ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 31 January 2012

21,343 ఉపాధ్యాయ పోస్టులకు ప్రకటన!

16 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో చాన్నాళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు. ఒకేసారి 21,343 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

సోమవారం డీఎస్సీ-2012 ప్రకటన వెలువరించింది. 

ఇదే ప్రకటనతో విద్యాశాఖలో సుమారు పదహారేళ్లుగా వేళ్లూనుకుపోయిన అప్రెంటీస్‌ వ్యవస్థను రద్దు చేసింది. అప్రెంటిస్‌ రద్దు కోసం ఉపాధ్యాయ సంఘాలు ఎన్నాళ్లుగానో పోరాడుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఉపాధ్యాయులుగా నియామకం పొందిన వారు రెండేళ్లపాటు అప్రెంటీస్‌గా స్వల్పవేతనంతో పనిచేయాలి. ఇప్పుడు అప్రెంటీస్‌ విధానానికి స్వస్తి పలికినందున ఇకపై ఉద్యోగాల్లో చేరేవారికి ప్రారంభం నుంచే పూర్తి వేతనం లభిస్తుంది.

 డీఎస్సీ-2012 ప్రకటన ప్రకారం... తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

 
 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, ఇతర పోస్టుల భర్తీకి మే 2, 3 తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ప్రకటన వివరాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి సచివాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రాథమిక విద్యా శాఖ నుంచి 38వేల ఎస్జీటీ పోస్టుల భర్తీపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. భవిష్యత్తులో సమాచారం వస్తే ఇందులో కలిపేందుకు ప్రయత్నిస్తామని, లేదంటే మరో డీఎస్సీ ద్వారా భర్తీచేసే అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ వారికి అర్హత కల్పించలేకపోతున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భర్తీచేస్తుందని పేర్కొన్నారు.

ఆదర్శ పాఠశాలల్లో 7100 పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు త్వరలోనే మరో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఇవికాకుండా వివిధరకాల 4,970 ఉద్యోగాలను పొరుగుసేవల కింద భర్తీ చేయనున్నామని తెలిపారు. వీటితో తమ శాఖ తరఫున 33,413 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు. గురుకులాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని కూడా మంత్రి పేర్కొన్నారు. డీఎస్సీ-2008 ద్వారా హామీపత్రాలు పొందిన 1002 మంది అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చినట్లు చెప్పారు.

 అధికారికంగా పూర్తి సమాచారం కింది  లింకులో చూడవచ్చు.
 http://apdsc.cgg.gov.in/APDSCJAN2012/INFORMATION_BULLITEN.pdf

మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికం
అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1862, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 1552, తూర్పుగోదావరిలో 1,474 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. తక్కువగా కృష్ణా జిల్లాలో 303, గుంటూరు జిల్లాలో 362, కడప జిల్లాలో 263 పోస్టులను విద్యాశాఖ భర్తీచేయనుంది.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నారు. స్వీకరణ ఈనెల 16 నుంచి ప్రారంభమై వచ్చేనెల (మార్చి) 17వ తేదీ వరకు జరగనుంది. రుసుము మాత్రం మార్చి 16వ తేదీలోగా చెల్లించాలి.

నియామక ప్రకటనకు సంబంధించిన అర్హతలు, సిలబస్‌, ఇతర వివరాలకు http://apdsc.cgg.gov.in, www.dseap. gov.inలో చూడొచ్చునని విద్యాశాఖ సంచాలకులు శివశంకర్‌ వెల్లడించారు.

దరఖాస్తు ధర రూ.250
డీఎస్సీ-2008 వరకు దరఖాస్తు ధర కింద రూ.200 వసూలు చేశారు. దీనిని ఇప్పుడు రూ.250కి (ప్రతి పోస్టుకు) పెంచారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నందున విద్యాశాఖకు వ్యయం తగ్గుతుంది. అయినా దరఖాస్తు ధరను పెంచేశారు.

'ఇంటర్‌ నిబంధన'కు స్వస్తి
డీఎస్సీ-2012లో స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు డిగ్రీలో సెరికల్చర్‌, ఫారెస్ట్రీ, ఫౌల్ట్రీ అర్హత ఉంటే, ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులోనే ఉండాలనే నిబంధనలు తొలగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల విడుదల చేసిన అర్హతల జీవో4ను అనుసరించి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దూరవిద్యలో డిగ్రీ, బీఎడ్‌ చదివి టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

సిలబస్‌లో మార్పులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నేపథ్యంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ-2012 సిలబస్‌లో భారీ మార్పులు చేశారు. సెకండరీగ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండితుల పోస్టుల రాతపరీక్షలో ప్రశ్నల సంఖ్యతో పాటు సమయాన్ని తగ్గించారు. కొత్తగా పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ఓ సబ్జెక్టును చేర్చారు. సబ్జెక్టు సిలబస్‌ను తరువాత ప్రకటించనున్నారు. ప్రధాన సబ్జెక్టుల సిలబస్‌ను మరింత కఠినం చేయనున్నారు. ఇప్పటికే నిర్వహించిన టెట్‌ పరీక్షలో సైకాలజీ, ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించినందున డీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆయా సబ్జెక్టులను తప్పించారు. ఎస్జీటీలు, పీఈటీలకు ఆంగ్ల భాష పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి.

80 మార్కులకే పరీక్ష
గతంలో 100 మార్కులకు మొత్తం 200 ప్రశ్నలు అడిగేవారు. పరీక్ష కాలపరిమితి 3 గంటలుగా ఉండేది. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో... ప్రశ్నలను 160కి, మార్కులను 80కి పరిమితం చేశారు. పరీక్ష సమయాన్ని రెండున్నర గంటలకు తగ్గించారు.

ఎస్జీటీలో ఇలా...
గతంలో ఎస్జీటీలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈ సారి ప్రశ్నల స్థాయిని ఎనిమిదో తరగతికి పెంచారు. ఈ ప్రశ్నల కాఠిన్యత పదోతరగతి స్థాయి వరకు ఉంటుంది. 100 ప్రశ్నలు సబ్జెక్టు కేంద్రంగా ఉంటాయి.

స్కూల్‌ అసిస్టెంట్స్‌లో..
స్కూల్‌ అసిస్టెంట్స్‌కు సంబంధించి మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, బయోలజికల్‌ సైన్సెస్‌, సోషల్‌ స్టడీస్‌ పోస్టుల రాతపరీక్ష సిలబస్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈ సారి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఈ ప్రశ్నల కాఠిన్యత ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు ఉంటుంది. ప్రధాన సబ్జెక్టుపైనే 88 ప్రశ్నలు ఉంటాయి. భాషా పండితుల్లోనూ ప్రశ్నలు ఇదే మాదిరి ఉంటాయి.

లాంగ్వేజ్‌ పండిట్స్‌లో..

లాంగ్వేజ్‌ పండిట్‌ గ్రేడ్‌-2 పోస్టుల్లోనూ ప్రధాన సబ్జెక్టు సిలబస్‌ స్థాయి పదోతరగతి వరకు నిర్దేశించారు. పీఈటీలో ఆంగ్ల భాషపై పదోతరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఉంటాయి. పీఈటీ పోస్టుల ప్రశ్నల సంఖ్యలో మార్పులేదు. మొత్తం 100 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలపరిమితి 3 గంటలుగా నిర్దేశించారు.


No comments:

Post a Comment