ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 9 January 2012

ఆధునిక అవకాశాలకు .... న్యాయవిద్య !


న్యాయ విద్యపై ఆసక్తి గల అభ్యర్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తోన్న సంస్థలు... నేషనల్‌ లా స్కూళ్లు. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి లా స్కూళ్లు ఉన్నాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన రీతిలో న్యాయ నిపుణులను తయారుచేయడంలో ఈ సంస్థలు పేరు ప్రఖ్యాతులు సాధించాయి.

కార్పొరేట్‌ కంపెనీల్లో మంచి ప్లేస్‌మెంట్లను కూడా అందిస్తోన్న ఈ సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) నోటిఫికేషన్‌ వెలువడింది.


న్యాయవిద్య అనగానే అందరికీ గుర్తొచ్చేది కోర్టులు, లాయర్లు. కానీ ఆచరణలో న్యాయ విద్య ఈ పరిధులను ఎప్పుడో అధిగమించింది. ప్రతి రంగంలోనూ న్యాయ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఆధునిక పారిశ్రామిక రంగాలైన మౌలిక సౌకర్యాలు, కమ్యూనికేషన్‌, ఇంధనం, క్యాపిటల్‌ మార్కెట్‌, తదితర రంగాల్లో న్యాయ నిపుణులకు చాలా డిమాండ్‌ ఉంది. న్యాయ విద్యలో కార్పొరేట్‌ లా, ట్యాక్సేషన్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, తదితర స్పెషలైజేషన్లకు బాగా డిమాండ్‌ ఏర్పడుతోంది. అన్ని రకాల కార్పొరేట్‌ పరిశ్రమల్లోనూ న్యాయ నిపుణుల ఆవశ్యకత పెరుగుతోంది.

అందువల్ల న్యాయ విద్య పూర్తిచేసిన వారికి కోర్టు సంబంధిత ఉద్యోగాలు మాత్రమే ఉంటాయనుకోవడం అపోహ. లా కంపెనీలు, కార్పొరేట్‌ కంపెనీల్లోని న్యాయ విభాగాలు, పెద్ద పెద్ద ఆడిట్‌ కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు లా గ్రాడ్యుయేట్లకు అత్యుత్తమ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఉత్తమ శిక్షణకు లా స్కూళ్లు
న్యాయవిద్యపై ఆసక్తి గల అభ్యర్థులకు దేశంలోని 14 ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు మంచి ప్రమాణాలతో కూడిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ లా కోర్సుల్లో ప్రవేశానికి సంయుక్తంగా 'కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌' (క్లాట్‌)ను నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది అన్ని లా యూనివర్సిటీల తరఫున జోధ్‌పూర్‌లోని నేషనల్‌ లా యూనివర్సిటీ క్లాట్‌ను నిర్వహిస్తుంది.

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ 2012 ద్వారా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఎల్‌ఎల్‌.బి., ఎల్‌ఎల్‌.ఎం., ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో మొత్తం 1607 సీట్లను క్లాట్‌ ద్వారా భర్తీ చేస్తారు. రెగ్యులర్‌ లా కోర్సులతోపాటు బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ, పొలిటికల్‌ సైన్స్‌ కాంబినేషన్‌లతో ఐదేళ్ల ఎల్‌.ఎల్‌.బి. ఆనర్స్‌ కోర్సులు అందుబాటులో ఉండటం విశేషం. ఒరిస్సాలోని ఎన్‌ఎల్‌యూ ఎల్‌.ఎల్‌.ఎం.- పీహెచ్‌డీ కోర్సును కూడా అందిస్తోంది.

క్లాట్‌ జాతీయ స్థాయి పరీక్ష. ప్రవేశాలు జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ ద్వారా జరుగుతాయి. క్లాట్‌లో ర్యాంకుల ఆధారంగానే పైన తెలిపిన 14 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. బెంగళూరు, కోల్‌కతా, జోధ్‌పూర్‌, ఒరిస్సాలోని సంస్థలు మినహా, మిగతావి స్టేట్‌ కోటాను అమలు చేస్తున్నాయి. క్లాట్‌ ద్వారా ప్రవేశం కల్పించే న్యాయ కళాశాలల్లోని వివిధ లా కోర్సుల్లో 30 శాతం సీట్లను అమ్మాయిలకు కేటాయిస్తారు. ఆయా సంస్థల్లో అందించే ఎల్‌.ఎల్‌.బి., ఎల్‌.ఎల్‌.ఎం. కోర్సులకు ఈ నిబంధన వర్తిస్తుంది.




పరీక్ష పద్ధతి...
క్లాట్‌ పరీక్ష వ్యవధి రెండు గంటలు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోగ్రామ్‌లకు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలుంటాయి. పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతోపాటు వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్‌ పరీక్షను ఆయా లా యూనివర్సిటీలతోపాటు ఢిల్లీ, చెన్నై, కొచ్చి, ముంబయి, చండీగడ్‌, షిల్లాంగ్‌, జమ్ము, గౌహతి, పాట్నా, జైపూర్‌, లక్నో, భువనేశ్వర్‌లలో నిర్వహిస్తారు.

* గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో ప్రశ్నలడిగే సబ్జెక్టులు, వాటికి కేటాయించిన మార్కులు...
* మొత్తం ప్రశ్నలు: 200
* మొత్తం మార్కులు: 200

పరీక్షలోని విభాగాలు
* ఇంగ్లిష్‌ (40 మార్కులు): ఇందులో కాంప్రహెన్షన్‌, గ్రామర్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ వాక్యాల్లోని తప్పులను గుర్తించి సరిచేయడం, ఖాళీలను పూరించడం, ప్యాసేజ్‌లో ముఖ్యమైన అంశాన్ని కనుక్కోవడం, ప్యాసేజ్‌లో వాడిన పదాలకు అర్థాలను కనుక్కోవడం ముఖ్యమైన అంశాలు.

* జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన విషయాలు (50 మార్కులు): సమకాలీన విషయాలపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా మార్చి 2011 నుంచి మార్చి 2012 వరకు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.

* ఎలిమెంటరీ మేథమేటిక్స్‌ (20 మార్కులు): పదో తరగతి స్థాయి గణిత అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

* లీగల్‌ ఆప్టిట్యూడ్‌ / లీగల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు):
ఇందులో ప్రశ్నలు న్యాయ విద్యకు సంబంధించిన ఆప్టిట్యూడ్‌ మీదనే ఉంటాయి. కొన్ని ప్రతిపాదనలు, వాస్తవాలు ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు. సబ్జెక్టుకు సంబంధించి ఎలాంటి అవగాహన లేని అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు తయారు చేస్తారు. ప్రశ్నలు వివరణాత్మకంగా ఉంటాయి. అందువల్ల ఈ విభాగంలో ప్రశ్నల స్థాయి, స్వరూపం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

* లాజికల్‌ రీజనింగ్‌ (40 మార్కులు): లాజికల్‌ సీక్వెన్సెస్‌, ఎనాలజీస్‌, తదితర తార్కిక అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లకు...
పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో లా ఆఫ్‌ కాంట్రాక్ట్స్‌, లా ఆఫ్‌ టార్ట్స్‌, ఫ్యామిలీ లా, క్రిమినల్‌ లా, కాన్‌స్టిట్యూషనల్‌ లా, లీగల్‌ థియరీ, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రం స్వరూపం ఇలా ఉంటుంది...

* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు: 100 (ఒక్కోదానికి ఒక మార్కు)
* స్వల్ప సమాధాన ప్రశ్నలు: 10 (ఒక్కోదానికి 10 మార్కులు)
* కనీసం 50 శాతం మార్కులు వస్తేనే పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కనీసం 40 శాతం మార్కులు అవసరం.



వివిధ రకాల అవకాశాలు...
లా కోర్సులు చేసినవారికి ఆర్థిక, కార్పొరేట్‌, సేవా రంగాల్లో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలుంటాయి. సొంతగా ప్రాక్టీస్‌ పెట్టుకోవడం ద్వారా కూడా కెరియర్‌లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు.

* కార్పొరేట్‌ కౌన్సెల్‌: కార్పొరేట్‌ కంపెనీల్లోని న్యాయవిభాగాల్లో పనిచేయడానికి అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీ ఎలాంటి చట్టపరమైన ఒడిదుడుకులు ఎదుర్కోకుండా చూడటంలో లీగల్‌ మేనేజర్లు అత్యంత కీలకంగా మారడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీల నియమ నిబంధనలను రూపొందించడం, న్యాయపరమైన వివాదాలను పరిష్కరించడం, నిర్వహణలో చట్టప్రకారం కొనసాగేలా చూడటం వీరి ప్రధాన బాధ్యతలు. జీఈ క్యాపిటల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఐబీఎం, ఇన్ఫోసిస్‌, మహీంద్రా సత్యం, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, బయోకాన్‌, ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌, కేపీఎంజీ, హెచ్‌.ఎల్‌.ఎల్‌., తదితర సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.

* వ్యాజ్యాలు: సొంతగా ప్రాక్టీసు ప్రారంభించడం ద్వారా తమ క్లయింట్ల తరఫున వ్యాజ్యాలను పరిష్కరించడం మరో ముఖ్యమైన కెరియర్‌. ఇది లాయర్‌ వృత్తి. కోర్టుల్లో వాదించడం, క్లయింట్ల వ్యాజ్యం గెలవడానికి అవసరమైన రీతిలో చట్టాలను వ్యాఖ్యానించడం ఇందులో కీలకం. ఇందులో క్రిమినల్‌ లా, సివిల్‌ లా, కంపెనీ లా, కాన్‌స్టిట్యూషనల్‌ లా, తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. సీనియర్‌ లాయర్ల దగ్గర జూనియర్‌గా కెరియర్‌ ప్రారంభించి అనుభవం, వ్యాజ్యాలు గెలవడాన్ని బట్టి కెరియర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

* లా కంపెనీల్లో పనిచేయడం: కొంతమంది లాయర్లు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి క్లయింట్లకు సేవలందించడం మరో కెరియర్‌ అవకాశం. లాయర్లు సంబంధిత కంపెనీలకు అసోసియేట్‌లుగా పనిచేయాల్సి ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి లా కంపెనీలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. లా కంపెనీల్లో పనిచేయాలంటే కేవలం ఒక స్పెషలైజేషన్‌లో నైపుణ్యం సరిపోకపోవచ్చు. అవసరాన్ని బట్టి వివిధ రకాల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మంచి పనితీరు కనబరిస్తే, పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలను క్లయింట్‌లుగా మలచుకోవచ్చు. కంపెనీల మధ్య ఒప్పందాలు, విలీనాలు, విదేశీ పెట్టుబడులు, పెద్ద ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల్లో క్లయింట్‌లకు మార్గదర్శకాలు అందించాలి.

* సోషల్‌ అడ్వొకేట్‌: ప్రస్తుతం లా స్కూళ్లు అనేక సామాజిక అంశాలకు సంబంధించిన చట్టాలను కోర్సుల్లో ముఖ్యమైన అంశాలుగా చేర్చుతున్నాయి. లింగ, కుల వివక్ష, పని స్థితిగతులు, పర్యావరణ పరిరక్షణ, తదితర అంశాలపై చేసిన చట్టాల్లో నిపుణులకు క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అంశాల్లో నిపుణులకు అనేక స్వచ్చంధ సంస్థలు, ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్‌ వార్‌ అండ్‌ క్రైమ్‌ ట్రిబ్యునల్స్‌, తదితర అంతర్జాతీయ సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి.

* లా తర్వాత మేనేజ్‌మెంట్‌: లా తర్వాత కొన్నాళ్లు పనిచేసి, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసిన అభ్యర్థులకు కార్పొరేట్‌ రంగంలో అద్భుతమైన అవకాశాలుంటాయి. లా+ఎంబీఏ కాంబినేషన్‌ ద్వారా కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలను తేలిగ్గా అందుకోవచ్చు.

* జ్యుడిషియరీ సర్వీసెస్‌ మరో మంచి అవకాశం. సరైన ప్రాక్టీస్‌ ద్వారా బెంచ్‌కి ఎదగడం ఇందులో కీలకం. సమాజంలో గౌరవం, సేవ చేస్తున్నామన్న తృప్తి ఇందులో లభిస్తాయి. వృత్తి జీవితంలో 'లా'తో దీర్ఘకాలం సంబంధాన్ని కొనసాగించవచ్చు. న్యాయ విద్య ద్వారా పరిశోధన, రాయడం, బోధించడంలో సామర్థ్యాలు పెంపొందుతాయి. కొంత శిక్షణ ద్వారా మీడియా కెరియర్‌లో కూడా ప్రవేశించవచ్చు.

- అవినాష్‌ భవ్రి, కెరీర్‌ లాంచర్

No comments:

Post a Comment