ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday, 12 January 2012

ఏపీపీఎస్ సీ రాతపరీక్షలు జరిగిన నెలలోపే ఫలితాలు !



హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

    ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు జరిగాక.. త్వరితగతిన ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు.

మౌఖిక పరీక్షలు అవసరంలేని ఉద్యోగాలకు (గ్రూప్‌-2 ఇతర) రాత పరీక్షలు నిర్వహించిన నెలలోపే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. మిగిలిన వాటికి (గ్రూప్‌-1 ఇతర) రాత పరీక్షలు జరిగిన వారానికే ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. రాత పరీక్ష ఫలితాలను మాత్రం ఇంటర్వ్యూ తేదీలకు 20 రోజుల ముందు ప్రకటిస్తామన్నారు.

ఉద్యోగ ప్రకటనల విడుదల పరంపరంలో భాగంగా పూనం మాలకొండయ్య బుధవారం 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇవీ..

* ఇప్పటివరకు వివిధ శాఖల్లో 9,505 ఉద్యోగాల భర్తీకి 40 ప్రకటనలు జారీచేశాం. ఇంకా కొన్నింటిని వెలువరించాల్సి ఉంది. జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగే 40 రాత పరీక్షల తేదీలను ప్రకటించాం. దాదాపు ప్రతి ఆదివారం పరీక్షలు జరగనున్నాయి. చిన్న చిన్న పరీక్షలను హైదరాబాదులోనే నిర్వహిస్తున్నాం. మిగిలిన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికచేసిన పట్టణాలు, నగరాల్లో జరుపుతాం.

* మూడు వేల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్షలకు సంబంధించిన మౌఖిక పరీక్షల నిర్వహణ వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం గ్రూపు-1 మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరం మూడువేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశాం.

* ఇంకా మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు జారీచేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల ఖాళీలపై సమాచారం అందాల్సి ఉంది. 207 ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి స్త్రీ శిశు సంక్షేమశాఖ తరఫున ప్రకటన ఇవ్వనున్నాం. ఇదే శాఖలో జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్స్‌, బిల్లు కలెక్టర్‌, ఇతర హోదాలో 372 పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది. విద్యాశాఖకు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ తరఫున 24 జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల భర్తీ గురించిన సమాచారం అందింది. జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల ఖాళీలు కూడా అందితే వీటి కోసం ఒకే రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. కళాశాల విద్యాశాఖ తరపున 21 గ్రంథ పాలకులు, 37 వ్యాయామ అధ్యాపకుల భర్తీకి ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇవికాకుండా రవాణా శాఖలో మరో 37 ఏఎంఐవీ పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం వచ్చింది. మున్సిపల్‌ శాఖలో ఏఈఈ పోస్టులు, ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టుల భర్తీకి సమాచారం రానుంది. వీటిపై స్పష్టత వచ్చాక ప్రకటనలు జారీచేస్తాం.

* మౌఖిక పరీక్షలు అవసరం లేని వాటికి రాత పరీక్షల ద్వారానే నియామకాలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫలితాలను నెలలోపు వెల్లడిస్తాం. ప్రతిభ ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను సంబంధిత శాఖలకు వెంటనే పంపుతాం. ఇక మౌఖిక పరీక్షలు అవసరమైన ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక పద్ధతిని పాటిస్తున్నాం. పరీక్షలు జరిగిన వారంలోగా మౌఖిక పరీక్షల తేదీలను ప్రకటిస్తాం. ఈ తేదీలకు 20 రోజుల ముందు రాతపరీక్షల ఫలితాలు వెల్లడిస్తాం. ఏపీపీఎస్సీలో తీసుకురావల్సిన మరికొన్ని సంస్కరణలపై అధ్యయనం చేయటానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది.

* గ్రూప్‌-1 మాదిరిగానే గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీలోనూ ప్రాథమిక, ప్రధాన పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. అయితే దీన్ని ఎప్పట్నుంచి అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పరీక్షల సిలబస్‌లో ఎలాంటి మార్పూ ఉండదు. ప్రస్తుత సిలబస్‌ను అనుసరించే ప్రశ్నలుంటాయి. అభ్యర్థులపై అదనపు భారం పడదు.

* కిందటేడాది జరిగిన జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల రాతపరీక్షలో తెలుగులో ప్రశ్నలు లేకపోవడంపై ఏర్పాటుచేసిన కమిటీ దానిపై అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. నివేదిక వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. మౌఖిక పరీక్షల నిర్వహణకు ముందుగానే దీనిపై స్పష్టత వస్తుంది.

* ఏదేని ఉద్యోగ రాతపరీక్ష జరిగే సమయానికి నెల ముందు వరకు జరిగిన సంఘటనలు, అంశాలపై ప్రశ్నలు రావచ్చు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

* ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలను తగ్గించిన నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రాయగలిగిన కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహిస్తాం. దీంతో కేంద్రాల సంఖ్య తగ్గుతుంది. పర్యవేక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

* ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు జారీచేసినందున నియామకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం తీసుకోవటం అనివార్యంగా మారింది. గతంలో కన్నా సాధ్యమైనంతమేరకు ముందుగానే నియామకాల ప్రక్రియను పూర్తిచేయగలమని ఆశిస్తున్నాం. క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు అందిస్తే ప్రకటన జారీచేసిన 3-6 నెలల్లోగానే నియామకాల ప్రక్రియను పూర్తిచేయటానికి వీలుంటుంది. గ్రూపు-1 వంటివి మినహా మిగిలిన పోస్టులను త్వరితగతిలో పూర్తిచేయడానికి అవకాశముంటుంది.

* ప్రస్తుతం శాఖాపరమైన పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు ముద్రిస్తున్న 'ఉద్యోగ సమాచారం' పుస్తకాన్ని అభ్యర్థులకు మరింత అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. గ్రామీణ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులు పంపే విధానం దగ్గర్నుంచి ఉద్యోగ ప్రకటనలపై సందేహాల నివృత్తి వరకు పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా చూస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి దీనిని తీసుకురావాలని కృషిచేస్తున్నాం.

* అభ్యర్థులు బ్యాంకులో చలానా కట్టి మరోచోటు నుంచి దరఖాస్తులు పంపే విధానంలో మార్పులు తేవాలని అనుకుంటున్నాం. ఈ-సేవా, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారానే నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పంపే విధానంపై ఆలోచిస్తున్నాం. దీనివల్ల అభ్యర్థులకు వ్యయప్రయాసలు తప్పుతాయి. పూర్తి వివరాలతో దరఖాస్తులను పంపడం సులభతరమవుతుంది.

No comments:

Post a Comment