ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 26 April 2012

కొత్త కోర్సులతో మేనేజ్‌మెంట్‌కు మహర్దశ!


మేనేజ్‌మెంట్‌ కెరియర్‌పై ఆసక్తి గల ఇంటర్మీడియట్‌ / 10+2 విద్యార్థులకు రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అవి... 1. మేనేజ్‌మెంట్‌లో డ్యుయల్‌ డిగ్రీ 2. ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / ఫార్మసీలతో కలిపి అందించే ఇంటెగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ. ఈ కోర్సులకు 2012-13 విద్యా సంవత్సరం నుంచే అనుమతి ఇవ్వనున్నట్టు ఏఐసీటీఈ చైర్మన్‌ ఎస్‌.ఎస్‌.మంథా ఇటీవల ప్రకటించారు. అమెరికా, యూకేలలో ఇలాంటి కోర్సులు బాగా అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో కూడా వీటికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏఐసీటీఈ చొరవ తీసుకోవడం శుభ పరిణామం

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులతోపాటు మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగవుతాయి. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం... ఇంటర్‌/ +2 తర్వాత బీబీఏ + ఎంబీఏ డ్యుయల్‌ డిగ్రీ చేయవచ్చు. ఈ కోర్సులో మూడేళ్లు పూర్తిచేసినవారికి బ్యాచిలర్‌ డిగ్రీ, నాలుగేళ్లు చదివినవారికి అప్లయిడ్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ ఇస్తారు. ఈ డిగ్రీతో అవసరమైతే ఉద్యోగంలో చేరవచ్చు. కొన్నాళ్లు పనిచేసిన తర్వాత, రిజిస్ట్రేషన్‌ గడువులోగా మరో ఏడాది కోర్సు చేస్తే మాస్టర్స్‌ డిగ్రీ లభిస్తుంది.
ఈ కోర్సుల ప్రత్యేకతలు
విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి విభిన్న కోర్సులు చేయడానికి ఏఐసీటీఈ నిర్ణయం వీలు కల్పిస్తుంది. మేనేజ్‌మెంట్‌ విద్యను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఈ కోర్సులకు కింది ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవి...

* నిర్దిష్ఠ కాలం తర్వాత కోర్సు నుంచి వైదొలగిన వారికి సంబంధిత డిగ్రీ వస్తుంది. ఉదాహరణకు డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లో మూడేళ్ల తర్వాత కోర్సు నుంచి వైదొలగితే బీబీఏ వస్తుంది.
* కోర్సు మధ్యలో వైదొలగినా, రిజిస్ట్రేషన్‌ వ్యవధి పూర్తయ్యేలోగా మళ్లీ వచ్చి మిగతా భాగాన్ని పూర్తిచేయవచ్చు.
* యూజీ నుంచి పీజీ కోర్సుకు వెళ్లడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు.
* రెండు డిగ్రీలు వేర్వేరుగా చేస్తే పట్టే సమయం, అయ్యే ఖర్చుకంటే తక్కువ వ్యవధి, ఖర్చుతో ఆయా డిగ్రీలను సాధించవచ్చు.

ఉన్నత విద్యను ప్రణాళికా బద్ధంగా చదవడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఖర్చులు, సమయం పరంగా చూస్తే ఆర్థికంగా వెనుకబడిన వారికి వీటివల్ల ప్రయోజనం ఉంటుంది.


బహుముఖ పరిజ్ఞానంతో భవిష్యత్తు
సమస్యను బహుముఖ దృక్పథం నుంచి ఆలోచించి పరిష్కరించాలంటే వివిధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానం అవసరం. అందుకే మల్టీ డిసిప్లీనరీ కోర్సులకు భవిష్యత్తులో డిమాండ్‌ పెరగనుంది. ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీతోపాటు మేనేజ్‌మెంట్‌ చదివిన వారికి ప్రత్యేక విలువ ఉంటుంది. అలాగే బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్‌ చేసిన అభ్యర్థులు సంపూర్ణ సామర్థ్యాలతో మేనేజర్లు అయ్యే అవకాశం ఉంటుంది. సబ్జెక్టును చాలాకాలం చదువుతారు కాబట్టి మేనేజ్‌మెంట్‌ సిద్ధాంతాలు, ఆచరణ, వృత్తిపై లోతైన అవగాహన ఏర్పరచుకోవచ్చు.

ప్రస్తుతం అందిస్తోన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులు సంబంధిత బ్రాంచిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఐదేళ్ల డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ కోర్సుల ద్వారా అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను మరింత సమగ్రంగా తయారుచేయవచ్చు. మాస్టర్స్‌ డిగ్రీలో అందించే స్పెషలైజేషన్‌ అంశాలను ప్రణాళికా బద్ధంగా యూజీలో పొందుపరచడం ద్వారా మంచి కోర్సులు తయారవుతాయి. ఆర్నెళ్ల ఇంటర్న్‌షిప్‌ రూపంలో ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ అందించడం ఈ కోర్సుల మరో లక్ష్యం. సాధారణ పద్ధతిలో బీటెక్‌/ బీఫార్మ్‌, ఎంబీఏ చేయాలంటే ఆరేళ్లు పడుతుంది. డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ పద్ధతుల్లో ఐదేళ్లలోనే సమగ్రమైన నిపుణులను తయారు చేయడం వీలవుతుంది.

గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులు కంపెనీల్లో రకరకాల టీమ్‌లు, బాధ్యతల్లో పాలుపంచుకుంటారు. ఈ నేపధ్యంలో నిర్వహణ సామర్థ్యాలు, నైతికత, విలువలు, క్రమశిక్షణ, తదితర అంశాలు చాలా కీలకంగా మారతాయి. డ్యుయల్‌ డిగ్రీలు, ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా ఈ లక్షణాలను, సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. ఒకదానికొకటి సంబంధం ఉన్న విభిన్న అంశాల్లో పరిజ్ఞానం గల అభ్యర్థులు కంపెనీలకు చాలా అవసరం. దీనితోపాటు అభ్యర్థి కెరియర్‌ ఆసక్తిని కూడా దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ఐదేళ్ల కోర్సుల్లో వీలవుతుంది.

మనదేశంలో డ్యుయల్‌ డిగ్రీలు
అమెరికా, యునైటెక్‌ కింగ్‌డమ్‌లలో డ్యుయల్‌ డిగ్రీ ఇంటెగ్రేటెడ్‌ కోర్సులు చాలా సంస్థల్లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమెరికా విద్యాసంస్థలు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, యేల్‌, డ్యూక్‌, కార్నెల్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, తదితర సంస్థలు మేనేజ్‌మెంట్‌లో డ్యుయల్‌ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. టెక్నాలజీ + మేనేజ్‌మెంట్‌, నర్సింగ్‌ + హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, లా + మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు కూడా చాలా విదేశీ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి.

మనదేశంలో కూడా ఇటీవలి కాలంలో మాస్టర్స్‌, డాక్టొరల్‌ స్థాయుల్లో ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లు ప్రారంభమయ్యాయి. అనేక ప్రైవేటు సంస్థలు వీటిని అందిస్తున్నాయి. అలాంటి కొన్ని ప్రోగ్రామ్‌ల వివరాలు...

* బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ మనదేశంలో డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లను ప్రారంభించిన తొలితరం సంస్థ. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా బిట్స్‌ ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షిస్తోంది.

* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ బీఏ- ఎల్‌ఎల్‌బీ, బీకాం -ఎల్‌ఎల్‌బీ, బీబీఏ- ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కోర్సులు చేసినవారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

* ఐఐఎస్‌సీ బెంగళూరు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, తదితర ప్రముఖ సంస్థలు డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి.

* ఐఐఎంలలో ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును మొదట ప్రారంభించిన సంస్థ ఐఐఎం -ఇండోర్‌. కంటెంట్‌ పరంగా ఇది మంచి ప్రోగ్రామ్‌.

* ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ ముంబయి, ఎన్‌ఎంఐఎంఎస్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లక్నో, వీఐటీ యూనివర్సిటీ, తదితర సంస్థలు ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌-ఎంబీఏ కోర్సును నిర్వహిస్తున్నాయి.

* అలహాబాద్‌ యూనివర్సిటీ కూడా ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మిగతా రెగ్యులర్‌ యూనివర్సిటీలు కూడా ఇదో బాటలో నడిచే అవకాశం ఉంది.

సరైన సామర్థ్యాలు లేకపోవడం వల్ల సాధారణ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని పరిశ్రమలు ఎప్పటినుంచో అంటున్నాయి. ఏఐసీటీఈ ప్రకటించిన డ్యుయల్‌, ఇంటెగ్రేటెడ్‌ డిగ్రీలు ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో లభించని అనేక సామర్థ్యాలు అభ్యర్థులకు ఈ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా సమకూరుతాయి.

ఈ కోర్సుల ప్రయోజనాలూ, ప్రతికూలతల  గురించి www.eenadu.net చదువు విభాగంలో చూడండి.

No comments:

Post a Comment