ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 27 March 2012

టెట్ మార్కులతో కొలువు ఖరారు!



    ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రకటన మూడోసారి వెలువడింది. ఆగస్టు చివర్లో నియామక పరీక్ష- డీఎస్‌సీ జరగనున్న నేపథ్యంలో మే 31న జరిగే టెట్‌కు ప్రాధాన్యం పెరిగింది. తాజా పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో నిపుణుల సూచనలు... ఇవిగో!

డీఎస్‌సీలో 20 మార్కుల వెయిటేజి టెట్‌కు ఇచ్చారు. అందువల్ల అర్హత మార్కులు మాత్రం సాధించి 'గట్టెక్కాంలే' అని ఆనందించే పరిస్థితి లేదు. తెలివైన అభ్యర్థులు టెట్‌లోనే గరిష్ఠమార్కులు సాధించటం ద్వారా డీఎస్‌సీ ఉద్యోగాన్ని ముందుగానే రిజర్వ్‌ చేసుకోవచ్చని మరవరాదు.

కొన్ని జిల్లాలో డీఎస్‌సీలో ఎంపికైన అభ్యర్థికీ, కాని అభ్యర్థికీ మధ్య అంతరం చాలా తక్కువగా ఉంది. అలాంటి పరిస్థితిలో టెట్‌లో మంచి మార్కుల సాధన ఇలాంటి సమస్య నుంచి బయటపడేస్తుంది.

ఉదాహరణకు టెట్‌లో 118, 90 మార్కులు సాధించిన ఇద్దరికి డీఎస్‌సీలో వెయిటేజి ఎలా మారుతుందో చూద్దాం.

టెట్‌ మార్కులు డీఎస్‌సీలో వెయిటేజి


ఇలాంటి తేడా వచ్చే అవకాశం ఉన్నందున టెట్‌లో 115కి పైగా మార్కులు తెచ్చుకోవడం ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. అందుకనుగుణంగా ప్రిపరేషన్‌ వ్యూహం ఉండాలి.

2011 టెట్‌లో 110కిపైగా మార్కులు తెచ్చుకున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. 2012 (జనవరి) టెట్‌లో పరీక్షాపత్రం కఠినంగా ఉన్నప్పటికీ 110కి పైగా మార్కులు పొందినవారూ ఎక్కువమందే!

అందువల్ల జనరల్‌ కేటగిరిలో ఉద్యోగాలు సాధించాలంటే 110కి పైన లక్ష్యం పెట్టుకుంటేనే డీఎస్‌సీలో నిలబడే అవకాశముంటుంది. తాజా టెట్‌లో 115కి పైగా మార్కుల లక్ష్యం పెట్టుకుని అందుకు అనుగుణంగా సిద్ధపడాలి.

ప్రిపరేషన్‌ వ్యూహం
టెట్‌, డీఎస్‌సీ తేదీలు కూడా ముందుగానే నిర్ణయించడంతో నిన్నటివరకూ డీఎస్‌సీ చదవటంలో, ప్రిపరేషన్‌ ప్రాధాన్యాలు నిర్ణయించుకోవడంలో కొందరు అభ్యర్థుల్లో తికమక కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రిపరేషన్ని ఎలా మార్చుకోవచ్చంటే...

* టెట్‌ పూర్తయేవరకూ టెట్‌ సిలబస్‌పైనే 100 శాతం దృష్టి పెట్టాలి.
* టెట్‌ ముగిశాక రెండున్నర నెలలకు పైగా డీఎస్‌సీకి వ్యవధి ఉంది. కాబట్టి అప్పుడు దానిపై శ్రద్ధ పెట్టవచ్చు.
* టెట్‌ కంటెంట్‌కు తయారవుతున్నపుడే అది డీఎస్‌సీకీ ఉపకరిస్తుందని గుర్తించాలి. తద్వారా డీఎస్‌సీకి సిద్ధమవటం లేదనే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

ఎ) ఆ 90 మార్కులు
150 మార్కుల టెట్‌కి గాను శిశువికాసం, భాష-1, భాష-2లకే 90 మార్కులు కేటాయించారు. మిగతా కంటెంట్‌+ పెడగాజిలకు 60 మార్కులు. క్షుణ్ణంగా పరిశీలిస్తే... కంటెంట్‌+ పెడగాజిలలో సాధించే మార్కుల్లో తేడా అభ్యర్థుల మధ్య తక్కువగా ఉంటుంది. కానీ కఠినంగా భావించే శిశువికాసం, ఇంగ్లిష్‌ల మార్కుల్లో తేడా మాత్రం ఎక్కువే.

టెట్‌-2012లో తెలుగు ప్రశ్నపత్రం కఠినత్వం గమనిస్తే 'తెలుగుభాష' కూడా మార్కుల సాధనలో కీలకంగా మారిందని తెలుస్తుంది. అందువల్ల అభ్యర్థులు ఈ మూడు అంశాలనూ పరీక్షకు అవసరమైన స్థాయిలో సిద్ధమైతేనే మార్కుల పంట పండేది!

* శిశువికాసం ప్రశ్నలు గత డీఎస్‌సీల మాదిరిగా పాఠ్యపుస్తకాల నుంచి నేరుగా ఇవ్వటం లేదు. పైగా పెడగాజి కూడా ఉండటం వల్ల ప్రశ్నలన్నీ అభ్యర్థి స్థూల అవగాహన, అన్వయాలపై అడుగుతున్నారు. అందుకని పాఠ్యపుస్తకాలో, ప్రశ్నల నిధులో చదివి 'బాగా ప్రిపేరయ్యాం' అనుకుంటే నష్టపోతున్నట్టే.

* గ్రామీణ అభ్యర్థులు ఏదో ఒక గ్రామర్‌ పుస్తకం చదివి భాషలను 'మమ' అనిపిస్తున్నారు. 12 మార్కులు పెడగాజి అంశాలున్నాయని మర్చిపోతున్నారు. భాషలను చదివేటప్పుడు వ్యాకరణ కిటుకులను, భాష బోధన పద్ధతులను దృష్టిలో పెట్టుకోవాలి.

బి) బట్టీయమా?
గత డీఎస్‌సీ అనుభవాలతో టెట్‌లో కూడా 'మక్కీకి మక్కీ'గా పాఠ్యపుస్తకాలు చదివినవారు ఇప్పటివరకూ జరిగిన రెండు టెట్‌లలోనూ దెబ్బతిన్నారు. శిక్షణ సంస్థలు కూడా పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాల్నే బిట్లుగా మార్చి, బట్టీ పట్టించి మొత్తమ్మీద డీఎస్‌సీలలో విజయాలు సాధించాయి. కానీ టెట్‌లో ఆ ధోరణి తగ్గటంతో శిక్షణసంస్థలతో పాటు అభ్యర్థులూ బోల్తాపడినట్టయింది.

గత రెండు టెట్‌ల ప్రశ్నల్లో అత్యధికం అభ్యర్థి సంపూర్ణ అవగాహనను పరిశీలించేవే. ప్రతి పాఠ్య విషయాన్నీ చదివినపుడు బిట్ల మాదిరిగా ఆలోచిస్తూ, ఆయా అంశాల నేపథ్యం కూడా పరిగణనలోకి తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శిశు వికాసం, పెడగాజి, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఈ ధోరణి అవసరం.

సి) మెథడ్స్‌ పెడగాజి కాదు
టెట్‌లో పేర్కొన్న పెడగాజి అంశాలను పరిశీలిస్తే- గతంలో డీఎస్‌సీ కోసం చదివిన మెథడ్స్‌ యథాతథంగా అన్వయించలేం. ముఖ్యంగా శిశు వికాసం కింద ఇచ్చిన పెడగాజిలో పాఠశాల నిర్వహణ, విద్య- ఆధారాలు, విద్య- సామాజిక అంశాల ప్రాధాన్యం ఉంది. అధ్యాపనం కింద బోధనా మెలకువలతో పాటు విద్యా దార్శనికత, తాత్వికత, వర్తమాన విద్యాంశాలను కూడా అనుసంధానించుకోవాలి.

డి) చదివితే సరిపోతుందా?
డీఎస్‌సీ స్థాయి పరీక్షలు రాసే అభ్యర్థులు గంటల తరబడి చదువుతారు. కానీ చదివిన అంశాలను అన్వయించుకోవటంలో కొందరు వెనకబడుతున్నారు. ముఖ్యంగా మారిన పరీక్షా ధోరణిని బట్టి చదివిన అంశాలను ఏయే రీతుల్లో సమాజంలో అన్వయించవచ్చు, వాటి ఉపయోగితా విలువ అనే కోణంలో పరిశీలించాలి.

* మార్కులు తెచ్చుకునేందుకు ప్రతి అంశాన్నీ చదవగానే ప్రశ్నలనూ, రూపాలనూ అంచనా వేయాలి.
* వీలైనన్ని నమూనా పరీక్షలను అభ్యాసం చేయాలి.
* వస్తున్న ఫలితాలను బట్టి సరైన మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి.

ఇ) అన్నీ చదవాల్సిందే
* చాలామంది సోషల్‌ అభ్యర్థులు- జాగ్రఫీ, చరిత్ర అంశాల పట్ల కొద్దిపాటి వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. కానీ ఆ రెండు అంశాల నుంచే ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశముంది.
* సైన్స్‌ అభ్యర్థుల్లో- బయోసైన్స్‌వారు పదో తరగతిస్థాయి గణితం అభ్యసించేందుకు మానసికంగా సిద్ధపడటం లేదు. గణితం అభ్యర్థులు బయోసైన్స్‌ పట్ల ఇదే స్థాయి ధోరణితో ఉంటున్నారు. అలాంటి వ్యతిరేకతతో చదవటం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు.

* భాష 1,2లలోని కంటెంట్‌, పెడగాజి అంశాల పట్ల భాషేతర అభ్యర్థులు నిరుత్సాహంగా ఉంటున్నారు.

అభ్యర్థిలో అనుకూలత ఉన్నా లేకపోయినా పరీక్ష కోసం చదవాల్సిందే.


- కొడాలి భవానీ శంకర్ 

 
విస్తృతంగా, సమగ్రంగా!
టెట్‌ పరీక్ష ప్రశ్నపత్రం పరిశీలిస్తే- జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలకంటే అవగాహన, అనుప్రయుక్త (అప్లికేషన్‌) లక్ష్యాలను పరీక్షించే ప్రశ్నలను ఎక్కువగా అడిగారు

తెలుగు అకాడమీ డి.ఇడి., బి.ఇడి పుస్తకాల సిలబస్‌లో లేని అంశాలు టెట్‌ సిలబస్‌లో ఉన్నాయి. అందుకని ఆ అంశాలపై ప్రశ్నలు అభ్యర్థులకు కష్టతరంగా కనపడుతున్నాయి.

ఉదాహరణకు- చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజిలో ఛామ్‌స్కీ, కార్ల్‌ రోజర్స్‌, కోఫ్కా; బోధనా విధానాల్లో ఎన్‌సీఎఫ్‌-2005, విద్యాహక్కు చట్టం-2009 మొదలైనవి. వీటిపై అందుబాటులో ఉండే మార్గాల్లో మెటీరియల్‌ను సంపాదించుకుని పరీక్ష దృష్టితో అభ్యసిస్తే ఇబ్బంది ఉండదు.

నిర్ణీత సిలబస్‌ను విస్తృత స్థాయిలో, ప్రాథమిక భావనలను సమగ్రంగా అభ్యసించాల్సిన అవసరముంది.

కేవలం డి.ఇడి సిలబస్‌ పస్తకాల్లోని విషయాలే కాకుండా బి.ఇడి సిలబస్‌లోని విషయాలు కూడా అడుగుతున్నారు. అంటే టెట్‌ సిలబస్‌ను ప్రామాణిక పుస్తకాల్లోని ప్రాథమిక భావనలూ, వాటిలో అంతర్లీనంగా ఉన్న విషయాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని తెలుస్తోంది. ఆ దిశలో ప్రిపరేషన్‌ కొనసాగించాలి.

* పేపర్‌-1 రాసేవారు మెథడాలజీ ప్రిపరేషన్లో అన్ని బోధనా పద్ధతుల్లో ఉమ్మడిగా ఉంటే అధ్యాయాలను సమన్వయంతో అభ్యసిస్తే మంచి ఫలితాలుంటాయి.

ఉదాహరణకు- 1) బోధనా పద్ధతులు 2) విద్యాప్రణాళిక/పాఠ్య ప్రణాళిక 3) బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు 4) బోధనోపకరణాలు 5) మూల్యాంకనం మొదలైనవి.

* భాషలకు సంబంధించి ఆంగ్ల మాధ్యమ నేపథ్యమున్న అభ్యర్థులు తెలుగు వ్యాకరణాంశాలు, బోధనా విధానాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బాగా సాధన చేయాలి.
* తెలుగుమీడియంలో చదివినవారు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో గ్రామర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లోపాలను గ్రహిస్తూ, సవరించుకుంటూ, అవసరమైతే ఇతర విద్యార్థులతో పంచుకోవడం ద్వారా మెరుగైన సాధన చేయాలి.

టెట్‌ కఠినమని ఎందుకనిపిస్తోంది?
డీఈడీ, బీఈడీ కోర్సుల్లో పరీక్షలను వ్యాసరూప, సంక్షిప్త సమాధానాలుగా రాస్తారు. జ్ఞాన సంబంధ ప్రశ్నలే ఎక్కువ. గత డీఎస్‌సీ పరీక్షల్లో మూసధోరణికి అలవాటు పడినవారికి ప్రస్తుత టెట్‌ ప్రశ్నపత్రం భిన్నంగా కనపడుతోంది.

ప్రాథమిక భావనలపై ప్రశ్నలు అడగటం, అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పరీక్షించే ప్రశ్నలను రూపొందించడం చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నలు అడిగే తీరును బట్టి నేర్చుకునే విధానాన్ని, ఆ విషయాల వెనకున్న భావనలను, సూత్రాలను అవగాహన చేసుకుంటూ చదవాలి. ఆపై పునశ్చరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

* తమకు ఏ సబ్జెక్టులోనైతే పూర్తి అవగాహన అవసరమనిపిస్తుందో ఆ విషయంపై ఎక్కువ శ్రద్ధ కనబరచాలి; పునశ్చరణ చేయాలి.
* వీలైనంత ఎక్కువగా ప్రామాణిక మాదిరి పరీక్షలు ఎంచుకుని, సాధన చేయాలి.

శక్తిసామర్థ్యాలకు తగిన విధంగా మెదడుకు శిక్షణనివ్వండి. మెరుగైన మార్కులతో టెట్‌ విజయం మీదే అవుతుంది!

ఉపయోగపడే పుస్తకాలు
* డి.ఇడి., బి.ఇడి తెలుగు అకాడమీ పుస్తకాలు (విద్యామనోవిజ్ఞాన శాస్త్రం, బోధనా పద్ధతులు, సమ్మిళిత విద్య)
* జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005 (SCERTప్రచురణ)
* విద్యాహక్కు చట్టం- 2009
* మానవ హక్కుల విద్య (ఉపాధ్యాయ కరదీపిక)

రాజీవ్‌ విద్యామిషన్‌ (SSA) , AP ప్రచురణలు
* కంటెంట్‌ కోసం: ఆంధ్రప్రభుత్వ రాష్ట్ర సిలబస్‌ పాఠ్యపుస్తకాలు


- వి. బ్రహ్మయ్య

Monday 12 March 2012

కొత్త కొలువుల మేఘ సందేశం!

వచ్చే మూడేళ్ళలో 'క్లౌడ్‌ కంప్యూటింగ్‌' మనదేశంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతోంది. మైక్రోసాఫ్ట్‌ అధ్యయనంలో వెల్లడైన విషయమిది! ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించే సత్తా ఉన్న ఈ విభాగం- ఐటీలో అత్యంత వేగంగా ఎదుగుతోంది. దీనిలో ప్రవేశించటానికీ, అవకాశాలను అందిపుచ్చుకోవటానికీ విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఏం చేయాలి?

మీ ఇంట్లో గ్రాఫిక్‌ డిజైనర్‌ ఉన్నాడనుకుందాం. అతనికి తగ్గ సాఫ్ట్‌వేర్స్‌, సిస్టమ్‌ కావాల్సి వస్తుంది. మరొకరికి కార్యాలయ విధుల కోసం మైక్రోసాఫ్ట్‌ అప్లికేషన్లు అవసరమవుతాయి. మీకూ, ఇంజినీరింగ్‌ చదువుతున్న మీ సోదరికీ లినక్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ అవసరం!

ఇలా ప్రతి ఒక్కరి అవసరం కోసం వివిధ అప్లికేషన్లు, ప్లాట్‌ఫార్మ్‌లు కావాలంటే వాటి సిస్టం, లైసెన్సుల కోసం చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంతేనా? పైన చెప్పిన అప్లికేషన్స్‌ అన్నిటికీ కొత్త వెర్షన్స్‌ ప్రతీ రెండు మూడేళ్ళకూ మారిపోతాయి. అంటే ప్రతీ వెర్షన్‌ లైసెన్స్‌కి డబ్బు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఈ ఖర్చును తగ్గించుకునే మార్గం ఏమిటి?

మనకు లినక్స్‌ సిస్టం కావాలంటే లినక్స్‌, విండోస్‌ కావాలంటే విండోస్‌... ఆపై మనకు ఏ అప్లికేషన్‌ కావాలంటే ఆ అప్లికేషన్‌ అవసరమైనప్పుడు ఇస్తూ- ఎంత వాడుకున్నామో అంతటికే చెల్లించే అవకాశాన్ని 'క్లౌడ్‌ కంప్యూటింగ్‌' అందిస్తుంది.


(నెట్‌వర్క్‌ డయాగ్రమ్స్‌లో ఇంటర్నెట్‌ను సూచించటానికి మేఘాన్ని cloud - ఉపయోగిస్తుంటారు).


* మనం డౌన్‌లోడ్‌ చేసుకున్న పాటలు, వీడియోలకు సరిపోయే హార్డ్‌డిస్క్‌ స్థలం సిస్టంలో లేదనుకుంటే కొంత 'స్పేస్‌'ని క్లౌడ్‌లో అద్దెకు తీసుకోవచ్చు.

* ఏదైనా అప్లికేషన్‌ రన్‌ చేయడానికి సిస్టంలో 16 జి.బి. మెమరీ కావాలి. కానీ లేదు. అప్పుడు క్లౌడ్‌లో అంత మెమరీ ఉన్న సిస్టమ్‌ని అద్దెకి తీసుకొని వాడుకోవచ్చు.

* మీ మిత్రుడు ఓ అటాచ్‌మెంట్‌ని ఆపిల్‌ మెషీన్‌ నుంచి పంపించాడు. అది ఆపిల్‌ మెషీన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌లో మాత్రమే ఓపెనవుతుంది. కానీ మీది విండోస్‌ సిస్టం. మీ సిస్టంలో నుంచి క్లౌడ్‌లో ఉన్న ఆపిల్‌ సిస్టంని అద్దెకు తీసుకుని ఆ అప్లికేషన్‌ని చూడొచ్చు. ఎంత సమయం ఆ సిస్టం వాడుతున్నారో అంతే సమయానికి చెల్లింపు చేసే సౌకర్యముంది.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అనే ఈ సాంకేతికత (టెక్నాలజీ) కంప్యూటర్‌- ఐటీ రంగాల్లో పెను మార్పులు తేవటమే కాకుండా కంప్యూటింగ్‌లో ఉన్న ఎన్నో అనవసర ఖర్చులను తగ్గించడానికి ఉపకరిస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిస్తోంది.

మూడు రకాల సేవలు
ఇది ఓ ఉత్పత్తిగా కాకుండా వివిధ వినియోగదారులకు కావల్సిన సేవలను ఏర్పాటు చేసే టెక్నాలజీగా పనిచేస్తుంది. ఆ సేవలు మూడు విధాలు.

1. అవస్థాపన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌): వినియోగదారులకు కావలసిన హార్డ్‌వేర్‌ అవసరాల (స్టోరేజీ, మెమరీ, ప్రాసెస్‌ పవర్‌, మొబైల్‌ వంటివి) కోసం.
2. ప్లాట్‌ఫార్మ్‌: లినక్స్‌, విండోస్‌, ఆండ్రాయిడ్‌, జావా, డాట్‌నెట్‌ లాంటి వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌.
3. అప్లికేషన్లు: డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్‌, లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్ల లాంటి వివిధ సాఫ్ట్‌వేర్లను సేవలుగా అందించడం.

ఇంట్లో విద్యుత్తును ఎంతవరకు వాడుకుంటున్నామో దానికే బిల్లు చెల్లిస్తాం కదా? అలాగే ఈ విధానంలో వివిధ కంప్యూటింగ్‌ సేవలను ఎక్కడి నుంచైనా, ఏ సిస్టం నుంచైనా వాడుకుంటాం; వాడినంతవరకు మాత్రమే చెల్లిస్తాం.

ఎలాంటి కెరియర్లు?
దీని ప్రయోజనాలు చూసి అన్ని ఐటీ కంపెనీలూ, ఎంటర్‌ప్రైజ్‌ ఆధారిత సంస్థలూ క్లౌడ్‌ బేస్డ్‌ అప్లికేషన్లను ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ ప్రస్తుతం తమ వద్దనున్న అప్లికేషన్లని క్లౌడ్‌ బేస్డ్‌గా మార్చటానికీ, కొత్త క్లౌడ్‌ బేస్డ్‌ సొల్యూషన్ల అభివృద్ధికీ ప్రయత్నిస్తున్నాయి కాబట్టి వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి చాలా గిరాకీ ఉంటుంది.

ఇలాంటి అప్లికేషన్‌ బదిలీ కోసం ఐటీ రంగంలో అనుభవమున్నవారు అవసరం. అయితే కొత్త అప్లికేషన్ల అభివృద్ధికి ఎక్కువగా ఫ్రెషర్లను నియమించుకుంటారు. కొత్త సాంకేతికత ఎప్పుడూ కొత్త టాలెంట్‌ని వెతుకుతుంది కాబట్టి ప్రస్తుతం ఇంజినీరింగ్‌, ఐటీ ఆధారిత కోర్సులను ఎంచుకునేవారు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అప్లికేషన్ల మీద ఓ కన్నెయ్యడం చాలా మంచిది.

అంతమాత్రాన ఈ నూతన సాంకేతికత పాత ఉద్యోగాలకు ఎసరు పెడుతుందనేది అపోహే. ఎందుకంటే ఇదొక కొత్త ప్లాట్‌ఫాం, పాత అప్లికేషన్ల కోసం! పాత అప్లికేషన్లన్నీ ఒక సపోర్టుగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి బ్యాకప్‌గా ఉంటాయి. అంటే ఇప్పటివరకు పనిచేసిన వారందరి చేయూతతో కొత్త టాలెంట్‌ని ఈ కొత్త సాంకేతికత ఆహ్వానిస్తుంది.


శిక్షణకు ఏవి ఉత్తమం?
ఇప్పుడిప్పుడే క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌ మీద వివిధ శిక్షణ, కార్యశాలలను విశ్వవిద్యాలయాలు అందజేస్తున్నాయి. వివిధ కమర్షియల్‌ క్లౌడ్స్‌ మీద శిక్షణను సంబంధిత కంపెనీ దగ్గర తీసుకోవడం మంచిది. అంటే వి.ఎం.వేర్‌ క్లౌడ్‌ మీద వి.ఎం. వేర్‌/ అధీకృత కేంద్రాల దగ్గర శిక్షణ పొందడం మేలు.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మీద వివిధ శిక్షణల కోసం ఈ కింద కేంద్రాలను సంప్రదించవచ్చు. కానీ ముందుగా పూర్తి వివరాలు తీసుకొని, ఇంతకుముందు శిక్షణ పొందిన విద్యార్థులతో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకోండి.

Indian Institute of Hardware Technology (IIHT), Bangalore and Hyderabad centres.

7-1-212/6, 1st floor, Lane beside Surya Residency, Shivbagh, Ameerpet, Near S.R. Nagar Police Station, Hyderabad

Knowledge Labs, Chennai.
e-mail: cloud.klabs@gmail.com

NxTech Consulting, Pune
14-A, 2nd Floor, Aditya Shagun mall, Bavdhan, Pune 411021. e-mail: mail@nxtech.in

పైన చెప్పిన అన్ని సంస్థలూ ప్రైవేట్‌వి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కొత్త సాంకేతికత కాబట్టి అక్కడున్న ఫ్యాకల్టీని బట్టి అప్పటికే ఏదయినా ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం ఉన్నవారు సంప్రదించవచ్చు.

సీ-డాక్‌, జేఎన్‌టీయూలలో...
ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సి-డాక్‌) తమ పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ని ఒక మాడ్యూల్‌గా ప్రవేశపెడుతోంది. కొత్తవారికి ఇది ఉపయోగం. జేఎన్‌టీయూ కూడా తమ ఐటీ, కంప్యూటింగ్‌ కోర్సుల్లో క్లౌడ్‌ టెక్నాలజీని ప్రత్యేక, ఐచ్ఛిక మాడ్యూల్స్‌గా ప్రవేశపెట్టింది. సి-డాక్‌, జేఎన్‌టీయూ రెండూ ఈ సాంకేతికత గురించి సదస్సులు, కార్యశాలలు నిర్వహిస్తున్నాయి. ఫ్రెషర్లు, ఇప్పటికే చదువుతున్నవారు ఈ కోర్సులను ఎంచుకోవటం వారి కెరియర్‌కి ప్రయోజనకరం.

ఉద్యోగావకాశాల విషయానికొస్తే... క్లౌడ్‌ సాంకేతికత మీద అవగాహన ఉంటే మౌఖిక పరీక్షలో ఉపయోగమే కాకుండా ఎక్కువ వెయిటేజి దొరుకుతుంది. ఫ్రెషర్ల విషయం సరే, అనుభవం ఉన్నవారి సంగతి? వీరికి 2016 వరకూ 2 లక్షల నుంచి 5 లక్షల వరకూ క్లౌడ్‌లో ఉద్యోగాలున్నాయని వివిధ సర్వేలు చెపుతున్నాయి.



- - Ch.A.S. మూర్తి.

Wednesday 7 March 2012

బ్యాంకు ఉద్యోగాల ప్రకటన చూశారా?



న్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నుంచి తాజాగా నోటిఫికేషన్ వెలువడింది.

 19 పబ్లిక్ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీల నియామానికి నిర్వహించే ఉమ్మడి రాత పరీక్షకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ ఉంటే  ఏ అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ

దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 9.
చివరితేదీ: మార్చి 30.
రాత పరీక్ష: జూన్ 17.

ఈ ప్రకటన  నిన్నటి ఈనాడు లో వచ్చింది.  దాన్నిక్కడ చూడండి.







Tuesday 6 March 2012

మేటి సంస్థల్లో పీజీ కోసం ఉమ్మడి బయోటెక్‌ పరీక్ష!

త్యుత్తమ విద్యాసంస్థల్లో బయోటెక్నాలజీ చదివిన అభ్యర్థులకు మంచి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
 
న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అనేక ప్రముఖ సంస్థల్లో బయోటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (కంబైన్డ్‌ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌- సీబీఈఈ)ను నిర్వహిస్తోంది.

దేశంలోని 32 ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ పరీక్ష ఆధారంగా ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. సరైన ప్రణాళిక రూపొందించుకొని కృషి చేస్తే మంచి యూనివర్సిటీలో సీటు సాధించవచ్చు.

బయోటెక్నాలజీలో ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహిస్తోన్న దేశాల్లో భారత్‌ అగ్రశ్రేణిలో ఉంది. మానవ జీనోమ్‌ ప్రాజెక్టు, మూలకణ పరిశోధన, జన్యు పరివర్తిత పంటలకు సంబంధించి మనదేశంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) ఏర్పాటైంది.

  బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేయాలనుకునే విద్యార్థులు ఈ విభాగం అనేక రకాల ఫెలోషిప్‌లను అందిస్తోంది. సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని పరిశోధన సంస్థల్లో కూడా బయోటెక్నాలజీ సంబంధిత పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో ప్రవేశానికి తొలిమెట్టు లాంటిది జేఎన్‌యూ బయోటెక్‌ ఎంట్రన్స్‌ పరీక్ష. దీని ద్వారా మంచి సంస్థలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తే... సీఎస్‌ఐఆర్‌, డీబీటీ ఫెలోషిప్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తేలిక.


సీబీఈఈ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లోని బయోటెక్నాలజీ కోర్సుల్లో సుమారు 400 సీట్లు భర్తీకానున్నాయి. వీటిలో ప్రవేశం పొందినవారికి నెలకు రూ.800 నుంచి రూ.1200 వరకు ఫెలోషిప్‌ లభిస్తుంది. ఎంపిక సీబీఈఈలో ర్యాంకు ఆధారంగానే ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులో యూనివర్సిటీల ఆప్షన్స్‌ను గుర్తించాలి. జులై మొదటి లేదా రెండోవారంలో అభ్యర్థుల ర్యాంకు, ఆప్షన్స్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

బయోటెక్నాలజీ అభ్యర్థులకు విదేశాల్లో కూడా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలుంటాయి. మనదేశంలో బెంగళూరు బయోటెక్‌ పార్క్‌, లక్నో బయోటెక్‌ పార్క్‌, గుర్గావ్‌ బయోటెక్‌ పార్క్‌, హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌... ఇలా అనేక కేంద్రాలు ఏర్పడుతున్నాయి. బయోటెక్నాలజీ అభ్యర్థులకు వీటిలో ఉద్యోగ అవకాశాలుంటాయి.

సీబీఈఈ ద్వారా అభ్యర్థులు బయోటెక్నాలజీలో ఆధునిక స్పెషలైజేషన్లను కూడా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు గోవా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. మెరైన్‌ బయోటెక్నాలజీ కోర్సును నిర్వహిస్తున్నాయి. సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీని అందిస్తోంది. అస్సాంలోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌సి. మాలెక్యులర్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ ఉంది. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సంస్థలు ఈ ప్రత్యేక కోర్సులను నిర్వహిస్తున్నాయి. బయోటెక్‌ కోర్సులు చేసినవారికి ప్రైవేటు రంగంలో స్థాపించిన బెంగళూరు, లక్నో, గుర్గావ్‌లలోని బయోటెక్‌ పార్కులు, హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌ లాంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది?
సీబీఈఈ పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి.

* పార్ట్‌ - ఎ: దీనిలో +2 స్థాయిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, బయాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 60 మార్కులకు ఈ విభాగం ఉంటుంది. తప్పు సమాధానానికి అరమార్కు తీసేస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 40 ప్రశ్నలకు అభ్యర్థులు అందరూ సమాధానాలు గుర్తించాలి. సెక్షన్‌-2 (20 ప్రశ్నలు), సెక్షన్‌-3 (20 ప్రశ్నలు)లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. బయాలజీ విద్యార్థులు సెక్షన్‌-3, మేథ్స్‌ అభ్యర్థులు సెక్షన్‌-2లోని ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు.

* పార్ట్‌ - బి: ఇందులో డిగ్రీ స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. మొత్తం 180 మార్కులకు ఈ పేపర్‌ ఉంటుంది. ఫిజిక్స్‌ + మేథ్స్‌ నుంచి 40 ప్రశ్నలు, బయాలజీ (బోటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ) నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. 60 ప్రశ్నలకంటే ఎక్కువగా సమాధానాలు గుర్తించకూడదు. ఒకవేళ గుర్తించినా వాటిని పరిగణనలోకి తీసుకోరు. మొదటి 60 ప్రశ్నలనే మూల్యాంకనం చేస్తారు. తప్పు సమాధానానికి ఒక మార్కు తీసేస్తారు.

సన్నద్ధత ఎలా?
సీబీఈఈ రాయబోతున్న అభ్యర్థులు పరీక్ష సిలబస్‌ను, ప్రశ్నల స్వభావాన్ని క్షుణ్నంగా తెలుసుకొని ప్రిపరేషన్‌ ప్రణాళిక తయారు చేసుకోవాలి. పరీక్షలో ఏ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది తెలుసుకోవడానికి పాత ప్రశ్నపత్రాలను చూడవచ్చు. అంశాల వారీగా మంచి మెటీరియల్‌ను సేకరించుకోవాలి. సబ్జెక్టులోని ప్రాథమిక భావనలపై పట్టు ఉంటేనే ఈ పరీక్షలో మంచి ర్యాంకు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది. సబ్జెక్టును వివరంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. చదివిన అంశాన్ని వాస్తవిక పరిస్థితులకు అన్వయించి లోతుగా అర్థం చేసుకోవాలి.

పార్ట్‌- ఎ: ఇందులో మంచి మార్కులు తెచ్చుకోవడానికి సీబీఎస్‌ఈ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పుస్తకాలు ఉపయోగపడతాయి. తెలుగు అకాడమీ ప్రచురించే ఇంటర్మీడియట్‌ పుస్తకాలు కూడా చదవచ్చు. డిగ్రీలో బీజడ్‌సీ తీసుకున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సిలబస్‌ను కూడా చదవాలి. ఫిజిక్స్‌లో మెకానిక్స్‌, ఎలక్ట్రో స్టాట్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌; మ్యాథ్స్‌లో మాత్రికలు, డెరివేటివ్స్‌, కాలిక్యులస్‌, త్రికోణమితి మొదలైనవి ముఖ్యమైన అంశాలు.

పార్ట్‌-బి: దీని కోసం చదివేటప్పుడు బయాలజీ అభ్యర్థులు.... ఆధునిక బయాలజీలో బయో టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీఎస్సీలో వీటిని చదివుంటే బోటనీ, జువాలజీలపై శ్రద్ధపెట్టాలి. బయో కెమిస్ట్రీలో... మెటబాలిజమ్స్‌, ఎంజైమ్స్‌, ఇమ్యునాలజీ; మైక్రో బయాలజీలో జనరల్‌, ఇండస్ట్రియల్‌, అప్లయిడ్‌ మైక్రోబయాలజీ, మైక్రోబియల్‌ ఇంటరాక్షన్స్‌; మాలెక్యులర్‌ బయాలజీ, జెనెటిక్స్‌ సిలబస్‌లో మెండిలీయన్‌ జెనెటిక్స్‌, ట్రాన్‌స్క్రిప్షన్‌, టాన్స్‌లేషన్‌, ఆర్‌.డి.ఎన్‌.ఎ. టెక్నాలజీ, మాలెక్యులర్‌ టెక్నిక్స్‌ అంశాలను బాగా నేర్చుకోవాలి.

* వృక్షశాస్త్రంలో... వృక్ష శరీర ధర్మ శాస్త్రం, ఎకాలజీ, పరిణామం; జంతుశాస్త్రంలో... జంతు శరీర ధర్మశాస్త్రం, ఏనిమల్‌ బయోటెక్నాలజీ, పర్యావరణ జీవశాస్త్రం; ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో... రియాక్టివిటీ, రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపి; ఫిజికల్‌ కెమిస్ట్రీలో కెమికల్‌ కైనెటిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ద్రావణాలు; ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, ఎం.ఒ.టి. అంశాలు ముఖ్యమైనవి.

* భౌతిక శాస్త్రంలో విద్యుత్తు, ఆప్టిక్స్‌, తరంగాలు, అసిలేషన్స్‌, థర్మోడైనమిక్స్‌; గణితంలో డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, ఇంటెగ్రేషన్స్‌, కోర్డానేట్‌ జామెట్రీ అంశాలు ముఖ్యమైనవి.

ఎన్ని మార్కులు వస్తే...
సీబీఈఈ పరీక్ష మొత్తం 240 మార్కులకు ఉంటుంది. ఎ, బి విభాగాల్లో వచ్చిన మార్కులను కలిపి ర్యాంకును కేటాయిస్తారు. మంచి యూనివర్సిటీలో సీటు సాధించాలంటే 150పైనే మార్కులు తెచ్చుకోవాలి. ప్రశ్న పత్రం స్థాయి, పోటీని బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మరిన్ని మార్కులు స్కోర్‌ చేయవచ్చు. ఈ రెండు సబ్జెక్టుల నుంచే సుమారు 220 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల ర్యాంకును నిర్ణయించడంలో ఈ సబ్జెక్టులు చాలా కీలకం.


ఎం.ఎస్‌సి.తోపాటు అనేక సంస్థలు ఎం.టెక్‌. బయోటెక్నాలజీ, ఎం.ఎస్‌సి. అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, వెటర్నరీ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా సీబీఈఈ మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సీబీఈఈ మార్కుల ఆధారంగా అగ్రిబయోటెక్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

వీటికి కావలసిన అర్హతలు, ఇతర వివరాలు జేఎన్‌యూ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

- ఎస్. కిరణ్ కుమార్