ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 2 January 2012

ఉద్యోగార్థులూ... పారాహుషార్‌!

వెల్లువలా వెలువడిన ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ముప్పయికి పైగా ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్లూ... వేల కొలువులూ- పాతవీ, రాబోతున్నవీ. మరోపక్క వయః పరిమితినీ పెంచారు.

వెరసి అభ్యర్థుల కళ్ళల్లో కొంగొత్త ఆశలు!

అర్హతలు సరితూగుతున్న పోస్టులు చాలానే! ఏదో ఒక నోటిఫికేషన్‌కే పరిమితమవాలా? వీలైనన్నివాటికి సిద్ధమయితే మేలా? గందరగోళపడకుండా ముందడుగు వేసేదెలా?
ఇవిగో సమాధానాలు..!

గ్రూప్‌-1 స్థాయి నుంచి దిగువస్థాయి గ్రూప్‌-4 పోస్టుల వరకూ వెలువడిన వివిధ రకాల నోటిఫికేషన్లు, ప్రతి ఉద్యోగార్థినీ ఏదో ఒక రూపంలో ఊరిస్తున్నవే. ఆశలుంటే సరికాదు- ఆచరణ ముఖ్యం. దీక్షతో అక్షరయజ్ఞం చేయగలిగినపుడే ఆశించిన సర్కారీ కొలువు చేతికందుతుంది.

అభ్యర్థుల పరంగా చూస్తే 'ఎన్నిటికి పోటీ పడటం క్షేమం, ప్రయోజనకరం?' అనే సందేహం చాలా ముఖ్యమైనది. సరైన కాల ప్రణాళికతో వీలైనన్ని ఉద్యోగాలకు పోటీపడటమే ప్రాప్త కాలజ్ఞత. పైగా ఈ పోటీ పరీక్షల్లో ఉమ్మడి సిలబస్‌ ఉండటం ఒక అనుకూలాంశం.

* ప్రధానమైన పరీక్షలన్నీ మే 2012 తర్వాతే ఉన్నాయి. జనవరి- ఏప్రిల్‌ మధ్య కాలాన్నే మనం ఎన్ని పరీక్షలు రాయగలమో నిర్ణయించుకుని సమయ విభజన చేయాలి. ఈ నాలుగు నెలలనూ పటిష్ఠంగా వినియోగించుకుంటే పరీక్షల మధ్య వచ్చే సమయాన్ని అప్పటి అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు.

* కొన్ని పరీక్షలు రాద్దామని నిర్ణయించుకున్నా ఒకటి రెండు పరీక్షలే ప్రధానంగా అభ్యర్థి దృష్టిలో ఉంటాయి. వాటి నుంచే సన్నద్ధతను ఆరంభించవచ్చు. ఉదాహరణకు చూడండి...

ప్రధాన పరీక్షలు                ఇతర పరీక్షలు
గ్రూప్‌-2                           గ్రూప్‌-1, 4, ఏఎస్‌ఓ
గ్రూప్‌-1                          గ్రూప్‌-2, 4, ఏఎస్‌ఓ, ఏఈఈ
ఏఈఈ                            గ్రూప్‌-1, 2
ఏఎస్‌ఓ                           గ్రూప్‌-1, 2, 4

ఎన్ని పరీక్షలు రాస్తున్నా...
ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాయటమే మంచి నిర్ణయమని అనుకున్నాం కదా? రాయదల్చిన పరీక్షల్లోని ఉమ్మడి సిలబస్‌ని ఎంపిక చేసుకోండి. మిగతా అంశాలు అదనపు పేపర్లుగా సిద్ధమవ్వాలి. ముందుగా జరిగే పరీక్షకు సంబంధించిన నిర్దిష్ట సిలబస్‌ (ఉమ్మడిగా లేనిది) అధ్యయనానికి పరీక్షకు నెలరోజుల ముందు నుంచీ అదనపు సమయం కేటాయించుకోవాలి. అలా అని కేవలం పరీక్ష ముందే చదవమని కాదు. ముందున్న నాలుగు నెలల సమయంలో కూడా ఎంతోకొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలి.

వీఆర్‌ఓ+గ్రూప్‌-4 +ఎక్సైజ్‌ +పోలీస్‌
ముందు జరగబోతున్న వీఆర్‌ఓ పరీక్షకు మొత్తం సమయం వెచ్చించటం సమంజసం. గ్రూప్‌-4 ఆగస్టు 11న కాబట్టి ఈలోపల మిగతా పరీక్షల సమయాన్నిబట్టి వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. వీఆర్‌ఓ కోసం చదివే చాలా సమాచారం డీఎస్‌సీ పరీక్షలకు సైతం ఉపయోగపడేలా ఉంది. అందువల్ల డీఎస్‌సీ ప్రిపరేషన్‌వైపునకు కూడా కాలానుగుణంగా మారవచ్చు. గ్రూప్‌-4కి సిద్ధమయేటపుడు సెక్రటేరియల్‌ ఎబిలిటీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. గతంలో జరిగిన గ్రూప్‌-4 పరీక్షలో పాలిటీ, చరిత్ర లాంటివి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో అడిగారు కాబట్టి ఆ ప్రకారమే సన్నద్ధత సాగాలి.

డీఎస్‌సీ ప్రధాన లక్ష్యమే కానీ...
లక్షలమంది డీఎస్‌సీ ఆశావహులు టెట్‌ సన్నద్ధతలో మునిగివున్నారు. జనవరి 8న పరీక్ష ముగియగానే వీరు వెంటనే డీఎస్‌సీపై కాకుండా వీఆర్‌ఓ/వీఆర్‌ఏను కూడా ఆశిస్తే... జనవరి 29 వరకూ ఆ పోస్టులపైనే దృష్టి సారించటం తెలివైన నిర్ణయమవుతుంది. అరిథ్‌మెటిక్‌, లాజికల్‌ రీజనింగ్‌, కరంట్‌ అఫైర్స్‌, ఏపీ జాగ్రఫీలు ముఖ్యం. ఫిబ్రవరి నుంచి డీఎస్‌సీని పట్టించుకోవచ్చు.

తాజా గ్రూప్‌-1 ఫలితాల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు చాలామంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. చాలామంది డీఎస్‌సీ ఆశావహులు గ్రూప్‌-1,2, జేఎల్‌ లాంటి పరీక్షల్లో కూడా ఫలితం సాధించాలనుకుంటున్నారు. ఇలాంటివారు డీఎస్‌సీ పూర్తవగానే మిగతా పరీక్షల సంగతి చూడవచ్చు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అందుకునే అవకాశాలు తక్కువగా ఉన్నా గ్రూప్‌-2 (జులై 15), గ్రూప్‌-4 (ఆగస్టు 11), జూనియర్‌ లెక్చరర్స్‌ లాంటివి క్రమబద్ధంగా రాయవచ్చు.

'సాంకేతికం'తో సంధానం సాధ్యమా?
ఇంజినీరింగ్‌ అభ్యర్థులు చాలామందికి ఏఈఈ పోస్టులతో పాటు గ్రూప్‌-1,2లు కూడా లక్ష్యమే. గ్రూప్‌-1 సిలబస్‌ సౌలభ్యం దృష్ట్యా ఏఈఈలుగా ఎంపికైనవారు కూడా దీన్ని రాస్తుంటారు. పాలనాపరమైన పోస్టుల్లో ప్రవేశించాలనుకునేవారు కూడా ఇంజినీరింగ్‌ విభాగం నుంచి గ్రూప్‌-2వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటివారు జనవరి-మార్చి మధ్య సమయాన్ని ఇంజినీరింగ్‌ సబ్జెక్టుతోపాటు జనరల్‌స్టడీస్‌ (ప్రిలిమ్స్‌)కి కేటాయించాలి. ఏఈఈ పరీక్షలో 150 మార్కులకు జీఎస్‌ పేపర్‌ ఉంది కాబట్టి దాని ప్రిపరేషన్‌గానే గుర్తించాలి. మే నెలలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ని ఇదే ప్రిపరేషన్‌తో పూర్తిచేయవచ్చు. అయితే జనవరి- ఏప్రిల్‌ మధ్య మెయిన్స్‌లోని పేపర్‌-1, 3, 4, 5 లాంటివాటికి ముందస్తుగానే సిద్ధమవటం మంచి నిర్ణయమవుతుంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పూర్తవగానే జులై 1న జరగబోయే ఏఈఈ పరీక్షకు సర్వశక్తులూ ఒడ్డాలి. మర్నాటినుంచి అక్టోబర్లో జరగబోయే పరీక్షకు పూర్తిస్థాయిలో అంకితమవటం ద్వారా ఏఈఈ, గ్రూప్‌-1 రెండు పరీక్షల్లోనూ మంచి ఫలితాలే సాధించవచ్చు. గ్రూప్‌-2 పరీక్ష జులై 15న కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యంగా నిర్దేశించుకోకపోవటం మంచిది.

ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, డెప్యూటీ సర్వేయర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌.. ఇతర సాంకేతిక ఉద్యోగార్థులు ఇతర పరీక్షలూ, వాటి తేదీలనూ బట్టి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు ప్రణాళిక వేసుకోవాలి.

ఈ తరహా పరీక్షలన్నిటిలో అభ్యర్థుల సబ్జెక్టు మార్కుల మధ్య పెద్ద తేడా కన్పించటంలేదు. అంతిమ ఫలితాన్ని నిర్ణయించటంలో జనరల్‌స్టడీస్‌దే కీలకపాత్ర. డీఏఓ, డీఎల్‌ లాంటి పరీక్షలు దీన్ని రుజువు చేశాయి!

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌
397 పోస్టులతో భారీ ప్రకటన వెలువడింది. ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌, గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా నిర్ణయించటంతో పోటీ బాగా తగ్గింది. జూన్‌ 24న పరీక్ష కాబట్టి ముందుగా ఈ అభ్యర్థులు సబ్జెక్టుతో పాటు జీఎస్‌కి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

గ్రూప్‌-1 అంతిమ లక్ష్యంగా ఉన్నట్టయితే కనీసం మూడు మెయిన్స్‌ పేపర్లను అయినా జనవరి- మే మధ్య పూర్తిచేయటం మంచిది. మే నెల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పూర్తవగానే ఏఎస్‌ఓకి అవసరమైన సబ్జెక్టుపై దృష్టి నిలపవచ్చు. ఏఎస్‌ఓ పరీక్ష పూర్తవగానే గ్రూప్‌-1 మెయిన్స్‌ సంగతి చూడొచ్చు.

గ్రూప్‌-2 పరీక్ష జులై 15న ఉంది కాబట్టి ఏఎస్‌ఓ, గ్రూప్‌-1, 2 అనే లక్ష్యాలను నిర్ణయించుకుంటే... జనవరి- జూన్‌ మధ్య ఏఎస్‌ఓ సిలబస్‌, గ్రూప్‌-2 సిలబస్‌పై కేంద్రీకరించి మెయిన్స్‌ ప్రిపరేషన్‌ని వాయిదా వేయటం మేలు. ఏఎస్‌ఓ పరీక్ష పూర్తవగానే గ్రూప్‌-2 సంగతి పట్టించుకోవాలి. అది పూర్తవగానే అక్టోబర్లో జరిగే మెయిన్స్‌కి సర్వశక్తులూ ఒడ్డడం ద్వారా మూడు పరీక్షలనూ పటిష్ఠంగా ఎదుర్కోవచ్చు.

- కొడాలి భవానీ శంకర్

No comments:

Post a Comment