ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday, 12 April 2012

పీజీలో ప్రవేశానికి ఇవీ పరీక్షలు

    రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌లు వెలువడ్డాయి.

మొత్తం 25 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యూనివర్సిటీలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్‌)ల ద్వారా పీజీ, పరిశోధన కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర, ఓయూ, ఏయూ, కాకతీయ యూనివర్సిటీలు తమ పరిధిలోని ఇతర యూనివర్సిటీలకు కూడా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. క్యాంపస్‌ కాలేజీలతోపాటు వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో సీట్లను కూడా ఈ ఎంట్రన్స్‌ల ఆధారంగా భర్తీ చేస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీ గతవారం పీజీసెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ప్రకటనలు విడుదల చేసినట్లయింది. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, నాగార్జున, కృష్ణా, ఉస్మానియా, నన్నయ యూనివర్సిటీలు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 26న ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే ఆసెట్‌ పరీక్ష జరగనుంది. అప్పటి నుంచి జూన్‌ చివరి వరకు వివిధ యూనివర్సిటీలు పీజీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నాయి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకడమిక్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే పీజీ ఎంట్రన్స్‌లకు సిద్ధం కావాలి.

బేసిక్‌ సైన్సెస్‌, ఆధునిక బయాలజీ, లాంగ్వేజెస్‌ (ముఖ్యంగా ఇంగ్లిష్‌) కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటోంది. బేసిక్‌ సైన్సెస్‌లో కెమిస్ట్రీ, మేథ్స్‌, ఫిజిక్స్‌; ఆధునిక బయాలజీలో బయో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, నానో టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, తదితర సబ్జెక్టులకు ఆదరణ ఎక్కువగా ఉంది. మిగతావాటితో పోల్చుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ సైన్సెస్‌లో చాలా స్పెషలైజేషన్లు అందిస్తోంది.
 


క్యాంపస్‌ కాలేజీల్లో...
రాష్ట్ర యూనివర్సిటీల్లో ఎంఏ, ఎం.ఎస్‌సి., ఎం.కాం, ఎంసీఏ, ఎంబీఏ, ఇంటెగ్రేటెడ్‌ పీజీ కోర్సులతోపాటు ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ పరిశోధన కోర్సులు ఉన్నాయి. పీజీసెట్‌ల ద్వారా ఎం.ఎ., ఎం.ఎస్‌సి., ఎం.కాం., ఇంటెగ్రేటెడ్‌ పీజీ, తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మిగతా కోర్సులకు విడిగా ప్రవేశ పరీక్షలు ఉంటాయి. సైన్సెస్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ సబ్జెక్టుల్లో పీజీ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. మంచి మౌలిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ అందుబాటులో ఉండే యూనివర్సిటీ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో సీట్లు సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకోవాల్సిందే. క్యాంపస్‌ కాలేజీల్లో మంచి లైబ్రరీలు, ఇంటర్నెట్‌ సౌకర్యం, ఇంకా ఉన్నత కోర్సులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అవసరమైన పుస్తకాలు, గైడెన్స్‌ అందుబాటులో ఉంటాయి.

* పీజీ ఎంట్రన్స్‌లలో విజయం సాధించాలంటే అభ్యర్థులకు సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన తప్పనిసరి. తాము ఎంచుకున్న సబ్జెక్టులో ఇంటర్మీడియట్‌ స్థాయిలోని అంశాల నుంచి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.

* తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. తద్వారా సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. వీటిని అప్పుడప్పుడు పునశ్చరణ చేస్తుండాలి. వివిధ అంశాలను అన్వయించడం నేర్చుకోవాలి. డిగ్రీ చదివేటప్పుడే పీజీ ఎంట్రన్స్‌లపై అవగాహన పెంచుకుంటే లక్ష్యసాధన సులువవుతుంది.

ప్రవేశ పరీక్షల తీరు...
దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎం.ఎస్‌సి. ప్రవేశ పరీక్షలను ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నాయి. యూనివర్సిటీ లైబ్రరీల్లో ప్రవేశ పరీక్షల గత ప్రశ్నపత్రాలు లభించవచ్చు. నగరాల్లోని ప్రముఖ బుక్‌షాప్‌లలో కూడా ప్రయత్నించవచ్చు. ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లకు సిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా ప్రశ్నపత్రాల స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకోవాలి. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు సాధారణంగా ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఇంగ్లిష్‌లో ఉండే నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం సాధారణంగా తెలుగులో కూడా ఇస్తారు.

* ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సులకు కలిపి ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. దీనిలో కెమిస్ట్రీ పేపర్‌ అందరికీ కామన్‌గా ఉంటుంది. బీఎస్సీలో చదివిన ఏదైనా ఒక బయాలజీ ఆప్షనల్‌ను అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. బయాలజీ విద్యార్థులు తాము ఎంచుకున్న స్పెషలైజేషన్‌, కెమిస్ట్రీలో మంచి మార్కులు తెచ్చుకుంటే సీటు సాధించవచ్చు. కామన్‌ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తే తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌లో ఎం.ఎస్‌సి. చేయవచ్చు.

* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఎంట్రన్స్‌ పరీక్షల్లో బయాలజీ సబ్జెక్టుకు వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఏయూ ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లలో నెగటివ్‌ మార్కులు ఉంటాయి. అందువల్ల కచ్చితమైన సమాధానం తెలిస్తేనే జవాబు గుర్తించడం మంచిది.

* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే మైక్రోబయాలజీ, కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌లలో సాధారణంగా కెమిస్ట్రీ ప్రశ్నలు అడగరు.

* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ ఎంట్రన్స్‌ రాయబోతున్న విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే... గత ఏడాది నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ 4వ పేపర్‌ సిలబస్‌ను ఎంట్రన్స్‌ పరీక్షల సిలబస్‌కు కొత్తగా చేర్చారు. దీనిలో మెటీరియల్‌ సైన్స్‌, గ్రీన్‌ కెమిస్ట్రీ, మాలెక్యులార్‌ స్పెక్ట్రోస్కోపి, పెరిసైక్లిక్‌ చర్యలు, డ్రగ్స్‌, పెస్టిసైడ్స్‌, సపరేషన్‌ టెక్నిక్స్‌, తదితర అంశాలు ఉంటాయి.

* ఎస్వీయూ, ఎస్కేయూ, యోగి వేమన, పద్మావతి, రాయలసీమ, విక్రమ సింహపురి, ద్రవిడియన్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎస్వీయూఆర్‌పీజీసెట్‌ బాధ్యతను ఈ ఏడాది శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ తీసుకుంది.

యూనివర్సిటీల పరిధిలో వివిధ సబ్జెక్టులకు ఉన్న పోటీని బట్టి చూస్తే, కనీసం 60 నుంచి 70 శాతం మార్కులు సాధించిన వారికి ఆయా కోర్సుల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుంది. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రోజూ కనీసం 6-7 గంటలు శ్రమించడం తప్పనిసరి. యూనివర్సిటీల్లో స్థానిక విద్యార్థులకు 85 శాతం, నాన్‌ లోకల్‌ విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు తమ లోకల్‌ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తే సీటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించే పీజీ కోర్సుల్లో అన్ని ప్రాంతాల విద్యార్థినులు ప్రవేశం పొందవచ్చు. యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి నిర్దిష్ట నిష్పత్తిలో అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

హెచ్‌సీయూ, ఇఫ్లూలలో పీజీ
రాష్ట్రంలోని ప్రముఖ సెంట్రల్‌ యూనివర్సిటీలు... యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ), ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) కూడా పీజీ నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. ఇవి రెండూ జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థలుగా పేరుపొందాయి. హెచ్‌సీయూలో సైన్సెస్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, మేథ్స్‌, ఏనిమల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, తదితర పీజీ కోర్సులున్నాయి. కొన్ని కోర్సులకు రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ప్రవేశం లభించిన విద్యార్థులు అందరికీ ఫెలోషిప్‌ లభిస్తుంది. ఇఫ్లూలో ఇంగ్లిష్‌, ఇతర విదేశీ భాషల్లో పీజీ చేయవచ్చు. ఆయా సంస్థల్లో ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ల ద్వారానే భర్తీ చేస్తారు.

 - ఎస్. కిరణ్ కుమార్

No comments:

Post a Comment