విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే వాస్తవ సమస్యలేమిటి? వాటిని తొలగించే ఆచరణాత్మక సూచనలేమిటి?
ప్రసిద్ధ రచయితా, వ్యక్తిత్వ వికాస నిపుణుడూ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న ప్రత్యేక కథనం!
విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం!
ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది.
పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.
తెలివీ... మార్కులూ
తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడైవుండొచ్చు.
గణితం, అకౌంట్స్ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.
వాయిదా పద్ధతుంది...
చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. ఈ academic procrastinators 'సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా'మంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి!
ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:
* ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండండి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోండి.
* విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్ ర్యాంకర్ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే I am proud of youభావంతో!
* ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టండి (గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు).
ఆహ్లాదకర వాతావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...
కళ్ళు: టేబుల్ లైట్ కింద చదవండి. ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండండి.
సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. నా అనుభవంలో సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.
ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్ ఫూడ్, చికెన్ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్‌ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి.
ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.
వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించండి. అమితాబ్, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్‌నూ, పైథాగరస్‌నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!
యాబైశాతం సన్నద్ధత
మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే!
* స్టడీ టేబుల్/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి. కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.
* రాత్రివేళ మీ రీడింగ్ టేబుల్ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది.
* చదివేటపుడు గది తలుపులు మూసివేయండి. ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టండి. తాజా గాలి పీల్చుకుని, గదిలోనే పచార్లు చేయండి... చదవటమే ఈ పచార్లకంటే మెరుగనిపించేదాకా!
* ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్ డీటెయిల్డ్ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది. చదవటం విసుగనిపిస్తే రాయండి. లేకపోతే గణితం సాధన చేయండి. రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.
* కష్టమైన కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్ సూత్రాలూ గోడమీద అంటించుకోండి. (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి). వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయండి. విశ్రాంతి తీసుకోవటానికి (రిలాక్స్) మ్యాపులను పరిశీలించటం ఓ చక్కని చిట్కా.
* ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్ లేకుండా, చదివే పోర్షన్‌ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోండి.
* విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.
* కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోండి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు.
* గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోండి. పోచుకోలు కబుర్లకు అవకాశమున్న కంబైన్డ్ స్టడీ అంత ఉపయోగకరం కాదు.
* ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టొద్దు. ఐదు నిమిషాల విరామం ఇవ్వండి. దీన్ని 'మైండ్ హాలీడే' అంటారు.
* సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు.
* ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. సెలవు రోజు కూడా. సెలవులకు మీ తాతగారి వూరికి వెళ్ళినపుడు కూడా. కనీసం అరగంటైనా చదవాలి. ఇలా చేస్తే చదవటం మీ అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.
ఏం చదివినా గుర్తుండటం లేదా?
సమయం సరిపోదు.. ఎందుకని?
ఏకాగ్రత కుదరటం లేదా? ...
www.eenadu.net లో చదువు విభాగం చూడండి.