ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 20 February 2012

వైద్య విద్యకు విభిన్న మార్గాలు!

జాతీయస్థాయి ఉమ్మడి వైద్య ప్రవేశపరీక్ష- (NEET ) వచ్చే ఏడాది రంగప్రవేశం చేసే అవకాశముంది. ఈ సంవత్సరానికి మాత్రం వైద్యవిద్య చదవాలనుకునేవారు వివిధ రకాల ప్రవేశపరీక్షలకు యథావిధిగా సిద్ధమవ్వాల్సిందే. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకోవలసిన విషయాలూ, పాటించాల్సిన సూచనలూ... ఇవిగో!

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ విభాగంలో ఉన్న విద్యార్థులకు ఎన్ని అవకాశాలున్నాయో బైపీసీ వారికి కూడా అంతకంటే అధిక అవకాశాలే ఉన్నాయి. అయితే బైపీసీ విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ కేవలం ఎంబీబీఎస్‌ దృష్టితోనే ఉంటున్నారు కాబట్టి అవకాశాలు పరిమితమనే అభిప్రాయం వ్యాపించింది.

ఈ గ్రూపు తీసుకుంటే విద్యాభ్యాసానికీ, 'సెటిల్‌' అవటానికీ చాలాకాలం పడుతుందనే అభ్యంతరం తల్లిదండ్రుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంబీబీఎస్‌ ఐదున్నర ఏళ్ళ తర్వాత సూపర్‌ స్పెషాలిటీతో కలిసి మొత్తం 11 సంవత్సరాల వరకూ చదవాలి కాబట్టి. కానీ వీరి కెరియర్‌ ప్రారంభం ఆలస్యం కావొచ్చు కానీ పదవీ విరమణ కూడా లేటుగానే ఉంటుంది కదా?

వీరు స్థిరపడినంతగా ఇంజినీర్లు లేదా ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో ఉండే విద్యార్థులు స్థిరపడే అవకాశాలు తక్కువ. ప్రారంభంలో ఒక ఇంజినీర్‌ ఐదేళ్ళలోనే స్థిరపడి సంపాదించడం ప్రారంభించవచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత ఒక డాక్టరు ఆదాయంలో ఇంజినీర్‌ ఆదాయం సగం కూడా ఉండకపోవచ్చు. సంపాదన కంటే కూడా వృత్తిలో పొందే సంతృప్తి ఒక వైద్యుడు పొందినట్లుగా మిగిలిన ఏ వృత్తిలో ఉన్న ఉద్యోగి కూడా పొందకపోవచ్చు.

మెడికల్‌ విభాగంలో కూడా విద్యార్థులను కొంతవరకూ సంతోషంగా ఉంచడానికి మెడికల్‌ కోర్సును నాలుగున్నర ఏళ్ళకు కుదించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ మెడికల్‌ (NEET)ప్రారంభించిన తర్వాత అన్నిటికీ ఉమ్మడి సిలబస్‌ ఏర్పడుతుంది కాబట్టి మెడికల్‌ విద్యార్థులు ఒక ఏడాది ఆదా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

ఈ సంవత్సరం సంగతేమిటి?
వైద్యవిద్య ప్రవేశపరీక్షలు రాసే విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయం- వీరు మొదట ఎంసెట్‌లో కచ్చితంగా సీటు సాధించగలమని నమ్మకం ఏర్పడితేనే మిగిలిన ప్రవేశపరీక్షల గురించి ఆలోచించడం మేలు. ఎందుకంటే మిగిలిన ఏ ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ అయ్యే సీట్లతో పోల్చుకున్నా మన ఎంసెట్‌- మెడికల్‌ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ.

2011 అడ్మిషన్ల ప్రకారం- మన రాష్ట్రంలో మొత్తం 37 వైద్యకళాశాలలున్నాయి. వీటిలోని సీట్ల సంఖ్య 4950. (ప్రభుత్వ కళాశాలల సీట్లు 1800 + ప్రైవేటు కళాశాలల్లో 3150.)

ఎయిమ్స్‌లాంటి సంస్థలో మొత్తం సీట్లు 45 లోపే. ఎ.ఎఫ్‌.ఎం.సి.లో బాలికలకు రిజర్వ్‌ చేసిన 25 సీట్లతో కలిపి మొత్తం ఉన్నవి 130 సీట్లే. వాటిమీద ఎక్కువ దృష్టి పెట్టేకంటే దాదాపు 5000 మెడికల్‌ సీట్లు భర్తీ చేసే మన ఎంసెట్‌ ర్యాంకు మీదే అధిక శ్రద్ధ వహించటం తెలివైన పని కదా? దీనిలో కచ్చితంగా సీటు సాధించగలమని ధీమా ఏర్పడిన తర్వాతే మిగిలిన ప్రవేశ పరీక్షల గురించి ఆలోచించాలనేది అందుకే!


వెటర్నరీ సైన్స్‌ (బీవీఎస్‌సీ) చదివినవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువ. మన రాష్ట్రంలో సుమారు నాలుగువేలమంది పశువైద్య నిపుణుల కొరత ఉంది. రాష్ట్రంలో బీవీఎస్‌సీ అందించే కళాశాలలు మూడున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎంసెట్‌ ద్వారా, జాతీయస్థాయిలో ఆలిండియా ప్రీ వెటర్నరీ టెస్ట్‌ (ఏఐపీవీటీ) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. అయితే ఎంసెట్‌ రోజునే ఏఐపీవీటీ కూడా నిర్వహిస్తున్నారు!

ప్రణాళిక ఎలా?
డాక్టరు కావడానికి అవకాశమిచ్చే (ఇంతకుముందు పేర్కొన్న) అన్ని కోర్సులకూ ప్రవేశం ఎంసెట్‌ ద్వారానే. ఎంసెట్‌ మే 12న కాబట్టి ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యేవరకూ కేవలం ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలపైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఎంసెట్‌ గురించి ఆలోచించడం మేలు.

అనంతరం సుమారుగా 55 రోజులుంటాయి. 10 గ్రాండ్‌ టెస్టులు 20 రోజుల్లో పూర్తిచేయగలిగితే మిగిలిన 35 రోజులూ సమగ్ర సన్నద్ధతకు ఉపయోగపడతాయి. ఆ సమయంలో ప్రథమ సంవత్సర సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి.

జాతీయస్థాయి పరీక్షల్లో బయాలజీ ప్రాధాన్యం తగ్గుతుంది. ఇంగ్లిష్‌ లేదా ఆప్టిట్యూడ్‌ లాంటి అదనపు విభాగాల్లో సాధన చేయాల్సివుంటుంది. MGIMS పరీక్షలో గాంధీయ చింతన (గాంథియన్‌ థాట్స్‌)పై మూడు గంటల పరీక్ష అదనం. జాతీయప్రవేశపరీక్షలన్నిటిలో సీట్ల సంఖ్య చాలా తక్కువ, అదనంగా కొంత సన్నద్ధం కావాల్సివుండటం వల్ల మన విద్యార్థులు ఈ పరీక్షల్లో కొంత వెనకబడివున్నారు. ఈ పరీక్షల్లో విజేతలు కావాలంటే ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌లలో అభ్యాసం తప్పనిసరి.

ఈ వివిధ రకాల పరీక్షలభారం ఈ ఏడాదితోనే ముగియవచ్చు. 2013 నుంచి దేశమంతటా NEETప్రారంభిస్తే విద్యార్థులపై ఈ అదనపు భారం, ఒత్తిడి తగ్గిపోతాయి.

భవితను తీర్చిదిద్దుకునేలా...
ఎంపీసీ విద్యార్థులు కానీ, బైపీసీ విద్యార్థులు కానీ వృత్తి విద్యలకు ఇచ్చే ప్రాధాన్యం బేసిక్‌ సైన్సెస్‌కు కూడా ఇస్తే మేలని విద్యావేత్తల అభిప్రాయం. నేడు బేసిక్‌ సైన్స్‌లలో ఎంఎస్సీ చేసిన అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా కనపడుతోంది.
ఎంఎస్‌సీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (5 సంవత్సరాలు)
డిపార్ట్‌మెంట్‌ అటామిక్‌ ఎనర్జీ వారు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (NEST)ద్వారా కింది ప్రసిద్ధ సంస్థల్లో విద్యావకాశం కల్పిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌, భువనేశ్వర్‌; సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌, ముంబాయి; విశ్వభారతి, శాంతినికేతన్‌. గత ఏడాది నుంచి ఐఐఎస్‌సీ, బెంగళూర్‌లో కూడా బేసిక్‌ సైన్సెస్‌ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో బీఎస్‌, ఎంఎస్‌లను ప్రారంభించారు.

వీటికి ఎంత గిరాకీ ఉందంటే ఈ కోర్సుల్లో చేరినవెంటనే అంటే ప్రథమ సంవత్సరం నుంచే స్త్టెపెండ్‌ రూపంలో రూ.5వేలు, సంవత్సరానికి అదనంగా రూ.20 వేలు ఇస్తారు. ఒకసారి ఈ సంస్థల్లో చేరినవారు ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను ప్రారంభించారు. వీటిలో అధికశాతం కోర్సులు 2007 తర్వాతే ప్రారంభమయ్యాయి. కొన్నిటిని 2011లోనే ఆరంభించారు. కాబట్టి వీటిపై చాలామందికి సరైన అవగాహన లేదు.

NEST సంగతులు
ఈ పరీక్ష మే 27న జరుగుతుంది. ఇది మొత్తం ఐదు భాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో జనరల్‌ ప్రశ్నలుంటాయి. ఇవి విద్యార్థులందరూ రాయాల్సిందే. మిగిలిన విభాగాలు- బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌. ఈ నాలుగింటిలో ఏవైనా మూడు విభాగాలు రాయాల్సివుంటుంది. అన్ని విభాగాలకూ మార్కులు సమం.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే! కానీ కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు కూడా ఉండొచ్చు. తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులుంటాయి. పరీక్ష ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్‌, విశాఖపట్నాల్లో ఉన్నాయి. ఇంటర్లో 60 శాతం మార్కులు వచ్చివున్నవారు మాత్రమే పరీక్ష రాయటానికి అర్హులు. సిలబస్‌ సీబీఎస్‌ఈ 12 తరగతిది మాత్రమే. పరిశోధన ఆసక్తి ఉన్న విద్యార్థులకూ, అధ్యాపక వృత్తిలో రాణించదలిచినవారికీ చక్కటి అవకాశం.

ఇంకా ఇతర కోర్సులు
బైపీసీ వారు మన రాష్ట్రంలో చదవటానికి అవకాశమున్న ఇతర కోర్సులు- బీఫార్మసీ, బీటెక్‌ (బయోటెక్నాలజీ), బీఎస్‌సీ హార్టికల్చర్‌, అగ్రికల్చరల్‌ బీఎస్‌సీ, ఫిజియోథెరపీ, బీఎస్‌సీ నర్సింగ్‌, మెడికల్‌ మైక్రో బయాలజీ, మెడికల్‌ బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్‌, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ... ఇలా చాలా ఉన్నాయి.

హార్టికల్చర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధిస్తున్నవారిలో ఎక్కువశాతం అగ్రికల్చర్‌ బీఎస్‌సీ నుంచే వస్తున్నారు. కాబట్టి బైపీసీ వారికి ఎంబీబీఎస్‌ అనేదే కాకుండా ఇతర అవకాశాలూ ఎక్కువే.

- పి.వి..ఆర్.కె. మూర్తి.

No comments:

Post a Comment