ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. తమ కుమారుడు / కుమార్తెను ఏ కోర్సులో చేర్చితే వారి భవిష్యత్తు బాగుంటుంది, విదేశాల్లో ఉపాధి అవకాశాలకు వీలుంటుంది అనే అంశాలపై తల్లిదండ్రులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
ప్రాంగణ నియామకాలు (క్యాంపస్ ప్లేస్‌మెంట్స్) జరుగుతున్న కళాశాలల గురించి తెలుసుకుంటూ, వాటిలో సీటు దక్కాలంటే ఏ స్థాయి ర్యాంకు సాధించాలో పిల్లలకు గుర్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ, వారి ఆలోచనల మేరకు ఇంటర్ వరకు చదివినా... ఉపాధికి కీలకంగా భావిస్తున్న ఇంజినీరింగ్ విద్యలో మాత్రం విద్యార్థుల అభిరుచికి ప్రాధాన్యం తప్పనిసరిగా ఇవ్వాలని వివిధ రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించవచ్చు? ఉన్నత జీవనానికి విద్యార్థి దశ నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలపై దిగ్గజ కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఏమంటున్నారు?
దేశ భౌగోళిక పరిస్థితులు, అత్యధిక జనాభా రీత్యా సదుపాయాల మెరుగుకు ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవారంగాలు (ఐటీఈఎస్), ఆటోమేషన్, టెలీ కమ్యూనికేషన్ వ్యాప్తి అధికమవుతోంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాల్లో టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పాస్‌పోర్ట్ దరఖాస్తు కూడా ఇ-సేవాకేంద్రాల్లో చేస్తున్నామంటే టెక్నాలజీ విస్తృతి వల్లే. ఈ పరిణామాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఇతర రంగాల్లోనూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కొరత ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
* మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున సివిల్ ఇంజినీర్లకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
* తయారీ రంగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుల అవసరం ఉంటుంది. ఏరోస్పేస్ రంగంలోనూ డిజైనింగ్ నిపుణులకు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.
* అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రవేశం వల్ల కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి కోర్సులు చదివిన వారు కూడా ఐటీ ఉద్యోగాల్లో ఇమిడిపోతున్నారు.
* రోజువారీ పనులను మొబైల్ సాయంతో చేయగలిగే టెక్నాలజీ, కంప్యూటర్ నిర్వహణ ఖర్చులు తగ్గించే క్లౌడ్ విస్తృతి పెరుగుతోంది. కాబట్టి ఐటీ రంగంలో రాబోయే 2 దశాబ్దాలలోనూ మంచి ఉపాధి అవకాశాలే లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి సామర్థ్యాలు కావాలి?
దేశంలోని ప్రధాన ఐటీ సంస్థలకు అత్యధిక ఖాతాదారులు విదేశాల్లో ఉంటారు. వారికి కావాల్సిన ప్రాజెక్టులను ఐటీ కంపెనీలు ఇక్కడే రూపొందిస్తుంటాయి. అందుకే ఐటీ ఉద్యోగుల్లో 80 శాతం మంది ఇక్కడ పనిచేస్తుంటే, 20 శాతం మంది ఖాతాదారులకు సమీపంగా విదేశాల్లో పనిచేస్తుంటారు. విదేశీ సంస్థలకు ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అక్కడి బాధ్యులతో సమాచారం ఇచ్చి, పుచ్చుకునే (కమ్యూనికేషన్) బాధ్యత ఆ ప్రాజెక్టు చేపట్టిన బృంద సభ్యులే వహించాలి. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. వారి హావభావాలకు అనుగుణంగా స్పందించవచ్చు. కనీసం ఆ వ్యక్తి ఎలా ఉంటారో కూడా తెలీకుండా ఫోన్, ఇ మెయిల్, ఛాటింగ్ పద్ధతుల్లో సమాచార మార్పిడి జరగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎదుటివారిని ఆకట్టుకునేలా కమ్యూనికేషన్ ఉండాలి. అందుకే భావ ప్రకటనా సామర్థ్యం ఐటీ రంగంలో అత్యంత ముఖ్యం.
* ఏం చేస్తున్నాము, ఇంకా ఏమి కావాలి అనే అంశాలను వివరంగా, తడబాటు లేకుండా విశ్లేషించగలగాలి. సాంకేతికంగా అభ్యర్థిలో ఎంత నైపుణ్యం ఉన్నా, చెప్పలేకపోతే ఫలితం ఉండదు.
* వ్యాకరణ దోషాలు లేకుండా ఇంగ్లిష్‌లో సమాచారాన్ని పంపగలగాలి.
* ఒక్కో ప్రాజెక్టు ఒక్కో దేశంతో చేయాల్సి రావచ్చు. జర్మనీ, జపాన్, అమెరికా.. ఇలా ఒక్కో దేశానికి ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారితో మెలగాల్సి ఉంటుంది.
* జావా, ఎస్‌ఏపీ, డాట్ నెట్ లాంటి 20 రకాల కంప్యూటర్ లాంగ్వేజీలపై ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌లో అభ్యసించిన టెక్నాలజీతో పాటు ఎప్పటికప్పుడు కొత్త సామర్థ్యాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీలను త్వరగా గ్రహించగలగాలి.
* ఫలానా దేశం ప్రాజెక్టు వచ్చింది, వచ్చే వారంలో వెళ్లాలి అని కంపెనీ సూచించినప్పుడు, వెంటనే బయలుదేరగలగాలి. ఇంజినీరింగ్ దశలోనే దీనికి పునాది వేసుకోవాలి. సొంత ఇల్లు / బంధువుల వద్ద ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చే వారికంటే, హాస్టల్‌లో ఉండేవారు కొత్తవారితో త్వరగా కలిసిపోతారని, ఎక్కడికైనా వెళ్లేందుకు సంకోచించరన్నది కంపెనీల అభిప్రాయం.
* దేశాలతో పాటు ఖాతాదారుల రంగాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. బ్యాంకింగ్, తయారీ, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ వంటి రంగాలకు ప్రాజెక్టులు చేయాల్సి రావచ్చు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొని అప్పగించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయగలగాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఇది సాధ్యం. విద్యార్థి దశ నుంచే దీనిపై దృష్టిపెట్టి వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి.
కళాశాలల పాత్ర కీలకం
వ్యక్తిగత మేథావితనం (బ్రిలియన్స్) కంటే ఒక బృందంగా విజయవంతం అయితేనే ఐటీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ప్రాజెక్టు పరిమాణానికి అనుగుణంగా ఒక్కో బృందంలో 5, 10, 50 మంది వరకు సభ్యులుగా ఉండవచ్చు. వీరంతా బృందంగా పనిచేస్తేనే ప్రాజెక్టు సక్రమంగా పూర్తవుతుంది. కళాశాలల్లో వ్యక్తిగత మూల్యాంకనానికే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పద్ధతిలో మార్పు అవసరం. కొన్ని కళాశాలలు మాత్రమే విద్యార్థులు బృందాల్లో పనిచేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిపెడుతున్నాయి.
ఎంతో ఒత్తిడి ఉండే ఐటీ ఉద్యోగంలో రాణించాలంటే మానసిక, శారీరక ఆరోగ్యం అత్యంత కీలకం. 20-30 ఏళ్ల వయస్సులో ఒత్తిడి తట్టుకుని పనిచేసినా, అనంతరం బీపీ, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్‌పై పనిచేస్తున్నందున, ఎక్కడ ఉన్నా విధులకు అందుబాటులో ఉంటారు. దీనివల్ల కార్యాలయ విధులు, ఇంటి బాధ్యతల మధ్య విభజన చెరిగిపోతోంది. 24 గంటలూ ఫోన్ / కంప్యూటర్‌కు అతుక్కుపోకుండా, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఉండే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. యోగా, వ్యాయామం లాంటి వాటికి సమయం కేటాయించాలి. ఆఫీసు, వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సంరక్షణకు సరైన రీతిలో ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి దశ నుంచే దీన్ని అలవరచుకోవాలి.
* రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. విద్యార్థి దశలో రాత్రి 10-5 గంటల మధ్య నిద్రపోవాలి. విధుల్లో చేరాక నైట్‌షిఫ్ట్ ఉన్నా, అనువైన సమయంలో 7 గంటలు నిద్ర మానకూడదు.
* ఇంజినీరింగ్ నుంచే అభిరుచులను 1-2 అంశాలకు పరిమితం చేసుకోవాలి.
* మొబైల్, టీవీ, కంప్యూటర్ వినియోగించకుండా రోజులో కనీసం గంట లేదా అరగంట సమయం కుటుంబసభ్యులు లేదా సన్నిహితులతో నాణ్యంగా, ఆహ్లాదంగా గడపడం అలవర్చుకోవాలి.
కంప్యూటర్స్‌తో తేలిగ్గా ఉపాధి
బీఈ / బీటెక్ ఉత్తీర్ణతతోనే ఐటీ రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో అయితే మంచి కళాశాలల్లో పీజీ చేస్తేనే ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. అందుకే ఇతర కోర్ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు కూడా చాలామంది ఐటీలో ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం కూడా ఐటీ ప్రాధాన్యం పెరగడానికి మరో కారణం. ప్రారంభ వేతనాలు కూడా ఈ రంగంలోనే అధికం. కానీ ఇవే కీలకమని భావించి, విద్యార్థికి ఇష్టం లేకుండా కంప్యూటర్ సైన్స్ / ఐటీ కోర్సులో చేరితే ఇబ్బందులు ఎదురుకావచ్చు.
* వేగంగా విశ్లేషించగలగడం, సత్వర నిర్ణయాలు తీసుకునే చాతుర్యం, గణితంపై ఆసక్తి ఉన్నవారు ఐటీ రంగంలో రాణిస్తారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివిన వారికి ఈ రంగం అనుకూలిస్తుంది.
ఎంపిక పద్ధతులివీ...
ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో జరిగే ప్రాంగణ నియామకాలతో పాటు కోర్సు పూర్తయ్యాక కూడా రాత పరీక్ష, బృంద చర్చ (గ్రూప్ డిస్కషన్), ఇంటర్వ్యూ ద్వారా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులకు ఎంపిక చేసుకుంటున్నాయి.
* రాత పరీక్షలో ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో పాటు లాజికల్, క్విక్ థింకింగ్, మ్యాథ్స్‌పై ప్రశ్నలుంటాయి. కొన్ని కంపెనీలు మాత్రం తమకు అవసరమైన టెక్నాలజీలో కనీస నైపుణ్యాలు ఉన్నాయో లేదో కూడా పరీక్షిస్తున్నాయి.
* ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న అంశాలను ఎదుటివారితో ఎలా పంచుకుంటారనే విషయాన్ని పరీక్షించేందుకు బృంద చర్చ నిర్వహిస్తున్నారు.
* ఇంటర్వ్యూల్లో విద్యార్థులను టెక్నాలజీపై మరీ లోతుగా ప్రశ్నలు అడగరు. వారు చేసిన ప్రాజెక్టు వివరాలను ఆత్మవిశ్వాసంతో వివరించగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యంగా పరిశీలిస్తారు.
ఎంత శాతం మార్కులు అవసరం?
ప్రాంగణ నియామకాలు జరిగే వివిధ కళాశాలల్లో, అక్కడ ఎంపిక చేసుకునే విద్యార్థుల సగటు మార్కులు మారిపోతుంటాయి. కనీసం 65 శాతం మార్కులకు పైగా ఉన్నవారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.
దిగ్గజ కంపెనీలు ప్రాంగణ నియామకాలను అత్యున్నత విద్యాసంస్థలతో ప్రారంభిస్తాయి. ఐఐటీలు, ఐఐఎస్‌సీ, బిట్స్, నిట్, యూనివర్సిటీ ప్రాంగణ కళాశాలలు, పేరొందిన ప్రైవేటు కళాశాలలు.. ఈ క్రమంలో కళాశాలలకు వెళ్తాయి. ప్రైవేటు కళాశాలల ఎంపికలో, స్వతంత్ర సంస్థలు ఇచ్చే ర్యాంకులను, అక్కడి మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏటా కొత్త కళాశాలలను జత చేస్తుంటారు.
* ఒక కళాశాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల పనితీరును ఏడాది తరవాత పరిశీలిస్తారు. వారి పనితీరును ప్రామాణికంగా తీసుకుని, మరుసటి ఏడాది ఆయా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరపాలో, వద్దో నిర్ణయించుకుంటారు.
కంపెనీలు అభ్యర్థుల్లో గమనిస్తున్న లోపాలు .... www.eenadu.net లో చూడండి.