ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 25 February 2013

సివిల్స్ జైత్రయాత్రకు అపోహలే అవరోధాలు!

సివిల్స్‌ పరీక్షకు తయారటానికి సుదీర్ఘ కాలం పడుతుంది కాబట్టి... దీనికి ప్రయత్నం చేయాలో లేదో; తమకు తగిన సామర్థ్యం ఉందో లేదో అనే సందేహాలు అభ్యర్థుల్లో ఉండటం చాలా సహజం. ఈ పరీక్ష చుట్టూ అల్లుకున్న అపోహలను ఎంత త్వరగా నివృత్తి చేసుకుంటే ఆశావహులకు అంత శ్రేయస్కరం!

జిల్లా కలెక్టర్‌గా/ ఎస్పీగా అవ్వాలని యువత గాఢంగా కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ హోదాల్లోని గౌరవం, ప్రత్యేకత వారికి అలాంటి ప్రేరణనిస్తుంది. జిల్లా మొత్తం అధికార యంత్రాంగం చిన్నా పెద్దా సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌మీద ఆధారపడుతుంది. జిల్లా పోలీసు సిబ్బందిని నియంత్రించే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సాధారణంగా కలెక్టర్‌ కన్నా చిన్నవయసులో ఉంటారు. (ఐపీఎస్‌కు ఎంపికయ్యాక ఐదారేళ్ళలో ఎస్పీ అవుతారు కానీ కలెక్టర్‌ అవ్వటానికి ఐఏఎస్‌కు ఎంపికయ్యాక పది పన్నెండేళ్ళు పడుతుంది.)
ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావటానికి పోటీ పరీక్ష రాయాలని తెలుసు. అయితే నాకు ఈ లక్ష్యం తగినదేనా? నాలో ఈ సత్తా ఉందా? విజయవంతం కాగలుగుతానా?- ఇవి చాలామందిలో మెదిలే ప్రశ్నలు!

పైగా చుట్టుపక్కలవాళ్ళు ప్రోత్సాహం ఇవ్వకపోగా వ్యతిరేక భావనలు పెంచేస్తుంటారు. 'ఐదేళ్ళపాటు సిద్ధపడినా నాకు తెలిసిన ఒకతను సివిల్స్‌ రాయలేకపోయాడు. అతడికి టెన్త్‌లో 98 శాతం, ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి. అతడికే సాధ్యం కానపుడు నీవల్లవుతుందా?' ... ఇలాంటి చర్చలు అనంతంగా సాగుతూ అభ్యర్థుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లుతుంటాయి. ఎన్నో సందేహాలు ముసిరి, వారిని ప్రయత్నం చేయనీకుండా వెనక్కి లాగుతుంటాయి.


ముఖ్యమైన సందేహాలు

* నేను సగటు విద్యార్థిని. డిగ్రీ ఎలాగోలా పూర్తిచేశాను. ఈ పరీక్షలో అర్హత సాధించే అవకాశం నాకుందా?

మొట్టమొదట- సగటు విద్యార్థిని అనో, సగటు కంటే కిందిస్థాయి అనో, అసాధారణ విద్యార్థిని అనో ముద్ర వేసుకోకూడదు. చదువుల్లో సరిగా ప్రతిభ చూపలేదంటే మీ నియంత్రణలో లేని కారణాలు ప్రభావం చూపివుండవచ్చు. ఎన్నో అనుకూలాంశాలు చుట్టూ ఉన్నా కూడా చదివేదానిపై ఆసక్తి లేకపోయివుంటే పరీక్షల్లో సరిగా రాసివుండకపోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే ప్రయత్నాలు వాటికవే రూపుదిద్దుకుంటాయి.

ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నపుడే మన శక్తిసామర్థ్యాలను గుర్తించగలుగుతాం. అప్పుడే సంపూర్తిగా లీనమై చేయటం గమనించవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ మీ ఏకైక లక్ష్యంగా మారితే దాన్ని సాధించటానికి మార్గాలూ, సాధనాలూ మీరే గుర్తించగలుగుతారు.

ఈ సర్వీసు సాధించినవారిలో ఎంతోమంది 'సగటు' విద్యార్థులున్నారు. పాఠశాలో, కళాశాలలో ఏనాడూ మంచి మార్కులు తెచ్చుకోనివారున్నారు. కానీ కళాశాల తర్వాత సివిల్‌ సాధించాలనే స్థిరమైన, స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాక దానిలో విజయం కోసమే వారు తమ సర్వశక్తులూ వినియోగించారు!

* నేను డిగ్రీలో కేవలం పాసైన విద్యార్థిని. సివిల్స్‌ యాత్రలో నాకెలాంటి సమస్యలు ఎదురవుతాయి?

మొదట తల్లిదండ్రులూ, స్నేహితులూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. వాళ్ళేమంటారంటే- 'ఇప్పటిదాకా నువ్వేమీ సాధించలేదు కదా, సివిల్స్‌లో ఎలా నెగ్గగలవు?' అని. మీరు నిరుత్సాహపడొచ్చు కానీ వారలా చెప్పటంలో సబబు ఉంది- మీరింకా మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేదు కాబట్టి. నేను మారానననీ, ఒక లక్ష్యం గుర్తించాననీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు వారు తప్పకుండా మీకు మద్దతునిస్తారు.

రెండో సమస్య ఏ దిశలో ముందుకు సాగాలనేది. మీకంటే ఈ పరీక్ష గురించి బాగా తెలిసినవారి సాయం తీసుకోవాలి. వారినుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల బలహీనతలూ, లోపాలపై కాకుండా వారి బలాలపై దృష్టి పెట్టండి. మీకు సౌకర్యంగా ఉండే స్థలం (ఇల్లు, ఊరు, బస్తీ) వదిలి మీలాంటి జీవితాశయాలున్నవారుండే చోటుకు మారటం దీనిలో భాగమే!

మూడోది మార్గదర్శనం. ఈ పరీక్షపై చక్కని అవగాహనఉన్నవారి సూచనలు పొందటం. అది స్నేహితులైనా కావొచ్చు; ఉపాధ్యాయులైనా కావొచ్చు.

నాలుగో అంశం- పరీక్ష రాసి దాని గురించి తెలుసుకోవటం. దీనివల్ల వాస్తవం ఏమిటన్నది స్వానుభవంతో గ్రహించవచ్చు.


(పూర్తి కథనం -  www.eenadu.net చదువు విభాగంలో చూడండి)

Friday, 22 February 2013

ఎంసెట్‌ నగారా


ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్రుతతో ఎదురు చూస్తోన్న ఎంసెట్‌ ప్రకటన వెలువడింది. ఎంపీసీ విద్యార్థుల విషయంలో స్పష్టతతో, బైపీసీ విద్యార్థులకు సంశయం కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్‌ రూపొందింది. మంచి భవితకు బాట కోసం ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధన అత్యవసరం. దీనికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాల్సిన తరుణమిది!

పోటీ పరీక్ష ఏదైనా దానికి తయారయ్యే విధానం, మానసిక సంసిద్ధత.. ఈ రెండు అంశాల మేరకే ఫలితాలుంటాయి. కష్టపడి చదవడం తప్పనిసరే కానీ, నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడటం ముఖ్యం. అప్పుడే గెలుపు సులభమవుతుంది. కానీ చాలామంది విద్యార్థులు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వక నష్టపోతున్నారు.

ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఎందుకో ఒక్క ఉదాహరణ ద్వారా చూద్దాం.
ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని అనుకుందాం. ఒక విద్యార్థి హిందీలో 90 మార్కులు, మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 92 మార్కులు తెచ్చుకున్నాడని అనుకుందాం. వేరొక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 99 లేదా 100 మార్కులు తెచ్చుకుంటూ ఒక సబ్జెక్టులో హిందీ కాకుండా 90 మార్కులు సాధించాడని అనుకుందాం.

ఈ ఇద్దరిలో మొదటి విద్యార్థికి 10 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 10/10, రెండో విద్యార్థికి 9.8 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 9.8/10 వచ్చినట్లు అవుతుంది. మార్కులపరంగా చూస్తే మొదటి విద్యార్థి మార్కులు కేవలం 550/600. మరి రెండో విద్యార్థి మార్కులు 590/600 వరకూ ఉండే అవకాశముంది. మరి ఈ ఇద్దరిలో తేడా అంటే ప్రణాళిక మాత్రమే.

మారిన గ్రేడింగ్‌ విధానం అర్థం చేసుకుని ప్రాధాన్యం గుర్తించి చదివిన విద్యార్థి 10/10 తెచ్చుకుంటే అవగాహన లేక ప్రణాళిక లేకుండా చాలా కష్టపడి కూడా రెండో విద్యార్థి తెచ్చుకున్నది 9.8/10 మాత్రమే. కాబట్టి మార్కులు సాధించాలంటే కష్టపడాల్సిందే. అయితే అవగాహనతో సరైన ప్రణాళికతో కష్టపడి చదివితే కచ్చితంగా మేటి ర్యాంకుకు అవకాశం ఉంటుంది.


ప్రకటన ప్రకారం...
ఇంజినీరింగ్‌, మెడికల్‌, డెంటల్‌, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌, ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతిల ప్రవేశానికి ఎంసెట్‌ ర్యాంకు ఉపయోగపడుతుంది.

ఈ పరీక్ష రాయడానికి నిబంధనలు చూస్తే... భారతీయులై, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు లేదా సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు. రిజర్వేషన్‌ కేటగిరీలలో ఉన్న విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి.

* బయోటెక్నాలజీలో చేరాలంటే బైపీసీ విద్యార్థులు లెక్కలులో బ్రిడ్జి కోర్సు పరీక్ష పాసై ఉండాలి.
* ఇంజినీరింగ్‌, ఫార్మసీలైతే విద్యార్థికి డిసెంబరు 31, 2013 లోపు 16 సంవత్సరాలు పూర్తి అయివుండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు.

* మెడికల్‌ విభాగంలో అయితే డిసెంబరు 31, 2013లోపు విద్యార్థి 17 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి. అలా కాని పక్షంలో ప్రవేశ అర్హత లభించదు. అలాగే గరిష్ఠ వయః పరిమితి జనరల్‌ కేటగిరి అయితే 22 ఏళ్ళు, రిజర్వేషన్‌ కేటగిరి అయితే 25 సంవత్సరాలు.

ఎలా సంసిద్ధమవ్వాలి?

ఇంటర్‌ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆఖరు తేదీ మార్చి 19 వరకూ ఇంటర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది.

ఇంటర్‌లో మూడు రకాల ప్రశ్నలుంటాయి. LAQ, SAQ, VSAQవీటిలో సాధారణ విద్యార్థులు LAQ, SAQలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదువుతారు. కచ్చితంగా మంచి మార్కులు లేదా నూరు శాతం మార్కులు సాధించాలనే ధ్యేయంతో ఉన్నవారు అధికంగా VSAQలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే అకాడమీ పుస్తకాలు చదవడంతో బాటు ఆబ్జెక్టివ్‌ ఓరియెంటేషన్‌లో కూడా తయారీ కావాలి.

అకాడమీ పుస్తకాలు చదవడం అంటే చివర్లో ఉన్న ప్రశ్నలు జవాబులు మాత్రమే కాకుండా పాఠ్యాంశం కూడా పూర్తిగా కనీసం ఒక్కసారైనా చదివి ఉండాలి. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యేవరకూ ఈ సిలబస్‌కు పరిమితమై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళాలి.

కాలవ్యవధి స్వల్పంగా ఉంది కాబట్టి రాని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవడం సరికాదు. దానికి బదులు- వచ్చిన అంశాలనే ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటూ వెళితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలో కూడా వేగం పెరుగుతుంది.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల తర్వాత ఎంపీసీ విద్యార్థులు అయితే జేఈఈ- మెయిన్స్‌కు తయారవుతుంటారు. 10 రోజుల్లో జూనియర్‌ సిలబస్‌ పూర్తి చేసుకుని మిగిలిన వారం రోజులూ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించుకోవడం మేలవుతుంది.

ఆ తర్వాత ఎంసెట్‌, బిట్‌శాట్‌ రెండు పరీక్షలకూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ రెండింటినీ పునశ్చరణ చేసుకుంటూ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా రాయాలి. ఎంసెట్‌లో రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి జవాబు తెలియనప్పటికీ ప్రతి ప్రశ్నకూ ఏదో ఒక జవాబు రాసే చాన్స్‌ తీసుకోవచ్చు. ఏప్రిల్‌ ఆఖరు వారం నుంచి గ్రాండ్‌ టెస్టులు రాయడం ప్రారంభించాలి.

బైపీసీ విద్యార్థులు అయితే మార్చి 19 తర్వాత కనీసం 20 రోజులు ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణ చేసుకోవాలి. సిలబస్‌ను చిన్న భాగాలుగా విభజించి నమూనా పరీక్షల రూపంలో అభ్యాసం చేయాలి. బయాలజీ విద్యార్థులు అధికశాతం నష్టపోవడానికి కారణాలు.. సబ్జెక్టుపై అవగాహన లేక కాదు! వాటిని ప్రశ్నల రూపంలో తర్ఫీదు పొందకపోవడమే. అందుకే వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ఇక్కడ కూడా రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు గుర్తించకుండా వదిలి వేయాల్సిన అవసరం లేదు.

ఎంపీసీ లేదా బైపీసీ ఏ విభాగం అయినా మన అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైనా ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన తయారీ ఏ విద్యార్థికయినా విజయం సాధించిపెడుతుంది!

(పూర్తి కథనం కోసం www.eenadu.net లో చదువు విభాగం చూడండి..)