ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 9 January 2012

సివిల్స్‌తో పాటే గ్రూప్‌-1... సరైన వ్యూహమేనా?

ద్యోగ నియామక పరీక్షల్లో జాతీయస్థాయిలో అధికారహోదా పరంగా అత్యున్నతమైనవి సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష కోసం కొనసాగించే సన్నద్ధత, కృషి రాష్ట్రస్థాయి ఉత్తమ సర్వీసులైన గ్రూప్‌-1 పరీక్షకు ఎంతమేరకు ఉపయోగం?

ఏపీపీఎస్‌సీ నుంచి నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో సివిల్స్‌ అభ్యర్థులు వాటికి కూడా దరఖాస్తు చేసుకుని, సిద్ధమవటం సరైన నిర్ణయమేనా?

2011 నుంచీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో Decision making అనే కొత్త విభాగం ప్రవేశపెట్టారు. పర్యవసానాలు ఆలోచించి దూరదృష్టితో అభ్యర్థి సరైన నిర్ణయం ఎంచుకుంటాడో లేదో పరిశీలించడం ఈ ప్రశ్నల పరమార్థం.

మన సందర్భం ఇక్కడ పోటీ పరీక్షలు. ఇక్కడ ఇస్తున్న ప్రశ్న గమనించండి. మీ సమాధానం ఏమిటో ఆలోచించండి.

* మీరు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరవుతున్నారు. ఇంతలో ఏపీపీఎస్‌సీ నుంచి గ్రూప్‌-1, గ్రూప్‌-2 మొదలైన నోటిఫికేషన్ల వెల్లువ వచ్చింది. మీరేం చేస్తారు?

ఎ) సివిల్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించి ఇతర పరీక్షలు వేటికీ దరఖాస్తు చేయరు
బి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు.
సి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు. డి) అన్ని పరీక్షలూ రాస్తారు.

ఇలాంటి సమస్యలూ, తీసుకోవాల్సిన నిర్ణయాలూ అభ్యర్థిని వూగిసలాటకు గురిచేస్తుంటాయి. తేల్చుకోవటం తప్పనిసరి అయిన సందర్భాల్లో ఏది అత్యుత్తమ నిర్ణయమవుతుందో, దాన్నెలా విజయవంతంగా అమలు చేయాలో ఒక పట్టాన అర్థం కాదు. విచిత్రమేమిటంటే... నిర్ణయం తీసుకోవటానికి ఒత్తిడి పెరిగినకొద్దీ ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఇలా విలువైన సమయం వృథా అవుతుంది.



పై ప్రశ్నకు సరైన సమాధానం డి. ఉత్తమ నిర్ణయం ఇదే ఎందుకవుతుందో విశ్లేషించటానికి ప్రయత్నిద్దాం.
i) గ్రూప్‌-1, 2, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల సిలబస్‌లో ఒకేరకమైన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే ఒకే ప్రిపరేషన్‌ సివిల్స్‌కూ, గ్రూప్స్‌కూ ఉపయోగపడుతుంది.

ii) సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షలు రెండూ దాదాపు ఒకే సమయంలో జరుగుతాయి. సివిల్స్‌ ప్రిలిమినరీని గ్రూప్‌-1 ప్రిలిమినరీ అనుసరిస్తుంది. అందువల్ల అభ్యర్థి షెడ్యూల్‌ ఏమీ దెబ్బతినదు.

iii) పోటీ పరీక్షలన్నిటిలో 'అదృష్టం' అంశ ఉంటూనే ఉంటుంది. మీరు సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ ఏడాది మీకు అనుకూలించకపోవచ్చు. అందుకే గ్రూప్‌-1, 2 పరీక్షలు రాస్తే మళ్ళీ సివిల్స్‌ రాయటానికి అవసరమైన ఉత్సాహం లభిస్తుంది.

iv) ఈ పరిస్థితిని వూహించండి- ఒక అభ్యర్థి నాలుగేళ్ళపాటు సివిల్స్‌కు దీక్షగా చదివాడు. కానీ విజేత కాలేకపోయాడు. ఈ కాల వ్యవధిలో గ్రూప్‌-1 లాంటి మరే పరీక్ష నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదు. ఇలాంటపుడు ఇంత సుదీర్ఘకాలం వెచ్చించిన ఆ అభ్యర్థిని ఎంతటి నిరాశా నిస్పృహలు కమ్ముకుంటాయో తేలిగ్గానే వూహించవచ్చు.



అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవటం అనుకూలాంశం. పెద్దసంఖ్యలో ఏపీపీఎస్‌సీ పోస్టులను ప్రకటించారు. పైగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పరీక్ష తేదీలను కూడా ముందే ప్రకటించేశారు. ప్రిపరేషన్‌ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించుకునే చక్కని అవకాశం ఏర్పడింది. అందుకే ఇదంతా అరుదైన అవకాశంగా భావించి, సివిల్స్‌ ఆశావహులు గ్రూప్స్‌ పరీక్షలకు కూడా సన్నద్ధం కావటం సమంజసం.

పరీక్షలకు సిద్ధం కావాలనే నిర్ణయం తీసుకున్నాక అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని- సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షల ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసే ప్రయత్నం. ప్రిపరేషన్‌ను ప్రభావశీలంగా మల్చుకోవటానికి కింది చర్యలు అనుసరించటం మేలు.


పాటించాల్సిన వ్యూహం
* సైన్సెస్‌ ప్రాథమికాంశాలను పటిష్ఠ పరుచుకోవాలి (గ్రూప్‌-1 కోసం). వాటిలోని తాజా పరిణామాలపై దృష్టి పెట్టాలి. (సివిల్స్‌ కోసం)
* చరిత్ర, భూగోళ అంశాలను క్షుణ్ణంగా చదవాలి. రెండు పరీక్షలకూ ఇవి ఉపయోగం.
* జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల వర్తమాన ఘటనలను స్థూలంగా అవగాహన చేసుకోవాలి. రెండు పరీక్షలకూ ఇది ప్రయోజనకరం.
* రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన అంశాలూ, ఆర్థిక గణాంకాలను సేకరించి అధ్యయనానికి జోడించుకోవాలి.
* ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.

ఈ మెలకువలన్నీ పాటిస్తే మీ 'ఉమ్మడి' ప్రిపరేషన్‌ సరైన దిశలో కొనసాగుతుంది!

- ‘బ్రెయిన్ ట్రీ’ గోపాలకృష్ణ. 

No comments:

Post a Comment