ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 9 September 2013

ఎంబీఏకు మ్యాట్‌ మార్గం


ఎంబీఏ ప్రవేశానికి ఏడాదికి నాలుగుసార్లు జరిగే జాతీయస్థాయి ప్రవేశపరీక్ష 'మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌' (MAT). ప్రసిద్ధ బీ స్కూల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 600 విద్యాసంస్థలు ఈ పరీక్ష స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. డిసెంబర్‌ మ్యాట్‌ ప్రకటన వెలువడిన సందర్భంగా... దీనిలో మెరుగైన ర్యాంకు సాధించటానికి ఏ అంశాలపౖెె దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!

డిగ్రీ ఉత్తీర్ణులే కాకుండా, చివరి సంవత్సరం విద్యార్థులు కూడా మ్యాట్‌ రాయవచ్చు. దీనికి వయః పరిమితి ఏమీ లేదు. పేపర్‌ ఆధారితంగా, కంప్యూటర్‌ ఆధారితంగా- రెండు రకాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు.

మ్యాట్‌ రాయడానికి క్యాట్‌లో మాదిరి కనీస మార్కుల శాతం నిబంధన ఏమీ లేదు. అందువల్ల డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినవారు కూడా మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో దరఖాస్తు చేసుకోవటానికి ఈ పరీక్ష ఓ చక్కని మార్గంగా ఉంది. ప్రతి ప్రవేశపరీక్షా ఆన్‌లైన్‌ పద్ధతిలోకి మారుతున్న ఈ రోజుల్లో ఇంకా కొందరు విద్యార్థులకు కంప్యూటర్‌ చేరువ కాలేదు. ఇలాంటివారికి పేపర్‌ బేస్డ్‌ పద్ధతిలో 'మ్యాట్‌' నిర్వహించటం అనుకూలం. మల్టిపుల్‌ చాయిస్‌ సమాధానాలుండే ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలను సాధించాల్సివుంటుంది. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. తప్పు సమాధానం రాస్తే 1/4 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష అభ్యర్థి సాధారణ సామర్థాన్ని పరీక్షించేలా రూపొందింది.

డిసెంబరు 1న మ్యాట్‌ను పేపర్‌ ఆధారితంగా నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు పరిమితంగా ఉంటే ఈ పరీక్ష కూడా డిసెంబరు 1నే జరుగుతుంది. లేకుంటే డిసెంబరు 7న నిర్వహిస్తారు.
విద్యార్థులు అక్టోబరు మొదటి వారం నుంచి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పేపర్‌ ఆధారిత పరీక్షకు అడ్మిట్‌ కార్డులను AIMA వెబ్‌సైట్‌ http://apps.aima.in/matadmitcard.aspxలో నవంబరు 23 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎలా సంసిద్ధం కావాలి?
విద్యార్థులు మొదట మాక్‌ మ్యాట్‌ రాయాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా నమూనా మ్యాట్‌ పరీక్షను రాసే వీలుంది. ఇలా చేస్తే పరీక్ష పద్ధతి అవగాహనకు వస్తుంది. దానికి అనుగుణంగా ఎలా చదవాలో ప్రణాళికీకరించుకోవచ్చు. నమూనా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినపుడు నిరాశపడకూడదు. ఈ పరీక్ష రాయటం స్కోరు కోసం కాదని గుర్తించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నదీ, వేటిలో పటిష్ఠంగా ఉన్నదీ గుర్తించటానికి ఈ పరీక్ష ఫలితాలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.

ప్రతి టాపిక్‌లోనూ కాన్సెప్ట్‌పై అవగాహన పెంచుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు- రేషియోస్‌ అనే అధ్యాయంలో కీలకాంశం ఏమిటో గ్రహించాలి. తర్వాత ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని రకాల ప్రశ్నలకూ జవాబులు రాసేలా తయారవ్వాలి. మళ్ళీ ఇదే అధ్యాయంలో మరోసారి ఎక్సర్‌సైజులు చేయాలి. ఈసారి సమయం చూసుకోవాలి. 40 నిమిషాలకు 40 మాథ్స్‌ ప్రశ్నలంటే నిమిషానికి ఓ ప్రశ్న. ఒక ఎక్సర్‌సైజులో 10 ప్రశ్నలుంటే వాటిని 10 నిమిషాల్లో చేయటానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు నిమిషం కంటే ఎక్కువ వ్యవధి పట్టవచ్చు; కొన్నిటికి నిమిషం కంటే తక్కువ సమయం పట్టొచ్చు. మొత్తమ్మీద వాటన్నిటినీ 10 నిమిషాల్లో పూర్తిచేయటం ముఖ్యం. ఈ రకంగా చేస్తే వేగం, కచ్చితత్వం కూడా పెరుగుతాయి. ఒక ప్రధానాంశంలోని అన్ని టాపిక్స్‌లోని కాన్సెప్టులపై పట్టు వచ్చాక, వాటన్నిటిపై ఓ పరీక్ష రాయాలి. ఉదాహరణతో చెప్పాలంటే- అరిథ్‌మెటిక్‌లో రేషియో, పర్సంటేజి, సింపుల్‌ ఇంటరెస్ట్‌, కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, వర్క్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఉంటాయి. ఈ కాన్సెప్టులపై అవగాహన సాధించాక అరిథ్‌మెటిక్‌లో పరీక్ష రాసి పరిశీలించుకోవాలి. నేర్చుకున్న అంశాలు దీనివల్ల మరింత పటిష్ఠమవుతాయి. విభిన్నమైన ప్రశ్నల నమూనాలను నిర్దిష్ట వ్యవధిలోనే చేయగలుగుతారు.

జనరల్‌ అవేర్‌నెస్‌ మినహాయించి మిగిలిన మూడు విభాగాలకూ ఇదే తీరు పాటించాలి. ఒక్కో విభాగంపై పట్టు సాధించాక పూర్తి నిడివి పరీక్ష అభ్యాసం చేయటం మొదలుపెట్టాలి. ఒకేసారి రెండున్నర గంటల సమయంలో పరీక్ష రాయటానికి శక్తి, సహనం అవసరమవుతాయి. ఇలాంటి నమూనా పరీక్షలు రాశాక సరైన, తప్పు జవాబులు రెంటినీ విశ్లేషించుకోవాలి. ఫలితంగా స్కోరు క్రమంగా మెరుగుపడుతుంది. అసలైన పరీక్షలో సందేహాలకు అతీతంగా మంచి స్కోరు సాధ్యమవుతుంది.

సారాంశం ఏమిటంటే... కాన్సెప్టులపై మొదట దృష్టిపెట్టాలి. తర్వాత ఎక్సర్‌సైజులు చేయాలి. క్రమంగా పూర్తినిడివి పరీక్షలు రాసి, నైపుణ్యాలూ, వ్యూహాలకు పదునుపెట్టుకోవాలి.

విభాగాలవారీగా  సన్నద్ధత  సూచనలు www.eenadu.net చదువు విభాగంలో  చూడవచ్చు.