ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 10 December 2012

'నీట్‌' పరీక్షలో గెలుపు సులువే!





మార్పు అనివార్యమైనపుడు దానికి తగ్గట్టుగా మనల్ని మల్చుకోకతప్పదు. సానుకూలవైఖరితో ముందడుగు వేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. 2013లో సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే ఎం.పి.సి., బై.పి.సి. విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పూర్తిమార్పులు చోటు చేసుకున్నాయి. ఎం.పి.సి. విద్యార్థులకు జేఈఈ- మెయిన్స్‌ మాదిరిగానే బై.పి.సి. వారికి 'నీట్‌' రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్పును తల్చుకుని బెంబేలుపడకుండా మంచి ర్యాంకు సాధనకు దీక్షతో సమాయత్తం కావాలి!


ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రభుత్వ, 25 ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో 5600 మెడికల్‌ సీట్లూ; మూడు ప్రభుత్వ, 18 ప్రయివేట్‌ డెంటల్‌ కళాశాలల్లో 1790 సీట్లూ ఉన్నాయి. అంటే మెడికల్‌, బీడీఎస్‌లతో కలిపి 7390 సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచి 'నీట్‌'లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారన్నమాట.
అయితే ఇప్పటికీ చాలామంది 'నీట్‌ ఉందా? ఎంసెట్‌ ఉందా? లేదా రెండూ ఉన్నాయా?' అనే సందిగ్ధంలో ఉన్నారు. రెండు పరీక్షలు జరిపే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఒకే పరీక్ష ఉంటుంది. అయితే అది 'నీట్‌' అవడానికే అవకాశం ఎక్కువ!

ఎందువల్లనంటే- మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 2010లోనే దేశంలోని మెడికల్‌ కళాశాలలన్నిటికీ ఒకే ప్రవేశపరీక్ష జరగాలని ఒక స్పెషల్‌ గెజిట్‌ విడుదల చేసింది. (గెజిట్‌ నెం. MCI-31(1)/2010_Med/49068, dated 21.12.2010). దాన్ని అనుసరించి 2012లోనే ఉమ్మడి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది.

అయితే వివిధ రాష్ట్రాలు 2012లో విద్యార్థులు సంసిద్ధం తయారుకాలేరని అభ్యంతరం చెప్పటం, కొన్ని సాంకేతిక కారణాల వల్లా మళ్ళీ ఒక స్పెషల్‌ గెజిట్‌ విడుదల చేశారు. పరీక్షను 2013 నుంచి జరుపుతామని నిర్ణయించారు. (గెజిట్‌ నెం.MCI-31(1)/2010_Med/62051, dated 15.02.2012). ఈ రెండు గెజిట్‌ల ఆధారంగా మెడికల్‌ కౌన్సిల్‌ 2013లో ప్రవేశపరీక్ష జరిపే దిశలో విధివిధానాలతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో పరీక్ష జరగడానికే అవకాశాలు అధికం. పరీక్ష తెలుగులో జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఎటువంటి మానసిక ఒత్తిడీ లేకుండా పరీక్షకు తయారుకావచ్చు.

ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే వాటినుంచి తయారీ విధానం గురించి ఆలోచించుకోవచ్చు.

 ఆన్‌లైన్‌ దరఖాస్తు
ఈ పరీక్షకు డిసెంబర్‌ 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేయాలి. దీనికోసం www.cbseneet.nic.inఅనే వెబ్‌పేజీని ఓపెన్‌ చేసి మొదటగా నమూనా దరఖాస్తును ప్రింట్‌ తీసుకోవాలి. దాన్ని నింపి, దాని ఆధారంగా మళ్ళీ ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తే తప్పులు చేసే అవకాశం ఉండదు.

నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేసిన తర్వాత దాన్ని A5 పేపరుపై ప్రింటు తీసుకోవాలి. వీటిని మూడు నుంచి ఐదు కాపీల వరకు ప్రింటు తీసుకొని వాటిపై ఫొటోగ్రాఫ్‌ అంటించి అటెస్టేషన్‌ చేయించాలి. ఫొటోగ్రాఫు నవంబరు ఒకటో తర్వాత తీసినదై ఉండాలి. ఫొటోగ్రాఫ్‌ కింద విద్యార్థిపేరు, ఫొటోతీసిన తేదీ ప్రింటు అయి ఉండాలి. ఆ ఫొటోగ్రాఫ్‌ని అంటించిన తర్వాత సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌/ గెజిటెడ్‌ ఆఫీసర్‌ చేత దానిపై సంతకం చేయించాలి. మిగిలిన సంతకాలు కూడా పూర్తిచేసి CBSE ఆఫీస్‌కు పంపించవలసి ఉంటుంది. ముందుగా ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేస్తే ఇక పూర్తిగా పరీక్షకు తయారయ్యే విధానంపైనే దృష్టి సారించవచ్చు.





సంసిద్ధమయ్యే విధమెలా?
ఎంసెట్‌కూ, నీట్‌కూ ఉన్న తేడాలు గమనించాలి. ఎంసెట్‌లో 160 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించవలసి ఉంటుంది. నీట్‌లో 180 ప్రశ్నలుంటాయి. ఈ 180 ప్రశ్నలు మూడు సమవిభాగాలుగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో 60 ప్రశ్నల చొప్పున ఉంటాయా లేదా బయాలజీ (బోటనీ + జువాలజీ) 90 ప్రశ్నలు, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉంటాయా అనేది ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అయితే CBSE PMT పరీక్షలో 200 ప్రశ్నలు (50X4) ఉంటున్నాయి కాబట్టి 45 X4 అంటే బోటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉండే అవకాశం ఎక్కువ.
ఎంసెట్‌ కంటే అదనంగా 20 ప్రశ్నలు పెరుగుతున్నందున పరీక్షలో వేగం కొంత పెంచుకోవాలి. అయితే జాతీయస్థాయి పరీక్షల్లో మనరాష్ట్ర ఎంసెట్‌ కంటే భౌతిక, రసాయనశాస్త్ర పేపర్లు సులభంగా ఉంటున్నాయి కాబట్టి పెద్దగా ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు.

రుణాత్మక మార్కులపై మన రాష్ట్ర విద్యార్థులకు అభ్యాసం లేదు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. జవాబు గుర్తించేటప్పుడు తెలియని ప్రశ్నలకు జవాబులు వదిలివేయడం మేలు. లేదా నాలుగు సమాధానాలను స్పష్టంగా చదివి; కనీసం రెండు జవాబులు ఆ ప్రశ్నకు వర్తించవని భావిస్తే మిగిలిన రెండింట్లో ఒకదాన్ని గుర్తించడానికి ఛాన్స్‌ తీసుకోవచ్చు. అంతేకానీ ఏమీ తెలియకుండా జవాబు గుర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.

1) రుణాత్మక మార్కులు ఉన్నాయి 2) ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఈ రెండు అంశాలనూ అధిగమించాలంటే ఎక్కువసార్లు పునశ్చరణ చేయాల్సిందే. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి.

సిలబస్‌లో వ్యత్యాసాలు
మన విద్యార్థుల పరంగా చూస్తే- నీట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో దాదాపు తేడా లేదనే చెప్పాలి. కానీ జీవశాస్త్రం (బయాలజీ)లో వ్యత్యాసం చాలా ఉంది. జాగ్రత్తపడవలసిన ఓ అంశం- ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్‌ మార్కు సాధిస్తేనే ర్యాంకు పొందే అవకాశం ఉండటం.

మన ఎంసెట్‌లో సీటు సాధించడానికి ఇటువంటి కనీసమార్కు లేదు కాబట్టి బయాలజీ, కెమిస్ట్రీ చదువుకొని కూడా ర్యాంకు సాధించగల్గుతున్నారు. అంటే బయాలజీలో 75 మార్కులు, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించి ఫిజిక్స్‌లో 2 లేదా 3 మార్కులు సాధించినవారు కూడా మెడికల్‌లో చేరే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్‌ మార్కు సాధించాలి కాబట్టి మూడు సబ్జెక్టులకూ సమప్రాధాన్యం ఇచ్చి తయారుకావాలి.

మన రాష్ట్రవిద్యార్థులకు సీట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌ విద్యార్థులు నేషనల్‌పూల్‌లో లేరు కాబట్టి ఈ రాష్ట్రాల్లో నూరు శాతం సీట్లు అదే రాష్ట్ర విద్యార్థులతోనే నింపుతారు. అంటే ఎంసెట్‌ స్థానంలో నీట్‌ జరుగుతుంది. సీట్లు నింపే పద్ధతీ, సీట్ల సంఖ్యా గతంలో మాదిరే ఉంటుంది. అయితే మన రాష్ట్రవిద్యార్థులు ఇతర డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోని ప్రయివేట్‌ కళాశాలలో కేటగిరి-సి సీట్లనూ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదనంగా 300 వరకూ సీట్లు లభ్యం అవుతాయి.

'నీట్‌' మన రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు- ఈ ఐదు కేంద్రాల్లో మే 5న జరుగుతుంది. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో డైరక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పర్యవేక్షణలో జరుగుతుంది.
- పి.వి.ఆర్.కె. మూర్తి

(కటాఫ్ పర్సంటైల్ అంటే?   పునశ్చరణ అవసరం ఏమిటి?... వీటి కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.)

No comments:

Post a Comment