ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 16 February 2012

బ్యాంకు కొలువుకు తుది సోపానాలు

    ఐబీపీఎస్‌ నిర్వహించిన ఉమ్మడి రాతపరీక్ష ఫలితాలు వెలువడి, వివిధ జాతీయ బ్యాంకులు పి.ఒ. నియామకాలకు నోటిఫికేషన్లు జారీచేసే ప్రక్రియ మొదలయింది. దీని ప్రకారం అభ్యర్థులు ఈ నెలలో నిర్వహించే మౌఖిక పరీక్షకు హాజరుకావాల్సి వుంటుంది. కీలకమైన ఈ దశలో నెగ్గి ఉద్యోగం సాధించేదెలాగో పరిశీలిద్దాం!

మ్మడి రాతపరీక్షలో వచ్చిన మార్కులూ, మౌఖిక పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు అవసరాన్ని బట్టి బృందచర్చ (Group Discussion) కూడా నిర్వహించే అవకాశం వుంది.

మౌఖిక పరీక్షకు ముందు
* విద్యార్హతలు, వయసు, కులం, ఆదాయం మొదలైనవాటి ధ్రువీకరణ పత్రాలు ముందే సిద్ధం చేసుకోవాలి.

* పరీక్షా కేంద్రానికి వీలైతే ఒకరోజు ముందే వెళ్ళి చూసిరావడం మంచిది. దీనివల్ల ఆ వాతావరణం కొత్తగా అనిపించకుండా వుండి నూతన ప్రదేశాలకు వెళ్ళినపుడు వుండే ఇబ్బంది, ఆందోళనలను దూరం చేస్తుంది. ఆత్మస్త్థెర్యం పెంచుతుంది.

* మౌఖిక పరీక్షలో తరచుగా అడిగే ఈ కింది ప్రశ్నలకు సిద్ధం కండి.

a) మీ గురించి పేర్కొనండి
b) మీరు ఈ ఉద్యోగానికి ఏ విధంగా సరిపోగలనని అనుకుంటున్నారు?
c) రానున్న 10 సం|| కాలంలో మీరు ఎక్కడ ఏ స్థానంలో వుండగలనని అనుకుంటున్నారు?
d) మీ బలాలు/బలహీనతలు

వీటిలో b) ప్రశ్నకు మీ బలాలు అంటే hard working, communication skills, adaptability, quick learningమొదలైనవి చెప్పి, అందువల్ల ఈ ఉద్యోగానికి సరిపోగలనని పేర్కొనాలి.

c) ప్రశ్నకు మీరు పేర్కొన్న మీ బలాల వల్ల ఈ బ్యాంక్‌లోనే ఒక ఉన్నత స్థానంలో వుండగలనని నమ్మకంగా పేర్కొనాలి.

బలహీనతలు ఎప్పుడూ అభ్యర్థి బలహీనతలు నేరుగా పేర్కొనేలాగా (అంటే communication skills లేకపోవడం, ఇంగ్లిష్‌లో పట్టులేకపోవడం..) వుండకూడదు. అవి పరోక్షంగా బలాన్ని తెలియజేసేలాగానే వుండాలి. అంటే విషయాలను త్వరగా నేర్చుకోవడానికి అత్యుత్సాహం చూపించడం, పని పూర్తిచేసే క్రమంలో కాలాన్ని పట్టించుకోకపోవడం లాంటివి. ఇటువంటివాటిని బలహీనతలుగా పేర్కొన్నప్పటికీ అవి పరోక్షంగా బలాన్నే తెలియజేస్తాయి.

పరీక్ష సమయంలో
* హాల్లోకి ప్రవేశం కోరుతూ సభ్యులను అభ్యర్థించండి. సభ్యులందరికీ విష్‌ చేయండి. ఒకవేళ మహిళా సభ్యురాలు వుంటే ముందుగా ఆమెకు విష్‌ చేయండి.

* ఇంటర్వ్యూను ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మొదటి 2, 3 నిమిషాల సమయం చాలా ముఖ్యమైనది. చాలామంది సభ్యులు మొదటి కొద్దినిమిషాల్లో అభ్యర్థి ప్రవర్తించే తీరు, ఇచ్చే సమాధానాలు ఆధారంగా అభ్యర్థిపై positiveగా కాని negativeగా కాని ఒక అంచనాకు వస్తారు. అందుచేత ఆ సమయం చాలా కీలకం.

 * శారీరక హావభావాల ద్వారా ఉత్సుకతను ప్రదర్శించండి. అందువల్ల అభ్యర్థి తను activeగా వుండే personగానూ, ఆ బ్యాంక్‌లో పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా నూ సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.

* అభ్యర్థి హాల్లో ఉన్న సమయమంతా చిరునవ్వును ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. ఇది అంతర్లీనంగా వుండే ఆందోళనను బహిర్గతపరచకుండా దాచిపెడుతుంది.

* సభ్యుల ప్రశ్నలను జాగ్రత్తగా వినండి. మధ్యలో వారిని అంతరాయపరచవద్దు.
* మీరు జవాబులను ఇచ్చేముందు ఆలోచించి మాట్లాడండి.

* ఒక ప్రవాహంలా మధ్యలో ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడం సరికాదు. అవసరమయినచోట కొంచెం ఆగటం, వ్యవధినివ్వటం చేయాలి. స్వరంలో హెచ్చు తగ్గులను సందర్భాన్ని బట్టి ప్రదర్శించగలగాలి. మాట్లాడుతున్నదాన్ని recordచేసి దాన్ని విని అవసరమైనచోట మార్పులు చేర్పులు చేసుకొని సాధన చేయడం ద్వారా చక్కగా మెరుగుపరుచుకోవచ్చు.

* మీ సమాధానాలు నిజాయతీగా ఉండాలి.
* సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండాలి. చుట్టుతిరుగుడుగా మాట్లాడకూడదు.
* కేవలం 'అవును' 'లేదు/ కాదు' అనటం కాకుండా అవసరమైనచోట ఉదాహరణలతో వివరించండి.

* మీరు గతంలో సాధించిన achievements పేర్కొనండి. దీనివల్ల ఉద్యోగంలో మీరు విజయం సాధించడానికి మీకున్న సామర్థ్యం, నిబద్ధతలను వారికి తెలియపరచినట్లవుతుంది.

* మిమ్మల్ని ఈ ఉద్యోగంలో నియమిస్తే, మీరు బ్యాంక్‌కు ఏ విధంగా అదనపు విలువ సంతరించగలరో పేర్కొనండి. అంతేకానీ మీకు ఈ ఉద్యోగం ఎందుకు అవసరమో తెలియజేయకండి.

* సభ్యుల జాలి (sympathy) పొందే ప్రయత్నం చేయవద్దు.
* Basic concepts మీద దృష్టి సారించండి. ఒక్కొక్కసారి సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంలోనే ఇబ్బంది పడవచ్చు.

* ఆహార్యం విషయంలో జాగ్రత్తగా వుండండి. దుస్తులుformalగా వుండాలి. ముదురు రంగు దుస్తులు వేయకుండా వుంటే మంచిది. ప్రసన్నంగా, ఆకర్షణీయంగా ఉన్నట్లు కనబడాలి.
* సభ్యులతో ఎప్పుడూ వాదనకు దిగవద్దు.
* సూటిగా చూస్తూ మాట్లాడండి. ప్రశ్న ఎవరు అడిగినా జవాబును సభ్యులందరినీ చూస్తూ చెప్పండి.
* జవాబు తెలియకపోతే 'తెలియదు' అని చెప్పడానికి సంకోచపడవద్దు. సరైన సమాధానం కంటే మనం జవాబు చెప్పే తీరు ముఖ్యమని గ్రహించండి.

మౌఖిక పరీక్షలో అడగడానికి అవకాశం వున్న అంశాలు
* లోక్‌పాల్‌ బిల్‌
* ముల్లా పెరియార్‌ అంశం
* రూపాయి విలువ తగ్గుదల
* ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ చర్యలు
* బంగారం విలువ పెరుగుదల
* ఆర్థికశాఖ fiscal policy
* ఆర్‌బీఐ మానిటరీ పాలసీ
* స్టాక్‌ మార్కెట్‌, సెన్సెక్స్‌
* DI, FII, Definations, వాటిమధ్య భేదం
* బ్యాంకింగ్‌ రంగంలోని మార్పులు
* రాష్ట్రాల ఎన్నికలు
* ఆర్థిక రంగ తాజా పరిణామాలు

- జి.ఎస్. గిరిధర్

1 comment: