ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 14 November 2011

బ్యాంకు టెస్టులో పట్టు పెంచుకునేదెలా?

IBPS నిర్వహించే క్లరికల్‌ పరీక్షకు దాదాపు రెండు వారాల వ్యవధి ఉంది.

ఈ చివరి సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటేనే ఆశించిన లక్ష్యం చేరగలిగేది. ఈ తరుణంలో రాతపరీక్షకు ఏ రీతిలో సన్నద్ధమవ్వాలో జి.ఎస్. గిరిధర్ వివరిస్తున్నారు...

బ్యాంక్‌ పరీక్షలో ఉండే సబ్జెక్టుల్లో న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ లు కష్టమైనవని అభ్యర్థులు భావిస్తారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. ఈ మధ్య కొన్ని బ్యాంకులు పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాయి. ఎక్కువమంది ఉత్తీర్ణులు కాలేకపోతున్న సబ్జెక్టు- ఇంగ్లిషు. అందుచేత విద్యార్థులు ఈ విభాగానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాల్సివుంది.

అధిక మార్కులు ఎలా?
ఇప్పటికిప్పుడు ఆంగ్ల భాషపై పట్టు సాధించాల్సిన అవసరం లేదు కానీ దీనిలో ఎక్కువ మార్కులు పొందే ప్రయత్నం చేయాలి. పరీక్షకు ఎక్కువ సమయం అందుబాటులో ఉన్నప్పుడు వ్యాకరణం (grammar)పై పట్టు సాధించి ఆపై వివిధ నమూనా ప్రశ్నలు సాధన చేయొచ్చు. అయితే IBPSక్లరికల్‌ పరీక్షలకు రెండు వారాల సమయం మాత్రమే ఉన్నందున నమూనా ప్రశ్నపత్రాలే సాధన చేయాలి. బ్యాంక్‌ క్లరికల్‌ పరీక్షలోని ఈ విభాగంలో గ్రామర్‌ను ఆధారం చేసుకుని Correction of sentences, Jumbled sentences, sentence completion, spotting errors, cloze test మొదలైనవాటిలో ప్రతీ మోడల్‌ నుంచి దాదాపు ఐదు ప్రశ్నలుంటాయి. ముందుగా ఈ మోడల్‌ ప్రశ్నలను సాధన చేయాలి. ఇబ్బంది ఎదురైనప్పుడు దానికి సంబంధించిన Grammar part refer చేయాలి. వీటిని బాగా సాధన చేయడం వల్ల దాదాపు అన్ని ప్రశ్నలూ సరిగా గుర్తించవచ్చు.

Vocabularyనుంచి దాదాపు 5 ప్రశ్నలుంటాయి. కానీ కొత్తగా నేర్చుకోడానికి సమయం లేదు కాబట్టి ఇప్పుడు దానికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. Reading comprehension లో పాసేజ్‌ చదివి అర్థం చేసుకుని ప్రశ్నలు సాధించడం కంటే, మొదట ప్రశ్నలు చదివి తరవాత పాసేజ్‌ చదవటం మేలు. ఇలా చేస్తే జవాబులు వేగంగా గుర్తించే అవకాశం ఉంది. వీటిని సమర్థంగా పాటించగలిగితే ఇంగ్లిషు గండం నుంచి తేలికగా బయటపడవచ్చు.


జనరల్‌ అవేర్‌నెస్‌ సంగతి?
ఈ విభాగం కోసం అభ్యర్థులు గత ఆర్నెల్ల కరెంట్‌ అఫైర్స్‌పై మెటీరియల్‌ సిద్ధం చేసుకుని ఉంటారు. దానిని వీలైతే పాయింట్ల ప్రకారం నోట్సుగా సిద్ధం చేసుకుని పరీక్ష సమయం వరకు వీలైనన్ని సార్లు చదవాలి. కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. ఇది మల్టిపుల్‌ ఛాయిస్‌ ఉన్న పరీక్ష కాబట్టి ప్రశ్నను చూసి దానికి సంబంధించిన జవాబును ఇచ్చిన ఆప్షన్ల నుంచి తేలికగా గుర్తించవచ్చు.


న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌...
సమయం ఎక్కువ పట్టే ఈ విభాగాలను వేగంగా పూర్తిచేయడం ముఖ్యం. దీనికోసం సమయాన్ని నిర్దేశించుకొని ఈ విభాగాలకు సంబంధించిన నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీలైతే 20 ప్రశ్నలుండేలా పేపర్లు సొంతంగా తయారుచేసుకుని వాటిని సాధించడానికి ఎంత సమయం పడుతుందో గమనించాలి. ఆ తదుపరి పట్టే సమయాన్ని బాగా తగ్గించేలా వేగాన్ని అభ్యసించాలి.

ఇప్పుడు ఈ సబ్జెక్టుల్లోని ప్రశ్నలను టాపిక్‌ల వారీగా సాధన చేయకుండా తాము ఏ అంశంలోని ప్రశ్నలు చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నారో వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా previous papers సాధన చేయడం వల్ల ఏయే టాపిక్‌ల నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో, దేనికి ప్రాముఖ్యమివ్వాలో అభ్యర్థులకు త్వరగా అవగతమవుతుంది.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌
ఈ విభాగానికి సంబంధించి Basics of Computer, Ms office (Word, excel, power point) లను బాగా చూసుకోవాలి. గత రెండు మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న బ్యాంకు పరీక్షల్లో ఈ విభాగం నుంచి ప్రశ్నలు బాగానే వస్తున్నందున వాటిని పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది.
ఈ విధంగా ప్రతిరోజూ 8- 10 గంటలకు తక్కువ కాకుండా సబ్జెక్టులను ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే కనీసం ఈ రెండు వారాల ప్రిపరేషన్‌ ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

పరీక్ష కేంద్రంలో...
పరీక్ష కోసం సన్నద్ధం కావడం ఒకెత్తు. పరీక్ష సరిగా రాయడం మరొక ఎత్తు. చాలామంది విద్యార్థులు ఎటువంటి అవగాహనా లేకుండా పరీక్షలకు వెళతారు. దానివల్ల దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఏ విభాగానికెంత సమయం కేటాయించాలో, దేన్ని ముందుగా మొదలుపెట్టాలో తెలియక ఏదో తోచిన విధంగా పరీక్ష రాస్తారు. ఇటువంటి అవగాహనలేమితోనే ఎక్కువ మంది విద్యార్థులు Knowledgeఉన్నా కూడా ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు.

అందుచేత విద్యార్థులకు 150 నిమిషాల పరీక్షా సమయంలో వారు ఏం చెయ్యాలో పూర్తి అవగాహన ఉండాలి. పరీక్షలోని అన్ని విభాగాల్లో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాలి కాబట్టి.. విభాగాల క్లిష్టత ఆధారంగా సమయాన్ని వాటికి కేటాయించుకోవాలి.


పరీక్ష రాసేటప్పుడు ముందుగా జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాన్ని పూర్తిచేయాలి. తదుపరి వరుసగా కంప్యూటర్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిషు, రీజనింగ్‌లను పూర్తిచేసి, చివరగా న్యూమరికల్‌ ఎబిలిటీతో ముగించాలి. అభ్యర్థులు వివిధ విభాగాలకు తాము కేటాయించుకున్న సమయాలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ నిర్దేశించుకున్న సమయంలో ఆ విభాగంలోని అన్ని ప్రశ్నలూ పూర్తి చేయలేకపోయినప్పటికీ తప్పనిసరిగా తదుపరి విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేయగలిగినపుడే అన్ని విభాగాల్లో కనీస మార్కులు పొందగలుగుతారు.

పరీక్షలో తప్పుగా గుర్తించే సమాధానాలకు నెగిటివ్‌ మార్కులున్నాయి. కాబట్టి జవాబు తెలియకపోతే ప్రశ్నను వదిలివేయటం మంచిది. వూహాజనిత జవాబులు గుర్తించటం వల్ల ఫలితం ఉండదు.

2 comments:

  1. Very helpful info. Thanks to Chaduvu Team.

    ReplyDelete
  2. dear chaduvu plz upload the banking interview questions for IBPS PO

    thanx

    ReplyDelete