ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Showing posts with label బ్యాంకింగ్. Show all posts
Showing posts with label బ్యాంకింగ్. Show all posts

Wednesday, 7 March 2012

బ్యాంకు ఉద్యోగాల ప్రకటన చూశారా?



న్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నుంచి తాజాగా నోటిఫికేషన్ వెలువడింది.

 19 పబ్లిక్ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీల నియామానికి నిర్వహించే ఉమ్మడి రాత పరీక్షకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ ఉంటే  ఏ అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ

దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 9.
చివరితేదీ: మార్చి 30.
రాత పరీక్ష: జూన్ 17.

ఈ ప్రకటన  నిన్నటి ఈనాడు లో వచ్చింది.  దాన్నిక్కడ చూడండి.







Thursday, 16 February 2012

బ్యాంకు కొలువుకు తుది సోపానాలు

    ఐబీపీఎస్‌ నిర్వహించిన ఉమ్మడి రాతపరీక్ష ఫలితాలు వెలువడి, వివిధ జాతీయ బ్యాంకులు పి.ఒ. నియామకాలకు నోటిఫికేషన్లు జారీచేసే ప్రక్రియ మొదలయింది. దీని ప్రకారం అభ్యర్థులు ఈ నెలలో నిర్వహించే మౌఖిక పరీక్షకు హాజరుకావాల్సి వుంటుంది. కీలకమైన ఈ దశలో నెగ్గి ఉద్యోగం సాధించేదెలాగో పరిశీలిద్దాం!

మ్మడి రాతపరీక్షలో వచ్చిన మార్కులూ, మౌఖిక పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు అవసరాన్ని బట్టి బృందచర్చ (Group Discussion) కూడా నిర్వహించే అవకాశం వుంది.

మౌఖిక పరీక్షకు ముందు
* విద్యార్హతలు, వయసు, కులం, ఆదాయం మొదలైనవాటి ధ్రువీకరణ పత్రాలు ముందే సిద్ధం చేసుకోవాలి.

* పరీక్షా కేంద్రానికి వీలైతే ఒకరోజు ముందే వెళ్ళి చూసిరావడం మంచిది. దీనివల్ల ఆ వాతావరణం కొత్తగా అనిపించకుండా వుండి నూతన ప్రదేశాలకు వెళ్ళినపుడు వుండే ఇబ్బంది, ఆందోళనలను దూరం చేస్తుంది. ఆత్మస్త్థెర్యం పెంచుతుంది.

* మౌఖిక పరీక్షలో తరచుగా అడిగే ఈ కింది ప్రశ్నలకు సిద్ధం కండి.

a) మీ గురించి పేర్కొనండి
b) మీరు ఈ ఉద్యోగానికి ఏ విధంగా సరిపోగలనని అనుకుంటున్నారు?
c) రానున్న 10 సం|| కాలంలో మీరు ఎక్కడ ఏ స్థానంలో వుండగలనని అనుకుంటున్నారు?
d) మీ బలాలు/బలహీనతలు

వీటిలో b) ప్రశ్నకు మీ బలాలు అంటే hard working, communication skills, adaptability, quick learningమొదలైనవి చెప్పి, అందువల్ల ఈ ఉద్యోగానికి సరిపోగలనని పేర్కొనాలి.

c) ప్రశ్నకు మీరు పేర్కొన్న మీ బలాల వల్ల ఈ బ్యాంక్‌లోనే ఒక ఉన్నత స్థానంలో వుండగలనని నమ్మకంగా పేర్కొనాలి.

బలహీనతలు ఎప్పుడూ అభ్యర్థి బలహీనతలు నేరుగా పేర్కొనేలాగా (అంటే communication skills లేకపోవడం, ఇంగ్లిష్‌లో పట్టులేకపోవడం..) వుండకూడదు. అవి పరోక్షంగా బలాన్ని తెలియజేసేలాగానే వుండాలి. అంటే విషయాలను త్వరగా నేర్చుకోవడానికి అత్యుత్సాహం చూపించడం, పని పూర్తిచేసే క్రమంలో కాలాన్ని పట్టించుకోకపోవడం లాంటివి. ఇటువంటివాటిని బలహీనతలుగా పేర్కొన్నప్పటికీ అవి పరోక్షంగా బలాన్నే తెలియజేస్తాయి.

పరీక్ష సమయంలో
* హాల్లోకి ప్రవేశం కోరుతూ సభ్యులను అభ్యర్థించండి. సభ్యులందరికీ విష్‌ చేయండి. ఒకవేళ మహిళా సభ్యురాలు వుంటే ముందుగా ఆమెకు విష్‌ చేయండి.

* ఇంటర్వ్యూను ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మొదటి 2, 3 నిమిషాల సమయం చాలా ముఖ్యమైనది. చాలామంది సభ్యులు మొదటి కొద్దినిమిషాల్లో అభ్యర్థి ప్రవర్తించే తీరు, ఇచ్చే సమాధానాలు ఆధారంగా అభ్యర్థిపై positiveగా కాని negativeగా కాని ఒక అంచనాకు వస్తారు. అందుచేత ఆ సమయం చాలా కీలకం.

 * శారీరక హావభావాల ద్వారా ఉత్సుకతను ప్రదర్శించండి. అందువల్ల అభ్యర్థి తను activeగా వుండే personగానూ, ఆ బ్యాంక్‌లో పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా నూ సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.

* అభ్యర్థి హాల్లో ఉన్న సమయమంతా చిరునవ్వును ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. ఇది అంతర్లీనంగా వుండే ఆందోళనను బహిర్గతపరచకుండా దాచిపెడుతుంది.

* సభ్యుల ప్రశ్నలను జాగ్రత్తగా వినండి. మధ్యలో వారిని అంతరాయపరచవద్దు.
* మీరు జవాబులను ఇచ్చేముందు ఆలోచించి మాట్లాడండి.

* ఒక ప్రవాహంలా మధ్యలో ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడం సరికాదు. అవసరమయినచోట కొంచెం ఆగటం, వ్యవధినివ్వటం చేయాలి. స్వరంలో హెచ్చు తగ్గులను సందర్భాన్ని బట్టి ప్రదర్శించగలగాలి. మాట్లాడుతున్నదాన్ని recordచేసి దాన్ని విని అవసరమైనచోట మార్పులు చేర్పులు చేసుకొని సాధన చేయడం ద్వారా చక్కగా మెరుగుపరుచుకోవచ్చు.

* మీ సమాధానాలు నిజాయతీగా ఉండాలి.
* సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండాలి. చుట్టుతిరుగుడుగా మాట్లాడకూడదు.
* కేవలం 'అవును' 'లేదు/ కాదు' అనటం కాకుండా అవసరమైనచోట ఉదాహరణలతో వివరించండి.

* మీరు గతంలో సాధించిన achievements పేర్కొనండి. దీనివల్ల ఉద్యోగంలో మీరు విజయం సాధించడానికి మీకున్న సామర్థ్యం, నిబద్ధతలను వారికి తెలియపరచినట్లవుతుంది.

* మిమ్మల్ని ఈ ఉద్యోగంలో నియమిస్తే, మీరు బ్యాంక్‌కు ఏ విధంగా అదనపు విలువ సంతరించగలరో పేర్కొనండి. అంతేకానీ మీకు ఈ ఉద్యోగం ఎందుకు అవసరమో తెలియజేయకండి.

* సభ్యుల జాలి (sympathy) పొందే ప్రయత్నం చేయవద్దు.
* Basic concepts మీద దృష్టి సారించండి. ఒక్కొక్కసారి సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంలోనే ఇబ్బంది పడవచ్చు.

* ఆహార్యం విషయంలో జాగ్రత్తగా వుండండి. దుస్తులుformalగా వుండాలి. ముదురు రంగు దుస్తులు వేయకుండా వుంటే మంచిది. ప్రసన్నంగా, ఆకర్షణీయంగా ఉన్నట్లు కనబడాలి.
* సభ్యులతో ఎప్పుడూ వాదనకు దిగవద్దు.
* సూటిగా చూస్తూ మాట్లాడండి. ప్రశ్న ఎవరు అడిగినా జవాబును సభ్యులందరినీ చూస్తూ చెప్పండి.
* జవాబు తెలియకపోతే 'తెలియదు' అని చెప్పడానికి సంకోచపడవద్దు. సరైన సమాధానం కంటే మనం జవాబు చెప్పే తీరు ముఖ్యమని గ్రహించండి.

మౌఖిక పరీక్షలో అడగడానికి అవకాశం వున్న అంశాలు
* లోక్‌పాల్‌ బిల్‌
* ముల్లా పెరియార్‌ అంశం
* రూపాయి విలువ తగ్గుదల
* ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ చర్యలు
* బంగారం విలువ పెరుగుదల
* ఆర్థికశాఖ fiscal policy
* ఆర్‌బీఐ మానిటరీ పాలసీ
* స్టాక్‌ మార్కెట్‌, సెన్సెక్స్‌
* DI, FII, Definations, వాటిమధ్య భేదం
* బ్యాంకింగ్‌ రంగంలోని మార్పులు
* రాష్ట్రాల ఎన్నికలు
* ఆర్థిక రంగ తాజా పరిణామాలు

- జి.ఎస్. గిరిధర్

Monday, 14 November 2011

బ్యాంకు టెస్టులో పట్టు పెంచుకునేదెలా?

IBPS నిర్వహించే క్లరికల్‌ పరీక్షకు దాదాపు రెండు వారాల వ్యవధి ఉంది.

ఈ చివరి సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటేనే ఆశించిన లక్ష్యం చేరగలిగేది. ఈ తరుణంలో రాతపరీక్షకు ఏ రీతిలో సన్నద్ధమవ్వాలో జి.ఎస్. గిరిధర్ వివరిస్తున్నారు...

బ్యాంక్‌ పరీక్షలో ఉండే సబ్జెక్టుల్లో న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ లు కష్టమైనవని అభ్యర్థులు భావిస్తారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. ఈ మధ్య కొన్ని బ్యాంకులు పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాయి. ఎక్కువమంది ఉత్తీర్ణులు కాలేకపోతున్న సబ్జెక్టు- ఇంగ్లిషు. అందుచేత విద్యార్థులు ఈ విభాగానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాల్సివుంది.

అధిక మార్కులు ఎలా?
ఇప్పటికిప్పుడు ఆంగ్ల భాషపై పట్టు సాధించాల్సిన అవసరం లేదు కానీ దీనిలో ఎక్కువ మార్కులు పొందే ప్రయత్నం చేయాలి. పరీక్షకు ఎక్కువ సమయం అందుబాటులో ఉన్నప్పుడు వ్యాకరణం (grammar)పై పట్టు సాధించి ఆపై వివిధ నమూనా ప్రశ్నలు సాధన చేయొచ్చు. అయితే IBPSక్లరికల్‌ పరీక్షలకు రెండు వారాల సమయం మాత్రమే ఉన్నందున నమూనా ప్రశ్నపత్రాలే సాధన చేయాలి. బ్యాంక్‌ క్లరికల్‌ పరీక్షలోని ఈ విభాగంలో గ్రామర్‌ను ఆధారం చేసుకుని Correction of sentences, Jumbled sentences, sentence completion, spotting errors, cloze test మొదలైనవాటిలో ప్రతీ మోడల్‌ నుంచి దాదాపు ఐదు ప్రశ్నలుంటాయి. ముందుగా ఈ మోడల్‌ ప్రశ్నలను సాధన చేయాలి. ఇబ్బంది ఎదురైనప్పుడు దానికి సంబంధించిన Grammar part refer చేయాలి. వీటిని బాగా సాధన చేయడం వల్ల దాదాపు అన్ని ప్రశ్నలూ సరిగా గుర్తించవచ్చు.

Vocabularyనుంచి దాదాపు 5 ప్రశ్నలుంటాయి. కానీ కొత్తగా నేర్చుకోడానికి సమయం లేదు కాబట్టి ఇప్పుడు దానికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. Reading comprehension లో పాసేజ్‌ చదివి అర్థం చేసుకుని ప్రశ్నలు సాధించడం కంటే, మొదట ప్రశ్నలు చదివి తరవాత పాసేజ్‌ చదవటం మేలు. ఇలా చేస్తే జవాబులు వేగంగా గుర్తించే అవకాశం ఉంది. వీటిని సమర్థంగా పాటించగలిగితే ఇంగ్లిషు గండం నుంచి తేలికగా బయటపడవచ్చు.


జనరల్‌ అవేర్‌నెస్‌ సంగతి?
ఈ విభాగం కోసం అభ్యర్థులు గత ఆర్నెల్ల కరెంట్‌ అఫైర్స్‌పై మెటీరియల్‌ సిద్ధం చేసుకుని ఉంటారు. దానిని వీలైతే పాయింట్ల ప్రకారం నోట్సుగా సిద్ధం చేసుకుని పరీక్ష సమయం వరకు వీలైనన్ని సార్లు చదవాలి. కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. ఇది మల్టిపుల్‌ ఛాయిస్‌ ఉన్న పరీక్ష కాబట్టి ప్రశ్నను చూసి దానికి సంబంధించిన జవాబును ఇచ్చిన ఆప్షన్ల నుంచి తేలికగా గుర్తించవచ్చు.


న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌...
సమయం ఎక్కువ పట్టే ఈ విభాగాలను వేగంగా పూర్తిచేయడం ముఖ్యం. దీనికోసం సమయాన్ని నిర్దేశించుకొని ఈ విభాగాలకు సంబంధించిన నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీలైతే 20 ప్రశ్నలుండేలా పేపర్లు సొంతంగా తయారుచేసుకుని వాటిని సాధించడానికి ఎంత సమయం పడుతుందో గమనించాలి. ఆ తదుపరి పట్టే సమయాన్ని బాగా తగ్గించేలా వేగాన్ని అభ్యసించాలి.

ఇప్పుడు ఈ సబ్జెక్టుల్లోని ప్రశ్నలను టాపిక్‌ల వారీగా సాధన చేయకుండా తాము ఏ అంశంలోని ప్రశ్నలు చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నారో వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా previous papers సాధన చేయడం వల్ల ఏయే టాపిక్‌ల నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో, దేనికి ప్రాముఖ్యమివ్వాలో అభ్యర్థులకు త్వరగా అవగతమవుతుంది.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌
ఈ విభాగానికి సంబంధించి Basics of Computer, Ms office (Word, excel, power point) లను బాగా చూసుకోవాలి. గత రెండు మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న బ్యాంకు పరీక్షల్లో ఈ విభాగం నుంచి ప్రశ్నలు బాగానే వస్తున్నందున వాటిని పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది.
ఈ విధంగా ప్రతిరోజూ 8- 10 గంటలకు తక్కువ కాకుండా సబ్జెక్టులను ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే కనీసం ఈ రెండు వారాల ప్రిపరేషన్‌ ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

పరీక్ష కేంద్రంలో...
పరీక్ష కోసం సన్నద్ధం కావడం ఒకెత్తు. పరీక్ష సరిగా రాయడం మరొక ఎత్తు. చాలామంది విద్యార్థులు ఎటువంటి అవగాహనా లేకుండా పరీక్షలకు వెళతారు. దానివల్ల దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఏ విభాగానికెంత సమయం కేటాయించాలో, దేన్ని ముందుగా మొదలుపెట్టాలో తెలియక ఏదో తోచిన విధంగా పరీక్ష రాస్తారు. ఇటువంటి అవగాహనలేమితోనే ఎక్కువ మంది విద్యార్థులు Knowledgeఉన్నా కూడా ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు.

అందుచేత విద్యార్థులకు 150 నిమిషాల పరీక్షా సమయంలో వారు ఏం చెయ్యాలో పూర్తి అవగాహన ఉండాలి. పరీక్షలోని అన్ని విభాగాల్లో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాలి కాబట్టి.. విభాగాల క్లిష్టత ఆధారంగా సమయాన్ని వాటికి కేటాయించుకోవాలి.


పరీక్ష రాసేటప్పుడు ముందుగా జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాన్ని పూర్తిచేయాలి. తదుపరి వరుసగా కంప్యూటర్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిషు, రీజనింగ్‌లను పూర్తిచేసి, చివరగా న్యూమరికల్‌ ఎబిలిటీతో ముగించాలి. అభ్యర్థులు వివిధ విభాగాలకు తాము కేటాయించుకున్న సమయాలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ నిర్దేశించుకున్న సమయంలో ఆ విభాగంలోని అన్ని ప్రశ్నలూ పూర్తి చేయలేకపోయినప్పటికీ తప్పనిసరిగా తదుపరి విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేయగలిగినపుడే అన్ని విభాగాల్లో కనీస మార్కులు పొందగలుగుతారు.

పరీక్షలో తప్పుగా గుర్తించే సమాధానాలకు నెగిటివ్‌ మార్కులున్నాయి. కాబట్టి జవాబు తెలియకపోతే ప్రశ్నను వదిలివేయటం మంచిది. వూహాజనిత జవాబులు గుర్తించటం వల్ల ఫలితం ఉండదు.

Wednesday, 21 September 2011

సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు!

 ఐబీపీఎస్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌) నిర్వహించే పరీక్షల జాబితాలో మరోటి చేరింది. బ్యాంకు పీఓ, క్లర్కుల పోస్టుల ప్రకటనల తర్వాత, మూడో పరీక్షకు కూడా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇవి జిల్లాస్థాయి సహకార బ్యాంకుల్లో కొలువుల నియామకానికి సంబంధించినవి. డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఓ, క్లర్కుల అభ్యర్థులు కొత్తగా ఏమీ చదవకుండానే ఈ పరీక్షను రాసెయ్యవచ్చు. అదనపు శ్రమ లేకుండానే అదనపు కొలువు అవకాశాలకు నిజంగా ఇదో గొప్ప సహకారం!

‘ఈనాడు చదువు’ పేజీలో ప్రచురించిన ఈ కథన రచయిత ఎస్. అరుణ్ మోహన్. 


జాతీయ బ్యాంకులూ, గ్రామీణ బ్యాంకులూ ఐబీపీఎస్‌ ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలకు ప్రకటనలు వెలువరిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగార్థులకు అపూర్వ అవకాశాలు లభిస్తున్న ఈ తరుణంలోనే ఏపీ సహకార బ్యాంకు డీసీసీబీల ద్వారా అవకాశాలను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంఆ 1593 క్లర్కు ఉద్యోగాలు, 960 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయబోతున్నారు!

ఈ పోస్టులకు ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు జిల్లాలవారీగా దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. ప్రతి జిల్లాకూ వేర్వేరు వెబ్‌సైట్లున్నాయి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 3, 2011.

పరీక్ష తేదీలు
* క్లర్కులు/, స్టాఫ్‌ అసిస్టెంట్లు: అక్టోబరు 30, 2011, ఉదయం.
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష: అక్టోబరు 30, 2011, మధ్యాహ్నం.

రిజర్వేషన్లు
ప్రస్తుత ఖాళీల్లో అన్ని క్యాటగిరీలలో స్త్రీలకు 30 శాతం రిజర్వేషన్‌ పాటిస్తున్నారు.

క్లర్కు ఉద్యోగాలకు ఉన్న మొత్తం ఖాళీల్లో 25 శాతం పోస్టులను ఆయా జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (Primary Agricultural Co-operative Societies - PACS) పనిచేస్తున్న ఉద్యోగులకు కేటాయించారు. కనీసం 10 సంవత్సరాలు ఆయా సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. PACSలో పనిచేస్తున్న అర్హత గల అభ్యర్థుల గరిష్ఠ వయః పరి మితి 45 సంవత్సరాలు.

సాధారణ అభ్యర్థుల వయః పరిమితి 18 సం. నుంచి 30 సంవత్సరాల మధ్య.

(క్లర్కు ఉద్యోగాలకు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు ఒకే వయః పరిమితి)

అభ్యర్థి ఏ జిల్లాలో ఉద్యోగాన్ని ఆశిస్తున్నాడో తప్పనిసరిగా అదే జిల్లాకు చెందినవాడై ఉండాలి. ఆయా జిల్లాల్లో స్థానిక (లోకల్‌) అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. ఒక జిల్లాకు లోకల్‌ అభ్యర్థులు వేరే జిల్లాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.

విద్యార్హతలు
* క్లర్కు ఉద్యోగానికి కనీస విద్యార్హత- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
* అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా కామర్స్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత

కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఇంగ్లిష్‌ భాషాజ్ఞానం కూడా అవసరం. తెలుగు రాయటం, చదవటం, మాట్లాడటం... ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం
ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. 1) రాతపరీక్ష 2) మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ).

175 మార్కులతో 2 గంటల కాలవ్యవధిలో ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకూ, క్లర్కు ఉద్యోగాలకూ విడివిడిగా జరుగుతుంది.

అలాగే 25 మార్కులతో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకూ, క్లర్కు ఉద్యోగాలకూ విడివిడిగా ఇంటర్వ్యూలు ఉంటాయి.

రాత పరీక్షలో మెరిట్‌ జాబితా ఆధారంగా 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలోనూ, రాతపరీక్షలోనూ సంయుక్తంగా వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఆబ్జెక్టివ్‌ రాతపరీక్షలో సబ్జెక్టులు
* స్టాఫ్‌ అసిస్టెంట్స్‌/ క్లర్కు పరీక్ష
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష
1)టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌
1) రీజనింగ్‌, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
2) టెస్ట్‌ ఆఫ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ
2) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
3) టెస్ట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌, క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌
3)జనరల్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
4) టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
4) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌


ఎలా తయారవ్వాలి?
ఐబీపీఎస్‌ క్లర్కు ఉద్యోగాలకూ, ఐబీపీఎస్‌ పీఓ ఉద్యోగాలకూ సిద్ధమయ్యే అభ్యర్థులు అదనంగా సిద్ధం కావలసిన సబ్జెక్టులు ఏమీ లేవు.

పరీక్ష అక్టోబరు 30న జరగబోతోంది కాబట్టి ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష నిన్న రాసినవారు సాధన (ప్రాక్టీస్‌) కొనసాగిస్తే ఈ పరీక్షను చాలా సులభంగా రాయవచ్చు.

అలాగే ఐబీపీఎస్‌ క్లర్కు ఉద్యోగాలకు నవంబరు 27న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ పరీక్ష చక్కటి అభ్యాసంగా ఉపయోగపడుతుంది.

ఐబీపీఎస్‌ పరీక్షతో పోలిస్తే ఈ బ్యాంకు పరీక్ష కేవలం జిల్లాలకు పరిమితం. కాబట్టి పోటీ కూడా జిల్లాకే పరిమితం. ఈ బ్యాంకులో ఉద్యోగంలో చేరితే సర్వీస్‌ అంతా ఒకే జిల్లాలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది! దూరప్రాంతాలకు బదిలీ బెడద అసలుండదు.

అదనపు ప్రిపరేషన్‌ అవసరం లేకుండా ఐబీపీఎస్‌ పరీక్షల ప్రిపరేషన్‌తోనే సహకార బ్యాంకులో కొలువు సంపాదించగల చక్కని అవకాశం ఇప్పుడు అభ్యర్థుల ముందుంది!

Monday, 29 August 2011

బ్యాంకు క్లర్కుల పరీక్షకు సిద్ధం కండి!

బీపీఎస్ క్లర్కు పోస్టుల  ప్రకటన వివరాలు ఈ టపాలో తెలుసుకున్నాం కదా?  టెన్త్ అర్హతతోనే బ్యాంకు పరీక్ష రాసే అవకాశమిది.

ఈ ఉమ్మడి పరీక్షా విధానం స్వరూపం ఏమిటి?

ఒక్కో విభాగానికి మరి ఎలా సిద్ధమవ్వాలి?

ప్రిపరేషన్లో ఏయే మెలకువలు పాటించాలి?

గతంలో బ్యాంకు పరీక్షలు  రాసి ఎంపిక కానివారు సవరించుకోవలసిన లోపాలు ఏమిటి?

బ్యాంకు ఉద్యోగార్థులు ఎవరికైనా ఇవి సహజంగా వచ్చే సందేహాలు!

వీటిని నివృత్తి చేయటానికి  ఇవాళ చదువు పేజీలో ప్రచురించిన ప్రధాన కథనం ఇది. 

 

Tuesday, 23 August 2011

బ్యాంకుల్లో ఉద్యోగాలు!


బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఓ శుభవార్త!

బ్యాంకు క్లర్కు కొలువుల  నియామకాల కోసం  కొత్త గా IBPS ఏర్పడింది కదా?  ఈ సంస్థ  ఏటా రెండుసార్లు కామన్ రిటన్ ఎగ్జామినేషన్ (CWE)  నిర్వహిస్తుంది.

 తాజాగా   19 బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీ  కోసంప్రకటన విడుదల చేసింది. 

చూడండి... ఆ ప్రకటన!  ఇవాళ ఈనాడు ఉద్యోగ అవకాశాలు పేజీలో వచ్చిందీ ప్రకటన.



పదో తరగతి  చదివినవారు కూడా దరఖాస్తు చేసి, రాతపరీక్ష రాయవచ్చు.  కాకపోతే వారికి టెన్త్ లో  60 శాతం మార్కులుండాలి. కనీసం 18 సంవత్సరాల వయసు తప్పనిసరి.  గరిష్ఠ వయ: పరిమితి - 28 సంవత్సరాలు (ఇది జనరల్ క్యాటగిరీకి వర్తిస్తుంది) . 

టెన్త్ లో  60 శాతం రాకపోయివుంటే ఇంటర్మీడియట్ చదివి, దానిలో 50 శాతం మార్కులొచ్చినా సరిపోతుంది.

ఇంటర్లో 50 శాతం మార్కులు కూడా రానివారు ఉంటారు కదా?  అలాంటి వారు  డిగ్రీ  పాసైవుంటే  చాలు;  దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్ సైట్  ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పంపటానికి చివరి తేదీ: సెప్టెంబరు 24.

రాత పరీక్ష  నవంబరు 27న! 

Monday, 8 August 2011

బ్యాంకు లో పాగా వేద్దామా?


కప్పుడు బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలంటే  BSRB పరీక్ష రాయాల్సివచ్చేది.

ఇప్పుడు అదే తరహాలో IBPS రాత పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో స్కోరు 19 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) గా నియామకం పొందటానికి   ఉపయోగపడుతుంది.

ఈ కామన్ రిటన్  ఎగ్జామ్ ను కొత్తగా  ప్రవేశపెట్టారు.  మొట్టమొదటిసారి  నిర్వహించబోతున్నారు. 40 రోజుల సమయం ఉందీ పరీక్షకు!


బ్యాంకు పరీక్షల ప్రిపరేషన్లో అభ్యర్థులు తరచూ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. విజేలకూ, వారికీ తేడా అక్కడే వస్తుంది. పొరపాట్లను  సవరించుకోగలిగితే  పరీక్షలో  విజయం సాధించటం కష్టమేమీ కాదు.


పరీక్షలోని ఐదు విభాగాల్లోనూ విడివిడిగా ఉత్తీర్ణులవ్వటం తప్పనిసరే. కాబట్టి అన్ని విభాగాల్లోనూ కనీస సంఖ్యలో ప్రశ్నలు సాధించాల్సివుంటుంది.

త్వరగా పూర్తిచేయగలిగే జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ లాంటి విభాగాలకు తక్కువ సమయం కేటాయించాలి. కష్టంగా ఉండే క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌లకు అధిక సమయం వెచ్చించాలి.

150 నిమిషాల వ్యవధి ఉండే ఈ పరీక్షకు కింది విధంగా సమయం కేటాయించుకోవచ్చు.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: 50 ని.
రీజనింగ్‌: 45 ని.
ఇంగ్లిష్‌: 25 ని.
జనరల్‌ అవేర్‌నెస్‌: 15 ని.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: 15 ని.


అయితే విద్యార్థులు ఈ సమయాలను తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోవచ్చు. 
 
 ఈ పరీక్ష  ప్రిపరేషన్లో  పాటించవలసిన మెలకువల గురించి  చదువులో ఇవాళ ప్రచురించిన  లోపాలు సరిదిద్దుకుంటే బ్యాంకులో కొలువు  లో తెలుసుకోవచ్చు.

(శీర్షిక మీద క్లిక్ చేస్తే  ఈనాడు చదువు ఆన్ లైన్ ఎడిషన్ లో ఉన్న  ఈ కథనాన్ని పూర్తిగా చదువుకోవచ్చు).

బ్యాంకు పరీక్షల కోచింగ్  నిపుణులు  జి.ఎస్. గిరిధర్  అందించిన కథనమిది.