ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 31 January 2012

21,343 ఉపాధ్యాయ పోస్టులకు ప్రకటన!

16 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో చాన్నాళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు. ఒకేసారి 21,343 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

సోమవారం డీఎస్సీ-2012 ప్రకటన వెలువరించింది. 

ఇదే ప్రకటనతో విద్యాశాఖలో సుమారు పదహారేళ్లుగా వేళ్లూనుకుపోయిన అప్రెంటీస్‌ వ్యవస్థను రద్దు చేసింది. అప్రెంటిస్‌ రద్దు కోసం ఉపాధ్యాయ సంఘాలు ఎన్నాళ్లుగానో పోరాడుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఉపాధ్యాయులుగా నియామకం పొందిన వారు రెండేళ్లపాటు అప్రెంటీస్‌గా స్వల్పవేతనంతో పనిచేయాలి. ఇప్పుడు అప్రెంటీస్‌ విధానానికి స్వస్తి పలికినందున ఇకపై ఉద్యోగాల్లో చేరేవారికి ప్రారంభం నుంచే పూర్తి వేతనం లభిస్తుంది.

 డీఎస్సీ-2012 ప్రకటన ప్రకారం... తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

 
 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, ఇతర పోస్టుల భర్తీకి మే 2, 3 తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ప్రకటన వివరాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి సచివాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రాథమిక విద్యా శాఖ నుంచి 38వేల ఎస్జీటీ పోస్టుల భర్తీపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. భవిష్యత్తులో సమాచారం వస్తే ఇందులో కలిపేందుకు ప్రయత్నిస్తామని, లేదంటే మరో డీఎస్సీ ద్వారా భర్తీచేసే అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ వారికి అర్హత కల్పించలేకపోతున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భర్తీచేస్తుందని పేర్కొన్నారు.

ఆదర్శ పాఠశాలల్లో 7100 పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు త్వరలోనే మరో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఇవికాకుండా వివిధరకాల 4,970 ఉద్యోగాలను పొరుగుసేవల కింద భర్తీ చేయనున్నామని తెలిపారు. వీటితో తమ శాఖ తరఫున 33,413 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు. గురుకులాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని కూడా మంత్రి పేర్కొన్నారు. డీఎస్సీ-2008 ద్వారా హామీపత్రాలు పొందిన 1002 మంది అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చినట్లు చెప్పారు.

 అధికారికంగా పూర్తి సమాచారం కింది  లింకులో చూడవచ్చు.
 http://apdsc.cgg.gov.in/APDSCJAN2012/INFORMATION_BULLITEN.pdf

మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికం
అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1862, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 1552, తూర్పుగోదావరిలో 1,474 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. తక్కువగా కృష్ణా జిల్లాలో 303, గుంటూరు జిల్లాలో 362, కడప జిల్లాలో 263 పోస్టులను విద్యాశాఖ భర్తీచేయనుంది.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నారు. స్వీకరణ ఈనెల 16 నుంచి ప్రారంభమై వచ్చేనెల (మార్చి) 17వ తేదీ వరకు జరగనుంది. రుసుము మాత్రం మార్చి 16వ తేదీలోగా చెల్లించాలి.

నియామక ప్రకటనకు సంబంధించిన అర్హతలు, సిలబస్‌, ఇతర వివరాలకు http://apdsc.cgg.gov.in, www.dseap. gov.inలో చూడొచ్చునని విద్యాశాఖ సంచాలకులు శివశంకర్‌ వెల్లడించారు.

దరఖాస్తు ధర రూ.250
డీఎస్సీ-2008 వరకు దరఖాస్తు ధర కింద రూ.200 వసూలు చేశారు. దీనిని ఇప్పుడు రూ.250కి (ప్రతి పోస్టుకు) పెంచారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నందున విద్యాశాఖకు వ్యయం తగ్గుతుంది. అయినా దరఖాస్తు ధరను పెంచేశారు.

'ఇంటర్‌ నిబంధన'కు స్వస్తి
డీఎస్సీ-2012లో స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు డిగ్రీలో సెరికల్చర్‌, ఫారెస్ట్రీ, ఫౌల్ట్రీ అర్హత ఉంటే, ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులోనే ఉండాలనే నిబంధనలు తొలగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల విడుదల చేసిన అర్హతల జీవో4ను అనుసరించి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దూరవిద్యలో డిగ్రీ, బీఎడ్‌ చదివి టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

సిలబస్‌లో మార్పులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నేపథ్యంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ-2012 సిలబస్‌లో భారీ మార్పులు చేశారు. సెకండరీగ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండితుల పోస్టుల రాతపరీక్షలో ప్రశ్నల సంఖ్యతో పాటు సమయాన్ని తగ్గించారు. కొత్తగా పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ఓ సబ్జెక్టును చేర్చారు. సబ్జెక్టు సిలబస్‌ను తరువాత ప్రకటించనున్నారు. ప్రధాన సబ్జెక్టుల సిలబస్‌ను మరింత కఠినం చేయనున్నారు. ఇప్పటికే నిర్వహించిన టెట్‌ పరీక్షలో సైకాలజీ, ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించినందున డీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆయా సబ్జెక్టులను తప్పించారు. ఎస్జీటీలు, పీఈటీలకు ఆంగ్ల భాష పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి.

80 మార్కులకే పరీక్ష
గతంలో 100 మార్కులకు మొత్తం 200 ప్రశ్నలు అడిగేవారు. పరీక్ష కాలపరిమితి 3 గంటలుగా ఉండేది. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో... ప్రశ్నలను 160కి, మార్కులను 80కి పరిమితం చేశారు. పరీక్ష సమయాన్ని రెండున్నర గంటలకు తగ్గించారు.

ఎస్జీటీలో ఇలా...
గతంలో ఎస్జీటీలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈ సారి ప్రశ్నల స్థాయిని ఎనిమిదో తరగతికి పెంచారు. ఈ ప్రశ్నల కాఠిన్యత పదోతరగతి స్థాయి వరకు ఉంటుంది. 100 ప్రశ్నలు సబ్జెక్టు కేంద్రంగా ఉంటాయి.

స్కూల్‌ అసిస్టెంట్స్‌లో..
స్కూల్‌ అసిస్టెంట్స్‌కు సంబంధించి మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, బయోలజికల్‌ సైన్సెస్‌, సోషల్‌ స్టడీస్‌ పోస్టుల రాతపరీక్ష సిలబస్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈ సారి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఈ ప్రశ్నల కాఠిన్యత ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు ఉంటుంది. ప్రధాన సబ్జెక్టుపైనే 88 ప్రశ్నలు ఉంటాయి. భాషా పండితుల్లోనూ ప్రశ్నలు ఇదే మాదిరి ఉంటాయి.

లాంగ్వేజ్‌ పండిట్స్‌లో..

లాంగ్వేజ్‌ పండిట్‌ గ్రేడ్‌-2 పోస్టుల్లోనూ ప్రధాన సబ్జెక్టు సిలబస్‌ స్థాయి పదోతరగతి వరకు నిర్దేశించారు. పీఈటీలో ఆంగ్ల భాషపై పదోతరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఉంటాయి. పీఈటీ పోస్టుల ప్రశ్నల సంఖ్యలో మార్పులేదు. మొత్తం 100 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలపరిమితి 3 గంటలుగా నిర్దేశించారు.


Monday, 30 January 2012

వార్డర్లు, జైలర్ల ఉద్యోగాలకు... ఇదీ వ్యూహం!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జైళ్లశాఖలోని డిప్యూటీ జైలర్లు, జైల్‌ వార్డర్లు, అసిస్టెంట్‌ మ్యాట్రన్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గతంలో ఈ పోస్టులతోపాటు ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్స్‌ పోస్టులకు అన్నిటికీ ఒకే నోటిఫికేషన్‌, రాతపరీక్ష ఉండేవి. డిప్యూటీ జైలర్లు, జైల్‌ వార్డర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా ఉండటం వల్ల సెలక్షన్స్‌ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా జైళ్ల శాఖకు వేరుగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.


ఇప్పటికే ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, జైళ్ల శాఖ పోస్టులకు కూడా ఒకే సమయంలో ప్రిపేర్‌ కావడం కలిసొస్తుంది.

కొత్తగా జైలుకు వచ్చిన ఖైదీల కేస్‌షీట్‌లను పరిశీలించి, వారిని కేటగిరీల వారీగా విభజించి బ్యారక్‌లను కేటాయించడం డిప్యూటీ జైలర్ల ప్రధాన బాధ్యత. అంతేగాక ఖైదీల పర్యవేక్షణ, వసతి లాంటివాటిని కింది స్థాయి సిబ్బందితో కలిసి పరిశీలించడం లాంటివి ఉంటాయి. డిప్యూటీ జైలర్‌ స్థాయి అధికారి 5 నుంచి 6 ఏళ్లలో జైలర్‌గా పదోన్నతి పొందవచ్చు. ఆ తర్వాత అనుభవాన్ని బట్టి డీఎస్పీ జైల్స్‌, ఎస్పీ జైల్స్‌గా ఉన్నత స్థాయులకు ఎదగవచ్చు.

* జైల్‌ వార్డరుగా ప్రవేశించి, అనుభవాన్ని బట్టి హెడ్‌ వార్డర్‌, చీఫ్‌ హెడ్‌ వార్డర్‌, డిప్యూటీ జైలర్‌గా పదోన్నతులు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డిప్యూటీ జైలర్స్‌- 75 పోస్టులు, అసిస్టెంట్‌ మ్యాట్రన్స్‌ -4 పోస్టులు, జైల్‌ వార్డర్స్‌ - 692 పోస్టులను భర్తీచేయనున్నారు.

నియామక ప్రక్రియలో మార్పులు
ఈసారి జైళ్లశాఖ నియామకాల్లో కొన్ని మార్పులు జరిగాయి. గతంలో అన్ని రిక్రూట్‌మెంట్‌లలో నోటిఫికేషన్‌ వెలువడిన సంవత్సరం జులై 1వ తేదీని విద్యార్హతలకు కటాఫ్‌గా నిర్ణయించారు. దీనివల్ల ఆ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనవారికి అవకాశం ఉండేది కాదు. ఈసారి నోటిఫికేషన్‌లో విద్యార్హతల కటాఫ్‌ తేదీని 26-12-2011గా నిర్ణయించారు. దీనివల్ల సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.

* బయోమెట్రిక్‌ పద్ధతిలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
* బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌తో ఓఎంఆర్‌ షీట్‌ను పూర్తిచేయాలి. గతంలో పెన్సిల్‌ వాడేవారు.
* రాత పరీక్ష అనంతరం ఓఎంఆర్‌ షీటు నకలును అభ్యర్థులు తమతోపాటు తీసుకెళ్లవచ్చు.

రాత పరీక్షలో విజయానికి...
జైళ్లశాఖలోని పోస్టులకు అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్ష, రాతపరీక్ష, ఓరల్‌ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక చేస్తారు. శారీరక సామర్థ్య పరీక్షల్లో... మొదట 5 కి.మీ. రన్నింగ్‌ ఉంటుంది. పురుష అభ్యర్థులు దీన్ని 25 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళా అభ్యర్థులు 2.5 కి.మీ. దూరాన్ని 16 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రాతపరీక్షలు ఉంటాయి. రాత పరీక్ష డిప్యూటీ జైలర్‌, జైల్‌ వార్డర్‌ పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది.

డిప్యూటీ జైలర్లు, అసిస్టెంట్‌ మ్యాట్రన్‌ పోస్టులకు రాత పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం...

పేపర్‌ 1, పేపర్‌ 2లకు...
ఈ రెండు పేపర్లు (ఇంగ్లిష్‌, తెలుగు) కేవలం అర్హత పరీక్షలే. వీటిలో కనీస మార్కులు (జనరల్‌కు 40 మార్కులు, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీలకు 30 మార్కులు) సాధిస్తే సరిపోతుంది. ప్రశ్నపత్రాలు వ్యాసరూప తరహాలో ఉంటాయి. రెండు పేపర్లలోనూ ఒకే విధానంలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి భాషా సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ పేపర్ల ఉద్దేశం. ఇందులో షార్ట్‌ ఎస్సేలు, కాంప్రహెన్షన్‌, లెటర్‌ రైటింగ్‌, పేరాగ్రాఫ్‌ రైటింగ్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, అనువాదం (తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి), తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

లేఖా రచన, నివేదికలు రాసేటప్పుడు అభ్యర్థి రచనా నైపుణ్యంతోపాటు రచనా విధానం కూడా ముఖ్యం. అందువల్ల అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. పేరు, తేదీ, స్థలం మొదలైనవి రాసేటప్పుడు ఫుల్‌స్టాప్‌లు, కామాలు చూసుకోవాలి.

* కాంప్రహెన్షన్‌లో ఒక ప్యాసేజ్‌ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్యాసేజ్‌ని చదివి జవాబులు గుర్తించాలి. కనీసం రెండు మూడు సార్లు ప్యాసేజ్‌ చదివి సమాధానాలు గుర్తిస్తే మంచిది.

* అనువాద రచనలో... అనువాదం మక్కీకి మక్కీ కాకుండా, మూల భావం చెడకుండా అనువదించాలి. దీనికోసం ఆంగ్ల దినపత్రికలోని అంశాలను తెలుగులోకి మార్చుకోవడం, తెలుగు పత్రికలోని అంశాలను ఇంగ్లిష్‌లోకి అనువదించడం సాధన చేస్తే సులువవుతుంది.

అరిథ్ థమెటిక్‌, రీజనింగ్‌లకు...
డిప్యూటీ జైలర్స్‌, అసిస్టెంట్‌ మ్యాట్రన్‌ రాత పరీక్షలో పేపర్‌-3 అరిథ్ మెటిక్‌, రీజనింగ్‌కు సంబంధించినది. ఇందులో 200 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఎంపికలో ఈ పేపర్‌ చాలా కీలకమైనది. ఇందులో అర్థమెటిక్‌ విభాగం నుంచి సంఖ్యలు, వాటి ధర్మాలు, అంటే... సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, కరణీయ, అకరణీయ, ప్రధాన సంఖ్యలు, వాటి మొత్తాన్ని, వర్గాల మొత్తాన్ని కనుక్కోవడం, భాగహార నియమాలు సాధన చేయాలి.

* కసాగు - గసాభాను లెక్కించడం, వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం, వాటి అనువర్తనాలు, భిన్నాలలో పెద్దవి, చిన్నవి, ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడంలాంటి ప్రశ్నలు సాధన చేయాలి.

* శాతం, లాభనష్టాల విభాగంలో ఒక విలువ మారక విలువలో ఎంతశాతం?, అక్షరాస్యత శాతం, ఉత్తీర్ణత శాతం, పెరిగిన శాతం, తగ్గినశాతం, ఒక వస్తువును మరో వస్తువుతో మార్పిడి చేసిన మార్పు శాతాన్ని లెక్కించడం తెలుసుకోవాలి.

* కాలం-పని, ట్యాంకులు- కుళాయిలు విభాగంలో మనుషుల సామర్థ్యాన్ని పనిచేసే కాలంలోకి మార్చడం; కుళాయిలు, ట్యాంకులు నింపడం, ఖాళీ చేయడం, తదితర అంశాలకు సంబంధించిన సూత్రాలను నేర్చుకోవాలి.

* కాలం- దూరం, రైళ్లు విభాగంలో... వేగాన్ని, దూరాన్ని, సగటు వేగాన్ని, సాపేక్ష వేగాన్ని, రైలు పొడవు, ప్లాట్‌ఫారం పొడవులను లెక్కించడం తెలుసుకోవాలి.

* బారు, చక్రవడ్డీలలో... నిర్ణీత కాలంలో కొంత అప్పుపై వచ్చే మొత్తాన్ని లెక్కించడం; అర్థ సంవత్సరం, ప్రతి మూడు నెలలకు వచ్చే మొత్తాన్ని లెక్కించడం; బారు వడ్డీ, చక్ర వడ్డీల మధ్య సంబంధాన్ని లెక్కించడం నేర్చుకోవాలి.

* మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో... దిశలు, రక్తసంబంధాలు, లెటర్‌ - సీరీస్‌, ఎనాలజీ, వర్గీకరణ, ర్యాంకింగ్‌, సిటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌, గణిత ప్రక్రియలు; నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లో డేటా సఫిషియన్సీ, డెసిషన్‌ మేకింగ్‌, జడ్జిమెంట్‌ - కంక్లూజన్స్‌, వాదనలు అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

జనరల్‌ స్టడీస్‌కు...
పేపర్‌-4 జనరల్‌ స్టడీస్‌కు సంబంధించినది. ఇందులో కూడా 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. సమయం 3 గంటలు. జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ ఈవెంట్స్‌తోపాటు భారతదేశ చరిత్ర, ఇండియన్‌ పాలిటీ, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌, శాస్త్ర - సాంకేతిక రంగాలు, ఇండియన్‌ ఎకానమీ, మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. కరెంట్‌ అఫైర్స్‌ కోసం పరీక్ష సమయానికి 6 నుంచి 7 నెలల ముందు ఉన్న సమాచారం చూసుకుంటే సరిపోతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వర్తమాన విషయాలు కీలకమైనవి. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలు, భూకంపాలు, సునామీలు, ఉపగ్రహాలు, యుద్ధక్షిపణులు, అణు పరిశోధన, భారత రక్షణ వ్యవస్థ మొదలైన అంశాలను నేర్చుకోవాలి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలోని పేపర్‌-3, పేపర్‌-4, ఇంటర్వ్యూలో మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.





- మాల్యాద్రి.

Monday, 23 January 2012

పక్కాగా సిద్ధమైతే ప్రభుత్వ కొలువులు!



క్షలమంది పోటీ పడే గ్రూప్‌-4 పోస్టుల నియామకానికి ఏపీపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తులకైనా, పరీక్షకైనా సమయం ఉంది. అలా అని ప్రిపరేషన్‌ ప్రారంభించటంలో తాత్సారం చేయకూడదు.

'సర్కారీ కొలువు సాధించాల్సిందే' అనే దృఢ సంకల్పం ఉంటే వెంటనే ముందడుగు వేయండి.

మీ లక్ష్యసాధనకు ఉపకరించే విలువైన సూచనలు అందిస్తున్నవారు కొడాలి భవానీ శంకర్.

మొత్తం 2146 పోస్టులకు గ్రూప్‌-4 ప్రకటన వెలువడింది. దరఖాస్తుల ప్రక్రియ మే నెల చివర్లో, రాతపరీక్ష ఆగస్టు 11న! సమగ్ర ప్రిపరేషన్‌కు నాందీ ప్రస్తావన చేయాల్సిన సమయమిదే. అప్పుడే విజయానికి అవకాశాలు పెరుగుతాయి.

ప్రస్తుత గ్రూప్‌-4 పోస్టుల్లో 'హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌' పోస్టుకు మాత్రం డిగ్రీ + బీఎడ్‌ కనీస అర్హతగా ఉంది. మిగతా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ అర్హత. పదో తరగతి అర్హత కలిగిన పోస్టులేమీ లేకపోవడం గమనార్హం.

ఖజానా శాఖలో మాత్రం ఇంటర్మీడియట్‌ అర్హతే కాకుండా సర్టిఫికెట్‌ కోర్సు- ఆఫీస్‌ ఆటోమేషన్‌- పీసీ మెయింటెనెన్స్‌- వెబ్‌ డిజైనింగ్‌ కూడా అడిగారు. ఇక్కడ గమనించాల్సిన సూచన ఏమిటంటే... బీసీఏ, బీఎస్‌సీ (కంప్యూటర్స్‌), బీకాం (కంప్యూటర్స్‌), బీటెక్‌/బీఈ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) అర్హతలు కలిగినవారికి పైన చెప్పిన సాంకేతిక అర్హతలకు మినహాయింపు ఉంటుంది. మిగతా శాఖల్లోని గ్రూప్‌-4 ఉద్యోగాలకు అర్హత ఇంటర్మీడియట్‌.

తమ అర్హతలు ప్రామాణికంగా అభ్యర్థులు పోస్టులను ఎంపిక చేసుకుని కృషి చేయటం మంచిది.
1) జూనియర్‌ అసిస్టెంట్స్‌: పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌, 150 మార్కులు/ప్రశ్నలు పేపర్‌-2 సెక్రటేరియల్‌ ఎబిలిటీ, 150 మార్కులు/ప్రశ్నలు
2) హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌: పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌, 150 మార్కులు/ప్రశ్నలు పేపర్‌-2 బి.ఇడి అంశాలు, 150 మార్కులు/ ప్రశ్నలు



జూనియర్‌ అసిస్టెంట్స్‌
పేపర్‌-1: జనరల్‌స్టడీస్‌
అర్హత పరీక్ష ఇంటర్మీడియట్‌ అయినప్పటికీ గత గ్రూప్‌-4 పరీక్షలో జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, చరిత్ర లాంటి అంశాల నుంచి వచ్చిన ప్రశ్నల స్థాయి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంది. ఈ కారణం వల్లనే పదో తరగతి స్థాయి వరకూ మాత్రమే చదివిన అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. అందుకని ప్రస్తుతం పోటీ పడేందుకు పాఠశాల స్థాయి పుస్తకాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఇతర గ్రూప్‌ పరీక్షలకు తయారయ్యే స్థాయిలో జనరల్‌స్టడీస్‌ను చదవటం మంచిది. ఈ అంశాలతో పాటు కింది అంశాలు కూడా ముఖ్యమే.

* Factఆధారిత ప్రశ్నలు గతంలో ఎక్కువగా వచ్చాయి. రేపటి పరీక్షలో కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. అందుకే నామమాత్రంగా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తూ జ్ఞాపకశక్తిపై ఆధారపడే సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.
* పాఠ్యాంశ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ అవకాశం.
*  ఇటీవల మారిన పాఠ్యపుస్తకాలను దృష్టిలో పెట్టుకోవాలి.

* బిట్లవారీగా చదవకూడదు. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవటమే సరైన విధానం. గ్రామీణ అభ్యర్థులు ప్రశ్నల నిధులపై అధికంగా ఆధారపడుతున్నారు. ఇది సరైన విధానం కాదు.
* గత గ్రూప్‌-4 పరీక్షలో వర్తమాన అంశాలను కొంచెం లోతుగా అడిగారు. అందుకే ఇప్పటినుంచీ సిద్ధమైతేనే మంచి ఫలితాలుంటాయి.
* మార్కెట్లో దొరికే చాలా పుస్తకాల్లో వృథా సమాచారం ఎక్కువ. ప్రభుత్వ ప్రచురణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం మేలు. పాఠ్యపుస్తకాలూ, తెలుగు అకాడమీ పుస్తకాలపై బాగా ఆధారపడినవారికే గ్రూప్‌-2 పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యం.


 


పేపర్‌-2: సెక్రటేరియల్‌ ఎబిలిటీ
సిలబస్‌ అంశాలు- మెంటల్‌ ఎబిలిటీ, సంఖ్యా/అంక గణిత సామర్థ్యం, లాజికల్‌ రీజనింగ్‌, కాంప్రహెన్షన్‌, వాక్యాల పునరమరిక. ఈ పేపర్లలో సాధించే మార్కులే అంతిమ విజయ సాధనలో కీలకం. ముఖ్యంగా పేపర్‌-1లో సీనియారిటీ, బట్టీ, అనుభవం లాంటి అంశాలు కొంతమందికి తోడ్పడి మంచి మార్కులు సాధించేందుకు దోహదం చేయవచ్చు. కానీ పేపర్‌-2లో స్వతహాగా సత్తా లేకుంటే కొంత వెనుకబాటుతనం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ పేపర్‌పై అధిక దృష్టి పెట్టటం ద్వారా మెరుగైన మార్కులను సాధించవచ్చు.

* సాధన ముఖ్యం.
* అంకగణిత సమస్యల విషయంలో షార్ట్‌కట్స్‌ వల్ల సమయం సద్వినియోగమవటమే కాకుండా కచ్చితత్వం పెరుగుతుంది.
* లాజికల్‌ రీజనింగ్‌లో ఇండక్షన్‌, డిడక్షన్‌, అబ్‌డక్షన్‌ ప్రక్రియలను సమర్థంగా వినియోగిస్తే కచ్చితమైన సమాధానాలు గుర్తించవచ్చు.
* కాంప్రహెన్షన్‌, వాక్యాల పునరమరికలపై సమయం కొద్దిగా వెచ్చిస్తే చాలు.
* బ్యాంకు పీఓ స్థాయిలో లోతైన ప్రశ్నలు ఉండవు కాబట్టి సాధారణ స్థాయిలోనే చదివితే సరిపోతుంది.
ఇంటర్మీడియట్‌ సిలబస్‌తో వీఆర్‌ఓకి సిద్ధమవుతున్నవారు, గ్రూప్‌-4లో 1335 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని గుర్తించాలి. సిలబస్‌ తేడాలు గుర్తించి మరో 6 నెలలు కష్టపడితే ఫలితం రావొచ్చు.




ఉద్యోగార్థులూ... మీ కోసమే!

పీపీఎస్ సీ  నుంచి వరసగా ఉద్యోగ నియామక  ప్రకటనలు వెలువడ్డాయి కదా?

ఏ అర్హతలున్నవారు ఏ పోస్టులకు సిద్ధం కావొచ్చు,  దరఖాస్తులకు  గడువు ఎప్పుడు ముగుస్తుంది...  మొదలైన ముఖ్యాంశాలన్నిటినీ  ఒకే చోట చూద్దాం!


Thursday, 12 January 2012

ఏపీపీఎస్ సీ రాతపరీక్షలు జరిగిన నెలలోపే ఫలితాలు !



హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

    ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు జరిగాక.. త్వరితగతిన ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు.

మౌఖిక పరీక్షలు అవసరంలేని ఉద్యోగాలకు (గ్రూప్‌-2 ఇతర) రాత పరీక్షలు నిర్వహించిన నెలలోపే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. మిగిలిన వాటికి (గ్రూప్‌-1 ఇతర) రాత పరీక్షలు జరిగిన వారానికే ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. రాత పరీక్ష ఫలితాలను మాత్రం ఇంటర్వ్యూ తేదీలకు 20 రోజుల ముందు ప్రకటిస్తామన్నారు.

ఉద్యోగ ప్రకటనల విడుదల పరంపరంలో భాగంగా పూనం మాలకొండయ్య బుధవారం 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇవీ..

* ఇప్పటివరకు వివిధ శాఖల్లో 9,505 ఉద్యోగాల భర్తీకి 40 ప్రకటనలు జారీచేశాం. ఇంకా కొన్నింటిని వెలువరించాల్సి ఉంది. జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగే 40 రాత పరీక్షల తేదీలను ప్రకటించాం. దాదాపు ప్రతి ఆదివారం పరీక్షలు జరగనున్నాయి. చిన్న చిన్న పరీక్షలను హైదరాబాదులోనే నిర్వహిస్తున్నాం. మిగిలిన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికచేసిన పట్టణాలు, నగరాల్లో జరుపుతాం.

* మూడు వేల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్షలకు సంబంధించిన మౌఖిక పరీక్షల నిర్వహణ వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం గ్రూపు-1 మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరం మూడువేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశాం.

* ఇంకా మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు జారీచేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల ఖాళీలపై సమాచారం అందాల్సి ఉంది. 207 ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి స్త్రీ శిశు సంక్షేమశాఖ తరఫున ప్రకటన ఇవ్వనున్నాం. ఇదే శాఖలో జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్స్‌, బిల్లు కలెక్టర్‌, ఇతర హోదాలో 372 పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది. విద్యాశాఖకు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ తరఫున 24 జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల భర్తీ గురించిన సమాచారం అందింది. జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల ఖాళీలు కూడా అందితే వీటి కోసం ఒకే రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. కళాశాల విద్యాశాఖ తరపున 21 గ్రంథ పాలకులు, 37 వ్యాయామ అధ్యాపకుల భర్తీకి ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇవికాకుండా రవాణా శాఖలో మరో 37 ఏఎంఐవీ పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం వచ్చింది. మున్సిపల్‌ శాఖలో ఏఈఈ పోస్టులు, ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టుల భర్తీకి సమాచారం రానుంది. వీటిపై స్పష్టత వచ్చాక ప్రకటనలు జారీచేస్తాం.

* మౌఖిక పరీక్షలు అవసరం లేని వాటికి రాత పరీక్షల ద్వారానే నియామకాలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫలితాలను నెలలోపు వెల్లడిస్తాం. ప్రతిభ ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను సంబంధిత శాఖలకు వెంటనే పంపుతాం. ఇక మౌఖిక పరీక్షలు అవసరమైన ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక పద్ధతిని పాటిస్తున్నాం. పరీక్షలు జరిగిన వారంలోగా మౌఖిక పరీక్షల తేదీలను ప్రకటిస్తాం. ఈ తేదీలకు 20 రోజుల ముందు రాతపరీక్షల ఫలితాలు వెల్లడిస్తాం. ఏపీపీఎస్సీలో తీసుకురావల్సిన మరికొన్ని సంస్కరణలపై అధ్యయనం చేయటానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది.

* గ్రూప్‌-1 మాదిరిగానే గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీలోనూ ప్రాథమిక, ప్రధాన పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. అయితే దీన్ని ఎప్పట్నుంచి అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పరీక్షల సిలబస్‌లో ఎలాంటి మార్పూ ఉండదు. ప్రస్తుత సిలబస్‌ను అనుసరించే ప్రశ్నలుంటాయి. అభ్యర్థులపై అదనపు భారం పడదు.

* కిందటేడాది జరిగిన జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల రాతపరీక్షలో తెలుగులో ప్రశ్నలు లేకపోవడంపై ఏర్పాటుచేసిన కమిటీ దానిపై అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. నివేదిక వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. మౌఖిక పరీక్షల నిర్వహణకు ముందుగానే దీనిపై స్పష్టత వస్తుంది.

* ఏదేని ఉద్యోగ రాతపరీక్ష జరిగే సమయానికి నెల ముందు వరకు జరిగిన సంఘటనలు, అంశాలపై ప్రశ్నలు రావచ్చు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

* ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలను తగ్గించిన నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రాయగలిగిన కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహిస్తాం. దీంతో కేంద్రాల సంఖ్య తగ్గుతుంది. పర్యవేక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

* ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు జారీచేసినందున నియామకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం తీసుకోవటం అనివార్యంగా మారింది. గతంలో కన్నా సాధ్యమైనంతమేరకు ముందుగానే నియామకాల ప్రక్రియను పూర్తిచేయగలమని ఆశిస్తున్నాం. క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు అందిస్తే ప్రకటన జారీచేసిన 3-6 నెలల్లోగానే నియామకాల ప్రక్రియను పూర్తిచేయటానికి వీలుంటుంది. గ్రూపు-1 వంటివి మినహా మిగిలిన పోస్టులను త్వరితగతిలో పూర్తిచేయడానికి అవకాశముంటుంది.

* ప్రస్తుతం శాఖాపరమైన పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు ముద్రిస్తున్న 'ఉద్యోగ సమాచారం' పుస్తకాన్ని అభ్యర్థులకు మరింత అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. గ్రామీణ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులు పంపే విధానం దగ్గర్నుంచి ఉద్యోగ ప్రకటనలపై సందేహాల నివృత్తి వరకు పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా చూస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి దీనిని తీసుకురావాలని కృషిచేస్తున్నాం.

* అభ్యర్థులు బ్యాంకులో చలానా కట్టి మరోచోటు నుంచి దరఖాస్తులు పంపే విధానంలో మార్పులు తేవాలని అనుకుంటున్నాం. ఈ-సేవా, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారానే నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పంపే విధానంపై ఆలోచిస్తున్నాం. దీనివల్ల అభ్యర్థులకు వ్యయప్రయాసలు తప్పుతాయి. పూర్తి వివరాలతో దరఖాస్తులను పంపడం సులభతరమవుతుంది.

Monday, 9 January 2012

సివిల్స్‌తో పాటే గ్రూప్‌-1... సరైన వ్యూహమేనా?

ద్యోగ నియామక పరీక్షల్లో జాతీయస్థాయిలో అధికారహోదా పరంగా అత్యున్నతమైనవి సివిల్‌ సర్వీసెస్‌. ఈ పరీక్ష కోసం కొనసాగించే సన్నద్ధత, కృషి రాష్ట్రస్థాయి ఉత్తమ సర్వీసులైన గ్రూప్‌-1 పరీక్షకు ఎంతమేరకు ఉపయోగం?

ఏపీపీఎస్‌సీ నుంచి నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో సివిల్స్‌ అభ్యర్థులు వాటికి కూడా దరఖాస్తు చేసుకుని, సిద్ధమవటం సరైన నిర్ణయమేనా?

2011 నుంచీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో Decision making అనే కొత్త విభాగం ప్రవేశపెట్టారు. పర్యవసానాలు ఆలోచించి దూరదృష్టితో అభ్యర్థి సరైన నిర్ణయం ఎంచుకుంటాడో లేదో పరిశీలించడం ఈ ప్రశ్నల పరమార్థం.

మన సందర్భం ఇక్కడ పోటీ పరీక్షలు. ఇక్కడ ఇస్తున్న ప్రశ్న గమనించండి. మీ సమాధానం ఏమిటో ఆలోచించండి.

* మీరు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరవుతున్నారు. ఇంతలో ఏపీపీఎస్‌సీ నుంచి గ్రూప్‌-1, గ్రూప్‌-2 మొదలైన నోటిఫికేషన్ల వెల్లువ వచ్చింది. మీరేం చేస్తారు?

ఎ) సివిల్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించి ఇతర పరీక్షలు వేటికీ దరఖాస్తు చేయరు
బి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు.
సి) సివిల్స్‌ సన్నద్ధతను ఆపివేసి గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ మొదలుపెడతారు. డి) అన్ని పరీక్షలూ రాస్తారు.

ఇలాంటి సమస్యలూ, తీసుకోవాల్సిన నిర్ణయాలూ అభ్యర్థిని వూగిసలాటకు గురిచేస్తుంటాయి. తేల్చుకోవటం తప్పనిసరి అయిన సందర్భాల్లో ఏది అత్యుత్తమ నిర్ణయమవుతుందో, దాన్నెలా విజయవంతంగా అమలు చేయాలో ఒక పట్టాన అర్థం కాదు. విచిత్రమేమిటంటే... నిర్ణయం తీసుకోవటానికి ఒత్తిడి పెరిగినకొద్దీ ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఇలా విలువైన సమయం వృథా అవుతుంది.



పై ప్రశ్నకు సరైన సమాధానం డి. ఉత్తమ నిర్ణయం ఇదే ఎందుకవుతుందో విశ్లేషించటానికి ప్రయత్నిద్దాం.
i) గ్రూప్‌-1, 2, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల సిలబస్‌లో ఒకేరకమైన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే ఒకే ప్రిపరేషన్‌ సివిల్స్‌కూ, గ్రూప్స్‌కూ ఉపయోగపడుతుంది.

ii) సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షలు రెండూ దాదాపు ఒకే సమయంలో జరుగుతాయి. సివిల్స్‌ ప్రిలిమినరీని గ్రూప్‌-1 ప్రిలిమినరీ అనుసరిస్తుంది. అందువల్ల అభ్యర్థి షెడ్యూల్‌ ఏమీ దెబ్బతినదు.

iii) పోటీ పరీక్షలన్నిటిలో 'అదృష్టం' అంశ ఉంటూనే ఉంటుంది. మీరు సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ ఏడాది మీకు అనుకూలించకపోవచ్చు. అందుకే గ్రూప్‌-1, 2 పరీక్షలు రాస్తే మళ్ళీ సివిల్స్‌ రాయటానికి అవసరమైన ఉత్సాహం లభిస్తుంది.

iv) ఈ పరిస్థితిని వూహించండి- ఒక అభ్యర్థి నాలుగేళ్ళపాటు సివిల్స్‌కు దీక్షగా చదివాడు. కానీ విజేత కాలేకపోయాడు. ఈ కాల వ్యవధిలో గ్రూప్‌-1 లాంటి మరే పరీక్ష నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదు. ఇలాంటపుడు ఇంత సుదీర్ఘకాలం వెచ్చించిన ఆ అభ్యర్థిని ఎంతటి నిరాశా నిస్పృహలు కమ్ముకుంటాయో తేలిగ్గానే వూహించవచ్చు.



అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవటం అనుకూలాంశం. పెద్దసంఖ్యలో ఏపీపీఎస్‌సీ పోస్టులను ప్రకటించారు. పైగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పరీక్ష తేదీలను కూడా ముందే ప్రకటించేశారు. ప్రిపరేషన్‌ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించుకునే చక్కని అవకాశం ఏర్పడింది. అందుకే ఇదంతా అరుదైన అవకాశంగా భావించి, సివిల్స్‌ ఆశావహులు గ్రూప్స్‌ పరీక్షలకు కూడా సన్నద్ధం కావటం సమంజసం.

పరీక్షలకు సిద్ధం కావాలనే నిర్ణయం తీసుకున్నాక అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని- సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షల ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసే ప్రయత్నం. ప్రిపరేషన్‌ను ప్రభావశీలంగా మల్చుకోవటానికి కింది చర్యలు అనుసరించటం మేలు.


పాటించాల్సిన వ్యూహం
* సైన్సెస్‌ ప్రాథమికాంశాలను పటిష్ఠ పరుచుకోవాలి (గ్రూప్‌-1 కోసం). వాటిలోని తాజా పరిణామాలపై దృష్టి పెట్టాలి. (సివిల్స్‌ కోసం)
* చరిత్ర, భూగోళ అంశాలను క్షుణ్ణంగా చదవాలి. రెండు పరీక్షలకూ ఇవి ఉపయోగం.
* జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల వర్తమాన ఘటనలను స్థూలంగా అవగాహన చేసుకోవాలి. రెండు పరీక్షలకూ ఇది ప్రయోజనకరం.
* రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన అంశాలూ, ఆర్థిక గణాంకాలను సేకరించి అధ్యయనానికి జోడించుకోవాలి.
* ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.

ఈ మెలకువలన్నీ పాటిస్తే మీ 'ఉమ్మడి' ప్రిపరేషన్‌ సరైన దిశలో కొనసాగుతుంది!

- ‘బ్రెయిన్ ట్రీ’ గోపాలకృష్ణ. 

ఆధునిక అవకాశాలకు .... న్యాయవిద్య !


న్యాయ విద్యపై ఆసక్తి గల అభ్యర్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తోన్న సంస్థలు... నేషనల్‌ లా స్కూళ్లు. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి లా స్కూళ్లు ఉన్నాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన రీతిలో న్యాయ నిపుణులను తయారుచేయడంలో ఈ సంస్థలు పేరు ప్రఖ్యాతులు సాధించాయి.

కార్పొరేట్‌ కంపెనీల్లో మంచి ప్లేస్‌మెంట్లను కూడా అందిస్తోన్న ఈ సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) నోటిఫికేషన్‌ వెలువడింది.


న్యాయవిద్య అనగానే అందరికీ గుర్తొచ్చేది కోర్టులు, లాయర్లు. కానీ ఆచరణలో న్యాయ విద్య ఈ పరిధులను ఎప్పుడో అధిగమించింది. ప్రతి రంగంలోనూ న్యాయ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఆధునిక పారిశ్రామిక రంగాలైన మౌలిక సౌకర్యాలు, కమ్యూనికేషన్‌, ఇంధనం, క్యాపిటల్‌ మార్కెట్‌, తదితర రంగాల్లో న్యాయ నిపుణులకు చాలా డిమాండ్‌ ఉంది. న్యాయ విద్యలో కార్పొరేట్‌ లా, ట్యాక్సేషన్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, తదితర స్పెషలైజేషన్లకు బాగా డిమాండ్‌ ఏర్పడుతోంది. అన్ని రకాల కార్పొరేట్‌ పరిశ్రమల్లోనూ న్యాయ నిపుణుల ఆవశ్యకత పెరుగుతోంది.

అందువల్ల న్యాయ విద్య పూర్తిచేసిన వారికి కోర్టు సంబంధిత ఉద్యోగాలు మాత్రమే ఉంటాయనుకోవడం అపోహ. లా కంపెనీలు, కార్పొరేట్‌ కంపెనీల్లోని న్యాయ విభాగాలు, పెద్ద పెద్ద ఆడిట్‌ కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు లా గ్రాడ్యుయేట్లకు అత్యుత్తమ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఉత్తమ శిక్షణకు లా స్కూళ్లు
న్యాయవిద్యపై ఆసక్తి గల అభ్యర్థులకు దేశంలోని 14 ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు మంచి ప్రమాణాలతో కూడిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ లా కోర్సుల్లో ప్రవేశానికి సంయుక్తంగా 'కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌' (క్లాట్‌)ను నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది అన్ని లా యూనివర్సిటీల తరఫున జోధ్‌పూర్‌లోని నేషనల్‌ లా యూనివర్సిటీ క్లాట్‌ను నిర్వహిస్తుంది.

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ 2012 ద్వారా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఎల్‌ఎల్‌.బి., ఎల్‌ఎల్‌.ఎం., ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో మొత్తం 1607 సీట్లను క్లాట్‌ ద్వారా భర్తీ చేస్తారు. రెగ్యులర్‌ లా కోర్సులతోపాటు బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ, పొలిటికల్‌ సైన్స్‌ కాంబినేషన్‌లతో ఐదేళ్ల ఎల్‌.ఎల్‌.బి. ఆనర్స్‌ కోర్సులు అందుబాటులో ఉండటం విశేషం. ఒరిస్సాలోని ఎన్‌ఎల్‌యూ ఎల్‌.ఎల్‌.ఎం.- పీహెచ్‌డీ కోర్సును కూడా అందిస్తోంది.

క్లాట్‌ జాతీయ స్థాయి పరీక్ష. ప్రవేశాలు జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ ద్వారా జరుగుతాయి. క్లాట్‌లో ర్యాంకుల ఆధారంగానే పైన తెలిపిన 14 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. బెంగళూరు, కోల్‌కతా, జోధ్‌పూర్‌, ఒరిస్సాలోని సంస్థలు మినహా, మిగతావి స్టేట్‌ కోటాను అమలు చేస్తున్నాయి. క్లాట్‌ ద్వారా ప్రవేశం కల్పించే న్యాయ కళాశాలల్లోని వివిధ లా కోర్సుల్లో 30 శాతం సీట్లను అమ్మాయిలకు కేటాయిస్తారు. ఆయా సంస్థల్లో అందించే ఎల్‌.ఎల్‌.బి., ఎల్‌.ఎల్‌.ఎం. కోర్సులకు ఈ నిబంధన వర్తిస్తుంది.




పరీక్ష పద్ధతి...
క్లాట్‌ పరీక్ష వ్యవధి రెండు గంటలు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోగ్రామ్‌లకు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలుంటాయి. పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతోపాటు వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్‌ పరీక్షను ఆయా లా యూనివర్సిటీలతోపాటు ఢిల్లీ, చెన్నై, కొచ్చి, ముంబయి, చండీగడ్‌, షిల్లాంగ్‌, జమ్ము, గౌహతి, పాట్నా, జైపూర్‌, లక్నో, భువనేశ్వర్‌లలో నిర్వహిస్తారు.

* గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో ప్రశ్నలడిగే సబ్జెక్టులు, వాటికి కేటాయించిన మార్కులు...
* మొత్తం ప్రశ్నలు: 200
* మొత్తం మార్కులు: 200

పరీక్షలోని విభాగాలు
* ఇంగ్లిష్‌ (40 మార్కులు): ఇందులో కాంప్రహెన్షన్‌, గ్రామర్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ వాక్యాల్లోని తప్పులను గుర్తించి సరిచేయడం, ఖాళీలను పూరించడం, ప్యాసేజ్‌లో ముఖ్యమైన అంశాన్ని కనుక్కోవడం, ప్యాసేజ్‌లో వాడిన పదాలకు అర్థాలను కనుక్కోవడం ముఖ్యమైన అంశాలు.

* జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన విషయాలు (50 మార్కులు): సమకాలీన విషయాలపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా మార్చి 2011 నుంచి మార్చి 2012 వరకు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.

* ఎలిమెంటరీ మేథమేటిక్స్‌ (20 మార్కులు): పదో తరగతి స్థాయి గణిత అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

* లీగల్‌ ఆప్టిట్యూడ్‌ / లీగల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు):
ఇందులో ప్రశ్నలు న్యాయ విద్యకు సంబంధించిన ఆప్టిట్యూడ్‌ మీదనే ఉంటాయి. కొన్ని ప్రతిపాదనలు, వాస్తవాలు ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు. సబ్జెక్టుకు సంబంధించి ఎలాంటి అవగాహన లేని అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు తయారు చేస్తారు. ప్రశ్నలు వివరణాత్మకంగా ఉంటాయి. అందువల్ల ఈ విభాగంలో ప్రశ్నల స్థాయి, స్వరూపం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

* లాజికల్‌ రీజనింగ్‌ (40 మార్కులు): లాజికల్‌ సీక్వెన్సెస్‌, ఎనాలజీస్‌, తదితర తార్కిక అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లకు...
పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో లా ఆఫ్‌ కాంట్రాక్ట్స్‌, లా ఆఫ్‌ టార్ట్స్‌, ఫ్యామిలీ లా, క్రిమినల్‌ లా, కాన్‌స్టిట్యూషనల్‌ లా, లీగల్‌ థియరీ, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రం స్వరూపం ఇలా ఉంటుంది...

* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు: 100 (ఒక్కోదానికి ఒక మార్కు)
* స్వల్ప సమాధాన ప్రశ్నలు: 10 (ఒక్కోదానికి 10 మార్కులు)
* కనీసం 50 శాతం మార్కులు వస్తేనే పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కనీసం 40 శాతం మార్కులు అవసరం.



వివిధ రకాల అవకాశాలు...
లా కోర్సులు చేసినవారికి ఆర్థిక, కార్పొరేట్‌, సేవా రంగాల్లో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలుంటాయి. సొంతగా ప్రాక్టీస్‌ పెట్టుకోవడం ద్వారా కూడా కెరియర్‌లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు.

* కార్పొరేట్‌ కౌన్సెల్‌: కార్పొరేట్‌ కంపెనీల్లోని న్యాయవిభాగాల్లో పనిచేయడానికి అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీ ఎలాంటి చట్టపరమైన ఒడిదుడుకులు ఎదుర్కోకుండా చూడటంలో లీగల్‌ మేనేజర్లు అత్యంత కీలకంగా మారడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీల నియమ నిబంధనలను రూపొందించడం, న్యాయపరమైన వివాదాలను పరిష్కరించడం, నిర్వహణలో చట్టప్రకారం కొనసాగేలా చూడటం వీరి ప్రధాన బాధ్యతలు. జీఈ క్యాపిటల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఐబీఎం, ఇన్ఫోసిస్‌, మహీంద్రా సత్యం, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, బయోకాన్‌, ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌, కేపీఎంజీ, హెచ్‌.ఎల్‌.ఎల్‌., తదితర సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.

* వ్యాజ్యాలు: సొంతగా ప్రాక్టీసు ప్రారంభించడం ద్వారా తమ క్లయింట్ల తరఫున వ్యాజ్యాలను పరిష్కరించడం మరో ముఖ్యమైన కెరియర్‌. ఇది లాయర్‌ వృత్తి. కోర్టుల్లో వాదించడం, క్లయింట్ల వ్యాజ్యం గెలవడానికి అవసరమైన రీతిలో చట్టాలను వ్యాఖ్యానించడం ఇందులో కీలకం. ఇందులో క్రిమినల్‌ లా, సివిల్‌ లా, కంపెనీ లా, కాన్‌స్టిట్యూషనల్‌ లా, తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. సీనియర్‌ లాయర్ల దగ్గర జూనియర్‌గా కెరియర్‌ ప్రారంభించి అనుభవం, వ్యాజ్యాలు గెలవడాన్ని బట్టి కెరియర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

* లా కంపెనీల్లో పనిచేయడం: కొంతమంది లాయర్లు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి క్లయింట్లకు సేవలందించడం మరో కెరియర్‌ అవకాశం. లాయర్లు సంబంధిత కంపెనీలకు అసోసియేట్‌లుగా పనిచేయాల్సి ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి లా కంపెనీలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. లా కంపెనీల్లో పనిచేయాలంటే కేవలం ఒక స్పెషలైజేషన్‌లో నైపుణ్యం సరిపోకపోవచ్చు. అవసరాన్ని బట్టి వివిధ రకాల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మంచి పనితీరు కనబరిస్తే, పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలను క్లయింట్‌లుగా మలచుకోవచ్చు. కంపెనీల మధ్య ఒప్పందాలు, విలీనాలు, విదేశీ పెట్టుబడులు, పెద్ద ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల్లో క్లయింట్‌లకు మార్గదర్శకాలు అందించాలి.

* సోషల్‌ అడ్వొకేట్‌: ప్రస్తుతం లా స్కూళ్లు అనేక సామాజిక అంశాలకు సంబంధించిన చట్టాలను కోర్సుల్లో ముఖ్యమైన అంశాలుగా చేర్చుతున్నాయి. లింగ, కుల వివక్ష, పని స్థితిగతులు, పర్యావరణ పరిరక్షణ, తదితర అంశాలపై చేసిన చట్టాల్లో నిపుణులకు క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అంశాల్లో నిపుణులకు అనేక స్వచ్చంధ సంస్థలు, ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్‌ వార్‌ అండ్‌ క్రైమ్‌ ట్రిబ్యునల్స్‌, తదితర అంతర్జాతీయ సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి.

* లా తర్వాత మేనేజ్‌మెంట్‌: లా తర్వాత కొన్నాళ్లు పనిచేసి, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసిన అభ్యర్థులకు కార్పొరేట్‌ రంగంలో అద్భుతమైన అవకాశాలుంటాయి. లా+ఎంబీఏ కాంబినేషన్‌ ద్వారా కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలను తేలిగ్గా అందుకోవచ్చు.

* జ్యుడిషియరీ సర్వీసెస్‌ మరో మంచి అవకాశం. సరైన ప్రాక్టీస్‌ ద్వారా బెంచ్‌కి ఎదగడం ఇందులో కీలకం. సమాజంలో గౌరవం, సేవ చేస్తున్నామన్న తృప్తి ఇందులో లభిస్తాయి. వృత్తి జీవితంలో 'లా'తో దీర్ఘకాలం సంబంధాన్ని కొనసాగించవచ్చు. న్యాయ విద్య ద్వారా పరిశోధన, రాయడం, బోధించడంలో సామర్థ్యాలు పెంపొందుతాయి. కొంత శిక్షణ ద్వారా మీడియా కెరియర్‌లో కూడా ప్రవేశించవచ్చు.

- అవినాష్‌ భవ్రి, కెరీర్‌ లాంచర్

Saturday, 7 January 2012

బిట్స్‌ సీటుకు ఎంత స్కోరు అవసరం?

నదేశంలో ఇంజినీరింగ్‌ కోర్సులకు ఐఐటీలతో సరితూగగల ప్రతిష్ఠాత్మక సంస్థ... బిర్లా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌), పిలానీ.

దీనికి గోవా, హైదరాబాద్‌లలో క్యాంపస్‌లున్నాయి. ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తోన్న ఈ సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష బిట్‌శాట్‌.

బిట్‌శాట్‌కు ఏటా దాదాపు లక్ష మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. వీరిలో బిట్స్‌ అందిస్తోన్న వివిధ కోర్సులకు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య 2 శాతానికిలోపే ఉంటుంది. ఇంజినీరింగ్‌లో ఆనర్స్‌ కోర్సులను అందించడం బిట్స్‌ సంస్థల ప్రత్యేకత. బీఈ + ఎం.ఎస్‌సి. ఆనర్స్‌ కోర్సులు కూడా చేయవచ్చు. బిట్‌శాట్‌ 2012 ఆన్‌లైన్‌ పరీక్ష 10 మే 2012 నుంచి 9 జూన్‌ 2012 వరకు జరగనుంది. గత ఏడాది బిట్‌శాట్‌ కటాఫ్‌లను పరిశీలించడం ద్వారా బిట్స్‌ క్యాంపస్‌లలో సీటు సాధించడానికి ఎంత స్కోరు అవసరమో అవగాహన చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర స్థాయి బోర్డులు నిర్వహించే +2, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారికి నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఈ అభ్యర్థులు బిట్‌శాట్‌ రాయాల్సిన అవసరం లేదు. వీళ్లు తాము కోరుకున్న కోర్సులో చేరవచ్చు.


పరీక్ష ఎలా ఉంటుంది?
బిట్‌శాట్‌ కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష. వ్యవధి మూడు గంటలు. పరీక్షలో మొత్తం 4 భాగాలుంటాయి.
* పార్ట్‌ 1: ఫిజిక్స్‌ - 40 ప్రశ్నలు
* పార్ట్‌ 2: కెమిస్ట్రీ - 40 ప్రశ్నలు
* పార్ట్‌ 3: ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ - 25 ప్రశ్నలు
* పార్ట్‌ 4: మేథమేటిక్స్‌ - 45 ప్రశ్నలు

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. సరైన సమాధానానికి 3 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు తీసేస్తారు. అభ్యర్థి నిర్దిష్ట సమయానికి ముందే అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, ఇంకా సమయం మిగిలిపోతే అదనంగా మరో 12 ప్రశ్నలు రాయడానికి అవకాశం ఇస్తారు. ఇది పూర్తిగా అభ్యర్థి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అదనపు ప్రశ్నలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌ నుంచి నాలుగేసి చొప్పున ఉంటాయి.

* అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే... అదనపు ప్రశ్నలు ఎంచుకున్న తర్వాత మొదట్లో గుర్తించిన 150 ప్రశ్నల్లో సమాధానాలు మార్చుకోవడానికి అవకాశం ఉండదు.

* సాధారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు మొదటి 150 ప్రశ్నలు సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోతుంది. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అదనపు ప్రశ్నల దశ వరకు వెళ్తారు. అదీగాక నెగటివ్‌ మార్కులు ఉంటాయి కాబట్టి ఊహించి సమాధానాలు గుర్తించి, తెచ్చుకున్న మార్కులు పోగొట్టుకోవడం సరైన పద్ధతి కాదు.

బిట్‌శాట్‌ ప్రశ్నపత్రాన్ని ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల సిలబస్‌ ఆధారంగా రూపొందిస్తారు. బిట్‌శాట్‌ వెబ్‌సైట్‌లో సిలబస్‌ పూర్తి వివరాలు లభిస్తాయి. ఆన్‌లైన్‌ పరీక్ష రాయగానే స్కోరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సరైన సమాధానాలు, తప్పు సమాధానాల సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. ఒక ఏడాదిలో ఒక్కసారి మాత్రమే బిట్‌శాట్‌ రాయడం వీలవుతుంది.

* మనరాష్ట్రంలో బిట్‌శాట్‌ హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలో జరుగుతుంది. బిట్స్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో కూడా పరీక్ష కేంద్రం ఉంది.

కోర్సుల వివరాలు...
బిట్స్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కోర్సులను ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అంటారు. బిట్‌శాట్‌ స్కోరు ఆధారంగా బీఈ (ఆనర్స్‌), ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌), ఎం.ఎస్‌సి. (టెక్‌), బి. ఫార్మ్‌ (ఆనర్స్‌) కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. బిట్స్‌ సంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సులు...

* బీఈ (ఆనర్స్‌): కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌.
* బి.ఫార్మ్‌ (ఆనర్స్‌)
* ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌): బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనమిక్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌.
* ఎం.ఎస్‌సి. (టెక్‌): ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, జనరల్‌ స్టడీస్‌.

అర్హతలు, దరఖాస్తు విధానం
2011 లేదా 2012లో మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 / ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే బిట్‌శాట్‌ 2012కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పై సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం, సగటున కనీసం 75 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు అవసరం.

బిట్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు బిట్‌శాట్‌ వెబ్‌సైట్‌ ద్వారా నమూనా టెస్ట్‌లను సాధన చేయవచ్చు.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2012
* బిట్‌శాట్‌ 2012: 10 మే నుంచి 9 జూన్‌ 2012 వరకు.

Tuesday, 3 January 2012

పోటీ పరీక్షల్లో గెలుపు మలుపు... జనరల్‌ స్టడీస్‌

పీపీఎస్ సీ పరీక్ష ఏదైనా తప్పనిసరిగా ఉండే పేపర్ జనరల్ స్టడీస్. దీని ప్రాధాన్యం, దీనికెలా సిద్ధం కావాలో తెలుసుకుందామా?

ఇటీవల జరిగిన డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌, డీఏఓ, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌, ఏఈఈల తుది ఎంపికలో జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌) పేపరే నిర్ణాయకంగా మారింది! గెలుపును అంతిమంగా నిర్దేశించే పేపర్‌ ఇది.

ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఈ పేపర్‌ పెద్ద సమస్యగా, ప్రతిబంధకంగా మారింది. వారు ఇప్పటివరకు జీఎస్‌ ఉన్న పరీక్షలు రాయకపోవడమే దీనికి కారణం. అంతేకాక పదో తరగతి తరవాత జీఎస్‌కు సంబంధించిన ప్రధాన సబ్జెక్టులు (చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ..) తిరిగి ఎక్కడా చదవకపోవటంతో ఈ పేపర్‌ కొత్తగా, కష్టంగా అనిపిస్తుంది.

సాంకేతిక సబ్జెక్టుల్లో కానీ వృత్తిపరమైన సబ్జెక్టుల్లో కానీ, తమ అకడమిక్‌ విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల్లో చాలామంది అభ్యర్థులు మంచి స్కోరు సాధించగలిగారు. కానీ, జీఎస్‌లో సరైన స్కోరు సాధించక విజయానికి దూరమయ్యారు! అందుకే ఈ పేపర్‌పై నిర్లక్ష్యం పనికిరాదు.

జనరల్‌ స్టడీస్‌లోని 150 ప్రశ్నలు బహుళ ఐచ్ఛిక విధానంలో ఉంటాయి. ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల జీఎస్‌ ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే సబ్జెక్టుల పరిధి.. ప్రశ్నల స్థాయి కొంతవరకు తెలుస్తుంది. దాన్ననుసరించి ఆయా సబ్జెక్టులను కొన్నింటిని ఇంటర్‌స్థాయి వరకు, కొన్నింటిని డిగ్రీస్థాయి వరకు చదవాలి. నిత్యజీవితంలో వాటి అనువర్తనాలపై, ప్రాధాన్యతలపై దృష్టి సారించాలి.

భారతదేశ చరిత్ర
భారతదేశ చరిత్రను డిగ్రీ స్థాయిలో చదవాలి. ఇంగ్లిషు మీడియం అభ్యర్థులు ఆంగ్లంలో ప్రామాణిక గ్రంథాలనూ, తెలుగు మీడియం వారు తెలుగు అకాడమీ డిగ్రీ స్థాయి పుస్తకాలనూ చదవాలి. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రించిన 'భారత స్వాతంత్య్ర పోరాటం' వంటివీ అధ్యయనం చేయాలి. ముందు చెప్పినట్లు మొదట ప్రశ్నల స్థాయి తెలుసుకుంటే ఏ స్థాయిలో చదవాలో అర్థమవుతుంది. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రల్లో ఒక్కొక్క టాపిక్‌ నుంచి రాగల ప్రశ్నలను కూడా ఊహించి చదవవలసి ఉంటుంది. ఆంధ్రుల చరిత్ర కూడా ముఖ్యమే. ముందుగా స్కూలు పుస్తకాలు చదివి, ఆపై డిగ్రీ పుస్తకాలు చదివితే పట్టు సాధించవచ్చు.

భూగోళశాస్త్రం

ఇటీవల ఈ పేపర్‌ నుంచి వచ్చిన ప్రశ్నల సరళిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రశ్నలు ఎక్కువగా పటాల అధ్యయనం (మ్యాప్‌ స్టడీ) ఆధారంగా ఉంటున్నాయి. ప్రపంచ పటంలోని వివిధ ఖండాలు, దేశాలు, సముద్రాలు, పర్వతాలు, సరస్సులు మొదలైనవాటి ఉనికిని పరిశీలించి వాటి ఎల్లలపై పట్టు సాధించాలి. భారతదేశ పటంలో కూడా ప్రధాన భూస్వరూపాల విస్తరణ, రాష్ట్రాల సరిహద్దులు, నదీ ప్రవాహాలను- అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను గమనిస్తూ చదవాలి. ఆ తరవాత ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసేప్పుడు ఖండాల, దేశాల ప్రధాన భూస్వరూపాలను, నదులను, వ్యవసాయ పంటలను, ఖనిజ వనరులను, పరిశ్రమలను, ప్రజల జీవన విధానాలను తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే భారతదేశ- ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలను వాటి భౌతిక, ఆర్థిక, సామాజిక కోణాల్లో అధ్యయనం చేయాలి.

కొన్ని ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో కూడా ఉంటాయి. అయితే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు 8- 12వ తరగతివి చాలా ఉపయోగకరం. తెలుగు మీడియం వారు కూడా వీటిని చదివి, ముఖ్యాంశాలను నోట్‌ చేసుకోవడం మేలు. 2001, 2011 జనగణనలపై, దేశంలోని గిరిజన తెగలపై కూడా ప్రశ్నలుంటాయి

జనరల్‌ సైన్స్‌

భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలలోని మౌలిక భావనలపై, మానవ శరీర ధర్మశాస్త్రం, ఆర్థిక వృక్షశాస్త్రం, వ్యవసాయ, పశు సంవర్ధక శాస్త్రం, సమాచార సాంకేతిక విజ్ఞానం, అణుభౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధనల అనువర్తనాలపై ప్రశ్నలుంటాయి. రసాయన శాస్త్రంలోని రసాయన నామాలు, వాటి వినియోగాలు, బహుళ ప్రాచుర్యం పొందిన ఔషధాలూ ముఖ్యమే. పాఠ్యాంశాల మౌలిక భావనలపై అవగాహన పెంచుకుని, ఆపై వాటి అనువర్తనాలు తెలుసుకోవలసి ఉంటుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలపై, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ శాస్త్రజ్ఞులపై ప్రశ్నలుంటాయి. ఈ ఏడాది పోటీ పరీక్షల్లో హర గోవింద ఖొరానా, శ్రీనివాస రామానుజంలపై తప్పకుండా ప్రశ్నలుంటాయని గుర్తించి ఆ కోణంలో సిద్ధం కావాలి. జనరల్‌సైన్స్‌ సన్నద్ధతకు చాలావరకు హైస్కూలు పాఠ్యపుస్తకాలూ, కొన్ని అంశాలకు ఇంటర్‌ పుస్తకాలూ ఉపయోగపడతాయి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో అమల్లో ఉన్న పథకాలు, వాటి లక్ష్యాలు, ఆర్థిక వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం మొదలైనవి ముఖ్యం. ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా ప్రశ్నలుంటాయి. మరికొన్ని పంచవర్ష ప్రణాళికల నుంచి వస్తాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే సగం ప్రశ్నలు సమకాలీన, ఆర్థిక పరిస్థితులపై ఉంటాయని గమనించాలి. తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను చదవవచ్చు. అదనంగా ఏడాది కాలపు వార్తాపత్రికల నుంచి ఆర్థిక వ్యవస్థ సమాచారాన్ని సేకరించి చదవాలి. 11వ పంచవర్ష ప్రణాళిక ముగుస్తున్నందువల్ల దీనిలో సాధించిన ప్రగతి (మధ్యంతర సమీక్ష), 2011-12, త్వరలో ప్రవేశపెట్టబోయే 2012-13 వార్షిక బడ్జెట్‌లపై అవగాహన అవసరం. డిగ్రీస్థాయి తాజా ఎడిషన్ల పుస్తకాలను చదవాలి. భారత ప్రభుత్వం ప్రచురించే యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలూ ఉపయోగమే. ఇంగ్లిషు మీడియంవారికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రామాణిక గ్రంథాలు ఉపకరిస్తాయి.

భారత రాజకీయ వ్యవస్థ

దీని అధ్యయనం అంటే భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవటమే. రాజ్యాంగంలో ముఖ్యమైన ప్రకరణాలను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇటీవలి పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు ప్రకరణాల నుంచి యథాతథంగా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీరాజ్‌సంస్థలపై ప్రత్యేక దృష్టి అవసరం.
దేశ రాజ్యాంగ పరిణామాలు కూడా ముఖ్యమే. ఉదా. లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లు పార్లమెంటులో ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశ పెట్టబడినదనో లేదా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావలసిన మెజారిటీ ఎంత అనో ప్రశ్నలు అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌పరిణామాల దృష్ట్యా కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రశ్నలు రావచ్చు.

డి.డి. బసు రచించిన 'ఇంట్రడక్షన్‌టు కాన్‌స్టిట్యూషన్‌' తాజా ఎడిషన్‌ఉపయుక్తం. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ వారి 'భారత రాజ్యాంగం' చదవాలి. అదనంగా ప్రకరణల వారీగా ప్రచురితమైన రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా చదివి ముఖ్య ప్రకరణలను గుర్తుంచుకోవాలి. పంచాయతీరాజ్‌వ్యవస్థ నుంచీ, ఆంధ్రప్రదేశ్‌పంచాయతీరాజ్‌చట్టం నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

విపత్తుల నిర్వహణఈ అంశాన్ని ఏపీపీఎస్సీ ఈ ఏడాదే ప్రవేశపెట్టింది. కాబట్టి దీన్నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఇందులోని కొన్ని అంశాలను (భూకంపాలు, తుపానులు, సునామీలు...) భౌతిక భూగోళ శాస్త్రంలో కూడా చదువుతాం. కానీ ఇక్కడ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి సంభవించే ప్రాంతాలను తెలుసుకోవటం ముఖ్యం. వీటితో పాటు కృత్రిమంగా మానవుల తప్పిదాలు, అకృత్యాల వల్ల సంభవించే విపత్తులనూ- నివారణ మార్గాలనూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి అధ్యయనానికి సీబీఎస్‌సీ సిలబస్‌చదవాలని ఏపీపీఎస్సీప్రత్యేకంగా సూచించింది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులైనా వీటిని ఇంగ్లిషులో చదివి అర్థం చేసుకోవాలి.

వర్తమాన విషయాలు
ఏడాది కాలం నుంచి జరిగిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపై ప్రశ్నలుంటాయి. కొన్ని సమస్యల మూలాలనూ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ అంశం చదివినా దాని పుట్టు పూర్వోత్తరాలతో సహా అధ్యయనం చేయాలి.

ఒక తెలుగు పత్రికనూ, హిందూ లాంటి జాతీయ వార్తాపత్రికనూ తప్పక చదవాలి. అనేక రంగాల నుంచి విభిన్న కోణాల్లో ప్రశ్నలు అడుగుతుంటారు. క్రీడలు; జాతీయ, అంతర్జాతీయ సదస్సులు; శిఖరాగ్ర సమావేశాలు; జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు; ముఖ్యమైన వ్యక్తులు, ప్రాంతాలు; విజ్ఞాన ఆవిష్కరణలు; రక్షణ రంగానికి చెందిన క్షిపణులు; జలాంతర్గాములు; రాజకీయ-సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయాలి. వర్తమాన ఆర్థిక, రాజకీయ భౌగోళిక, సాంస్కృతిక అంశాలను క్షుణ్ణంగా చదవాలి. వార్తాపత్రికలతో పాటు పరీక్షాపద్ధతిలో సమగ్రంగా అందించే ప్రామాణిక మ్యాగజీన్‌చదవటం కూడా మంచిదే.


మానసిక సామర్థ్యం
రీజనింగ్‌కు సంబంధించిన మౌలిక అంశాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. వాటికి సంబంధించిన అనేక ప్రశ్నలను భిన్న కోణాల్లో సాధించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలుండే నమూనా పేపర్లను అభ్యాసం చేయాలి. దీనికి బ్యాంకు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎంతో ఉపయోగకరం. బ్యాంక్‌పుస్తకాల రీజనింగ్‌పేపర్‌లోని ప్రశ్నలను సాధ్యమైనంత ఎక్కువగా అభ్యాసం చేయాలి. మానసిక సామర్ధ్య ప్రశ్నలు సాధించడమనేది అభ్యర్థుల ప్రజ్ఞ, సాధనలపై ఆధారపడి ఉంటుంది. ఆ దిశలో సన్నద్ధత సాగించాలి.

-  ఎ. ఎం. రెడ్డి

Monday, 2 January 2012

ఉద్యోగార్థులూ... పారాహుషార్‌!

వెల్లువలా వెలువడిన ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ముప్పయికి పైగా ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్లూ... వేల కొలువులూ- పాతవీ, రాబోతున్నవీ. మరోపక్క వయః పరిమితినీ పెంచారు.

వెరసి అభ్యర్థుల కళ్ళల్లో కొంగొత్త ఆశలు!

అర్హతలు సరితూగుతున్న పోస్టులు చాలానే! ఏదో ఒక నోటిఫికేషన్‌కే పరిమితమవాలా? వీలైనన్నివాటికి సిద్ధమయితే మేలా? గందరగోళపడకుండా ముందడుగు వేసేదెలా?
ఇవిగో సమాధానాలు..!

గ్రూప్‌-1 స్థాయి నుంచి దిగువస్థాయి గ్రూప్‌-4 పోస్టుల వరకూ వెలువడిన వివిధ రకాల నోటిఫికేషన్లు, ప్రతి ఉద్యోగార్థినీ ఏదో ఒక రూపంలో ఊరిస్తున్నవే. ఆశలుంటే సరికాదు- ఆచరణ ముఖ్యం. దీక్షతో అక్షరయజ్ఞం చేయగలిగినపుడే ఆశించిన సర్కారీ కొలువు చేతికందుతుంది.

అభ్యర్థుల పరంగా చూస్తే 'ఎన్నిటికి పోటీ పడటం క్షేమం, ప్రయోజనకరం?' అనే సందేహం చాలా ముఖ్యమైనది. సరైన కాల ప్రణాళికతో వీలైనన్ని ఉద్యోగాలకు పోటీపడటమే ప్రాప్త కాలజ్ఞత. పైగా ఈ పోటీ పరీక్షల్లో ఉమ్మడి సిలబస్‌ ఉండటం ఒక అనుకూలాంశం.

* ప్రధానమైన పరీక్షలన్నీ మే 2012 తర్వాతే ఉన్నాయి. జనవరి- ఏప్రిల్‌ మధ్య కాలాన్నే మనం ఎన్ని పరీక్షలు రాయగలమో నిర్ణయించుకుని సమయ విభజన చేయాలి. ఈ నాలుగు నెలలనూ పటిష్ఠంగా వినియోగించుకుంటే పరీక్షల మధ్య వచ్చే సమయాన్ని అప్పటి అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు.

* కొన్ని పరీక్షలు రాద్దామని నిర్ణయించుకున్నా ఒకటి రెండు పరీక్షలే ప్రధానంగా అభ్యర్థి దృష్టిలో ఉంటాయి. వాటి నుంచే సన్నద్ధతను ఆరంభించవచ్చు. ఉదాహరణకు చూడండి...

ప్రధాన పరీక్షలు                ఇతర పరీక్షలు
గ్రూప్‌-2                           గ్రూప్‌-1, 4, ఏఎస్‌ఓ
గ్రూప్‌-1                          గ్రూప్‌-2, 4, ఏఎస్‌ఓ, ఏఈఈ
ఏఈఈ                            గ్రూప్‌-1, 2
ఏఎస్‌ఓ                           గ్రూప్‌-1, 2, 4

ఎన్ని పరీక్షలు రాస్తున్నా...
ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాయటమే మంచి నిర్ణయమని అనుకున్నాం కదా? రాయదల్చిన పరీక్షల్లోని ఉమ్మడి సిలబస్‌ని ఎంపిక చేసుకోండి. మిగతా అంశాలు అదనపు పేపర్లుగా సిద్ధమవ్వాలి. ముందుగా జరిగే పరీక్షకు సంబంధించిన నిర్దిష్ట సిలబస్‌ (ఉమ్మడిగా లేనిది) అధ్యయనానికి పరీక్షకు నెలరోజుల ముందు నుంచీ అదనపు సమయం కేటాయించుకోవాలి. అలా అని కేవలం పరీక్ష ముందే చదవమని కాదు. ముందున్న నాలుగు నెలల సమయంలో కూడా ఎంతోకొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలి.

వీఆర్‌ఓ+గ్రూప్‌-4 +ఎక్సైజ్‌ +పోలీస్‌
ముందు జరగబోతున్న వీఆర్‌ఓ పరీక్షకు మొత్తం సమయం వెచ్చించటం సమంజసం. గ్రూప్‌-4 ఆగస్టు 11న కాబట్టి ఈలోపల మిగతా పరీక్షల సమయాన్నిబట్టి వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. వీఆర్‌ఓ కోసం చదివే చాలా సమాచారం డీఎస్‌సీ పరీక్షలకు సైతం ఉపయోగపడేలా ఉంది. అందువల్ల డీఎస్‌సీ ప్రిపరేషన్‌వైపునకు కూడా కాలానుగుణంగా మారవచ్చు. గ్రూప్‌-4కి సిద్ధమయేటపుడు సెక్రటేరియల్‌ ఎబిలిటీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. గతంలో జరిగిన గ్రూప్‌-4 పరీక్షలో పాలిటీ, చరిత్ర లాంటివి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో అడిగారు కాబట్టి ఆ ప్రకారమే సన్నద్ధత సాగాలి.

డీఎస్‌సీ ప్రధాన లక్ష్యమే కానీ...
లక్షలమంది డీఎస్‌సీ ఆశావహులు టెట్‌ సన్నద్ధతలో మునిగివున్నారు. జనవరి 8న పరీక్ష ముగియగానే వీరు వెంటనే డీఎస్‌సీపై కాకుండా వీఆర్‌ఓ/వీఆర్‌ఏను కూడా ఆశిస్తే... జనవరి 29 వరకూ ఆ పోస్టులపైనే దృష్టి సారించటం తెలివైన నిర్ణయమవుతుంది. అరిథ్‌మెటిక్‌, లాజికల్‌ రీజనింగ్‌, కరంట్‌ అఫైర్స్‌, ఏపీ జాగ్రఫీలు ముఖ్యం. ఫిబ్రవరి నుంచి డీఎస్‌సీని పట్టించుకోవచ్చు.

తాజా గ్రూప్‌-1 ఫలితాల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు చాలామంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. చాలామంది డీఎస్‌సీ ఆశావహులు గ్రూప్‌-1,2, జేఎల్‌ లాంటి పరీక్షల్లో కూడా ఫలితం సాధించాలనుకుంటున్నారు. ఇలాంటివారు డీఎస్‌సీ పూర్తవగానే మిగతా పరీక్షల సంగతి చూడవచ్చు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అందుకునే అవకాశాలు తక్కువగా ఉన్నా గ్రూప్‌-2 (జులై 15), గ్రూప్‌-4 (ఆగస్టు 11), జూనియర్‌ లెక్చరర్స్‌ లాంటివి క్రమబద్ధంగా రాయవచ్చు.

'సాంకేతికం'తో సంధానం సాధ్యమా?
ఇంజినీరింగ్‌ అభ్యర్థులు చాలామందికి ఏఈఈ పోస్టులతో పాటు గ్రూప్‌-1,2లు కూడా లక్ష్యమే. గ్రూప్‌-1 సిలబస్‌ సౌలభ్యం దృష్ట్యా ఏఈఈలుగా ఎంపికైనవారు కూడా దీన్ని రాస్తుంటారు. పాలనాపరమైన పోస్టుల్లో ప్రవేశించాలనుకునేవారు కూడా ఇంజినీరింగ్‌ విభాగం నుంచి గ్రూప్‌-2వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటివారు జనవరి-మార్చి మధ్య సమయాన్ని ఇంజినీరింగ్‌ సబ్జెక్టుతోపాటు జనరల్‌స్టడీస్‌ (ప్రిలిమ్స్‌)కి కేటాయించాలి. ఏఈఈ పరీక్షలో 150 మార్కులకు జీఎస్‌ పేపర్‌ ఉంది కాబట్టి దాని ప్రిపరేషన్‌గానే గుర్తించాలి. మే నెలలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ని ఇదే ప్రిపరేషన్‌తో పూర్తిచేయవచ్చు. అయితే జనవరి- ఏప్రిల్‌ మధ్య మెయిన్స్‌లోని పేపర్‌-1, 3, 4, 5 లాంటివాటికి ముందస్తుగానే సిద్ధమవటం మంచి నిర్ణయమవుతుంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పూర్తవగానే జులై 1న జరగబోయే ఏఈఈ పరీక్షకు సర్వశక్తులూ ఒడ్డాలి. మర్నాటినుంచి అక్టోబర్లో జరగబోయే పరీక్షకు పూర్తిస్థాయిలో అంకితమవటం ద్వారా ఏఈఈ, గ్రూప్‌-1 రెండు పరీక్షల్లోనూ మంచి ఫలితాలే సాధించవచ్చు. గ్రూప్‌-2 పరీక్ష జులై 15న కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యంగా నిర్దేశించుకోకపోవటం మంచిది.

ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, డెప్యూటీ సర్వేయర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌.. ఇతర సాంకేతిక ఉద్యోగార్థులు ఇతర పరీక్షలూ, వాటి తేదీలనూ బట్టి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు ప్రణాళిక వేసుకోవాలి.

ఈ తరహా పరీక్షలన్నిటిలో అభ్యర్థుల సబ్జెక్టు మార్కుల మధ్య పెద్ద తేడా కన్పించటంలేదు. అంతిమ ఫలితాన్ని నిర్ణయించటంలో జనరల్‌స్టడీస్‌దే కీలకపాత్ర. డీఏఓ, డీఎల్‌ లాంటి పరీక్షలు దీన్ని రుజువు చేశాయి!

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌
397 పోస్టులతో భారీ ప్రకటన వెలువడింది. ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌, గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా నిర్ణయించటంతో పోటీ బాగా తగ్గింది. జూన్‌ 24న పరీక్ష కాబట్టి ముందుగా ఈ అభ్యర్థులు సబ్జెక్టుతో పాటు జీఎస్‌కి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

గ్రూప్‌-1 అంతిమ లక్ష్యంగా ఉన్నట్టయితే కనీసం మూడు మెయిన్స్‌ పేపర్లను అయినా జనవరి- మే మధ్య పూర్తిచేయటం మంచిది. మే నెల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పూర్తవగానే ఏఎస్‌ఓకి అవసరమైన సబ్జెక్టుపై దృష్టి నిలపవచ్చు. ఏఎస్‌ఓ పరీక్ష పూర్తవగానే గ్రూప్‌-1 మెయిన్స్‌ సంగతి చూడొచ్చు.

గ్రూప్‌-2 పరీక్ష జులై 15న ఉంది కాబట్టి ఏఎస్‌ఓ, గ్రూప్‌-1, 2 అనే లక్ష్యాలను నిర్ణయించుకుంటే... జనవరి- జూన్‌ మధ్య ఏఎస్‌ఓ సిలబస్‌, గ్రూప్‌-2 సిలబస్‌పై కేంద్రీకరించి మెయిన్స్‌ ప్రిపరేషన్‌ని వాయిదా వేయటం మేలు. ఏఎస్‌ఓ పరీక్ష పూర్తవగానే గ్రూప్‌-2 సంగతి పట్టించుకోవాలి. అది పూర్తవగానే అక్టోబర్లో జరిగే మెయిన్స్‌కి సర్వశక్తులూ ఒడ్డడం ద్వారా మూడు పరీక్షలనూ పటిష్ఠంగా ఎదుర్కోవచ్చు.

- కొడాలి భవానీ శంకర్