ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 27 March 2012

టెట్ మార్కులతో కొలువు ఖరారు!



    ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రకటన మూడోసారి వెలువడింది. ఆగస్టు చివర్లో నియామక పరీక్ష- డీఎస్‌సీ జరగనున్న నేపథ్యంలో మే 31న జరిగే టెట్‌కు ప్రాధాన్యం పెరిగింది. తాజా పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో నిపుణుల సూచనలు... ఇవిగో!

డీఎస్‌సీలో 20 మార్కుల వెయిటేజి టెట్‌కు ఇచ్చారు. అందువల్ల అర్హత మార్కులు మాత్రం సాధించి 'గట్టెక్కాంలే' అని ఆనందించే పరిస్థితి లేదు. తెలివైన అభ్యర్థులు టెట్‌లోనే గరిష్ఠమార్కులు సాధించటం ద్వారా డీఎస్‌సీ ఉద్యోగాన్ని ముందుగానే రిజర్వ్‌ చేసుకోవచ్చని మరవరాదు.

కొన్ని జిల్లాలో డీఎస్‌సీలో ఎంపికైన అభ్యర్థికీ, కాని అభ్యర్థికీ మధ్య అంతరం చాలా తక్కువగా ఉంది. అలాంటి పరిస్థితిలో టెట్‌లో మంచి మార్కుల సాధన ఇలాంటి సమస్య నుంచి బయటపడేస్తుంది.

ఉదాహరణకు టెట్‌లో 118, 90 మార్కులు సాధించిన ఇద్దరికి డీఎస్‌సీలో వెయిటేజి ఎలా మారుతుందో చూద్దాం.

టెట్‌ మార్కులు డీఎస్‌సీలో వెయిటేజి


ఇలాంటి తేడా వచ్చే అవకాశం ఉన్నందున టెట్‌లో 115కి పైగా మార్కులు తెచ్చుకోవడం ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. అందుకనుగుణంగా ప్రిపరేషన్‌ వ్యూహం ఉండాలి.

2011 టెట్‌లో 110కిపైగా మార్కులు తెచ్చుకున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. 2012 (జనవరి) టెట్‌లో పరీక్షాపత్రం కఠినంగా ఉన్నప్పటికీ 110కి పైగా మార్కులు పొందినవారూ ఎక్కువమందే!

అందువల్ల జనరల్‌ కేటగిరిలో ఉద్యోగాలు సాధించాలంటే 110కి పైన లక్ష్యం పెట్టుకుంటేనే డీఎస్‌సీలో నిలబడే అవకాశముంటుంది. తాజా టెట్‌లో 115కి పైగా మార్కుల లక్ష్యం పెట్టుకుని అందుకు అనుగుణంగా సిద్ధపడాలి.

ప్రిపరేషన్‌ వ్యూహం
టెట్‌, డీఎస్‌సీ తేదీలు కూడా ముందుగానే నిర్ణయించడంతో నిన్నటివరకూ డీఎస్‌సీ చదవటంలో, ప్రిపరేషన్‌ ప్రాధాన్యాలు నిర్ణయించుకోవడంలో కొందరు అభ్యర్థుల్లో తికమక కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రిపరేషన్ని ఎలా మార్చుకోవచ్చంటే...

* టెట్‌ పూర్తయేవరకూ టెట్‌ సిలబస్‌పైనే 100 శాతం దృష్టి పెట్టాలి.
* టెట్‌ ముగిశాక రెండున్నర నెలలకు పైగా డీఎస్‌సీకి వ్యవధి ఉంది. కాబట్టి అప్పుడు దానిపై శ్రద్ధ పెట్టవచ్చు.
* టెట్‌ కంటెంట్‌కు తయారవుతున్నపుడే అది డీఎస్‌సీకీ ఉపకరిస్తుందని గుర్తించాలి. తద్వారా డీఎస్‌సీకి సిద్ధమవటం లేదనే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

ఎ) ఆ 90 మార్కులు
150 మార్కుల టెట్‌కి గాను శిశువికాసం, భాష-1, భాష-2లకే 90 మార్కులు కేటాయించారు. మిగతా కంటెంట్‌+ పెడగాజిలకు 60 మార్కులు. క్షుణ్ణంగా పరిశీలిస్తే... కంటెంట్‌+ పెడగాజిలలో సాధించే మార్కుల్లో తేడా అభ్యర్థుల మధ్య తక్కువగా ఉంటుంది. కానీ కఠినంగా భావించే శిశువికాసం, ఇంగ్లిష్‌ల మార్కుల్లో తేడా మాత్రం ఎక్కువే.

టెట్‌-2012లో తెలుగు ప్రశ్నపత్రం కఠినత్వం గమనిస్తే 'తెలుగుభాష' కూడా మార్కుల సాధనలో కీలకంగా మారిందని తెలుస్తుంది. అందువల్ల అభ్యర్థులు ఈ మూడు అంశాలనూ పరీక్షకు అవసరమైన స్థాయిలో సిద్ధమైతేనే మార్కుల పంట పండేది!

* శిశువికాసం ప్రశ్నలు గత డీఎస్‌సీల మాదిరిగా పాఠ్యపుస్తకాల నుంచి నేరుగా ఇవ్వటం లేదు. పైగా పెడగాజి కూడా ఉండటం వల్ల ప్రశ్నలన్నీ అభ్యర్థి స్థూల అవగాహన, అన్వయాలపై అడుగుతున్నారు. అందుకని పాఠ్యపుస్తకాలో, ప్రశ్నల నిధులో చదివి 'బాగా ప్రిపేరయ్యాం' అనుకుంటే నష్టపోతున్నట్టే.

* గ్రామీణ అభ్యర్థులు ఏదో ఒక గ్రామర్‌ పుస్తకం చదివి భాషలను 'మమ' అనిపిస్తున్నారు. 12 మార్కులు పెడగాజి అంశాలున్నాయని మర్చిపోతున్నారు. భాషలను చదివేటప్పుడు వ్యాకరణ కిటుకులను, భాష బోధన పద్ధతులను దృష్టిలో పెట్టుకోవాలి.

బి) బట్టీయమా?
గత డీఎస్‌సీ అనుభవాలతో టెట్‌లో కూడా 'మక్కీకి మక్కీ'గా పాఠ్యపుస్తకాలు చదివినవారు ఇప్పటివరకూ జరిగిన రెండు టెట్‌లలోనూ దెబ్బతిన్నారు. శిక్షణ సంస్థలు కూడా పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాల్నే బిట్లుగా మార్చి, బట్టీ పట్టించి మొత్తమ్మీద డీఎస్‌సీలలో విజయాలు సాధించాయి. కానీ టెట్‌లో ఆ ధోరణి తగ్గటంతో శిక్షణసంస్థలతో పాటు అభ్యర్థులూ బోల్తాపడినట్టయింది.

గత రెండు టెట్‌ల ప్రశ్నల్లో అత్యధికం అభ్యర్థి సంపూర్ణ అవగాహనను పరిశీలించేవే. ప్రతి పాఠ్య విషయాన్నీ చదివినపుడు బిట్ల మాదిరిగా ఆలోచిస్తూ, ఆయా అంశాల నేపథ్యం కూడా పరిగణనలోకి తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శిశు వికాసం, పెడగాజి, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఈ ధోరణి అవసరం.

సి) మెథడ్స్‌ పెడగాజి కాదు
టెట్‌లో పేర్కొన్న పెడగాజి అంశాలను పరిశీలిస్తే- గతంలో డీఎస్‌సీ కోసం చదివిన మెథడ్స్‌ యథాతథంగా అన్వయించలేం. ముఖ్యంగా శిశు వికాసం కింద ఇచ్చిన పెడగాజిలో పాఠశాల నిర్వహణ, విద్య- ఆధారాలు, విద్య- సామాజిక అంశాల ప్రాధాన్యం ఉంది. అధ్యాపనం కింద బోధనా మెలకువలతో పాటు విద్యా దార్శనికత, తాత్వికత, వర్తమాన విద్యాంశాలను కూడా అనుసంధానించుకోవాలి.

డి) చదివితే సరిపోతుందా?
డీఎస్‌సీ స్థాయి పరీక్షలు రాసే అభ్యర్థులు గంటల తరబడి చదువుతారు. కానీ చదివిన అంశాలను అన్వయించుకోవటంలో కొందరు వెనకబడుతున్నారు. ముఖ్యంగా మారిన పరీక్షా ధోరణిని బట్టి చదివిన అంశాలను ఏయే రీతుల్లో సమాజంలో అన్వయించవచ్చు, వాటి ఉపయోగితా విలువ అనే కోణంలో పరిశీలించాలి.

* మార్కులు తెచ్చుకునేందుకు ప్రతి అంశాన్నీ చదవగానే ప్రశ్నలనూ, రూపాలనూ అంచనా వేయాలి.
* వీలైనన్ని నమూనా పరీక్షలను అభ్యాసం చేయాలి.
* వస్తున్న ఫలితాలను బట్టి సరైన మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి.

ఇ) అన్నీ చదవాల్సిందే
* చాలామంది సోషల్‌ అభ్యర్థులు- జాగ్రఫీ, చరిత్ర అంశాల పట్ల కొద్దిపాటి వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. కానీ ఆ రెండు అంశాల నుంచే ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశముంది.
* సైన్స్‌ అభ్యర్థుల్లో- బయోసైన్స్‌వారు పదో తరగతిస్థాయి గణితం అభ్యసించేందుకు మానసికంగా సిద్ధపడటం లేదు. గణితం అభ్యర్థులు బయోసైన్స్‌ పట్ల ఇదే స్థాయి ధోరణితో ఉంటున్నారు. అలాంటి వ్యతిరేకతతో చదవటం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు.

* భాష 1,2లలోని కంటెంట్‌, పెడగాజి అంశాల పట్ల భాషేతర అభ్యర్థులు నిరుత్సాహంగా ఉంటున్నారు.

అభ్యర్థిలో అనుకూలత ఉన్నా లేకపోయినా పరీక్ష కోసం చదవాల్సిందే.


- కొడాలి భవానీ శంకర్ 

 
విస్తృతంగా, సమగ్రంగా!
టెట్‌ పరీక్ష ప్రశ్నపత్రం పరిశీలిస్తే- జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలకంటే అవగాహన, అనుప్రయుక్త (అప్లికేషన్‌) లక్ష్యాలను పరీక్షించే ప్రశ్నలను ఎక్కువగా అడిగారు

తెలుగు అకాడమీ డి.ఇడి., బి.ఇడి పుస్తకాల సిలబస్‌లో లేని అంశాలు టెట్‌ సిలబస్‌లో ఉన్నాయి. అందుకని ఆ అంశాలపై ప్రశ్నలు అభ్యర్థులకు కష్టతరంగా కనపడుతున్నాయి.

ఉదాహరణకు- చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజిలో ఛామ్‌స్కీ, కార్ల్‌ రోజర్స్‌, కోఫ్కా; బోధనా విధానాల్లో ఎన్‌సీఎఫ్‌-2005, విద్యాహక్కు చట్టం-2009 మొదలైనవి. వీటిపై అందుబాటులో ఉండే మార్గాల్లో మెటీరియల్‌ను సంపాదించుకుని పరీక్ష దృష్టితో అభ్యసిస్తే ఇబ్బంది ఉండదు.

నిర్ణీత సిలబస్‌ను విస్తృత స్థాయిలో, ప్రాథమిక భావనలను సమగ్రంగా అభ్యసించాల్సిన అవసరముంది.

కేవలం డి.ఇడి సిలబస్‌ పస్తకాల్లోని విషయాలే కాకుండా బి.ఇడి సిలబస్‌లోని విషయాలు కూడా అడుగుతున్నారు. అంటే టెట్‌ సిలబస్‌ను ప్రామాణిక పుస్తకాల్లోని ప్రాథమిక భావనలూ, వాటిలో అంతర్లీనంగా ఉన్న విషయాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని తెలుస్తోంది. ఆ దిశలో ప్రిపరేషన్‌ కొనసాగించాలి.

* పేపర్‌-1 రాసేవారు మెథడాలజీ ప్రిపరేషన్లో అన్ని బోధనా పద్ధతుల్లో ఉమ్మడిగా ఉంటే అధ్యాయాలను సమన్వయంతో అభ్యసిస్తే మంచి ఫలితాలుంటాయి.

ఉదాహరణకు- 1) బోధనా పద్ధతులు 2) విద్యాప్రణాళిక/పాఠ్య ప్రణాళిక 3) బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు 4) బోధనోపకరణాలు 5) మూల్యాంకనం మొదలైనవి.

* భాషలకు సంబంధించి ఆంగ్ల మాధ్యమ నేపథ్యమున్న అభ్యర్థులు తెలుగు వ్యాకరణాంశాలు, బోధనా విధానాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బాగా సాధన చేయాలి.
* తెలుగుమీడియంలో చదివినవారు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో గ్రామర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లోపాలను గ్రహిస్తూ, సవరించుకుంటూ, అవసరమైతే ఇతర విద్యార్థులతో పంచుకోవడం ద్వారా మెరుగైన సాధన చేయాలి.

టెట్‌ కఠినమని ఎందుకనిపిస్తోంది?
డీఈడీ, బీఈడీ కోర్సుల్లో పరీక్షలను వ్యాసరూప, సంక్షిప్త సమాధానాలుగా రాస్తారు. జ్ఞాన సంబంధ ప్రశ్నలే ఎక్కువ. గత డీఎస్‌సీ పరీక్షల్లో మూసధోరణికి అలవాటు పడినవారికి ప్రస్తుత టెట్‌ ప్రశ్నపత్రం భిన్నంగా కనపడుతోంది.

ప్రాథమిక భావనలపై ప్రశ్నలు అడగటం, అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పరీక్షించే ప్రశ్నలను రూపొందించడం చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నలు అడిగే తీరును బట్టి నేర్చుకునే విధానాన్ని, ఆ విషయాల వెనకున్న భావనలను, సూత్రాలను అవగాహన చేసుకుంటూ చదవాలి. ఆపై పునశ్చరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

* తమకు ఏ సబ్జెక్టులోనైతే పూర్తి అవగాహన అవసరమనిపిస్తుందో ఆ విషయంపై ఎక్కువ శ్రద్ధ కనబరచాలి; పునశ్చరణ చేయాలి.
* వీలైనంత ఎక్కువగా ప్రామాణిక మాదిరి పరీక్షలు ఎంచుకుని, సాధన చేయాలి.

శక్తిసామర్థ్యాలకు తగిన విధంగా మెదడుకు శిక్షణనివ్వండి. మెరుగైన మార్కులతో టెట్‌ విజయం మీదే అవుతుంది!

ఉపయోగపడే పుస్తకాలు
* డి.ఇడి., బి.ఇడి తెలుగు అకాడమీ పుస్తకాలు (విద్యామనోవిజ్ఞాన శాస్త్రం, బోధనా పద్ధతులు, సమ్మిళిత విద్య)
* జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005 (SCERTప్రచురణ)
* విద్యాహక్కు చట్టం- 2009
* మానవ హక్కుల విద్య (ఉపాధ్యాయ కరదీపిక)

రాజీవ్‌ విద్యామిషన్‌ (SSA) , AP ప్రచురణలు
* కంటెంట్‌ కోసం: ఆంధ్రప్రభుత్వ రాష్ట్ర సిలబస్‌ పాఠ్యపుస్తకాలు


- వి. బ్రహ్మయ్య

3 comments:

  1. please tell the industrial promotion officers model papers and old question papers and how to prepare for that exam?please explain......

    ReplyDelete
    Replies
    1. hi andi.. nenu ippude ee blog chustunnanu..chalabagundi.
      tq for sharing

      Delete
  2. hello
    industrial promotion officers exam which medium (telugu or english) lo untunda?
    pls reply me...

    ReplyDelete