ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label యూపీఎస్ సీ. Show all posts
Showing posts with label యూపీఎస్ సీ. Show all posts

Monday, 24 June 2013

ఎలా సాధించారు... ఈ టాపర్లు?

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు తెచ్చుకోవటమే గొప్ప విజయం. అలాంటిది ఆ ప్రవేశపరీక్షలో అందరికంటే ముందు నిలిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించటం మామూలు విషయం కాదు! దేశవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించే జేఈఈ  అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో- భావనలపై స్పష్టత, లోతైన అవగాహన, అనువర్తన సామర్థ్యాలు ప్రధానం. వీటి సమ్మేళనంతో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను కైవసం చేసుకున్న సాయి సందీప్‌, రవిచంద్రలు 'చదువు'తో తమ అనుభవాలు పంచుకున్నారు!


కల నిజమైంది!
రాష్ట్రస్థాయి ఎంసెట్‌లో స్టేట్‌ టాపర్‌... జాతీయస్థాయి ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆలిండియా టాపర్‌! విశిష్టమైన ఈ 'డబుల్‌' సాధించిన పి. సాయిసందీప్‌రెడ్డి 'మొదటి నుంచీ నా గురి ఐఐటీపైనే' అని ముందే సంకల్పం ప్రకటించాడు. తన కలను అపురూప స్థాయిలో నిజం చేసుకున్నాడు. తన విజయప్రస్థానం ఎలా సాగిందో అతడి మాటల్లోనే...

 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు ముందుగా వూహించిందే! ఫలితం తెలిశాక ఆరు సంవత్సరాల కష్టం ఫలించిందని సంతృప్తి కలిగింది. అయితే ఇదంతా ఇష్టపడే చదివాను.

జేఈఈ మెయిన్స్‌కు వారం ముందునుంచీ నా ఆరోగ్యం బాగా లేదు. దీంతో పరీక్ష సరిగా రాయక ఫలితం ఆశించినట్టు రాలేదు. విచారంగా అనిపించింది. ఇలాంటి సమయంలో నిరాశతో కుంగిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకవసరమైన ప్రోత్సాహాన్ని ఆ సమయంలో అమ్మా నాన్నా అందించారు. దీంతో పట్టుదలగా నెలన్నర చదివాను.

మ్యాథ్స్‌లో ఒక జవాబును తప్పుగా బబ్లింగ్‌ చేశాను. అది గమనించినప్పటికీ బాల్‌పెన్‌ వాడాలనే నిబంధన వల్ల ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం లేకుండాపోయింది. ఐదు మార్కులు పోయాయి. బాధ వేసినా 'పోతే పోయింది' అని సమాధానపర్చుకున్నాను. ఆ ప్రభావం మిగతావాటిపై పడకుండా జాగ్రత్తపడ్డాను. ఫస్ట్‌ర్యాంకు వచ్చాక మాత్రం ఆ లోటు పోయింది!

ఈ ర్యాంకు సాధించటానికి నా సరదాలన్నీ పూర్తిగా త్యాగం చేశాననుకోవద్దు. రెండు వారాలకో సినిమా చూసేవాణ్ణి. హారీపోటర్‌ కథల పుస్తకాలు ఇష్టంగా చదివేవాణ్ణి.

గుడివాడ విశ్వభారతిలో ఏడోతరగతి నుంచే ఈ ఐఐటీ ప్రయాణానికి తొలి అడుగులు పడ్డాయి. నాకు అబ్దుల్‌కలామ్‌ స్ఫూర్తి. ఇంజినీర్‌ని కావాలని మొదట్నుంచీ లక్ష్యంగా ఉండేది. అందుకే స్కూల్‌ రోజుల్లో కూడా గణితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాణ్ణి. ఇక ఐఐటీ ప్రవేశపరీక్షకు అసలైన కృషి శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం నుంచీ మొదలైంది.

కృషే ప్రధానం
ర్యాంకుల మీద మొదట్లో నాకేమీ దృష్టి లేదు. సిలబస్‌ మొత్తం పూర్తిగా అర్థం చేసుకోవాలి. చేతనైనంత వరకూ బాగా కృషి చేయాలి అనేదే ప్రధానంగా ఉండేది. ఏ విద్యార్థికైనా సెకండియర్‌కి వచ్చేటప్పటికి ఒక అవగాహన వస్తుంది. ఏ టాపిక్‌ రిఫర్‌ చేయాలి, ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, రివిజన్‌కు ఎంత సమయం కేటాయించాలి... ఇవన్నీ తెలుస్తాయి.

నా ఉద్దేశంలో ఐఐటీ ప్రవేశపరీక్షలో విజయానికి పాత్ర వహించే బోధన, ప్రిపరేషన్ల నిష్పత్తి 10: 90. అంటే సరైన మార్గదర్శకత్వంలో విద్యార్థి చాల సాధన చేయాలి. ఐఐటీ ప్రవేశపరీక్షలో కెమిస్ట్రీ స్కోరింగ్‌.. ముఖ్యంగా ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ సమయం దీనికి కేటాయించి చదివాను.

ఐఐటీలో పరీక్షావిధానం వూహించినట్టుగా ఉండదు. అనూహ్యమైన తీరులో ప్రశ్నలు వచ్చినా, దానికి సిద్ధంగా ఉండాలి. భయపడకుండా, ఒత్తిడికి గురవకుండా ఆ పరిస్థితికి తగ్గట్టుగా తయారై పరీక్ష రాయాలి.

ఆశావహుల సంగతి
ఐఐటీకి గురిపెడితే ఎంసెట్‌ లాంటి పరీక్షల్లోనైనా ర్యాంకు వస్తుందని ఐఐటీకి సన్నద్ధం కావడం మంచిది కాదు. అప్పుడు రెంటికీ దూరం కావాల్సివస్తుంది. ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేసుకుని దేనికి సన్నద్ధం కావాలో నిర్ణయించుకోవాలి.

ఐఐటీ ప్రవేశపరీక్షకు సిద్ధమవ్వాలనుకున్నవారికి కనీస స్థాయి తెలివితేటలు, కష్టపడే తత్వం అవసరం. సగటున రోజుకు 12 గంటలు చదవగలగాలి. మొదట లక్ష్యం పెట్టుకుని, టాపిక్‌వారీగా ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి. లోతుగా చదవాలి. పూర్తి ఏకాగ్రత అవసరం.

మొదటి సంవత్సరంలో సిలబస్‌ అన్ని అంశాలూ చదవాలి. తర్వాత కొన్ని టాపిక్స్‌ మీద కేంద్రీకరించి లోతుగా అధ్యయనం చేయాలి. ఏ విద్యార్థికైనా కొన్ని కాన్సెప్టులు అర్థం కాకపోవచ్చు. అది మామూలే. ఆ సందేహాలను అధ్యాపకుల దగ్గర తీర్చుకోవాలి. స్పష్టత తెచ్చుకోవాలి. గ్రాండ్‌ టెస్టుల ద్వారా తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ కృషి చేయాలో తెలుసుకోవచ్చు.

ఎలా చదివానంటే..
ఐఐటీ ప్రవేశపరీక్షకు ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు సరిపోవు. వాటిలో ప్రాథమికాంశాలుంటాయి. వాటినే ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ కోసం లోతుగా అధ్యయనం చేశాను. కళాశాల వారిచ్చిన మెటీరియల్‌కు అదనంగా కొన్ని పుస్తకాలు చదివాను.

మ్యాథ్స్‌: ఆర్‌.డి. శర్మ, ఎంటీజీ పబ్లికేషన్స్‌ సిరీస్‌ ఫిజిక్స్‌: హెచ్‌సీ వర్మ, ఐ.ఇ. ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: అట్కిన్స్‌, వేడ్‌ జూనియర్‌, జేడీ లీ

పాత ప్రశ్నపత్రాలను సాధన చేశాను. అన్ని సబ్జెక్టులకూ క్లుప్తంగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. రివిజన్‌లో- చాలా వేగంగా ఓసారి చూసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడింది.

ఏమిటి తేడా?
ఇంటర్మీడియట్‌లో/ ఎంసెట్‌లో తెలిసినవే వస్తాయి. చదివిన అంశాలను అప్త్లె చేయాల్సిన అవసరం ఉండదు. ఐఐటీ ప్రవేశపరీక్ష అలా కాదు. దీనిలో అప్లికేషన్‌ ప్రధానం. చదివిన కాన్సెప్టుల్ని అప్త్లె చేయగలగాలి.

ఇంటర్మీడియట్‌ తరహా పరీక్షకు అలవాటు పడటంవల్లనే విద్యార్థులకు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఎంతో క్లిష్టం అనిపిస్తోంది. నిజానికిది అంత కష్టం కాదు. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఈ కంటే తక్కువే. చక్కని ప్రణాళికతో సమయం వృథా చేయకుండా కష్టపడితే ఎవరైనా ఐఐటీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించవచ్చు.

saisandeep192@gmail.com



కోరిక తీరింది!
ఎంసెట్‌లో తొమ్మిదో ర్యాంకు...  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మరింత ముందుకు దూసుకువెళ్ళి ద్వితీయ ర్యాంకును సాధించాడు అద్దంకి రవిచంద్ర. వివిధ ప్రతిభా పరీక్షల్లో ఉపకార వేతనాలూ, అవార్డులూ, స్వర్ణ పతకాలూ పొందటం ఇతడి ప్రత్యేకత. ఐఐటీ ప్రవేశపరీక్షలో మేటి ర్యాంకు తెచ్చుకోవాలన్న చిరకాల లక్ష్యం చేరుకున్న రవిచంద్ర సన్నద్ధత తీరు... ఇతర విశేషాలూ తన మాటల్లోనే తెలుసుకుందాం!


నా ఐఐటీ ప్రయాణం హైదరాబాద్‌ నల్లకుంటలో శర్మ ఇన్‌స్టిట్యూట్‌లో ఎనిమిదో తరగతి నుంచి మొదలైంది. సీరియస్‌గా మాత్రం ఇంటర్మీడియట్‌ నుంచే...! ఐఐటీ ప్రవేశపరీక్షలో టాప్‌ టెన్‌లో ఏదో ఒక ర్యాంకు తెచ్చుకోవటం మొదట్నుంచీ నా లక్ష్యంగా ఉండేది. దీనికి ఉపాధ్యాయుల, అధ్యాపకుల ప్రోత్సాహం కారణం.
ఐఐటీ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవటం కష్టమనిపించలేదు. ఎందుకంటే సరదాగా చదివాను. సబ్జెక్టు మీద అమిత ఇష్టంతో చదివాను. టీవీ, ఇంటర్నెట్‌లు చూడటం తగ్గించాను. జేఈఈ మెయిన్స్‌లో మార్కులు తగ్గి టాప్‌ టెన్‌లో నాకు ర్యాంకు రాలేదు. దీంతో నిరాశ పెరిగి, ప్రేరణ మందగించింది. ఈ సంకట పరిస్థితిలో నా మిత్రులూ, తల్లిదండ్రులూ చక్కని వాతావరణం కల్పించారు. అడ్వాన్స్‌డ్‌కు మిగిలిన మిగతా ఒకటిన్నర నెలలూ బాగా చదవటానికి తోడ్పడ్డారు.

రెండు పరీక్షల భేదాలు
ఐపీఈకీ, ఐఐటీ ప్రవేశపరీక్షకూ తేడా చెప్పాలంటే... మొదటిది చదువుకుని, కొన్ని గుర్తుంచుకుని రాస్తే చాలు. జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కానీ ఐఐటీ ఎంట్రన్స్‌కు జ్ఞాపకశక్తి మరీ అంత ఎక్కువ అవసరం లేదు. ఆలోచించగల సామర్థ్యం కావాలి. దీనిలో అనువర్తన (అప్లికేషన్‌) భాగం ఎక్కువ పరీక్షిస్తారు. ఎంసెట్‌కు వేగం కావాలి. అన్ని ప్రశ్నలూ అందరూ జవాబులు రాయగలరు. కానీ సమయం సరిపోకపోవటమే సమస్య. ఐఐటీ ఎంట్రన్స్‌కు అంత వేగం అక్కర్లేదు.

ఐపీఈకి సిద్ధమై ఐఐటీ ప్రవేశపరీక్ష రాయాలంటే కష్టం. దీనిలో చాలా లోతుగా చదవాలి కాబట్టి. ఐపీఈలో ప్రాథమికాంశాలను బట్టీకొట్టి రాసి మార్కులు తెచ్చుకోవచ్చు. ఐఐటీ కోసం జరిగే పరీక్షలో ఆ అంశాలను నిజజీవిత పరిస్థితుల్లో అనువర్తించగలగాలి.

శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థ వారిచ్చిన మెటీరియల్‌ 80 శాతం ఉపయోగపడింది. అది కాకుండా చదివినవి...

మ్యాథ్స్‌: టీఎంహెచ్‌ పబ్లిషర్స్‌- మ్యాథ్స్‌ ఫర్‌ ఐఐటీ జేఈఈ ఫిజిక్స్‌: ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: బహదూర్‌, హిమాంశు పాండే, గోపీ టాండన్‌

ఇష్టముంటే సులభమే
ఐఐటీలో సీటు సాధించాలనుకునేవారికి సబ్జెక్టు మీద ఆసక్తి ఉండాలి. రోజూ సగటున 6-7 గంటల సమయమైనా సాధన చేస్తుండాలి. టాపర్‌గా నిలవాలంటే మాత్రం 10 గంటలు చదవాల్సిందే. దీంతో పాటు మంచి మార్గదర్శకత్వం ఉండాలి. సబ్జెక్టుకు సిద్ధమవటాన్ని ఇష్టంగా ఆస్వాదించాలి. అప్పుడు తెలియకుండానే సులువుగా అనిపిస్తుంది.

ఈ పరీక్షలో విజయానికి బోధన ప్రాముఖ్యం 20 శాతం మాత్రమే. మిగతా 80 శాతం విద్యార్థి సన్నద్ధత మీదే ఆధారపడివుంటుంది. పూర్వ ప్రశ్నపత్రాలు 5-6 సంవత్సరాలవి సాల్వ్‌ చేయాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో విశ్లేషించుకోవాలి. వాటిని సవరించుకోవటానికి అధ్యాపకుల సహాయం తీసుకోవాలి. 'ఎంత చదివాం' అన్నది కాదు. 'ఎంత సాధన చేశాం' అన్నదే ముఖ్యం. పరీక్షలో భయం, ఓవర్‌ యాంగ్జయిటీ ఉండకూడదు. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి.

ravichandra.addanki95@gmail.com

Monday, 31 December 2012

మంచి ర్యాంకు సాధించేదెలా? .. యండమూరి వీరేంద్రనాథ్ సూచనలు!



విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్‌ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే వాస్తవ సమస్యలేమిటి? వాటిని తొలగించే ఆచరణాత్మక సూచనలేమిటి? 

ప్రసిద్ధ రచయితా, వ్యక్తిత్వ వికాస నిపుణుడూ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం!


విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం!
ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది.

పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్‌ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.

తెలివీ... మార్కులూ
తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడైవుండొచ్చు.

గణితం, అకౌంట్స్‌ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్‌ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.

వాయిదా పద్ధతుంది...
చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. ఈ academic procrastinators 'సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా'మంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి!

ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:

* ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండండి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోండి.

* విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్‌ ర్యాంకర్‌ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే I am proud of youభావంతో!

* ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టండి (గ్రూప్స్‌, సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు).

ఆహ్లాదకర వాతావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...

కళ్ళు: టేబుల్‌ లైట్‌ కింద చదవండి. ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండండి.

సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. నా అనుభవంలో సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్‌)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.

ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్‌ ఫూడ్‌, చికెన్‌ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్‌ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి.

ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోండి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.

వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించండి. అమితాబ్‌, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్‌నూ, పైథాగరస్‌నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!


యాబైశాతం సన్నద్ధత
మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే!
* స్టడీ టేబుల్‌/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి. కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.

* రాత్రివేళ మీ రీడింగ్‌ టేబుల్‌ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది.

* చదివేటపుడు గది తలుపులు మూసివేయండి. ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టండి. తాజా గాలి పీల్చుకుని, గదిలోనే పచార్లు చేయండి... చదవటమే ఈ పచార్లకంటే మెరుగనిపించేదాకా!

* ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్‌ డీటెయిల్డ్‌ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది. చదవటం విసుగనిపిస్తే రాయండి. లేకపోతే గణితం సాధన చేయండి. రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.

* కష్టమైన కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్‌ సూత్రాలూ గోడమీద అంటించుకోండి. (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి). వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయండి. విశ్రాంతి తీసుకోవటానికి (రిలాక్స్‌) మ్యాపులను పరిశీలించటం ఓ చక్కని చిట్కా.

* ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్‌ లేకుండా, చదివే పోర్షన్‌ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోండి.

* విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.

* కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోండి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు.

* గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోండి. పోచుకోలు కబుర్లకు అవకాశమున్న కంబైన్డ్‌ స్టడీ అంత ఉపయోగకరం కాదు.

* ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టొద్దు. ఐదు నిమిషాల విరామం ఇవ్వండి. దీన్ని 'మైండ్‌ హాలీడే' అంటారు.

* సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు.

* ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. సెలవు రోజు కూడా. సెలవులకు మీ తాతగారి వూరికి వెళ్ళినపుడు కూడా. కనీసం అరగంటైనా చదవాలి. ఇలా చేస్తే చదవటం మీ అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.


ఏం చదివినా గుర్తుండటం లేదా? 
సమయం సరిపోదు.. ఎందుకని? 
ఏకాగ్రత కుదరటం లేదా? ...

www.eenadu.net లో చదువు విభాగం  చూడండి.

Wednesday, 2 November 2011

సీడీఎస్‌ బాటలో మేటి కెరియర్‌!

యువతీ యువకులకు ఉజ్వలమైన కెరియర్‌ మార్గం అందించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ (CDS) గురించి మీకు తెలుసా? సీడీఎస్‌ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌లలో ఆఫీసర్‌ స్థాయి నియామకాలు పొందవచ్చు. డిగ్రీ పట్టా ఉన్నవారే కాకుండా సాధారణ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నవారు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి వీలుంది!

ఆకర్షణీయమైన జీవనశైలి, హోదా, ఉద్యోగభద్రత, జీతభత్యాలూ, సౌకర్యాలతో సాగే ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కెరియర్‌ మరోదానితో పోల్చలేనంతగా ఉన్నతస్థాయిలో నిలుస్తుంది. అందుకే త్రివిధ రక్షణ దళ సర్వీసుల్లో ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో ఉత్సాహవంతులైన యువతీ యువకులు చేరుతున్నారు. యూపీఎస్‌సీ జాతీయస్థాయిలో నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్ష  లో రాతపరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (SSB) ఇంటర్వ్యూ భాగం. తాజాగా ప్రకటించిన సీడీఎస్‌ఈ ప్రకటన ప్రకారం మిలిటరీ అకాడమీలో 250 పోస్టులు, నేవల్‌లో 40, ఏర్‌ఫోర్స్‌లో 32 పోస్టులున్నాయి.

ఈ పరీక్షలో విజయానికి అభ్యర్థి వ్యక్తిత్వ స్వభావం, పరిజ్ఞానం, నైపుణ్యం మూడూ ప్రధానమే.
ఇండియన్‌ మిలటరీ అకాడమీ/ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీల్లో ప్రవేశానికి గుర్తింపు పొందిన డిగ్రీ అవసరం. నేవల్‌, ఏర్‌ఫోర్స్‌ అకాడమీల్లో ప్రవేశానికి బిఎస్‌సీ (ఫిజిక్స్‌-మ్యాథ్స్‌) /బీటెక్‌ అభ్యర్థులు అర్హులు.


ఈ రెండు దశల్లో కలిపి వచ్చిన మార్కుల ఆధారంగా జాతీయ తుది మెరిట్‌ జాబితా తయారవుతుంది. ఇంటర్‌వ్యూలో మార్కులు 50-55 శాతం కంటే మించి రావటం ఏ అభ్యర్థికైనా కష్టం. అందుకని రాతపరీక్షలో తెచ్చుకునే మార్కులే ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఎలా సిద్ధం కావాలి?
సీడీఎస్‌సీలో విజయం సాధించటానికి సుదీర్ఘ ప్రిపరేషన్‌, ఏకాగ్రతతో కూడిన సాధన చాలా అవసరం. ఆంగ్లం, సైన్స్‌, గణిత సబ్జెక్టుల్లో అభ్యర్థి నైపుణ్యాలను దీనిలో పరీక్షిస్తారు. గణిత పరిజ్ఞానాన్ని పదో తరగతి స్థాయిలోనూ, మిగిలిన సబ్జెక్టుల అవగాహనను డిగ్రీ స్థాయిలోనూ పరీక్షిస్తారు. రాతపరీక్షలోనూ, ఇంటర్‌వ్యూలోనూ ఇంగ్లిష్‌కు ప్రాధాన్యం కనిపిస్తుంది. అంతమాత్రం చేత గ్రామీణ విద్యార్థుల కంటే పట్టణ అభ్యర్థులకు అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు.

మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల్లో నెగిటివ్‌ మార్కులు ఉండటం సరికొత్త ధోరణి. ఇలాంటపుడు కచ్చితంగా తెలిస్తే గానీ సమాధానం గుర్తించటం ప్రమాదం. ఊహాగానాలు చేస్తే అసలుకే ముప్పు వస్తుంది. ప్రతి ప్రశ్నకూ వేగంగా, కచ్చితంగా జవాబు గుర్తించటం అలవాటవ్వాలంటే బాగా అభ్యాసం చేయాల్సిందే.

జనరల్‌ నాలెడ్జ్‌ సిలబస్‌ చాలా విస్తృతంగా ఉండి, అభ్యర్థులను తికమక పెడుతుంది. హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్‌ పాలిటీ, కరంట్‌ అఫైర్స్‌, జనరల్‌ సైన్స్‌ మొదలైన అంశాల సమాహారమిది. ఈ విభాగాల్లో తాజా పరిణామాల సమాచారం కోసం వార్తాపత్రికలూ, మ్యాగజీన్లూ క్రమం తప్పకుండా అనుసరించాలి.

ఇంగ్లిష్‌లో ప్రాథమిక అంశాలను పరీక్షిస్తారు. త్వరగా మర్చిపోయే అవకాశమున్న వ్యాకరణాంశాలను ఉదాహరణలతో సహా అభ్యాసం చేయటం మేలు.

పర్సనాలిటీ టెస్టులో....
దీనిలో వివిధ పరీక్షలుంటాయి.
* సిచ్యువేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌ SRT): 60 వివిధ సందర్భాలను ప్రశ్నలుగా ఇస్తారు. 30 నిమిషాల్లో వీటిని పరిష్కరించాల్సివుంటుంది.
* థిమాటిక్‌ అప్రిసియేషన్‌ టెస్ట్‌ (TAT) :12 బొమ్మల సెట్‌ చూపిస్తారు. 36 నిమిషాల్లో వాటిపై ఆధారపడి కథ అల్లి, రాయాల్సివుంటుంది.
* వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌ (WAT): 60 పదాలు ఇస్తారు. ఒక్కో పదంతో 15 సెకండ్ల వ్యవధిలో వాక్యం తయారుచేయాలి.
* గ్రూప్‌ టెస్ట్‌: 8-10 మంది అభ్యర్థులతో కలిపి ఈ పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్‌ ప్లానింగ్‌, బృంద చర్చ, డిబేట్లు, ఔట్‌డోర్‌ గ్రూప్‌ టాస్కులు ఉంటాయి.
* శారీరక ప్రమాణాలు: అభ్యర్థుల శారీరక ప్రమాణాలను ఎస్‌ఎస్‌బీ వైద్యాధికారులు పరీక్షిస్తారు.
దరఖాస్తు ఇలా
సీడీఎస్‌ఈ దరఖాస్తులను ప్రధాన తపాలాకార్యాలయాల్లో రూ.20 చెల్లించి పొందవచ్చు. భర్తీ చేసినవాటిని పంపుకోవటానికి నవంబరు 28 వరకూ గడువు ఉంది. పూర్తి వివరాలకు 'ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌' 29 అక్టోబరు- 4 నవంబరు సంచిక చూడవచ్చు.
* పరీక్ష తేదీ: ఫిబ్రవరి 12, 2012
* యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌: www.upsc.gov.in
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయటానికి: www.upsconline.nic.in