జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగ నియామకాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. డిసెంబరు 3న పరీక్షలు జరుగనున్నాయి.
తెలుగు అధ్యాపకుల పోస్టుల కోసం రాతపరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సూచనలూ, సలహాలూ ఇస్తున్నారు... పోటీపరీక్షల నిపుణులు డా. ద్వా.నా. శాస్త్రి
ఇప్పటివరకూ సాహిత్యం, వ్యాకరణం, కావ్య విమర్శ, భాషాశాస్త్రం, సంస్కృతం అంశాలకు సంబంధించి జేఎల్ అభ్యర్థులుగా బాగా చదివివుంటారు. శిక్షణ తీసుకున్నా తీసుకోకపోయినా కృషిచేసివుంటారు.
ఇప్పుడు గ్రహించవలసినవి:
* కొత్తపుస్తకాలు, మరొక 'మెటీరియల్' కోసం ఆరాటపడటంగానీ, చదవటం కానీ సమంజసం కాదు.
* చదివినవి పునశ్చరణ చేసుకోవాలి.
* పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. అయితే వాటిలో తెలియనివి ఉంటే గాభరా పడకూడదు.
* వీలైతే ఓ ఇద్దరు కలిసి అధ్యాయాలవారీగా ప్రశ్నలు వేసుకుని సిద్ధం కావటం మంచిది.
* ఆత్మవిశ్వాసాన్ని అలవరుచుకోవాలి.
పరీక్షలో సాహిత్యానిదే సింహభాగం అని మర్చిపోవద్దు. ప్రతి అంశం నుంచీ ప్రశ్నలుంటాయి కాబట్టి దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. అయితే కొన్ని ముఖ్యమైన అంశాలపై మరింత శ్రద్ధ వహించాలి.
* ప్రబంధం
* శతకం
* ఆధునిక ఉద్యమ కవిత్వాలు ఇవి చాలా ముఖ్యం.
వచన ప్రక్రియలలో కథ, నవల చాలా ముఖ్యం. వీటికి సంబంధించిన విషయాలను పదేపదే అధ్యయనం చేయాలి. ప్రాచీన కవిత్వం నుంచి, ఆధునిక కవిత్వం నుంచి 'కొటేషన్లు' వస్తాయి.
* 'ఆంధ్రావళి మోదముంబొరయ..' రాస్తానన్నదెవరు? * 'సత్కవుల్ హాలికులైననేమి' అన్నదెవరు?* 'నా కవిత్వంబు నిజము కర్ణాట భాష' అని చాటినదెవరు?* 'ఏ గతి రచించిరేని సమకాలపువారలు మెచ్చరే గదా?' అన్న కవి?* 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని పలికిన కవి?
* 'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు' అన్న కవి?
(సమాధానాలు: తిక్కన, పోతన, శ్రీనాథుడు, చేమకూర వేంకటకవి, దాశరథి, తిలక్)
సాహిత్యం తర్వాత కావ్య విమర్శ, వ్యాకరణాలు కీలకమైనవి. వీటి నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కావ్య నిర్వచనాలు, కావ్యాత్మ, రసం, ధ్వని వంటి అంశాలే కాకుండా అలంకార శాస్త్ర గ్రంథాలూ, వాటి రచయితల పేర్లూ గుర్తుంచుకోవాలి.
వ్యాకరణపరంగా...
వ్యాకరణంలో ముఖ్యంగా బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణాల తులనాత్మక పరిశీలన ప్రధానం. సూరి చెప్పనివీ, బహుజనపల్లి చెప్పినవీ, ఇద్దరూ విభేదించినవీ గుర్తుంచుకోవాలి. ద్రుతము, అవ్యయము, డుమంతము, క్త్వార్థము, స్త్రీ సమము, జ్నిత్తు, నిపాత వంటి పారిభాషక పదాలను మళ్ళీ మళ్ళీ చదవాలి. కవ్వడి, కెందోయి, చిట్టెలుక, ఎయ్యది వంటి సంధి రూపాల నిష్పత్తి, సమాస కారకాలపై దృష్టి సారించాలి.
'రసం' అధ్యాయంలో రస భేదాలు, రసాల స్థాయీ భావాలు, అనుభావాలు, సంచారీ భావాలు కూడా గుర్తుంచుకోవాలి.
భాషాశాస్త్రం
భాషా శాస్త్రానికి మూడో ప్రాధాన్యం ఇవ్వాలి. ద్రావిడ భాషలు, మాండలికాలు, అర్థ విపరిణామం, అన్య భాషాపదాలు అనేవాటికి ప్రాధాన్యం అవసరం. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. సంస్కృతం గురించి ఎక్కువమందికి ఆందోళన ఉంటుంది. ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆరేడు ప్రశ్నల కంటే దీన్నుంచి వచ్చే వీలు లేదు. వీటిల్లో నాలుగైదు కవులు- కావ్యాల గురించి ఉంటాయి. కాబట్టి సంస్కృతం పట్ల దిగులు చెందకుండా మిగిలిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తే ఇందులో ఒకవేళ సమాధానాలు గుర్తించకపోయినా వాటిని సాహిత్యంలో గుర్తించవచ్చు.
1) గ్రంథ రచయితలు- గ్రంథాల మారుపేర్లు (ఉదా: ఉన్నవ లక్ష్మీనారాయణ- మాలపల్లి- సంగ విజయం)
2) తొలి రచనలు (తొలి దండకం- భోగినీ దండకం ; తొలి నాటకం- మంజరీమధకరీయం)
3) విమర్శలు (భావ కవిత్వంపై విమర్శ గ్రంథం- నేటికాలపు కవిత్వం; విమర్శకాగ్రేసర బిరుదు గలవారు కాశీభట్ట బ్రహ్మయశాస్త్రి) ఇలాంటివాటిని పునశ్చరణ చేయాలి.
ఆబ్జెక్టివ్ పద్ధతిలో...
జేఎల్ పరీక్షలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో సమాధానాలు గుర్తించాలి కాబట్టి ఈ సందర్భంగా కొన్ని అంశాలను గుర్తించాలి.
* ప్రశ్నపత్రం చదువుతూనే తెలిసినవాటికి సమాధానం గుర్తిస్తూ సాగాలి. తెలియనివాటికోసం మళ్ళీ మొదటికి రావాలి.
* సమాధానం తెలియనపుడు ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకూడదు.తర్వాతి ప్రశ్నకి వెళ్ళాలి.
* ప్రశ్నను పూర్తిగా చదవాలి.
ఉదా: 'కిందివానిలో శ్రీనాథుని రచన కానిదేది?' అని ఇస్తే గతంలో కొందరు అభ్యర్థులు శ్రీనాథుని రచనను గుర్తించారు.
ఇలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తే విజయం తథ్యం!
No comments:
Post a Comment