గ్రూప్-2 కార్యనిర్వాహక పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగార్థులకు కొత్త సవాలు ఎదురయింది. రెండు పరీక్షలు రాయాల్సిరావటమే కాదు; ప్రధాన పరీక్ష లక్ష్యాత్మక (ఆబ్జెక్టివ్) పద్ధతి నుంచి వివరణాత్మక (డిస్క్రిప్టివ్) విధానంలోకి మారిపోయింది. ఈ మార్పులకు తగిన వ్యూహం రూపొందించుకోవటం తక్షణ కర్తవ్యం!
ఇప్పటివరకూ గ్రూప్-1 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్-1 (ఎ)గా; గ్రూప్-2 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్-1 (బి)గా మారుస్తున్నట్లు (జీవో ఎంఎస్ నంబర్ 622) ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రూప్-1 రాతపరీక్ష ద్వారా ఎంపిక జరిగే ఉద్యోగాల పరిధి బాగా విస్తృతమయింది. కానీ ఇప్పటివరకూ గ్రూప్-2పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు డీలా పడ్డారు.మారిన పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధత వ్యూహాన్ని మార్చుకోవాలంటే ఈ పరీక్షల స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి.ఏ రకమైన డిగ్రీ అయినా శ్రేణి, శాతంతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులైతే దరఖాస్తుకు అర్హులే.
కొత్త అభ్యర్థులు
గత పరీక్షానుభవం లేకపోయినా కొత్త అభ్యర్థులు ప్రతి నోటిఫికేషన్లోనూ భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. 2008, 2011 నోటిఫికేషన్లలో తొలిసారే పరీక్ష రాసినప్పటికీ 50 శాతానికి పైగా ఉద్యోగాలను వారే సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరీక్షా విధానం, మారుతున్న ప్రశ్నల ధోరణి సీనియర్, జూనియర్‌ల మధ్య పెద్ద తేడాను సృష్టించటం లేదు. అందువల్ల కొత్త అభ్యర్థులు సైతం గ్రూప్-1 ఉద్యోగానికి ధీమాగా ప్రయత్నించొచ్చు.
* సన్నద్ధత సమయంలో 2/3 వంతు సమయాన్ని ప్రిలిమినరీకి కేటాయించాలి. పరీక్షకు నెలరోజుల ముందునుంచీ 100 శాతం సమయం ప్రిలిమినరీకి కేటాయించాలి.
* ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మిగిలిన 1/3 వంతు సమయాన్ని మెయిన్స్‌లో కనీసం 3 పేపర్లకు కేటాయించాలి.
* 'ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ సన్నద్ధత' ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా అనుసరణీయం.
* బీటెక్/ గణిత నేపథ్యం ఉన్నవారు పేపర్-1,2,3,4 లను ఇప్పటినుంచే ప్రిలిమినరీతో కలిపి చదవటం మంచిది.
* ఆర్ట్స్ నేపథ్యమున్న అభ్యర్థులు పేపర్-1,4,5లపై బాగా దృష్టి పెట్టవచ్చు.
* ముఖ్యంగా వ్యాసరచన (పేపర్-1) కృషిని ఇప్పటినుంచే మొదలుపెడితే మిగిలిన పేపర్లలో వ్యాస సంబంధిత అంశాలను ఎలా అనుసంధానించుకోవచ్చో అర్థమవుతుంది. ఫలితంగా గ్రూప్-1 స్థాయికి తగిన భావనల పునాది ఏర్పడి 250-300/750 మార్కులకు సిద్ధమైనట్లే!
గ్రూప్-2 నుంచి గ్రూప్-1కి మారేందుకు మెలకువలు
* గ్రూప్-2 ప్రిపరేషన్లో భాగంగా జనరల్‌స్టడీస్ (పేపర్-1) చదివేవుంటారు కాబట్టి ప్రస్తుతం ప్రిలిమినరీ గురించి ఆలోచించవద్దు. ఈ పరీక్షకు 45 రోజుల ముందునుంచి చదివితే సరిపోతుంది.
* ప్రస్తుత సమయాన్ని మెయిన్స్ సన్నద్ధతకు వినియోగించండి.
* ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనిస్తే ప్రిపరేషన్‌ని ఎలా కొనసాగించాలో దిశానిర్దేశం ఏర్పడుతుంది. అందుకే 2008, 2011, 2012 సంవత్సరాల ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలించండి.
* మెయిన్స్ 2,3,4 పేపర్లలోని ఒక మార్కు ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన (2,3,4 మార్కుల) ప్రశ్నలను గ్రూప్-2 స్థాయిలో తయారైన అంశాల ద్వారా ఎదుర్కోవచ్చు. ఇలాంటి వ్యూహంతో విజయానికి కావాల్సిన 65 శాతంలో 30 శాతం మార్కులు సాధించవచ్చని గమనించాలి.
ఉదా:
1. భారతదేశ దేవాలయ నిర్మాణ శైలికి ఉదాహరణలు?
2. భారతదేశ ఎన్నికల సంఘ అధికారాలు, విధులు?
3. సంస్కరణల అమలు అనంతరం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల సాపేక్ష వాటాలు
4. ఏపీ చిన్నతరహా పరిశ్రమల సమస్యలు
5. టెలి మెడిసిన్ అంటే?
6. కార్డోశాట్-2 రిజల్యూషన్ ఎంత?
7. అణుశక్తి నిర్వచనం
8. సామాజిక అడవులు- ఉపయోగం
* మెయిన్స్‌లో అనేక ప్రశ్నలకు సరైన జవాబులు రాయాలంటే ప్రాథమికాంశాలు (బేసిక్స్) తెలిసుండాలి. వీటిపై పట్టున్న అభ్యర్థులే గతంలో కూడా రాణించారు. ఇప్పటివరకూ గ్రూప్-2 కోసం సిద్ధమైన ప్రాథమికాంశాలు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి.
గ్రూప్-1 సీనియర్ అభ్యర్థులు
* గతంలో కూడా చాలామంది సీనియర్ అభ్యర్థులు ప్రిలిమినరీ కూడా పాసవని సందర్భాలున్నాయి. గ్రూప్-2 వారు 'ప్రాక్టీస్' కోసం ప్రిలిమినరీ రాయటం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం. గత గ్రూప్-2 అభ్యర్థులు ఇప్పుడు శ్రద్ధగా గ్రూప్-1 రాస్తారు కాబట్టి ప్రిలిమినరీ గట్టెక్కటం మరింత క్లిష్టంగా మారనుంది. అందుకు తగిన రీతిలో సిద్ధపడాలి.
* మెయిన్స్‌లో చేసిన తప్పిదాలను గతానుభవాలతో సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వస్తోంది. ప్రిలిమినరీకి రోజూ 2 గంటల సమయం కేటాయించి మెయిన్స్‌పై శ్రద్ధ పెట్టండి.
గ్రూప్-1 ఉద్యోగార్థులందరికీ...
* ప్రతిరోజూ వార్తాపత్రికల అధ్యయనం గ్రూప్-1లో రాణించేందుకు బాగా ఉపయోగపడుతుంది. 2012 గ్రూప్-1లో దినపత్రికల అధ్యయనం ద్వారా దాదాపు 280 మార్కులకు జవాబులు రాయగల్గిన పరిస్థితి ఏర్పడింది.
* సమాధానాలను సంక్షిప్తీకరించటం/ విపులీకరించటం చేయగల సామర్థ్యాలున్నవారు ఎగ్జామినర్లను మెప్పించగలుగుతున్నారు. తద్వారా ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారు.
* ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి సమయం కేటాయింపు ఉండాలి. పేపర్-2,3,4లలో సమయం చాలని సమస్య ఎదురవుతోంది. వీలైనన్ని నమూనా ప్రశ్నలను సమయ నియంత్రణతో రాయటం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి.
* చాలామంది జిరాక్స్ నోట్సులూ, కోచింగ్ నోట్సులూ బట్టీ పడుతున్నారు. ప్రశ్న తీరు మారగానే జవాబు రాయలేకపోతున్నారు. సిలబస్‌లో ప్రతి అంశాన్నీ సమాజానికి అన్వయించటం, దాన్ని సమాధానంలో పొందుపర్చటం ముఖ్యం.
* ఒక పేపర్ ముఖ్యం, మరోటి అంత ముఖ్యం కాదు- ఇలాంటి భావనలు పెంచుకోకుండా అన్ని పేపర్లలోనూ సగటు మార్కుల కంటే కనీసం 5 మార్కులు (ఒక్కో పేపర్‌లో) తెచ్చుకుంటే విజయం తథ్యం!
స్త్థెర్యంతో సాగాలి
గ్రూప్-2 పరీక్షకు మాత్రమే సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్-1 అభ్యర్థులతో సమానంగా పోటీపడలేమనీ, గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ గ్రూప్-1 అభ్యర్థులే దక్కించుకుంటారనీ భయపడుతున్నారు. ఇది వాస్తవమే. కానీ పరీక్షకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా తయారై, గ్రూప్-1 పోస్టులనే సాధించగలమనే స్త్థెర్యంతో ముందుకు సాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
గ్రూప్-2 అభ్యర్థులంతా పరీక్షా పద్ధతి ఎలా ఉన్నా ముందుగా పాత పద్ధతిలోని మూడు పేపర్లకు సంబంధించిన సబ్జెక్టులన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీంతో వారు గ్రూప్-2 నాన్ ఎగ్జిక్యూటివ్ పరీక్షను విజయవంతంగా రాయగలుగుతారు. ఆ తర్వాత ఇదే ప్రిపరేషన్‌తో సాధించిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ, క్రమం తప్పకుండా రాయటం సాధన చేస్తే గ్రూప్-1 (ఎ) పోస్టు గానీ, గ్రూప్-1 (బి) పోస్టు గానీ సాధించే వీలుంటుంది.
వెయ్యి పోస్టులు
ఏపీపీఎస్‌సీ గత నోటిఫికేషన్లను గమనిస్తే గ్రూప్-1 పోస్టులు 300 ఉంటే గ్రూప్-2 కార్యనిర్వాహక పోస్టులు 600కు పైగా ఉంటాయి. అంటే ఒకేసారి, ఒకే పరీక్ష ద్వారా దాదాపు వెయ్యి పోస్టులకు పోటీ పడే అవకాశం! సరైన పంథాలో సిద్ధమైతే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు.
అంతే కాకుండా గ్రూప్-2 ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపితే గ్రూప్-1 పోస్టు పొందే అవకాశమూ ఉంటుంది. అంటే ఆశించినదానికంటే ఎన్నో రెట్లు అధిక ఫలితం సాధించే వీలు!
గ్రూప్-1 సన్నద్ధత అంటే ఆల్‌ఇన్‌వన్
ప్రణాళికాబద్ధంగా గ్రూప్-1 పరీక్షకు సన్నద్ధమైతే ఆల్ ఇన్ వన్ లాగా గ్రూప్-1 (ఎ), గ్రూప్-1 (బి), గ్రూప్-2 పరీక్షలన్నిటికీ సిద్ధమవుతున్నట్లే! ఎందుకంటే- ఇప్పుడు మార్చిన పద్ధతి ప్రకారం గ్రూప్-2 పరీక్ష నాన్ ఎగ్జిక్యూటివ్‌లోని మూడు పేపర్లకు నిర్దేశించిన సిలబస్ మొత్తం గ్రూప్-1 (ఎ), (బి) పరీక్షకు సంబంధించిన మెయిన్ పరీక్షలో ఉంటుంది. అందుకే సిలబస్‌లోని సబ్జెక్టులను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర, భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలపై పట్టు సాధించవలసిందే!
మెయిన్ పరీక్షలో 15 ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలను మూడు గంటల్లో రాయాల్సివుంటుంది. అందుకని ఇప్పటినుంచే రాయటం సాధన చేయాల్సివుంటుంది. గంటకు వెయ్యి పదాల చొప్పున 3 గంటల్లో 3,000 పదాలు రాయాలి.పద్ధతి కొత్తదైనా, పాతదైనా సాగించాల్సిన ప్రిపరేషన్ తీరు ఒకటే. పటిష్ఠమైన ప్రణాళిక, పట్టుదల, కృషి. వీటికి ఆత్మస్త్థెర్యం, ఉత్తమ మార్గదర్శకత్వం తోడైతే లక్ష్యం నెరవేరటంలో సందేహమే ఉండదు.
No comments:
Post a Comment