ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label ఫార్మసీ. Show all posts
Showing posts with label ఫార్మసీ. Show all posts

Monday, 9 September 2013

ఎంబీఏకు మ్యాట్‌ మార్గం


ఎంబీఏ ప్రవేశానికి ఏడాదికి నాలుగుసార్లు జరిగే జాతీయస్థాయి ప్రవేశపరీక్ష 'మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌' (MAT). ప్రసిద్ధ బీ స్కూల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 600 విద్యాసంస్థలు ఈ పరీక్ష స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. డిసెంబర్‌ మ్యాట్‌ ప్రకటన వెలువడిన సందర్భంగా... దీనిలో మెరుగైన ర్యాంకు సాధించటానికి ఏ అంశాలపౖెె దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!

డిగ్రీ ఉత్తీర్ణులే కాకుండా, చివరి సంవత్సరం విద్యార్థులు కూడా మ్యాట్‌ రాయవచ్చు. దీనికి వయః పరిమితి ఏమీ లేదు. పేపర్‌ ఆధారితంగా, కంప్యూటర్‌ ఆధారితంగా- రెండు రకాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు.

మ్యాట్‌ రాయడానికి క్యాట్‌లో మాదిరి కనీస మార్కుల శాతం నిబంధన ఏమీ లేదు. అందువల్ల డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినవారు కూడా మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో దరఖాస్తు చేసుకోవటానికి ఈ పరీక్ష ఓ చక్కని మార్గంగా ఉంది. ప్రతి ప్రవేశపరీక్షా ఆన్‌లైన్‌ పద్ధతిలోకి మారుతున్న ఈ రోజుల్లో ఇంకా కొందరు విద్యార్థులకు కంప్యూటర్‌ చేరువ కాలేదు. ఇలాంటివారికి పేపర్‌ బేస్డ్‌ పద్ధతిలో 'మ్యాట్‌' నిర్వహించటం అనుకూలం. మల్టిపుల్‌ చాయిస్‌ సమాధానాలుండే ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలను సాధించాల్సివుంటుంది. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. తప్పు సమాధానం రాస్తే 1/4 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష అభ్యర్థి సాధారణ సామర్థాన్ని పరీక్షించేలా రూపొందింది.

డిసెంబరు 1న మ్యాట్‌ను పేపర్‌ ఆధారితంగా నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు పరిమితంగా ఉంటే ఈ పరీక్ష కూడా డిసెంబరు 1నే జరుగుతుంది. లేకుంటే డిసెంబరు 7న నిర్వహిస్తారు.
విద్యార్థులు అక్టోబరు మొదటి వారం నుంచి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పేపర్‌ ఆధారిత పరీక్షకు అడ్మిట్‌ కార్డులను AIMA వెబ్‌సైట్‌ http://apps.aima.in/matadmitcard.aspxలో నవంబరు 23 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎలా సంసిద్ధం కావాలి?
విద్యార్థులు మొదట మాక్‌ మ్యాట్‌ రాయాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా నమూనా మ్యాట్‌ పరీక్షను రాసే వీలుంది. ఇలా చేస్తే పరీక్ష పద్ధతి అవగాహనకు వస్తుంది. దానికి అనుగుణంగా ఎలా చదవాలో ప్రణాళికీకరించుకోవచ్చు. నమూనా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినపుడు నిరాశపడకూడదు. ఈ పరీక్ష రాయటం స్కోరు కోసం కాదని గుర్తించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నదీ, వేటిలో పటిష్ఠంగా ఉన్నదీ గుర్తించటానికి ఈ పరీక్ష ఫలితాలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.

ప్రతి టాపిక్‌లోనూ కాన్సెప్ట్‌పై అవగాహన పెంచుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు- రేషియోస్‌ అనే అధ్యాయంలో కీలకాంశం ఏమిటో గ్రహించాలి. తర్వాత ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని రకాల ప్రశ్నలకూ జవాబులు రాసేలా తయారవ్వాలి. మళ్ళీ ఇదే అధ్యాయంలో మరోసారి ఎక్సర్‌సైజులు చేయాలి. ఈసారి సమయం చూసుకోవాలి. 40 నిమిషాలకు 40 మాథ్స్‌ ప్రశ్నలంటే నిమిషానికి ఓ ప్రశ్న. ఒక ఎక్సర్‌సైజులో 10 ప్రశ్నలుంటే వాటిని 10 నిమిషాల్లో చేయటానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు నిమిషం కంటే ఎక్కువ వ్యవధి పట్టవచ్చు; కొన్నిటికి నిమిషం కంటే తక్కువ సమయం పట్టొచ్చు. మొత్తమ్మీద వాటన్నిటినీ 10 నిమిషాల్లో పూర్తిచేయటం ముఖ్యం. ఈ రకంగా చేస్తే వేగం, కచ్చితత్వం కూడా పెరుగుతాయి. ఒక ప్రధానాంశంలోని అన్ని టాపిక్స్‌లోని కాన్సెప్టులపై పట్టు వచ్చాక, వాటన్నిటిపై ఓ పరీక్ష రాయాలి. ఉదాహరణతో చెప్పాలంటే- అరిథ్‌మెటిక్‌లో రేషియో, పర్సంటేజి, సింపుల్‌ ఇంటరెస్ట్‌, కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, వర్క్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఉంటాయి. ఈ కాన్సెప్టులపై అవగాహన సాధించాక అరిథ్‌మెటిక్‌లో పరీక్ష రాసి పరిశీలించుకోవాలి. నేర్చుకున్న అంశాలు దీనివల్ల మరింత పటిష్ఠమవుతాయి. విభిన్నమైన ప్రశ్నల నమూనాలను నిర్దిష్ట వ్యవధిలోనే చేయగలుగుతారు.

జనరల్‌ అవేర్‌నెస్‌ మినహాయించి మిగిలిన మూడు విభాగాలకూ ఇదే తీరు పాటించాలి. ఒక్కో విభాగంపై పట్టు సాధించాక పూర్తి నిడివి పరీక్ష అభ్యాసం చేయటం మొదలుపెట్టాలి. ఒకేసారి రెండున్నర గంటల సమయంలో పరీక్ష రాయటానికి శక్తి, సహనం అవసరమవుతాయి. ఇలాంటి నమూనా పరీక్షలు రాశాక సరైన, తప్పు జవాబులు రెంటినీ విశ్లేషించుకోవాలి. ఫలితంగా స్కోరు క్రమంగా మెరుగుపడుతుంది. అసలైన పరీక్షలో సందేహాలకు అతీతంగా మంచి స్కోరు సాధ్యమవుతుంది.

సారాంశం ఏమిటంటే... కాన్సెప్టులపై మొదట దృష్టిపెట్టాలి. తర్వాత ఎక్సర్‌సైజులు చేయాలి. క్రమంగా పూర్తినిడివి పరీక్షలు రాసి, నైపుణ్యాలూ, వ్యూహాలకు పదునుపెట్టుకోవాలి.

విభాగాలవారీగా  సన్నద్ధత  సూచనలు www.eenadu.net చదువు విభాగంలో  చూడవచ్చు.

Wednesday, 23 January 2013

ఎంసెట్... నీట్ - సన్నద్ధత ఎలా?





    ఎంసెట్‌-నీట్‌... ఏ పరీక్ష రాయాల్సివచ్చినా, ఒకవేళ రెండూ రాయాల్సివచ్చినా బైపీసీ విద్యార్థులు తయారుగా ఉండటం మేలు. అనుకూల అంశాలను గుర్తుచేసుకుంటూ ఆశావహ దృక్పథంతో ప్రణాళిక వేసుకోవాలి; ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించాలి!

ఇంటర్మీడియట్‌ బైపీసీ విభాగంలోని ప్రవేశపరీక్షలకు దాదాపు 1,25,000 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఏది ఖరారవుతుందనే విషయంపై అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తుండటమే సరైన చర్య.

బైపీసీ విభాగంలో జరిగే పోటీ పరీక్షల్లో సబ్జెక్టుపై అవగాహన ఎంత అవసరమో ఆత్మవిశ్వాసం అంతకంటే ఎక్కువ అవసరమవుతోంది. ప్రణాళికతో తయారు కాగలిగితే ఈ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

జరగబోయే నీట్‌, ఎంసెట్‌ రెండు పరీక్షలూ ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లలో ప్రవేశాలు నీట్‌ ద్వారా జరిగితే; మిగిలిన కోర్సులైన యునానీ, ఆయుర్వేదిక్‌, హోమియోపతి, అగ్రికల్చరల్‌ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్‌, ఫార్మసీ, నర్సింగ్‌ లాంటి కోర్సుల్లో ప్రవేశం ఎంసెట్‌ ద్వారా జరిగే అవకాశం ఏర్పడుతోంది. నీట్‌ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపు సంశయం కంటే సన్నద్ధత  చాలా అవసరం.

ఎంసెట్ 2012 : 
మార్కుల, ర్యాంకుల విశ్లేషణ 


తయారయ్యేదెలా?
* సీనియర్‌ ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి, మార్చి మొదటివారంలో థియరీ పరీక్షలూ ప్రారంభమవుతున్నాయి కాబట్టి సీనియర్‌ ఇంటర్‌ ఆఖరి పరీక్ష మార్చి 19వ తేదీ వరకూ రెండో సంవత్సరం సిలబస్‌కే పరిమితమై చదవాలి.

* ఇంటర్‌ పరీక్షకు VSAQప్రశ్నలపై బాగా తయారైతే అది ఎంసెట్‌కు కూడా ప్రయోజనం.

* చాలామంది ఈ సమయంలో మొదటి సంవత్సరం సిలబస్‌ పునశ్చరణ అని సమయాన్ని నష్టపరుచుకుని సీనియర్‌ సిలబస్‌ పూర్తికాక ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా మార్చి 19 వరకూ ఆబ్జెక్టివ్‌తో కలిపి రెండో సంవత్సరం సిలబస్‌ సంపూర్ణంగా పూర్తిచేయగలిగితే ఆ తర్వాత ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణకు కావలసిన సమయం దొరుకుతుంది.

* ఇంటర్‌ అకాడమీ పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదివినా సరిపోతుంది. నీట్‌కు అయితే అదనంగా బోటనీ, జువాలజీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కూడా కచ్చితంగా చదవాలి. అయితే ఈ అదనపు అంశాలు మార్చి 19 తర్వాత చదువుకోవచ్చు.

* ఇంటర్‌ పరీక్షల ముందు నెలరోజులు పాఠాలు వినడం కంటే విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి ప్రయత్నిస్తే అధికలాభం. సందేహాలు వస్తే వెంటనే అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకోవచ్చు.

* కొంతమంది ఒక వారం ఒక సబ్జెక్టు పూర్తిచేయాలని ప్రయత్నిస్తూవుంటారు. అయితే ఒకే సబ్జెక్టు అంత ఎక్కువ కాలం చదివితే అవగాహనలోపం ఏర్పడవచ్చు. ఇతర సబ్జెక్టులు ఎక్కువకాలం చదవలేదు కాబట్టి మనసులో వాటిపై భయం పెంచుకుని, ఆ సబ్జెక్టులు కూడా సరిగా చదవలేరు. అందుకే వీలైనంతవరకూ ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులూ చదవాలి (పరీక్షల సమయంలో తప్పించి).

* సిద్ధాంతపరమైన ప్రశ్నలు చదివినపుడు ఆకళింపు చేసుకోలేకపోతే కొంత సమయం లెక్కలు చేసి, మళ్ళీ సిద్ధాంతపరమైన భాగాలను చదివితే సరిపోతుంది.

* ఈ సమయంలో కొత్త అంశాలు చదవకుండా, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే ఆత్మస్త్థెర్యం పెంచుకోవచ్చు.

* ఎంసెట్‌ బైపీసీ విభాగంలో 160 మార్కులకు 115 మార్కులపైన సాధించగలిగితే సీటు సాధించినట్లే. ఆ మార్కులు పొందాలంటే బయాలజీలో 75, కెమిస్ట్రీలో 35, ఫిజిక్స్‌లో మిగిలిన మార్కులు సాధించగలిగితే సరిపోతుంది. పట్టున్న సబ్జెక్టులో అధిక మార్కులు సాధించటం ముఖ్యం!

పూర్తి కథనం కోసం  www.eenadu.net చదువు విభాగం చూడండి! 
   

Wednesday, 9 January 2013

మే 10న ఎంసెట్‌


ఈనాడు హైదరాబాద్‌ :ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సుల ప్రవేశపరీక్షల తేదీలతోపాటు ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ నిర్వహణ, తరగతుల ప్రారంభం తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఇలా జరగడం ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం.

సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్‌ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్‌ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్‌(పీజీఈసెట్‌) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్‌సెట్‌(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్‌), న్యాయవిద్య(లాసెట్‌, పీజీలా) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం(ఈసెట్‌) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్‌, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయప్రకాష్‌రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు.



2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్‌ఆర్‌సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్‌జైన్‌, జయప్రకాష్‌రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్‌ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.


Sunday, 4 September 2011

ఫార్మసీ కోర్సుల ప్రత్యేకతలు తెలుసా?

వాళ ఈనాడులో ఫార్మా-డి కౌన్సెలింగ్ గురించి ఓ వార్త వచ్చింది చూశారా?  ఇక్కడ ఇస్తున్నాం.

ఫార్మా డీ కౌన్సెలింగ్‌ ఉన్నట్లా.. లేనట్లా?

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఫార్మా డీ కౌన్సెలింగ్‌ ఈసారి ఉంటుందా? ఉండదా? ఇదే ప్రశ్న ఇపుడు విద్యార్థులను వేధిస్తోంది. ఈ నెల 5న ఇంజినీరింగ్‌ తుది కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామంటూ ఉన్నత విద్యాశాఖ ఒక ప్రకటన జారీ చేసింది కానీ... ఫార్మా డీ గురించి ప్రస్తావించలేదు.

దీంతో ఫార్మా డీ కౌన్సెలింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కొత్త కోర్సుకు ఇటీవల కాలంలో డిమాండు పెరగడంతో కౌన్సెలింగ్‌ తేదీల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. బీఫార్మసీ, బయోటెక్నాలజీలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు జరగనుంది. 12వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఫార్మా డీ ప్రవేశాల గురించి ప్రత్యేకంగా ప్రకటన రాకపోవడాన్ని చూస్తే... కౌన్సెలింగ్‌ ఉండకపోవచ్చనే భావిస్తున్నారు. ఎంతో డిమాండు ఉన్న ఫార్మా డీలో ప్రవేశాలను నేరుగా చేసుకుంటామంటూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నాయని, దీనిలో భాగంగానే తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫార్మా డీ కోర్సును 32 కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కళాశాలలో 30 చొప్పున సీట్లు ఉన్నాయి. ఇందులో 21 సీట్లను కన్వీనర్‌ కోటాతో భర్తీచేయాలి. మిగిలిన సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. కన్వీనర్‌ కోటా రూ.68,000 కాగా, యాజమాన్య కోటా రూ.1,55,000 చెల్లించాలి. ఈ కోర్సుకున్న డిమాండు దృష్ట్యా కొన్ని కళాశాలల్లో డొనేషన్ల పర్వం సాగుతోంది. కన్వీనర్‌ కోటా ద్వారా సీట్ల భర్తీ జరిగితే అర్హులైన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. బోధనా ఫీజుల చెల్లింపు పథకం ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.

ఢిల్లీలో కుదరని సమన్వయం: 
ఇంజినీరింగ్‌ కళాశాలలకు కాస్త ఆలస్యమైనా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతులన్నీ వచ్చాయి. కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే నాటికి వాటి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. బీఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల అనుమతులు కూడా అఖిల భారత సాంకేతిక విద్యా మండలే ఇస్తోంది. ఫార్మా డీ కోర్సుని మాత్రం భారత ఫార్మసీ మండలి చూస్తోంది. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడటం వల్ల కూడా సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. బీఫార్మసీలో ఒక్కో కళాశాలలో 60 సీట్లు మాత్రమే ఉండాలని ఫార్మసీ మండలి పేర్కొంటుండగా ఎఐసీఈటీ 120, 180 సీట్ల భర్తీ వరకు ఆమోదిస్తోంది. ఫార్మసీ మండలి నుంచి ఫార్మా డీి కోర్సులకు సంబంధించిన అనుమతులు ఇంకా వస్తున్నాయని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి కార్యదర్శి డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంత ప్రాధాన్యముంది కదా, మరి  ఫార్మసీ కోర్సు ప్రత్యేకతలు ఏమిటి?

‘చదువు’ ప్రచురించిన ఈ కథనం చదివి, తెలుసుకోండి!

రచయిత ఫార్మసీ రంగ నిపుణుడు  ఎం. వెంకటరెడ్డి.