ఇంజినీరింగ్ ప్రవేశానికి జాతీయస్థాయిలో ఒకే ఉమ్మడి పరీక్ష ప్రవేశపెట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవి ఓ కొలిక్కివస్తే వచ్చే ఏడాది నుంచి ఒకే పరీక్ష విధానం అమల్లోకి రావొచ్చు. ఈ ఏడాది మటుకు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలకు సిద్ధం కావాల్సిందే. దీనికి సమర్థమైన ప్రణాళిక ముఖ్యం. ప్రధాన ప్రవేశపరీక్షల తీరుపై స్థూల అవగాహన కూడా అవసరమే!
2012లో ఐఐటీ-జేఈఈ తోపాటు ఎంసెట్ రాయదల్చుకున్నారా? ఏప్రిల్ 8 వరకూ కేవలం ఐఐటీ-జేఈఈపై దృష్టి కేంద్రీకరించండి. తర్వాత మే 12 వరకూ ఎంసెట్ అభ్యాసం చేయండి.
విద్యార్థులు ఇంటర్ పూర్తిచేస్తూనే పదికి పైగా రాష్ట్ర, జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు రాయాల్సివస్తోంది. మార్చి నుంచి జూన్ వరకూ వీటి మూలంగా విశ్రాంతే ఉండక ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
ఇంజినీరింగ్‌కు సంబంధించి ఎన్ని పరీక్షలు రాసినా చేరే కోర్సు ఒకటే. చేరబోయేది ఏదో ఒక ఇంజినీరింగ్ కళాశాలలోనే. అటువంటప్పుడు అన్ని పరీక్షలు రాయాల్సిరావటం సహేతుకం కాదు కదా? ఇన్ని పరీక్షలతో విద్యార్థులను ఇబ్బంది పెట్టేబదులు అన్నింటికీ ఒకే పరీక్షను నిర్వహించాలనే చిరకాల ఆకాంక్ష ఆచరణలోకి రాబోతోంది. ఐఐటి, ఎన్.ఐ.టి. డైరెక్టర్లు సంయుక్తంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. 2013 నుంచి ఒకే పరీక్ష విధానానికి ప్రారంభం జరగాలని ఆలోచించి, విధి విధానాలు ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రకటించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదే జరిగితే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతో ఊరట లభించినట్లే. ఎందుకంటే ఐఐటీ జేఈఈ, ఏఐఈఈఈ, ఎంసెట్, విట్టీ.. వంటి ప్రతి పరీక్షకూ సిద్ధమవ్వాల్సిన ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది కాబట్టి! అంతేకాదు, ఐఐటీ-జేఈఈ, ఎఐఈఈఈ..- ఇలా ప్రతి పోటీ పరీక్షకూ వేరువేరుగా కోచింగ్ అవసరం లేదు. ఒకే కోచింగ్ తీసుకుని, ఒకే ప్రవేశ పరీక్ష రాస్తే సరిపోతుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా ఏ ఇంజినీరింగ్ సంస్థలోనైనా సీటు సాధించే అవకాశం ఉంటుంది.
విధివిధానాలు ప్రకటిస్తే మేలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష విధి విధానాలు వెంటనే విడుదల చేస్తే 2013కు తయారయ్యే విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టవుతుంది. వారు నూతన పరీక్ష పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు.
ఈ ఉమ్మడి పరీక్ష విధానానికి వస్తే ఇంటర్ మార్కుల నుంచి 50, 60 శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఇంగ్లిషులో కనీస మార్కులు సాధించాలన్న నిబంధన గానీ, అన్ని లాంగ్వేజెస్‌లో కలిపిన మొత్తం మార్కుల్లో యాభై శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశం గానీ లేకపోలేదు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఉమ్మడి ప్రవేశపరీక్షను మొదట 2013 నుంచి నిర్వహించి, 2014 నుంచి పూర్తిగా ఆన్‌లైన్ విధానంగా మార్చి విద్యార్థులు రెండు సార్లు రాసుకునేలా వీలుకల్పించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. సబ్జెక్టుతో పాటు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథమెటిక్స్) ఆప్టిట్యూడ్‌పై కూడా ప్రశ్నలు ఉండేలా ఉన్నాయి. ఆంగ్లంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలున్నాయి.
మార్పులు నిశ్చయమే
2013 నుంచి ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి ప్రవేశ పరీక్షల్లో మార్పులు జరగబోతున్నాయి. పరిగణనలోకి తీసుకునే ఇంటర్ మార్కుల వెయిటేజీ విద్యార్థి ఇంప్రూవ్‌మెంట్ రాసినట్లయితే తొలి మార్కుల ప్రాతిపదికగా ఉంటుందా అనేది చర్చలో ఉన్న అంశం. ఇంటర్, ఆప్టిట్యూడ్, సైన్సెస్ 40:30:30 నిష్పత్తిలో ఉండాలని కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా 2013 నుంచి జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష జరిగే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి.
ఈ ఏడాది సంగతేమిటి?
2012లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు అధిక పరీక్షలు రాయాల్సిందే. అయితే కన్పించిన ప్రతి పరీక్షకూ దరఖాస్తు చేస్తే ప్రతి వారం ఏదో ఒక పరీక్షకు సిద్ధపడాల్సిందే. వాటి విధి విధానాల తేడా వల్ల ప్రతి వారం వేర్వేరు పరీక్షలకు తయారవుతూ వెళితే, ఏ పరీక్షపైనా పట్టులేక నష్టపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను రెండు భాగాలుగా విభజించుకొని తయారు కావటం సులభం, ప్రయోజనకరం.
ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, బిట్‌శాట్ లాంటి పరీక్షలు ఒక విభాగంగా; ఎంసెట్, మహీ లాంటి పరీక్షలు రెండో విభాగంగా పరిగణించవచ్చు.
ఎందుకంటే...
* ఏఐఈఈఈ లాంటి పరీక్షల్లో ప్రశ్నల సంఖ్య చాలా తక్కువ కాబట్టి విద్యార్థిపై కాల ఒత్తిడి ఉండదు. కేవలం చదివిన అంశాలను అనువర్తింపచేసుకోవడాన్ని అభ్యసిస్తే సరిపోతుంది. ఏఐఈఈఈ/ బిట్‌శాట్‌లలో గంటకు జవాబులు గుర్తించే ప్రశ్నల సంఖ్య 30- 40 లోపే కాబట్టి ఏ జవాబును కూడా కంఠతా చేయాల్సిన అవసరం ఉండదు.
* ఎంసెట్ లేదా మహీ లాంటి పరీక్షల్లో గంటకు 60- 100 ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టుపై అవగాహనకు తోడుగా వాటిని వేగంగా సాధించగలిగిన అభ్యాసం కూడా తప్పనిసరి. అంత వేగం కనబరచాలంటే కచ్చితంగా కొన్ని ప్రశ్నల జవాబులను కంఠతా చేయాలి. షార్ట్‌కట్ మెథడ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ తరహా జ్ఞాపకశక్తి మెలకువలు ఐఐటీ-జేఈఈ/ ఏఐఈఈఈ/ బిట్‌శాట్‌లకు ఉపయోగపడవు.
ఇదీ ఆచరణీయ ప్రణాళిక
2012లో ఐఐటీ-జేఈఈ తోపాటు ఎంసెట్ రాయదల్చుకున్నారా? ఏప్రిల్ 8 వరకూ కేవలం ఐఐటీ-జేఈఈపై దృష్టి కేంద్రీకరించండి. తర్వాత మే 12 వరకూ ఎంసెట్ అభ్యాసం చేయండి. ఇలా కాకుండా ఐఐటీ ప్రవేశపరీక్షకు ముందే ఎంసెట్ సన్నద్ధత ప్రారంభిస్తే మానసిక ఒత్తిడికి లోనై అనుకొన్నస్థాయిలో రాణించలేకపోవచ్చు.
ఆన్‌లైన్ సాధనపై శ్రద్ధ
ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఏడాది కొన్ని ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ఉన్నాయి. వీటికోసం నమూనా పరీక్షలు తప్పకుండా సాధన చేయాలి. సాధారణ ప్రశ్నపత్రంలోనైతే అన్ని ప్రశ్నలను ఏకకాలంలో ముందుకు లేదా వెనుకకు ఏ వైపునకయినా తిప్పి చూడవచ్చు. జవాబు గుర్తించాలనుకునే ప్రశ్నకు వెంటనే వెళ్లవచ్చు. అదే ఆన్‌లైన్ పరీక్షయితే ఒక సమయంలో మానిటర్‌పై ఒకే ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు- జరిగిపోయిన ప్రశ్న జవాబు మరలా గుర్తించాలంటే అన్ని ప్రశ్నలనూ వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాలి. దీనివల్ల సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించాలంటే ఆన్‌లైన్ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువ రాయాలి.
ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈల ద్వారా సీట్లు వచ్చే అవకాశాలున్న విద్యార్థులు వాటిపైనే అధిక శ్రద్ధ పెడితే మంచిది. వాటిపై ఏదైనా అనుమానం ఉంటే మిగిలిన పోటీ పరీక్షలన్నిటి గురించి ఆలోచించే బదులు ఎంసెట్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టటం శ్రేయస్కరం.అప్పుడు మంచి ఇంజినీరింగ్ కళాశాలలో చేరే అవకాశం ఉంటుంది.
- - - - పి.వి.ఆర్.కె. మూర్తి
No comments:
Post a Comment