ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 16 April 2013

సివిల్స్‌లో కీలకాంశం... వ్యాసం

కొత్త విధానంలోకి మారిన సివిల్స్‌ పరీక్షలో జనరల్‌స్టడీస్‌ నాలుగు పేపర్లుగా (250 మార్కుల చొప్పున) విస్తరించిందని తెలిసిందే. దాంతోపాటు జనరల్‌ ఎస్సే (వ్యాసం) పేపరు మార్కులను 200 నుంచి 250కి మార్చారు. జనరల్‌స్టడీస్‌ మార్పుతో పోలిస్తే ఈ స్వల్పమార్పు అంత గణనీయంగా అనిపించకపోవచ్చు. లోతుగా విశ్లేషిస్తే తుది మార్కులపరంగా వ్యాసం ప్రాధాన్యం ఎంత అధికమో స్పష్టమవుతుంది!

విస్తృతమైన జనరల్‌స్టడీస్‌ (జీఎస్‌) సిలబస్‌లోని ఏ అంశంనుంచి ప్రశ్నలు రావొచ్చో నిర్దిష్టంగా ఊహించటం చాలా కష్టం. ప్రశ్నలు వాస్తవికాంశాలపై కాకుండా అభిప్రాయ ఆధారితంగా ఉండటం వల్ల ఎన్ని మార్కులు రావొచ్చనేది ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటపుడు ఒక్కో పేపర్లో 48-50 శాతం మార్కులు తెచ్చుకోవాలనుకోవటం వాస్తవ దూరమవుతుంది. వాటిలో గరిష్ఠ మార్కులు వచ్చే అవకాశం లేదు కాబట్టి వ్యాసంలో 50-55 శాతం మార్కులు తెచ్చుకోగలిగినవారే విజేతలయ్యే అవకాశం ఉంది!

వ్యాసంలో అత్యధికంగా స్కోర్‌ చేయటం ఎలా? అనేది చర్చించేముందు సివిల్స్‌లో వ్యాసం చరిత్రను సంగ్రహంగా చూద్దాం.

మెకాలేతో ఆరంభం
1854లో మెకాలే నివేదిక తన సిఫార్సుల్లో సూచించిన తప్పనిసరి పేపర్లలో ఇంగ్లిష్‌ ఎస్సే ఒకటి. మొత్తం 6875 మార్కుల్లో దీనికి 500 మార్కులను కేటాయించారు. 1979 వరకూ సివిల్స్‌లో మెకాలే పద్ధతిని స్వల్ప మార్పులతో కొనసాగించారు. 1947-1968 మధ్యకాలంలో ఎస్సే పేపర్‌కు నిర్దేశించింది ఆంగ్లమాధ్యమం మాత్రమే. 1969 నుంచీ ఈ వ్యాసాన్ని ఏ ప్రాంతీయ భాషల్లోనైనా రాసే వెసులుబాటు కల్పించారు.

1975లో కొఠారి కమిటీ సిఫార్సుల్లో ఒకటి- 300 మార్కులకు కంపల్సరీ ఎస్సే పేపర్‌ ప్రవేశపెట్టటం. అభ్యర్థి లక్షణాలను అంచనా వేయటానికి వ్యాసం ఉపయోగపడుతుందనేది ఈ కమిటీ గుర్తించి, దాన్ని తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. ఫలితంగా 1979 నుంచీ వ్యాసాన్ని తొలగించారు. పరీక్షా విధానంలో తప్పనిసరి ఎస్సే పేపర్‌ లేకుండాపోయింది.

1988లో ప్రభుత్వం సివిల్స్‌ విధానాన్ని సమీక్షించటానికి నియమించిన సతీష్‌చంద్ర కమిటీ 1989లో నివేదిక సమర్పించింది. ఎస్సే పేపర్‌ను తిరిగి ప్రవేశపెట్టాలనేది ఈ కమిటీ సిఫార్సుల్లో ప్రముఖమైనది. 'మెయిన్స్‌ పరీక్షలోని వ్యాసం పేపర్‌- అభ్యర్థుల భాషానైపుణ్యాలను మాత్రమే కాకుండా వారి అవగాహన సామర్థ్యం, విమర్శనాత్మక విశ్లేషణ శక్తి, సమన్వయ చింతనా ధోరణి, ఆలోచనల సమ్మేళనం, వ్యక్తీకరణలో స్పష్టతలను కూడా వెలికితీస్తుందని మా అభిప్రాయం' అని కమిటీ పేర్కొంది.

ఆంగ్లంలో కానీ, రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన ఏదో ఒక భారతీయభాషలో వ్యాసాన్ని రాయవచ్చు. మూల్యాంకనంలో ప్రమాణాల ఏకరూపత కోసం వ్యాసంలో పరిగణించాల్సిన లక్షణాలను సతీష్‌చంద్ర కమిటీ ఇలా నిర్వచించింది-

1) అవగాహన
2) మౌలిక ఆలోచన
3) వ్యక్తీకరణలో స్పష్టత
4) సమ్మిళిత ఆలోచనలతో సమన్వయ దృక్పథం


ఎస్సే పేపర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఇద్దరు స్వతంత్ర ఎగ్జామినర్లతో చేయించాలనీ, ఈ రెండు స్కోర్ల 'మీన్‌'ను అభ్యర్థి సాధించిన మార్కులుగా పరిగణించాలనీ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రభుత్వం వీటిని ఆమోదించింది. 1993 నుంచీ సివిల్స్‌ పరీక్షావిధానంలో 200 మార్కుల కంపల్సరీ ఎస్సే పేపర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న కొత్తవిధానంలో ఈ 200 మార్కులను 250కి పెంచారు.

ప్రధాన అంశాలు రెండు
వ్యాసంలో అత్యధిక స్కోరింగ్‌ సాధించాలంటే రెండు అంశాలపై శ్రద్ధ పెట్టాలి.

 1) మంచి వ్యాసం రాసే మెలకువలను తెలుసుకొని, దానిలో ప్రావీణ్యం సంపాదించటం. సరైన అంశాన్ని ఎంచుకోవటం ఆ మెలకువల్లో ఎంతో ముఖ్యమైనది.

2) వ్యాసానికి సంబంధించిన విషయం తెలుసుకోవటం.

మంచి వ్యాసం రాయటానికి ప్రాథమికాంశాల నుంచి లోతైన విషయాల వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* రాసేది అర్థమయ్యేలా ఉండాలి. వంకర టింకర లైన్లతో, మార్జిన్లను దాటిపోయేలా రాస్తే చూడగానే మంచి అభిప్రాయం ఏర్పడదు.

* పేరాలతో రాయాలి. పేరాగ్రాఫ్‌లో మొదటిలైను మొదటి అక్షరం ఒక స్పేస్‌ ఖాళీగా ఉంచి మొదలవుతుందని తెలిసిందే కదా?

* ఎడమపక్క మార్జిన్‌ తప్పనిసరి. కుడివైపు కూడా కొంత మార్జిన్‌ ఉంచితే చదవటం సులువు.

No comments:

Post a Comment