మనదేశంలో బయో ఇన్ఫర్మేటిక్స్ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. శాస్త్ర పరిశోధనలను వేగవంతం చేయడంలో కీలకంగా మారిన బయో ఇన్ఫర్మేటిక్స్ రంగం ఐరోపా దేశాలు, అమెరికాలో బాగా విస్తరించింది.
బయాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామర్థ్యాలు ఉన్నవారికి ఈ రంగంలో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన సామర్థ్యాలను అందించడం లక్ష్యంగా డీబీటీ 'బయో ఇన్ఫర్మేటిక్స్ నేషనల్ సర్టిఫికేషన్' ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.
బీఐఎన్‌సీ 2012 నోటిఫికేషన్ ఇటీవల వెలువడింది. పుణె, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, షిలాంగ్, హైదరాబాద్, తిరువనంతపురం, గౌహతిలో పరీక్ష కేంద్రాలున్నాయి.
బయోఇన్ఫర్మేటిక్స్ రంగానికి సంబంధించి అభ్యర్థి తెలివితేటలు, సామర్థ్యాలను అంచనా వేయడం బీఐఎన్‌సీ పరీక్ష ఉద్దేశం.
ఈ ఏడాది నుంచి బీఐఎన్‌సీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందరికీ డీబీటీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లు ఇవ్వనుంది. గతంలో టాప్ 10 అభ్యర్థులకు మాత్రమే ఫెలోషిప్‌లు ఉండేవి. బీఐఎన్‌సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీహెచ్‌డీ చేయాలనుకుంటే సంబంధిత విద్యాసంస్థ ప్రవేశ నిబంధనలకు అనుగుణంగా ఫెలోషిప్ లభిస్తుంది.
ఇదిగాక బీఐఎన్‌సీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 10 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా రూ.10000 చొప్పున నగదు బహుమతి కూడా ఇస్తారు.
నియామకాల్లో ప్రాధాన్యం
బయో ఇన్ఫర్మేటిక్స్ రంగంలో కొత్తగా ప్రవేశించాలనుకునే అభ్యర్థులతోపాటు, ఇప్పటికే పరిశ్రమల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌కు కూడా బీఐఎన్‌సీ శిక్షణ వల్ల ప్రయోజనం ఉంటుంది. బీఐఎన్‌సీలో చేరాలంటే బయో ఇన్ఫర్మేటిక్స్‌లో డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా డిప్లొమా చేయాల్సిన అవసరం లేదు. ఈ రంగం పట్ల ఆసక్తి ఉంటే సరిపోతుంది. నియామకాల సమయంలో బయో ఇన్ఫర్మేటిక్స్ కంపెనీలు ఈ సర్టిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య వేయిమంది లోపే ఉంటుంది. ఇప్పటివరకు ఈ పరీక్షను యూనివర్సిటీ ఆఫ్ పుణె నిర్వహించింది. బీఐఎన్‌సీ-2012 పరీక్ష బాధ్యతలను న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) చేపట్టింది. జేఎన్‌యూకు యూనివర్సిటీ ఆఫ్ పుణె, అన్నా యూనివర్సిటీ (చెన్నై), వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (కోల్‌కత), ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ (బెంగళూరు), నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ (షిల్లాంగ్), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాద్) సహకరిస్తున్నాయి.
పరీక్ష విధానం
బీఐఎన్‌సీ 2012 పరీక్షలో మొత్తం మూడు పేపర్లుంటాయి. అన్నిటిలోనూ సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో అభ్యర్థి అవగాహన, సామర్థ్యాలను పరీక్షిస్తారు.
పేపర్ల వివరాలు...
* పేపర్-1: ఇది ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష. 25 ఫిబ్రవరి 2012న జరగనుంది. ఇందులో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. దీనిలో బయో ఇన్ఫర్మేటిక్స్‌కు 40 శాతం, బయాలజీకి 20 శాతం, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్‌కు కలిపి 20 శాతం, ఐటీకి 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
* పేపర్ 2: ఇది స్వల్ప సమాధాన ప్రశ్నలతో కూడిన పేపర్. ఫిబ్రవరి 26, 2012న దీన్ని నిర్వహిస్తారు. ఇందులో 20 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. ఈ ప్రశ్నపత్రానికి కేటాయించిన సమయం 3 గంటలు. ఇందులో బయోఇన్ఫర్మేటిక్స్‌కు 40 శాతం, ఐటీకి 20, బయాలజీకి 20 శాతం, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. గత ఏడాది నుంచి ఈ పరీక్ష స్వభావం మారింది.
* పేపర్ 3: ఇది ప్రాక్టికల్స్ పరీక్ష. దీన్ని 26 ఫిబ్రవరి 2012న రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 100. ప్రాక్టికల్ పూర్తిచేయాల్సిన సమయం 2 గంటలు.
పేపర్-1లో తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కును తీసేస్తారు. పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను పరీక్ష జరిగిన రోజే (25 ఫిబ్రవరి 2012) సంబంధిత కేంద్రంలో ప్రకటిస్తారు. ఇందులో కనీసం 40 శాతం మార్కులు ఉంటే పేపర్-2, పేపర్-3కి అనుమతిస్తారు. అన్ని పేపర్లలో కనీసం 40 శాతం మార్కులు సాధించినవారికి సర్టిఫికేషన్ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జేఎన్‌యూ - బీఐఎన్‌సీ వెబ్‌సైట్‌లో పెడతారు.
పరీక్ష సిలబస్
బీఐఎన్‌సీ సిలబస్‌లో మొత్తం ఐదు విభాగాలుంటాయి. అవి... బయాలజీ, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్, మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్. పేపర్-1లో అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. ఆయా సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలపై ప్రశ్నలడుగుతారు.
* పేపర్-2లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అడ్వాన్స్‌డ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్-3 కంప్యూటర్ ఆధారిత ప్రాక్టికల్ పరీక్ష. ఇందులో బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పేపర్ల వారీగా పూర్తి సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలు జేఎన్‌యూ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
దరఖాస్తు విధానం
సైన్స్, అగ్రికల్చర్, వెటర్నరీ, మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, అంతకంటే పైస్థాయి కోర్సులు చేసిన అభ్యర్థులు బీఐఎన్‌సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. ఫెలోషిప్ మాత్రం పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి, పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకే లభిస్తుంది. బయో ఇన్ఫర్మేటిక్స్‌లో ఎలాంటి సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ చదివుండాల్సిన అవసరం లేదు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఐఎన్‌సీ 2012 పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులకు ఈ-మెయిల్, 'ఫైనాన్స్ ఆఫీసర్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ' పేరు మీద న్యూఢిల్లీలో చెల్లే విధంగా తీసిన రూ.600లకు (రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.450) డిమాండ్ డ్రాఫ్ట్ అవసరం. డీడీ వెనుక పేరు, దరఖాస్తు సంఖ్య రాయాలి.
ఆన్‌లైన్‌లో ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తిచేసిన వెంటనే దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దీనికి డిమాండ్ డ్రాఫ్ట్ జతచేసి, రెండు ఫొటోగ్రాఫ్‌లతో 'కో ఆర్డినేటర్, బీఐఎన్‌సీ ఎగ్జామినేషన్, స్కూల్ ఆఫ్ కంప్యూటేషనల్ అండ్ ఇంటెగ్రేటివ్ సైన్సెస్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ- 110067'కి పంపించాలి.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరితేదీ: 3 ఫిబ్రవరి, 2012
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్‌లు చేరడానికి చివరితేదీ: 7 ఫిబ్రవరి 2012.
* పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థులు జాబితా విడుదల తేదీ: 10 ఫిబ్రవరి 2012.
* వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు లభించే తేదీ: ఫిబ్రవరి 10, 2012
* బీఐఎన్‌సీ పరీక్ష తేదీలు: 25-26 ఫిబ్రవరి 2012.
No comments:
Post a Comment