ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday, 14 October 2011

సివిల్స్ మెయిన్స్‌ మెలకువలివిగో!

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు దగ్గర్లోకి వచ్చేశాయి.

దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ఆందోళన!

పరీక్షను అర్థం చేసుకుని, విజయసూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే 'సన్నద్ధత' ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఆ వివరాలను అందిస్తూ పునశ్చరణను పరిపుష్టం చేసుకునే విధానం వివరిస్తున్నారు... బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ

 
సివిల్స్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది కాబట్టి అది చాలా తేలికనే అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంది. నిజానికి కష్టమైన పరీక్ష ఇదే. ప్రిలిమినరీలో ప్రతి మార్కూ విలువైనదే. ఒక్క మార్కే అభ్యర్థి పోటీలో ఉండటాన్నీ, వైదొలగటాన్నీ నిర్ణయించే అవకాశముంది. పైగా మొదటిసారి ప్రిలిమ్స్‌లో నెగ్గనివారిలో ఆ కారణం మానసికంగా కొంత అవరోధాన్ని ఏర్పరిచే ప్రమాదం ఉంటుంది.

అందుకే ప్రిలిమ్స్‌ దశ దాటినవారు పెద్ద 'హర్డిల్‌' దాటేసినందుకు తమ భుజం తామే తట్టుకోవచ్చు! ఇక రెండో దశ అయిన మెయిన్స్‌ విషయానికి వస్తే... దీనిలో సాధించిన మార్కులు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వారు ఇంటర్వ్యూకు అర్హత పొందుతారా? ఏ సర్వీసుకు ఎంపికవుతారు? ఐఏఎస్‌కో, ఐపీఎస్‌కో ఎంపికైతే ఏ రాష్ట్రంలో పనిచేస్తారు?... ఇవన్నీ!

ప్రతి మార్కూ ఇక్కడ కూడా పరిగణనలోకి వచ్చేదే. అయితే ఎక్కువ పేపర్లుంటాయి కాబట్టి ఒక పేపర్లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్లో అత్యధిక స్కోరు తెచ్చుకుని సర్దుబాటు చేసుకోవచ్చు.

ఆప్షనల్స్‌ ప్రత్యేకత
మెయిన్‌ పరీక్షలో తొమ్మిది పేపర్లుంటాయి. వాటిలో ఐదు తప్పనిసరి (కంపల్సరీ). మిగిలిన నాలుగూ అభ్యర్థి ఎంచుకునే ఆప్షనల్స్‌. ఈ ఆప్షనల్‌ సబ్జెక్టుల ప్రత్యేకత ఏమిటి? గత మూడేళ్ళ ఫలితాల్లో టాపర్ల మార్కులను పరిశీలిస్తే... అందరూ ఆప్షనల్స్‌లో చాలా అధిక మార్కులు స్కోర్‌ చేసినవారే! ఆశ్చర్యకరంగా జనరల్‌ స్టడీస్‌లో అందరికీ తక్కువ మార్కులే వచ్చాయి.

ఇది దేన్ని సూచిస్తోంది?

జనరల్‌ స్టడీస్‌ చాలా విస్తృతం కాబట్టి దీనిలో స్కోర్‌ చేయటం చాలా కష్టం. ఈ క్లిష్టత అభ్యర్థులందరిదీ! ఈ పేపర్‌ పూర్తిగా అనూహ్యంగా ఉండొచ్చు. ఎంత విస్తారంగా చదివినా, ఎన్ని కోచింగ్‌ తరగతులకు హాజరైనా... ప్రశ్నపత్రం అదివరకెన్నడూ ఎరగనిది చూసినట్టు అనిపిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇలాంటపుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి విచారించనక్కర్లేదు. అందుకే 2000 మార్కులున్న ఆప్షనల్స్‌ మీద దృష్టి కేంద్రీకరిస్తే 1200 మార్కులు (60 శాతం) తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర పేపర్లలో అనూహ్య ప్రశ్నలు ఎక్కువ కాబట్టి ఆప్షనల్స్‌ మార్కులు 60 శాతమైనప్పటికీ, అభ్యర్థి విజయంలో వాటి పాత్రను 75 శాతం వరకూ లెక్కలోకి వేసుకోవచ్చు. ఈ రకంగా ఆప్షనల్స్‌లో వచ్చే మార్కులకు నేరుగా ర్యాంకుతోనే సంబంధం ఉంటుంది!

మన రాష్ట్రంలో సివిల్స్‌ విజేతల్లో ఎక్కువమంది ఎంచుకునే ఆప్షనల్స్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీ, తెలుగు సాహిత్యం, భూగోళశాస్త్రం ఉన్నాయి. తొలిసారే అర్హత పొందినవారిలో అధికశాతం ఎంపిక- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలే. దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందిన ఆప్షనల్‌- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌. గత ఏడాది విజేతలైన 900 + అభ్యర్థుల్లో 400+ మంది ఆప్షనల్‌ ఇదే! ఈ ఏడాది మెయిన్స్‌కు హాజరయ్యే 12,000 మంది అభ్యర్థుల్లో 6,500కి పైగా ఈ సబ్జెక్టునే ఆప్షనల్‌గా ఎంచుకోవటం విశేషం. ఈ సబ్జెక్టు సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. మొదటి పేపర్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ థియరీ, రెండోదానిలో భారతీయ పాలనావ్యవస్థ. రెండూ స్కోరింగ్‌కు అనుకూలమైనవే. ప్రతి పేపర్లోనూ 300కు 200 మార్కులు తెచ్చుకున్నవారున్నారు. వీరి వ్యూహం ఏమిటంటే...

1) స్కోరింగ్‌ అంశాలను గుర్తించటం

2) ఈ అంశాల్లోని వర్తమాన పరిణామాలను చదవటం

3) జవాబులు రాసే తీరుపై దృష్టి పెట్టటం

పేపర్‌-1:
మొదటి విభాగం (సెక్షన్‌)లో తొలి ఆరు అధ్యాయాలూ, రెండో విభాగంలో మిగిలిన ఆరు అధ్యాయాలూ ఉంటాయి. మొదటి విభాగం అధిక స్కోరింగ్‌ కాబట్టి ఈ అధ్యాయాలపై అధిక దృష్టి కేంద్రీకరించవలసివుంది.

పేపర్‌-2: తొలి ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-ఎలో, మిగిలిన ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-బిలో ఉంటాయి. దీనిలో పేపర్‌-1 మాదిరి కాకుండా రెండో విభాగంలోనే అధిక మార్కులు స్కోర్‌ చేసే అవకాశముంది.

గత కొద్ది సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా కింది ధోరణులను గుర్తించవచ్చు.

* గతంలో కనీసం నాలుగు వ్యాసరూప (ఎస్సే) ప్రశ్నలుండేవి. ఈ తీరు మారుతోంది. ఎస్సే ప్రశ్నలు చిన్న ప్రశ్నలుగా మారుతున్నాయి. దీనిబట్టి గ్రహించాల్సింది ఏమిటంటే... అభ్యర్థులు కొన్ని అంశాలను వదిలివేసే అవకాశం లేదిప్పుడు. అన్నిటినీ చదివి తీరాల్సిందే!

* కొన్ని areasలో ప్రశ్నలు పరోక్షంగా ఉంటాయి. అవి అంత స్కోరింగ్‌ కావు. కానీ కొన్ని areasలో నేరుగా వచ్చే ప్రశ్నలుంటాయి. అవి స్కోరింగే. సమస్యేమిటంటే... ఈ areasచదవటానికి విసుగ్గా ఉంటాయి. బోరింగ్‌... కానీ స్కోరింగ్‌! అందుకే అభ్యర్థులకు మరో అవకాశం లేదని గుర్తుంచుకోండి.

* ప్రశ్నల విధానం ఏటా మారుతుంటుంది. ఇటీవల 10-15 మార్కులుండే short questions ఇవ్వటంపై దృష్టి పెరిగింది. దీనికి సిద్ధంగా ఉండాలి.

* సరికొత్త పరిణామాలను తెలుసుకుంటూ ఉండాలి. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గతిశీలమైనది, రోజూ నూతన సంఘటనలు చోటుచేసుకునే సబ్జెక్టు. అతి ముఖ్యమైన అంశాలను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.

* గత సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాల జాబితా తయారుచేసుకోవాలి. వాటిపై అధిక దృష్టి పెట్టాలి. అయితే పేపర్‌ రూపొందించేవారు మనకంటే తెలివైనవారైవుంటారు కాబట్టి ఏ అంశాన్నీ వదిలెయ్యకుండా జాగ్రత్తపడాలి.

* 'ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌' నుంచి సంబంధమున్న వ్యాసాలను చదవాలి. వాటి నుంచి చాలా ప్రశ్నలు ఆశించవచ్చు.

* పరీక్షలో ఎన్ని వీలైతే ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశ్నకు నేరుగా స్పందించలేకపోయినప్పటికీ ఆ అంశం గురించి ఏదో ఒకటి రాయటం మేలు. ఆ అంశానికి సంబంధించిన ముఖ్య కోణాల గురించి రాసినప్పటికీ కనీసం 40 శాతం మార్కులైనా వచ్చే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment