపర్లకు సంబంధించిన సబ్జెక్టులన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీంతో వారు గ్రూప్‌-2 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షను విజయవంతంగా రాయగలుగుతారు. ఆ తర్వాత ఇదే ప్రిపరేషన్‌తో సాధించిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ, క్రమం తప్పకుండా రాయటం సాధన చేస్తే గ్రూప్‌-1 (ఎ) పోస్టు గానీ, గ్రూప్‌-1 (బి) పోస్టు గానీ సాధించే వీలుంటుంది.

వెయ్యి పోస్టులు
ఏపీపీఎస్‌సీ గత నోటిఫికేషన్లను గమనిస్తే గ్రూప్‌-1 పోస్టులు 300 ఉంటే గ్రూప్‌-2 కార్యనిర్వాహక పోస్టులు 600కు పైగా ఉంటాయి. అంటే ఒకేసారి, ఒకే పరీక్ష ద్వారా దాదాపు వెయ్యి పోస్టులకు పోటీ పడే అవకాశం! సరైన పంథాలో సిద్ధమైతే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు.

అంతే కాకుండా గ్రూప్‌-2 ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపితే గ్రూప్‌-1 పోస్టు పొందే అవకాశమూ ఉంటుంది. అంటే ఆశించినదానికంటే ఎన్నో రెట్లు అధిక ఫలితం సాధించే వీలు!


గ్రూప్‌-1 సన్నద్ధత అంటే ఆల్‌ఇన్‌వన్‌
ప్రణాళికాబద్ధంగా గ్రూప్‌-1 పరీక్షకు సన్నద్ధమైతే ఆల్‌ ఇన్‌ వన్‌ లాగా గ్రూప్‌-1 (ఎ), గ్రూప్‌-1 (బి), గ్రూప్‌-2 పరీక్షలన్నిటికీ సిద్ధమవుతున్నట్లే! ఎందుకంటే- ఇప్పుడు మార్చిన పద్ధతి ప్రకారం గ్రూప్‌-2 పరీక్ష నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లోని మూడు పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌ మొత్తం గ్రూప్‌-1 (ఎ), (బి) పరీక్షకు సంబంధించిన మెయిన్‌ పరీక్షలో ఉంటుంది. అందుకే సిలబస్‌లోని సబ్జెక్టులను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర, భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలపై పట్టు సాధించవలసిందే!

మెయిన్‌ పరీక్షలో 15 ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలను మూడు గంటల్లో రాయాల్సివుంటుంది. అందుకని ఇప్పటినుంచే రాయటం సాధన చేయాల్సివుంటుంది. గంటకు వెయ్యి పదాల చొప్పున 3 గంటల్లో 3,000 పదాలు రాయాలి.పద్ధతి కొత్తదైనా, పాతదైనా సాగించాల్సిన ప్రిపరేషన్‌ తీరు ఒకటే. పటిష్ఠమైన ప్రణాళిక, పట్టుదల, కృషి. వీటికి ఆత్మస్త్థెర్యం, ఉత్తమ మార్గదర్శకత్వం తోడైతే లక్ష్యం నెరవేరటంలో సందేహమే ఉండదు.

Tuesday, 28 February 2012

గ్రూప్ -2 ఇంటర్వ్యూ కిటుకులు



గ్రూప్‌-2 రాతపరీక్షలో మెరిసిన అభ్యర్థులు మరో అంచెను విజయవంతంగా దాటితే ఉద్యోగం సాధించినట్టే! కీలకమైన ఇంటర్వ్యూ దశలో ప్రతిభావంతంగా నెగ్గటానికి ఏయే అంశాలు గమనించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏపీపీఎస్సీ తన నిర్వహణ శైలిలో చేపట్టిన సంస్కరణలు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ ప్రక్రియ) లో కూడా ప్రతిఫలిస్తున్నాయి. పక్షపాత రహిత, వ్యక్తిత్వ పరిశీలన ప్రధాన లక్ష్యాలుగా ఇంటర్వ్యూ అసలైన స్ఫూర్తి ఇప్పుడు కన్పిస్తోందని చాలామంది అభ్యర్థుల భావన. ఇటీవల జరిగిన గ్రూప్‌-1, ఎ.ఎం.వి.ఐ. మొదలైన ఇంటర్వ్యూలన్నింటిలోనూ ప్రదర్శితమైన ఈ ధోరణిని బట్టి గ్రూప్‌-2 ఇంటర్వ్యూల సరళి కూడా అదే విధంగా ఉండవచ్చు.

A.నూతనత్వం ఏమిటి?
అభ్యర్థుల నుంచి పొందిన సమాచారం మేరకు... గతంలో అభ్యర్థికి సంబంధించిన మొత్తం సమాచారం (ప్రాంతం, కులం, మతం, చేస్తున్న ఉద్యోగం, విద్యార్హతలు మొదలైనవి) ముందుగానే బోర్డు సభ్యులకు చేరేవి. అందువల్ల ఆ బయోడేటా అంశాల ఆధారంగా ఇంటర్వ్యూ జరిగేది.

ఇప్పటి పద్ధతిలో అభ్యర్థి పేరు, చిరునామా, విద్యార్హత తప్ప మిగతా సమాచారం ఏదీ చేరడం లేదు. ఏపీపీఎస్సీ నిష్పాక్షికంగా వ్యవహరించేందుకు ఇలా చేస్తోందని తెలుస్తోంది.



B. ఎదుర్కోవడం ఎలా? గరిష్ఠ మార్కులు సాధ్యమేనా?
బయోడేటా బలంగా నిర్మించండి
బోర్డు వద్ద ఎలాంటి ముందస్తు సమాచారం ఉండటం లేదు కాబట్టి, తప్పనిసరిగా అభ్యర్థిని 'అడిగి' తెలుసుకున్న సమాచారం కీలకంగా మారింది. అందువల్ల 'మీ గురించి చెప్పండి?' అనే ప్రశ్న అనివార్యం.

ఈ ప్రశ్న అడిగినపుడు ఎలాంటివి ప్రస్తావించాలి? కుటుంబం గురించీ, విద్య, ప్రొఫెషనల్‌ కెరియర్‌ గురించీ ఏం చెప్పాలి... ఇలాంటివాటికి స్పష్టంగా సిద్ధమైతే మొదటి అంశం ముగిసినట్లే! మీ పైన మీకు స్పష్టత ఉందనే అభిప్రాయానికి బోర్డు వస్తే చాలు. నోకియా, ఫిన్‌లాండ్‌లో ఉన్నతోద్యోగిగా ఉంటూ నెలకు రెండున్నర లక్షల రూపాయలు సంపాదించే శిరీష డీఎస్పీగా ఎంపికవడంలో ఇలాంటి బయోడేటా నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. 'సినీ డైరెక్టర్‌' డీఎస్పీగా మార్పు చెందడం కూడా ఈ అవగాహనకి సంబంధించినదే.

సామాజిక పునాదుల 'బలం'
ఆప్షనల్‌ సబ్జెక్టు ఉన్న ఇంటర్వ్యూలు తప్ప మిగతా అన్నింట్లోనూ అభ్యర్థి లోతును పరిశీలిస్తారు. అందుకే సామాజిక పునాదులైన 'వర్ణ వ్యవస్థ', 'మను ధర్మశాస్త్రం' 'ఫండమెంటలిజం' మొదలైన అంశాలే ప్రశ్నలుగా దూసుకొస్తున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా గత నలభై ఏళ్లలో పాశ్చాత్యీకరణ ప్రభావం, డేటింగ్‌, సహజీవనం, సరగొసీ, వివాహేతర సంబంధాలు లాంటివన్నీ కూడా ఇంటర్వ్యూ అంశాలుగా మారాయి. వీటికోసం 'షార్ట్‌ ఆన్సర్స్‌'తో సిద్ధమైతే చాలు.

ముఖ్యంగా మహిళా, మైనార్టీ, దళిత అభ్యర్థులను ఆ వర్గాల స్థితిగతులపై ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి అంశాలపై స్పందించాలంటే సామాజిక పునాదుల అవగాహన అనివార్యం.

వర్తమానాంశాలే వర్త్‌ఫుల్‌...
ప్రతి ఇంటర్వ్యూలో కూడా 'వర్తమానా'న్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం, జిల్లాస్థాయి ప్రశ్నలు వస్తున్నాయి. ఇరాన్‌, సిరియా, మధ్యాసియా, పాకిస్థాన్‌, అమెరికా, జర్మనీ, చైనా మొదలైన దేశాల్లో జరుగుతున్న పరిణామాల గురించి సాధారణ అవగాహన అయినా ఉండాలి.

2జీ, ఎమ్మార్‌, లోక్‌పాల్‌, ఎన్‌.సి.టి.సి., ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆహార భద్రత, ప్రియాంక గాంధీ, రాహుల్‌ రాజకీయ భవితవ్యం, కాగ్‌, సుప్రీంకోర్టు క్రియాశీలత, జాతీయ సమైక్యత లాంటి అంశాలపై పట్టు అవసరం. గనుల కుంభకోణం, పారా సిండికేట్లు, ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, క్రాప్‌ హాలీడే, పార్టీ ఫిరాయింపులు, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు, ఉపఎన్నికలు, ఏపీ బడ్జెట్‌... (ఇటీవల జరిగిన ఎ.ఎం.వి.ఐ. ఇంటర్వ్యూలో కూడా రవాణా శాఖకు కేటాయించిన బడ్జెట్‌ అంశాలపై ప్రశ్నలు అడిగారు).

సూచన: జిల్లా స్థాయి ప్రశ్నలకు అవకాశం ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాకి సంబంధించిన వర్తమానాంశాలను చదవాలి.



తులనాత్మక పరిశీలన
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలు అన్నింట్లోనూ తులనాత్మక (comparative) సమాధానాలకు ప్రాధాన్యమిచ్చారు.
* భారత ప్రధానులలో మీకు బాగా నచ్చిన వారెవరు? ఎందుకు?
* నెహ్రూ, ఇందిరల మధ్య తేడా ఏమిటి?
* కాంగ్రెస్‌, కాంగ్రెసేతర పాలనలలో ప్రధాన భేదాలు ఏమిటి?
* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులలో నచ్చినది ఎవరు? ఎందుకు?
* ఎన్టీ రామారావు పాలనలో నచ్చినది/ నచ్చనిది ఏమిటి?
* ప్రస్తుత ముఖ్యమంత్రులలో మోడల్‌ సీఎం ఎవరు?
* మన్మోహన్‌సింగ్‌ని తొలగించాల్సివస్తే ప్రత్యామ్నాయం ఎవరు?
* తదుపరి రాష్ట్రపతిగా ఎవరుంటే బాగుంటుంది?

శరీర భంగిమ, కదలికలు... ఎదుట ఉన్నవారికి ఒక అభిప్రాయం ఏర్పరుస్తాయి. 'ప్రవేశించే దశ' నుంచి  నిష్క్రమించే దశ' వరకు ప్రతి దశలోనూ శరీరపు కదలికలుంటాయి. వాటిలో వృథా కదలికలు చాలా ఉండవచ్చు. వాటిని తగ్గించాలి. 'అనుకూలత'ను అందించే కదలికలు పెంచాలి. బిగుసుకుపోయి కూర్చునే స్థితి నుంచి, ఆహ్లాదం కలిగించే దిశలో కదలికలు ఉండటం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు.

ముఖ్యంగా ముఖకవళికల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఇలాంటివన్నీ సాధన ద్వారా వస్తాయి కాబట్టి ఇంటర్వ్యూ సన్నద్ధతలో భాగంగా ఈ అంశాలపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడు గరిష్ఠ మార్కులు వాటంతట అవే వస్తాయి.


C.సమాధానాల్లో ఉండాల్సినవి
* సూటిగా సమాధానాలు చెప్పాలి. వ్యాసాల్లో మాదిరిగా ఉపోద్ఘాతాలు లాంటివి వద్దు.
* గణాంక సమాచారం గుప్పించవద్దు. ఇంటర్వ్యూ అనగానే ముఖ్యంగా ఆర్థిక గణాంకాల కోసం పరిగెడ్తున్నారు. కేవలం స్థూల సమాచారం ఉంటే చాలు.
* ప్రముఖుల వ్యాఖ్యానాలు, విధానాలను కోట్‌ చేయదల్చుకుంటే ఆ ప్రముఖుని గురించి ముందుగానే సమాచారం సంపాదించుకోవాలి.
* సుదీర్ఘ వచనాలు వద్దు. వాడుక పదాలు వాడుతూ భావవ్యక్తీకరణ జరిగేలా చూసుకుంటే చాలు.
* సామెతలు, నానుడులూ వాడితే మంచిదే కానీ, అలా చేసేటపుడు వాటిపై పట్టు ఉండటం మంచిది.

- కొడాలి భవానీ శంకర్

Monday, 23 January 2012

పక్కాగా సిద్ధమైతే ప్రభుత్వ కొలువులు!



క్షలమంది పోటీ పడే గ్రూప్‌-4 పోస్టుల నియామకానికి ఏపీపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తులకైనా, పరీక్షకైనా సమయం ఉంది. అలా అని ప్రిపరేషన్‌ ప్రారంభించటంలో తాత్సారం చేయకూడదు.

'సర్కారీ కొలువు సాధించాల్సిందే' అనే దృఢ సంకల్పం ఉంటే వెంటనే ముందడుగు వేయండి.

మీ లక్ష్యసాధనకు ఉపకరించే విలువైన సూచనలు అందిస్తున్నవారు కొడాలి భవానీ శంకర్.

మొత్తం 2146 పోస్టులకు గ్రూప్‌-4 ప్రకటన వెలువడింది. దరఖాస్తుల ప్రక్రియ మే నెల చివర్లో, రాతపరీక్ష ఆగస్టు 11న! సమగ్ర ప్రిపరేషన్‌కు నాందీ ప్రస్తావన చేయాల్సిన సమయమిదే. అప్పుడే విజయానికి అవకాశాలు పెరుగుతాయి.

ప్రస్తుత గ్రూప్‌-4 పోస్టుల్లో 'హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌' పోస్టుకు మాత్రం డిగ్రీ + బీఎడ్‌ కనీస అర్హతగా ఉంది. మిగతా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ అర్హత. పదో తరగతి అర్హత కలిగిన పోస్టులేమీ లేకపోవడం గమనార్హం.

ఖజానా శాఖలో మాత్రం ఇంటర్మీడియట్‌ అర్హతే కాకుండా సర్టిఫికెట్‌ కోర్సు- ఆఫీస్‌ ఆటోమేషన్‌- పీసీ మెయింటెనెన్స్‌- వెబ్‌ డిజైనింగ్‌ కూడా అడిగారు. ఇక్కడ గమనించాల్సిన సూచన ఏమిటంటే... బీసీఏ, బీఎస్‌సీ (కంప్యూటర్స్‌), బీకాం (కంప్యూటర్స్‌), బీటెక్‌/బీఈ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) అర్హతలు కలిగినవారికి పైన చెప్పిన సాంకేతిక అర్హతలకు మినహాయింపు ఉంటుంది. మిగతా శాఖల్లోని గ్రూప్‌-4 ఉద్యోగాలకు అర్హత ఇంటర్మీడియట్‌.

తమ అర్హతలు ప్రామాణికంగా అభ్యర్థులు పోస్టులను ఎంపిక చేసుకుని కృషి చేయటం మంచిది.
1) జూనియర్‌ అసిస్టెంట్స్‌: పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌, 150 మార్కులు/ప్రశ్నలు పేపర్‌-2 సెక్రటేరియల్‌ ఎబిలిటీ, 150 మార్కులు/ప్రశ్నలు
2) హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌: పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌, 150 మార్కులు/ప్రశ్నలు పేపర్‌-2 బి.ఇడి అంశాలు, 150 మార్కులు/ ప్రశ్నలు



జూనియర్‌ అసిస్టెంట్స్‌
పేపర్‌-1: జనరల్‌స్టడీస్‌
అర్హత పరీక్ష ఇంటర్మీడియట్‌ అయినప్పటికీ గత గ్రూప్‌-4 పరీక్షలో జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, చరిత్ర లాంటి అంశాల నుంచి వచ్చిన ప్రశ్నల స్థాయి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంది. ఈ కారణం వల్లనే పదో తరగతి స్థాయి వరకూ మాత్రమే చదివిన అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. అందుకని ప్రస్తుతం పోటీ పడేందుకు పాఠశాల స్థాయి పుస్తకాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఇతర గ్రూప్‌ పరీక్షలకు తయారయ్యే స్థాయిలో జనరల్‌స్టడీస్‌ను చదవటం మంచిది. ఈ అంశాలతో పాటు కింది అంశాలు కూడా ముఖ్యమే.

* Factఆధారిత ప్రశ్నలు గతంలో ఎక్కువగా వచ్చాయి. రేపటి పరీక్షలో కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. అందుకే నామమాత్రంగా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తూ జ్ఞాపకశక్తిపై ఆధారపడే సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.
* పాఠ్యాంశ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ అవకాశం.
*  ఇటీవల మారిన పాఠ్యపుస్తకాలను దృష్టిలో పెట్టుకోవాలి.

* బిట్లవారీగా చదవకూడదు. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవటమే సరైన విధానం. గ్రామీణ అభ్యర్థులు ప్రశ్నల నిధులపై అధికంగా ఆధారపడుతున్నారు. ఇది సరైన విధానం కాదు.
* గత గ్రూప్‌-4 పరీక్షలో వర్తమాన అంశాలను కొంచెం లోతుగా అడిగారు. అందుకే ఇప్పటినుంచీ సిద్ధమైతేనే మంచి ఫలితాలుంటాయి.
* మార్కెట్లో దొరికే చాలా పుస్తకాల్లో వృథా సమాచారం ఎక్కువ. ప్రభుత్వ ప్రచురణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం మేలు. పాఠ్యపుస్తకాలూ, తెలుగు అకాడమీ పుస్తకాలపై బాగా ఆధారపడినవారికే గ్రూప్‌-2 పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యం.


 


పేపర్‌-2: సెక్రటేరియల్‌ ఎబిలిటీ
సిలబస్‌ అంశాలు- మెంటల్‌ ఎబిలిటీ, సంఖ్యా/అంక గణిత సామర్థ్యం, లాజికల్‌ రీజనింగ్‌, కాంప్రహెన్షన్‌, వాక్యాల పునరమరిక. ఈ పేపర్లలో సాధించే మార్కులే అంతిమ విజయ సాధనలో కీలకం. ముఖ్యంగా పేపర్‌-1లో సీనియారిటీ, బట్టీ, అనుభవం లాంటి అంశాలు కొంతమందికి తోడ్పడి మంచి మార్కులు సాధించేందుకు దోహదం చేయవచ్చు. కానీ పేపర్‌-2లో స్వతహాగా సత్తా లేకుంటే కొంత వెనుకబాటుతనం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ పేపర్‌పై అధిక దృష్టి పెట్టటం ద్వారా మెరుగైన మార్కులను సాధించవచ్చు.

* సాధన ముఖ్యం.
* అంకగణిత సమస్యల విషయంలో షార్ట్‌కట్స్‌ వల్ల సమయం సద్వినియోగమవటమే కాకుండా కచ్చితత్వం పెరుగుతుంది.
* లాజికల్‌ రీజనింగ్‌లో ఇండక్షన్‌, డిడక్షన్‌, అబ్‌డక్షన్‌ ప్రక్రియలను సమర్థంగా వినియోగిస్తే కచ్చితమైన సమాధానాలు గుర్తించవచ్చు.
* కాంప్రహెన్షన్‌, వాక్యాల పునరమరికలపై సమయం కొద్దిగా వెచ్చిస్తే చాలు.
* బ్యాంకు పీఓ స్థాయిలో లోతైన ప్రశ్నలు ఉండవు కాబట్టి సాధారణ స్థాయిలోనే చదివితే సరిపోతుంది.
ఇంటర్మీడియట్‌ సిలబస్‌తో వీఆర్‌ఓకి సిద్ధమవుతున్నవారు, గ్రూప్‌-4లో 1335 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని గుర్తించాలి. సిలబస్‌ తేడాలు గుర్తించి మరో 6 నెలలు కష్టపడితే ఫలితం రావొచ్చు.




ఉద్యోగార్థులూ... మీ కోసమే!

పీపీఎస్ సీ  నుంచి వరసగా ఉద్యోగ నియామక  ప్రకటనలు వెలువడ్డాయి కదా?

ఏ అర్హతలున్నవారు ఏ పోస్టులకు సిద్ధం కావొచ్చు,  దరఖాస్తులకు  గడువు ఎప్పుడు ముగుస్తుంది...  మొదలైన ముఖ్యాంశాలన్నిటినీ  ఒకే చోట చూద్దాం!


Thursday, 12 January 2012

ఏపీపీఎస్ సీ రాతపరీక్షలు జరిగిన నెలలోపే ఫలితాలు !



హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

    ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు జరిగాక.. త్వరితగతిన ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు.

మౌఖిక పరీక్షలు అవసరంలేని ఉద్యోగాలకు (గ్రూప్‌-2 ఇతర) రాత పరీక్షలు నిర్వహించిన నెలలోపే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. మిగిలిన వాటికి (గ్రూప్‌-1 ఇతర) రాత పరీక్షలు జరిగిన వారానికే ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. రాత పరీక్ష ఫలితాలను మాత్రం ఇంటర్వ్యూ తేదీలకు 20 రోజుల ముందు ప్రకటిస్తామన్నారు.

ఉద్యోగ ప్రకటనల విడుదల పరంపరంలో భాగంగా పూనం మాలకొండయ్య బుధవారం 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇవీ..

* ఇప్పటివరకు వివిధ శాఖల్లో 9,505 ఉద్యోగాల భర్తీకి 40 ప్రకటనలు జారీచేశాం. ఇంకా కొన్నింటిని వెలువరించాల్సి ఉంది. జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగే 40 రాత పరీక్షల తేదీలను ప్రకటించాం. దాదాపు ప్రతి ఆదివారం పరీక్షలు జరగనున్నాయి. చిన్న చిన్న పరీక్షలను హైదరాబాదులోనే నిర్వహిస్తున్నాం. మిగిలిన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికచేసిన పట్టణాలు, నగరాల్లో జరుపుతాం.

* మూడు వేల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్షలకు సంబంధించిన మౌఖిక పరీక్షల నిర్వహణ వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం గ్రూపు-1 మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరం మూడువేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశాం.

* ఇంకా మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు జారీచేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల ఖాళీలపై సమాచారం అందాల్సి ఉంది. 207 ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి స్త్రీ శిశు సంక్షేమశాఖ తరఫున ప్రకటన ఇవ్వనున్నాం. ఇదే శాఖలో జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్స్‌, బిల్లు కలెక్టర్‌, ఇతర హోదాలో 372 పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది. విద్యాశాఖకు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ తరఫున 24 జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల భర్తీ గురించిన సమాచారం అందింది. జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల ఖాళీలు కూడా అందితే వీటి కోసం ఒకే రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. కళాశాల విద్యాశాఖ తరపున 21 గ్రంథ పాలకులు, 37 వ్యాయామ అధ్యాపకుల భర్తీకి ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇవికాకుండా రవాణా శాఖలో మరో 37 ఏఎంఐవీ పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం వచ్చింది. మున్సిపల్‌ శాఖలో ఏఈఈ పోస్టులు, ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టుల భర్తీకి సమాచారం రానుంది. వీటిపై స్పష్టత వచ్చాక ప్రకటనలు జారీచేస్తాం.

* మౌఖిక పరీక్షలు అవసరం లేని వాటికి రాత పరీక్షల ద్వారానే నియామకాలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫలితాలను నెలలోపు వెల్లడిస్తాం. ప్రతిభ ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను సంబంధిత శాఖలకు వెంటనే పంపుతాం. ఇక మౌఖిక పరీక్షలు అవసరమైన ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక పద్ధతిని పాటిస్తున్నాం. పరీక్షలు జరిగిన వారంలోగా మౌఖిక పరీక్షల తేదీలను ప్రకటిస్తాం. ఈ తేదీలకు 20 రోజుల ముందు రాతపరీక్షల ఫలితాలు వెల్లడిస్తాం. ఏపీపీఎస్సీలో తీసుకురావల్సిన మరికొన్ని సంస్కరణలపై అధ్యయనం చేయటానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది.

* గ్రూప్‌-1 మాదిరిగానే గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీలోనూ ప్రాథమిక, ప్రధాన పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. అయితే దీన్ని ఎప్పట్నుంచి అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పరీక్షల సిలబస్‌లో ఎలాంటి మార్పూ ఉండదు. ప్రస్తుత సిలబస్‌ను అనుసరించే ప్రశ్నలుంటాయి. అభ్యర్థులపై అదనపు భారం పడదు.

* కిందటేడాది జరిగిన జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల రాతపరీక్షలో తెలుగులో ప్రశ్నలు లేకపోవడంపై ఏర్పాటుచేసిన కమిటీ దానిపై అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. నివేదిక వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. మౌఖిక పరీక్షల నిర్వహణకు ముందుగానే దీనిపై స్పష్టత వస్తుంది.

* ఏదేని ఉద్యోగ రాతపరీక్ష జరిగే సమయానికి నెల ముందు వరకు జరిగిన సంఘటనలు, అంశాలపై ప్రశ్నలు రావచ్చు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

* ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలను తగ్గించిన నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రాయగలిగిన కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహిస్తాం. దీంతో కేంద్రాల సంఖ్య తగ్గుతుంది. పర్యవేక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

* ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు జారీచేసినందున నియామకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం తీసుకోవటం అనివార్యంగా మారింది. గతంలో కన్నా సాధ్యమైనంతమేరకు ముందుగానే నియామకాల ప్రక్రియను పూర్తిచేయగలమని ఆశిస్తున్నాం. క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు అందిస్తే ప్రకటన జారీచేసిన 3-6 నెలల్లోగానే నియామకాల ప్రక్రియను పూర్తిచేయటానికి వీలుంటుంది. గ్రూపు-1 వంటివి మినహా మిగిలిన పోస్టులను త్వరితగతిలో పూర్తిచేయడానికి అవకాశముంటుంది.

* ప్రస్తుతం శాఖాపరమైన పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు ముద్రిస్తున్న 'ఉద్యోగ సమాచారం' పుస్తకాన్ని అభ్యర్థులకు మరింత అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. గ్రామీణ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులు పంపే విధానం దగ్గర్నుంచి ఉద్యోగ ప్రకటనలపై సందేహాల నివృత్తి వరకు పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా చూస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి దీనిని తీసుకురావాలని కృషిచేస్తున్నాం.

* అభ్యర్థులు బ్యాంకులో చలానా కట్టి మరోచోటు నుంచి దరఖాస్తులు పంపే విధానంలో మార్పులు తేవాలని అనుకుంటున్నాం. ఈ-సేవా, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారానే నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పంపే విధానంపై ఆలోచిస్తున్నాం. దీనివల్ల అభ్యర్థులకు వ్యయప్రయాసలు తప్పుతాయి. పూర్తి వివరాలతో దరఖాస్తులను పంపడం సులభతరమవుతుంది.

Monday, 9 January 2012

సివిల్స్‌తో పాటే గ్రూప్‌-1... సరైన వ్యూహమేనా?

ద్యోగ నియామక పరీక్షల్లో జాతీయస్థాయిలో అధికారహోదా పరంగా అత్యున్నతమైనవి సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష కోసం కొనసాగించే సన్నద్ధత, కృషి రాష్ట్రస్థాయి ఉత్తమ సర్వీసులైన గ్రూప్‌-1 పరీక్షకు ఎంతమేరకు ఉపయోగం?

ఏపీపీఎస్‌సీ నుంచి నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో సివిల్స్‌ అభ్యర్థులు వాటికి కూడా దరఖాస్తు చేసుకుని, సిద్ధమవటం సరైన నిర్ణయమేనా?

2011 నుంచీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో Decision making అనే కొత్త విభాగం ప్రవేశపెట్టారు. పర్యవసానాలు ఆలోచించి దూరదృష్టితో అభ్యర్థి సరైన నిర్ణయం ఎంచుకుంటాడో లేదో పరిశీలించడం ఈ ప్రశ్నల పరమార్థం.

మన సందర్భం ఇక్కడ పోటీ పరీక్షలు. ఇక్కడ ఇస్తున్న ప్రశ్న గమనించండి. మీ సమాధానం ఏమిటో ఆలోచించండి.

* మీరు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరవుతున్నారు. ఇంతలో ఏపీపీఎస్‌సీ నుంచి గ్రూప్‌-1, గ్రూప్‌-2 మొదలైన నోటిఫికేషన్ల వెల్లువ వచ్చింది. మీరేం చేస్తారు?

ఎ) సివిల్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించి ఇతర పరీక్షలు వేటికీ దరఖాస్తు చేయరు
బి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు.
సి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు. డి) అన్ని పరీక్షలూ రాస్తారు.

ఇలాంటి సమస్యలూ, తీసుకోవాల్సిన నిర్ణయాలూ అభ్యర్థిని వూగిసలాటకు గురిచేస్తుంటాయి. తేల్చుకోవటం తప్పనిసరి అయిన సందర్భాల్లో ఏది అత్యుత్తమ నిర్ణయమవుతుందో, దాన్నెలా విజయవంతంగా అమలు చేయాలో ఒక పట్టాన అర్థం కాదు. విచిత్రమేమిటంటే... నిర్ణయం తీసుకోవటానికి ఒత్తిడి పెరిగినకొద్దీ ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఇలా విలువైన సమయం వృథా అవుతుంది.



పై ప్రశ్నకు సరైన సమాధానం డి. ఉత్తమ నిర్ణయం ఇదే ఎందుకవుతుందో విశ్లేషించటానికి ప్రయత్నిద్దాం.
i) గ్రూప్‌-1, 2, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల సిలబస్‌లో ఒకేరకమైన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే ఒకే ప్రిపరేషన్‌ సివిల్స్‌కూ, గ్రూప్స్‌కూ ఉపయోగపడుతుంది.

ii) సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షలు రెండూ దాదాపు ఒకే సమయంలో జరుగుతాయి. సివిల్స్‌ ప్రిలిమినరీని గ్రూప్‌-1 ప్రిలిమినరీ అనుసరిస్తుంది. అందువల్ల అభ్యర్థి షెడ్యూల్‌ ఏమీ దెబ్బతినదు.

iii) పోటీ పరీక్షలన్నిటిలో 'అదృష్టం' అంశ ఉంటూనే ఉంటుంది. మీరు సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ ఏడాది మీకు అనుకూలించకపోవచ్చు. అందుకే గ్రూప్‌-1, 2 పరీక్షలు రాస్తే మళ్ళీ సివిల్స్‌ రాయటానికి అవసరమైన ఉత్సాహం లభిస్తుంది.

iv) ఈ పరిస్థితిని వూహించండి- ఒక అభ్యర్థి నాలుగేళ్ళపాటు సివిల్స్‌కు దీక్షగా చదివాడు. కానీ విజేత కాలేకపోయాడు. ఈ కాల వ్యవధిలో గ్రూప్‌-1 లాంటి మరే పరీక్ష నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదు. ఇలాంటపుడు ఇంత సుదీర్ఘకాలం వెచ్చించిన ఆ అభ్యర్థిని ఎంతటి నిరాశా నిస్పృహలు కమ్ముకుంటాయో తేలిగ్గానే వూహించవచ్చు.



అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవటం అనుకూలాంశం. పెద్దసంఖ్యలో ఏపీపీఎస్‌సీ పోస్టులను ప్రకటించారు. పైగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పరీక్ష తేదీలను కూడా ముందే ప్రకటించేశారు. ప్రిపరేషన్‌ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించుకునే చక్కని అవకాశం ఏర్పడింది. అందుకే ఇదంతా అరుదైన అవకాశంగా భావించి, సివిల్స్‌ ఆశావహులు గ్రూప్స్‌ పరీక్షలకు కూడా సన్నద్ధం కావటం సమంజసం.

పరీక్షలకు సిద్ధం కావాలనే నిర్ణయం తీసుకున్నాక అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని- సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షల ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసే ప్రయత్నం. ప్రిపరేషన్‌ను ప్రభావశీలంగా మల్చుకోవటానికి కింది చర్యలు అనుసరించటం మేలు.


పాటించాల్సిన వ్యూహం
* సైన్సెస్‌ ప్రాథమికాంశాలను పటిష్ఠ పరుచుకోవాలి (గ్రూప్‌-1 కోసం). వాటిలోని తాజా పరిణామాలపై దృష్టి పెట్టాలి. (సివిల్స్‌ కోసం)
* చరిత్ర, భూగోళ అంశాలను క్షుణ్ణంగా చదవాలి. రెండు పరీక్షలకూ ఇవి ఉపయోగం.
* జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల వర్తమాన ఘటనలను స్థూలంగా అవగాహన చేసుకోవాలి. రెండు పరీక్షలకూ ఇది ప్రయోజనకరం.
* రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన అంశాలూ, ఆర్థిక గణాంకాలను సేకరించి అధ్యయనానికి జోడించుకోవాలి.
* ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.

ఈ మెలకువలన్నీ పాటిస్తే మీ 'ఉమ్మడి' ప్రిపరేషన్‌ సరైన దిశలో కొనసాగుతుంది!

- ‘బ్రెయిన్ ట్రీ’ గోపాలకృష్ణ. 

Tuesday, 3 January 2012

పోటీ పరీక్షల్లో గెలుపు మలుపు... జనరల్‌ స్టడీస్‌

పీపీఎస్ సీ పరీక్ష ఏదైనా తప్పనిసరిగా ఉండే పేపర్ జనరల్ స్టడీస్. దీని ప్రాధాన్యం, దీనికెలా సిద్ధం కావాలో తెలుసుకుందామా?

ఇటీవల జరిగిన డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌, డీఏఓ, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌, ఏఈఈల తుది ఎంపికలో జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌) పేపరే నిర్ణాయకంగా మారింది! గెలుపును అంతిమంగా నిర్దేశించే పేపర్‌ ఇది.

ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఈ పేపర్‌ పెద్ద సమస్యగా, ప్రతిబంధకంగా మారింది. వారు ఇప్పటివరకు జీఎస్‌ ఉన్న పరీక్షలు రాయకపోవడమే దీనికి కారణం. అంతేకాక పదో తరగతి తరవాత జీఎస్‌కు సంబంధించిన ప్రధాన సబ్జెక్టులు (చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ..) తిరిగి ఎక్కడా చదవకపోవటంతో ఈ పేపర్‌ కొత్తగా, కష్టంగా అనిపిస్తుంది.

సాంకేతిక సబ్జెక్టుల్లో కానీ వృత్తిపరమైన సబ్జెక్టుల్లో కానీ, తమ అకడమిక్‌ విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల్లో చాలామంది అభ్యర్థులు మంచి స్కోరు సాధించగలిగారు. కానీ, జీఎస్‌లో సరైన స్కోరు సాధించక విజయానికి దూరమయ్యారు! అందుకే ఈ పేపర్‌పై నిర్లక్ష్యం పనికిరాదు.

జనరల్‌ స్టడీస్‌లోని 150 ప్రశ్నలు బహుళ ఐచ్ఛిక విధానంలో ఉంటాయి. ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల జీఎస్‌ ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే సబ్జెక్టుల పరిధి.. ప్రశ్నల స్థాయి కొంతవరకు తెలుస్తుంది. దాన్ననుసరించి ఆయా సబ్జెక్టులను కొన్నింటిని ఇంటర్‌స్థాయి వరకు, కొన్నింటిని డిగ్రీస్థాయి వరకు చదవాలి. నిత్యజీవితంలో వాటి అనువర్తనాలపై, ప్రాధాన్యతలపై దృష్టి సారించాలి.

భారతదేశ చరిత్ర
భారతదేశ చరిత్రను డిగ్రీ స్థాయిలో చదవాలి. ఇంగ్లిషు మీడియం అభ్యర్థులు ఆంగ్లంలో ప్రామాణిక గ్రంథాలనూ, తెలుగు మీడియం వారు తెలుగు అకాడమీ డిగ్రీ స్థాయి పుస్తకాలనూ చదవాలి. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రించిన 'భారత స్వాతంత్య్ర పోరాటం' వంటివీ అధ్యయనం చేయాలి. ముందు చెప్పినట్లు మొదట ప్రశ్నల స్థాయి తెలుసుకుంటే ఏ స్థాయిలో చదవాలో అర్థమవుతుంది. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రల్లో ఒక్కొక్క టాపిక్‌ నుంచి రాగల ప్రశ్నలను కూడా ఊహించి చదవవలసి ఉంటుంది. ఆంధ్రుల చరిత్ర కూడా ముఖ్యమే. ముందుగా స్కూలు పుస్తకాలు చదివి, ఆపై డిగ్రీ పుస్తకాలు చదివితే పట్టు సాధించవచ్చు.

భూగోళశాస్త్రం

ఇటీవల ఈ పేపర్‌ నుంచి వచ్చిన ప్రశ్నల సరళిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రశ్నలు ఎక్కువగా పటాల అధ్యయనం (మ్యాప్‌ స్టడీ) ఆధారంగా ఉంటున్నాయి. ప్రపంచ పటంలోని వివిధ ఖండాలు, దేశాలు, సముద్రాలు, పర్వతాలు, సరస్సులు మొదలైనవాటి ఉనికిని పరిశీలించి వాటి ఎల్లలపై పట్టు సాధించాలి. భారతదేశ పటంలో కూడా ప్రధాన భూస్వరూపాల విస్తరణ, రాష్ట్రాల సరిహద్దులు, నదీ ప్రవాహాలను- అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను గమనిస్తూ చదవాలి. ఆ తరవాత ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసేప్పుడు ఖండాల, దేశాల ప్రధాన భూస్వరూపాలను, నదులను, వ్యవసాయ పంటలను, ఖనిజ వనరులను, పరిశ్రమలను, ప్రజల జీవన విధానాలను తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే భారతదేశ- ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలను వాటి భౌతిక, ఆర్థిక, సామాజిక కోణాల్లో అధ్యయనం చేయాలి.

కొన్ని ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో కూడా ఉంటాయి. అయితే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు 8- 12వ తరగతివి చాలా ఉపయోగకరం. తెలుగు మీడియం వారు కూడా వీటిని చదివి, ముఖ్యాంశాలను నోట్‌ చేసుకోవడం మేలు. 2001, 2011 జనగణనలపై, దేశంలోని గిరిజన తెగలపై కూడా ప్రశ్నలుంటాయి

జనరల్‌ సైన్స్‌

భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలలోని మౌలిక భావనలపై, మానవ శరీర ధర్మశాస్త్రం, ఆర్థిక వృక్షశాస్త్రం, వ్యవసాయ, పశు సంవర్ధక శాస్త్రం, సమాచార సాంకేతిక విజ్ఞానం, అణుభౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధనల అనువర్తనాలపై ప్రశ్నలుంటాయి. రసాయన శాస్త్రంలోని రసాయన నామాలు, వాటి వినియోగాలు, బహుళ ప్రాచుర్యం పొందిన ఔషధాలూ ముఖ్యమే. పాఠ్యాంశాల మౌలిక భావనలపై అవగాహన పెంచుకుని, ఆపై వాటి అనువర్తనాలు తెలుసుకోవలసి ఉంటుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలపై, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ శాస్త్రజ్ఞులపై ప్రశ్నలుంటాయి. ఈ ఏడాది పోటీ పరీక్షల్లో హర గోవింద ఖొరానా, శ్రీనివాస రామానుజంలపై తప్పకుండా ప్రశ్నలుంటాయని గుర్తించి ఆ కోణంలో సిద్ధం కావాలి. జనరల్‌సైన్స్‌ సన్నద్ధతకు చాలావరకు హైస్కూలు పాఠ్యపుస్తకాలూ, కొన్ని అంశాలకు ఇంటర్‌ పుస్తకాలూ ఉపయోగపడతాయి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో అమల్లో ఉన్న పథకాలు, వాటి లక్ష్యాలు, ఆర్థిక వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం మొదలైనవి ముఖ్యం. ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా ప్రశ్నలుంటాయి. మరికొన్ని పంచవర్ష ప్రణాళికల నుంచి వస్తాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే సగం ప్రశ్నలు సమకాలీన, ఆర్థిక పరిస్థితులపై ఉంటాయని గమనించాలి. తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను చదవవచ్చు. అదనంగా ఏడాది కాలపు వార్తాపత్రికల నుంచి ఆర్థిక వ్యవస్థ సమాచారాన్ని సేకరించి చదవాలి. 11వ పంచవర్ష ప్రణాళిక ముగుస్తున్నందువల్ల దీనిలో సాధించిన ప్రగతి (మధ్యంతర సమీక్ష), 2011-12, త్వరలో ప్రవేశపెట్టబోయే 2012-13 వార్షిక బడ్జెట్‌లపై అవగాహన అవసరం. డిగ్రీస్థాయి తాజా ఎడిషన్ల పుస్తకాలను చదవాలి. భారత ప్రభుత్వం ప్రచురించే యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలూ ఉపయోగమే. ఇంగ్లిషు మీడియంవారికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రామాణిక గ్రంథాలు ఉపకరిస్తాయి.

భారత రాజకీయ వ్యవస్థ

దీని అధ్యయనం అంటే భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవటమే. రాజ్యాంగంలో ముఖ్యమైన ప్రకరణాలను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇటీవలి పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు ప్రకరణాల నుంచి యథాతథంగా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీరాజ్‌సంస్థలపై ప్రత్యేక దృష్టి అవసరం.
దేశ రాజ్యాంగ పరిణామాలు కూడా ముఖ్యమే. ఉదా. లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లు పార్లమెంటులో ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశ పెట్టబడినదనో లేదా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావలసిన మెజారిటీ ఎంత అనో ప్రశ్నలు అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌పరిణామాల దృష్ట్యా కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రశ్నలు రావచ్చు.

డి.డి. బసు రచించిన 'ఇంట్రడక్షన్‌టు కాన్‌స్టిట్యూషన్‌' తాజా ఎడిషన్‌ఉపయుక్తం. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ వారి 'భారత రాజ్యాంగం' చదవాలి. అదనంగా ప్రకరణల వారీగా ప్రచురితమైన రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా చదివి ముఖ్య ప్రకరణలను గుర్తుంచుకోవాలి. పంచాయతీరాజ్‌వ్యవస్థ నుంచీ, ఆంధ్రప్రదేశ్‌పంచాయతీరాజ్‌చట్టం నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

విపత్తుల నిర్వహణఈ అంశాన్ని ఏపీపీఎస్సీ ఈ ఏడాదే ప్రవేశపెట్టింది. కాబట్టి దీన్నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఇందులోని కొన్ని అంశాలను (భూకంపాలు, తుపానులు, సునామీలు...) భౌతిక భూగోళ శాస్త్రంలో కూడా చదువుతాం. కానీ ఇక్కడ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి సంభవించే ప్రాంతాలను తెలుసుకోవటం ముఖ్యం. వీటితో పాటు కృత్రిమంగా మానవుల తప్పిదాలు, అకృత్యాల వల్ల సంభవించే విపత్తులనూ- నివారణ మార్గాలనూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి అధ్యయనానికి సీబీఎస్‌సీ సిలబస్‌చదవాలని ఏపీపీఎస్సీప్రత్యేకంగా సూచించింది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులైనా వీటిని ఇంగ్లిషులో చదివి అర్థం చేసుకోవాలి.

వర్తమాన విషయాలు
ఏడాది కాలం నుంచి జరిగిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపై ప్రశ్నలుంటాయి. కొన్ని సమస్యల మూలాలనూ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ అంశం చదివినా దాని పుట్టు పూర్వోత్తరాలతో సహా అధ్యయనం చేయాలి.

ఒక తెలుగు పత్రికనూ, హిందూ లాంటి జాతీయ వార్తాపత్రికనూ తప్పక చదవాలి. అనేక రంగాల నుంచి విభిన్న కోణాల్లో ప్రశ్నలు అడుగుతుంటారు. క్రీడలు; జాతీయ, అంతర్జాతీయ సదస్సులు; శిఖరాగ్ర సమావేశాలు; జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు; ముఖ్యమైన వ్యక్తులు, ప్రాంతాలు; విజ్ఞాన ఆవిష్కరణలు; రక్షణ రంగానికి చెందిన క్షిపణులు; జలాంతర్గాములు; రాజకీయ-సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయాలి. వర్తమాన ఆర్థిక, రాజకీయ భౌగోళిక, సాంస్కృతిక అంశాలను క్షుణ్ణంగా చదవాలి. వార్తాపత్రికలతో పాటు పరీక్షాపద్ధతిలో సమగ్రంగా అందించే ప్రామాణిక మ్యాగజీన్‌చదవటం కూడా మంచిదే.


మానసిక సామర్థ్యం
రీజనింగ్‌కు సంబంధించిన మౌలిక అంశాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. వాటికి సంబంధించిన అనేక ప్రశ్నలను భిన్న కోణాల్లో సాధించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలుండే నమూనా పేపర్లను అభ్యాసం చేయాలి. దీనికి బ్యాంకు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎంతో ఉపయోగకరం. బ్యాంక్‌పుస్తకాల రీజనింగ్‌పేపర్‌లోని ప్రశ్నలను సాధ్యమైనంత ఎక్కువగా అభ్యాసం చేయాలి. మానసిక సామర్ధ్య ప్రశ్నలు సాధించడమనేది అభ్యర్థుల ప్రజ్ఞ, సాధనలపై ఆధారపడి ఉంటుంది. ఆ దిశలో సన్నద్ధత సాగించాలి.

-  ఎ. ఎం. రెడ్డి

Monday, 2 January 2012

ఉద్యోగార్థులూ... పారాహుషార్‌!

వెల్లువలా వెలువడిన ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ముప్పయికి పైగా ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్లూ... వేల కొలువులూ- పాతవీ, రాబోతున్నవీ. మరోపక్క వయః పరిమితినీ పెంచారు.

వెరసి అభ్యర్థుల కళ్ళల్లో కొంగొత్త ఆశలు!

అర్హతలు సరితూగుతున్న పోస్టులు చాలానే! ఏదో ఒక నోటిఫికేషన్‌కే పరిమితమవాలా? వీలైనన్నివాటికి సిద్ధమయితే మేలా? గందరగోళపడకుండా ముందడుగు వేసేదెలా?
ఇవిగో సమాధానాలు..!

గ్రూప్‌-1 స్థాయి నుంచి దిగువస్థాయి గ్రూప్‌-4 పోస్టుల వరకూ వెలువడిన వివిధ రకాల నోటిఫికేషన్లు, ప్రతి ఉద్యోగార్థినీ ఏదో ఒక రూపంలో ఊరిస్తున్నవే. ఆశలుంటే సరికాదు- ఆచరణ ముఖ్యం. దీక్షతో అక్షరయజ్ఞం చేయగలిగినపుడే ఆశించిన సర్కారీ కొలువు చేతికందుతుంది.

అభ్యర్థుల పరంగా చూస్తే 'ఎన్నిటికి పోటీ పడటం క్షేమం, ప్రయోజనకరం?' అనే సందేహం చాలా ముఖ్యమైనది. సరైన కాల ప్రణాళికతో వీలైనన్ని ఉద్యోగాలకు పోటీపడటమే ప్రాప్త కాలజ్ఞత. పైగా ఈ పోటీ పరీక్షల్లో ఉమ్మడి సిలబస్‌ ఉండటం ఒక అనుకూలాంశం.

* ప్రధానమైన పరీక్షలన్నీ మే 2012 తర్వాతే ఉన్నాయి. జనవరి- ఏప్రిల్‌ మధ్య కాలాన్నే మనం ఎన్ని పరీక్షలు రాయగలమో నిర్ణయించుకుని సమయ విభజన చేయాలి. ఈ నాలుగు నెలలనూ పటిష్ఠంగా వినియోగించుకుంటే పరీక్షల మధ్య వచ్చే సమయాన్ని అప్పటి అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు.

* కొన్ని పరీక్షలు రాద్దామని నిర్ణయించుకున్నా ఒకటి రెండు పరీక్షలే ప్రధానంగా అభ్యర్థి దృష్టిలో ఉంటాయి. వాటి నుంచే సన్నద్ధతను ఆరంభించవచ్చు. ఉదాహరణకు చూడండి...

ప్రధాన పరీక్షలు                ఇతర పరీక్షలు
గ్రూప్‌-2                           గ్రూప్‌-1, 4, ఏఎస్‌ఓ
గ్రూప్‌-1                          గ్రూప్‌-2, 4, ఏఎస్‌ఓ, ఏఈఈ
ఏఈఈ                            గ్రూప్‌-1, 2
ఏఎస్‌ఓ                           గ్రూప్‌-1, 2, 4

ఎన్ని పరీక్షలు రాస్తున్నా...
ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాయటమే మంచి నిర్ణయమని అనుకున్నాం కదా? రాయదల్చిన పరీక్షల్లోని ఉమ్మడి సిలబస్‌ని ఎంపిక చేసుకోండి. మిగతా అంశాలు అదనపు పేపర్లుగా సిద్ధమవ్వాలి. ముందుగా జరిగే పరీక్షకు సంబంధించిన నిర్దిష్ట సిలబస్‌ (ఉమ్మడిగా లేనిది) అధ్యయనానికి పరీక్షకు నెలరోజుల ముందు నుంచీ అదనపు సమయం కేటాయించుకోవాలి. అలా అని కేవలం పరీక్ష ముందే చదవమని కాదు. ముందున్న నాలుగు నెలల సమయంలో కూడా ఎంతోకొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలి.

వీఆర్‌ఓ+గ్రూప్‌-4 +ఎక్సైజ్‌ +పోలీస్‌
ముందు జరగబోతున్న వీఆర్‌ఓ పరీక్షకు మొత్తం సమయం వెచ్చించటం సమంజసం. గ్రూప్‌-4 ఆగస్టు 11న కాబట్టి ఈలోపల మిగతా పరీక్షల సమయాన్నిబట్టి వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. వీఆర్‌ఓ కోసం చదివే చాలా సమాచారం డీఎస్‌సీ పరీక్షలకు సైతం ఉపయోగపడేలా ఉంది. అందువల్ల డీఎస్‌సీ ప్రిపరేషన్‌వైపునకు కూడా కాలానుగుణంగా మారవచ్చు. గ్రూప్‌-4కి సిద్ధమయేటపుడు సెక్రటేరియల్‌ ఎబిలిటీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. గతంలో జరిగిన గ్రూప్‌-4 పరీక్షలో పాలిటీ, చరిత్ర లాంటివి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో అడిగారు కాబట్టి ఆ ప్రకారమే సన్నద్ధత సాగాలి.

డీఎస్‌సీ ప్రధాన లక్ష్యమే కానీ...
లక్షలమంది డీఎస్‌సీ ఆశావహులు టెట్‌ సన్నద్ధతలో మునిగివున్నారు. జనవరి 8న పరీక్ష ముగియగానే వీరు వెంటనే డీఎస్‌సీపై కాకుండా వీఆర్‌ఓ/వీఆర్‌ఏను కూడా ఆశిస్తే... జనవరి 29 వరకూ ఆ పోస్టులపైనే దృష్టి సారించటం తెలివైన నిర్ణయమవుతుంది. అరిథ్‌మెటిక్‌, లాజికల్‌ రీజనింగ్‌, కరంట్‌ అఫైర్స్‌, ఏపీ జాగ్రఫీలు ముఖ్యం. ఫిబ్రవరి నుంచి డీఎస్‌సీని పట్టించుకోవచ్చు.

తాజా గ్రూప్‌-1 ఫలితాల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు చాలామంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. చాలామంది డీఎస్‌సీ ఆశావహులు గ్రూప్‌-1,2, జేఎల్‌ లాంటి పరీక్షల్లో కూడా ఫలితం సాధించాలనుకుంటున్నారు. ఇలాంటివారు డీఎస్‌సీ పూర్తవగానే మిగతా పరీక్షల సంగతి చూడవచ్చు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అందుకునే అవకాశాలు తక్కువగా ఉన్నా గ్రూప్‌-2 (జులై 15), గ్రూప్‌-4 (ఆగస్టు 11), జూనియర్‌ లెక్చరర్స్‌ లాంటివి క్రమబద్ధంగా రాయవచ్చు.

'సాంకేతికం'తో సంధానం సాధ్యమా?
ఇంజినీరింగ్‌ అభ్యర్థులు చాలామందికి ఏఈఈ పోస్టులతో పాటు గ్రూప్‌-1,2లు కూడా లక్ష్యమే. గ్రూప్‌-1 సిలబస్‌ సౌలభ్యం దృష్ట్యా ఏఈఈలుగా ఎంపికైనవారు కూడా దీన్ని రాస్తుంటారు. పాలనాపరమైన పోస్టుల్లో ప్రవేశించాలనుకునేవారు కూడా ఇంజినీరింగ్‌ విభాగం నుంచి గ్రూప్‌-2వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటివారు జనవరి-మార్చి మధ్య సమయాన్ని ఇంజినీరింగ్‌ సబ్జెక్టుతోపాటు జనరల్‌స్టడీస్‌ (ప్రిలిమ్స్‌)కి కేటాయించాలి. ఏఈఈ పరీక్షలో 150 మార్కులకు జీఎస్‌ పేపర్‌ ఉంది కాబట్టి దాని ప్రిపరేషన్‌గానే గుర్తించాలి. మే నెలలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ని ఇదే ప్రిపరేషన్‌తో పూర్తిచేయవచ్చు. అయితే జనవరి- ఏప్రిల్‌ మధ్య మెయిన్స్‌లోని పేపర్‌-1, 3, 4, 5 లాంటివాటికి ముందస్తుగానే సిద్ధమవటం మంచి నిర్ణయమవుతుంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పూర్తవగానే జులై 1న జరగబోయే ఏఈఈ పరీక్షకు సర్వశక్తులూ ఒడ్డాలి. మర్నాటినుంచి అక్టోబర్లో జరగబోయే పరీక్షకు పూర్తిస్థాయిలో అంకితమవటం ద్వారా ఏఈఈ, గ్రూప్‌-1 రెండు పరీక్షల్లోనూ మంచి ఫలితాలే సాధించవచ్చు. గ్రూప్‌-2 పరీక్ష జులై 15న కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యంగా నిర్దేశించుకోకపోవటం మంచిది.

ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, డెప్యూటీ సర్వేయర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌.. ఇతర సాంకేతిక ఉద్యోగార్థులు ఇతర పరీక్షలూ, వాటి తేదీలనూ బట్టి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు ప్రణాళిక వేసుకోవాలి.

ఈ తరహా పరీక్షలన్నిటిలో అభ్యర్థుల సబ్జెక్టు మార్కుల మధ్య పెద్ద తేడా కన్పించటంలేదు. అంతిమ ఫలితాన్ని నిర్ణయించటంలో జనరల్‌స్టడీస్‌దే కీలకపాత్ర. డీఏఓ, డీఎల్‌ లాంటి పరీక్షలు దీన్ని రుజువు చేశాయి!

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌
397 పోస్టులతో భారీ ప్రకటన వెలువడింది. ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌, గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా నిర్ణయించటంతో పోటీ బాగా తగ్గింది. జూన్‌ 24న పరీక్ష కాబట్టి ముందుగా ఈ అభ్యర్థులు సబ్జెక్టుతో పాటు జీఎస్‌కి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

గ్రూప్‌-1 అంతిమ లక్ష్యంగా ఉన్నట్టయితే కనీసం మూడు మెయిన్స్‌ పేపర్లను అయినా జనవరి- మే మధ్య పూర్తిచేయటం మంచిది. మే నెల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పూర్తవగానే ఏఎస్‌ఓకి అవసరమైన సబ్జెక్టుపై దృష్టి నిలపవచ్చు. ఏఎస్‌ఓ పరీక్ష పూర్తవగానే గ్రూప్‌-1 మెయిన్స్‌ సంగతి చూడొచ్చు.

గ్రూప్‌-2 పరీక్ష జులై 15న ఉంది కాబట్టి ఏఎస్‌ఓ, గ్రూప్‌-1, 2 అనే లక్ష్యాలను నిర్ణయించుకుంటే... జనవరి- జూన్‌ మధ్య ఏఎస్‌ఓ సిలబస్‌, గ్రూప్‌-2 సిలబస్‌పై కేంద్రీకరించి మెయిన్స్‌ ప్రిపరేషన్‌ని వాయిదా వేయటం మేలు. ఏఎస్‌ఓ పరీక్ష పూర్తవగానే గ్రూప్‌-2 సంగతి పట్టించుకోవాలి. అది పూర్తవగానే అక్టోబర్లో జరిగే మెయిన్స్‌కి సర్వశక్తులూ ఒడ్డడం ద్వారా మూడు పరీక్షలనూ పటిష్ఠంగా ఎదుర్కోవచ్చు.

- కొడాలి భవానీ శంకర్

Saturday, 31 December 2011

ఉద్యోగాలూ... ప్రకటనలూ!

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ శుక్రవారం మరో మూడు ప్రకటనలు జారీచేసింది.

వయ: పరిమితిని 18 నుంచి 34 సంవత్సరాలుగా నిర్ధరించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.


ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రకటన
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

కమ్యూనికేషన్స్‌ విభాగంలో 38 మంది ఎస్సైలు, పోలీసు ట్రాన్స్‌పోర్టు సంస్థలో 10 మంది ఎస్సైలు, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో 29 మంది ఏఎస్సైల ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు 2011 జులై 1 నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లలోపువారై ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.

పూర్తి వివరాలు www.appolice.org వెబ్‌సైట్లో పొందుపరిచామని.. 2012 ఫిబ్రవరి 2 నుంచి మార్చి 15లోపు దరఖాస్తు చేయాలని సూచించారు.

Friday, 30 December 2011

మరో పది ఉద్యోగ ప్రకటనలు... నేడు మరికొన్ని!

హైదరాబాద్‌-న్యూస్‌టుడే

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నుంచి గురువారం మరో పది ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు వెలువడ్డాయి.

ఇందులో గ్రూపు-2 కింద 525 ఉద్యోగాలు భర్తీచేయనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో 119, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో 406 పోస్టులను నింపుతారు. గ్రూపు-2కు ఒక్క పరీక్షనే నిర్వహించాలా... గ్రూపు-1 మాదిరిగా ప్రాథమిక, ప్రధాన పరీక్షలను నిర్వహించాలా? వద్దా అన్న అంశంపై అధికారిక నిర్ణయానికి. మరికొంత సమయం పట్టనుంది.

టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు మినహా మిగిలిన వాటికి వయోపరిమితిని 18 నుంచి 34 సంవత్సరాలుగా నిర్ధారించారు. టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ (పోలీసు రవాణ) పోస్టులకు దరఖాస్తుచేసే అభ్యర్థులకు 21 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు.





ఇవికాకుండా శుక్రవారం మరికొన్ని ప్రకటనలు వెలువడనున్నాయి.

Thursday, 29 December 2011

ఏపీపీఎస్ సీ ఉద్యోగ ప్రకటనల జోరు!

నేటివరకూ 19  ఉద్యోగ ప్రకటనల జారీ

ఇవాళ ఈనాడు లో వచ్చిన ఈ వార్త చూడండి.....

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  ఏపీపీఎస్సీ మరో 2602 పోస్టులతో ఏడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది.

మంగళవారం 2805 పోస్టులతో పది ప్రకటనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 132 లెక్చరర్ల పోస్టులు, 15 సహాయ అటవీ సంరక్షణ అధికారుల పోస్టులకు ప్రకటనలు జారీ చేశారు. రెండు రోజుల్లో మొత్తం 5,454 పోస్టులతో 19 ఉద్యోగ ప్రకటనలు జారీ అయ్యాయి.

బుధవారం జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో గ్రూప్‌-4 పోస్టులు 2,146 ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఉద్యోగ ప్రకటనలతో పాటు దరఖాస్తు స్వీకరణ, రాత పరీక్షల తేదీలు ప్రకటించారు.

ప్రకటనలకు సంబంధించిన అర్హతలు, జోన్లవారీ ఖాళీల వివరాలు www.apspsc.gov.inలో లభిస్తాయి.




Monday, 19 December 2011

గ్రూప్ -1 ఇంటర్వ్యూలో విజయీభవ!


గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక మిగిలింది మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) దశ.

ప్రశ్నలు అడగటం, అభ్యర్థి చెప్పే సమాధానాల్లో కచ్చితత్వం చూడటానికి మాత్రమే ఈ ప్రక్రియ పరిమితం కాదు. అభ్యర్థి మూర్తిమత్వ లక్షణాల పరిశీలన, తద్వారా ఉద్యోగానికి అభ్యర్థి ఎంతవరకూ సరిపోతాడో ఒక నిర్థారణకూ, నిర్ణయానికీ రావటానికి ఇది ఉపయోగపడుతుంది.రాతపరీక్షల ద్వారా బయటపడని మానసిక, శారీరక లక్షణాలను గమనించటం ఇంటర్వ్యూలోనే సాధ్యమవుతుంది.

ఏ మౌఖిక పరీక్షలోనైనా సాధారణంగా ఐదు దశలుంటాయి. ప్రవేశించే దశ (Entry), పరిచయం, లోతైన చర్చ, ముగింపు, నిష్క్రమణ (Exit).

1. ప్రవేశించే దశ
అభ్యర్థి బోర్డు గదిలోకి ఎంత cosy గా ప్రవేశించాడు; పరిసరాలనూ, బోర్డు సభ్యులనూ ఎలా చూశాడు, సభ్యులను ఎలా సంబోధిస్తున్నాడు లాంటివి పరిశీలించి 'తొలి అభిప్రాయాన్ని' ఏర్పరచుకునే అవకాశం ఈ దశలో బోర్డుకు ఉంటుంది. అభ్యర్థి సాధన చేయగలిగితే ఈ దశలో మంచి అభిప్రాయం కలగజేసే వీలుంటుంది.

2. పరిచయం
'మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి' అని అభ్యర్థిని బోర్డు అడగవచ్చు. లేదా బోర్డు చైర్మన్‌ అభ్యర్థి బయోడేటాను క్లుప్తంగా మిగతా సభ్యులకు వినపడేలా చదదవచ్చు. ఆహ్లాద వాతావరణం ఏర్పడేందుకు సులభమైన, అభ్యర్థికి సంబంధించిన ప్రశ్నలనే అడుగుతారు. అభ్యర్థి కుటుంబం, విద్యా ప్రగతి, చేస్తున్న ఉద్యోగం లాంటివి ఈ పరిచయ ప్రశ్నల్లో భాగంగా చేరవచ్చు. దినపత్రికల్లో వస్తున్న వార్తలను ప్రస్తావించవచ్చు.

ఒక బోర్డులో... 'ఈ ఆఫీసుకు మీరెలా వచ్చారు?', 'బస్సులో మీ పక్క ప్రయాణికులను పరిచయం చేసుకున్నారా?' 'హైదరాబాద్‌ బస్సు ప్రయాణం ఎలా ఉంది?' లాంటి పరిచయ ప్రశ్నలు అడిగి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యపై చర్చ కొనసాగించారు.



3. లోతైన చర్చ
ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థి శక్తి సామర్థ్యాలు పరిశీలించేందుకు 'సన్నివేశ' కల్పన జరుగుతుంది. విషయ వివరణ, విభిన్నకోణాల పరిశీలన, వాద ప్రతివాదనలు, ధనాత్మక - సకారాత్మక ధోరణులు మొదలైన అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా భావోద్వేగాల నియంత్రణలో అభ్యర్థి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుంటారు. బోర్డు రకరకాల ఒత్తిడులను ఈ దశలో ప్రయోగించవచ్చు.

లోతైన చర్చ నుంచి బయటపడే లక్షణాలు:. ఒత్తిడికి ప్రతిస్పందన, సహనస్థాయి, స్థిత ప్రజ్ఞత, బలాలు- బలహీనతలు, వినయం, సేవాతత్పరత, నిజాయతీ, దార్శనికత (vision).

4. ముగింపు
చర్చించిన విషయాన్ని అభ్యర్థి ఏ విధంగా ముగిస్తున్నాడు, అతడి అంతిమ భావన ఏమిటి, మొదట తాను కలిగివున్న భావనల నుంచి బయటపడ్డాడా? అసంబద్ధమైన భావనలనే చర్చ ముగింపులో కూడా కలిగివున్నాడా లాంటివి పరిశీలిస్తారు. అభ్యర్థి తన హేతుబద్ధ భావనలను బోర్డు ఒత్తిడి కారణంగా వదులుకున్నాడా, 'తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు' ధోరణితో వ్యవహరించాడా ... ఇవన్నీ గమనిస్తారు.

5. నిష్క్రమణ
బోర్డు చైర్మన్‌ 'ఇక మీరు వెళ్ళవచ్చు' అని చెప్పినపుడు నిదానంగా బోర్డు సభ్యులందర్నీ ఒకసారి చూసి చైర్మన్‌కి 'కృతజ్ఞతలు' తెలియజేసి బయటకు వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పుడు...
* బోర్డు నుంచి పారిపోయినట్టుగా వేగంగా వెళ్తున్నాడా?
* ఇంటర్వ్యూ జరిగినదాన్ని బట్టి అసంతృప్తి/సంతృప్తికి గురై అదే బాధ/ఆనందంతో వెళ్తున్నాడా?
* ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించే అవకాశం మరింత ఉంటే బాగుణ్ణు అనే అభిప్రాయం అభ్యర్థిలో ఉందా?
ఇలాంటివి అంచనా వేసే అవకాశముంది. అందుకే exit behaviour ని సాధన చేయాల్సివుంటుంది.

సిద్ధం కావాల్సినవి...
1) బయోడేటా సమాచారం 2) గ్రూప్‌-1 మెయిన్స్‌ సిలబస్‌లోని పేపర్‌-2, 3, 4 అంశాలు 3) జాతీయ, అంతర్జాతీయ విషయాలు 4) రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 5) సామాజిక అంశాలు 6) తాజా ఆర్థిక పరిణామాలు 7) పార్లమెంటులో ప్రవేశపెట్టిన తాజా బిల్లులు 8) గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల ప్రాథమికాంశాలు


- కొడాలి భవానీ శంకర్

Thursday, 15 December 2011

గ్రూప్‌-1 కొలువుకు తొలిమెట్టు

గ్రూప్‌-1 పరీక్ష ప్రిపరేషన్‌లో కీలకఘట్టం ఆన్‌లైన్‌ దరఖాస్తును సక్రమంగా పూర్తిచేసి పంపడంతోనే ప్రారంభమవుతుంది.

'దరఖాస్తు పంపించటమేముందిలే?' అనే తేలికభావం తగదు. సరిగా పూరించని చాలామంది అభ్యర్థుల దరఖాస్తులు గతంలో తిరస్కరణకు గురై హాల్‌టికెట్లు జారీ కాలేదు. ఇలాంటి చిక్కుల్లేకుండా లక్ష్యం దిశగా దూసుకువెళ్ళాలంటే ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎ.ఎం. రెడ్డి! 

లక్షల మంది ఉద్యోగార్థుల చిరకాల నిరీక్షణ ఫలించి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయింది. దీని ద్వారా 19 రాష్ట్రప్రభుత్వ శాఖలకు సంబంధించి 304 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిని సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నవారు వెంటనే ఆన్‌లైన్‌ దరఖాస్తును పంపుకోవాలి.

తెలుగు మీడియం అభ్యర్థులు, కంప్యూటర్‌ అవగాహన లేనివారు, ఇంటర్నెట్‌ అందుబాటులో లేనివారు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు పొందడమెలా?
అభ్యర్థులు మొట్టమొదట ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ కోసం www.apspsc.gov.inను క్లిక్‌ చేయాలి. హోమ్‌పేజీ కనపడుతుంది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేసి తన పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ (కులం) ఎంటర్‌ చేస్తే చెల్లించవలసిన ఫీజుకు సంబంధించిన చలాన్‌ వస్తుంది. దాన్ని ప్రింట్‌ తీసుకోవాలి. ఏపీ ఆన్‌లైన్‌లో కానీ, ఏదేని ఎస్‌.బి.ఐ. బ్రాంచిలో కానీ నిర్దేశించిన ఫీజు చెల్లించాలి.

ఇక్కడ ముఖ్యంగా గ్రూప్‌-1 రాయబోయే ప్రతి అభ్యర్థీ ఏ విధమైన రిజర్వేషన్‌తో ప్రమేయం లేకుండా రూ. 100 దరఖాస్తు ప్రాసెసింగ్‌ కోసం తప్పక చెల్లించాలని మరిచిపోకూడదు.

ఫీజు మినహాయింపులో చిక్కు
ఏ విధమైన ఫీజు మినహాయింపు లేనివారికి అంటే... ఉద్యోగం చేసే ఒ.సి. అభ్యర్థులందరూ అదనంగా మరో రూ. 120 చెల్లించవలసి ఉంటుంది. ఒ.సి. అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేటు లేదా సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నా రూ. 120 తప్పక చెల్లించాలి.

నిజానికి 34 సంవత్సరాల లోపు నిరుద్యోగ ఒ.సి.లు ఈ రూ. 120 చెల్లించవలసిన పనిలేదు. కాబట్టి చాలామంది ప్రైవేటు విద్యా సంస్థలలో లేదా ఇతర ప్రైవేటు సంస్థలలో పని చేసేవారు ఈ ఫీజు మినహాయింపు పొందాలని చూస్తారు

కానీ, ఇంటర్వ్యూ సమయంలో ఆ అభ్యర్థులను 'డిగ్రీ/పీజీ అయిన తరవాత ఏం చేస్తున్నారు' అనడిగితే వెంటనే 'ప్రైవేటు రంగంలో ఫలానా ఉద్యోగం చేస్తున్నా'నని సమాధానం ఇస్తూ ఉంటారు. అప్పుడు వారు నిజాయతీగా ఫీజు మినహాయింపు పొందలేదని బోర్డుకు తెలిసిపోతుంది. ఇంటర్వ్యూలో అలాంటి అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే రూ. 120 ఫీజు చెల్లిస్తే తమ నిజాయతీని నిరూపించుకొన్నట్లు అవుతుంది. ఇది వారికి 'ప్లస్‌ పాయింటే'!

అభ్యర్థులందరూ ఫీజు చెల్లించిన తరవాత వారికి ఫీజు చెల్లించిన చలాన్‌కు ఓ జర్నల్‌ నం. బ్యాంకు ద్వారా గానీ, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా గానీ లభిస్తుంది. ఆ నంబరు ద్వారా ఫీజు చెల్లించిన మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల తరవాత తిరిగి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి సంబంధిత కాలమ్‌లో ఆ జర్నల్‌ నంబర్‌ను ఎంట్రీ చేసి దరఖాస్తును పొందవచ్చు.

ఇంటర్నెట్‌ కేంద్రాలు
చాలామంది గ్రామీణ అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు పంపటంలో స్థానికంగా ఉండే ఇంటర్నెట్‌ కేంద్రాలపై ఆధారపడతారు. ఆ కేంద్రాల ఆపరేటర్లు తమ ఇష్టం వచ్చినట్టు తెలిసో తెలియకో ఆప్షన్లను క్లిక్‌ చేసే అవకాశముంది. దీనివల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సివుంటుంది. ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తు ప్రింట్‌ కాపీని తప్పనిసరిగా తీసుకుని అందులోని సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

చివరి తేదీ
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సిన చివరితేదీ జనవరి 8 కదా అని ఆ రోజు వరకూ తాత్సారం చేస్తే గ్రూప్‌-1 అవకాశం చేజారిపోతుంది. దరఖాస్తు పంపే చివరితేదీ జనవరి 8 కానీ ఫీజు చెల్లించాల్సిన చివరితేదీ జనవరి 6 అని మర్చిపోకూడదు.

చివరితేదీ వరకూ వేచివుండకుండా సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు పంపుకోవడం మంచిది. ఎందుకంటే దరఖాస్తు పంపిననాటి నుంచే అభ్యర్థుల్లో పరీక్ష పట్ల ఆసక్తి పెరుగుతుంది. 'దరఖాస్తు పంపిన తర్వాత అంటే జనవరి 8 నుంచి ప్రారంభిద్దాంలే' అని నిర్లక్ష్యం చేస్తే ఈ పోటీపరీక్షకు సమయం సరిపోదని గుర్తించండి.

దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా పంపాక అది ఏ స్థాయి (status)లో ఉందో తెలుసుకోవాలంటే ఏపీపీఎస్‌సీ హోమ్‌ పేజ్‌లో పోటీపరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ నంబర్‌నూ, రెఫరెన్స్‌ ఐడీ నంబర్‌నూ, మీ పుట్టినతేదీనీ ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు. దీనికోసం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ నంబర్‌ 18/2011- తేదీ 28-11-2011 నూ, అభ్యర్థి రెఫరెన్స్‌ ఐడీనీ భద్రపరుచుకోవాలి.

చివరిగా ఆన్‌లైన్‌ దరఖాస్తులోని చివర్లో ఉన్న imageలోని అక్షరాలను యథాతథంగా టైపు చేయాలి. లేకుంటే దరఖాస్తును స్వీకరించరు.

ఈ విధంగా దరఖాస్తును సరైనరీతిలో గడువుకు ముందుగానే పంపించడంతో గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ తొలి మెట్టు అధిరోహించినట్టే!

Monday, 5 December 2011

గమ్యం... గ్రూప్‌-1

ఏడాది చివర్లో వెలువడిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఉద్యోగార్థులకు తీపి కబురునందించింది.

ఏపీపీఎస్‌సీ చరిత్రలోనే తొలిసారిగా నియామక ప్రకటనతో పాటే పరీక్ష తేదీలను ముందస్తుగా ప్రకటించటం విశేషం. ఈ అనుకూలాంశాన్ని అందిపుచ్చుకుని... పక్కా ప్రణాళికతో వెంటనే సన్నద్ధమవటమే అభ్యర్థుల కర్తవ్యం అని సూచిస్తున్నారు  కొడాలి భవానీ శంకర్ !

రాష్ట్రస్థాయిలో అత్యున్నతమైనవి గ్రూప్‌-1 ప్రభుత్వ సర్వీసులు. ఈ హోదాలను అందుకోవాలంటే మూడంచెల నియామక పరీక్షలో విజయం సాధించాల్సిందే. ఈ సర్వీసుల్లో ఎంపికైనవారికి విధాన నిర్ణయాల్లో, అమలులో కీలకపాత్ర పోషించే విశిష్ట అవకాశం లభిస్తుంది.
సమస్యలను విశ్లేషించగల నేర్పు, శ్రమించే తత్వం, సామాజిక సమస్యలపై స్పందించే సహానుభూతి ఉన్నవారు ఈ పోస్టుల్లో రాణిస్తారు.

మేధో శక్తి కంటే కష్టపడే స్వభావం అధికంగా ఉండేవారికే అవకాశాలు అధికం.

19 విభాగాల్లో 304 పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. డిసెంబరు 9 నుంచి జనవరి 8 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఎవరైనా అర్హులే. మే 27న ప్రిలిమ్స్‌, అక్టోబరు 3న మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు చూడాల్సిన వెబ్‌సైట్‌:  http://www. apspsc.gov.in/

నాటి అభ్యర్థుల పొరపాట్లు
తెలివైన వ్యక్తి కేవలం తన తప్పుల నుంచే గుణపాఠం నేర్చుకోడు. ఇతరుల పొరబాట్ల నుంచి కూడా నేర్చుకుంటాడు. 2008 గ్రూప్‌-1 ప్రకటనకు ఎన్నో ఆశలతో అక్షర యుద్ధం ప్రారంభించిన అభ్యర్థులు రకరకాల కారణాల వల్ల మధ్యలోనే నిష్క్రమించారు. అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం ఏ అభ్యర్థికైనా అవసరమే.

** ప్రయత్నించి చూద్దాం
నోటిఫికేషన్‌ వచ్చిన తొలిరోజుల్లో నిండుగా ఉండే స్ఫూర్తి వల్ల చాలామంది అభ్యర్థులు ఉత్సాహంగానే చదువుతారు. అయితే వీరిలో చాలామంది అప్పటికి వేరే ప్రత్యామ్నాయం లేక గ్రూప్స్‌ రాద్దామని నిర్ణయించు కొనేవారే. వందశాతం ఈ ఉద్యోగం పొందాలనీ, చివరివరకూ పోరాడాలనీ నిర్ణయించుకొని దిగేవారి సంఖ్య పది శాతం కూడా మించదు! అలా 'ప్రయత్నించి చూద్దాంలే' అనుకునే అభ్యర్థుల కోవకి మీరు కూడా చెందితే ఫలితం ఆశాజనకంగా ఉండదు. గ్రూప్స్‌లో విజయం యాదృచ్ఛికం కాదు. నిర్దిష్ట ప్రణాళికతో అలుపెరగకుండా సాగాల్సిన ప్రయాణం!

** అసలు సత్తా ఉందా?
ఒక అభ్యర్థి ఒకసారి ఇలా అడిగారు- 'నిరంతరం శ్రమించడం వల్ల ఉద్యోగం వచ్చేట్లయితే కొందరు 4, 5 సార్లు సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలు రాసినా, ఎందుకని వారికి విజయం రావడం లేదు?'. నిజమే, ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌ తప్పనిసరి విజయాన్ని అందిస్తుందనేది అపోహ. 'జుట్టున్నమ్మకు ఏ కొప్పయినా అందమే' అనే నానుడి విన్నారా? ఇది కూడా అలాంటిదే. సహజ మానసిక సామర్థ్యాలు లేకుండా ఏళ్ల తరబడి పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం సున్నా. అసలు సత్తా ఉన్నా, పరీక్ష నాడిని పట్టుకోకుంటే మరోసారి రాయాల్సిందే. సామర్థ్యం ఉండి, పరీక్ష నాడి తెలుసుకుని దానికి తగిన శ్రమను అందిస్తే గెలుపు తథ్యమని గత గ్రూపు-1 టాపర్లు రవినాయక్‌, నారాయణరెడ్డిల విజయాలు తెలుపుతున్నాయి.

అందువల్ల నోటిఫికేషన్‌ వచ్చిందని ఆరాటపడకుండా, 'నిజంగా మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఏడాది కాలం పాటు ఓపిక పట్టగలమా? సామాజిక దృక్కోణంలో వివిధ విషయాల్ని అధ్యయనం చేయగలమా?' అని ఆలోచించి దిగాలి.

** అకడమిక్‌ మార్కుల్ని అతిగా...
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అకడమిక్‌ పరీక్షల్లో వచ్చిన 80- 90 శాతం మార్కుల్ని చూసి సివిల్స్‌, గ్రూప్స్‌లో తప్పక విజయం సాధిస్తారని అనుకుంటారు. అకడమిక్‌ అంటే ప్రత్యేక సిలబస్‌, పాఠ్యాంశాల్ని కలిగి ఉంటుంది. దాంతో 'బట్టీ' అభ్యర్థులు కూడా మంచి స్కోరు సాధించవచ్చు.

కానీ సివిల్స్‌, గ్రూప్స్‌ సిలబస్‌లో ప్రతి అంశాన్నీ బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌ వరకూ వివిధ కోణాల్లో చదివే నేర్పుండాలి. అలా కాకుండా మార్కెట్లో దొరికే ఏదో ఒక పుస్తకమో, కోచింగ్‌ సెంటర్లో నోట్సో చదవడం వల్ల ఉపయోగం ఉండదు.





Tuesday, 29 November 2011

గ్రూప్‌-1 పరీక్ష ప్రకటన విడుదలైంది!

* మే 27న ప్రాథమిక పరీక్ష
* అక్టోబరు 3నుంచి ప్రధాన పరీక్షలు
* ఏపీపీఎస్సీ ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
పక్కా ప్రణాళికతో గ్రూప్‌-1 ప్రకటనను ఏపీపీఎస్సీ సోమవారం జారీ చేసింది.

నిరుద్యోగ అభ్యర్థులు తొలినుంచి జాగ్రత్తగా, లక్ష్యంతో సిద్ధం కావడానికి వీలుగా ప్రాథమిక, ప్రధాన పరీక్షల తేదీల వివరాలను ముందుగానే ప్రకటించింది. ఇలా చేయడం కమిషన్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

కొత్తగా జారీ చేసిన గ్రూపు-1 ప్రకటనలో దాదాపు 19 విభాగాల్లో 263 పోస్టులున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.  అయితే...


నవంబర్ 28న  ప్రకటించిన 263 పోస్టులకు మరో 41 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ   మంగళవారం ప్రకటించింది.
పెరిగిన 41 పోస్టుల్లో 39 ఎంపీడీవోలు, 4 డిఎస్పీలు వున్నాయి. 



మే 27న ప్రిలిమినరీ: 
గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తులను డిసెంబరు 9 నుంచి 2012 జనవరి 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

గతంలో నోటిఫికేషన్‌ జారీచేసి దరఖాస్తులు స్వీకరించాక నెమ్మదిగా ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ప్రకటించేవారు. పరీక్ష ఎప్పుడు జరుగుతుందో అభ్యర్థులకు స్పష్టంగా తెలిసేది కాదు. ఒక్కోసారి తేదీ ప్రకటించినా.. మళ్లీవాయిదా పడేవి. పరీక్షల నిర్వహణలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఈసారి.. నోటిఫికేషన్‌తో పాటు పరీక్ష తేదీలనూ కమిషన్‌ ప్రకటించింది.


నాలుగు నెలల సమయం: 
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం ఇచ్చారు. మే 27న ప్రిలిమినరీ పరీక్ష పూర్తయిన తరువాత ప్రధాన పరీక్షలు 2012 అక్టోబరు 3 నుంచి నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షకు మధ్య కచ్చితమైన సమయం ముందుగానే తెలియడం వల్ల అభ్యర్థులు ప్రణాళికాయుతంగా ప్రధాన పరీక్షలకు సిద్ధం కావడానికి వీలు కలుగుతుంది.

భర్తీ చేయనున్న పోస్టులివే: 
గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో....
డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, వాణిజ్యపన్నుల అధికారులు, సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, ఉపాధి కల్పన అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రేడ్‌-2 పురపాలక కమిషనర్లు, ఏపీజీఎల్‌ఐ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ ఆడిటర్లు, జిల్లా బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ అధికారులు, జిల్లా రిజిస్టార్లు, ఎంపీడీవోలు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారులు, అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారులు, కోఆపరేటివ్‌ జిల్లా రిజిస్టార్‌ పోస్టులున్నాయి.



Friday, 25 November 2011

గ్రూప్‌ 1, 2 ఇంటర్వ్యూల తేదీల ఖరారు

హైదరాబాద్‌ :  గ్రూప్‌-1, 2  సర్వీసుల నియామకానికి సంబంధించి  ఇంటర్వ్యూ తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది.

జనవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలూ ,

మార్చి 3 నుంచి 31 వరకు గ్రూప్‌-2 ఇంటర్వ్యూలూ  నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

పిబ్రవరి 16 నుంచి 23 వరకు అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటర్వ్యూలు,
ఫిబ్రవరి 13 నుంచి 15, 24 నుంచి మార్చి 2 వరకు పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

తొలిసారి ఒకే బోర్డు ద్వారా గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రోజుకు గరిష్ఠంగా 10 నుంచి 15 మందికి మాత్రమే ఇంటర్వ్యూలు చేయనున్నట్లు తెలిపారు.

Monday, 10 October 2011

గ్రూప్‌-2 గెలుపు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలకు మిగిలింది ఐదు రోజులే!

ఇప్పుడున్న కొద్ది సమయం చాలా అమూల్యం. దీన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలి. మరోపక్క ఇటీవలి గ్రూప్‌-1 మెయిన్స్‌ ధోరణులనూ గమనంలోకి తీసుకోవాలి.

సన్నద్ధతకు ఇలా తుది మెరుగులు దిద్దుకుంటేనే ఆశించిన ఫలితం సిద్ధించేది అంటున్నారు... కొడాలి భవానీ శంకర్‌!

రీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో కనీసం 5 శాతం మంది స్వల్ప తప్పిదాల వల్ల విలువైన సమయం నష్టపోవటమే కాకుండా విజయాన్ని కూడా దూరం చేసుకుంటుంటారు.

* పరీక్ష హాల్లోకి కనీసం 20 నిమిషాలు ముందుగా వెళ్ళటం వల్ల వ్యక్తిగత వివరాలను నింపాదిగా నింపటం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

* ప్రశ్నపత్రం ఇవ్వగానే పరీక్ష సిరీస్‌ కోడ్‌ లాంటి సమాచారాన్ని ముందుగా నింపండి.

* మొదటి పేజీ సమాచారం పూర్తయిన తర్వాతే ప్రశ్నల వంక చూడటం ప్రారంభించండి.

* ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించగానే వెంటనే ఓఎంఆర్‌ షీటులో సంబంధిత ప్రశ్నకు ఎదురుగా ఉన్న వృత్తాన్ని నింపాలి. ప్రశ్నపత్రంపై సమాధానాలు గుర్తించి, చివర్లో అన్నీ ఒకేసారి నింపుదామనుకోవటం సరికాదు.

సమాధానాలు ఎలా?
* జనరల్‌స్టడీస్‌ పేపర్లో బాగా సులభమనుకున్న విభాగపు ప్రశ్నలను ముందుగా సాధిస్తే ప్రేరణ పెరుగుతుంది. అయితే వీలైనంతవరకూ మొదటి ప్రశ్న నుంచి గుర్తించటం వల్ల ఒక్కో విభాగపు ప్రశ్నలు ఎక్కడున్నాయో వెతుక్కోవటానికి పట్టే సమయం వృథా కాకుండా ఉంటుంది.

* అన్ని ప్రశ్నలకూ సమాన మార్కులే కాబట్టి ఒక ప్రశ్న చదవగానే సరైన సమాధానం గుర్తించగలమా లేదా అనేది సెకన్ల వ్యవధిలోనే నిర్థారించుకోవాలి. కొంత సమయం తర్వాతనైనా సాధించగలమనుకుంటే అలాగే చేయటం ఉత్తమం.

* సమాధానం కచ్చితంగా 'తెలియదు' అనుకుంటే సమయం వ్యర్థం చేసుకోకుండా తోచిన సమాధానాన్ని ఓఎంఆర్‌ షీట్లో గుర్తించెయ్యటం మంచిది.

* రెండో రౌండులో సాధించదల్చుకున్న ప్రశ్నల వద్ద ఏదైనా గుర్తు పెట్టుకుంటే వాటికోసం వెతికే సమయం తగ్గుతుంది. ఇలా వదిలే ప్రశ్నల సంఖ్య తక్కువుండేలా చూసుకోవాలి.

* ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో 'సరైన సమాధానం కానిది ఏది' అంటూ చూసుకుంటూపోతే (ఎలిమినేషన్‌) మంచి ఫలితాలు సాధించవచ్చు. సరికానివి వదిలెయ్యటం ద్వారా సరైన జవాబును గుర్తించటం తేలికవుతుంది.

మరింత మెరుగైనదే సరైనది
ప్రశ్న చదివాక ఒక సమాధానం చూడగానే కచ్చితం అనిపించొచ్చు. కానీ మిగిలినదానిలో మరోటి 'మరికొంచెం కచ్చితం' అనిపిస్తే? దాన్నే సమాధానంగా గుర్తించాలి.

* 73వ రాజ్యాంగ సవరణ ఎన్ని అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రతిపాదించింది?

ఎ) 2 అంచెలు బి) 3 అంచెలు సి) స్పష్టంగా పేర్కొనలేదు డి) 3 అంచెలు; ఏదైనా రాష్ట్రంలో జనాభా 20 లక్షలలోపుంటే రెండు అంచెలు

ఎ, బి- రెండూ సరైనవే. అయితే డి సమాధానంలో మరింత కచ్చితత్వం ఉంది. కాబట్టి అదే సరైన జవాబు!

గ్రూప్‌-1 మెయిన్స్‌ నేపథ్యంలో...
ఇటీవల జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల ప్రశ్నల తీరుతెన్నులు గ్రూప్‌-2లో కూడా పునరావృతం అవ్వొచ్చు. దాన్ని ఎదుర్కొనే వ్యూహం అభ్యర్థుల వద్ద ఉండాలి.

* గ్రూప్‌-1లో వ్యాస రూప ప్రశ్నల్లో ఊహించనివిధంగా స్థూల అవగాహన అవసరమైన ప్రశ్నలను అడిగారు. ఈ అవగాహన లేకుండా ఏవో కొన్ని వ్యాసాలు ముక్కునపెట్టుకు వెళ్ళినవారు డీలా పడ్డారు. గ్రూప్‌-2లో కూడా స్థూల అవగాహనపై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. అందుకని విహంగవీక్షణంతో స్థూల అవగాహన పెంచుకోవాలి.

* ఏపీ చరిత్రలో ప్రధానంగా లలితకళలు, సాహిత్యం లాంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. గ్రూప్‌-2 2008లో కూడా ఇదే ధోరణి. ఈసారి కూడా ఇది కొనసాగవచ్చు.

* తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో తెలంగాణా సాంఘిక సాంస్కృతిక చైతన్య ప్రాముఖ్యం, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు దారితీసిన క్రమం, సంఘటనలపై కూడా ప్రశ్నలు వచ్చాయి. గ్రూప్‌-2 అభ్యర్థులు ఇలాంటి కోణాలను కూడా క్షుణ్ణంగా స్పృశించటం మంచిది.

* పాలిటీ ప్రశ్నలు కూడా అనువర్తన కోణంలోనే గ్రూప్‌-1 మెయిన్స్‌లో అడిగారు. 2008 గ్రూప్‌-2లో ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. ఈసారి కూడా దాదాపుగా అదే ధోరణి కొనసాగవచ్చు. అయితే విశ్లేషణాత్మక అంశాలపై ఒత్తిడి పెరిగినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి.

* ఎకానమీ పేపర్లో గణాంక సమాచారం కంటే స్థూల అవగాహనకే గ్రూప్‌-1 మెయిన్స్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే గ్రూప్‌-2 ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి స్థూల అవగాహనతో ప్రశ్నలు రాకపోవచ్చు. కాబట్టి కొంతమేర గణాంక ప్రభావం ఉండొచ్చు. అంతమాత్రం చేత గణాంకాలే ప్రిపరేషన్‌కు ఆధారం కారాదు. ఏపీ ఎకానమీ ప్రాథమికాంశాలు కీలకంగా భావించి అధ్యయనం మెరుగుపరచుకోవాలి.

* గ్రూప్‌-1 మెయిన్స్‌ వ్యాసరూప ప్రశ్న సరిగా రాయలేదని చాలామంది తర్వాతి పరీక్షలకు హాజరు కాలేదు. అది సరికాదని వేరే చెప్పనవసరం లేదని గ్రూప్‌-2 అభ్యర్థులు గుర్తించాలి. కఠినంగా ఉంటే అది అందరికీ వర్తిస్తుంది. ఒక పేపర్లో మార్కులు తగ్గినా మరో పేపర్లో పెరగవచ్చు. అందుకని వెనుకంజ వేయకుండా చివరివరకూ పోరాడటం అవసరం.

* మొత్తమ్మీద గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రశ్నల్లో కొన్ని హైస్కూలు విద్యార్థి కూడా రాసేలా ఉన్నాయి. మరికొన్ని దినపత్రికల సమాచారంతో రాయగలిగేలా ఉన్నాయి. కొన్ని అనువర్తన కోణంలో మాత్రమే రాసేలా ఉన్నాయి. గ్రూప్‌-2 ప్రశ్నలు కూడా స్థూలంగా (ప్రాథమికాంశాలు) బేసిక్స్‌+ అనువర్తనం ఆధారంగా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా మానసికంగా సన్నద్ధమైతే విజయం తథ్యం!

* చివరిగా... చదివినదానిలోనే ప్రశ్నలు వస్తాయని భావించి కంగు తినొద్దు. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం గుర్తించగలనని భావించి పరీక్షకు హాజరవటం శ్రేయస్కరం.