ఎంసెట్-నీట్... ఏ పరీక్ష రాయాల్సివచ్చినా, ఒకవేళ రెండూ రాయాల్సివచ్చినా బైపీసీ విద్యార్థులు తయారుగా ఉండటం మేలు. అనుకూల అంశాలను గుర్తుచేసుకుంటూ ఆశావహ దృక్పథంతో ప్రణాళిక వేసుకోవాలి; ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించాలి!
ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలోని ప్రవేశపరీక్షలకు దాదాపు 1,25,000 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఏది ఖరారవుతుందనే విషయంపై అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తుండటమే సరైన చర్య.
బైపీసీ విభాగంలో జరిగే పోటీ పరీక్షల్లో సబ్జెక్టుపై అవగాహన ఎంత అవసరమో ఆత్మవిశ్వాసం అంతకంటే ఎక్కువ అవసరమవుతోంది. ప్రణాళికతో తయారు కాగలిగితే ఈ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
జరగబోయే నీట్, ఎంసెట్ రెండు పరీక్షలూ ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలు నీట్ ద్వారా జరిగితే; మిగిలిన కోర్సులైన యునానీ, ఆయుర్వేదిక్, హోమియోపతి, అగ్రికల్చరల్ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశం ఎంసెట్ ద్వారా జరిగే అవకాశం ఏర్పడుతోంది. నీట్ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపు సంశయం కంటే సన్నద్ధత చాలా అవసరం.
ఎంసెట్ 2012 :
మార్కుల, ర్యాంకుల విశ్లేషణ
తయారయ్యేదెలా?
* సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి, మార్చి మొదటివారంలో థియరీ పరీక్షలూ ప్రారంభమవుతున్నాయి కాబట్టి సీనియర్ ఇంటర్ ఆఖరి పరీక్ష మార్చి 19వ తేదీ వరకూ రెండో సంవత్సరం సిలబస్‌కే పరిమితమై చదవాలి.
* ఇంటర్ పరీక్షకు VSAQప్రశ్నలపై బాగా తయారైతే అది ఎంసెట్‌కు కూడా ప్రయోజనం.
* చాలామంది ఈ సమయంలో మొదటి సంవత్సరం సిలబస్ పునశ్చరణ అని సమయాన్ని నష్టపరుచుకుని సీనియర్ సిలబస్ పూర్తికాక ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా మార్చి 19 వరకూ ఆబ్జెక్టివ్‌తో కలిపి రెండో సంవత్సరం సిలబస్ సంపూర్ణంగా పూర్తిచేయగలిగితే ఆ తర్వాత ప్రథమ సంవత్సర సిలబస్ పునశ్చరణకు కావలసిన సమయం దొరుకుతుంది.
* ఇంటర్ అకాడమీ పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదివినా సరిపోతుంది. నీట్‌కు అయితే అదనంగా బోటనీ, జువాలజీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కూడా కచ్చితంగా చదవాలి. అయితే ఈ అదనపు అంశాలు మార్చి 19 తర్వాత చదువుకోవచ్చు.
* ఇంటర్ పరీక్షల ముందు నెలరోజులు పాఠాలు వినడం కంటే విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి ప్రయత్నిస్తే అధికలాభం. సందేహాలు వస్తే వెంటనే అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకోవచ్చు.
* కొంతమంది ఒక వారం ఒక సబ్జెక్టు పూర్తిచేయాలని ప్రయత్నిస్తూవుంటారు. అయితే ఒకే సబ్జెక్టు అంత ఎక్కువ కాలం చదివితే అవగాహనలోపం ఏర్పడవచ్చు. ఇతర సబ్జెక్టులు ఎక్కువకాలం చదవలేదు కాబట్టి మనసులో వాటిపై భయం పెంచుకుని, ఆ సబ్జెక్టులు కూడా సరిగా చదవలేరు. అందుకే వీలైనంతవరకూ ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులూ చదవాలి (పరీక్షల సమయంలో తప్పించి).
* సిద్ధాంతపరమైన ప్రశ్నలు చదివినపుడు ఆకళింపు చేసుకోలేకపోతే కొంత సమయం లెక్కలు చేసి, మళ్ళీ సిద్ధాంతపరమైన భాగాలను చదివితే సరిపోతుంది.
* ఈ సమయంలో కొత్త అంశాలు చదవకుండా, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే ఆత్మస్త్థెర్యం పెంచుకోవచ్చు.
* ఎంసెట్ బైపీసీ విభాగంలో 160 మార్కులకు 115 మార్కులపైన సాధించగలిగితే సీటు సాధించినట్లే. ఆ మార్కులు పొందాలంటే బయాలజీలో 75, కెమిస్ట్రీలో 35, ఫిజిక్స్‌లో మిగిలిన మార్కులు సాధించగలిగితే సరిపోతుంది. పట్టున్న సబ్జెక్టులో అధిక మార్కులు సాధించటం ముఖ్యం!
పూర్తి కథనం కోసం www.eenadu.net చదువు విభాగం చూడండి!