ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label సివిల్స్. Show all posts
Showing posts with label సివిల్స్. Show all posts

Monday, 6 May 2013

గెలుపు గాథలో శశాంకం!

ఓటమి బాధపెడితే నిరాశతో లక్ష్యాన్నే వదిలేస్తారు కొందరు. కానీ లోటుపాట్లను సవరించుకుని ఉత్సాహంతో ముందుకు సాగుతారు మరికొందరు. చివరకు విజేతలుగా నిలిచేది వీళ్ళే. సివిల్‌ సర్వీసెస్‌ ఏపీ టాపర్‌ శశాంక ఇదే తరహా!   

తన సివిల్స్‌ ప్రయాణం ఎలా సాగిందో, విజయానికి ఏయే అంశాలు దోహద పడ్డాయో అతడు స్వయంగా చెబుతున్నాడు...!

తొలి నుంచీ మా ఇంట్లో సామాజిక స్పృహ ఎక్కువే. సామాజిక ఉద్యమాల ప్రభావం అమ్మానాన్నలపై ఉంది. వారి ఆలోచనల ప్రభావం నాపై ఉంది. వర్తమాన పరిణామాలపై ఇప్పటికీ కుటుంబసభ్యుల మధ్య చర్చ, సంవాదం జరుగుతూనే ఉంటాయి. మధ్యతరగతి నేపథ్యం, తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ (మాజీ) ఉద్యోగులు కావడం, సమాజ పరిస్థితులపై కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండటం.. ఇవన్నీ సివిల్స్‌ రాయాలనే నా ఆలోచనలో స్పష్టత రావడానికి తోడ్పడ్డాయి.

ఈ విషయంలో మా పెదనాన్న కొండూరు పురుషోత్తమే నాకు స్ఫూర్తిప్రదాత. ఆయన డిప్యుటేషన్‌పై నల్గొండ జిల్లాలో ఎంపీడీవోగా సేవలందించారు. గ్రామాలకు రహదారులు, తాగునీటి సరఫరా లాంటి సదుపాయాలు కల్పించడంలో శక్తివంచన లేకుండా కృషిచేశారు. నిబద్ధతతో పనిచేసే లక్షణం ఉంటే సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశముందనే భావన ఆయన్ను చూసిన తర్వాతే నాలో బలపడింది.

చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తిరీత్యా రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాలు తిరిగాను. ప్రజలూ, ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు... వీటిని రూపుమాపి జన జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభావవంతమైన పని ఏమైనా చేయగలనా అన్న ప్రశ్న వేసుకున్నా. సమాధానం అన్వేషించే క్రమంలో సివిల్స్‌ అత్యుత్తమ మార్గంగా కనిపించింది.

ఈ పరీక్ష రాద్దామనే ఆలోచన 2009-10లో తుదిరూపు దిద్దుకొంది. 2010 డిసెంబరు నుంచి సన్నద్ధత తీవ్రతరం చేశాను.

ఆసక్తి, ప్రాథమికాంశాలపై అవగాహన, మెటీరియల్‌ లభ్యత, సిలబస్‌ సకాలంలో పూర్తిచేయగలనన్న విశ్వాసం, రెలవెన్స్‌ ప్రాతిపదికగా ఆప్షనల్స్‌ ఎంచుకున్నాను. వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్రం అరుదైన ఆప్షనల్సే. కానీ ఇవి నాకు బాగా నచ్చాయి. వాణిజ్యశాస్త్రంపై నాకు పట్టుంది. అర్థశాస్త్రం విషయానికి వస్తే- భారత్‌ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ కోణంలో చూస్తే అర్థశాస్త్రంలో ప్రవేశం ఉండటం సర్వీసులో చేరాక బాగా ఉపయోగపడుతుందని అనిపించింది.

ప్రణాళిక
ప్రిలిమ్స్‌కూ, మెయిన్స్‌కూ విడివిడిగా సిద్ధమవడం కంటే హోలిస్టిక్‌ దృక్పథంతో రెండింటికీ కలిపి తయారవటం మంచిదని నా అభిప్రాయం. జనరల్‌ స్టడీస్‌ ప్రాథమికాంశాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాలు తిరగేశా. ఢిల్లీ 'శ్రీరామ్స్‌ ఐఏఎస్‌' మెటీరియల్‌ అందులో ముఖ్యంగా ఇండియన్‌ ఎకానమీ, పాలిటీ, కరెంట్‌ అఫైర్స్‌ నోట్స్‌ బాగా చదివాను. ఎకనమిక్‌ సర్వే, 'ఇండియా ఇయర్‌బుక్‌'లను ఆకళింపు చేసుకున్నాను.

తెలుగు పేపర్లలో వచ్చే మంచి వ్యాసాల గురించి నాన్న నాతో చర్చించేవారు. విద్యారంగ విషయాలపై అమ్మతో మాట్లాడేవాడిని. ద హిందూ, ఫ్రంట్‌లైన్‌, ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఢిల్లీ ఎడిషన్‌), ఈనాడు, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ పత్రికలు చదివా. పీఐబీ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌లో 'ప్రాజెక్ట్‌ సిండికేట్‌' పేజ్‌ చూశా. అంతర్జాతీయ వ్యవహారాలూ, రక్షణ అంశాలకు ఈ పేజ్‌ బాగా ఉపయోగపడుతుంది.

* జీఎస్‌ పేపర్లకూ, జనరల్‌ ఎస్సే పేపర్‌కూ దాదాపు ఒకేలా సన్నద్ధమయ్యా. వ్యాసానికి 200 మార్కులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా సమాధానం రాయడం సాధన చేశా. ఎలాంటి వ్యాసం ఎలా రాయాలి అన్న దానికి సంబంధించి కొన్ని నమూనాలు రూపొందించుకున్నా. 20 నుంచి 25 అంశాలపై పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా. 2012లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)పై ఇచ్చిన వ్యాసం రాశా.
* ఆప్షనల్స్‌ రెండూ కూడా నాకు నచ్చే తీసుకున్నా. కానీ ఆర్థిక శాస్త్రంపైనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది.

మూడు పెద్ద పొరపాట్లు
మొదటి ప్రయత్నం (2011) తర్వాత ఓసారి సమీక్షించుకుంటే మూడు పెద్ద పొరపాట్లు చేసినట్లు అనిపించింది...

1. తగినన్ని నమూనా పరీక్షలకు (మాక్‌ టెస్టులకు) హాజరుకాకపోవడం.

2. అనవసర ఆందోళనతో అపరిమితమైన మెటీరియల్‌ చదవడం.

3. ఆప్షనల్స్‌పై తగినంతగా దృష్టి పెట్టకపోవడం.

తొలి ప్రయత్నంలో వైఫల్యం బాధించింది. రెండో ప్రయత్నంలో కామర్స్‌ పేపర్‌ ఒకటి సరిగా రాయలేకపోయాననే భావన కలిగింది. సివిల్స్‌ లాంటి పరీక్షల్లో విజయం కోసం ప్రయత్నించే క్రమంలో ఇలాంటి దశలు ఎదురుకావడం సాధారణమే. వీటితో డీలా పడిపోకూడదు. పరిస్థితులను బేరీజు వేసుకొంటూ గుండెనిబ్బరంతో ముందుకు సాగాలి.

లోటుపాట్లు విశ్లేషించుకుని వ్యూహం సమీక్షించుకున్నాను. మొదటి ప్రయత్నంలో జనరల్‌స్టడీస్‌లో సమయపాలన పాటించలేకపోయా. తర్వాతి ప్రయత్నంలో దానిపై దృష్టి కేంద్రీకరించాను. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాశా. అత్యధిక పరీక్షలు ఇంట్లోనే ఉండి రాసి చూసుకున్నాను. మెటీరియల్‌ మరింత లోతుగా పదేపదే చదివా.

సివిల్స్‌ మెయిన్స్‌లో ప్రవేశపెట్టిన కొత్త పరీక్షా విధానం బాగుంది. కొందరు అభ్యర్థులకే అనుచిత ప్రయోజనం కలగకుండా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.

పుస్తకాలతో సహవాసం
పాఠశాల రోజుల నుంచే పత్రికా పఠనం అలవడింది. పుస్తకాలు చదవడం మొదటి నుంచీ బాగా అలవాటు. సివిల్స్‌పై దృష్టి కేంద్రీకరించక ముందు కాల్పనిక రచనలు చదివేవాడిని. ఈ పరీక్షలపై దృష్టి సారించాక, వివిధ అంశాలపై అవగాహన, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి కాల్పనికేతర పుస్తకాలు బాగా చదివా.

భిన్న వైఖరులు తెలుసుకునేందుకు వీలు కల్పించేలా పుస్తక పఠనం ఉండాలి. అమర్త్యసేన్‌, రామచంద్ర గుహ, శశిథరూర్‌ లాంటి రచయితల పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. మంచి పుస్తకమనిపిస్తే ఎవరిదైనా చదువుతా.

మౌఖిక పరీక్ష... ప్రశ్నల తీరు
డేవిడ్‌ బోర్డు నన్ను పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) చేసింది. 25 నిమిషాలపాటు సాగింది. ఇంటర్వ్యూలో వాస్తవాధారితమైన, మెలిక ఉన్న ప్రశ్నలూ; విశ్లేషణాత్మకమైన, ఓపెన్‌ ఎండెడ్‌ ప్రశ్నలూ అడిగారు. మొదటి రకం ప్రశ్నలు ప్రధానంగా నా వృత్తి నేపథ్యానికి సంబంధించినవి. రెండోరకం ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్స్‌పై అడిగారు.

అడిగిన కొన్ని ప్రశ్నలు:
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న మూడు ప్రధాన సమస్యలు ఏమిటి?

* ఏపీలో విద్యుత్‌ సంక్షోభానికి కారణమేమిటి? మీరైతే దాన్ని ఎలా ఎదుర్కొంటారు?

* ప్రస్తుత ద్రవ్యోల్బణంపై మీరేమంటారు?

* రాజ్యాంగంలో పేర్కొన్న ఎమర్జెన్సీ నిబంధనలు ఏవి?

* సీఏ ఒక గౌరవప్రదమైన వృత్తి. సీఏగా మీరు చేయలేనిదీ, సివిల్‌ సర్వెంట్‌గా మీరు చేయగలిగేదీ ఏమిటి?

* ఈమధ్య కాలంలో సీఏలపై ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?

* కంపెనీ లా గురించి చెప్పండి.

* పేమెంట్‌ ఆఫ్‌ బోనస్‌ యాక్ట్‌ గురించి చెప్పండి.

* 'రామోజీ ఫిల్మ్‌సిటీ' ప్రత్యేకత ఏమిటి? హైదరాబాద్‌లో ఇంకా ఏ స్టూడియోలున్నాయి?

మధుర స్మృతి
సివిల్స్‌ ప్రయాణంలో నాకు మధుర స్మృతి మాత్రం పర్సనాలిటీ టెస్టే. ఎంతగా సన్నద్ధమైనా ఇంటర్వ్యూ ప్రారంభమయ్యాక సాధారణంగా నాలుగైదు నిమిషాలకే మీ అసలు వ్యక్తిత్వం బయటపడిపోతుంది. ఒకట్రెండు చోట్ల కాస్త తడబడ్డా మొత్తమ్మీద సంతృప్తికరంగా చేశా.

స్పష్టమైన, నిర్దిష్టమైన సమాధానం తెలియని ప్రశ్నలకు అంచనాలు, వూహల ఆధారంగా జవాబిచ్చేందుకు ప్రయత్నించలేదు. బోర్డు గదిలోకి ఎంత ఆత్మస్త్థెర్యంతో వెళ్లానో, అంతే ఆత్మస్త్థెర్యంతో బయటకు వచ్చాను. మంచి మార్కులు వస్తాయని గట్టి నమ్మకం కుదిరింది. అందుకే మధురస్మృతిగా నిలిచిపోయింది.

సివిల్స్‌లో విజయంతో సమాజానికి సేవ చేసేందుకు వీలుగా ఒక తలుపు తెరచుకొంది. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది!

(ఇవాళ ఈనాడులో ప్రచురించిన ఈ  కథనాన్ని మరిన్ని వివరాలతో
 http://eenadu.net/Specialpages/chaduvu/chaduvuinner.aspx?qry=topstory1 లో చదవండి... )

-  లింగుట్ల రవిశంకర్‌,  ఈనాడు- హైదరాబాద్‌

Tuesday, 16 April 2013

సివిల్స్‌లో కీలకాంశం... వ్యాసం

కొత్త విధానంలోకి మారిన సివిల్స్‌ పరీక్షలో జనరల్‌స్టడీస్‌ నాలుగు పేపర్లుగా (250 మార్కుల చొప్పున) విస్తరించిందని తెలిసిందే. దాంతోపాటు జనరల్‌ ఎస్సే (వ్యాసం) పేపరు మార్కులను 200 నుంచి 250కి మార్చారు. జనరల్‌స్టడీస్‌ మార్పుతో పోలిస్తే ఈ స్వల్పమార్పు అంత గణనీయంగా అనిపించకపోవచ్చు. లోతుగా విశ్లేషిస్తే తుది మార్కులపరంగా వ్యాసం ప్రాధాన్యం ఎంత అధికమో స్పష్టమవుతుంది!

విస్తృతమైన జనరల్‌స్టడీస్‌ (జీఎస్‌) సిలబస్‌లోని ఏ అంశంనుంచి ప్రశ్నలు రావొచ్చో నిర్దిష్టంగా ఊహించటం చాలా కష్టం. ప్రశ్నలు వాస్తవికాంశాలపై కాకుండా అభిప్రాయ ఆధారితంగా ఉండటం వల్ల ఎన్ని మార్కులు రావొచ్చనేది ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటపుడు ఒక్కో పేపర్లో 48-50 శాతం మార్కులు తెచ్చుకోవాలనుకోవటం వాస్తవ దూరమవుతుంది. వాటిలో గరిష్ఠ మార్కులు వచ్చే అవకాశం లేదు కాబట్టి వ్యాసంలో 50-55 శాతం మార్కులు తెచ్చుకోగలిగినవారే విజేతలయ్యే అవకాశం ఉంది!

వ్యాసంలో అత్యధికంగా స్కోర్‌ చేయటం ఎలా? అనేది చర్చించేముందు సివిల్స్‌లో వ్యాసం చరిత్రను సంగ్రహంగా చూద్దాం.

మెకాలేతో ఆరంభం
1854లో మెకాలే నివేదిక తన సిఫార్సుల్లో సూచించిన తప్పనిసరి పేపర్లలో ఇంగ్లిష్‌ ఎస్సే ఒకటి. మొత్తం 6875 మార్కుల్లో దీనికి 500 మార్కులను కేటాయించారు. 1979 వరకూ సివిల్స్‌లో మెకాలే పద్ధతిని స్వల్ప మార్పులతో కొనసాగించారు. 1947-1968 మధ్యకాలంలో ఎస్సే పేపర్‌కు నిర్దేశించింది ఆంగ్లమాధ్యమం మాత్రమే. 1969 నుంచీ ఈ వ్యాసాన్ని ఏ ప్రాంతీయ భాషల్లోనైనా రాసే వెసులుబాటు కల్పించారు.

1975లో కొఠారి కమిటీ సిఫార్సుల్లో ఒకటి- 300 మార్కులకు కంపల్సరీ ఎస్సే పేపర్‌ ప్రవేశపెట్టటం. అభ్యర్థి లక్షణాలను అంచనా వేయటానికి వ్యాసం ఉపయోగపడుతుందనేది ఈ కమిటీ గుర్తించి, దాన్ని తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. ఫలితంగా 1979 నుంచీ వ్యాసాన్ని తొలగించారు. పరీక్షా విధానంలో తప్పనిసరి ఎస్సే పేపర్‌ లేకుండాపోయింది.

1988లో ప్రభుత్వం సివిల్స్‌ విధానాన్ని సమీక్షించటానికి నియమించిన సతీష్‌చంద్ర కమిటీ 1989లో నివేదిక సమర్పించింది. ఎస్సే పేపర్‌ను తిరిగి ప్రవేశపెట్టాలనేది ఈ కమిటీ సిఫార్సుల్లో ప్రముఖమైనది. 'మెయిన్స్‌ పరీక్షలోని వ్యాసం పేపర్‌- అభ్యర్థుల భాషానైపుణ్యాలను మాత్రమే కాకుండా వారి అవగాహన సామర్థ్యం, విమర్శనాత్మక విశ్లేషణ శక్తి, సమన్వయ చింతనా ధోరణి, ఆలోచనల సమ్మేళనం, వ్యక్తీకరణలో స్పష్టతలను కూడా వెలికితీస్తుందని మా అభిప్రాయం' అని కమిటీ పేర్కొంది.

ఆంగ్లంలో కానీ, రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన ఏదో ఒక భారతీయభాషలో వ్యాసాన్ని రాయవచ్చు. మూల్యాంకనంలో ప్రమాణాల ఏకరూపత కోసం వ్యాసంలో పరిగణించాల్సిన లక్షణాలను సతీష్‌చంద్ర కమిటీ ఇలా నిర్వచించింది-

1) అవగాహన
2) మౌలిక ఆలోచన
3) వ్యక్తీకరణలో స్పష్టత
4) సమ్మిళిత ఆలోచనలతో సమన్వయ దృక్పథం


ఎస్సే పేపర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఇద్దరు స్వతంత్ర ఎగ్జామినర్లతో చేయించాలనీ, ఈ రెండు స్కోర్ల 'మీన్‌'ను అభ్యర్థి సాధించిన మార్కులుగా పరిగణించాలనీ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రభుత్వం వీటిని ఆమోదించింది. 1993 నుంచీ సివిల్స్‌ పరీక్షావిధానంలో 200 మార్కుల కంపల్సరీ ఎస్సే పేపర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న కొత్తవిధానంలో ఈ 200 మార్కులను 250కి పెంచారు.

ప్రధాన అంశాలు రెండు
వ్యాసంలో అత్యధిక స్కోరింగ్‌ సాధించాలంటే రెండు అంశాలపై శ్రద్ధ పెట్టాలి.

 1) మంచి వ్యాసం రాసే మెలకువలను తెలుసుకొని, దానిలో ప్రావీణ్యం సంపాదించటం. సరైన అంశాన్ని ఎంచుకోవటం ఆ మెలకువల్లో ఎంతో ముఖ్యమైనది.

2) వ్యాసానికి సంబంధించిన విషయం తెలుసుకోవటం.

మంచి వ్యాసం రాయటానికి ప్రాథమికాంశాల నుంచి లోతైన విషయాల వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* రాసేది అర్థమయ్యేలా ఉండాలి. వంకర టింకర లైన్లతో, మార్జిన్లను దాటిపోయేలా రాస్తే చూడగానే మంచి అభిప్రాయం ఏర్పడదు.

* పేరాలతో రాయాలి. పేరాగ్రాఫ్‌లో మొదటిలైను మొదటి అక్షరం ఒక స్పేస్‌ ఖాళీగా ఉంచి మొదలవుతుందని తెలిసిందే కదా?

* ఎడమపక్క మార్జిన్‌ తప్పనిసరి. కుడివైపు కూడా కొంత మార్జిన్‌ ఉంచితే చదవటం సులువు.

Monday, 25 February 2013

సివిల్స్ జైత్రయాత్రకు అపోహలే అవరోధాలు!

సివిల్స్‌ పరీక్షకు తయారటానికి సుదీర్ఘ కాలం పడుతుంది కాబట్టి... దీనికి ప్రయత్నం చేయాలో లేదో; తమకు తగిన సామర్థ్యం ఉందో లేదో అనే సందేహాలు అభ్యర్థుల్లో ఉండటం చాలా సహజం. ఈ పరీక్ష చుట్టూ అల్లుకున్న అపోహలను ఎంత త్వరగా నివృత్తి చేసుకుంటే ఆశావహులకు అంత శ్రేయస్కరం!

జిల్లా కలెక్టర్‌గా/ ఎస్పీగా అవ్వాలని యువత గాఢంగా కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ హోదాల్లోని గౌరవం, ప్రత్యేకత వారికి అలాంటి ప్రేరణనిస్తుంది. జిల్లా మొత్తం అధికార యంత్రాంగం చిన్నా పెద్దా సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌మీద ఆధారపడుతుంది. జిల్లా పోలీసు సిబ్బందిని నియంత్రించే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సాధారణంగా కలెక్టర్‌ కన్నా చిన్నవయసులో ఉంటారు. (ఐపీఎస్‌కు ఎంపికయ్యాక ఐదారేళ్ళలో ఎస్పీ అవుతారు కానీ కలెక్టర్‌ అవ్వటానికి ఐఏఎస్‌కు ఎంపికయ్యాక పది పన్నెండేళ్ళు పడుతుంది.)
ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావటానికి పోటీ పరీక్ష రాయాలని తెలుసు. అయితే నాకు ఈ లక్ష్యం తగినదేనా? నాలో ఈ సత్తా ఉందా? విజయవంతం కాగలుగుతానా?- ఇవి చాలామందిలో మెదిలే ప్రశ్నలు!

పైగా చుట్టుపక్కలవాళ్ళు ప్రోత్సాహం ఇవ్వకపోగా వ్యతిరేక భావనలు పెంచేస్తుంటారు. 'ఐదేళ్ళపాటు సిద్ధపడినా నాకు తెలిసిన ఒకతను సివిల్స్‌ రాయలేకపోయాడు. అతడికి టెన్త్‌లో 98 శాతం, ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి. అతడికే సాధ్యం కానపుడు నీవల్లవుతుందా?' ... ఇలాంటి చర్చలు అనంతంగా సాగుతూ అభ్యర్థుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లుతుంటాయి. ఎన్నో సందేహాలు ముసిరి, వారిని ప్రయత్నం చేయనీకుండా వెనక్కి లాగుతుంటాయి.


ముఖ్యమైన సందేహాలు

* నేను సగటు విద్యార్థిని. డిగ్రీ ఎలాగోలా పూర్తిచేశాను. ఈ పరీక్షలో అర్హత సాధించే అవకాశం నాకుందా?

మొట్టమొదట- సగటు విద్యార్థిని అనో, సగటు కంటే కిందిస్థాయి అనో, అసాధారణ విద్యార్థిని అనో ముద్ర వేసుకోకూడదు. చదువుల్లో సరిగా ప్రతిభ చూపలేదంటే మీ నియంత్రణలో లేని కారణాలు ప్రభావం చూపివుండవచ్చు. ఎన్నో అనుకూలాంశాలు చుట్టూ ఉన్నా కూడా చదివేదానిపై ఆసక్తి లేకపోయివుంటే పరీక్షల్లో సరిగా రాసివుండకపోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే ప్రయత్నాలు వాటికవే రూపుదిద్దుకుంటాయి.

ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నపుడే మన శక్తిసామర్థ్యాలను గుర్తించగలుగుతాం. అప్పుడే సంపూర్తిగా లీనమై చేయటం గమనించవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ మీ ఏకైక లక్ష్యంగా మారితే దాన్ని సాధించటానికి మార్గాలూ, సాధనాలూ మీరే గుర్తించగలుగుతారు.

ఈ సర్వీసు సాధించినవారిలో ఎంతోమంది 'సగటు' విద్యార్థులున్నారు. పాఠశాలో, కళాశాలలో ఏనాడూ మంచి మార్కులు తెచ్చుకోనివారున్నారు. కానీ కళాశాల తర్వాత సివిల్‌ సాధించాలనే స్థిరమైన, స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాక దానిలో విజయం కోసమే వారు తమ సర్వశక్తులూ వినియోగించారు!

* నేను డిగ్రీలో కేవలం పాసైన విద్యార్థిని. సివిల్స్‌ యాత్రలో నాకెలాంటి సమస్యలు ఎదురవుతాయి?

మొదట తల్లిదండ్రులూ, స్నేహితులూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. వాళ్ళేమంటారంటే- 'ఇప్పటిదాకా నువ్వేమీ సాధించలేదు కదా, సివిల్స్‌లో ఎలా నెగ్గగలవు?' అని. మీరు నిరుత్సాహపడొచ్చు కానీ వారలా చెప్పటంలో సబబు ఉంది- మీరింకా మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేదు కాబట్టి. నేను మారానననీ, ఒక లక్ష్యం గుర్తించాననీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు వారు తప్పకుండా మీకు మద్దతునిస్తారు.

రెండో సమస్య ఏ దిశలో ముందుకు సాగాలనేది. మీకంటే ఈ పరీక్ష గురించి బాగా తెలిసినవారి సాయం తీసుకోవాలి. వారినుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల బలహీనతలూ, లోపాలపై కాకుండా వారి బలాలపై దృష్టి పెట్టండి. మీకు సౌకర్యంగా ఉండే స్థలం (ఇల్లు, ఊరు, బస్తీ) వదిలి మీలాంటి జీవితాశయాలున్నవారుండే చోటుకు మారటం దీనిలో భాగమే!

మూడోది మార్గదర్శనం. ఈ పరీక్షపై చక్కని అవగాహనఉన్నవారి సూచనలు పొందటం. అది స్నేహితులైనా కావొచ్చు; ఉపాధ్యాయులైనా కావొచ్చు.

నాలుగో అంశం- పరీక్ష రాసి దాని గురించి తెలుసుకోవటం. దీనివల్ల వాస్తవం ఏమిటన్నది స్వానుభవంతో గ్రహించవచ్చు.


(పూర్తి కథనం -  www.eenadu.net చదువు విభాగంలో చూడండి)

Monday, 31 December 2012

మంచి ర్యాంకు సాధించేదెలా? .. యండమూరి వీరేంద్రనాథ్ సూచనలు!



విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్‌ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే వాస్తవ సమస్యలేమిటి? వాటిని తొలగించే ఆచరణాత్మక సూచనలేమిటి? 

ప్రసిద్ధ రచయితా, వ్యక్తిత్వ వికాస నిపుణుడూ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం!


విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం!
ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది.

పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్‌ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.

తెలివీ... మార్కులూ
తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడైవుండొచ్చు.

గణితం, అకౌంట్స్‌ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్‌ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.

వాయిదా పద్ధతుంది...
చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. ఈ academic procrastinators 'సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా'మంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి!

ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:

* ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండండి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోండి.

* విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్‌ ర్యాంకర్‌ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే I am proud of youభావంతో!

* ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టండి (గ్రూప్స్‌, సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు).

ఆహ్లాదకర వాతావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...

కళ్ళు: టేబుల్‌ లైట్‌ కింద చదవండి. ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండండి.

సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. నా అనుభవంలో సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్‌)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.

ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్‌ ఫూడ్‌, చికెన్‌ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్‌ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి.

ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోండి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.

వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించండి. అమితాబ్‌, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్‌నూ, పైథాగరస్‌నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!


యాబైశాతం సన్నద్ధత
మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే!
* స్టడీ టేబుల్‌/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి. కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.

* రాత్రివేళ మీ రీడింగ్‌ టేబుల్‌ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది.

* చదివేటపుడు గది తలుపులు మూసివేయండి. ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టండి. తాజా గాలి పీల్చుకుని, గదిలోనే పచార్లు చేయండి... చదవటమే ఈ పచార్లకంటే మెరుగనిపించేదాకా!

* ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్‌ డీటెయిల్డ్‌ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది. చదవటం విసుగనిపిస్తే రాయండి. లేకపోతే గణితం సాధన చేయండి. రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.

* కష్టమైన కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్‌ సూత్రాలూ గోడమీద అంటించుకోండి. (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి). వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయండి. విశ్రాంతి తీసుకోవటానికి (రిలాక్స్‌) మ్యాపులను పరిశీలించటం ఓ చక్కని చిట్కా.

* ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్‌ లేకుండా, చదివే పోర్షన్‌ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోండి.

* విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.

* కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోండి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు.

* గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోండి. పోచుకోలు కబుర్లకు అవకాశమున్న కంబైన్డ్‌ స్టడీ అంత ఉపయోగకరం కాదు.

* ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టొద్దు. ఐదు నిమిషాల విరామం ఇవ్వండి. దీన్ని 'మైండ్‌ హాలీడే' అంటారు.

* సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు.

* ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. సెలవు రోజు కూడా. సెలవులకు మీ తాతగారి వూరికి వెళ్ళినపుడు కూడా. కనీసం అరగంటైనా చదవాలి. ఇలా చేస్తే చదవటం మీ అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.


ఏం చదివినా గుర్తుండటం లేదా? 
సమయం సరిపోదు.. ఎందుకని? 
ఏకాగ్రత కుదరటం లేదా? ...

www.eenadu.net లో చదువు విభాగం  చూడండి.

Saturday, 8 December 2012

సివిల్స్‌ సమరానికి విభిన్న అస్త్రాలు




సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీలోని మొదటి పేపర్‌ పోటీపరీక్షలన్నిటిలోనూ సాధారణంగా కనపడేదే. ఈ సర్వీసుకు తగిన అభిరుచి అభ్యర్థుల్లో ఎంతమేరకు ఉన్నదో పరీక్షించేది రెండో పేపర్‌. ప్రిలిమినరీ విజయసాధనలో ఈ పేపర్‌ పాత్ర కీలకంగా మారింది. ఈ పేపర్‌ స్వభావం, తీరులను విశ్లేషిద్దాం!


విభిన్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను అంచనా వేసే రెండో పేపర్‌కు పకడ్బందీగా సిద్ధమవటం తప్పనిసరి. లేకపోతే మంచి స్కోరు సాధ్యం కాదు. ఏడు రకాల విభాగాలుండే ఈ పేపర్‌లో మొత్తం ప్రశ్నలు 80. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు.

ఒక్కో విభాగాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టారో, సంసిద్ధమెలా అవాలో పరిశీలిద్దాం.

కాంప్రహెన్షన్‌

పాలనలో భాగస్వామిగా ఉండే అధికారి తన విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే అవగాహన శక్తి ముఖ్యం. ఒక నిర్దిష్ట పరిస్థితిలోని ముఖ్యాంశాలను గుర్తించి విశ్లేషించగల సత్తా, తగిన నిర్థారణకు వచ్చే విజ్ఞతా ఉండాలి. నివేదికలూ, సమాచారం పరిశీలిస్తూనే కార్యాచరణకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగం ఈ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు 2-3 పేరాగ్రాఫులు ఇచ్చి బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌) ప్రశ్నలకు జవాబులు రాయమంటారు.

ఇంటర్‌ పర్సనల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
పాలనాధికారుల విధుల్లో భావ ప్రసారానికి (కమ్యూనికేషన్‌) ప్రాముఖ్యం ఉంది. బృందంలో పనిచేయటం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ నైపుణ్యాలు పెంచుకుంటేనే విజయానికి దగ్గరవుతాము. ఉద్యోగుల్లో నిబద్ధత, పని సామర్థ్యం మెరుగుపరచటానికి సమర్థమైన భావప్రసారం చేయగలగాలి. ఆత్మవిశ్వాసం, సంబంధాల మెరుగుదల, ఇతరులకు ఆమోదయోగ్యమవటం... ఇవన్నీ సమర్థ కమ్యూనికేషన్‌ వల్లనే సాధ్యం. సివిల్‌ సర్వెంటుకు ఇది చాలా కీలకం.

ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం జరిగే భావాల ప్రసారాన్నే ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలంటారు. భిన్న పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులతో తగిన విధంగా వ్యవహరించి ప్రజలు నిశ్చింతగా ఉండేలా చేయగలగాలి. ఆలకించటం, మాట్లాడటం, ఘర్షణను నివారించటం- ఇవి ఈ నైపుణ్యాలతో సాధించే సాధారణ ఫలితాలు.

ఈ విభాగంలో ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు.
ఉదా:1. How would you best console a bereaved person?

a) Do not talk about the dead person for fear of causing pain. b) Give him a sedative on a regular basis after consulting a doctor. c) Instead of speaking give him a sympathetic touch. d) Offer help with the practical tasks and be prepared to listen. (Answer) 

లాజికల్‌ రీజనింగ్‌, ఎనలిటికల్‌ ఎబిలిటీ
ఆలోచనల పనితీరుపై ఆధారపడి మనుషులను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. 1) సరిగా, పొందికగా ఆలోచించలేనివారు 2) లోకజ్ఞానం, అనుభవం, తెలివితేటలు ఉపయోగించి నెగ్గుకువచ్చేవారు 3) దృఢంగా, తార్కికంగా ఆలోచించి ఇతరులకంటే శక్తిమంతంగా నిర్వహణ చేయగలిగేవారు. ఈ మూడో లక్షణమున్నవారే పాలనాధికారులుగా నేటి అవసరం.

ఈ నైపుణ్యాలను పరీక్షించేలాగానే ప్రశ్నలుంటాయి.

ఉదా:All big dams involve displacement of people and risk of serious harm to the ecology of the region. The claims of pro-big dam enthusiast cannot be sustained in terms of costs and benefits.

Assuming the truth of the passage, one can conclude from it that :

a) No big dam should ever be constructed whatever be the benefits arising out of it. b) All big dams from the very nature of its 'highness'destroy ecology or displace people. c) Big dam should only be undertaken provided it displaces the minimum number of people causes negligible damage to ecology and provide substantial benefits when completed. (Answer ) d) There are abundant alternatives to each water in scarcity areas such a way that , what big dams can offer, the alternatives can provide more efficiently at lesser cost.

డెసిషన్‌ మేకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
ప్రైవేటురంగంలోని ఉద్యోగి తీసుకునే నిర్ణయం కంటే సివిల్‌ సర్వెంట్‌ తీసుకునే నిర్ణయాలు ఎక్కువమంది ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. పరిస్థితుల మంచి చెడులను బేరీజు వేసి, సత్వర నిర్ణయాలు తీసుకోగలగాలి. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ఇలాంటివారిని గుర్తించటం సివిల్స్‌ నియామకాల లక్ష్యం.

డెసిషన్‌ మేకింగ్‌కు సన్నిహితంగా అనుసంధానమైవుండేది ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌. సివిల్‌ సర్వెంట్లందరూ ఈ నైపుణ్యాలనుపెంపొందించుకునివుండాలి. సమస్యను దాని ఆనుపానులు గ్రహించి, అందులో భాగమైవున్నవారి సహకారంతో పరిష్కరించాలి.

పరీక్షలో ఊహాత్మక సందర్భాలను ఇచ్చి ఈ నైపుణ్యాలను పరిశీలిస్తారు. అత్యుత్తమ నిర్ణయాన్ని ఎంచుకుని, సమాధానంగా గుర్తించాల్సివుంటుంది. నెగిటివ్‌ మార్కులుండవు.

ఉదా:1. You are having dinner with your colleagues. Suddenly one of your colleagues starts choking. What would be your first reaction?

a) Reach for his throat around the voice box with your thumb and forefinger. b) Ask him 'are you choking' and see if he is able to reply. (Answer ) c) Ask him to leave the dining area immediately and go to the rest room. d) Try to help him cough so that the obstruction is cleared.

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ
అందుబాటులో ఉన్న గణాంక సమాచారం ఆధారంగా పాలనాధికారులు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. డేటా విశ్లేషణ ఆధారంగా సరైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాల్సివుంటుంది.

ఈ విభాగంలో ప్రశ్నలు గ్రాఫులు, డయాగ్రమ్‌లు, సంకేతాలతో నిండివుంటాయి. యూపీఎస్‌సీ ప్రకారం మెంటల్‌ ఎబిలిటీ అనేది ఇంటలెక్చువల్‌ ఎబిలిటీ అని గ్రహించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌
సివిల్‌ సర్వెంట్లకు 'ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌' పరిజ్ఞానం తగినంత అవసరమని అందరూ అంగీకరిస్తారు. అభ్యర్థి ఆంగ్ల భాషా నైపుణ్యాలను ఈ విభాగం పరీక్షిస్తుంది. కొన్ని పేరాలు ఇచ్చి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు రాయమని అడుగుతారు. దీనికి సంబంధించి అభ్యాసాలకు పనికొచ్చే మెటీరియల్‌ విస్తృతంగానే లభ్యమవుతోంది.

పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి, తగిన వ్యూహం తయారుచేసుకోవాలి. దాన్ని దీక్షగా అమలుచేయాలి.


-  గోపాలకృష్ణ (డైరెక్టర్ , బ్రెయిన్ ట్రీ) 

(గత రెండేళ్ళ ప్రశ్నపత్రాల విశ్లేషణను eenadu.net చదువు విభాగంలో చూడండి).

Monday, 7 May 2012

సివిల్స్ లో ... ఏపీ టాపర్‌ గెలుపు గాథ!

సివిల్‌ సర్వీస్‌ సాధించటమంటే అదెంతో ప్రత్యేకం. అందులోనూ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవటం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. ఏడాది వ్యవధిలో 90వ ర్యాంకు నుంచి 9వ ర్యాంకుకు ఎదిగిన పట్టుదలా, కృషీ కృష్ణ భాస్కర్‌ ది! తన విజయగాథలోని మలుపులూ, విశేషాలను 'చదువు' పాఠకులకు తనే స్వయంగా వివరిస్తున్నాడీ టాపర్‌!

మ్మా నాన్నలు ఐఏఎస్‌ అధికారులు! ఇంకేం? సివిల్స్‌ను నా కెరియర్‌గా ఎంచుకోవటం చాలా సహజమని అందరూ ఊహించారు. కిందటి సంవత్సరం సివిల్స్‌లో 90వ ర్యాంకు తెచ్చుకోగానే సివిల్స్‌లో చేరటం 'బాల్యం నుంచీ నా కల' అయివుంటుందని చాలామంది అంచనాకు వచ్చారు!
కానీ వాస్తవం వేరు. సివిల్స్‌ ఆలోచన నాకు కలిగింది కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే... ప్రైవేటు రంగంతో సంబంధం ఏర్పడిన తర్వాతే!

పాఠశాల చదువు ఒకచోటే ఉండటం మంచిదని సాధారణ అభిప్రాయం. అమ్మానాన్నల బదిలీల మూలంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా పాఠశాలల్లో నేను చదవాల్సివచ్చింది. ఇలా వివిధ ప్రాంతాలు మారటం నాకు మేలే చేసింది. ప్రతి స్కూల్లోనూ విభిన్న వాతావరణం, సదుపాయాల్లో తేడాలు, రకరకాల మనుషులు, ఉపాధ్యాయులు... విస్తృత అనుభవాలు సంపాదించుకోగలిగాను. ఐఏఎస్‌ను సాధించాలనే అభిలాషకు ఇవి అంతర్లీనంగా పనిచేశాయనిపిస్తుంది. ఈ వృత్తిలోనే కదా వైవిధ్యకరమైన అనుభవాలకు ఆస్కారముండేది... నిస్సారమైన క్షణాలకెప్పుడూ తావుండనిది!

ఐఐటీలో బీటెక్‌
బేగంపేట- హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్లో 1998లో నా పదో తరగతి పూర్తయింది. తర్వాత రత్న జూనియర్‌ కాలేజీలో చేరాను. ఐఐటీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ (ఎలక్ట్రికల్‌)లో ప్రవేశించాను. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కొద్దికాలం ఓ ప్రముఖ సంస్థలోని పరిశోధన విభాగంలో పనిచేశాను. నా అర్హతలు పెంచుకోవాలని నిర్ణయించుకుని 2008లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) లో చేరాను... మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో!

ఐఎస్‌బీ అంటే తెలిసిందే కదా? అక్కడి గ్రాడ్యుయేట్లలో చాలామంది భారీ వేతనాలతో ప్రైవేటు కొలువుల్లో చేరిపోతుంటారు. ఇక్కడే సివిల్‌ సర్వీసెస్‌ గురించి ఆలోచనలు నాలో మొదలయ్యాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం 'ఉద్యోగ భద్రత' గురించి దృష్టిపెట్టేలా చేసిందనుకోండీ. అమ్మానాన్నలతో చర్చించాను. నిర్ణయాన్ని నా విచక్షణకే వారు వదిలేశారు.

ప్రైవేటు ఉద్యోగంలో చేరకపోవటం వల్ల విలువైన సమయాన్నీ, అనుభవాన్నీ కోల్పోతున్నానని తెలుసు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కొలువుల్లో చేరనివారికి ఒకటి రెండు సంవత్సరాల తర్వాత తగిన ఉపాధి అవకాశాలుండవు కదా!

అయినప్పటికీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సిద్ధమై, అత్యుత్తమంగా రాయాలని నిర్ణయించుకున్నాను!

రీక్ష రాయాలని నిశ్చయించుకున్నాక నా మేనేజ్‌మెంట్‌ తరగతుల్లో సంపాదించిన పరిజ్ఞానంపై ఆధారపడ్డాను. Why winners winగురించి చాలా సెషన్లు జరిగేవి. వీటన్నిటిలోనూ ఒక వాస్తవం కనపడేది. విజేతలందరూ తామెంచుకున్న రంగాల్లో నిపుణులు. బాగా కష్టపడతారు. మౌలికాంశాలను విస్మరించరు.

విపరీతమైన పోటీ ఉండే సివిల్స్‌ పరీక్ష రాయదల్చినపుడు అభ్యర్థికి సరైన వాతావరణం, సరైన mentor ఉండాలి. ఢిల్లీలో కొన్ని ఇన్‌స్టిట్యూషన్లు చూశాను కానీ హైదరాబాద్‌ వాతావరణమే సౌకర్యంగా ఉంటుందనిపించింది. అన్నిటికీ మించి ఒక Mentorను ఎంచుకోవటం ముఖ్యమనేది తెలిసింది. అంటే... మన ఎదుగుదలపై నిజమైన ఆసక్తి ఉండి శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రేరణను అందించగలిగే వ్యక్తి! ఆ వ్యక్తి తండ్రి కావొచ్చు, పొరుగు వ్యక్తి, అధ్యాపకుడు, స్నేహితుడి తండ్రి.. ఎవరైనా కావొచ్చు. స్నేహితుల సలహా మేరకు బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణను కలిశాక, నా mentorను ఆయనలో గుర్తించాను.

సుదీర్ఘంగా సాగిన కౌన్సెలింగ్‌లో ఆప్షనల్స్‌ను ఎంచుకోవటం చాలా కీలకమని ఆయన వివరించారు. లాభనష్టాలను బేరీజు వేసుకుని, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలను ఎంచుకున్నాను. మొదటి సబ్జెక్టు- పరీక్ష తీరు, జనరల్‌స్టడీస్‌ను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. రెండో సబ్జెక్టు- సమాజాన్నీ, దాని సమస్యలను ఆకళింపు చేసుకోవటానికి ఉపకరించింది. అదీ గాక రుజువైన 'ట్రాక్‌ రికార్డు', తక్కువ సమయంలో చాలామంది విద్యార్థులు అర్హత సాధించిన చరిత్ర ఈ సబ్జెక్టులకుంది. ఈ ఆప్షనల్స్‌ను తీసుకుని తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించిన కార్తికేయ మిశ్రా (IIM Ahmedabad)నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.

ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు రెంటికీ ఉమ్మడి విధానంలో శిక్షణ తరగతులకు హాజరయ్యాను. ఐదు నెల్లకంటే ఎక్కువ సమయం కోచింగ్‌కి హాజరవ్వటానికి కేటాయించదల్చలేదు. ఎందుకంటే... ఈ పరీక్షకు spoon feeding కంటే స్వీయ సన్నద్ధతే ముఖ్యమని నాకు తెలుసు. అందుకే ఐదు నెల్ల శిక్షణ తర్వాత ప్రిలిమినరీకి సొంత టైమ్‌ టేబుల్‌ తయారు చేసుకున్నాను.

నా మొదటి ప్రయత్నంలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విషయంలో చాలా కృషి చేయాల్సివచ్చింది. ప్రిలిమినరీ కోసం సూక్ష్మ అంశాలను సైతం అవగాహన చేసుకోవాలి కదా! (ఆ ఏడాది ప్రిలిమ్స్‌లో ఒక ఆప్షనల్‌, జనరల్‌ స్టడీస్‌ ఉన్నాయి). ఆప్షనల్‌ కవర్‌ చేశాక, జనరల్‌ స్టడీస్‌మీద దృష్టి పెట్టాను.

ప్రిలిమినరీ నెగ్గాను.

తర్వాత వెంటనే ఆంత్రపాలజీపై మనసు కేంద్రీకరించాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలకు సంబంధించి writing practiceఎంతో చేశాను. మౌలిక పాఠ్యపుస్తకాలపై, ఆప్షనల్స్‌ స్టడీ మెటీరియల్‌పై ఆధారపడ్డాను. జనరల్‌స్టడీస్‌లో పదాల పరిమితి, ప్రశ్నపత్రం తీరు ముందుగా తెలియదు కాబట్టి ఆ ప్రిపరేషన్‌ను ఆ open ended గానే సాగించాను. అదృష్టవశాత్తూ ఆప్షనల్స్‌లో ఎక్కువ ప్రశ్నలు అంచనాల మేరకే వచ్చాయి. తేలిగ్గానే వాటికి జవాబులు రాశాను.

మెయిన్స్‌ ఫలితాలు వచ్చాక ఇంటర్వ్యూకు సిద్ధమయ్యాను. బయోడేటా, కరంట్‌ అఫైర్స్‌పై సన్నద్ధమవ్వాలనే సూచన పాటించాను. రెండు నమూనా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. 'ఏం చెపుతున్నావన్నది కాకుండా ఎలా చెపుతున్నావన్నదే ప్రధానం' అని నా mentorపదేపదే చెప్పారు. నిజాయతీగా ప్రవర్తించటం కూడా ముఖ్యమనేది మరో అంశం. ఈ వ్యూహం ఫలించి నా తొలి ప్రయత్నంలో 90వ ర్యాంకు సాధించాను. (ఆప్షనల్స్‌లో బాగా స్కోర్‌ చేశాను. ఇంటర్వ్యూలో 330కు 230 మార్కులు వచ్చాయి.) ఐఏఎస్‌కు అర్హత పొందుతానని భావించాను. అయితే 'రిస్క్‌' తీసుకోవద్దన్న సలహా మేరకు మళ్ళీ ప్రిలిమినరీకి సిద్ధమయ్యాను. అదే మంచిదైంది. ఎందుకంటే... మూడు మార్కుల తేడాతో ఐఏఎస్‌ తప్పిపోయి, ఐపీఎస్‌ వచ్చింది.


ఆగస్టులో ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చాయి. అక్టోబర్లో మెయిన్స్‌. రెండోసారి మెయిన్స్‌ రాయటం మొదటిసారంత కష్టమనిపించలేదు. తొలి ప్రయత్నంలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడింది. జనరల్‌స్టడీస్‌ కోసం ప్రాథమికాంశాలను మరోసారి సరిచూసుకున్నాను; కరంట్‌ అఫైర్స్‌ చదువుతూపోయాను. మెయిన్స్‌ రాసి, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ పోలీస్‌ అకాడమీ (హైదరాబాద్‌)లో ప్రవేశించాను.

పోలీస్‌ సర్వీసెస్‌లో శిక్షణ అద్భుతమైన అనుభవం. శారీరకంగా, మానసికంగా అవసరమైన క్రమశిక్షణను ఇది అందిస్తుంది. నా శిక్షణను చాలా ఆస్వాదిస్తూ వచ్చా. మార్చిలో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించారు. ఐపీఎస్‌ కఠోర శిక్షణ మూలంగా ఇంటర్వ్యూకు తక్కువ సమయం చిక్కినా స్వీయ క్రమశిక్షణ నా ప్రిపరేషన్‌ ప్రణాళికకు సహాయపడింది. ఇంటర్వ్యూలో factual based questionsఅడిగారు. అడిగిన ప్రశ్నలకు న్యాయం చేసేలా జవాబులు చెప్పాననుకుంటున్నాను. అందుకే దేశంలో అత్యుత్తమ పది ర్యాంకర్లలో ఒకడిగా నిలిచాను. అభ్యర్థులందరికీ నా సలహా ఒకటే. పరీక్షపై సరైన దృక్పథం పెంచుకోండి. అది పరీక్షలో మీ ర్యాంకును/ విజయాన్ని నిర్ణయిస్తుంది!

email: krishna.bhaskar@gmail.com

Monday, 9 January 2012

సివిల్స్‌తో పాటే గ్రూప్‌-1... సరైన వ్యూహమేనా?

ద్యోగ నియామక పరీక్షల్లో జాతీయస్థాయిలో అధికారహోదా పరంగా అత్యున్నతమైనవి సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష కోసం కొనసాగించే సన్నద్ధత, కృషి రాష్ట్రస్థాయి ఉత్తమ సర్వీసులైన గ్రూప్‌-1 పరీక్షకు ఎంతమేరకు ఉపయోగం?

ఏపీపీఎస్‌సీ నుంచి నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో సివిల్స్‌ అభ్యర్థులు వాటికి కూడా దరఖాస్తు చేసుకుని, సిద్ధమవటం సరైన నిర్ణయమేనా?

2011 నుంచీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో Decision making అనే కొత్త విభాగం ప్రవేశపెట్టారు. పర్యవసానాలు ఆలోచించి దూరదృష్టితో అభ్యర్థి సరైన నిర్ణయం ఎంచుకుంటాడో లేదో పరిశీలించడం ఈ ప్రశ్నల పరమార్థం.

మన సందర్భం ఇక్కడ పోటీ పరీక్షలు. ఇక్కడ ఇస్తున్న ప్రశ్న గమనించండి. మీ సమాధానం ఏమిటో ఆలోచించండి.

* మీరు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరవుతున్నారు. ఇంతలో ఏపీపీఎస్‌సీ నుంచి గ్రూప్‌-1, గ్రూప్‌-2 మొదలైన నోటిఫికేషన్ల వెల్లువ వచ్చింది. మీరేం చేస్తారు?

ఎ) సివిల్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించి ఇతర పరీక్షలు వేటికీ దరఖాస్తు చేయరు
బి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు.
సి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు. డి) అన్ని పరీక్షలూ రాస్తారు.

ఇలాంటి సమస్యలూ, తీసుకోవాల్సిన నిర్ణయాలూ అభ్యర్థిని వూగిసలాటకు గురిచేస్తుంటాయి. తేల్చుకోవటం తప్పనిసరి అయిన సందర్భాల్లో ఏది అత్యుత్తమ నిర్ణయమవుతుందో, దాన్నెలా విజయవంతంగా అమలు చేయాలో ఒక పట్టాన అర్థం కాదు. విచిత్రమేమిటంటే... నిర్ణయం తీసుకోవటానికి ఒత్తిడి పెరిగినకొద్దీ ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఇలా విలువైన సమయం వృథా అవుతుంది.



పై ప్రశ్నకు సరైన సమాధానం డి. ఉత్తమ నిర్ణయం ఇదే ఎందుకవుతుందో విశ్లేషించటానికి ప్రయత్నిద్దాం.
i) గ్రూప్‌-1, 2, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల సిలబస్‌లో ఒకేరకమైన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే ఒకే ప్రిపరేషన్‌ సివిల్స్‌కూ, గ్రూప్స్‌కూ ఉపయోగపడుతుంది.

ii) సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షలు రెండూ దాదాపు ఒకే సమయంలో జరుగుతాయి. సివిల్స్‌ ప్రిలిమినరీని గ్రూప్‌-1 ప్రిలిమినరీ అనుసరిస్తుంది. అందువల్ల అభ్యర్థి షెడ్యూల్‌ ఏమీ దెబ్బతినదు.

iii) పోటీ పరీక్షలన్నిటిలో 'అదృష్టం' అంశ ఉంటూనే ఉంటుంది. మీరు సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ ఏడాది మీకు అనుకూలించకపోవచ్చు. అందుకే గ్రూప్‌-1, 2 పరీక్షలు రాస్తే మళ్ళీ సివిల్స్‌ రాయటానికి అవసరమైన ఉత్సాహం లభిస్తుంది.

iv) ఈ పరిస్థితిని వూహించండి- ఒక అభ్యర్థి నాలుగేళ్ళపాటు సివిల్స్‌కు దీక్షగా చదివాడు. కానీ విజేత కాలేకపోయాడు. ఈ కాల వ్యవధిలో గ్రూప్‌-1 లాంటి మరే పరీక్ష నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదు. ఇలాంటపుడు ఇంత సుదీర్ఘకాలం వెచ్చించిన ఆ అభ్యర్థిని ఎంతటి నిరాశా నిస్పృహలు కమ్ముకుంటాయో తేలిగ్గానే వూహించవచ్చు.



అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవటం అనుకూలాంశం. పెద్దసంఖ్యలో ఏపీపీఎస్‌సీ పోస్టులను ప్రకటించారు. పైగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పరీక్ష తేదీలను కూడా ముందే ప్రకటించేశారు. ప్రిపరేషన్‌ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించుకునే చక్కని అవకాశం ఏర్పడింది. అందుకే ఇదంతా అరుదైన అవకాశంగా భావించి, సివిల్స్‌ ఆశావహులు గ్రూప్స్‌ పరీక్షలకు కూడా సన్నద్ధం కావటం సమంజసం.

పరీక్షలకు సిద్ధం కావాలనే నిర్ణయం తీసుకున్నాక అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని- సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షల ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసే ప్రయత్నం. ప్రిపరేషన్‌ను ప్రభావశీలంగా మల్చుకోవటానికి కింది చర్యలు అనుసరించటం మేలు.


పాటించాల్సిన వ్యూహం
* సైన్సెస్‌ ప్రాథమికాంశాలను పటిష్ఠ పరుచుకోవాలి (గ్రూప్‌-1 కోసం). వాటిలోని తాజా పరిణామాలపై దృష్టి పెట్టాలి. (సివిల్స్‌ కోసం)
* చరిత్ర, భూగోళ అంశాలను క్షుణ్ణంగా చదవాలి. రెండు పరీక్షలకూ ఇవి ఉపయోగం.
* జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల వర్తమాన ఘటనలను స్థూలంగా అవగాహన చేసుకోవాలి. రెండు పరీక్షలకూ ఇది ప్రయోజనకరం.
* రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన అంశాలూ, ఆర్థిక గణాంకాలను సేకరించి అధ్యయనానికి జోడించుకోవాలి.
* ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.

ఈ మెలకువలన్నీ పాటిస్తే మీ 'ఉమ్మడి' ప్రిపరేషన్‌ సరైన దిశలో కొనసాగుతుంది!

- ‘బ్రెయిన్ ట్రీ’ గోపాలకృష్ణ. 

Saturday, 17 December 2011

సివిల్స్‌ మెయిన్స్‌ లో రేపటి మార్పులు

రీక్షా విధానంలో 'మార్పు' అనే మాట వినగానే అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది.

తాజాగా 'మెయిన్స్‌లో మార్పులు రాబోతున్నాయి' అంటూ వెలువడుతున్న వార్తలు సివిల్స్‌ పరీక్షను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల్లో తికమకను పెంచుతున్నాయి.

అయితే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఏ మార్పులైనా ఆకస్మికంగా ప్రవేశపెట్టరని గుర్తుంచుకోవాలి. సూక్ష్మంగా పరిశీలించి, విభిన్న అభిప్రాయాలను గమనించిగానీ మార్పులకు పచ్చజెండా ఊపరు.

కాకపోతే ఏ మార్పులకు ఆస్కారముందో తెలుసుకోవటం అభ్యర్థులకు మంచిదే!

నవంబరు, డిసెంబరు అంటే... సివిల్‌ సర్వీసుల అభ్యర్థులు శ్రద్ధగా గమనించాల్సిన నెలలుగా గుర్తింపు పొందాయి. కొన్నేళ్ళక్రితమైతే ఈ సమయంలో సివిల్స్‌ నోటిఫికేషన్‌ వచ్చేది. ఇప్పుడు పరీక్షా విధానం 'మార్పుల'కు సంబంధించిన సమాచారం వెలువడుతోంది. అంతే తేడా!

డిసెంబరు మొదటివారంలో యూపీఎస్‌సీ చైర్మన్‌ సివిల్స్‌ మెయిన్స్‌లో మార్పులను సూచించటానికి ప్యానెల్‌ని నియమించామని చెప్పారు. హ్యుమానిటీస్‌ విద్యార్థులతో పోలిస్తే సైన్స్‌ సబ్జెక్టుల వారు మార్కుల పరంగా అనుచిత ప్రయోజనం పొందకుండా మార్పులను సూచించటం ప్యానెల్‌ కర్తవ్యమని వార్తాకథనాల సారాంశం. నిర్వహణ, పాలనా నైపుణ్యాలను పరీక్షించేలా పేపర్లను రూపొందించటం కూడా మరో విధి.

అలఘ్‌ కమిటీ (1991), పాలనాసంస్కరణల రెండో కమిషన్‌ (2008) సిఫార్సుల ఆధారంగానే ప్యానెల్‌ సూచనలుంటాయని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నో ప్రశ్నలూ సందేహాలూ... వాటిని పరిశీలిద్దాం!


వయః పరిమితి, ప్రయత్నాల సంఖ్య మొదలైనవి ఇప్పటి కమిటీ పరిధిలో లేవని గమనించాలి.

** ప్రిలిమినరీ పరీక్షా విధానం మళ్ళీ మారుతుందా?
* లేదు. ప్రిలిమ్స్‌ యథాతథంగానే ఉంటుంది. ప్రశ్నల సంఖ్యా, వెయిటేజి మారవచ్చు. అంతేగానీ మార్కుల, పేపర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులూ ఉండవు.

** మెయిన్స్‌ మార్కులకు ప్రిలిమినరీ మార్కులు కలుస్తాయా?
* అలఘ్‌ కమిటీ ఇలా సిఫార్సు చేసింది కానీ, అది ఆమోదం పొందలేదు. అందుకని ప్రిలిమ్స్‌ మార్కులు మెయిన్స్‌లో కలిపే అవకాశం లేదు.

** మెయిన్స్‌లో అవకాశమున్న సబ్జెక్టులేమిటి?
* కమిటీ పరిధిని దృష్టిలో పెట్టుకుని కింది అంచనాలకు రావొచ్చు.

1) కంపల్సరీ లాంగ్వేజ్‌ పేపర్లు- ఇంగ్లిష్‌, మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ కొనసాగుతాయి. ఈ పేపర్ల స్థాయి పెరుగుతుంది. ఇప్పుడవి అర్హతా పేపర్లే. ర్యాంకును నిర్థారించే స్కోరులో వీటి మార్కులను కూడా కలిపే అవకాశముంది.

2) అలఘ్‌ కమిటీ, ఏఆర్‌సీలు ఎస్సే విషయంలో ఏకాభిప్రాయంతో లేవు. కాబట్టి వ్యాసం యథాతథంగానే ఉంటుంది.

3) ఇప్పుడున్న జనరల్‌స్టడీస్‌ పేపర్లను మార్చాలని అలఘ్‌ కమిటీ సిఫార్సు చేయగా, ఏఆర్‌సీ దాన్ని బలపరిచింది. కాబట్టి ఇప్పుడున్నట్టుగా జనరల్‌స్టడీస్‌ పేపర్లుండకపోవచ్చు. ప్రిలిమ్స్‌లో పరీక్షించిన స్టాటిస్టిక్స్‌ లాంటివాటికి మెయిన్స్‌లో చోటు దొరక్కపోవచ్చు.

** కంపల్సరీ పేపర్లు ఏవి ఉండే అవకాశముంది?
* ఇప్పటి మెయిన్స్‌లో ఆప్షనల్స్‌ అంటే- అభ్యర్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో చదివిన సబ్జెక్టులపై దృష్టి పెట్టటం. కానీ విజయవంతమైన సివిల్‌ సర్వెంట్‌గా మారాలంటే... నేర్చుకోదల్చిన అంశాలపై అభ్యర్థి దృష్టిపెట్టేలా ఉండాలి. అందుకే ఆప్షనల్‌ పేపర్ల స్థానంలో అభ్యర్థి విస్తృత పరిజ్ఞానం, నైపుణ్యాలు, స్వభావం, అభిరుచులూ పరీక్షించేలా కంపల్సరీ పేపర్లను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. వివిధ సబ్జెక్టుల కలబోత స్వభావంతో ఉండే ఈ పేపర్లు హయ్యర్‌ సివిల్‌ సర్వీసెస్‌తో నేరుగా సంబంధం కలిగివుంటాయి.

ఏమిటా పేపర్లు?
1.Sustainable development and Social Justice
2. Science and Technology in Society
3. Public Systems, Democratic Governance and Human Rights
4. The constitution of India and Indian Legal System
5. Indian Economy
6. Administrative Theory and Governance in India

బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌), షార్ట్‌ ఆన్సర్‌, ఎస్సే టైపు ప్రశ్నలు అడుగుతారని భావిస్తున్నారు.

** గ్రూప్‌-1 పరీక్ష తరహాలో ఉంటుందా నూతన పరీక్షా విధానం?
* అలా ఉండే అవకాశం లేదు.
** సివిల్స్‌-2012 పరీక్షా విధానం మారబోతోందనీ, అందుకే నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోందనీ వదంతులు వినిపిస్తున్నాయి....

* 2012లో ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ డిసెంబరు 1న రాజ్యసభలో అవినాష్‌పాండే అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి వి.నారాయణస్వామి జవాబిస్తూ ఈ విషయాన్నే ఇలా స్పష్టం చేశారు. 'There is no proposal to introduce changes in the Main examination of the Civil Services Examination, at present.' 

కాబట్టి అభ్యర్థులు అనవసర గందరగోళానికి గురవ్వకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే పరీక్షకు సిద్ధం కావటం శ్రేయస్కరం!

- గోపాలకృష్ణ 

Wednesday, 30 November 2011

సివిల్స్ లో జనరల్‌ స్టడీస్‌ ఎలా?

సివిల్స్‌ ప్రిలిమినరీలోని రెండు పేపర్లలో ఏయే అంశాలుంటాయి? సముద్రంలాంటి జనరల్‌స్టడీస్‌ను చదివే విధానం ఏమిటి? నూతనంగా ప్రవేశపెట్టిన అంశాలపై అవగాహన ఎలా పెంచుకోవాలి?...

అభ్యర్థులకు ఉపయోగపడే సూచనలు అందిస్తున్నారు 'బ్రెయిన్‌ ట్రీ' డైరెక్టర్‌ గోపాలకృష్ణ!

ఏ పోటీ పరీక్షకైనా ఎలా సంసిద్ధం కావాలి? విద్యార్థులందరూ ఈ విషయంలో మూడంచెలను పాటించాల్సివుంటుంది.
1) సిలబస్‌ను చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2) పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అడిగిన ప్రశ్నల తీరును అవగాహన చేసుకోవాలి.
3) సిలబస్‌లోని అన్ని general areasచదవటంతో పాటు పరీక్షలో రావటానికి అవకాశమున్న ధోరణులపై (పూర్వ ప్రశ్నపత్రాల ఆధారంతో) దృష్టి పెట్టాలి.

సివిల్స్‌ ప్రిలిమినరీకి కూడా కూడా ఇదే విధానం వర్తిస్తుంది, కొన్ని మినహాయింపులతో!

రెండు కామన్‌ పేపర్లు
సివిల్స్‌ అభ్యర్థులందరూ ప్రిలిమినరీలో రెండు కామన్‌ పేపర్లు రాయాలి.

1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1:
2) పేపర్‌-2:

పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌
వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.

ఇన్ని అంశాలనూ కవర్‌ చేసి, ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి? తార్కికంగా చూసినా ఉన్న ఒకే మార్గం- trendsను గుర్తించి, అనుసరించటమే! అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరిగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను ముందస్తుగా ఊహించటం కష్టం.

ఇది 'నల్లహంస' దృగ్విషయం లాంటిది. 
 (నల్లహంసల జాతి ఒకటుందని పదిహేడో శతాబ్దిలో కనిపెట్టేదాకా హంసలన్నీ తెల్లగా ఉంటాయనే నమ్మకం కొనసాగింది. లెబనీస్‌ రచయిత టాలెబ్‌ దీన్ని Black swan phenomenon గాcoinచేశారు. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహించటానికి సాధ్యం కాని స్థితి!...

పరీక్షల సందర్భానికొస్తే పాత ప్రశ్నపత్రాల సాయంతో రాబోయే ప్రశ్నలను వూహించలేకపోవటం.)

ప్రిలిమినరీలో పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌ నిశ్చయంగా Black Swan. ఎవరూ వూహించటానికి వీల్లేకుండా యూపీఎస్‌సీ దీన్ని రూపొందిస్తుంది. మరి కర్తవ్యం?

మొదట మీ విశ్లేషణ కచ్చితంగా ఉండాలి. ఇది జ్ఞాపకశక్తిని పరీక్షించే factual paper అని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. ఈ కారణంతోనే చాలామంది మంచి అభ్యర్థులకు ఇది మొదటినుంచీ సమస్యగా ఉంటూ వచ్చింది. ఈ పేపర్‌తో సంబంధమున్న రీజనింగ్‌ భాగాన్ని చాలామంది అర్థం చేసుకోరు. 2011 నుంచి UPSCఅధికారికంగా 'ఆప్టిట్యూడ్‌' పరీక్షను ప్రవేశపెట్టింది కానీ, గత 4-5 ఏళ్ళ నుంచీ జనరల్‌స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ పరోక్షంగా కరిక్యులమ్‌లో భాగంగానే ఉంది.

ప్రాథమిక factualసమాచారంతో పాటు బలమైన రీజనింగ్‌ నైపుణ్యాలు అవసరమయ్యేలా UPSCప్రశ్నలను రూపొందిస్తోంది. కాబట్టి సారాంశంలో ఇది జనరల్‌స్టడీసూ కాదు; జనరల్‌ నాలెడ్జీ కాదు! ఇది జనరల్‌ స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (GSAT).

స్థిర, పరిణామశీల అంశాలు
* స్థిర (static)అంశాలు- భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ

* పరిణామశీల అంశాలు - వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జి. వీటికి తగిన నిర్వచనం, సిలబస్‌ అంటూ లేవు.

స్థిర అంశాల్లో సాధారణంగా స్కోరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. వీటిలో ఎంత ఎక్కువ సాధించగలిగితే అనిర్దిష్ట అంశాలైన వర్తమాన వ్యవహారాలూ, జి.కె.లపై ఆధారపడటం అంత తగ్గుతుంది. వీటిని మౌలిక అంశాల నుంచి నేర్చుకుని, నోట్సు ద్వారా పకడ్బందీగా పునశ్చరణ చేసుకోవాలి. భావనలు (concepts) పటిష్ఠపరచుకోవాలి. నమూనా టెస్టులు రాస్తే పరిజ్ఞానం విస్తృతమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

నిర్దిష్టత ఉండని వర్తమాన, జి.కె.లలో ప్రాథమిక వివరాలతో పాటు సూత్రాలూ, అమలూ కూడా అవగాహన చేసుకోవాలి. చాలినంత సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు థియరిటికల్‌ అంశాల జాబితా తయారుచేసి, రోజువారీగా తాజా పరిణామాలను జోడించుకుంటూ ఉండాలి. ఈ తరహా ప్రశ్నలకు రీజనింగ్‌, factual data అవసరం కాబట్టి పైన చెప్పిన విధానం పాటిస్తే వాటిని పెంపొందించుకోవచ్చు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలు
2) తెలుగు అకాడమీ ప్రచురణలు
3) హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ) లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు
4) తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు
5) పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌'
6) తెలుగు, ఇంగ్లిష్‌ల్లో ప్రచురితమయ్యే 'యోజన'
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు ఈ పేపర్‌ గురించి మరీ ఇబ్బందిపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు అంశాలతో తేలిగ్గానే పరిచయం పెంచుకోవచ్చు.

పేపర్‌-2
కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌- అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ (పదో తరగతి స్థాయి)

గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యథావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడివుంటుంది కాబట్టి ఈ పేపర్‌ కూడా మరో Black swanఅవ్వగలదు.

ఈ పేపర్లో ఉన్న అంశాలన్నిటిలోనూ పట్టు సాధించటం ఎక్కువమంది అభ్యర్థులకు సాధ్యం కాదు. అందుకని గరిష్ఠ మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయికంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పటిష్ఠపరుచుకోవటం కోసం మంచి వర్క్‌బుక్‌తో సాధన చేయాలి. ఒక నిర్దిష్టమైన తర్కంపై పట్టు లభిస్తే అది ఆత్మవిశ్వాసం పెంచి, ఇతర ప్రశ్నలను చేయటానికి కూడా ఉపకరిస్తుంది. అందుకే ఈ పేపర్‌ కోసం మంచి ప్రశ్నలను solve చేయటం చాలా ముఖ్యం.

పేపర్‌-1 static section లో ప్రశ్నల సంఖ్యది ప్రధాన పాత్ర. కానీ పేపర్‌-2లో నాణ్యమైన ప్రశ్నలు (సంఖ్యలో తక్కువైనప్పటికీ) చేయటం అవసరం. అప్పుడే దానిమీద అవగాహన పెరుగుతుంది. ఈ విధంగా ఈ విభాగంలో స్కోర్‌ చేయాలంటే smart work ప్రధానాంశం.

క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం చాలా ప్రధానం. మొత్తం మార్కుల్లో వీటి భాగం ఎక్కువ. అభ్యర్థులు కష్టపడితే దీన్ని సులభంగా మల్చుకోవచ్చు. ఈ విభాగానికి సమయం కబళించటంలో చాలా పేరుంది కాబట్టి ప్రశ్నలను సత్వరం చేసేలా సమయపాలన పద్ధతులను మెరుగుపరుచుకోవాల్సిందే. లేకుంటే అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను రాయగలిగే అవకాశం లేకుండాపోతుంది.

ఇంగ్లిష్‌ మాధ్యమ నేపథ్యం లేనివారూ, ఈ భాషపై అంతగా పట్టు లేనివారూ ఆందోళన పడకూడదు. ఇప్పటివరకూ అనుసరించిన ప్రిపరేషన్‌ పద్ధతినే, తీరునే కొనసాగించాలి. యూపీఎస్‌సీ పేర్కొన్నట్టు- 'టెన్త్‌ క్లాస్‌ స్థాయి' నైపుణ్యాలను మాత్రమే పరీక్షిస్తారు కాబట్టి ఆందోళన పడనవసరంలేదు. సిలబస్‌లో లేని లోతైన అంశాలను చదువుతూ ప్రిపరేషన్‌ను సంక్లిష్టం చేసుకోకూడదు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) అరిథ్‌మెటిక్‌ ప్రాథమిక పుస్తకాలు
2) ఇంగ్లిష్‌ మౌలిక విషయాలుండే పుస్తకాలు
3) 'ఇగ్నో' ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌ పుస్తకాలు
4) బ్యాంకింగ్‌ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు
5) పేపర్‌-2కు సంబంధించిన మంచి manual
6) మంచి ఇంగ్లిష్‌ నిఘంటువు / ఇంగ్లిష్‌- తెలుగు నిఘంటువు

మొత్తమ్మీద రెండు పేపర్లకూ section వారీగా సంసిద్ధం కావాలి. మిగతా అంశాలను పకడ్బందీగా చదివివుంటే కొన్ని ఉప అంశాలను వదిలివేసినా ఇబ్బంది ఎదురవ్వదు. ప్రతి మార్కూ పెద్ద తేడాను సృష్టించే ఇలాంటి పోటీపరీక్షల్లో సమయ నిర్వహణ చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది.


కాబట్టి వచ్చే రోజుల్లో అభ్యర్థులు తమ సాధనను సమయ నిర్వహణతో అనుసంధానించుకోవటం శ్రేయస్కరం.

Tuesday, 22 November 2011

సివిల్స్‌ నగారా

సామాజిక స్పృహ, అంకితభావం ఉండి దేశానికి ఉపయోగపడాలని అభిలషించే నవ యువత మొదటి మొగ్గు సివిల్స్‌కే! ఆశావహ దృక్పథం, సరైన ప్రణాళిక, సహనం, సుదీర్ఘకాలం కష్టపడే స్వభావం ఉంటేనే దేశంలోని అత్యుత్తమమైన సివిల్‌ సర్వీసుల్లో ప్రవేశించగలుగుతారు. పరీక్షా పద్ధతి మారిందని నిరాశపడకుండా దానికి తగ్గట్టుగా తమను మల్చుకోగలిగితే తెలుగు మీడియం విద్యార్థులకూ సివిల్స్‌ శిఖరారోహణ సుసాధ్యమే అంటున్నారు బ్రెయిన్ ట్రీ గోపాలకృష్ణ !

సివిల్‌ సర్వీసుల ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుంది. ఈలోపు పకడ్బందీగా పూర్వరంగం సిద్ధం చేసుకుంటే సులభంగా కార్యాచరణలోకి అడుగుపెట్టవచ్చు. గత ఏడాదే ప్రవేశపెట్టిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష మార్పుల గురించి తెలుసుకుంటే స్పష్టత ఏర్పడుతుంది.
గతంలో ప్రిలిమినరీ ఐచ్ఛిక (ఆప్షనల్‌) పేపర్‌ 300 మార్కులకూ, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ 150 మార్కులకూ ఉండేవి. ఆప్షనల్‌లో 120 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు. జనరల్‌స్టడీస్‌లో సరైన జవాబుకు మార్కు చొప్పున 150 ప్రశ్నలు. తప్పు జవాబులకు 0.33 మార్కుల తగ్గింపు (మైనస్‌) ఉండేది. ఈ విధానంలో డిగ్రీలో చదివిన సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకునే వీలుండటం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. ఇంగ్లిష్‌లో ప్రశ్నలున్నప్పటికీ తెలిసివున్న సబ్జెక్టు కాబట్టి తేలిగ్గా రాయగలిగేవారు. ప్రతికూలతల్లో ప్రధానమైనది ఏమిటంటే... ఆప్షనల్స్‌ కటాఫ్‌ మార్కుల్లో రకరకాల తేడాలుండటం, కొన్ని మాత్రమే ఎక్కువ స్కోరింగ్‌గా ఉండి అభ్యర్థులందరికీ సమన్యాయం లభించకపోవటం. దీంతో సివిల్స్‌లో ఉమ్మడి (కామన్‌) పేపర్లు అవసరమనే వాదనకు మద్దతు ఏర్పడింది. ఫలితంగా 2011లో మార్పులు అమలయ్యాయి.



రెండు కామన్‌ పేపర్లు
సివిల్స్‌ అభ్యర్థులందరూ ఇప్పుడు రెండు కామన్‌ పేపర్లు రాయాలి.

1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1:
వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.

2) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2: 
కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌- అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ (పదో తరగతి స్థాయి)


యూపీఎస్‌సీ నుంచి ప్రశ్నల సంఖ్య గురించి కానీ, ప్రశ్నల శైలి గురించి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. కొన్ని నమూనా ప్రశ్నలు మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. దీంతో ఏ తరహా ప్రశ్నలు వస్తాయో ఎవరికీ అర్థం కాలేదు. అనిశ్చిత స్థితిలోనే అభ్యర్థులు పరీక్ష రాయాల్సివచ్చింది.
నిరాశాపూరితం
ఈ ఏడాది జూన్‌ నెల్లో ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానం అభ్యర్థులకు తొలిసారి అవగతమయింది. నూతన పద్ధతి నిరాశాపూరితంగా ఉందనటం అనుచితమైన వ్యాఖ్య ఏమీ కాదు. ప్రశ్నపత్రం సృజనాత్మకంగా లేదు; క్లిష్టంగానూ లేదు. ప్రచారం జోరుగా సాగిన సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలేమీ లేవు.

పేపర్‌-1 యథాప్రకారం కఠినంగా ఉంది. సూక్ష్మాంశాలతో కూడి ఉండటం వల్ల 50 శాతం కంటే మించి ఏ అభ్యర్థీ కచ్చితంగా జవాబులు గుర్తించలేకపోయారు. ఇలాంటి స్థితిలో పేపర్‌-2లో 75 శాతం తెచ్చుకున్నవారే పాసయ్యారు. ఉత్తీర్ణతకు అవసరమైన సాధారణ స్కోరు 200/ 400.

ఇంగ్లిష్‌లో మంచి ప్రావీణ్యమున్న పట్టణ విద్యార్థులకే ప్రశ్నపత్రం అనుకూలించినట్టుగా ఫలితాల తీరు తెలిపింది. నిజానికి గత పరీక్షా విధానంలో పరీక్షకు హాజరైవున్న చాలామంది నెగ్గలేకపోగా; అంతగా సిద్ధం కాకుండానే పరీక్ష రాసిన ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. ప్రాంతీయ భాషల మీడియంలో డిగ్రీ చదివినవారు విజయానికి దూరం కాగా, పట్టణ విద్యార్థులే ఎక్కువమంది విజేతలుగా నిలిచారు.

తెలుగు మీడియం విద్యార్థులు ఏం గమనించాలి?
* ఇంగ్లిష్‌ అంత సరిగా రాకుంటే ఈ భాష నేర్చుకోవటానికి కృషి చేయాల్సిందే. ఇంగ్లిష్‌ ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు.
* పాఠశాల పుస్తకాల్లోని ప్రాథమిక వ్యాకరణం చదివి భాషను మెరుగుపర్చుకోవచ్చు. వాక్యనిర్మాణం అర్థం చేసుకోవటం, వాక్యాల భావాన్ని సరిగా బోధపరుచుకోవటం అవసరం.
* ఇంగ్లిష్‌లో ప్రాచుర్యం పొంది, తెలుగులోకి కూడా అనువాదం పొందిన పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. మొదట ఆంగ్ల భాగం చదివి, దాన్ని తెలుగులోకి మార్చాలి. సరిగా వచ్చిందో లేదో తెలుగు అనువాదంతో పోల్చి చూడాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఆసక్తిగా సంతోషంతో చేయాలి గానీ 'తప్పదు కదా' అనే ఉద్దేశంతో కాదు.
* పాత బ్యాంకింగ్‌ పరీక్షల నుంచి కాంప్రహెన్షన్‌ పాసేజ్‌లను తీసుకుని, జవాబులు రాయటం సాధన చేయాలి.
* మెంటల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ విభాగాల నుంచి ఎక్కువ స్కోర్‌ చేయటానికి ప్రయత్నించండి. వీటికి ఇంగ్లిష్‌తో సంబంధం లేదు.
* వీలైనంత త్వరగా ప్రిపరేషన్‌ మొదలుపెడితే ఇంగ్లిష్‌ నైపుణ్యాలు పెంచుకోవటానికి వ్యవధి చిక్కుతుంది.
* పేపర్‌-1లో మార్కులను గరిష్ఠంగా పెంచుకోవటానికి ప్రయత్నించాలి. పేపర్‌-2 అంశాలు మీకెటూ ఇబ్బంది కావు.
* సాధన చేసేటపుడు పొరపాట్లపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే... చేసే ప్రతి పొరపాటూ మార్కులను కోల్పోయేలా చేస్తుందని మరవకూడదు.

Friday, 14 October 2011

సివిల్స్ మెయిన్స్‌ మెలకువలివిగో!

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు దగ్గర్లోకి వచ్చేశాయి.

దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ఆందోళన!

పరీక్షను అర్థం చేసుకుని, విజయసూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే 'సన్నద్ధత' ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఆ వివరాలను అందిస్తూ పునశ్చరణను పరిపుష్టం చేసుకునే విధానం వివరిస్తున్నారు... బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ

 
సివిల్స్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది కాబట్టి అది చాలా తేలికనే అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంది. నిజానికి కష్టమైన పరీక్ష ఇదే. ప్రిలిమినరీలో ప్రతి మార్కూ విలువైనదే. ఒక్క మార్కే అభ్యర్థి పోటీలో ఉండటాన్నీ, వైదొలగటాన్నీ నిర్ణయించే అవకాశముంది. పైగా మొదటిసారి ప్రిలిమ్స్‌లో నెగ్గనివారిలో ఆ కారణం మానసికంగా కొంత అవరోధాన్ని ఏర్పరిచే ప్రమాదం ఉంటుంది.

అందుకే ప్రిలిమ్స్‌ దశ దాటినవారు పెద్ద 'హర్డిల్‌' దాటేసినందుకు తమ భుజం తామే తట్టుకోవచ్చు! ఇక రెండో దశ అయిన మెయిన్స్‌ విషయానికి వస్తే... దీనిలో సాధించిన మార్కులు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వారు ఇంటర్వ్యూకు అర్హత పొందుతారా? ఏ సర్వీసుకు ఎంపికవుతారు? ఐఏఎస్‌కో, ఐపీఎస్‌కో ఎంపికైతే ఏ రాష్ట్రంలో పనిచేస్తారు?... ఇవన్నీ!

ప్రతి మార్కూ ఇక్కడ కూడా పరిగణనలోకి వచ్చేదే. అయితే ఎక్కువ పేపర్లుంటాయి కాబట్టి ఒక పేపర్లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్లో అత్యధిక స్కోరు తెచ్చుకుని సర్దుబాటు చేసుకోవచ్చు.

ఆప్షనల్స్‌ ప్రత్యేకత
మెయిన్‌ పరీక్షలో తొమ్మిది పేపర్లుంటాయి. వాటిలో ఐదు తప్పనిసరి (కంపల్సరీ). మిగిలిన నాలుగూ అభ్యర్థి ఎంచుకునే ఆప్షనల్స్‌. ఈ ఆప్షనల్‌ సబ్జెక్టుల ప్రత్యేకత ఏమిటి? గత మూడేళ్ళ ఫలితాల్లో టాపర్ల మార్కులను పరిశీలిస్తే... అందరూ ఆప్షనల్స్‌లో చాలా అధిక మార్కులు స్కోర్‌ చేసినవారే! ఆశ్చర్యకరంగా జనరల్‌ స్టడీస్‌లో అందరికీ తక్కువ మార్కులే వచ్చాయి.

ఇది దేన్ని సూచిస్తోంది?

జనరల్‌ స్టడీస్‌ చాలా విస్తృతం కాబట్టి దీనిలో స్కోర్‌ చేయటం చాలా కష్టం. ఈ క్లిష్టత అభ్యర్థులందరిదీ! ఈ పేపర్‌ పూర్తిగా అనూహ్యంగా ఉండొచ్చు. ఎంత విస్తారంగా చదివినా, ఎన్ని కోచింగ్‌ తరగతులకు హాజరైనా... ప్రశ్నపత్రం అదివరకెన్నడూ ఎరగనిది చూసినట్టు అనిపిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇలాంటపుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి విచారించనక్కర్లేదు. అందుకే 2000 మార్కులున్న ఆప్షనల్స్‌ మీద దృష్టి కేంద్రీకరిస్తే 1200 మార్కులు (60 శాతం) తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర పేపర్లలో అనూహ్య ప్రశ్నలు ఎక్కువ కాబట్టి ఆప్షనల్స్‌ మార్కులు 60 శాతమైనప్పటికీ, అభ్యర్థి విజయంలో వాటి పాత్రను 75 శాతం వరకూ లెక్కలోకి వేసుకోవచ్చు. ఈ రకంగా ఆప్షనల్స్‌లో వచ్చే మార్కులకు నేరుగా ర్యాంకుతోనే సంబంధం ఉంటుంది!

మన రాష్ట్రంలో సివిల్స్‌ విజేతల్లో ఎక్కువమంది ఎంచుకునే ఆప్షనల్స్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీ, తెలుగు సాహిత్యం, భూగోళశాస్త్రం ఉన్నాయి. తొలిసారే అర్హత పొందినవారిలో అధికశాతం ఎంపిక- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలే. దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందిన ఆప్షనల్‌- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌. గత ఏడాది విజేతలైన 900 + అభ్యర్థుల్లో 400+ మంది ఆప్షనల్‌ ఇదే! ఈ ఏడాది మెయిన్స్‌కు హాజరయ్యే 12,000 మంది అభ్యర్థుల్లో 6,500కి పైగా ఈ సబ్జెక్టునే ఆప్షనల్‌గా ఎంచుకోవటం విశేషం. ఈ సబ్జెక్టు సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. మొదటి పేపర్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ థియరీ, రెండోదానిలో భారతీయ పాలనావ్యవస్థ. రెండూ స్కోరింగ్‌కు అనుకూలమైనవే. ప్రతి పేపర్లోనూ 300కు 200 మార్కులు తెచ్చుకున్నవారున్నారు. వీరి వ్యూహం ఏమిటంటే...

1) స్కోరింగ్‌ అంశాలను గుర్తించటం

2) ఈ అంశాల్లోని వర్తమాన పరిణామాలను చదవటం

3) జవాబులు రాసే తీరుపై దృష్టి పెట్టటం

పేపర్‌-1:
మొదటి విభాగం (సెక్షన్‌)లో తొలి ఆరు అధ్యాయాలూ, రెండో విభాగంలో మిగిలిన ఆరు అధ్యాయాలూ ఉంటాయి. మొదటి విభాగం అధిక స్కోరింగ్‌ కాబట్టి ఈ అధ్యాయాలపై అధిక దృష్టి కేంద్రీకరించవలసివుంది.

పేపర్‌-2: తొలి ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-ఎలో, మిగిలిన ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-బిలో ఉంటాయి. దీనిలో పేపర్‌-1 మాదిరి కాకుండా రెండో విభాగంలోనే అధిక మార్కులు స్కోర్‌ చేసే అవకాశముంది.

గత కొద్ది సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా కింది ధోరణులను గుర్తించవచ్చు.

* గతంలో కనీసం నాలుగు వ్యాసరూప (ఎస్సే) ప్రశ్నలుండేవి. ఈ తీరు మారుతోంది. ఎస్సే ప్రశ్నలు చిన్న ప్రశ్నలుగా మారుతున్నాయి. దీనిబట్టి గ్రహించాల్సింది ఏమిటంటే... అభ్యర్థులు కొన్ని అంశాలను వదిలివేసే అవకాశం లేదిప్పుడు. అన్నిటినీ చదివి తీరాల్సిందే!

* కొన్ని areasలో ప్రశ్నలు పరోక్షంగా ఉంటాయి. అవి అంత స్కోరింగ్‌ కావు. కానీ కొన్ని areasలో నేరుగా వచ్చే ప్రశ్నలుంటాయి. అవి స్కోరింగే. సమస్యేమిటంటే... ఈ areasచదవటానికి విసుగ్గా ఉంటాయి. బోరింగ్‌... కానీ స్కోరింగ్‌! అందుకే అభ్యర్థులకు మరో అవకాశం లేదని గుర్తుంచుకోండి.

* ప్రశ్నల విధానం ఏటా మారుతుంటుంది. ఇటీవల 10-15 మార్కులుండే short questions ఇవ్వటంపై దృష్టి పెరిగింది. దీనికి సిద్ధంగా ఉండాలి.

* సరికొత్త పరిణామాలను తెలుసుకుంటూ ఉండాలి. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గతిశీలమైనది, రోజూ నూతన సంఘటనలు చోటుచేసుకునే సబ్జెక్టు. అతి ముఖ్యమైన అంశాలను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.

* గత సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాల జాబితా తయారుచేసుకోవాలి. వాటిపై అధిక దృష్టి పెట్టాలి. అయితే పేపర్‌ రూపొందించేవారు మనకంటే తెలివైనవారైవుంటారు కాబట్టి ఏ అంశాన్నీ వదిలెయ్యకుండా జాగ్రత్తపడాలి.

* 'ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌' నుంచి సంబంధమున్న వ్యాసాలను చదవాలి. వాటి నుంచి చాలా ప్రశ్నలు ఆశించవచ్చు.

* పరీక్షలో ఎన్ని వీలైతే ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశ్నకు నేరుగా స్పందించలేకపోయినప్పటికీ ఆ అంశం గురించి ఏదో ఒకటి రాయటం మేలు. ఆ అంశానికి సంబంధించిన ముఖ్య కోణాల గురించి రాసినప్పటికీ కనీసం 40 శాతం మార్కులైనా వచ్చే అవకాశం ఉంటుంది.

Wednesday, 5 October 2011

సివిల్స్‌ తెలుగును అశ్రద్ధ చేస్తే అసలుకే మోసం!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మన రాష్ట్ర విద్యార్థులకు తప్పనిసరి పేపర్‌గా మాతృభాష తెలుగు ఉంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే అయినా నిర్లక్ష్యం వహిస్తే అర్హత కోల్పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు డా. ద్వా.నా. శాస్త్రి.

అర్హత పరీక్షగా తెలుగు 300 మార్కులకు జరుగుతుంది. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. అయితే నలబై శాతం మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. అంటే 120 మార్కులు! 'ఈ మాత్రం రావా?' అనే నిర్లక్ష్యం పనికిరాదు. అశ్రద్ధ వల్ల 'క్వాలిఫై' అవ్వని అభ్యర్థులూ ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు.

'క్వాలిఫైయింగ్‌' తెలుగులో మొత్తం ఆరు ప్రశ్నలుంటాయి.

1) 300 పదాలతో వ్యాసం - 100 మార్కులు 2) ఒక ఖండిక ఇచ్చి చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయటం- 60 మార్కులు 3) ఒక ఖండికను మూడోవంతు పరిమాణానికి తగ్గించి రాయటం- 60 మార్కులు 4) ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించటం- 20 మార్కులు 5) తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించటం - 20 మార్కులు 6) ఎ) జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటం- 20 మార్కులు బి) సమానార్థక పదాలు రాయటం- 20 మార్కులు

పదో తరగతి స్థాయికి తగినది అని చెపుతున్నా నిజానికి ఈ పేపర్‌ డిగ్రీ స్థాయికి చెందినదే. పైగా ఆంగ్లమాధ్యమంలో చదువుతున్న అభ్యర్థులకు తెలుగు రాసే అలవాటు అంతగా ఉండదు. అందుకే ఈ పేపర్‌ను తేలిగ్గా తీసుకోవటం, నిర్లక్ష్యం చేయటం సరికాదు.

మొదటి ప్రశ్న
ఇది 'జనరల్‌ ఎస్సే'కి సంబంధించినది. సుమారు 300 పదాల్లో రాయమన్నారు కాబట్టి ఓ ఇరవై పదాలు ఎక్కువైనా, తక్కువైనా పట్టించుకోరు. తక్కువ రాయటం కంటే ఇరవై పదాలు ఎక్కువైనా ఫరవాలేదనుకోవాలి. లెక్కపెట్టి మరీ రాయనవసరం లేదు.

ఒక పేజీ రాసినతర్వాత సుమారుగా ఎన్ని పదాలు వచ్చాయో చూసుకుని దాని ప్రకారం రాయవచ్చు. వంద మార్కులున్నాయి కాబట్టి ఆచితూచి రాయాల్సివుంటుంది. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే... ఐదు ప్రశ్నల్లో ఒకటే రాయటం. 'చాయిస్‌' ఎక్కువుంది కాబట్టి దిగులు చెందనక్కర్లేదు.

నేపథ్యం, ప్రారంభం, విషయ వివరణ, అనుకూల ప్రతికూల అంశాలు, ప్రస్తుత స్థితి, సూచనలు, ముగింపు... అనేవాటిపై దృష్టి ఉంచి వ్యాసం రాయాలి. పెద్దల మాటలనూ, కవుల వాక్యాలనూ, సామెతలనూ, జాతీయాలనూ ప్రయోగిస్తే మార్కులు ఎక్కువ సంపాదించవచ్చు. అనుకూలమైనా, ప్రతికూలమైనా చర్చించే పద్ధతిని బట్టి మార్కులుంటాయి. సోదాహరణంగా వివరిస్తే స్పష్టత సాధించవచ్చు.

రెండో ప్రశ్న
చివరలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు- పైన ఇచ్చిన ఖండికలోనే ఉంటాయి. జాగ్రత్తగా చదివితే చాలు. అయితే సమయం ముఖ్యమని మర్చిపోకూడదు. ఖండికలో ఉన్నట్టే రాయక్కర్లేదు- 'మీ సొంత మాటల్లో' రాయాలని సూచిస్తారు.

మూడో ప్రశ్న
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇచ్చిన ఖండికను మూడో వంతు పరిమాణానికి తగ్గించి సంక్షిప్తంగా రాయాలి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన కాగితాలపైనే రాసి ప్రధాన సమాధాన పత్రానికి జత చేయాలి. మూడోవంతుకు తక్కువైనా, ఎక్కువైనా తగిన విధంగా మార్కులుంటాయన్న హెచ్చరికను గమనించాలి. కాబట్టి మొత్తం పంక్తులు లెక్కబెట్టి మూడో వంతుకు ఎన్ని పంక్తులు వస్తాయో ముందుగానే సరిచూసుకోవాలి. ఇలా సంక్షిప్తం చేయడమంటే ఇచ్చిన సమాచారంపై అవగాహన ఉండాలని భావం. రెండు మూడు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంగా కుదించాలి. భావం మారకుండా, సొంత కవిత్వం లేకుండా రాయాలి. ఇందుకు సామెతలు, జాతీయాలు తోడ్పడతాయి. రెండు మూడుసార్లు చదివినతర్వాతనే సంక్షిప్త రచన చేపట్టాలి.

అనువాదం
ఆంగ్లం నుంచి తెలుగులోకీ, తెలుగు నుంచి ఆంగ్లంలోకీ అనువదించమనే ప్రశ్నలుంటాయి. అనువాదం ఎప్పుడూ యథాతథానువాదం కాకూడదు. అంటే మక్కీకి మక్కీ ఉండకూడదు. భావాన్ని సొంతమాటల్లో చెప్పాలి. అనువాదంలా కాకుండా 'అనుసృజన' లాగా ఉండాలి.

రెండు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంలో చెప్పవచ్చు. సరైన పదాలు తట్టకపోతే మూలపదాలను అలాగే రాసి కొటేషన్లలో రాయవచ్చు. ఆంగ్లపదాలను రాయాల్సివస్తే ఆంగ్లంలో కాకుండా వాటిని కొటేషన్లో ఉంచి తెలుగులో రాయాలి. ఉదా: 'కంప్యూటర్‌', 'అడ్మినిస్ట్రేషన్‌', 'ఇంటర్వ్యూ' మొదలైనవి. అనువాదంలో భాషానుగుణమైన పదప్రయోగాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్లంలో staying at hotel అంటారు. దీన్ని తెలుగులో రాసేటప్పుడు 'హోటల్‌ వద్ద' అనకుండా 'హోటల్‌లో'బస చేస్తున్నాడనాలి. ఆంగ్లంలోని 'బ్రెడ్‌' అనే మాటను సందర్భాన్నిబట్టి 'ఆహారం' అని మార్చాల్సివుంటుంది. ఇలాంటి మెలకువలు గ్రహించాలి.

సొంతవాక్యాల్లో జాతీయాలు
ఇది ఎంత తేలికో అంత కష్టమైనది. జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటమంటే లోకజ్ఞానం, సందర్భం తెలిసివుండాలి. జాతీయం అనేది రెండు మూడు పదాల కలయిగా ఉండే పదబంధం. ఆంగ్లంలో 'ఇడియమ్‌' అంటారు. అసలైన అర్థం కాకుండా దానికి సంబంధించి మరో అర్థం వస్తుంది.

'కళ్ళల్లో కారం పోసుకోవడం' అంటే నిజంగా ఆ అర్థం కాదు. ఈర్ష్య పడటం, అసూయపడటం, ఓర్వలేకపోవడం అని. దీన్ని గ్రహించి వాక్యంలో ప్రయోగించాలి.

* వడ్డించిన విస్తరి: అధికారం, సంపద గలవారి జీవితం వడ్డించిన విస్తరి వంటిది.

* నత్తనడక: ప్రభుత్వ ప్రణాళికలు చాలావరకూ నత్తనడక నడుస్తున్నాయి.

*  చెవి కోసుకోవడం: కథలంటే మా అన్నయ్య చెవి కోసుకుంటాడు.

అమృతము= పీయూషము, సుధ

కలువ= ఉత్పలము, కల్హారం, కుముదం

మనుష్యుడు= మానవుడు, మనుజుడు, మర్త్యుడు, నరుడు, పురుషుడు

వాయువు= గాలి, మారుతము, పవనము, అనిలం, సమీరం

ఈ విధంగా తెలుగు అర్హత పరీక్ష ఉంటుంది. జనరల్‌స్టడీస్‌, ఆప్షనల్స్‌ ఎంత బాగా చదివినా, ఎంత బాగా రాయగలిగినా మాతృభాషలో అర్హత పొందకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరు విధం అవుతుంది. కాబట్టి మెయిన్స్‌కు సన్నద్ధమయ్యేవారు దీనిపై దృష్టి పెట్టడం అవసరం.

ఒక్కమాట- తెలుగులో రాయటం అంటే వాడుకభాషలో రాయటమే. పత్రికాభాషలో రాయటమే!

Thursday, 29 September 2011

సివిల్స్ లో వెరీ ఇంపార్టెంట్...!

క్టోబరు చివరి వారంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.

పునశ్చరణ పకడ్బందీగా పూర్తిచేసినవారు ఇప్పుడున్న పరిమిత సమయంలో చేయాల్సింది- అత్యంత ముఖ్యమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించటం. దీనివల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది.

వివిధ సబ్జెక్టుల్లో  అలాంటి ముఖ్యమైన  టాపిక్స్  జాబితా ఇది... (దీన్ని తయారుచేసినవారు- ‘బ్రెయిన్ ట్రీ’ గోపాలకృష్ణ). 


HISTORY:  
• The Constitution and Sardar Patel. • Growth of Education in India.  • Causes for the rise of revolutionary terrorism in the early decade of the 20th Century.

CULTURE :
* Vedic Divinities *  Samhitas * Vihara Constructions * Minhaj–Us-Siraj  *  Ravi Verma  * Tulsi Das  *  Onam * Vivekananda Rock Memorial  * Sriranga Patnam * Kathakali * Kosambhi   * Nathadwara  * Nandalal Bose *  Purandaradasa   * Manasarova * Pinjore Garden.

GEOGRAPHY  /  ECONOMIC GEOGRAPHY:  
• Bio-diversity and conservation • Floods. • Earthquakes and Tsunamis • Fukushima Nuclear Disasters • Global Warming • India’s stand on Climate change.  • National Action Plan on Climate Change its merits and demerits.  • Jawaharlal Nehru National Solar Machine.   • Sustainable Management of Natural Resources.  • Challenges of urbanization etc. • Energy • Promoting Energy Efficiency.

POLITY:  
• Comptroller and Auditor General • Judiciary • ‘State politics’ Vs ‘National politics’ • Lokpal Bill • Khap Panchayats • Central Bureau of Investigation • Terrorism •  Issues with reference to the Right to Information Act.

ECONOMY:

• Macro Economic Frame Work  •  Inflation Vs Growth • Black Money  • Public Distribution System  •  Goods and Services Tax •  Twelfth  Five Year Plan • Fuel Price Hike  • Direct Taxes Code •  Flagship Programmes like  MGNREGA, NRHM, etc.

CURRENT AFFAIRS AND SOCIAL PROBLEMS:  
• Corruption  • Paid News  • Caste Census  • Inter-State River Water disputes • Micro Finance • Internal Security • India’s Nuclear Doctrine • Problems of the aged  • Ethical Issues involved in Stem Cell Research. • Central Strategy to deal with Naxalism. • National Knowledge Commission and Indian Systems of Medicine. • Recent Measures for Social Protection. • Racial Attacks  • Social Networking  • Social Audit  • Exclusion of Women from Productive Employment  • National Innovation Council.

INDIA AND THE WORLD:
• Directions of India’s Foreign Policy • East Asia summit. • Indo-US relations •  Indo-French •  SAARC  • Indian Diaspora in ‘Cyber – Space’.  • Indian Diasporic Writing. • Chinese Diaspora Vs. the Indian Diaspora •  Asean  • G-8 • UN Forum for Women.   

SCIENCE AND TECHNOLOGY:
•  Mile stones in India’s Space Programme
• Health Care in India •  Super Bug •  India’s Super Computer •  Global Environment and Disaster Management •  National Ganga River Basin Project •  National Green India Mission •  E.Coli.

PEOPLE / EVENTS / PROGRAMMES / PLACES IN THE NEWS:  
•  Dr. Binayak Sen  • M.F. Hussain    • Harish Hande • Kisan Babu Rao Hazare  • Satya Sai Baba • Narayana Murthy • Angela Merkel.   • Goran Hadzic

Wednesday, 28 September 2011

సివిల్స్‌ మెయిన్స్‌లో.. మార్కుల వ్యూహం

 
సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌... సిసలైన సత్తాను పరీక్షకు పెట్టే డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే పరీక్ష!

దీనిలో విజయవంతమైతే సివిల్స్‌ ప్రస్థానంలో విజయానికి దాదాపు చేరువైనట్లే. వచ్చేనెల చివరివారంలో ఈ పరీక్ష ప్రారంభమవుతున్న సందర్భంగా అత్యధిక మార్కులను స్కోరు చేసే వ్యూహం వివరిస్తున్నారు గోపాలకృష్ణ.

తగిన పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నంతమాత్రాన ఎవరూ ఉత్తమ సివిల్‌ సర్వెంట్లు కాలేరు. అంకితభావం, సామాజిక అంశాలపై స్పందన, రాజ్యాంగ ఆదర్శాలపట్ల నిబద్ధత మొదలైన విలువలు ప్రధానం. ఇలాంటివారిని గుర్తించే లక్ష్యంతోనే సివిల్స్‌ నియామక ప్రక్రియ పనిచేస్తుంది.

తొమ్మిది పేపర్లతో డిస్క్రిప్టివ్‌ విధానంలో సాగే మెయిన్స్‌ పరీక్ష 20 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. అభ్యర్థుల విద్యాపరమైన ప్రతిభను మాత్రమే కాకుండా వారి సమన్వయ సామర్థ్యాన్నీ, స్వీయ పరిజ్ఞానాన్ని స్పష్టంగా సమర్పించే తీరునూ పరీక్షించేలా మెయిన్స్‌ను రూపొందించారు.

క్వాలిఫైయింగ్‌ పేపర్లు
అభ్యర్థి ప్రాథమిక నైపుణ్యాలను మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌లలో పరీక్షిస్తారు. ఈ పేపర్లలో మార్కులను ర్యాంకింగ్‌కు లెక్కించరు కానీ, వీటిలో కనీసం 33 శాతం మార్కులు తెచ్చుకోవటం తప్పనిసరి.

* మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌: తెలుగు/ హిందీ రాయటం తగ్గిపోయిన అభ్యర్థులు చాలామందే ఉంటారు. ఇలాంటివారు రోజుకు కనీసం అరగంటైనా రైటింగ్‌ సాధన చేయాల్సివుంటుంది. భాషను సాధన చేయటం కోసం అక్టోబరు 1 నుంచి రోజుకు అరగంట చొప్పున వారానికి 4 రోజులు కేటాయించుకోవాలి. తెలుగుమీడియంలో డిగ్రీ చేసినవారూ, తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా ఉన్న విద్యార్థులూ ఈ పేపర్‌పై ఎక్కువ సమయం వెచ్చించనక్కర్లేదు.

* జనరల్‌ ఇంగ్లిష్‌: మన రాష్ట్ర విద్యార్థుల్లో చాలామందికి ఈ పేపర్‌ సమస్యే కాదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన గ్రామీణప్రాంతాల్లో ఇంగ్లిష్‌ బోధన మెరుగేనని చెప్పాలి. కాబట్టి తెలుగుమీడియం నేపథ్యం వారు కూడా దీనికి ఎక్కువగా సన్నద్ధం కానక్కర్లేదు. గత సంవత్సరాల పేపర్లు చూసి, మానసికంగా సిద్ధమవ్వాలి.

జనరల్‌ ఎస్సే

ర్యాంకును సాధించటంలో వ్యాసం పాత్ర నిర్ణయాత్మకం. చాలామంది టాపర్లు సగటు మార్కుల కంటే అధికంగా తెచ్చుకునే పేపరిది. గరిష్ఠమార్కులు పొందాలంటే తగిన అంశాన్ని ఎంచుకోవటం, క్రమపద్ధతిలో దాన్ని విశ్లేషించటం అవసరం.

ఈ ఏడాది ఆశించదగ్గ టాపిక్స్‌:
1) Role of Audit in Democratic India

2) Judicial Accountability and Democracy

3) Food Security, Food inflation and Public Distribution System

4) What the Next five year Plan should focus upon Five priority items

5) Information Technology for the Masses: Bridging the Digital Divide

  
స్కోరు సాధించేదెలా?
* వ్యాసానికి ఎంచుకున్న అంశం (టాపిక్‌) సందర్భాన్ని అభ్యర్థి సరిగా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే ఆ అంశానికి న్యాయం చేయలేము.

* అందుకే మొదటి 10 నిమిషాలూ టాపిక్‌ ఎంచుకోవటానికే వెచ్చించాలి.

* ఇచ్చిన సందర్భాన్ని సరిగా అర్థం చేసుకున్నామా లేదా అనేది ఒకటికి రెండుసార్లు నిర్థారించుకోవాలి.

* అంశం ఎంచుకున్నాక దాని గురించి మీ దగ్గరున్న సమాచారం గురించి పాయింట్లుగా రాయాలి.

* వాటిని తార్కిక పద్ధతిలో అమర్చాలి.

* ప్రతి పాయింటునూ రాసేటపుడు విస్తరిస్తూ రాయాలి. ఉదా: Judicial accountability and democracy అనే అంశం. ఈ క్రమంలో ముందుకుసాగవచ్చు-

The need for judicial accountability in a democracy

> The problems of ensuring judicial accountability in practice

> Significant features of the proposed judicial standards and accountability bill

> Mechanism for making the proposed bill effective.

కంపల్సరీ పేపర్లలో ముఖ్యాంశాలు గుర్తించాలి. తర్వాత ఇదే కసరత్తును ఆప్షనల్స్‌లో కూడా చేయాలి. వాటిపై మనసు కేంద్రీకృతం చేయాలి. ఇలాంటి ప్రయత్నం పరీక్షలో మంచి ఫలితాలను అందిస్తుంది.

భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి 2011 సంవత్సరం అభ్యర్థులు ముందడుగు వేయటానికి సరైన సంవత్సరం. ఆత్మవిశ్వాసంతో విజయవ్యూహాన్ని ఆచరణలో పెడితే... మెయిన్స్‌లో విజయం సాధించి... ఇంటర్వ్యూ దశకు చేరుకున్నట్టే!

ఇవి గుర్తుంచుకోండి!
* జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ పూర్తిగా అనూహ్యంగా ఉంటుంది. ఇలా ఉండటం అసాధారణమేమీ కాదు. అందుకని అందుకు మానసికంగా సిద్ధం కావాలి.

* ఎస్సే ప్రశ్నలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎక్కువ ప్రశ్నలు షార్ట్‌ నోట్సు, 5 మార్కులు, 10 మార్కులవి ఉండొచ్చు.

* అన్ని అంశాలనూ కవర్‌ చేయటం దాదాపు అసాధ్యం. అందుకని అలా చేయాలనుకోవద్దు.

* కిందటి సంవత్సరం విజేతల్లో చాలా తక్కువమందే 300/600 కంటే మించి స్కోర్‌ చేశారు. ఇదే ధోరణి కొనసాగుతుంది. అందుకని జనరల్‌స్టడీస్‌ సన్నద్ధతకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వొద్దు. దీనికంటే ఆప్షనల్స్‌పై దృష్టిపెట్టటం సముచితం. ఎందుకంటే మార్కుల నిష్పత్తి 2:1 ఉంటుంది.

Monday, 5 September 2011

సివిల్స్ మీ లక్ష్యమైతే... ఇది చదవండి!

సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రకటన రావటానికి  ఇంకా 5 నెల్ల సమయముంది.

ఈ పరీక్షకు సిద్ధం కావాలని మీరు  అభిలషిస్తుంటే  మీకు అభినందనలు!

ప్రిలిమ్స్  పరీక్షా విధానం మార్చాక  తొలిసారిగా  పరీక్ష ఈ సంవత్సరం జూన్ లో జరిగింది.  ఆ పరీక్షను విశ్లేషించుకుని  కార్యాచరణ ప్రణాళిక వేసుకోవాలి కదా?

దాన్ని వివరించే ఈ వ్యాసం చదవండి.   ‘చదువు’లో ప్రచురితమైంది ఇవాళ!

 

Monday, 29 August 2011

సివిల్స్ కు సరికొత్త వ్యూహం !


మాసాల్లో మార్గశిర మాసం గొప్పది అన్నట్టుగా...  పరీక్షలన్నిట్లో ఏ పరీక్ష గొప్పదంటే ... వెనువెంటనే ఎవరైనా చెప్పే  సమాధానం... సివిల్స్ !   

సివిల్ సర్వీసెస్  ప్రిలిమినరీ పరీక్షలో ఈ సంవత్సరం  కొత్త విధానం ప్రవేశపెట్టారు.  దీని గురించి అభ్యర్థుల్లో  ఎన్నెన్నో వూహాగానాలు ప్రచారమయ్యాయి.

వీటన్నిటికీ తెర దించుతూ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, ఫలితాలూ ప్రకటించారు.



ప్రశ్నల స్వభావాన్ని విశ్లేషిస్తే తెలిసే అంశాలేమిటి?



బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ చెబుతున్న విశేషాలు ఇవాళ ‘చదువు’లో  ప్రచురితమైన కథనం లో ఇక్కడ క్లిక్ చేసి  చదవండి.