ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 9 September 2013

ఎంబీఏకు మ్యాట్‌ మార్గం


ఎంబీఏ ప్రవేశానికి ఏడాదికి నాలుగుసార్లు జరిగే జాతీయస్థాయి ప్రవేశపరీక్ష 'మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌' (MAT). ప్రసిద్ధ బీ స్కూల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 600 విద్యాసంస్థలు ఈ పరీక్ష స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. డిసెంబర్‌ మ్యాట్‌ ప్రకటన వెలువడిన సందర్భంగా... దీనిలో మెరుగైన ర్యాంకు సాధించటానికి ఏ అంశాలపౖెె దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!

డిగ్రీ ఉత్తీర్ణులే కాకుండా, చివరి సంవత్సరం విద్యార్థులు కూడా మ్యాట్‌ రాయవచ్చు. దీనికి వయః పరిమితి ఏమీ లేదు. పేపర్‌ ఆధారితంగా, కంప్యూటర్‌ ఆధారితంగా- రెండు రకాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు.

మ్యాట్‌ రాయడానికి క్యాట్‌లో మాదిరి కనీస మార్కుల శాతం నిబంధన ఏమీ లేదు. అందువల్ల డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినవారు కూడా మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో దరఖాస్తు చేసుకోవటానికి ఈ పరీక్ష ఓ చక్కని మార్గంగా ఉంది. ప్రతి ప్రవేశపరీక్షా ఆన్‌లైన్‌ పద్ధతిలోకి మారుతున్న ఈ రోజుల్లో ఇంకా కొందరు విద్యార్థులకు కంప్యూటర్‌ చేరువ కాలేదు. ఇలాంటివారికి పేపర్‌ బేస్డ్‌ పద్ధతిలో 'మ్యాట్‌' నిర్వహించటం అనుకూలం. మల్టిపుల్‌ చాయిస్‌ సమాధానాలుండే ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలను సాధించాల్సివుంటుంది. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. తప్పు సమాధానం రాస్తే 1/4 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష అభ్యర్థి సాధారణ సామర్థాన్ని పరీక్షించేలా రూపొందింది.

డిసెంబరు 1న మ్యాట్‌ను పేపర్‌ ఆధారితంగా నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు పరిమితంగా ఉంటే ఈ పరీక్ష కూడా డిసెంబరు 1నే జరుగుతుంది. లేకుంటే డిసెంబరు 7న నిర్వహిస్తారు.
విద్యార్థులు అక్టోబరు మొదటి వారం నుంచి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పేపర్‌ ఆధారిత పరీక్షకు అడ్మిట్‌ కార్డులను AIMA వెబ్‌సైట్‌ http://apps.aima.in/matadmitcard.aspxలో నవంబరు 23 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎలా సంసిద్ధం కావాలి?
విద్యార్థులు మొదట మాక్‌ మ్యాట్‌ రాయాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా నమూనా మ్యాట్‌ పరీక్షను రాసే వీలుంది. ఇలా చేస్తే పరీక్ష పద్ధతి అవగాహనకు వస్తుంది. దానికి అనుగుణంగా ఎలా చదవాలో ప్రణాళికీకరించుకోవచ్చు. నమూనా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినపుడు నిరాశపడకూడదు. ఈ పరీక్ష రాయటం స్కోరు కోసం కాదని గుర్తించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నదీ, వేటిలో పటిష్ఠంగా ఉన్నదీ గుర్తించటానికి ఈ పరీక్ష ఫలితాలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.

ప్రతి టాపిక్‌లోనూ కాన్సెప్ట్‌పై అవగాహన పెంచుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు- రేషియోస్‌ అనే అధ్యాయంలో కీలకాంశం ఏమిటో గ్రహించాలి. తర్వాత ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని రకాల ప్రశ్నలకూ జవాబులు రాసేలా తయారవ్వాలి. మళ్ళీ ఇదే అధ్యాయంలో మరోసారి ఎక్సర్‌సైజులు చేయాలి. ఈసారి సమయం చూసుకోవాలి. 40 నిమిషాలకు 40 మాథ్స్‌ ప్రశ్నలంటే నిమిషానికి ఓ ప్రశ్న. ఒక ఎక్సర్‌సైజులో 10 ప్రశ్నలుంటే వాటిని 10 నిమిషాల్లో చేయటానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు నిమిషం కంటే ఎక్కువ వ్యవధి పట్టవచ్చు; కొన్నిటికి నిమిషం కంటే తక్కువ సమయం పట్టొచ్చు. మొత్తమ్మీద వాటన్నిటినీ 10 నిమిషాల్లో పూర్తిచేయటం ముఖ్యం. ఈ రకంగా చేస్తే వేగం, కచ్చితత్వం కూడా పెరుగుతాయి. ఒక ప్రధానాంశంలోని అన్ని టాపిక్స్‌లోని కాన్సెప్టులపై పట్టు వచ్చాక, వాటన్నిటిపై ఓ పరీక్ష రాయాలి. ఉదాహరణతో చెప్పాలంటే- అరిథ్‌మెటిక్‌లో రేషియో, పర్సంటేజి, సింపుల్‌ ఇంటరెస్ట్‌, కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, వర్క్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఉంటాయి. ఈ కాన్సెప్టులపై అవగాహన సాధించాక అరిథ్‌మెటిక్‌లో పరీక్ష రాసి పరిశీలించుకోవాలి. నేర్చుకున్న అంశాలు దీనివల్ల మరింత పటిష్ఠమవుతాయి. విభిన్నమైన ప్రశ్నల నమూనాలను నిర్దిష్ట వ్యవధిలోనే చేయగలుగుతారు.

జనరల్‌ అవేర్‌నెస్‌ మినహాయించి మిగిలిన మూడు విభాగాలకూ ఇదే తీరు పాటించాలి. ఒక్కో విభాగంపై పట్టు సాధించాక పూర్తి నిడివి పరీక్ష అభ్యాసం చేయటం మొదలుపెట్టాలి. ఒకేసారి రెండున్నర గంటల సమయంలో పరీక్ష రాయటానికి శక్తి, సహనం అవసరమవుతాయి. ఇలాంటి నమూనా పరీక్షలు రాశాక సరైన, తప్పు జవాబులు రెంటినీ విశ్లేషించుకోవాలి. ఫలితంగా స్కోరు క్రమంగా మెరుగుపడుతుంది. అసలైన పరీక్షలో సందేహాలకు అతీతంగా మంచి స్కోరు సాధ్యమవుతుంది.

సారాంశం ఏమిటంటే... కాన్సెప్టులపై మొదట దృష్టిపెట్టాలి. తర్వాత ఎక్సర్‌సైజులు చేయాలి. క్రమంగా పూర్తినిడివి పరీక్షలు రాసి, నైపుణ్యాలూ, వ్యూహాలకు పదునుపెట్టుకోవాలి.

విభాగాలవారీగా  సన్నద్ధత  సూచనలు www.eenadu.net చదువు విభాగంలో  చూడవచ్చు.

Tuesday 9 July 2013

నేనో ఐఐటియన్‌ని... కానీ అందుకు గర్వపడటంలేదు!

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు   తెచ్చుకున్నంతమాత్రానే భవిత ఉజ్వలంగా మారిపోయినట్టు కాదు. డ్రాపవుట్లుగా మిగిలే ప్రమాదం... పొంచే వుంటుంది! విద్యార్థులు అక్కడి క్యాంపస్‌ జీవితం గురించి ముందస్తుగానే ఒక అవగాహనతో ఉండటం మేలు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ రూర్కీ ఐఐటీలో పేపర్‌ అండ్‌ పల్ప్‌ టెక్నాలజీ చదువుతున్న నూతక్కి శరత్‌ తమ క్యాంపస్‌ పరిస్థితులను ఇలా విశ్లేషిస్తున్నాడు...


నదేశంలో ప్రాముఖ్యం కలిగిన, ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఐఐటీలు. అందులో ప్రవేశించాలనేది ఎందరో విద్యార్థులు స్వప్నించే విశేషం. ఆ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి కఠినమైన శిక్షణ పొందుతారు. నేను జేఈఈలో సఫలమైన వాళ్ళలో ఒకణ్ణి. ఈ ప్రవేశపరీక్ష ప్రాతిపదికగా సీట్లు కేటాయించే సంస్థలు పదిహేడు. అందులో పదిహేను ఐఐటీలు. మిగతా రెండు కూడా వీటితో పోలిస్తే ఇంచుమించు అదే స్థాయిలోనివే. ఈ సంస్థలు విద్యార్థులకు అత్యున్నత సదుపాయాలు, మంచి ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులను అందిస్తాయి. ఇవన్నీ నిజాలే అయినప్పటికీ, విద్యార్థులూ, తల్లిదండ్రులూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకా వేరే ఉన్నాయి.

పైన ఉన్న శీర్షిక నేనేమి రాయబోతున్నానో చెబుతుంది. అవును, సాధించినదానికి నేనేమీ గర్వపడడం లేదు. అందరిలాగే నేనూ ఈ ప్రవేశాన్ని ఒక కలగా భావించాను. క్యాంపస్‌లోకి ప్రవేశించేవరకు అంతా బాగానే ఉంది. నిజానికి నాకు ఎన్‌ఐటీ, జంషెడ్‌పూర్‌లో ఇంకో అవకాశం ఉంది. అది ఉపయోగించుకోలేకపోయాను.

'ఐఐటియన్స్‌ అందరికీ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి' అని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. ఈ అభిప్రాయం సరైనది కాదు. అది కేవలం మన బ్రాంచి మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి 'ఐఐటియన్లందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయి' అనేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే అనేక ఇతర ప్రైవేటు కళాశాలల విషయంలో కూడా ఇదే నిజం.

ఏ బ్రాంచి అయినా సరే, ఐఐటీల నుంచి ఉద్యోగాలు పొందిన వారు సగటున సంవత్సరానికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. 'అమృత' లాంటి ప్రైవేటు కళాశాలల్లో చదివినవారు కూడా దాదాపుగా ఇంతే సంపాదిస్తున్నారు. మీరు వినే- సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయల ఉద్యోగాలు వందలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దానికోసం మన జీవితాన్ని పణంగా పెట్టలేము, అవును కదా?

కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌ (ఈసీఈ) ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఈ బ్రాంచుల్లో ఉంటేనే అందరూ గొప్పగా అనుకునే ఐఐటియన్‌ కింద లెక్క. నేను ఈ సంస్థలు నాణ్యత లేవని చెప్పటం లేదు. కానీ ఎక్కువగా ఆశించి నిరాశ పడవద్దని మాత్రమే చెబుతున్నాను. నా అభిప్రాయాలు ప్రతికూలంగా ఉన్నట్లు మీకు అనిపించినా, నియామకాలకు సంబంధించి నేను చెప్పదలచుకున్నదీ, నాకు అనిపించిందీ మాత్రం ఇదే!

అత్యున్నత వసతులు
ఇక క్యాంపస్‌ జీవితానికి వస్తే భారతదేశంలోని మిగతా ఇంజినీరింగ్‌ కళాశాలల కన్నా అత్యున్నత సౌకర్యాలున్న మాట వాస్తవం. ఇక్కడ విద్యార్థులకు 'ఇంటర్న్స్‌' ఇంకా బాగుంటాయి.

వ్యక్తిగత, వ్యక్తిత్వ అభివృద్ధికీ, నైపుణ్యాలను పెంచుకోవడానికీ ఇక్కడ అనంతమైన అవకాశాలుంటాయి. రకరకాల హాబీల క్లబ్బుల్లో పాల్గొనటం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఆ సంగతి చాలామందికి వాళ్ల కోర్సు పూర్తి అయ్యాక కానీ అర్థం కాదు. అదృష్టవశాత్తూ నాకది అర్థమైంది. పోటీపడిన ప్రతి అంశంలోనూ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. కేవలం పాల్గొన్నందుకు కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. అవి తరువాత మన రెజ్యూమె తయారు చేసుకునేటప్పుడు ఉద్యోగావకాశాలకు చాలా సహాయకరంగా ఉంటాయి.

బోధనను అధికంగా ఆశించకండి
ఇక ఉపాధ్యాయుల విషయం. ఈ విషయంలో కూడా ఎక్కువ ఆశించనవసరం లేదు. ఎవరికి వారు చదువుకోవాల్సిందే. సబ్జెక్టు వరకూ చూస్తే వాళ్లు అత్యున్నత ప్రమాణాలు కలవారే అనడంలో సందేహం లేదు. కానీ వాళ్లలో కొందరికి బోధించడంలో నైపుణ్యం లేదు. మీరు దక్షిణ రాష్ట్రాలవారై ఉండి హిందీ అర్థం కానివారైతే, ఇలాంటి విద్యార్థులు ఉత్తర రాష్ట్రాల్లో చేరకముందే హిందీ నేర్చుకోవడం మంచిది. మీ ప్రొఫెసర్‌ అర్థం చేసుకోగల ఇంగ్లిషు మాట్లాడతారనీ, కనీసం ఇంగ్లిషయినా మాట్లాడతారని మాత్రం ఆశించవద్దు.

నా ఇంటర్‌ను ఓ కార్పొరేట్‌ కళాశాలలో పూర్తిచేశాను. అక్కడ చదివిన మిగతావారిలాగే అదొక విద్యాసంస్థలా కాక జైలులాగే నాకు అనిపించేది. అలాంటి వాతావరణం నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా వాతావరణంలోకి రావడంతో నాకు వూపిరి ఆడినట్లయింది. అక్కడ ఇరవై నాలుగు గంటలు చదువు, ఇక్కడ కావాల్సినంత స్వేచ్ఛ. ఏమైనా చేసే అవకాశం ఉందిక్కడ. అది కొంతమందిని తప్పుదారి పట్టిస్తుంది. ఐఐటీ డ్రాప్‌ అవుట్ల విషయంలో మన ఆంధ్ర విద్యార్థులు పేరు తెచ్చుకున్నారని అందరికీ తెలిసిన విషయమే.

ఇక్కడ లభించే స్వేచ్ఛను నేను తప్పు పట్టడం లేదు. అక్కడి జైలులాంటి జీవితాన్ని మాత్రమే తప్పు పడుతున్నాను. ఇంటర్‌లో పడిన పునాది జేఈఈని విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా సహాయపడింది. అందులో సందేహం లేదు. కానీ జీవితానికి అదే సరిపోదు కదా!

రూర్కీ విషయానికి వస్తే ఒక మిడ్‌టర్మ్‌ పరీక్ష మాత్రమే ఉంటుంది. 25 శాతం మార్కులు క్లాస్‌వర్క్‌ సెషనల్స్‌కి కేటాయిస్తారు. ఇది ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోలాగా ఉంటుంది. కానీ 25 శాతం అనేది సగటు సంఖ్య. తుది పరీక్షలకు 50 నుంచి 40 శాతం మాత్రమే కేటాయిస్తారు.


ఏ ఐఐటీలో అయినా గ్రేడ్స్‌ సాపేక్షిక ప్రాతిపదికన కేటాయిస్తారు. A+ అంటే పది పాయింట్లు. దానిని అనుసరించే A, B+, B, C+, C, D, F ఉంటాయి. అంటే 9, 8, 7, 6, 5, 4, 0 పాయింట్లు. ప్రతి సబ్జెక్టుకూ క్రెడిట్లు ఉంటాయి. ఉదాహరణకు లెక్కలకి నాలుగు క్రెడిట్లు. లెక్కల్లో B+ వస్తే దాని పాయింట్లు 8, క్రెడిట్ల చేత గుణీకరించి ఆ సబ్జెక్టు క్రెడిట్లు 8x4= 32 వస్తాయి. ఈ సబ్జెక్టు క్రెడిట్లు అన్నీ కూడి మొత్తం క్రెడిట్లతో భాగిస్తే చివరి సీజీపీఏ వస్తుంది. మనకొచ్చిన బ్రాంచితో సంతృప్తి చెందనివారికి బ్రాంచి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్లాసులో టాప్‌ 2% సీజీపీఏ స్కోరులో ఉండాలి.

విఫలమైతే పీడకలే
బ్యాక్‌లాగ్స్‌- ఐఐటీయన్‌ జీవితంలో భయోత్పాతం కలిగించే సంగతి ఇది. బ్యాక్‌లాగ్‌ లేకపోతే జీవితం ఇక్కడ సాఫీగా నడిచిపోతుంది. కానీ ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యావంటే అది ఒక పీడ కల అయిపోతుంది. బ్యాక్‌లాగ్‌ అసలేవీ లేకపోతే ఉపయోగమా అంటే అదీ కాదు. ఒక సబ్జెక్టులో ఉత్త D తో పాసైతే ఉపయోగం ఉండదు. D అంటే 10కి 4 సీజీపీఏ వచ్చినట్లు లెక్క. ప్లేస్‌మెంట్‌ దొరకాలంటే కనీసం C+ తెచ్చుకోవాల్సి ఉండగా, ఏ బ్యాక్‌లాగూ లేకుండా ఉత్త D తెచ్చుకుంటే ఫలితం ఏముంటుంది గనక?

చివరగా- మిమ్మల్ని కేవలం జేఈఈ పరీక్షకు మాత్రమే కాకుండా ఐఐటీ జీవితానికి కూడా తయారుకమ్మని నా సలహా. ఒక టర్మ్‌లో మీరు ఏమైనా చెయ్యండి. ఏమి చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కనీసం పరీక్షలకు ఒక వారం ముందు చదవటం మొదలుపెట్టినా B కానీ B+ కానీ తెచ్చుకోవచ్చు. అలాగే ఐఐటీలో ఏ బ్రాంచి అయినా మంచిదే అనేది అపోహ మాత్రమే. పాత ఎన్‌ఐటీల్లో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో సీటు వస్తే గనక అది ఐఐటీల్లో చిన్న బ్రాంచి కంటే చాలా మెరుగు.

నా అభిప్రాయాలు మీలో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తూ... సెలవ్‌. 

Monday 24 June 2013

ఎలా సాధించారు... ఈ టాపర్లు?

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు తెచ్చుకోవటమే గొప్ప విజయం. అలాంటిది ఆ ప్రవేశపరీక్షలో అందరికంటే ముందు నిలిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించటం మామూలు విషయం కాదు! దేశవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించే జేఈఈ  అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో- భావనలపై స్పష్టత, లోతైన అవగాహన, అనువర్తన సామర్థ్యాలు ప్రధానం. వీటి సమ్మేళనంతో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను కైవసం చేసుకున్న సాయి సందీప్‌, రవిచంద్రలు 'చదువు'తో తమ అనుభవాలు పంచుకున్నారు!


కల నిజమైంది!
రాష్ట్రస్థాయి ఎంసెట్‌లో స్టేట్‌ టాపర్‌... జాతీయస్థాయి ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆలిండియా టాపర్‌! విశిష్టమైన ఈ 'డబుల్‌' సాధించిన పి. సాయిసందీప్‌రెడ్డి 'మొదటి నుంచీ నా గురి ఐఐటీపైనే' అని ముందే సంకల్పం ప్రకటించాడు. తన కలను అపురూప స్థాయిలో నిజం చేసుకున్నాడు. తన విజయప్రస్థానం ఎలా సాగిందో అతడి మాటల్లోనే...

 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు ముందుగా వూహించిందే! ఫలితం తెలిశాక ఆరు సంవత్సరాల కష్టం ఫలించిందని సంతృప్తి కలిగింది. అయితే ఇదంతా ఇష్టపడే చదివాను.

జేఈఈ మెయిన్స్‌కు వారం ముందునుంచీ నా ఆరోగ్యం బాగా లేదు. దీంతో పరీక్ష సరిగా రాయక ఫలితం ఆశించినట్టు రాలేదు. విచారంగా అనిపించింది. ఇలాంటి సమయంలో నిరాశతో కుంగిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకవసరమైన ప్రోత్సాహాన్ని ఆ సమయంలో అమ్మా నాన్నా అందించారు. దీంతో పట్టుదలగా నెలన్నర చదివాను.

మ్యాథ్స్‌లో ఒక జవాబును తప్పుగా బబ్లింగ్‌ చేశాను. అది గమనించినప్పటికీ బాల్‌పెన్‌ వాడాలనే నిబంధన వల్ల ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం లేకుండాపోయింది. ఐదు మార్కులు పోయాయి. బాధ వేసినా 'పోతే పోయింది' అని సమాధానపర్చుకున్నాను. ఆ ప్రభావం మిగతావాటిపై పడకుండా జాగ్రత్తపడ్డాను. ఫస్ట్‌ర్యాంకు వచ్చాక మాత్రం ఆ లోటు పోయింది!

ఈ ర్యాంకు సాధించటానికి నా సరదాలన్నీ పూర్తిగా త్యాగం చేశాననుకోవద్దు. రెండు వారాలకో సినిమా చూసేవాణ్ణి. హారీపోటర్‌ కథల పుస్తకాలు ఇష్టంగా చదివేవాణ్ణి.

గుడివాడ విశ్వభారతిలో ఏడోతరగతి నుంచే ఈ ఐఐటీ ప్రయాణానికి తొలి అడుగులు పడ్డాయి. నాకు అబ్దుల్‌కలామ్‌ స్ఫూర్తి. ఇంజినీర్‌ని కావాలని మొదట్నుంచీ లక్ష్యంగా ఉండేది. అందుకే స్కూల్‌ రోజుల్లో కూడా గణితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాణ్ణి. ఇక ఐఐటీ ప్రవేశపరీక్షకు అసలైన కృషి శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం నుంచీ మొదలైంది.

కృషే ప్రధానం
ర్యాంకుల మీద మొదట్లో నాకేమీ దృష్టి లేదు. సిలబస్‌ మొత్తం పూర్తిగా అర్థం చేసుకోవాలి. చేతనైనంత వరకూ బాగా కృషి చేయాలి అనేదే ప్రధానంగా ఉండేది. ఏ విద్యార్థికైనా సెకండియర్‌కి వచ్చేటప్పటికి ఒక అవగాహన వస్తుంది. ఏ టాపిక్‌ రిఫర్‌ చేయాలి, ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, రివిజన్‌కు ఎంత సమయం కేటాయించాలి... ఇవన్నీ తెలుస్తాయి.

నా ఉద్దేశంలో ఐఐటీ ప్రవేశపరీక్షలో విజయానికి పాత్ర వహించే బోధన, ప్రిపరేషన్ల నిష్పత్తి 10: 90. అంటే సరైన మార్గదర్శకత్వంలో విద్యార్థి చాల సాధన చేయాలి. ఐఐటీ ప్రవేశపరీక్షలో కెమిస్ట్రీ స్కోరింగ్‌.. ముఖ్యంగా ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ సమయం దీనికి కేటాయించి చదివాను.

ఐఐటీలో పరీక్షావిధానం వూహించినట్టుగా ఉండదు. అనూహ్యమైన తీరులో ప్రశ్నలు వచ్చినా, దానికి సిద్ధంగా ఉండాలి. భయపడకుండా, ఒత్తిడికి గురవకుండా ఆ పరిస్థితికి తగ్గట్టుగా తయారై పరీక్ష రాయాలి.

ఆశావహుల సంగతి
ఐఐటీకి గురిపెడితే ఎంసెట్‌ లాంటి పరీక్షల్లోనైనా ర్యాంకు వస్తుందని ఐఐటీకి సన్నద్ధం కావడం మంచిది కాదు. అప్పుడు రెంటికీ దూరం కావాల్సివస్తుంది. ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేసుకుని దేనికి సన్నద్ధం కావాలో నిర్ణయించుకోవాలి.

ఐఐటీ ప్రవేశపరీక్షకు సిద్ధమవ్వాలనుకున్నవారికి కనీస స్థాయి తెలివితేటలు, కష్టపడే తత్వం అవసరం. సగటున రోజుకు 12 గంటలు చదవగలగాలి. మొదట లక్ష్యం పెట్టుకుని, టాపిక్‌వారీగా ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి. లోతుగా చదవాలి. పూర్తి ఏకాగ్రత అవసరం.

మొదటి సంవత్సరంలో సిలబస్‌ అన్ని అంశాలూ చదవాలి. తర్వాత కొన్ని టాపిక్స్‌ మీద కేంద్రీకరించి లోతుగా అధ్యయనం చేయాలి. ఏ విద్యార్థికైనా కొన్ని కాన్సెప్టులు అర్థం కాకపోవచ్చు. అది మామూలే. ఆ సందేహాలను అధ్యాపకుల దగ్గర తీర్చుకోవాలి. స్పష్టత తెచ్చుకోవాలి. గ్రాండ్‌ టెస్టుల ద్వారా తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ కృషి చేయాలో తెలుసుకోవచ్చు.

ఎలా చదివానంటే..
ఐఐటీ ప్రవేశపరీక్షకు ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు సరిపోవు. వాటిలో ప్రాథమికాంశాలుంటాయి. వాటినే ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ కోసం లోతుగా అధ్యయనం చేశాను. కళాశాల వారిచ్చిన మెటీరియల్‌కు అదనంగా కొన్ని పుస్తకాలు చదివాను.

మ్యాథ్స్‌: ఆర్‌.డి. శర్మ, ఎంటీజీ పబ్లికేషన్స్‌ సిరీస్‌ ఫిజిక్స్‌: హెచ్‌సీ వర్మ, ఐ.ఇ. ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: అట్కిన్స్‌, వేడ్‌ జూనియర్‌, జేడీ లీ

పాత ప్రశ్నపత్రాలను సాధన చేశాను. అన్ని సబ్జెక్టులకూ క్లుప్తంగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. రివిజన్‌లో- చాలా వేగంగా ఓసారి చూసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడింది.

ఏమిటి తేడా?
ఇంటర్మీడియట్‌లో/ ఎంసెట్‌లో తెలిసినవే వస్తాయి. చదివిన అంశాలను అప్త్లె చేయాల్సిన అవసరం ఉండదు. ఐఐటీ ప్రవేశపరీక్ష అలా కాదు. దీనిలో అప్లికేషన్‌ ప్రధానం. చదివిన కాన్సెప్టుల్ని అప్త్లె చేయగలగాలి.

ఇంటర్మీడియట్‌ తరహా పరీక్షకు అలవాటు పడటంవల్లనే విద్యార్థులకు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఎంతో క్లిష్టం అనిపిస్తోంది. నిజానికిది అంత కష్టం కాదు. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఈ కంటే తక్కువే. చక్కని ప్రణాళికతో సమయం వృథా చేయకుండా కష్టపడితే ఎవరైనా ఐఐటీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించవచ్చు.

saisandeep192@gmail.com



కోరిక తీరింది!
ఎంసెట్‌లో తొమ్మిదో ర్యాంకు...  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మరింత ముందుకు దూసుకువెళ్ళి ద్వితీయ ర్యాంకును సాధించాడు అద్దంకి రవిచంద్ర. వివిధ ప్రతిభా పరీక్షల్లో ఉపకార వేతనాలూ, అవార్డులూ, స్వర్ణ పతకాలూ పొందటం ఇతడి ప్రత్యేకత. ఐఐటీ ప్రవేశపరీక్షలో మేటి ర్యాంకు తెచ్చుకోవాలన్న చిరకాల లక్ష్యం చేరుకున్న రవిచంద్ర సన్నద్ధత తీరు... ఇతర విశేషాలూ తన మాటల్లోనే తెలుసుకుందాం!


నా ఐఐటీ ప్రయాణం హైదరాబాద్‌ నల్లకుంటలో శర్మ ఇన్‌స్టిట్యూట్‌లో ఎనిమిదో తరగతి నుంచి మొదలైంది. సీరియస్‌గా మాత్రం ఇంటర్మీడియట్‌ నుంచే...! ఐఐటీ ప్రవేశపరీక్షలో టాప్‌ టెన్‌లో ఏదో ఒక ర్యాంకు తెచ్చుకోవటం మొదట్నుంచీ నా లక్ష్యంగా ఉండేది. దీనికి ఉపాధ్యాయుల, అధ్యాపకుల ప్రోత్సాహం కారణం.
ఐఐటీ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవటం కష్టమనిపించలేదు. ఎందుకంటే సరదాగా చదివాను. సబ్జెక్టు మీద అమిత ఇష్టంతో చదివాను. టీవీ, ఇంటర్నెట్‌లు చూడటం తగ్గించాను. జేఈఈ మెయిన్స్‌లో మార్కులు తగ్గి టాప్‌ టెన్‌లో నాకు ర్యాంకు రాలేదు. దీంతో నిరాశ పెరిగి, ప్రేరణ మందగించింది. ఈ సంకట పరిస్థితిలో నా మిత్రులూ, తల్లిదండ్రులూ చక్కని వాతావరణం కల్పించారు. అడ్వాన్స్‌డ్‌కు మిగిలిన మిగతా ఒకటిన్నర నెలలూ బాగా చదవటానికి తోడ్పడ్డారు.

రెండు పరీక్షల భేదాలు
ఐపీఈకీ, ఐఐటీ ప్రవేశపరీక్షకూ తేడా చెప్పాలంటే... మొదటిది చదువుకుని, కొన్ని గుర్తుంచుకుని రాస్తే చాలు. జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కానీ ఐఐటీ ఎంట్రన్స్‌కు జ్ఞాపకశక్తి మరీ అంత ఎక్కువ అవసరం లేదు. ఆలోచించగల సామర్థ్యం కావాలి. దీనిలో అనువర్తన (అప్లికేషన్‌) భాగం ఎక్కువ పరీక్షిస్తారు. ఎంసెట్‌కు వేగం కావాలి. అన్ని ప్రశ్నలూ అందరూ జవాబులు రాయగలరు. కానీ సమయం సరిపోకపోవటమే సమస్య. ఐఐటీ ఎంట్రన్స్‌కు అంత వేగం అక్కర్లేదు.

ఐపీఈకి సిద్ధమై ఐఐటీ ప్రవేశపరీక్ష రాయాలంటే కష్టం. దీనిలో చాలా లోతుగా చదవాలి కాబట్టి. ఐపీఈలో ప్రాథమికాంశాలను బట్టీకొట్టి రాసి మార్కులు తెచ్చుకోవచ్చు. ఐఐటీ కోసం జరిగే పరీక్షలో ఆ అంశాలను నిజజీవిత పరిస్థితుల్లో అనువర్తించగలగాలి.

శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థ వారిచ్చిన మెటీరియల్‌ 80 శాతం ఉపయోగపడింది. అది కాకుండా చదివినవి...

మ్యాథ్స్‌: టీఎంహెచ్‌ పబ్లిషర్స్‌- మ్యాథ్స్‌ ఫర్‌ ఐఐటీ జేఈఈ ఫిజిక్స్‌: ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: బహదూర్‌, హిమాంశు పాండే, గోపీ టాండన్‌

ఇష్టముంటే సులభమే
ఐఐటీలో సీటు సాధించాలనుకునేవారికి సబ్జెక్టు మీద ఆసక్తి ఉండాలి. రోజూ సగటున 6-7 గంటల సమయమైనా సాధన చేస్తుండాలి. టాపర్‌గా నిలవాలంటే మాత్రం 10 గంటలు చదవాల్సిందే. దీంతో పాటు మంచి మార్గదర్శకత్వం ఉండాలి. సబ్జెక్టుకు సిద్ధమవటాన్ని ఇష్టంగా ఆస్వాదించాలి. అప్పుడు తెలియకుండానే సులువుగా అనిపిస్తుంది.

ఈ పరీక్షలో విజయానికి బోధన ప్రాముఖ్యం 20 శాతం మాత్రమే. మిగతా 80 శాతం విద్యార్థి సన్నద్ధత మీదే ఆధారపడివుంటుంది. పూర్వ ప్రశ్నపత్రాలు 5-6 సంవత్సరాలవి సాల్వ్‌ చేయాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో విశ్లేషించుకోవాలి. వాటిని సవరించుకోవటానికి అధ్యాపకుల సహాయం తీసుకోవాలి. 'ఎంత చదివాం' అన్నది కాదు. 'ఎంత సాధన చేశాం' అన్నదే ముఖ్యం. పరీక్షలో భయం, ఓవర్‌ యాంగ్జయిటీ ఉండకూడదు. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి.

ravichandra.addanki95@gmail.com

Monday 6 May 2013

గెలుపు గాథలో శశాంకం!

ఓటమి బాధపెడితే నిరాశతో లక్ష్యాన్నే వదిలేస్తారు కొందరు. కానీ లోటుపాట్లను సవరించుకుని ఉత్సాహంతో ముందుకు సాగుతారు మరికొందరు. చివరకు విజేతలుగా నిలిచేది వీళ్ళే. సివిల్‌ సర్వీసెస్‌ ఏపీ టాపర్‌ శశాంక ఇదే తరహా!   

తన సివిల్స్‌ ప్రయాణం ఎలా సాగిందో, విజయానికి ఏయే అంశాలు దోహద పడ్డాయో అతడు స్వయంగా చెబుతున్నాడు...!

తొలి నుంచీ మా ఇంట్లో సామాజిక స్పృహ ఎక్కువే. సామాజిక ఉద్యమాల ప్రభావం అమ్మానాన్నలపై ఉంది. వారి ఆలోచనల ప్రభావం నాపై ఉంది. వర్తమాన పరిణామాలపై ఇప్పటికీ కుటుంబసభ్యుల మధ్య చర్చ, సంవాదం జరుగుతూనే ఉంటాయి. మధ్యతరగతి నేపథ్యం, తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ (మాజీ) ఉద్యోగులు కావడం, సమాజ పరిస్థితులపై కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండటం.. ఇవన్నీ సివిల్స్‌ రాయాలనే నా ఆలోచనలో స్పష్టత రావడానికి తోడ్పడ్డాయి.

ఈ విషయంలో మా పెదనాన్న కొండూరు పురుషోత్తమే నాకు స్ఫూర్తిప్రదాత. ఆయన డిప్యుటేషన్‌పై నల్గొండ జిల్లాలో ఎంపీడీవోగా సేవలందించారు. గ్రామాలకు రహదారులు, తాగునీటి సరఫరా లాంటి సదుపాయాలు కల్పించడంలో శక్తివంచన లేకుండా కృషిచేశారు. నిబద్ధతతో పనిచేసే లక్షణం ఉంటే సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశముందనే భావన ఆయన్ను చూసిన తర్వాతే నాలో బలపడింది.

చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తిరీత్యా రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాలు తిరిగాను. ప్రజలూ, ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు... వీటిని రూపుమాపి జన జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభావవంతమైన పని ఏమైనా చేయగలనా అన్న ప్రశ్న వేసుకున్నా. సమాధానం అన్వేషించే క్రమంలో సివిల్స్‌ అత్యుత్తమ మార్గంగా కనిపించింది.

ఈ పరీక్ష రాద్దామనే ఆలోచన 2009-10లో తుదిరూపు దిద్దుకొంది. 2010 డిసెంబరు నుంచి సన్నద్ధత తీవ్రతరం చేశాను.

ఆసక్తి, ప్రాథమికాంశాలపై అవగాహన, మెటీరియల్‌ లభ్యత, సిలబస్‌ సకాలంలో పూర్తిచేయగలనన్న విశ్వాసం, రెలవెన్స్‌ ప్రాతిపదికగా ఆప్షనల్స్‌ ఎంచుకున్నాను. వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్రం అరుదైన ఆప్షనల్సే. కానీ ఇవి నాకు బాగా నచ్చాయి. వాణిజ్యశాస్త్రంపై నాకు పట్టుంది. అర్థశాస్త్రం విషయానికి వస్తే- భారత్‌ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ కోణంలో చూస్తే అర్థశాస్త్రంలో ప్రవేశం ఉండటం సర్వీసులో చేరాక బాగా ఉపయోగపడుతుందని అనిపించింది.

ప్రణాళిక
ప్రిలిమ్స్‌కూ, మెయిన్స్‌కూ విడివిడిగా సిద్ధమవడం కంటే హోలిస్టిక్‌ దృక్పథంతో రెండింటికీ కలిపి తయారవటం మంచిదని నా అభిప్రాయం. జనరల్‌ స్టడీస్‌ ప్రాథమికాంశాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాలు తిరగేశా. ఢిల్లీ 'శ్రీరామ్స్‌ ఐఏఎస్‌' మెటీరియల్‌ అందులో ముఖ్యంగా ఇండియన్‌ ఎకానమీ, పాలిటీ, కరెంట్‌ అఫైర్స్‌ నోట్స్‌ బాగా చదివాను. ఎకనమిక్‌ సర్వే, 'ఇండియా ఇయర్‌బుక్‌'లను ఆకళింపు చేసుకున్నాను.

తెలుగు పేపర్లలో వచ్చే మంచి వ్యాసాల గురించి నాన్న నాతో చర్చించేవారు. విద్యారంగ విషయాలపై అమ్మతో మాట్లాడేవాడిని. ద హిందూ, ఫ్రంట్‌లైన్‌, ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఢిల్లీ ఎడిషన్‌), ఈనాడు, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ పత్రికలు చదివా. పీఐబీ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌లో 'ప్రాజెక్ట్‌ సిండికేట్‌' పేజ్‌ చూశా. అంతర్జాతీయ వ్యవహారాలూ, రక్షణ అంశాలకు ఈ పేజ్‌ బాగా ఉపయోగపడుతుంది.

* జీఎస్‌ పేపర్లకూ, జనరల్‌ ఎస్సే పేపర్‌కూ దాదాపు ఒకేలా సన్నద్ధమయ్యా. వ్యాసానికి 200 మార్కులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా సమాధానం రాయడం సాధన చేశా. ఎలాంటి వ్యాసం ఎలా రాయాలి అన్న దానికి సంబంధించి కొన్ని నమూనాలు రూపొందించుకున్నా. 20 నుంచి 25 అంశాలపై పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా. 2012లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)పై ఇచ్చిన వ్యాసం రాశా.
* ఆప్షనల్స్‌ రెండూ కూడా నాకు నచ్చే తీసుకున్నా. కానీ ఆర్థిక శాస్త్రంపైనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది.

మూడు పెద్ద పొరపాట్లు
మొదటి ప్రయత్నం (2011) తర్వాత ఓసారి సమీక్షించుకుంటే మూడు పెద్ద పొరపాట్లు చేసినట్లు అనిపించింది...

1. తగినన్ని నమూనా పరీక్షలకు (మాక్‌ టెస్టులకు) హాజరుకాకపోవడం.

2. అనవసర ఆందోళనతో అపరిమితమైన మెటీరియల్‌ చదవడం.

3. ఆప్షనల్స్‌పై తగినంతగా దృష్టి పెట్టకపోవడం.

తొలి ప్రయత్నంలో వైఫల్యం బాధించింది. రెండో ప్రయత్నంలో కామర్స్‌ పేపర్‌ ఒకటి సరిగా రాయలేకపోయాననే భావన కలిగింది. సివిల్స్‌ లాంటి పరీక్షల్లో విజయం కోసం ప్రయత్నించే క్రమంలో ఇలాంటి దశలు ఎదురుకావడం సాధారణమే. వీటితో డీలా పడిపోకూడదు. పరిస్థితులను బేరీజు వేసుకొంటూ గుండెనిబ్బరంతో ముందుకు సాగాలి.

లోటుపాట్లు విశ్లేషించుకుని వ్యూహం సమీక్షించుకున్నాను. మొదటి ప్రయత్నంలో జనరల్‌స్టడీస్‌లో సమయపాలన పాటించలేకపోయా. తర్వాతి ప్రయత్నంలో దానిపై దృష్టి కేంద్రీకరించాను. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాశా. అత్యధిక పరీక్షలు ఇంట్లోనే ఉండి రాసి చూసుకున్నాను. మెటీరియల్‌ మరింత లోతుగా పదేపదే చదివా.

సివిల్స్‌ మెయిన్స్‌లో ప్రవేశపెట్టిన కొత్త పరీక్షా విధానం బాగుంది. కొందరు అభ్యర్థులకే అనుచిత ప్రయోజనం కలగకుండా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.

పుస్తకాలతో సహవాసం
పాఠశాల రోజుల నుంచే పత్రికా పఠనం అలవడింది. పుస్తకాలు చదవడం మొదటి నుంచీ బాగా అలవాటు. సివిల్స్‌పై దృష్టి కేంద్రీకరించక ముందు కాల్పనిక రచనలు చదివేవాడిని. ఈ పరీక్షలపై దృష్టి సారించాక, వివిధ అంశాలపై అవగాహన, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి కాల్పనికేతర పుస్తకాలు బాగా చదివా.

భిన్న వైఖరులు తెలుసుకునేందుకు వీలు కల్పించేలా పుస్తక పఠనం ఉండాలి. అమర్త్యసేన్‌, రామచంద్ర గుహ, శశిథరూర్‌ లాంటి రచయితల పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. మంచి పుస్తకమనిపిస్తే ఎవరిదైనా చదువుతా.

మౌఖిక పరీక్ష... ప్రశ్నల తీరు
డేవిడ్‌ బోర్డు నన్ను పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) చేసింది. 25 నిమిషాలపాటు సాగింది. ఇంటర్వ్యూలో వాస్తవాధారితమైన, మెలిక ఉన్న ప్రశ్నలూ; విశ్లేషణాత్మకమైన, ఓపెన్‌ ఎండెడ్‌ ప్రశ్నలూ అడిగారు. మొదటి రకం ప్రశ్నలు ప్రధానంగా నా వృత్తి నేపథ్యానికి సంబంధించినవి. రెండోరకం ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్స్‌పై అడిగారు.

అడిగిన కొన్ని ప్రశ్నలు:
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న మూడు ప్రధాన సమస్యలు ఏమిటి?

* ఏపీలో విద్యుత్‌ సంక్షోభానికి కారణమేమిటి? మీరైతే దాన్ని ఎలా ఎదుర్కొంటారు?

* ప్రస్తుత ద్రవ్యోల్బణంపై మీరేమంటారు?

* రాజ్యాంగంలో పేర్కొన్న ఎమర్జెన్సీ నిబంధనలు ఏవి?

* సీఏ ఒక గౌరవప్రదమైన వృత్తి. సీఏగా మీరు చేయలేనిదీ, సివిల్‌ సర్వెంట్‌గా మీరు చేయగలిగేదీ ఏమిటి?

* ఈమధ్య కాలంలో సీఏలపై ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?

* కంపెనీ లా గురించి చెప్పండి.

* పేమెంట్‌ ఆఫ్‌ బోనస్‌ యాక్ట్‌ గురించి చెప్పండి.

* 'రామోజీ ఫిల్మ్‌సిటీ' ప్రత్యేకత ఏమిటి? హైదరాబాద్‌లో ఇంకా ఏ స్టూడియోలున్నాయి?

మధుర స్మృతి
సివిల్స్‌ ప్రయాణంలో నాకు మధుర స్మృతి మాత్రం పర్సనాలిటీ టెస్టే. ఎంతగా సన్నద్ధమైనా ఇంటర్వ్యూ ప్రారంభమయ్యాక సాధారణంగా నాలుగైదు నిమిషాలకే మీ అసలు వ్యక్తిత్వం బయటపడిపోతుంది. ఒకట్రెండు చోట్ల కాస్త తడబడ్డా మొత్తమ్మీద సంతృప్తికరంగా చేశా.

స్పష్టమైన, నిర్దిష్టమైన సమాధానం తెలియని ప్రశ్నలకు అంచనాలు, వూహల ఆధారంగా జవాబిచ్చేందుకు ప్రయత్నించలేదు. బోర్డు గదిలోకి ఎంత ఆత్మస్త్థెర్యంతో వెళ్లానో, అంతే ఆత్మస్త్థెర్యంతో బయటకు వచ్చాను. మంచి మార్కులు వస్తాయని గట్టి నమ్మకం కుదిరింది. అందుకే మధురస్మృతిగా నిలిచిపోయింది.

సివిల్స్‌లో విజయంతో సమాజానికి సేవ చేసేందుకు వీలుగా ఒక తలుపు తెరచుకొంది. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది!

(ఇవాళ ఈనాడులో ప్రచురించిన ఈ  కథనాన్ని మరిన్ని వివరాలతో
 http://eenadu.net/Specialpages/chaduvu/chaduvuinner.aspx?qry=topstory1 లో చదవండి... )

-  లింగుట్ల రవిశంకర్‌,  ఈనాడు- హైదరాబాద్‌

Tuesday 16 April 2013

సివిల్స్‌లో కీలకాంశం... వ్యాసం

కొత్త విధానంలోకి మారిన సివిల్స్‌ పరీక్షలో జనరల్‌స్టడీస్‌ నాలుగు పేపర్లుగా (250 మార్కుల చొప్పున) విస్తరించిందని తెలిసిందే. దాంతోపాటు జనరల్‌ ఎస్సే (వ్యాసం) పేపరు మార్కులను 200 నుంచి 250కి మార్చారు. జనరల్‌స్టడీస్‌ మార్పుతో పోలిస్తే ఈ స్వల్పమార్పు అంత గణనీయంగా అనిపించకపోవచ్చు. లోతుగా విశ్లేషిస్తే తుది మార్కులపరంగా వ్యాసం ప్రాధాన్యం ఎంత అధికమో స్పష్టమవుతుంది!

విస్తృతమైన జనరల్‌స్టడీస్‌ (జీఎస్‌) సిలబస్‌లోని ఏ అంశంనుంచి ప్రశ్నలు రావొచ్చో నిర్దిష్టంగా ఊహించటం చాలా కష్టం. ప్రశ్నలు వాస్తవికాంశాలపై కాకుండా అభిప్రాయ ఆధారితంగా ఉండటం వల్ల ఎన్ని మార్కులు రావొచ్చనేది ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటపుడు ఒక్కో పేపర్లో 48-50 శాతం మార్కులు తెచ్చుకోవాలనుకోవటం వాస్తవ దూరమవుతుంది. వాటిలో గరిష్ఠ మార్కులు వచ్చే అవకాశం లేదు కాబట్టి వ్యాసంలో 50-55 శాతం మార్కులు తెచ్చుకోగలిగినవారే విజేతలయ్యే అవకాశం ఉంది!

వ్యాసంలో అత్యధికంగా స్కోర్‌ చేయటం ఎలా? అనేది చర్చించేముందు సివిల్స్‌లో వ్యాసం చరిత్రను సంగ్రహంగా చూద్దాం.

మెకాలేతో ఆరంభం
1854లో మెకాలే నివేదిక తన సిఫార్సుల్లో సూచించిన తప్పనిసరి పేపర్లలో ఇంగ్లిష్‌ ఎస్సే ఒకటి. మొత్తం 6875 మార్కుల్లో దీనికి 500 మార్కులను కేటాయించారు. 1979 వరకూ సివిల్స్‌లో మెకాలే పద్ధతిని స్వల్ప మార్పులతో కొనసాగించారు. 1947-1968 మధ్యకాలంలో ఎస్సే పేపర్‌కు నిర్దేశించింది ఆంగ్లమాధ్యమం మాత్రమే. 1969 నుంచీ ఈ వ్యాసాన్ని ఏ ప్రాంతీయ భాషల్లోనైనా రాసే వెసులుబాటు కల్పించారు.

1975లో కొఠారి కమిటీ సిఫార్సుల్లో ఒకటి- 300 మార్కులకు కంపల్సరీ ఎస్సే పేపర్‌ ప్రవేశపెట్టటం. అభ్యర్థి లక్షణాలను అంచనా వేయటానికి వ్యాసం ఉపయోగపడుతుందనేది ఈ కమిటీ గుర్తించి, దాన్ని తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. ఫలితంగా 1979 నుంచీ వ్యాసాన్ని తొలగించారు. పరీక్షా విధానంలో తప్పనిసరి ఎస్సే పేపర్‌ లేకుండాపోయింది.

1988లో ప్రభుత్వం సివిల్స్‌ విధానాన్ని సమీక్షించటానికి నియమించిన సతీష్‌చంద్ర కమిటీ 1989లో నివేదిక సమర్పించింది. ఎస్సే పేపర్‌ను తిరిగి ప్రవేశపెట్టాలనేది ఈ కమిటీ సిఫార్సుల్లో ప్రముఖమైనది. 'మెయిన్స్‌ పరీక్షలోని వ్యాసం పేపర్‌- అభ్యర్థుల భాషానైపుణ్యాలను మాత్రమే కాకుండా వారి అవగాహన సామర్థ్యం, విమర్శనాత్మక విశ్లేషణ శక్తి, సమన్వయ చింతనా ధోరణి, ఆలోచనల సమ్మేళనం, వ్యక్తీకరణలో స్పష్టతలను కూడా వెలికితీస్తుందని మా అభిప్రాయం' అని కమిటీ పేర్కొంది.

ఆంగ్లంలో కానీ, రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన ఏదో ఒక భారతీయభాషలో వ్యాసాన్ని రాయవచ్చు. మూల్యాంకనంలో ప్రమాణాల ఏకరూపత కోసం వ్యాసంలో పరిగణించాల్సిన లక్షణాలను సతీష్‌చంద్ర కమిటీ ఇలా నిర్వచించింది-

1) అవగాహన
2) మౌలిక ఆలోచన
3) వ్యక్తీకరణలో స్పష్టత
4) సమ్మిళిత ఆలోచనలతో సమన్వయ దృక్పథం


ఎస్సే పేపర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఇద్దరు స్వతంత్ర ఎగ్జామినర్లతో చేయించాలనీ, ఈ రెండు స్కోర్ల 'మీన్‌'ను అభ్యర్థి సాధించిన మార్కులుగా పరిగణించాలనీ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రభుత్వం వీటిని ఆమోదించింది. 1993 నుంచీ సివిల్స్‌ పరీక్షావిధానంలో 200 మార్కుల కంపల్సరీ ఎస్సే పేపర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న కొత్తవిధానంలో ఈ 200 మార్కులను 250కి పెంచారు.

ప్రధాన అంశాలు రెండు
వ్యాసంలో అత్యధిక స్కోరింగ్‌ సాధించాలంటే రెండు అంశాలపై శ్రద్ధ పెట్టాలి.

 1) మంచి వ్యాసం రాసే మెలకువలను తెలుసుకొని, దానిలో ప్రావీణ్యం సంపాదించటం. సరైన అంశాన్ని ఎంచుకోవటం ఆ మెలకువల్లో ఎంతో ముఖ్యమైనది.

2) వ్యాసానికి సంబంధించిన విషయం తెలుసుకోవటం.

మంచి వ్యాసం రాయటానికి ప్రాథమికాంశాల నుంచి లోతైన విషయాల వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* రాసేది అర్థమయ్యేలా ఉండాలి. వంకర టింకర లైన్లతో, మార్జిన్లను దాటిపోయేలా రాస్తే చూడగానే మంచి అభిప్రాయం ఏర్పడదు.

* పేరాలతో రాయాలి. పేరాగ్రాఫ్‌లో మొదటిలైను మొదటి అక్షరం ఒక స్పేస్‌ ఖాళీగా ఉంచి మొదలవుతుందని తెలిసిందే కదా?

* ఎడమపక్క మార్జిన్‌ తప్పనిసరి. కుడివైపు కూడా కొంత మార్జిన్‌ ఉంచితే చదవటం సులువు.

Sunday 24 March 2013

గేట్ టాపర్ ఏం చెప్తున్నాడు?

జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అగ్రశ్రేణిలో నిలవటం అనిర్వచనీయమైన అనుభూతి! లక్ష్యం సాధించి, ఆ స్థాయికి చేరుకోవటానికి పాటించిన క్రమం, పడిన కష్టం గుర్తుచేసుకోవటం ఎంతో మధురంగా ఉంటుంది. ఉజ్వల భవితకు ముఖద్వారమైన 'గేట్‌' (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)లో జయకేతనం ఎగురవేసిన సుజీత్ కుమార్  (ఈసీఈ ) ఆ విశేషాలను ఇలా పంచుకున్నాడు..


'ఆత్మవిశ్వాసం' నా విజయంలో ప్రధాన పాత్ర వహించింది. కానీ ఈ నమ్మకం నాకు ఆఖరిదశలో... పరీక్ష రాసేరోజు మాత్రమే పూర్తిగా ఏర్పడింది. అనుకున్నట్టు కాకుండా రివిజన్‌ కొద్దిగా తగ్గిందని తెలుసు కానీ దాని గురించి ఆలోచించలేదు. కాన్సెప్టులు నాకు స్పష్టంగా ఉన్నాయని తెలుసు. అదే ధైర్యం!
... అయినా కొంత ఉత్కంఠ, టెన్షన్‌... తెల్లారి పరీక్ష. తెల్లవారుఝామున 2 గంటలదాకా చదువుతూనే ఉన్నాను. నిజానికి పరీక్ష ముందు ఇంతసేపు మేలుకోవటం మంచిది కాదు. ఆరుగంటలకే మెలకువ వచ్చేసింది. టెన్షన్‌తో ఉదయం 9 గంటలదాకా ప్రిపరేషన్‌ ఆపలేదు. వదిలేసిన మ్యాథ్స్‌ రివిజన్‌ కూడా పూర్తయ్యాక.. అప్పుడు- ఆ ఆఖరి సమయంలో- వచ్చేసింది ఆత్మవిశ్వాసం!

'ఈసారి పరీక్ష కష్టంగా ఉండి, సరిగా రాయకపోయినా పర్లేదు, మరోసారి రాయగలను. ఎందుకంటే... నాకు కాన్సెప్టులపై స్పష్టత ఉంది కాబట్టి'!- ఈ నమ్మకం వచ్చాక ఇక టెన్షనే లేదు. పరీక్షకు హాజరై, ప్రశాంతమైన మనసుతో రాయటం మొదలుపెట్టాను. తేలికైనవి ముందు రాసేశాను, కష్టమైనవి రెండో రౌండుకు వదిలేసి. అందుకే జనరల్‌ ఆప్టిట్యూడ్‌తో పాటు 1.45 గంటల్లోనే సగం పేపర్‌ పూర్తిచేశా.

మళ్ళీ ప్రశ్నపత్రం చూసుకున్నాను. ఒక ప్రాబ్లమ్‌ అయితే పూర్తి పేజీ నిడివి ఉంది. చూడగానే దాన్ని అంతకుముందు వదిలేశా. ఇప్పుడు తరచిచూస్తే విచిత్రంగా అది చాలా తేలిక సమస్య! భయపెట్టటానికి ఇంత నిడివితో ఇచ్చివుంటారు.

పట్టు వదలకుండా...
నా ప్రిపరేషన్‌ గురించి చెప్పాలంటే- చదివినంతవరకూ బాగా చదివాను. కాన్సెప్టులపై అస్పష్టత ఉంటే దాన్ని క్లారిఫై చేసుకునేదాకా వదల్లేదు. ఏదైనా ప్రాబ్లమ్‌ రాకపోతే సొల్యూషన్‌ తెలిసేవరకూ దానిమీదే ఉన్నాను. ప్రిపరేషన్‌ విషయంలో కష్టమైన అంశాలనే ముందు ప్లాన్‌ చేసుకోవాలి. వాటికి ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి. తర్వాతే తేలికైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే చివర్లో మనకు వ్యవధి సరిపోకపోవచ్చు. పరీక్ష ముందు రివిజన్‌ పెండింగ్‌ లేకుండా చూసుకుంటే ఆత్మస్త్థెర్యం పెరుగుతుంది.

గేట్‌లో నాకిది మూడో ప్రయత్నం. మొదటిసారి అసలేమీ చదవకుండా రాశాను. మార్కులు 42/100, గేట్‌ ర్యాంకు 5,898! రెండో ప్రయత్నంలో బాగా చదివాను. కొన్ని కాన్సెప్టులు అంత క్లియర్‌గా లేవు. సమయం లేక ప్రాబ్లమ్స్‌ సాధన చేయలేకపోయాను. మార్కులు 32/100 మాత్రమే. కానీ 3,360 ర్యాంకు! ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఇవ్వటం దీనికి కారణం. దీనిబట్టి తెలిసేదేమిటంటే... ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంకు వస్తుంది. ఇతరుల గురించి పట్టించుకోకూడదు.

మూడోసారి గేట్‌ రాసినపుడు బాగా చదివాను. కాన్సెప్టులు క్లియర్‌గా ఉన్నాయి. ప్లాబ్లమ్స్‌ కూడా సాధన చేశాను. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా, వాటిని చివరి నిమిషం వరకూ సవరించుకుంటూ వచ్చాను. మొదటి రెండు సార్లూ సమయం లేక తేలికైనవి కూడా వదిలేశాను. ఇప్పుడలా కాకుండా తేలికైన ప్రశ్నలకు ముందు జవాబులు గుర్తించాను. దీనివల్ల జరిగే ప్రయోజనం ఆత్మస్త్థెర్యం రావటం! పేపర్‌ సులువుగా ఉంది కాబట్టి మార్కులశాతం 88.67 వచ్చింది. ర్యాంకు తెలిసిందే కదా? మొదటి ర్యాంకు!

నిరాశపడకూడదు
గేట్‌ కోసం రోజుకు 8 గంటల చొప్పున చదివితే ఆరు నెలల సమయం సరిపోతుంది. సన్నద్ధతకు తప్పనిసరిగా ఒక ప్రణాళిక అనుకోవాలి. దాన్ని పాటించటానికి నిర్దిష్ట వ్యవధి పెట్టుకోవాలి. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు ప్రణాళిక సరిగా పాటించటం లేదని నిరాశపడిపోకూడదు. 'అయిందేదో అయింది. ఉన్న సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేయాలి' అనుకోవాలి. పరిస్థితిని బట్టి డైనమిక్‌గా దాన్ని మార్చుకోవటం కూడా అవసరం. ఏది ఏమైనా ప్రిపరేషన్‌ సకాలంలో పూర్తవుతుందనే ఆత్మవిశ్వాసం ఉండాలి.

గేట్‌ రాసేవారు తమ కళాశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటే సందేహాలు వచ్చినపుడు వివిధ పుస్తకాలను సంప్రదింంచే వీలుంటుంది. చదువుకునే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.

క్రమం పాటిస్తే సులువు
గేట్‌లో సాధారణంగా అన్ని సబ్జెక్టులకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. పాత పేపర్లు సాధన చేస్తే వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. ఆ ప్రకారం సిద్ధమవ్వొచ్చు. కానీ టాప్‌ ర్యాంకు రావాలంటే మాత్రం సిలబస్‌ మొత్తం కవర్‌ చేయాల్సిందే. ఇంజినీరింగ్‌ మ్యాథ్స్‌కు మార్కులు తక్కువని దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి సరిగా సన్నద్ధమైతే ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు చదివేటపుడు సమయం బాగా ఆదా అవుతుంది. మ్యాథ్స్‌లో పునాది సరిగా ఏర్పరచుకోకపోతే ప్రిపరేషన్‌ సమయం చాలా పెరుగుతుంది!

ఎలక్ట్రో మాగ్నటిక్‌ థియరీ లాంటి కొన్ని సబ్జెక్టుల్లో మొదటి కొన్ని చాప్టర్లు మిగతావాటికి ఆధారంగా ఉంటాయి. ఇంటర్లో చదివినవాటికి కొనసాగింపు కొన్ని ఉంటాయి. సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ తర్వాత కమ్యూనికేషన్స్‌ చదవటం; ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌, ఎనలాగ్‌ సర్క్యూట్స్‌ వరసగా, ఈ రెంటికీ ముందు నెట్‌వర్క్‌ థియరీ చదవటం ... ఈ క్రమం చక్కని అవగాహననిస్తుంది.

ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) ఎంత బాగా చదివితే సబ్జెక్టు అంత సులభం. సమస్యల సాధనలో ఎక్కువ పేజీలు రాయటం బీటెక్‌కు పనికిరావొచ్చు కానీ, గేట్‌కు క్లుప్తంగా సాల్వ్‌ చేయటమే ప్రధానం. మ్యాథ్స్‌లో పట్టుంటేనే ఇది సాధ్యం!

ఉపయోగపడే సైట్లు
నేనైతే పరీక్షకు ఒక్కణ్ణే సిద్ధమయ్యాను గానీ, 'కంబైన్డ్‌ స్టడీ' చాలా ఉపయోగకరమే! ఒకే రకమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు ముగ్గురు కలిసి చదివితే అద్భుతాలు సృష్టించవచ్చు. సొంతంగా సన్నద్ధమయ్యేటపుడు ఎక్కడైనా చిక్కుముడి ఏర్పడితే సమయం వృథా అవుతుంటుంది. ఇలాంటపుడు సమయం ఉంటే http://nptel.iitm.ac.in/వెబ్‌సైట్‌లో నిపుణులైన అధ్యాపకుల బోధనలున్న వీడియోలు చూస్తే సందేహనివృత్తి అవుతుంది. తర్వాత పాఠ్యపుస్తకాలు చదివితే అర్థమవుతుంది. www.coursera.org వెబ్‌సైట్‌లో విదేశీ ప్రొఫెసర్ల పాఠాలు ఉచితంగా చూడొచ్చు. ఇవి చాలా ఉపయోగం.

మాక్‌ టెస్టులు నిర్దిష్ట సమయం పెట్టుకుని రాయటం మంచిది. రాసి, ఎక్కడ, ఏమేం తప్పులు చేశామో బేరీజు వేసుకోవాలి. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. నేను పరీక్ష ముందు రెండు టెస్టులు రాశాను. సరైన మైండ్‌సెట్‌, సమయ నిర్వహణ వీటితో అలవడతాయి. పాత పేపర్లు 8 నుంచి 10 సంవత్సరాలవి సాల్వ్‌ చేయటం మేలు.కాన్సెప్టుల విషయంలో 'నాదే కరెక్టు' అనే ధోరణి సరికాదు. ఇవి సుస్పష్టంగా (క్రిష్టల్‌ క్లియర్‌) ఉండాలి. నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండాలి. ఎంత చదివినా రివిజన్‌ ఉండాలి. తప్పులు తెలుసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్‌నూ సాల్వ్‌ చేసేలా ఉండాలి. పరిష్కరించకుండా దేన్నీ వదలకూడదు. ఏ సమస్య అయినా చేయలేకపోయామంటే ఆ కాన్సెప్ట్‌పై పూర్తి అవగాహన రాలేదని అర్థం!

నేను హైదరాబాద్‌ 'ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ'లో కోచింగ్‌ తీసుకున్నాను. అనుభవజ్ఞులైన అధ్యాపకులు మన సమయం తగ్గిస్తారు. కోచింగ్‌ లేకుండా కూడా గేట్‌కు సిద్ధం కావచ్చు. అయితే దీనికి సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది.

ఇంజినీరింగ్‌ ఫైనలియర్లో కీలకమైన ప్రాజెక్టు, పరీక్షలూ, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లూ ఉంటాయి. వీటి మధ్య గేట్‌కు సన్నద్ధమవటం పరీక్షే. అందుకే రెండో సంవత్సరం నుంచీ గేట్‌మీద దృష్టిపెట్టటం మంచిది. సబ్జెక్టులో కష్టంగా ఉన్నవాటిని నోట్స్‌గా రాసుకోవాలి. గేట్‌ సన్నద్ధతలో అవి ఉపయోగపడతాయి. సమయం కూడా బాగా ఆదా అవుతుంది.

Monday 25 February 2013

సివిల్స్ జైత్రయాత్రకు అపోహలే అవరోధాలు!

సివిల్స్‌ పరీక్షకు తయారటానికి సుదీర్ఘ కాలం పడుతుంది కాబట్టి... దీనికి ప్రయత్నం చేయాలో లేదో; తమకు తగిన సామర్థ్యం ఉందో లేదో అనే సందేహాలు అభ్యర్థుల్లో ఉండటం చాలా సహజం. ఈ పరీక్ష చుట్టూ అల్లుకున్న అపోహలను ఎంత త్వరగా నివృత్తి చేసుకుంటే ఆశావహులకు అంత శ్రేయస్కరం!

జిల్లా కలెక్టర్‌గా/ ఎస్పీగా అవ్వాలని యువత గాఢంగా కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ హోదాల్లోని గౌరవం, ప్రత్యేకత వారికి అలాంటి ప్రేరణనిస్తుంది. జిల్లా మొత్తం అధికార యంత్రాంగం చిన్నా పెద్దా సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌మీద ఆధారపడుతుంది. జిల్లా పోలీసు సిబ్బందిని నియంత్రించే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సాధారణంగా కలెక్టర్‌ కన్నా చిన్నవయసులో ఉంటారు. (ఐపీఎస్‌కు ఎంపికయ్యాక ఐదారేళ్ళలో ఎస్పీ అవుతారు కానీ కలెక్టర్‌ అవ్వటానికి ఐఏఎస్‌కు ఎంపికయ్యాక పది పన్నెండేళ్ళు పడుతుంది.)
ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావటానికి పోటీ పరీక్ష రాయాలని తెలుసు. అయితే నాకు ఈ లక్ష్యం తగినదేనా? నాలో ఈ సత్తా ఉందా? విజయవంతం కాగలుగుతానా?- ఇవి చాలామందిలో మెదిలే ప్రశ్నలు!

పైగా చుట్టుపక్కలవాళ్ళు ప్రోత్సాహం ఇవ్వకపోగా వ్యతిరేక భావనలు పెంచేస్తుంటారు. 'ఐదేళ్ళపాటు సిద్ధపడినా నాకు తెలిసిన ఒకతను సివిల్స్‌ రాయలేకపోయాడు. అతడికి టెన్త్‌లో 98 శాతం, ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి. అతడికే సాధ్యం కానపుడు నీవల్లవుతుందా?' ... ఇలాంటి చర్చలు అనంతంగా సాగుతూ అభ్యర్థుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లుతుంటాయి. ఎన్నో సందేహాలు ముసిరి, వారిని ప్రయత్నం చేయనీకుండా వెనక్కి లాగుతుంటాయి.


ముఖ్యమైన సందేహాలు

* నేను సగటు విద్యార్థిని. డిగ్రీ ఎలాగోలా పూర్తిచేశాను. ఈ పరీక్షలో అర్హత సాధించే అవకాశం నాకుందా?

మొట్టమొదట- సగటు విద్యార్థిని అనో, సగటు కంటే కిందిస్థాయి అనో, అసాధారణ విద్యార్థిని అనో ముద్ర వేసుకోకూడదు. చదువుల్లో సరిగా ప్రతిభ చూపలేదంటే మీ నియంత్రణలో లేని కారణాలు ప్రభావం చూపివుండవచ్చు. ఎన్నో అనుకూలాంశాలు చుట్టూ ఉన్నా కూడా చదివేదానిపై ఆసక్తి లేకపోయివుంటే పరీక్షల్లో సరిగా రాసివుండకపోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే ప్రయత్నాలు వాటికవే రూపుదిద్దుకుంటాయి.

ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నపుడే మన శక్తిసామర్థ్యాలను గుర్తించగలుగుతాం. అప్పుడే సంపూర్తిగా లీనమై చేయటం గమనించవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ మీ ఏకైక లక్ష్యంగా మారితే దాన్ని సాధించటానికి మార్గాలూ, సాధనాలూ మీరే గుర్తించగలుగుతారు.

ఈ సర్వీసు సాధించినవారిలో ఎంతోమంది 'సగటు' విద్యార్థులున్నారు. పాఠశాలో, కళాశాలలో ఏనాడూ మంచి మార్కులు తెచ్చుకోనివారున్నారు. కానీ కళాశాల తర్వాత సివిల్‌ సాధించాలనే స్థిరమైన, స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాక దానిలో విజయం కోసమే వారు తమ సర్వశక్తులూ వినియోగించారు!

* నేను డిగ్రీలో కేవలం పాసైన విద్యార్థిని. సివిల్స్‌ యాత్రలో నాకెలాంటి సమస్యలు ఎదురవుతాయి?

మొదట తల్లిదండ్రులూ, స్నేహితులూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. వాళ్ళేమంటారంటే- 'ఇప్పటిదాకా నువ్వేమీ సాధించలేదు కదా, సివిల్స్‌లో ఎలా నెగ్గగలవు?' అని. మీరు నిరుత్సాహపడొచ్చు కానీ వారలా చెప్పటంలో సబబు ఉంది- మీరింకా మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేదు కాబట్టి. నేను మారానననీ, ఒక లక్ష్యం గుర్తించాననీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు వారు తప్పకుండా మీకు మద్దతునిస్తారు.

రెండో సమస్య ఏ దిశలో ముందుకు సాగాలనేది. మీకంటే ఈ పరీక్ష గురించి బాగా తెలిసినవారి సాయం తీసుకోవాలి. వారినుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల బలహీనతలూ, లోపాలపై కాకుండా వారి బలాలపై దృష్టి పెట్టండి. మీకు సౌకర్యంగా ఉండే స్థలం (ఇల్లు, ఊరు, బస్తీ) వదిలి మీలాంటి జీవితాశయాలున్నవారుండే చోటుకు మారటం దీనిలో భాగమే!

మూడోది మార్గదర్శనం. ఈ పరీక్షపై చక్కని అవగాహనఉన్నవారి సూచనలు పొందటం. అది స్నేహితులైనా కావొచ్చు; ఉపాధ్యాయులైనా కావొచ్చు.

నాలుగో అంశం- పరీక్ష రాసి దాని గురించి తెలుసుకోవటం. దీనివల్ల వాస్తవం ఏమిటన్నది స్వానుభవంతో గ్రహించవచ్చు.


(పూర్తి కథనం -  www.eenadu.net చదువు విభాగంలో చూడండి)

Friday 22 February 2013

ఎంసెట్‌ నగారా


ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్రుతతో ఎదురు చూస్తోన్న ఎంసెట్‌ ప్రకటన వెలువడింది. ఎంపీసీ విద్యార్థుల విషయంలో స్పష్టతతో, బైపీసీ విద్యార్థులకు సంశయం కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్‌ రూపొందింది. మంచి భవితకు బాట కోసం ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధన అత్యవసరం. దీనికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాల్సిన తరుణమిది!

పోటీ పరీక్ష ఏదైనా దానికి తయారయ్యే విధానం, మానసిక సంసిద్ధత.. ఈ రెండు అంశాల మేరకే ఫలితాలుంటాయి. కష్టపడి చదవడం తప్పనిసరే కానీ, నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడటం ముఖ్యం. అప్పుడే గెలుపు సులభమవుతుంది. కానీ చాలామంది విద్యార్థులు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వక నష్టపోతున్నారు.

ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఎందుకో ఒక్క ఉదాహరణ ద్వారా చూద్దాం.
ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని అనుకుందాం. ఒక విద్యార్థి హిందీలో 90 మార్కులు, మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 92 మార్కులు తెచ్చుకున్నాడని అనుకుందాం. వేరొక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 99 లేదా 100 మార్కులు తెచ్చుకుంటూ ఒక సబ్జెక్టులో హిందీ కాకుండా 90 మార్కులు సాధించాడని అనుకుందాం.

ఈ ఇద్దరిలో మొదటి విద్యార్థికి 10 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 10/10, రెండో విద్యార్థికి 9.8 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 9.8/10 వచ్చినట్లు అవుతుంది. మార్కులపరంగా చూస్తే మొదటి విద్యార్థి మార్కులు కేవలం 550/600. మరి రెండో విద్యార్థి మార్కులు 590/600 వరకూ ఉండే అవకాశముంది. మరి ఈ ఇద్దరిలో తేడా అంటే ప్రణాళిక మాత్రమే.

మారిన గ్రేడింగ్‌ విధానం అర్థం చేసుకుని ప్రాధాన్యం గుర్తించి చదివిన విద్యార్థి 10/10 తెచ్చుకుంటే అవగాహన లేక ప్రణాళిక లేకుండా చాలా కష్టపడి కూడా రెండో విద్యార్థి తెచ్చుకున్నది 9.8/10 మాత్రమే. కాబట్టి మార్కులు సాధించాలంటే కష్టపడాల్సిందే. అయితే అవగాహనతో సరైన ప్రణాళికతో కష్టపడి చదివితే కచ్చితంగా మేటి ర్యాంకుకు అవకాశం ఉంటుంది.


ప్రకటన ప్రకారం...
ఇంజినీరింగ్‌, మెడికల్‌, డెంటల్‌, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌, ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతిల ప్రవేశానికి ఎంసెట్‌ ర్యాంకు ఉపయోగపడుతుంది.

ఈ పరీక్ష రాయడానికి నిబంధనలు చూస్తే... భారతీయులై, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు లేదా సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు. రిజర్వేషన్‌ కేటగిరీలలో ఉన్న విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి.

* బయోటెక్నాలజీలో చేరాలంటే బైపీసీ విద్యార్థులు లెక్కలులో బ్రిడ్జి కోర్సు పరీక్ష పాసై ఉండాలి.
* ఇంజినీరింగ్‌, ఫార్మసీలైతే విద్యార్థికి డిసెంబరు 31, 2013 లోపు 16 సంవత్సరాలు పూర్తి అయివుండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు.

* మెడికల్‌ విభాగంలో అయితే డిసెంబరు 31, 2013లోపు విద్యార్థి 17 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి. అలా కాని పక్షంలో ప్రవేశ అర్హత లభించదు. అలాగే గరిష్ఠ వయః పరిమితి జనరల్‌ కేటగిరి అయితే 22 ఏళ్ళు, రిజర్వేషన్‌ కేటగిరి అయితే 25 సంవత్సరాలు.

ఎలా సంసిద్ధమవ్వాలి?

ఇంటర్‌ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆఖరు తేదీ మార్చి 19 వరకూ ఇంటర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది.

ఇంటర్‌లో మూడు రకాల ప్రశ్నలుంటాయి. LAQ, SAQ, VSAQవీటిలో సాధారణ విద్యార్థులు LAQ, SAQలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదువుతారు. కచ్చితంగా మంచి మార్కులు లేదా నూరు శాతం మార్కులు సాధించాలనే ధ్యేయంతో ఉన్నవారు అధికంగా VSAQలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే అకాడమీ పుస్తకాలు చదవడంతో బాటు ఆబ్జెక్టివ్‌ ఓరియెంటేషన్‌లో కూడా తయారీ కావాలి.

అకాడమీ పుస్తకాలు చదవడం అంటే చివర్లో ఉన్న ప్రశ్నలు జవాబులు మాత్రమే కాకుండా పాఠ్యాంశం కూడా పూర్తిగా కనీసం ఒక్కసారైనా చదివి ఉండాలి. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యేవరకూ ఈ సిలబస్‌కు పరిమితమై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళాలి.

కాలవ్యవధి స్వల్పంగా ఉంది కాబట్టి రాని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవడం సరికాదు. దానికి బదులు- వచ్చిన అంశాలనే ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటూ వెళితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలో కూడా వేగం పెరుగుతుంది.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల తర్వాత ఎంపీసీ విద్యార్థులు అయితే జేఈఈ- మెయిన్స్‌కు తయారవుతుంటారు. 10 రోజుల్లో జూనియర్‌ సిలబస్‌ పూర్తి చేసుకుని మిగిలిన వారం రోజులూ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించుకోవడం మేలవుతుంది.

ఆ తర్వాత ఎంసెట్‌, బిట్‌శాట్‌ రెండు పరీక్షలకూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ రెండింటినీ పునశ్చరణ చేసుకుంటూ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా రాయాలి. ఎంసెట్‌లో రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి జవాబు తెలియనప్పటికీ ప్రతి ప్రశ్నకూ ఏదో ఒక జవాబు రాసే చాన్స్‌ తీసుకోవచ్చు. ఏప్రిల్‌ ఆఖరు వారం నుంచి గ్రాండ్‌ టెస్టులు రాయడం ప్రారంభించాలి.

బైపీసీ విద్యార్థులు అయితే మార్చి 19 తర్వాత కనీసం 20 రోజులు ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణ చేసుకోవాలి. సిలబస్‌ను చిన్న భాగాలుగా విభజించి నమూనా పరీక్షల రూపంలో అభ్యాసం చేయాలి. బయాలజీ విద్యార్థులు అధికశాతం నష్టపోవడానికి కారణాలు.. సబ్జెక్టుపై అవగాహన లేక కాదు! వాటిని ప్రశ్నల రూపంలో తర్ఫీదు పొందకపోవడమే. అందుకే వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ఇక్కడ కూడా రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు గుర్తించకుండా వదిలి వేయాల్సిన అవసరం లేదు.

ఎంపీసీ లేదా బైపీసీ ఏ విభాగం అయినా మన అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైనా ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన తయారీ ఏ విద్యార్థికయినా విజయం సాధించిపెడుతుంది!

(పూర్తి కథనం కోసం www.eenadu.net లో చదువు విభాగం చూడండి..)

Wednesday 23 January 2013

ఎంసెట్... నీట్ - సన్నద్ధత ఎలా?





    ఎంసెట్‌-నీట్‌... ఏ పరీక్ష రాయాల్సివచ్చినా, ఒకవేళ రెండూ రాయాల్సివచ్చినా బైపీసీ విద్యార్థులు తయారుగా ఉండటం మేలు. అనుకూల అంశాలను గుర్తుచేసుకుంటూ ఆశావహ దృక్పథంతో ప్రణాళిక వేసుకోవాలి; ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించాలి!

ఇంటర్మీడియట్‌ బైపీసీ విభాగంలోని ప్రవేశపరీక్షలకు దాదాపు 1,25,000 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఏది ఖరారవుతుందనే విషయంపై అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తుండటమే సరైన చర్య.

బైపీసీ విభాగంలో జరిగే పోటీ పరీక్షల్లో సబ్జెక్టుపై అవగాహన ఎంత అవసరమో ఆత్మవిశ్వాసం అంతకంటే ఎక్కువ అవసరమవుతోంది. ప్రణాళికతో తయారు కాగలిగితే ఈ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

జరగబోయే నీట్‌, ఎంసెట్‌ రెండు పరీక్షలూ ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లలో ప్రవేశాలు నీట్‌ ద్వారా జరిగితే; మిగిలిన కోర్సులైన యునానీ, ఆయుర్వేదిక్‌, హోమియోపతి, అగ్రికల్చరల్‌ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్‌, ఫార్మసీ, నర్సింగ్‌ లాంటి కోర్సుల్లో ప్రవేశం ఎంసెట్‌ ద్వారా జరిగే అవకాశం ఏర్పడుతోంది. నీట్‌ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపు సంశయం కంటే సన్నద్ధత  చాలా అవసరం.

ఎంసెట్ 2012 : 
మార్కుల, ర్యాంకుల విశ్లేషణ 


తయారయ్యేదెలా?
* సీనియర్‌ ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి, మార్చి మొదటివారంలో థియరీ పరీక్షలూ ప్రారంభమవుతున్నాయి కాబట్టి సీనియర్‌ ఇంటర్‌ ఆఖరి పరీక్ష మార్చి 19వ తేదీ వరకూ రెండో సంవత్సరం సిలబస్‌కే పరిమితమై చదవాలి.

* ఇంటర్‌ పరీక్షకు VSAQప్రశ్నలపై బాగా తయారైతే అది ఎంసెట్‌కు కూడా ప్రయోజనం.

* చాలామంది ఈ సమయంలో మొదటి సంవత్సరం సిలబస్‌ పునశ్చరణ అని సమయాన్ని నష్టపరుచుకుని సీనియర్‌ సిలబస్‌ పూర్తికాక ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా మార్చి 19 వరకూ ఆబ్జెక్టివ్‌తో కలిపి రెండో సంవత్సరం సిలబస్‌ సంపూర్ణంగా పూర్తిచేయగలిగితే ఆ తర్వాత ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణకు కావలసిన సమయం దొరుకుతుంది.

* ఇంటర్‌ అకాడమీ పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదివినా సరిపోతుంది. నీట్‌కు అయితే అదనంగా బోటనీ, జువాలజీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కూడా కచ్చితంగా చదవాలి. అయితే ఈ అదనపు అంశాలు మార్చి 19 తర్వాత చదువుకోవచ్చు.

* ఇంటర్‌ పరీక్షల ముందు నెలరోజులు పాఠాలు వినడం కంటే విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి ప్రయత్నిస్తే అధికలాభం. సందేహాలు వస్తే వెంటనే అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకోవచ్చు.

* కొంతమంది ఒక వారం ఒక సబ్జెక్టు పూర్తిచేయాలని ప్రయత్నిస్తూవుంటారు. అయితే ఒకే సబ్జెక్టు అంత ఎక్కువ కాలం చదివితే అవగాహనలోపం ఏర్పడవచ్చు. ఇతర సబ్జెక్టులు ఎక్కువకాలం చదవలేదు కాబట్టి మనసులో వాటిపై భయం పెంచుకుని, ఆ సబ్జెక్టులు కూడా సరిగా చదవలేరు. అందుకే వీలైనంతవరకూ ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులూ చదవాలి (పరీక్షల సమయంలో తప్పించి).

* సిద్ధాంతపరమైన ప్రశ్నలు చదివినపుడు ఆకళింపు చేసుకోలేకపోతే కొంత సమయం లెక్కలు చేసి, మళ్ళీ సిద్ధాంతపరమైన భాగాలను చదివితే సరిపోతుంది.

* ఈ సమయంలో కొత్త అంశాలు చదవకుండా, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే ఆత్మస్త్థెర్యం పెంచుకోవచ్చు.

* ఎంసెట్‌ బైపీసీ విభాగంలో 160 మార్కులకు 115 మార్కులపైన సాధించగలిగితే సీటు సాధించినట్లే. ఆ మార్కులు పొందాలంటే బయాలజీలో 75, కెమిస్ట్రీలో 35, ఫిజిక్స్‌లో మిగిలిన మార్కులు సాధించగలిగితే సరిపోతుంది. పట్టున్న సబ్జెక్టులో అధిక మార్కులు సాధించటం ముఖ్యం!

పూర్తి కథనం కోసం  www.eenadu.net చదువు విభాగం చూడండి! 
   

Wednesday 9 January 2013

మే 10న ఎంసెట్‌


ఈనాడు హైదరాబాద్‌ :ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సుల ప్రవేశపరీక్షల తేదీలతోపాటు ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ నిర్వహణ, తరగతుల ప్రారంభం తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఇలా జరగడం ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం.

సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్‌ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్‌ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్‌(పీజీఈసెట్‌) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్‌సెట్‌(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్‌), న్యాయవిద్య(లాసెట్‌, పీజీలా) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం(ఈసెట్‌) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్‌, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయప్రకాష్‌రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు.



2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్‌ఆర్‌సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్‌జైన్‌, జయప్రకాష్‌రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్‌ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.