ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label మేనేజ్ మెంట్/ ఎంసీఏ. Show all posts
Showing posts with label మేనేజ్ మెంట్/ ఎంసీఏ. Show all posts

Monday, 9 September 2013

ఎంబీఏకు మ్యాట్‌ మార్గం


ఎంబీఏ ప్రవేశానికి ఏడాదికి నాలుగుసార్లు జరిగే జాతీయస్థాయి ప్రవేశపరీక్ష 'మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌' (MAT). ప్రసిద్ధ బీ స్కూల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 600 విద్యాసంస్థలు ఈ పరీక్ష స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. డిసెంబర్‌ మ్యాట్‌ ప్రకటన వెలువడిన సందర్భంగా... దీనిలో మెరుగైన ర్యాంకు సాధించటానికి ఏ అంశాలపౖెె దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!

డిగ్రీ ఉత్తీర్ణులే కాకుండా, చివరి సంవత్సరం విద్యార్థులు కూడా మ్యాట్‌ రాయవచ్చు. దీనికి వయః పరిమితి ఏమీ లేదు. పేపర్‌ ఆధారితంగా, కంప్యూటర్‌ ఆధారితంగా- రెండు రకాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు.

మ్యాట్‌ రాయడానికి క్యాట్‌లో మాదిరి కనీస మార్కుల శాతం నిబంధన ఏమీ లేదు. అందువల్ల డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినవారు కూడా మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో దరఖాస్తు చేసుకోవటానికి ఈ పరీక్ష ఓ చక్కని మార్గంగా ఉంది. ప్రతి ప్రవేశపరీక్షా ఆన్‌లైన్‌ పద్ధతిలోకి మారుతున్న ఈ రోజుల్లో ఇంకా కొందరు విద్యార్థులకు కంప్యూటర్‌ చేరువ కాలేదు. ఇలాంటివారికి పేపర్‌ బేస్డ్‌ పద్ధతిలో 'మ్యాట్‌' నిర్వహించటం అనుకూలం. మల్టిపుల్‌ చాయిస్‌ సమాధానాలుండే ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలను సాధించాల్సివుంటుంది. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. తప్పు సమాధానం రాస్తే 1/4 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష అభ్యర్థి సాధారణ సామర్థాన్ని పరీక్షించేలా రూపొందింది.

డిసెంబరు 1న మ్యాట్‌ను పేపర్‌ ఆధారితంగా నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు పరిమితంగా ఉంటే ఈ పరీక్ష కూడా డిసెంబరు 1నే జరుగుతుంది. లేకుంటే డిసెంబరు 7న నిర్వహిస్తారు.
విద్యార్థులు అక్టోబరు మొదటి వారం నుంచి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పేపర్‌ ఆధారిత పరీక్షకు అడ్మిట్‌ కార్డులను AIMA వెబ్‌సైట్‌ http://apps.aima.in/matadmitcard.aspxలో నవంబరు 23 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎలా సంసిద్ధం కావాలి?
విద్యార్థులు మొదట మాక్‌ మ్యాట్‌ రాయాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా నమూనా మ్యాట్‌ పరీక్షను రాసే వీలుంది. ఇలా చేస్తే పరీక్ష పద్ధతి అవగాహనకు వస్తుంది. దానికి అనుగుణంగా ఎలా చదవాలో ప్రణాళికీకరించుకోవచ్చు. నమూనా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినపుడు నిరాశపడకూడదు. ఈ పరీక్ష రాయటం స్కోరు కోసం కాదని గుర్తించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నదీ, వేటిలో పటిష్ఠంగా ఉన్నదీ గుర్తించటానికి ఈ పరీక్ష ఫలితాలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.

ప్రతి టాపిక్‌లోనూ కాన్సెప్ట్‌పై అవగాహన పెంచుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు- రేషియోస్‌ అనే అధ్యాయంలో కీలకాంశం ఏమిటో గ్రహించాలి. తర్వాత ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని రకాల ప్రశ్నలకూ జవాబులు రాసేలా తయారవ్వాలి. మళ్ళీ ఇదే అధ్యాయంలో మరోసారి ఎక్సర్‌సైజులు చేయాలి. ఈసారి సమయం చూసుకోవాలి. 40 నిమిషాలకు 40 మాథ్స్‌ ప్రశ్నలంటే నిమిషానికి ఓ ప్రశ్న. ఒక ఎక్సర్‌సైజులో 10 ప్రశ్నలుంటే వాటిని 10 నిమిషాల్లో చేయటానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు నిమిషం కంటే ఎక్కువ వ్యవధి పట్టవచ్చు; కొన్నిటికి నిమిషం కంటే తక్కువ సమయం పట్టొచ్చు. మొత్తమ్మీద వాటన్నిటినీ 10 నిమిషాల్లో పూర్తిచేయటం ముఖ్యం. ఈ రకంగా చేస్తే వేగం, కచ్చితత్వం కూడా పెరుగుతాయి. ఒక ప్రధానాంశంలోని అన్ని టాపిక్స్‌లోని కాన్సెప్టులపై పట్టు వచ్చాక, వాటన్నిటిపై ఓ పరీక్ష రాయాలి. ఉదాహరణతో చెప్పాలంటే- అరిథ్‌మెటిక్‌లో రేషియో, పర్సంటేజి, సింపుల్‌ ఇంటరెస్ట్‌, కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, వర్క్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఉంటాయి. ఈ కాన్సెప్టులపై అవగాహన సాధించాక అరిథ్‌మెటిక్‌లో పరీక్ష రాసి పరిశీలించుకోవాలి. నేర్చుకున్న అంశాలు దీనివల్ల మరింత పటిష్ఠమవుతాయి. విభిన్నమైన ప్రశ్నల నమూనాలను నిర్దిష్ట వ్యవధిలోనే చేయగలుగుతారు.

జనరల్‌ అవేర్‌నెస్‌ మినహాయించి మిగిలిన మూడు విభాగాలకూ ఇదే తీరు పాటించాలి. ఒక్కో విభాగంపై పట్టు సాధించాక పూర్తి నిడివి పరీక్ష అభ్యాసం చేయటం మొదలుపెట్టాలి. ఒకేసారి రెండున్నర గంటల సమయంలో పరీక్ష రాయటానికి శక్తి, సహనం అవసరమవుతాయి. ఇలాంటి నమూనా పరీక్షలు రాశాక సరైన, తప్పు జవాబులు రెంటినీ విశ్లేషించుకోవాలి. ఫలితంగా స్కోరు క్రమంగా మెరుగుపడుతుంది. అసలైన పరీక్షలో సందేహాలకు అతీతంగా మంచి స్కోరు సాధ్యమవుతుంది.

సారాంశం ఏమిటంటే... కాన్సెప్టులపై మొదట దృష్టిపెట్టాలి. తర్వాత ఎక్సర్‌సైజులు చేయాలి. క్రమంగా పూర్తినిడివి పరీక్షలు రాసి, నైపుణ్యాలూ, వ్యూహాలకు పదునుపెట్టుకోవాలి.

విభాగాలవారీగా  సన్నద్ధత  సూచనలు www.eenadu.net చదువు విభాగంలో  చూడవచ్చు.

Saturday, 24 December 2011

ఆకర్షణీయం... ఐసీఐసీఐ ఎంబీఏ


ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ సంయుక్తంగా ఎంబీఏ (ఫైనాన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌) కోర్సును నిర్వహిస్తున్నాయి.

ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం లభిస్తుంది. 'ఐసీఐసీఐ బిజినెస్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌' పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు.

బ్యాంకింగ్‌ రంగంలో ఉన్నత స్థాయి ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం దీని ప్రధాన లక్ష్యం.

కార్పొరేట్‌ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌కు ఐసీఐసీఐ -ఎన్‌ఐఐటీ అందిస్తోన్న ఎంబీఏ మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఆయిల్‌, గ్యాస్‌,ప ఎనర్జీ, పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌, ఫార్మా, స్టీల్‌, ఏవియేషన్‌, టెలికాం, ఫైనాన్స్‌, టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌, అకౌంట్స్‌, తదితర రంగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌ ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు.

ఏడాదికి రూ.15 లక్షల ప్రారంభ వేతనంతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గ్లోబల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, తదితర విభాగాల్లో వీరికి అవకాశాలుంటాయి.

కోర్సు స్వరూపం
కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 8 టర్మ్‌లు ఉంటాయి. వీటిలో 1, 2 టర్మ్‌లు క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌, తర్వాతి రెండు (3, 4) టర్మ్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 5,6 టర్మ్‌లు క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌, 7,8 టర్మ్‌లలో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఒక్కో టర్మ్‌ వ్యవధి మూడు నెలలు. అభ్యర్థి ఎంచుకున్న ఎలక్టివ్‌లను బట్టి కార్పొరేట్‌ బ్యాంకింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీలో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక మేనేజర్‌ గ్రేడ్‌-2, అనుభవాన్ని బట్టి అంతకంటే ఉన్నత స్థాయిలో ఉద్యోగం పొందవచ్చు.

* కోర్సు ఫీజు రూ.4.5 లక్షలు. ఈ మొత్తాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఏడాదికి 2.5 శాతం వడ్డీతో రుణంగా ఇస్తుంది. కోర్సుకాలంలో ఏమీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తయ్యాక, ఉద్యోగంలో చేరిన దగ్గర్నుంచి 60 ఈఎంఐల రూపంలో రుణం తిరిగి చెల్లించాలి.

* కోర్సు కాలంలో నెలకు రూ.10000 స్టయిపెండ్‌ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.50000 స్టయిపెండ్‌ ఇస్తారు. అభ్యర్థులు కనీసం మూడేళ్లు ఐసీఐసీఐ బ్యాంకులో తప్పనిసరిగా పనిచేయాలి. ఈమేరకు రూ.20 లక్షలకు బాండ్‌ సమర్పించాలి.

ఎంపిక, అర్హతలు
మొత్తం సీట్లు 120. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, సైకోమెట్రిక్‌ ప్రొఫైలింగ్‌ లేదా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంట్రన్స్‌ టెస్ట్‌లో వెర్బల్‌ ఎబిలిటీ, న్యుమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రూప్‌ డిస్కషన్‌లో ప్రధానంగా అభ్యర్థికి గల విశ్లేషణాత్మక, సమస్యా పరిష్కార సామర్థ్యాలను పరీక్షిస్తారు. కోర్సు ఏప్రిల్‌ 2012 నుంచి ప్రారంభమవుతుంది. శిక్షణ రాజస్థాన్‌లోని ఎన్‌ఐఐటీ యూనివర్సిటీలో ఉంటుంది.

సీఏ, ఇంజినీరింగ్‌, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ప్రొఫెషనల్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ, ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌, లా, కామర్స్‌, స్టాటిస్టిక్స్‌ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఫార్మా, స్టీల్‌, ఇన్‌ఫ్రా, సాఫ్ట్‌వేర్‌, ఏవియేషన్‌, పవర్‌, టెలికాం, ఫైనాన్స్‌, పెట్రోలియం, మాన్యుఫ్యాక్చరింగ్‌, తదితర రంగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకు అన్ని కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులుండాలి.

వయసు 15 ఏప్రిల్‌ 2012 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

* అభ్యర్థులు ఐసీఐసీఐ కెరీర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 1 జనవరి 2012.

Saturday, 26 November 2011

మేనేజ్ మెంట్ లో సర్టిఫికెట్‌ కోర్సులు


మేనేజ్‌మెంట్‌ కోర్సులకు అగ్రశ్రేణి సంస్థ లయోలా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (లీబా).

చెన్నైలోని ఈ సంస్థ ఉత్తమ బోధన, సౌకర్యాలు, ప్లేస్‌మెంట్లతో మేనేజ్‌మెంట్‌ కోర్సులను నిర్వహిస్తోంది. పూర్తిస్థాయి పీజీడీఎంతోపాటు మూణ్ణెల్ల వ్యవధి గల సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది.

ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి, సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి ఈ కోర్సులు చాలా ఉపయోగపడతాయి.

ప్రోగ్రామ్‌ల వివరాలు...
* సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైనాన్స్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, కంట్రోల్స్‌ అండ్‌ ఆడిట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ సప్లయ్‌ చైన్‌ మోడలింగ్‌ అండ్‌ ఎనాలిసిస్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌
* సర్టిఫికెట్‌ ఇన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌లకు అర్హులు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం,

ఇతర వివరాలు సంస్థ వెబ్‌సైట్ http://liba.edu/index.php లో లభిస్తాయి.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 4 జనవరి 2012.

ప్రోగ్రామ్‌లు 22 జనవరి 2012 నుంచి ప్రారంభమవుతాయి.

పై ప్రోగ్రామ్‌లతోపాటు సర్టిఫికెట్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును కూడా లీబా నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) సహకారంతో ఈ కోర్సును అందిస్తోంది. దీనిలో ప్రవేశానికి అర్హత ఏదైనా డిగ్రీ. ఈ ప్రోగ్రామ్‌కు విడిగా నోటిఫికేషన్‌ వెలువడుతుంది.

Friday, 11 November 2011

పెట్రోలియం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ

పెట్రోలియం, ఎనర్జీ స్పెషలైజేషన్‌లతో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులను అందిస్తోన్న సంస్థ.. రాజీవ్‌గాంధీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ).

రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్‌)లోని ఈ సంస్థ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

ఇందులో పెట్రోలియం అండ్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ చేయవచ్చు. ఈ సంస్థ అత్యున్నత ప్రమాణాలతో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది.

ఎంబీఏ (పెట్రోలియం అండ్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌)లో సీట్ల సంఖ్య 50.

టెన్త్‌, ఇంటర్‌లో మేథ్స్‌ సబ్జెక్టుతో కనీసం 60 శాతం మార్కులు అవసరం.
ఏదైనా బ్రాంచిలో బీటెక్‌ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
వీటితోపాటు క్యాట్‌ 2011 / జీమ్యాట్‌ 2011 (జూన్‌ 2011 తర్వాత) స్కోరు అవసరం.
వీటి ఆధారంగా అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఎంపికలో అభ్యర్థుల అకడమిక్‌ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

కొన్ని సీట్లు స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఈ అభ్యర్థులకు బీటెక్‌లో కనీసం 65 శాతం మార్కులు, రెండేళ్ల పని అనుభవం అవసరం. క్యాట్‌, జీమ్యాట్‌ స్కోర్లు అవసరం లేదు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆర్‌జీఐపీటీలో ఎంబీఏ చేసిన అభ్యర్థులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, తదితర ప్రభుత్వ రంగ కంపెనీలు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాయి. వీటితోపాటు కెయిర్న్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌ - మిట్టల్‌ ఎనర్జీ లిమిటెడ్‌, యాక్సెంచూర్‌ సర్వీసెస్‌, భారత్‌- ఒమన్‌ రిఫైనరీస్‌, తదితర కంపెనీలు ప్లేస్‌మెంట్లు కల్పిస్తున్నాయి.

* ఆర్‌జీఐపీటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల ప్రింట్లను సంబంధిత సర్టిఫికెట్‌ కాపీలతో పంపాలి. ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ  5 డిసెంబరు 2011.

Tuesday, 1 November 2011

జీమ్యాట్‌ వెబ్‌సైట్... ‌ భారతీయ విద్యార్థుల కోసం!

విదేశాల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీమ్యాట్‌).

ఈ పరీక్షను గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీమ్యాక్‌) నిర్వహిస్తోంది. జీమ్యాట్‌ రాసే భారతీయ విద్యార్థుల కోసం జీమ్యాక్‌ ప్రత్యేకంగా పేరుతో ఓ వెబ్‌సైట్‌ ను రూపొందించడం విశేషం.

భారతదేశంలోని ఐఎస్‌బీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఐఎంలు, అనేక ఇతర ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ స్కూళ్లు కూడా జీమ్యాట్‌ స్కోరును ఆమోదిస్తున్నాయి. దీనితోపాటు మనదేశంలో జీమ్యాట్‌ విద్యార్థులకు ఉండే విద్యావకాశాల పూర్తి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.

మనదేశంలో జీమ్యాట్‌ రాసే అభ్యర్థుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. జీమ్యాట్‌ను ఆమోదించే సంస్థల సంఖ్య కూడా గణనీయంగా అధికమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీమ్యాక్‌ ప్రత్యేకంగా www.mba.com/india వెబ్‌సైట్‌ను రూపొందించింది. దేశంలో మూడువేల పైచిలుకు బిజినెస్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను నిర్వహిస్తోన్న సంస్థలు చాలా తక్కువ. కఠినమైన ప్రవేశ పరీక్షగా పేరున్న జీమ్యాట్‌లో మంచి స్కోరు సాధిస్తే ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవచ్చు.

జీమ్యాట్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా మనదేశంలో జీమ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పించే బిజినెస్‌ స్కూళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. వివిధ అంశాల్లో నాణ్యతా ప్రమాణాల ఆధారంగా బిజినెస్‌ స్కూళ్లను వర్గీకరించి ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జీమ్యాట్‌ను ఆమోదించే ఆయా బిజినెస్‌ స్కూళ్ల ప్లేస్‌మెంట్‌ వివరాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. జీమ్యాట్‌ ఆధారంగా అంతర్జాతీయ స్థాయి బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు ఈ వెబ్‌సైట్‌ చాలా ఉపయోగపడుతుంది.

ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చేయడానికి అయ్యే ఫీజుల వివరాలను కూడా ఇందులో పొందుపరచారు. విదేశీ యూనివర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఏర్పరచుకోవడం ద్వారా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోన్న సంస్థల సమాచారం ఈ సైట్‌లో లభిస్తుంది. భారతదేశంలో ఎంబీఏ చేయాలంటే సంస్థను బట్టి ఖర్చు రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ కోర్సులకు అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు, సంబంధిత నియమ నిబంధనలను తెలుసుకోవచ్చు.

జీమ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తోన్న ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు కొన్ని...
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హైదరాబాద్‌
*ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంలు): అహ్మదాబాద్‌, బెంగళూరు, కలకత్తా, ఇండోర్‌, లక్నో
* ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ, జంషెడ్‌పూర్‌
* టాటా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబాయి
* ఎస్‌పీ జైన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబాయి
* నార్సీ మోంజీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబాయి
* ఐఐఎఫ్‌టీ, న్యూఢిల్లీ
* వీఐటీ బిజినెస్‌ స్కూల్‌, వీఐటీ యూనివర్సిటీ
* గీతం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, విశాఖపట్నం * ఆచార్య గ్రూప్‌ ఆఫ్‌ ఇన్ స్టిట్యూషన్స్‌, బెంగళూరు
* ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌, హైదరాబాద్‌ * మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్ స్టిట్యూట్‌, గుర్గావ్‌

Wednesday, 19 October 2011

గీతం 'హెచ్‌బీఎస్‌'లో ఎంబీఏ


రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థ గీతం యూనివర్సిటీ (హైదరాబాద్‌ క్యాంపస్‌) మేనేజ్‌మెంట్‌ కోర్సుల నిర్వహణకు ప్రత్యేకంగా 'హైదరాబాద్‌ బిజినెస్‌ స్కూల్‌' (హెచ్‌బీఎస్‌)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎంబీఏతోపాటు మేనేజ్‌మెంట్‌లో ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తోంది.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రోగ్రామ్‌లు, వాటికి అవసరమైన అర్హతలు, ఇతర వివరాలు...

* ఎంబీఏ: ఇందులో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ఎం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.

క్యాట్‌, జీమ్యాట్‌, మ్యాట్‌ స్కోర్ల ఆధారంగా ఎంబీఏలో ప్రవేశం లభిస్తుంది. ఈ స్కోర్లు లేని అభ్యర్థులు సంస్థ నిర్వహించే హెచ్‌బీశాట్‌ రాయాలి. వీటితోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అవసరం. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. ప్రొఫెషనల్‌ కోర్సుల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఎం.ఫిల్‌. మేనేజ్‌మెంట్‌ (ఫుల్‌టైమ్‌/ పార్ట్‌టైమ్‌): ఫుల్‌టైమ్‌ కోర్సుకు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌టైమ్‌ కోర్సులో ప్రవేశానికి పై అర్హతలతోపాటు సంబంధిత రంగంలో అనుభవం అవసరం.

* పీహెచ్‌డీ - మేనేజ్‌మెంట్‌ (పార్ట్‌టైమ్‌/ ఫుల్‌టైమ్‌): ఫుల్‌టైమ్‌ కోర్సుకు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా పీజీ డిగ్రీ అవసరం. ఎం.ఫిల్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ జీప్యాట్‌ అర్హతలున్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. ఎం.ఫిల్‌. ఉన్నవారికి ప్రీ-పీహెచ్‌డీ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. పార్ట్‌టైమ్‌ కోర్సులో ప్రవేశానికి పై అర్హతలతోపాటు నిర్దిష్ట కాలం అనుభవం అవసరం.

ఆయా కోర్సులకు అవసరమైన అనుభవం, కోర్సుల వ్యవధి, ఫీజుల వివరాలు జీహెచ్‌బీఎస్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఫుల్‌టైమ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందిన నలుగురు అభ్యర్థులకు నెలకు రూ. 8000 చొప్పున అసిస్టెంట్‌షిప్‌ లభిస్తుంది.

 దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ - (ఎంబీఏ కోర్సుకు):

హెచ్‌బీశాట్‌ అభ్యర్థులకు                   - 21 జనవరి 2012
జీమ్యాట్‌, క్యాట్‌, మ్యాట్‌ అభ్యర్థులకు - 18 ఫిబ్రవరి 2012.

Monday, 17 October 2011

మంచి ఎంబీఏకి మెలకువలు

 ఎంబీఏ ద్వారా మంచి కెరియర్‌ను ఆశిస్తోన్న విద్యార్థులు కేవలం కాలేజీలు అందించే సౌకర్యాల మీదనే ఆధారపడకూడదు. సొంత కెరియర్‌ ప్రణాళిక అవసరం. విజయవంతంగా ఎంబీఏ పూర్తిచేసి, మంచి మేనేజర్‌ అవ్వాలంటే కింది అంశాలపై అవగాహన అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా, మీరు ఏ లక్ష్యం కోసం ఎంబీఏలో చేరారో దానిమీదే దృష్టిపెట్టాలి. సొంతగా వ్యాపారం చేయడం, కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకోవడం, మంచి కంపెనీలో చేరడం... ఇలా మీ లక్ష్యం ఏదైనా... దానిపై పూర్తి స్పష్టత ఉండాలి. తద్వారా మీ కార్యాచరణ, లక్ష్యసాధన సులువవుతుంది.

మొదటి మెట్టు... తెలివితేటలు
సబ్జెక్టులో మంచి పట్టు, తెలివితేటలు సాధించడం ఎంబీఏలో విజయానికి తొలిమెట్టు. మేనేజ్‌మెంట్‌ భావనలు, సిద్ధాంతాలు, అనువర్తనాలను బాగా నేర్చుకోవాలి. మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, తదితర ఫంక్షనల్‌ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఎకనమిక్స్‌, బిజినెస్‌ స్ట్రాటజీ అండ్‌ పాలసీ, ఎథిక్స్‌ అండ్‌ గవర్నన్స్‌, లీడర్‌షిప్‌ అండ్‌ చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ఇంటెగ్రేటెడ్‌ అంశాలను నేర్చుకోవాలి. వీటితోపాటు ఎంబీఏ అభ్యర్థులకు కింది సబ్జెక్టు అంశాల్లో సరైన అవగాహన అవసరం...

* మీకు ఆసక్తి గల స్పెషలైజేషన్‌లో తాజా పరిణామాలు, ఆధునిక అంశాలు
* సమస్యా పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ నమూనాలు, అందులోని ప్రక్రియలు
* ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌
* టీమ్‌ను తయారుచేయడం
* వ్యవస్థలను రూపొందించడం, అభివృద్ధి చేయడం

రెండో మెట్టు... సామర్థ్యాలు
కేవలం సబ్జెక్టులో తెలివితేటల ద్వారా మంచి మేనేజర్‌ కాలేరు. తెలిసిన అంశాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. ఎంబీఏ విద్యార్థులు ప్రధానంగా ఆరు రకాల సామర్థ్యాలను బాగా పెంపొందించుకోవాలి. అవి... 1. కమ్యూనికేషన్‌, ఇంటర్‌ పర్సనల్‌ అండ్‌ ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌ 2. టీమ్‌ బిల్డింగ్‌ అండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ 3. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు 4. సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం, ఘర్షణలను నివారించడం 5. పరిశోధన, ప్రణాళిక, మదింపు సామర్థ్యాలు 6. ఆర్గనైజేషనల్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌.

మూడో మెట్టు... ఆలోచన ధోరణి
పని, వ్యక్తులు, సంఘటనల పట్ల స్పందించడంలో మెలకువలు పాటించడం తప్పనిసరి. సానుకూల ఆలోచన అవసరం. ఎంబీఏ విద్యార్థులు దృష్టిపెట్టాల్సిన అత్యంత ముఖ్యమైన అంశాలు... ఆలోచన ధోరణి, వ్యక్తిత్వం, ప్రవర్తన. ఒక వ్యాపార అంశాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కీలకంగా పనిచేస్తాయి. మేనేజ్‌మెంట్‌ కెరియర్‌లో విజయం సాధించాలంటే కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు అవసరం. అవేమిటంటే... సహోద్యోగులను గౌరవించాలి. పని పట్ల బాధ్యతాయుతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. ఇతరుల భావాలను, నేపధ్యాన్ని అర్థం చేసుకోవాలి. సహనం, కృత నిశ్చయం, మనోనిబ్బరం అలవరచుకోవాలి. నాయకత్వం లేకపోయినా పనిలో నిబద్ధతతో పాలుపంచుకోవాలి. ఈ వ్యక్తిత్వ లక్షణాలన్నీ ఒకేసారి అలవడేవి కాదు. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరచుకోవాలి.

* సాధారణ ఎంబీఏ కాలేజీల్లో పైన పేర్కొన్న అంశాలపై పెద్దగా దృష్టిపెట్టకపోవచ్చు. కానీ మీ కెరియర్‌ను సరైన రీతిలో మలచడంలో ఇవి చాలా కీలకమైన అంశాలని మర్చిపోవద్దు.

అదనంగా చేయాల్సింది ఎంతో..!
ఎంబీఏ కోర్సు ద్వారా మీరు ఆశించిన కెరియర్‌ దక్కాలంటే కింది అంశాలను ఆచరణలో పెట్టాలి. మీరు చేరిన కాలేజీలో అద్భుతమైన సౌకర్యాలు లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కేవలం తరగతి గదిలో నేర్చుకునేవి, మంచి సిలబస్‌ ఉంటే సరిపోదు. అదనంగా చేయాల్సింది చాలా ఉంటుంది. చాలా సందర్భాల్లో తరగతి గదిలో నేర్చుకునేదానికి, వాస్తవిక వ్యాపార వాతావరణానికి సంబంధం ఉండకపోవచ్చు. అందువల్ల మీరే శ్రద్ధతో తాజా అంశాలను నేర్చుకోవాలి.

* స్టాక్‌ మార్కెట్లు, బులియన్‌, క్రూడ్‌ ఆయిల్‌, ఫారిన్‌ ఎక్చేంజ్‌, ద్రవ్యోల్బణం అంశాల్లో పరిణామాలను నిత్యం గమనిస్తుండాలి.

* సీఎన్‌బీసీ, ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ లాంటి బిజినెస్‌ న్యూస్‌ చానెళ్లను చూడొచ్చు. ఎన్డీటీవీ, బీబీసీ, తదితర న్యూస్‌ చానళ్లను కూడా చూడొచ్చు. బిజినెస్‌ లైన్‌, ఎకనమిక్‌ టైమ్స్‌, ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌, తదితర వ్యాపార పత్రికలను చదవచ్చు. రోజూ కనీసం ఒక బిజినెస్‌ వార్తా పత్రికను క్షుణ్నంగా చదివితే మంచిది.

* బిజినెస్‌ ఇండియా, బిజినెస్‌ టుడే, తదితర మేగజీన్లను చదవాలి. బడ్జెట్‌లు, క్రెడిట్‌ పాలసీలు, వ్యాపార పుస్తకాల సమీక్షలు చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఉపయోగపడే బిజినెస్‌ వెబ్‌సైట్లను కూడా చూస్తుండాలి.



చొరవ తప్పనిసరి
ప్రస్తుతం నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాలేజీలో సౌకర్యాలు లేవని బాధపడటం కంటే స్వీయ చొరవతో నేర్చుకోవడానికి గల మార్గాలను అన్వేషించడం ఉత్తమం. తద్వారా తోటి విద్యార్థుల కంటే పోటీలో ముందుండగలరు. ఎంబీఏ లాంటి వృత్తి విద్యా కోర్సులో ఆచరణకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. తరగతి గదిలో నేర్చుకునే సిద్ధాంతాలను లైవ్‌ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, కేస్‌ స్టడీల రూపంలో ఆచరణలో పెట్టడం ద్వారా ఆ అంశాలపై మరింత స్పష్టత ఏర్పడుతుంది. కింది అంశాలపై కూడా దృష్టినిలపాలి.

* గెస్ట్‌ లెక్చర్లకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఒకవేళ మీ కాలేజీలో అలాంటివి నిర్వహించకపోతే, మీరే చొరవ తీసుకొని ఏర్పాటు చేయించడానికి ప్రయత్నించవచ్చు. సబ్జెక్టు, పరిశ్రమల నిపుణులు చెప్పే అంశాల ద్వారా అవగాహన పరిధి విస్తరిస్తుంది.

* సాధారణ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌లకు సరిగా ప్రాధాన్యం ఉండదు. సీరియస్‌గా ఇంటర్న్‌షిప్‌ చేసిన విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. రొటీన్‌ అంశాలపై కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే అంశాలపై ఇంటర్న్‌షిప్‌ చేయాలి.

* మేనేజ్‌మెంట్‌ రంగంలో ఉన్నన్ని సంఘాలు, సంస్థలు మిగతా రంగాల్లో ఉండవేమో! పారిశ్రామిక సంఘాలు, విద్యాసంస్థలు నిర్వహించే సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లకు తప్పనిసరిగా హాజరవ్వాలి. వీటిల్లో సభ్యత్వం తీసుకుంటే ఇంకా మంచిది. ఈ సంఘాలు నిర్వహించే సమావేశాల్లో పరిశోధన పత్రాలు ప్రెజెంట్‌ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోవద్దు.

* మేనేజ్‌మెంట్‌ కెరియర్‌లో ప్రవేశించాక వివిధ దశల్లో చాలా నివేదికలు రాయాల్సి ఉంటుంది. సెమినార్లు, వర్క్‌షాప్‌లలో పేపర్ల ప్రెజెంటేషన్‌ రూపంలో ఇప్పటి నుంచే దీన్ని సాధన చేయవచ్చు. వ్యాపార పత్రికలకు, మేగజీన్లకు ఉత్తరాలు రాయడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు.

* ప్రస్తుత వ్యాపార వాతావరణంలో నెగ్గుకురావాలంటే మేనేజర్లకు అనేక కీలకమైన సామర్థ్యాలు అవసరం. వీటిలో కొన్ని... నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, పీపుల్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌, సమస్యలను సమర్థంగా పరిష్కరించగలగడం, ఒత్తిడిని అధిగమించడం, కుటుంబ జీవితం - విధి నిర్వహణల మధ్య సమతౌల్యం సాధించడం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం.

పోటీలో ముందుండాలంటే...
ప్రస్తుత పోటీ వాతావరణంలో తోటి విద్యార్థులకంటే ముందుండాలంటే అసలు డిగ్రీకి అదనపు హంగులు కూడా అవసరమే. ఎంబీఏతోపాటు కొద్దిపాటి శ్రమతో సాధించగల సర్టిఫికేషన్‌లు చాలా ఉంటాయి. ఎన్‌సీఎఫ్‌ఎం, ఏఎంఎఫ్‌ఐ, సెబీ, తదితర సంస్థలు అందించే సర్టిఫికేషన్‌లకు మంచి విలువ ఉంటుంది. ఈ అదనపు అర్హతలు మిమ్మల్ని మీ క్లాస్‌మేట్ల కంటే పోటీలో ముందుంచుతాయి. మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్లు, రిటైల్‌, తదితర సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ కోర్సులను ఎంచుకోవచ్చు.

* ప్లేస్‌మెంట్ల గురించి కూడా మొదటి నుంచి ఆలోచించాలి. ఈ విషయంలో కాలేజీ నుంచి సరైన సహకారం లేకపోతే విద్యార్థులే ప్లేస్‌మెంట్‌ కమిటీగా ఏర్పడి కంపెనీలతో సంప్రదింపులు జరపవచ్చు.

* ప్లేస్‌మెంట్ల ధోరణిని నిరంతరం గమనిస్తుండాలి. పత్రికల్లో వచ్చే నియామక ప్రకటనలను పరిశీలిస్తే, కంపెనీలు అభ్యర్థుల నుంచి ఎలాంటి అర్హతలు, సామర్థ్యాలు ఆశిస్తున్నాయో అర్థమవుతుంది.

* క్రమం తప్పకుండా లైబ్రరీలో పుస్తకాలు, జర్నళ్లు చదవడానికి, ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌ చూడటానికి కొంత సమయం వెచ్చించాలి.
ఈ కథన  రచయిత...  ప్రొ. ఎం. భాస్కరరావు .

Wednesday, 14 September 2011

మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మెరుగైన విద్యాసంస్థలు

దేశంలో అనేక కార్పొరేట్‌ విద్యా సంస్థలు సాధారణ యూనివర్సిటీలకంటే నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఆధునిక సౌకర్యాలు, మంచి ప్లేస్‌మెంట్లతో ఐఐఎంలకు దీటుగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి.

అలాంటి కొన్ని సంస్థల గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం.

ఇదో కోవలోకి వచ్చే మరికొన్ని...

* ఎస్‌పీ జైన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబయి (ఎస్‌పీజేఐఎంఆర్‌);
* మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్ స్టిట్యూట్‌ (ఎండీఐ), గుర్గావ్‌;
* భారతీదాసన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐఎం), తిరుచిరాపల్లి.


ఈ సంస్థల్లో అందిస్తోన్న మేనేజ్‌మెంట్‌ కోర్సులు, వాటి ప్రత్యేకతలు, ప్రవేశ వివరాలు తెలుసుకుందాం.

అంతర్జాతీయ గుర్తింపు సంస్థల అక్రెడిటేషన్‌తో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోన్న అరుదైన సంస్థ ఎండీఐ, గుర్గావ్‌. ఈ సంస్థకు లండన్‌లోని అసోసియేషన్‌ ఆఫ్‌ ఎంబీఏస్‌ (ఏఎంబీఏ) గుర్తింపు ఉంది. ఉన్నత అర్హతలు, అనుభవం గల జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్‌ల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. పారిశ్రామికంగా మంచి గుర్తింపు పొందిన గుర్గావ్‌లో ఈ సంస్థ ఉండటం సంస్థకు, విద్యార్థులకు సానుకూల అంశం.

ఎండీఐలో ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అనేక పార్ట్‌టైమ్‌, పీజీపీఎం, డాక్టొరల్‌ ప్రోగ్రామ్‌లు చేయవచ్చు. ముఖ్యమైన ప్రోగ్రామ్‌లు కొన్ని...

* పీజీపీ ఇన్‌ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌
* పీజీపీ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌
* పీజీపీ ఇన్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌
* పీజీపీ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ మేనేజ్‌మెంట్‌
* ఫెలో/ ఎగ్జిక్యూటివ్‌ ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌
* నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎగ్జిక్యూటివ్‌ పీజీడీఎం)
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌

ఎండీఐ అందిస్తోన్న మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ, ఎన్‌బీఏ గుర్తింపు ఉంది. నేషనల్‌ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ సహకారంతో పీజీపీ - హెచ్‌ఆర్‌ను నిర్వహిస్తోంది. పరిశోధనలకు కూడా ఈ సంస్థ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, కార్పొరేట్‌ గవర్నన్స్‌, తదితర అంశాల్లో పరిశోధనలు చేయవచ్చు. కంపెనీల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగుల కోసం అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తోంది.

అనేక విదేశీ బిజినెస్‌ స్కూళ్లతో స్టూడెంట్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రామ్‌లను ఎండీఐ నిర్వహిస్తోంది. వీటిలో పాల్గొనడానికి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌లతోపాటు ఎండీఐ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, ఒ.పి. జిందాల్‌ స్కాలర్‌షిప్‌లు పొందవచ్చు.

* పీజీపీఎం (2012-14)లో ప్రవేశానికి ఎండీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. క్యాట్‌ 2011 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆదారంగా ఎండీఐలో ప్రవేశం లభిస్తుంది.

* అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎండీఐ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఫిబ్రవరి- ఏప్రిల్‌ 2012లో గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

* దరఖాస్తులకు చివరితేదీ 20 అక్టోబరు 2011.

బీఐఎం, తిరుచిరాపల్లి
ప్రధాన స్రవంతి యూనివర్సిటీలకు చెందిన మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ప్రముఖమైనది... భారతీదాసన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐఎం- తిరుచిరాపల్లి). టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓగా పనిచేసిన ఎస్‌. రామదొరై పాలనా నేతృత్వంలో బీఐఎం కొనసాగుతోంది. మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, సిస్టమ్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లతో ఎంబీఏ కోర్సును బీఐఎం అందిస్తోంది. ఐఐఎంలు, ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల నిపుణులతో శిక్షణ అందిస్తోంది.
యూనివర్సిటీలో భాగంగా ఉన్నప్పటికీ ప్రత్యేక బిజినెస్‌ స్కూల్‌ మాదిరిగా బీఐఎం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతోంది. భారతీదాసన్‌ యూనివర్సిటీ పరిధిలో స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా గుర్తింపు పొందింది. మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, మార్పులు, చేర్పులలో ప్రభుత్వ రంగ కంపెనీ బీహెచ్‌ఈఎల్‌, సీఐఐ పాలుపంచుకుంటున్నాయి. విద్యార్థులకు బీహెచ్‌ఈఎల్‌ ప్రాజెక్టులను కూడా ఇస్తోంది. అనేక కార్పొరేట్‌ కంపెనీల్లో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు చేసే అవకాశం ఉంటుంది. క్యాట్‌ 2011 స్కోర్లను మాత్రమే బీఐఎం పరిగణనలోకి తీసుకుంటుంది. క్యాట్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ వివిధ కేటగిరీల అభ్యర్థులకు ఇలా ఉండాలి... ఓసీ-90; బీసీ-75; ఎంబీసీ-60; ఎస్సీ-50, ఎస్టీ-50.

* కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. అభ్యర్థులు క్యాట్‌ 2011 పరీక్ష తప్పనిసరిగా రాయాలి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో బీఐఎంకు దరఖాస్తు చేయవచ్చు. ఐఎంఎస్‌ లెర్నింగ్‌ సెంటర్లలో కూడా దరఖాస్తులు లభిస్తాయి. 1 డిసెంబరు 2011 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.

చివరితేదీ 30 జనవరి 2012.


'రిటైల్‌' ప్రత్యేకతకు 'లీబా' - చెన్నై
నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ కోర్సులను మరో రెండు అగ్రశ్రేణి ప్రైవేటు సంస్థలు... లయోలా ఇన్  స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (లీబా- చెన్నై), జేవియర్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (భువనేశ్వర్‌).

* వ్యాపార రంగంలో జాతీయ, అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సమర్థులైన నిపుణులను తయారుచేయడానికి మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించిన సంస్థ లయోలా ఇన్ స్టిట్యూట్‌. జనరల్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, సిస్టమ్స్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, రిటైలింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్పెషలైజేషన్లతో పీజీడీఎం కోర్సులను నిర్వహిస్తోంది. ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. - ఎక్స్‌ఏటీ ఆధారంగా ఎంపిక చేస్తుంది. తర్వాత జీడీ, ఇంటర్వ్యూ ఉంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కావచ్చు.

* జేవియర్‌ ఇన్ స్టిట్యూట్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎం, రూరల్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్లతో పీజీడీఎం, ఫెలోప్రోగ్రామ్‌లను ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. తొలిదశలో క్యాట్‌ లేదా జేవియర్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటాయి. వీటితోపాటు అకడమిక్‌ రికార్డు, పని అనుభవం కూడా ఎంపికలో కీలకంగా పనిచేస్తాయి. అభ్యర్థులు ఎక్స్‌ఐఎంబీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేయవచ్చు.

చివరితేదీ 21 నవంబరు 2011.

Wednesday, 7 September 2011

మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ కోసం...


ప్రముఖ కార్పొరేట్‌ బిజినెస్‌ స్కూల్‌  XLRI (జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్ స్టిట్యూట్‌, జంషెడ్‌పూర్‌).  ఇది దేశంలోని అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో  ముందువరుసలో ఉంటుంది.

మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ కోసం అనేక పీజీ సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహిస్తోంది.

హెచ్‌సీఐఎల్‌, రిలయన్స్‌ వరల్డ్‌ సహకారంతో నిర్వహిస్తోన్న ఈ కోర్సులను శాటిలైట్‌ ప్రోగ్రామ్‌లుగా వ్యవహరిస్తోంది.

మేనేజ్‌మెంట్‌ రంగంలో అనుభవం ఉన్న/  పనిచేస్తోన్న అభ్యర్థులకు ఈ కోర్సులు బాగా ఉపయోగపడతాయి.

ప్రోగ్రామ్‌ల వివరాలు...

* పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌/ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌/ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌.

ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో నిర్వహిస్తారు.

* ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ను ఫీజు డీడీతో కలిపి పంపించాలి. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు, ప్రింట్‌ల స్వీకరణకు చివరితేదీ 28 సెప్టెంబరు 2011.

* అర్హులైన అభ్యర్థులకు 10-25 అక్టోబరు 2011 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉద్యోగాలు చేసే అభ్యర్థులకు అనుకూలమైన సమయాల్లో తరగతులు ఉంటాయి.

ఇతర వివరాలు ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. వెబ్‌సైట్‌ లో లభిస్తాయి.

Tuesday, 6 September 2011

ఫీజు లేకుండా... ఐఐఎంలో కోర్సు!

మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో ఉన్నత స్థాయి కోర్సులవైపు అభ్యర్థులను ఆకర్షించడానికి ఐఐఎంలు ప్రయత్నిస్తున్నాయి.

దీనికోసం ఫీజులు లేకుండా, ఆకర్షణీయమైన స్టయిపెండ్‌ అందిస్తూ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక స్పెషలైజేషన్లతో ఫెలో ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి.

మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు ఐఐఎం ఇండోర్‌ ప్రారంభించిన ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌పీఎం) సరైన కోర్సు.  

ఈ డిగ్రీ పీహెచ్‌డీతో సమానం.

ఐఐఎం ఇండోర్‌ నిర్వహిస్తోన్న ఎఫ్‌పీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందినవారికి అనేక సౌకర్యాలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. కోర్సులో చేరిన అందరికీ మొదటి రెండేళ్లు నెలకు రూ.15000 చొప్పున స్టయిపెండ్‌ ఇస్తారు. తర్వాతి రెండేళ్లు నెలకు రూ.20000 చొప్పున స్టయిపెండ్‌ లభిస్తుంది. వీటితోపాటు పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద ఏటా రూ.25000 లభిస్తుంది.

కోర్సు మొదటి నాలుగేళ్లకు ఎలాంటి ట్యూషన్‌ ఫీజూ ఉండదు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. ఇన్ని సౌకర్యాలతో ఐఐఎంలో చదివే అవకాశం అందుబాటులో ఉంది.

ఇప్పటికే కంపెనీల్లో వివిధ స్థాయుల్లో పనిచేస్తోన్న మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ను శిక్షణ, పరిశోధన, కన్సల్టింగ్‌ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దడం ఐఐఎం ఇండోర్‌ అందిస్తోన్న ఎఫ్‌.పి.ఎం. (ఇండస్ట్రీ) ప్రోగ్రామ్‌ ప్రధాన లక్ష్యం. ఆధునిక పరిశోధన అంశాలు, బోధన పద్ధతుల ద్వారా ఇందులో శిక్షణ లభిస్తుంది.

అభ్యర్థులు వారి పని అనుభవం, విద్యా నేపధ్యాన్ని బట్టి కింది స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు...

* జనరల్‌ మేనేజ్‌మెంట్‌ - కమ్యూనికేషన్‌
* ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌
* ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌
* ఫైనాన్షియల్‌ ఎకనమిక్స్‌
* మార్కెటింగ్‌
* ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హెచ్‌.ఆర్‌.ఎం.
* ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌
* స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌

కోర్సు స్వరూపం
ఎఫ్‌పీఎం వ్యవధి నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల వరకు ఉంటుంది. కోర్సు మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి ఏడాది కోర్సు వర్క్‌ ఉంటుంది. ఇది ఐఐఎం ఇండోర్‌ నిర్వహిస్తోన్న పీజీపీ ప్రోగ్రామ్‌తో సమాన స్థాయిలో ఉంటుంది. రెండో ఏడాది నుంచి అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో శిక్షణ ఇస్తారు. అంతేగాక పరిశోధనలకు అవసరమైన రిసెర్చ్‌ మెథడాలజీ, అకడమిక్‌ అంశాలపై అవగాహన కల్పిస్తారు. రెండేళ్ల తర్వాత అభ్యర్థులు తమ స్పెషలైజేషన్లకు సంబంధించిన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు థీసిస్‌ రాయాలి. ఇది పూర్తిచేస్తే డాక్టొరేట్‌ లభిస్తుంది.

అర్హతలు, ప్రవేశం
మొదటి నుంచి మంచి అకడమిక్‌ రికార్డు ఉన్న అభ్యర్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం లభిస్తుంది. అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసుండాలి. సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్‌ పూర్తిచేసిన వారు కూడా అర్హులు. వీరికి కనీసం 55 శాతం మార్కులు అవసరం. 60 శాతం మార్కులున్న బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ/ సీడబ్ల్యుఏ, సీఎస్‌/ బీటెక్‌, తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన అభ్యర్థులకు మేనేజ్‌మెంట్‌ రంగంలో కనీసం రెండేళ్ళ అనుభవం అవసరం.

అభ్యర్థులకు క్యాట్‌/ జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోరు అవసరం.
ఇవేవీ లేకపోతే ఐఐఎం ఇండోర్‌ నిర్వహించే రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రాయాలి.
గుర్తింపు పొందిన కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ అధ్యాపకులుగా మూడేళ్లు అనుభవం ఉన్నవారిని నేరుగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
సీఎస్‌ఐఆర్‌- యూజీసీ జేఆర్‌ఎఫ్‌ ఉన్నవారు కూడా పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.

* ఐఐఎం ఇండోర్‌ వెబ్‌సైట్‌  నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తులు చేరడానికి చివరితేదీ : 20 జనవరి 2012.

Sunday, 4 September 2011

క్యాట్ కు పెరగనున్న పోటీ!

ఐఎంలు, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి   ‘క్యాట్’ నిర్వహిస్తారని తెలుసు కదా?

ఈ పోటీ  పరీక్షకు  మరింత పోటీ పెరగబోతోంది! 

ఎందుకంటే... ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి క్యాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోవాలని ఐఐటీలు కూడా  నిర్ణయించాయి. 

కార్పొరేట్ ఎంబీఏకి సంబంధించిన మరిన్ని విశేషాలను  రామకృష్ణ  రాసిన ఈ  కథనం లో చదవండి...

Wednesday, 24 August 2011

ఐఐఎంల తర్వాత అగ్రగామి సంస్థలేవి?


ఇంజినీరింగ్‌ విద్య అంటే ఐఐటీలే. ఇవి మేనేజ్‌మెంట్‌ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి.

ఐఐఎంల తర్వాత నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ శిక్షణ వీటిలో లభిస్తోంది!

ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐటీలు ఏటా నిర్వహించే జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (జేఎంఈటీ)పై ఈ ఏడాది సందిగ్థత  ఏర్పడింది. ఈ పరీక్షకు  స్పందన తగ్గిపోతుండటంతో ఐఐటీలు ఆలోచనలో పడ్డాయి. జేఎంఈటీకి బదులుగా క్యాట్‌ ఆధారంగా ఐఐటీల్లో కూడా మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదనలపై ఐఐటీలు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాయి.

వీటితోపాటు బెంగళూరులోని ఐఐఎస్‌సీ కూడా ఎంబీఏ కోర్సు నిర్వహిస్తోంది.

మేనేజ్‌మెంట్‌ కోర్సుల నిర్వహణకు జాతీయస్థాయిలో ప్రసిద్ధిగాంచిన కార్పొరేట్‌ సంస్థలు మనదేశంలో అనేకం ఉన్నాయి.  వీటిలో ప్రముఖమైనవి...

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ,
ఇర్మా,
నార్సీమోంజీ,
సింబయోసిస్‌,
ఎఫ్‌.ఎం.ఎస్‌.,
టిస్‌.


ఇవన్నీ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా ఎంబీఏ లేదా పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలతో కోర్సుల నిర్వహణలో ఈ సంస్థలన్నీ ఐఐఎంలతో పోటీపడుతున్నాయి.

ఎంబీఏ చదవాలనుకునే అభ్యర్థులు కేవలం ఐసెట్‌ మీదనే ఆధారపడటం కంటే ఇలాంటి ప్రఖ్యాత సంస్థల మీద దృష్టిపెట్టడం మంచిది.

ఈ సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో కొంత సారూప్యం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే వీటిలో విజయం సాధించి మంచి భవిష్యత్తు  అందుకోవచ్చు!

పూర్తి వ్యాసాన్ని చదువు ఆన్ లైన్ ఎడిషన్లో  ఇక్కడ చదవండి.  ఈ వ్యాస రచయిత  రామకృష్ణ.  

Monday, 15 August 2011

క్యాట్ లో మార్పులూ... వాటి మర్మం!

ఐటీల్లో ఇంజినీరింగ్ లో  చేరటానికి జేఈఈ రాయాలి. ఐఐఎంలలో  ఎంబీఏ చేయాలంటే రాయాల్సింది -  కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT.

అత్యుత్తమమైన ప్రైవేటు బిజినెస్ స్కూళ్ళలో మేనేజ్ మెంట్ కోర్సులు చేయాలన్నా CAT రాయాల్సిందే !

 ప్రతి సంవత్సరం జాతీయస్థాయిలో రెండు లక్షలమంది అభ్యర్థులు పోటీ పడే  పరీక్ష ఇది.





క్యాట్ : ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తుల అమ్మకం ప్రారంభం- 17 ఆగస్టు 2011
* దరఖాస్తులు తీసుకోవడానికి చివరితేదీ - 26 సెప్టెంబరు 2011
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 28 సెప్టెంబరు 2011
* ఆన్‌లైన్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)- 22 అక్టోబరు 2011 నుంచి 18 నవంబరు 2011 వరకు.
* క్యాట్‌ ఫలితాల ప్రకటన: 11 జనవరి 2012.

పరీక్ష విధానంలో ఈ ఏడాది  ప్రధాన  మార్పులు జరిగాయి.

అవేమిటి?

వీటి వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉందా?

పరీక్షకు సన్నద్ధమెలా కావాలి?

సమగ్ర సమాచారం కోసం ఇవాళ  ‘చదువు’ తాజా సంచికలో ప్రచురితమైన  ఈ కథనం చదవండి...

దీన్ని రాసినవారు -  ఐఐఎం (ఇండోర్) పూర్వ విద్యార్థి,  బోధనా నిపుణులు  రామకృష్ణ .     


Friday, 12 August 2011

ముంబయి విద్యాసంస్థలో ఎంబీఏ!

  
నదేశంలోని ప్రైవేటు బిజినెస్‌ స్కూళ్లలో అగ్రశ్రేణి లో ఉన్న సంస్థ -  ముంబయిలోని నార్జీమోంజీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎన్‌ఎంఐఎంఎస్‌). కార్పొరేట్‌ రంగానికి అవసరమైన కోర్సులను నిర్వహించడంలో  దీనికి మంచి పేరు.   ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, కేపిటల్‌ మార్కెట్‌ లాంటి ఆధునిక స్పెషలైజేషన్‌లతో ఎంబీఏ కోర్సులున్నాయి.

   హైదరాబాద్‌, బెంగళూరులలో కూడా క్యాంపసులున్నాయి.
 
   ఈ సంస్థలో  చేరాలంటే  'నార్సీ మోంజీ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (NMAT 2012)  రాయాలి.  దీని నోటిఫికేషన్‌ వెలువడింది.

   ఇక్కడ  అందుబాటులో ఉన్న మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు, వాటిలోని సీట్లు:

* ఎంబీఏ - కోర్‌: 300 సీట్లు
* ఎంబీఏ యాక్చూరియల్‌ సైన్స్‌: 30
* ఎంబీఏ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌: 60
* ఎంబీఏ క్యాపిటల్‌ మార్కెట్‌: 60
* ఎంబీఏ హెచ్‌ఆర్‌: 30
* ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌: 60
* పీజీడీఎం - బెంగళూరు, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో: ఒక్కోదానిలో 60 సీట్లు

 మూడుసార్లు రాయవచ్చు...
ఎన్‌మ్యాట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష. ఇది 31 అక్టోబరు 2011 నుంచి ప్రారంభమవుతుంది. ఎన్‌మ్యాట్‌ ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులు మూడుసార్లు రాయవచ్చు. వీటిలో మంచి స్కోరు సాధించిన పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్‌మ్యాట్‌ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటుంది.

పరీక్షలో మొత్తం మూడు విభాగాలుంటాయి. 
1. లాంగ్వేజ్‌ స్కిల్స్
2. క్వాంటిటేటివ్‌ స్కిల్స్
3. లాజికల్‌ రీజనింగ్‌

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరినీ ఎన్‌మ్యాట్‌ 2011కి పిలుస్తారు. ఎన్‌మ్యాట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ దశలు ఉంటాయి. వీటన్నిటితోపాటు అకడమిక్‌ రికార్డు, పని చేసిన అనుభవం, తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
 
ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఎన్‌మ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు అవసరం.  ఎన్‌మ్యాట్‌ వెబ్‌సైట్‌  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 10 అక్టోబరు 2011
* ఆన్‌లైన్‌ పరీక్ష: 8 ఆగస్టు 2011 నుంచి 25 అక్టోబరు 2011 వరకు
* రెండోసారి, మూడోసారి రాయడానికి: 31 అక్టోబరు 2011 నుంచి 4 జనవరి 2012 వరకు.

పూర్తి వివరాలకు చదువు ఆన్ లైన్ ఎడిషన్ లోని  నార్సీమోంజీలో ఎంబీఏకి ఎన్‌మ్యాట్‌  చదవండి!

Wednesday, 10 August 2011

స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో డిగ్రీ!


సామాజిక శాస్త్రాల అధ్యయనమంటే  వెంటనే  గుర్తొచ్చే పేరు టాటా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌).

సోషల్‌ వర్క్‌, ఎడ్యుకేషన్‌, ఇతర సోషల్‌ సైన్సెస్‌ సంబంధిత కోర్సుల నిర్వహణలో 'టిస్‌'కు మంచి పేరుంది.  ముంబయిలో ఉన్న  డీమ్డ్‌ యూనివర్సిటీ ఇది. 

స్వచ్చంద సంస్థల నిర్వహణ,  సోషల్‌ వర్క్‌ సంబంధిత విభాగాల్లో డ్యుయల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి టిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ వాలంటరీ ఆర్గనైజేషన్స్‌:

ఏడాది వ్యవధి గల ఫుల్‌ టైమ్‌ కోర్సు. స్వచ్చంద సంస్థల నిర్వహణకు అవసరమైన అన్ని మెలకువలను ఈ కోర్సులో అందిస్తారు. 

సోషల్‌ వర్క్‌లో పీజీ డిగ్రీ లేదా ఏదైనా పీజీతోపాటు కనీసం మూడేళ్లు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  కోర్సు ఫీజు సెమిస్టర్‌కు రూ.24600.

దరఖాస్తులు సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 16 ఆగస్టు 2011.



* డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ సోషల్‌ వర్క్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌:

బెల్జియం సంస్థల సహకారంతో టిస్‌ ఈ కోర్సును నిర్వహిస్తోంది.  ఇది కూడా ఏడాది ఫుల్‌ టైమ్‌ కోర్సు.  సామాజిక రంగానికి అవసరమైన మెంటల్‌ హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం ఈ కోర్సు లక్ష్యం. 

టిస్‌ లేదా ఇతర సంస్థల నుంచి ఎం.ఎ. సోషల్‌ వర్క్‌ (మెడికల్‌ సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్‌ స్పెషలైజేషన్‌తో) చేసిన అభ్యర్థులు అర్హులు.  కోర్సు ఫీజు సెమిస్టర్‌కు రూ.24600.

దరఖాస్తులు టిస్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 30 ఆగస్టు 2011.

*  ఇంటర్వ్యూలు రెండు కోర్సులకూ 16-17 సెప్టెంబరు 2011న జరుగుతాయి. 

పూర్తి వివరాలు చదువు ఆన్ లైన్ ఎడిషన్ లో చూడండి.

Thursday, 4 August 2011

ఎంబీఏ/ ఎంసీఏ కళాశాలను ఎంచుకోండి!



సెట్ రాసేసి,  ఎంబీఏ కానీ  ఎంసీఏ కానీ  చదవబోతున్నారా?  ఐసెట్ కౌన్సెలింగ్ కి సిద్ధమవుతున్నారా?

మంచి కాలేజీలో చేరితే భవితకు భరోసా దొరికినట్టే. కానీ ఉన్నవేమో  వందల కళాశాలలు. వీటిలో  ఉత్తమ కళాశాలను గుర్తించేది ఎలా?

చిక్కు సమస్యే! 


నిజానికి  ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. ఏ కళాశాలలో  చేరాలో  తేల్చుకోలేకపోతున్న విద్యార్థులు  ఎందరో ఉన్నారు !

అందుకే- మీకు ఉపయోగపడే  సమాచారంతో   ‘చదువు’ పేజీ (ఆగస్టు 1 సంచిక)  ప్రధాన కథనం   కాలేజీ కళ... తెలిసేది ఇలా!  ప్రచురించింది. 

( ఎర్రటి అక్షరాలతో  శీర్షిక కనపడుతోంది కదా? దీనిమీద క్లిక్ చేస్తే  ‘ఈనాడు’  ఆన్ లైన్ ఎడిషన్లో  చదువు పేజీలో ఉన్న  ఈ కథనం ఓపెన్ అవుతుంది. ఎంచక్కా చదువుకోవచ్చు!) 

ఈ  వ్యాసంలో  ప్రొ. ఎం.భాస్కరరావు  విలువైన సూచనలు అందించారు.

వీటిని పాటించారనుకోండీ...  ఉత్తమ కళాశాలను మీరు  తేలిగ్గానే ఎంచుకోగలుగుతారు!