ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు. Show all posts
Showing posts with label జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు. Show all posts

Thursday, 2 August 2012

ఆధునిక అవకాశాలకు... బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌

    ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదివిన విద్యార్థులకు ఆకర్షణీయమైన వేతనంతో ఆధునిక కార్పొరేట్‌ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. 

నిపుణులైన అభ్యర్థుల కొరత ఈ రంగాల్లో అధికంగా ఉంది. దీన్ని భర్తీ చేయడానికి అనేక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి... సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ), డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (డీబీఎఫ్‌), చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్‌ ్ట (సీఎఫ్‌ఏ). మనదేశంతోపాటు విదేశాల్లో ఉద్యోగాలు పొందడానికి, సొంతగా ప్రాక్టీస్‌ చేయడానికి ఈ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి.

వ్యక్తుల ఆర్థిక జీవితానికి సంబంధించిసంపూర్ణ అవగాహనతో, వారి పెట్టుబడులు, బీమా, పన్నులు, పదవీ విరమణ, స్థిరాస్తులు, తదితర అంశాల్లో సమగ్రమైన సలహాలు ఇవ్వడం సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ల ప్రత్యేకత. సీఎఫ్‌పీ అనేది సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌. ఇప్పటికే కెరియర్‌లో స్థిరపడినవారు తమ విధి నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కోర్సు చేయవచ్చు. విద్యార్హతలను, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్థిక సేవల రంగంలోని అనేక పెద్ద కంపెనీలు సైతం తమ ఎగ్జిక్యూటివ్‌లను ఈ ప్రోగ్రామ్‌కు స్పాన్సర్‌ చేస్తుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సీఎఫ్‌పీకి డిమాండ్‌ పెరుగుతోంది. 24 దేశాల్లో ఈ సర్టిఫికేషన్‌కు గుర్తింపు ఉంది.

ఆర్థిక రంగానికి సంబంధించిన వివిధ అంశాలను విస్తృతంగా, క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా సీఎఫ్‌పీలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో కీలకంగా మారుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో సుమారు 1600 మంది సీఎఫ్‌పీలు మాత్రమే ఉన్నారు. 2015 నాటికి కనీసం లక్ష మంది అవసరమవుతారని అంచనా. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ (ఎఫ్‌పీఎస్‌బీ) ఇండియా ఇందులో ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. అమెరికాకు చెందిన ఎఫ్‌.పి.ఎస్‌.బి.ఎల్‌.కు అనుబంధంగా ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా పనిచేస్తుంది. విదేశాల్లో ప్రాక్టీస్‌ చేయాలనుకునే సీఎఫ్‌పీలు ఆయా దేశాల సర్టిఫికేషన్‌ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

కోర్సు కాలంలో మంచి శిక్షణ ద్వారా పర్సనల్‌ ఫైనాన్స్‌లో ప్రత్యేక సామర్థ్యాలను సీఎఫ్‌పీలు పెంపొందించుకుంటారు. తద్వారా వీరికి ఫైనాన్స్‌ రంగంలోని అనేక విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీలైతే సొంతగా ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు. క్లయింట్ల సమస్యలను పరిష్కరించినందుకు, సలహాలు ఇచ్చినందుకు కమిషన్‌ కూడా లభిస్తుంది. ఏ సబ్జెక్టులతోనైనా ఇంటర్మీడియట్‌ / 10+2 పూర్తిచేసిన విద్యార్థులు సీఎఫ్‌పీకి పేరు నమోదు చేసుకోవచ్చు.

బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో డిప్లొమా
బ్యాంకింగ్‌ రంగంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోన్న కోర్సు డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో సుశిక్షితులైన నిపుణుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (ఐఐబీఎఫ్‌) దీన్ని రూపొందించింది. ఈ కోర్సుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) గుర్తింపు ఉంది. అన్ని రకాల బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, ఐటీ, బీపీఓ రంగాల్లో ప్రవేశ స్థాయి ఉద్యోగాలకు ఈ డిప్లొమా అభ్యర్థులను అర్హులుగా ఐబీఏ గుర్తించింది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలపై సమగ్ర అవగాహన కల్పించడంతోపాటు, విధి నిర్వహణకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలను పెంపొందిస్తారు. విద్యార్థులను ఉద్యోగాలకు పూర్తి స్థాయిల్లో సన్నద్ధులను చేయడం ఈ కోర్సు ప్రత్యేకత. ఈ అభ్యర్థులకు కంపెనీల్లో అంతర్గత శిక్షణ పెద్దగా అవసరం ఉండదు. అందుకే కంపెనీలు డీబీఎఫ్‌ అభ్యర్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి.

పరీక్ష, అర్హతలు: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులు ఐఐబీఎఫ్‌ నిర్వహించే 'డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఎగ్జామినేషన్‌' రాయడానికి అర్హులు. ఈ పరీక్షలో కింది సబ్జెక్టులు / పేపర్లు ఉంటాయి...

* Principles & Practices of Banking
*Accounting & Finance for Bankers
* Legal & Regulatory Aspects of Banking

ఒక్కో పేపర్‌లో సుమారు 120 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. సాధారణంగా నెగటివ్‌ మార్కులు ఉండవు. సబ్జెక్టు పరిజ్ఞానం, భావనలపై పట్టు, విశ్లేషణ, తార్కిక, సమస్యా పరిష్కార సామర్థ్యాలు, కేస్‌ ఎనాలిసిస్‌ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ఆదివారం ఒక పేపర్‌ చొప్పున వరుసగా మూడు ఆదివారాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు గల సీఎఫ్‌ఏ
ఫైనాన్స్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన కోర్సుగా చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ)కు గుర్తింపు ఉంది. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది అత్యంత అనువైన కోర్సు. శిక్షణ మొదటి రోజు నుంచే ఉద్యోగానికి అవసరమైన సామర్థ్యాలను ఇందులో నేర్చుకుంటారు. ఇన్వెస్ట్‌మెంట్‌ రంగంలోని వైవిధ్యమైన అవకాశాలను అందుకోవడానికి అవసరమైన ఆచరణాత్మక జ్ఞానాన్ని సీఎఫ్‌ఏ ద్వారా పొందవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో సీఎఫ్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం గల ఈక్విటీలు, స్థిర ఆదాయం, డెరివేటివ్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, హెడ్జ్‌ ఫండ్‌లు, స్థిరాస్తి, తదితర ఆధునిక రంగాల్లో ఈ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాల్లో పోర్టిఫోలియో మేనేజర్లు, రిసెర్చ్‌ ఎనలిస్ట్‌లు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కన్సల్టెంట్లు, రిస్క్‌ మేనేజర్లు, రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు, కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ ఎనలిస్ట్‌లు, మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.

పరీక్ష, అర్హతలు: సీఎఫ్‌ఏ ప్రోగ్రామ్‌లో మొత్తం మూడు దశల పరీక్షలు ఉంటాయి. లెవెల్‌ 1లో ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్స్‌, లెవెల్‌ 2లో అసెట్‌ వాల్యుయేషన్‌, లెవెల్‌ 3లో పోర్టిఫోలియో మేనేజ్‌మెంట్‌ అంశాలు ఉంటాయి. పరీక్షలోని వివిధ దశల్లో సబ్జెక్టుపై అవగాహన, విశ్లేషణ, అనువర్తనం, కాంప్రహెన్షన్‌, మూల్యాంకనం, తదితర సామర్థ్యాలను పరీక్షిస్తారు. పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవారు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు లేదా సంబంధిత రంగంలో నాలుగేళ్ల పని అనుభవం ఉన్నవారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ పాస్‌పోర్టు కూడా అవసరం.


త్వరగా ఉద్యోగం కావాలంటే...
ఇంటర్మీడియట్‌ తర్వాత కొద్దిపాటి శిక్షణ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సీఎఫ్‌పీ, డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (డీబీఎఫ్‌) వీలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా డీబీఎఫ్‌ చేసిన అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ఐఐబీఎఫ్‌ తన వెబ్‌సైట్‌లో పెడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఈ అభ్యర్థులను నియమించుకునే అవకాశం ఉంది. మళ్లీ రాతపరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. మనదేశంలో డీబీఎఫ్‌ చేసిన అభ్యర్థులు అందరికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకింగ్‌ రంగం మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా ఈ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు కూడా తేలిగ్గా డీబీఎఫ్‌లో ఉత్తీర్ణులు కావచ్చు. ఏటా నవంబరు, మే నెలలో పరీక్షలు జరుగుతాయి.

సీఎఫ్‌పీ ఉత్తీర్ణులకు మనదేశంలో చాలా డిమాండ్‌ ఉంది. కెనడా లాంటి చిన్నదేశంలో 50 వేలమంది సీఎఫ్‌పీలు ఉంటే మనదేశంలో రెండువేల మంది కూడా లేరు. మనరాష్ట్రంలో వీరి సంఖ్య వందలోపే. కెనడాలో సీఎఫ్‌పీ నాలుగేళ్ల కోర్సు. మనదేశంలో ఆర్నెల్ల శిక్షణతో సీఎఫ్‌పీలో ఉత్తీర్ణత సాధించవచ్చు. అందుకే అనేకమంది విదేశీ విద్యార్థులు మనదేశంలో శిక్షణకు వస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ఎవరూ నిరుద్యోగులుగా ఉన్న దాఖలాలు లేవు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు వీరిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఇంటర్మీడియట్‌ తర్వాత స్వల్పకాలంలోనే ఉపాధి పొందడానికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది.


సీఎఫ్‌పీ, డీబీఎఫ్‌లతో పోల్చుకుంటే సీఎఫ్‌ఏ కొంచెం కఠినమైన పరీక్ష. సీఎఫ్‌ఏ పరీక్ష ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని దశలు పూర్తిచేయడానికి సుమారు రెండున్నరేళ్లు పడుతుంది. ఇందులో ఉత్తీర్ణులై కనీసం మూడేళ్లు అనుభవం సాధిస్తే అద్భుతమైన వేతనాలు లభిస్తాయి.



- డా|| సీఏ జి.వి.రావు, గౌరవ డైరెక్టర్‌,
శ్రీ నాగ్‌ మేధో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ స్టడీస్‌, హైదరాబాద్‌

Tuesday, 6 December 2011

బయో ఇన్ఫర్మేటిక్స్‌ ఉద్యోగాలకు బి.ఐ.ఎన్‌.సి.


నదేశంలో బయో ఇన్ఫర్మేటిక్స్‌ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. శాస్త్ర పరిశోధనలను వేగవంతం చేయడంలో కీలకంగా మారిన బయో ఇన్ఫర్మేటిక్స్‌ రంగం ఐరోపా దేశాలు, అమెరికాలో బాగా విస్తరించింది. 

బయాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో సామర్థ్యాలు ఉన్నవారికి ఈ రంగంలో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన సామర్థ్యాలను అందించడం లక్ష్యంగా డీబీటీ 'బయో ఇన్ఫర్మేటిక్స్‌ నేషనల్‌ సర్టిఫికేషన్‌' ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. 

బీఐఎన్‌సీ 2012 నోటిఫికేషన్‌ ఇటీవల వెలువడింది. పుణె, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, షిలాంగ్‌, హైదరాబాద్‌, తిరువనంతపురం, గౌహతిలో పరీక్ష కేంద్రాలున్నాయి.

బయోఇన్ఫర్మేటిక్స్‌ రంగానికి సంబంధించి అభ్యర్థి తెలివితేటలు, సామర్థ్యాలను అంచనా వేయడం బీఐఎన్‌సీ పరీక్ష ఉద్దేశం. 

ఈ ఏడాది నుంచి బీఐఎన్‌సీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందరికీ డీబీటీ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లు ఇవ్వనుంది. గతంలో టాప్‌ 10 అభ్యర్థులకు మాత్రమే ఫెలోషిప్‌లు ఉండేవి. బీఐఎన్‌సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీహెచ్‌డీ చేయాలనుకుంటే సంబంధిత విద్యాసంస్థ ప్రవేశ నిబంధనలకు అనుగుణంగా ఫెలోషిప్‌ లభిస్తుంది. 

ఇదిగాక బీఐఎన్‌సీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 10 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా రూ.10000 చొప్పున నగదు బహుమతి కూడా ఇస్తారు.

నియామకాల్లో ప్రాధాన్యం
బయో ఇన్ఫర్మేటిక్స్‌ రంగంలో కొత్తగా ప్రవేశించాలనుకునే అభ్యర్థులతోపాటు, ఇప్పటికే పరిశ్రమల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌కు కూడా బీఐఎన్‌సీ శిక్షణ వల్ల ప్రయోజనం ఉంటుంది. బీఐఎన్‌సీలో చేరాలంటే బయో ఇన్ఫర్మేటిక్స్‌లో డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ లేదా డిప్లొమా చేయాల్సిన అవసరం లేదు. ఈ రంగం పట్ల ఆసక్తి ఉంటే సరిపోతుంది. నియామకాల సమయంలో బయో ఇన్ఫర్మేటిక్స్‌ కంపెనీలు ఈ సర్టిఫికేషన్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. 

దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య వేయిమంది లోపే ఉంటుంది. ఇప్పటివరకు ఈ పరీక్షను యూనివర్సిటీ ఆఫ్‌ పుణె నిర్వహించింది. బీఐఎన్‌సీ-2012 పరీక్ష బాధ్యతలను న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) చేపట్టింది. జేఎన్‌యూకు యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, అన్నా యూనివర్సిటీ (చెన్నై), వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (కోల్‌కత), ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ అప్లయిడ్‌ బయోటెక్నాలజీ (బెంగళూరు), నార్త్‌ ఈస్ట్రన్‌ హిల్‌ యూనివర్సిటీ (షిల్లాంగ్‌), యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హైదరాబాద్‌) సహకరిస్తున్నాయి.

పరీక్ష విధానం
బీఐఎన్‌సీ 2012 పరీక్షలో మొత్తం మూడు పేపర్లుంటాయి. అన్నిటిలోనూ సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో అభ్యర్థి అవగాహన, సామర్థ్యాలను పరీక్షిస్తారు. 

పేపర్ల వివరాలు...
 * పేపర్‌-1: ఇది ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్ష. 25 ఫిబ్రవరి 2012న జరగనుంది. ఇందులో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. దీనిలో బయో ఇన్ఫర్మేటిక్స్‌కు 40 శాతం, బయాలజీకి 20 శాతం, ఫిజికల్‌ అండ్‌ కెమికల్‌ సైన్సెస్‌కు కలిపి 20 శాతం, ఐటీకి 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

* పేపర్‌ 2: ఇది స్వల్ప సమాధాన ప్రశ్నలతో కూడిన పేపర్‌. ఫిబ్రవరి 26, 2012న దీన్ని నిర్వహిస్తారు. ఇందులో 20 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. ఈ ప్రశ్నపత్రానికి కేటాయించిన సమయం 3 గంటలు. ఇందులో బయోఇన్ఫర్మేటిక్స్‌కు 40 శాతం, ఐటీకి 20, బయాలజీకి 20 శాతం, ఫిజికల్‌ అండ్‌ కెమికల్‌ సైన్సెస్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. గత ఏడాది నుంచి ఈ పరీక్ష స్వభావం మారింది.

* పేపర్‌ 3: ఇది ప్రాక్టికల్స్‌ పరీక్ష. దీన్ని 26 ఫిబ్రవరి 2012న రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 100. ప్రాక్టికల్‌ పూర్తిచేయాల్సిన సమయం 2 గంటలు.

పేపర్‌-1లో తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కును తీసేస్తారు. పేపర్‌-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను పరీక్ష జరిగిన రోజే (25 ఫిబ్రవరి 2012) సంబంధిత కేంద్రంలో ప్రకటిస్తారు. ఇందులో కనీసం 40 శాతం మార్కులు ఉంటే పేపర్‌-2, పేపర్‌-3కి అనుమతిస్తారు. అన్ని పేపర్లలో కనీసం 40 శాతం మార్కులు సాధించినవారికి సర్టిఫికేషన్‌ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జేఎన్‌యూ - బీఐఎన్‌సీ వెబ్‌సైట్‌లో పెడతారు.

పరీక్ష సిలబస్‌
బీఐఎన్‌సీ సిలబస్‌లో మొత్తం ఐదు విభాగాలుంటాయి. అవి... బయాలజీ, ఫిజికల్‌ అండ్‌ కెమికల్‌ సైన్సెస్‌, మేథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్‌. పేపర్‌-1లో అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. ఆయా సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలపై ప్రశ్నలడుగుతారు.

* పేపర్‌-2లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-3 కంప్యూటర్‌ ఆధారిత ప్రాక్టికల్‌ పరీక్ష. ఇందులో బయో ఇన్ఫర్మేటిక్స్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పేపర్ల వారీగా పూర్తి సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రాలు జేఎన్‌యూ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

దరఖాస్తు విధానం
సైన్స్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ, మెడిసిన్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, అంతకంటే పైస్థాయి కోర్సులు చేసిన అభ్యర్థులు బీఐఎన్‌సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. ఫెలోషిప్‌ మాత్రం పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి, పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకే లభిస్తుంది. బయో ఇన్ఫర్మేటిక్స్‌లో ఎలాంటి సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ చదివుండాల్సిన అవసరం లేదు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఐఎన్‌సీ 2012 పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులకు ఈ-మెయిల్‌, 'ఫైనాన్స్‌ ఆఫీసర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ' పేరు మీద న్యూఢిల్లీలో చెల్లే విధంగా తీసిన రూ.600లకు (రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.450) డిమాండ్‌ డ్రాఫ్ట్‌ అవసరం. డీడీ వెనుక పేరు, దరఖాస్తు సంఖ్య రాయాలి. 

ఆన్‌లైన్‌లో ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తిచేసిన వెంటనే దాన్ని ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి. దీనికి డిమాండ్‌ డ్రాఫ్ట్‌ జతచేసి, రెండు ఫొటోగ్రాఫ్‌లతో 'కో ఆర్డినేటర్‌, బీఐఎన్‌సీ ఎగ్జామినేషన్‌, స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటేషనల్‌ అండ్‌ ఇంటెగ్రేటివ్‌ సైన్సెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ- 110067'కి పంపించాలి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరితేదీ: 3 ఫిబ్రవరి, 2012
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌లు చేరడానికి చివరితేదీ: 7 ఫిబ్రవరి 2012.
* పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థులు జాబితా విడుదల తేదీ: 10 ఫిబ్రవరి 2012.
* వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు లభించే తేదీ: ఫిబ్రవరి 10, 2012
* బీఐఎన్‌సీ పరీక్ష తేదీలు: 25-26 ఫిబ్రవరి 2012.

Friday, 30 September 2011

ఆంధ్ర మహిళా సభలో పీజీ డిప్లొమా, టీపీటీ

హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్‌) ఆధ్వర్యంలో కొనసాగుతోన్న కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ వివిధ జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులను అందిస్తోంది.

2011-12 సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌, తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ (టీపీటీ) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులకు అర్హులు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా ఏఎంఎస్‌ కొనసాగుతోంది.

* పీజీ డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌: అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులకు ఎన్‌సీటీఈ గుర్తింపు ఉంది.

* తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌: తెలుగు ఆప్షనల్‌ సబ్జెక్టుగా బీఏ లేదా ఎం.ఎ. తెలుగు లేదా బీఏ లాంగ్వేజెస్‌ చదివుండాలి.

ఈ కోర్సులకు సంబంధించిన ఇతర వివరాలు, దరఖాస్తులను ఏఎంఎస్‌ కార్యాలయం నుంచి పొందవచ్చు.

చిరునామా: కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్ర మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ రోడ్‌, హైదరాబాద్‌.

వీటితోపాటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులకు అనేక పారామెడికల్‌ కోర్సులను కూడా ఏఎంఎస్‌ అందిస్తోంది. వీటి వ్యవధి రెండేళ్లు. మేనేజ్‌మెంట్‌ కోటాలో కింది పారామెడికల్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఏఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది...
* రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌
* పెర్‌ఫ్యూజన్‌ టెక్నీషియన్‌
* ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌
* క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌


ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ లేదా ఎంపీసీ గ్రూప్‌లు చదివిన అభ్యర్థులు అర్హులు. బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

వీటితోపాటు ఏడాది వ్యవధి గల 'ఈసీజీ టెక్నీషియన్‌'  కోర్సును కూడా అందిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులు దీనికి అర్హులు.

దరఖాస్తులను ఏఎంఎస్‌, డి.డి. కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, విద్యానగర్‌, హైదరాబాద్‌ నుంచి పొందవచ్చు.

పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ  30 సెప్టెంబరు 2011.