ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 28 February 2012

గ్రూప్ -2 ఇంటర్వ్యూ కిటుకులు



గ్రూప్‌-2 రాతపరీక్షలో మెరిసిన అభ్యర్థులు మరో అంచెను విజయవంతంగా దాటితే ఉద్యోగం సాధించినట్టే! కీలకమైన ఇంటర్వ్యూ దశలో ప్రతిభావంతంగా నెగ్గటానికి ఏయే అంశాలు గమనించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏపీపీఎస్సీ తన నిర్వహణ శైలిలో చేపట్టిన సంస్కరణలు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ ప్రక్రియ) లో కూడా ప్రతిఫలిస్తున్నాయి. పక్షపాత రహిత, వ్యక్తిత్వ పరిశీలన ప్రధాన లక్ష్యాలుగా ఇంటర్వ్యూ అసలైన స్ఫూర్తి ఇప్పుడు కన్పిస్తోందని చాలామంది అభ్యర్థుల భావన. ఇటీవల జరిగిన గ్రూప్‌-1, ఎ.ఎం.వి.ఐ. మొదలైన ఇంటర్వ్యూలన్నింటిలోనూ ప్రదర్శితమైన ఈ ధోరణిని బట్టి గ్రూప్‌-2 ఇంటర్వ్యూల సరళి కూడా అదే విధంగా ఉండవచ్చు.

A.నూతనత్వం ఏమిటి?
అభ్యర్థుల నుంచి పొందిన సమాచారం మేరకు... గతంలో అభ్యర్థికి సంబంధించిన మొత్తం సమాచారం (ప్రాంతం, కులం, మతం, చేస్తున్న ఉద్యోగం, విద్యార్హతలు మొదలైనవి) ముందుగానే బోర్డు సభ్యులకు చేరేవి. అందువల్ల ఆ బయోడేటా అంశాల ఆధారంగా ఇంటర్వ్యూ జరిగేది.

ఇప్పటి పద్ధతిలో అభ్యర్థి పేరు, చిరునామా, విద్యార్హత తప్ప మిగతా సమాచారం ఏదీ చేరడం లేదు. ఏపీపీఎస్సీ నిష్పాక్షికంగా వ్యవహరించేందుకు ఇలా చేస్తోందని తెలుస్తోంది.



B. ఎదుర్కోవడం ఎలా? గరిష్ఠ మార్కులు సాధ్యమేనా?
బయోడేటా బలంగా నిర్మించండి
బోర్డు వద్ద ఎలాంటి ముందస్తు సమాచారం ఉండటం లేదు కాబట్టి, తప్పనిసరిగా అభ్యర్థిని 'అడిగి' తెలుసుకున్న సమాచారం కీలకంగా మారింది. అందువల్ల 'మీ గురించి చెప్పండి?' అనే ప్రశ్న అనివార్యం.

ఈ ప్రశ్న అడిగినపుడు ఎలాంటివి ప్రస్తావించాలి? కుటుంబం గురించీ, విద్య, ప్రొఫెషనల్‌ కెరియర్‌ గురించీ ఏం చెప్పాలి... ఇలాంటివాటికి స్పష్టంగా సిద్ధమైతే మొదటి అంశం ముగిసినట్లే! మీ పైన మీకు స్పష్టత ఉందనే అభిప్రాయానికి బోర్డు వస్తే చాలు. నోకియా, ఫిన్‌లాండ్‌లో ఉన్నతోద్యోగిగా ఉంటూ నెలకు రెండున్నర లక్షల రూపాయలు సంపాదించే శిరీష డీఎస్పీగా ఎంపికవడంలో ఇలాంటి బయోడేటా నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. 'సినీ డైరెక్టర్‌' డీఎస్పీగా మార్పు చెందడం కూడా ఈ అవగాహనకి సంబంధించినదే.

సామాజిక పునాదుల 'బలం'
ఆప్షనల్‌ సబ్జెక్టు ఉన్న ఇంటర్వ్యూలు తప్ప మిగతా అన్నింట్లోనూ అభ్యర్థి లోతును పరిశీలిస్తారు. అందుకే సామాజిక పునాదులైన 'వర్ణ వ్యవస్థ', 'మను ధర్మశాస్త్రం' 'ఫండమెంటలిజం' మొదలైన అంశాలే ప్రశ్నలుగా దూసుకొస్తున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా గత నలభై ఏళ్లలో పాశ్చాత్యీకరణ ప్రభావం, డేటింగ్‌, సహజీవనం, సరగొసీ, వివాహేతర సంబంధాలు లాంటివన్నీ కూడా ఇంటర్వ్యూ అంశాలుగా మారాయి. వీటికోసం 'షార్ట్‌ ఆన్సర్స్‌'తో సిద్ధమైతే చాలు.

ముఖ్యంగా మహిళా, మైనార్టీ, దళిత అభ్యర్థులను ఆ వర్గాల స్థితిగతులపై ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి అంశాలపై స్పందించాలంటే సామాజిక పునాదుల అవగాహన అనివార్యం.

వర్తమానాంశాలే వర్త్‌ఫుల్‌...
ప్రతి ఇంటర్వ్యూలో కూడా 'వర్తమానా'న్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం, జిల్లాస్థాయి ప్రశ్నలు వస్తున్నాయి. ఇరాన్‌, సిరియా, మధ్యాసియా, పాకిస్థాన్‌, అమెరికా, జర్మనీ, చైనా మొదలైన దేశాల్లో జరుగుతున్న పరిణామాల గురించి సాధారణ అవగాహన అయినా ఉండాలి.

2జీ, ఎమ్మార్‌, లోక్‌పాల్‌, ఎన్‌.సి.టి.సి., ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆహార భద్రత, ప్రియాంక గాంధీ, రాహుల్‌ రాజకీయ భవితవ్యం, కాగ్‌, సుప్రీంకోర్టు క్రియాశీలత, జాతీయ సమైక్యత లాంటి అంశాలపై పట్టు అవసరం. గనుల కుంభకోణం, పారా సిండికేట్లు, ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, క్రాప్‌ హాలీడే, పార్టీ ఫిరాయింపులు, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు, ఉపఎన్నికలు, ఏపీ బడ్జెట్‌... (ఇటీవల జరిగిన ఎ.ఎం.వి.ఐ. ఇంటర్వ్యూలో కూడా రవాణా శాఖకు కేటాయించిన బడ్జెట్‌ అంశాలపై ప్రశ్నలు అడిగారు).

సూచన: జిల్లా స్థాయి ప్రశ్నలకు అవకాశం ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాకి సంబంధించిన వర్తమానాంశాలను చదవాలి.



తులనాత్మక పరిశీలన
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలు అన్నింట్లోనూ తులనాత్మక (comparative) సమాధానాలకు ప్రాధాన్యమిచ్చారు.
* భారత ప్రధానులలో మీకు బాగా నచ్చిన వారెవరు? ఎందుకు?
* నెహ్రూ, ఇందిరల మధ్య తేడా ఏమిటి?
* కాంగ్రెస్‌, కాంగ్రెసేతర పాలనలలో ప్రధాన భేదాలు ఏమిటి?
* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులలో నచ్చినది ఎవరు? ఎందుకు?
* ఎన్టీ రామారావు పాలనలో నచ్చినది/ నచ్చనిది ఏమిటి?
* ప్రస్తుత ముఖ్యమంత్రులలో మోడల్‌ సీఎం ఎవరు?
* మన్మోహన్‌సింగ్‌ని తొలగించాల్సివస్తే ప్రత్యామ్నాయం ఎవరు?
* తదుపరి రాష్ట్రపతిగా ఎవరుంటే బాగుంటుంది?

శరీర భంగిమ, కదలికలు... ఎదుట ఉన్నవారికి ఒక అభిప్రాయం ఏర్పరుస్తాయి. 'ప్రవేశించే దశ' నుంచి  నిష్క్రమించే దశ' వరకు ప్రతి దశలోనూ శరీరపు కదలికలుంటాయి. వాటిలో వృథా కదలికలు చాలా ఉండవచ్చు. వాటిని తగ్గించాలి. 'అనుకూలత'ను అందించే కదలికలు పెంచాలి. బిగుసుకుపోయి కూర్చునే స్థితి నుంచి, ఆహ్లాదం కలిగించే దిశలో కదలికలు ఉండటం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు.

ముఖ్యంగా ముఖకవళికల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఇలాంటివన్నీ సాధన ద్వారా వస్తాయి కాబట్టి ఇంటర్వ్యూ సన్నద్ధతలో భాగంగా ఈ అంశాలపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడు గరిష్ఠ మార్కులు వాటంతట అవే వస్తాయి.


C.సమాధానాల్లో ఉండాల్సినవి
* సూటిగా సమాధానాలు చెప్పాలి. వ్యాసాల్లో మాదిరిగా ఉపోద్ఘాతాలు లాంటివి వద్దు.
* గణాంక సమాచారం గుప్పించవద్దు. ఇంటర్వ్యూ అనగానే ముఖ్యంగా ఆర్థిక గణాంకాల కోసం పరిగెడ్తున్నారు. కేవలం స్థూల సమాచారం ఉంటే చాలు.
* ప్రముఖుల వ్యాఖ్యానాలు, విధానాలను కోట్‌ చేయదల్చుకుంటే ఆ ప్రముఖుని గురించి ముందుగానే సమాచారం సంపాదించుకోవాలి.
* సుదీర్ఘ వచనాలు వద్దు. వాడుక పదాలు వాడుతూ భావవ్యక్తీకరణ జరిగేలా చూసుకుంటే చాలు.
* సామెతలు, నానుడులూ వాడితే మంచిదే కానీ, అలా చేసేటపుడు వాటిపై పట్టు ఉండటం మంచిది.

- కొడాలి భవానీ శంకర్

No comments:

Post a Comment