ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 17 October 2011

మంచి ఎంబీఏకి మెలకువలు

 ఎంబీఏ ద్వారా మంచి కెరియర్‌ను ఆశిస్తోన్న విద్యార్థులు కేవలం కాలేజీలు అందించే సౌకర్యాల మీదనే ఆధారపడకూడదు. సొంత కెరియర్‌ ప్రణాళిక అవసరం. విజయవంతంగా ఎంబీఏ పూర్తిచేసి, మంచి మేనేజర్‌ అవ్వాలంటే కింది అంశాలపై అవగాహన అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా, మీరు ఏ లక్ష్యం కోసం ఎంబీఏలో చేరారో దానిమీదే దృష్టిపెట్టాలి. సొంతగా వ్యాపారం చేయడం, కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకోవడం, మంచి కంపెనీలో చేరడం... ఇలా మీ లక్ష్యం ఏదైనా... దానిపై పూర్తి స్పష్టత ఉండాలి. తద్వారా మీ కార్యాచరణ, లక్ష్యసాధన సులువవుతుంది.

మొదటి మెట్టు... తెలివితేటలు
సబ్జెక్టులో మంచి పట్టు, తెలివితేటలు సాధించడం ఎంబీఏలో విజయానికి తొలిమెట్టు. మేనేజ్‌మెంట్‌ భావనలు, సిద్ధాంతాలు, అనువర్తనాలను బాగా నేర్చుకోవాలి. మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, తదితర ఫంక్షనల్‌ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఎకనమిక్స్‌, బిజినెస్‌ స్ట్రాటజీ అండ్‌ పాలసీ, ఎథిక్స్‌ అండ్‌ గవర్నన్స్‌, లీడర్‌షిప్‌ అండ్‌ చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ఇంటెగ్రేటెడ్‌ అంశాలను నేర్చుకోవాలి. వీటితోపాటు ఎంబీఏ అభ్యర్థులకు కింది సబ్జెక్టు అంశాల్లో సరైన అవగాహన అవసరం...

* మీకు ఆసక్తి గల స్పెషలైజేషన్‌లో తాజా పరిణామాలు, ఆధునిక అంశాలు
* సమస్యా పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ నమూనాలు, అందులోని ప్రక్రియలు
* ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌
* టీమ్‌ను తయారుచేయడం
* వ్యవస్థలను రూపొందించడం, అభివృద్ధి చేయడం

రెండో మెట్టు... సామర్థ్యాలు
కేవలం సబ్జెక్టులో తెలివితేటల ద్వారా మంచి మేనేజర్‌ కాలేరు. తెలిసిన అంశాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. ఎంబీఏ విద్యార్థులు ప్రధానంగా ఆరు రకాల సామర్థ్యాలను బాగా పెంపొందించుకోవాలి. అవి... 1. కమ్యూనికేషన్‌, ఇంటర్‌ పర్సనల్‌ అండ్‌ ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌ 2. టీమ్‌ బిల్డింగ్‌ అండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ 3. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు 4. సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం, ఘర్షణలను నివారించడం 5. పరిశోధన, ప్రణాళిక, మదింపు సామర్థ్యాలు 6. ఆర్గనైజేషనల్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌.

మూడో మెట్టు... ఆలోచన ధోరణి
పని, వ్యక్తులు, సంఘటనల పట్ల స్పందించడంలో మెలకువలు పాటించడం తప్పనిసరి. సానుకూల ఆలోచన అవసరం. ఎంబీఏ విద్యార్థులు దృష్టిపెట్టాల్సిన అత్యంత ముఖ్యమైన అంశాలు... ఆలోచన ధోరణి, వ్యక్తిత్వం, ప్రవర్తన. ఒక వ్యాపార అంశాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కీలకంగా పనిచేస్తాయి. మేనేజ్‌మెంట్‌ కెరియర్‌లో విజయం సాధించాలంటే కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు అవసరం. అవేమిటంటే... సహోద్యోగులను గౌరవించాలి. పని పట్ల బాధ్యతాయుతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. ఇతరుల భావాలను, నేపధ్యాన్ని అర్థం చేసుకోవాలి. సహనం, కృత నిశ్చయం, మనోనిబ్బరం అలవరచుకోవాలి. నాయకత్వం లేకపోయినా పనిలో నిబద్ధతతో పాలుపంచుకోవాలి. ఈ వ్యక్తిత్వ లక్షణాలన్నీ ఒకేసారి అలవడేవి కాదు. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరచుకోవాలి.

* సాధారణ ఎంబీఏ కాలేజీల్లో పైన పేర్కొన్న అంశాలపై పెద్దగా దృష్టిపెట్టకపోవచ్చు. కానీ మీ కెరియర్‌ను సరైన రీతిలో మలచడంలో ఇవి చాలా కీలకమైన అంశాలని మర్చిపోవద్దు.

అదనంగా చేయాల్సింది ఎంతో..!
ఎంబీఏ కోర్సు ద్వారా మీరు ఆశించిన కెరియర్‌ దక్కాలంటే కింది అంశాలను ఆచరణలో పెట్టాలి. మీరు చేరిన కాలేజీలో అద్భుతమైన సౌకర్యాలు లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కేవలం తరగతి గదిలో నేర్చుకునేవి, మంచి సిలబస్‌ ఉంటే సరిపోదు. అదనంగా చేయాల్సింది చాలా ఉంటుంది. చాలా సందర్భాల్లో తరగతి గదిలో నేర్చుకునేదానికి, వాస్తవిక వ్యాపార వాతావరణానికి సంబంధం ఉండకపోవచ్చు. అందువల్ల మీరే శ్రద్ధతో తాజా అంశాలను నేర్చుకోవాలి.

* స్టాక్‌ మార్కెట్లు, బులియన్‌, క్రూడ్‌ ఆయిల్‌, ఫారిన్‌ ఎక్చేంజ్‌, ద్రవ్యోల్బణం అంశాల్లో పరిణామాలను నిత్యం గమనిస్తుండాలి.

* సీఎన్‌బీసీ, ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ లాంటి బిజినెస్‌ న్యూస్‌ చానెళ్లను చూడొచ్చు. ఎన్డీటీవీ, బీబీసీ, తదితర న్యూస్‌ చానళ్లను కూడా చూడొచ్చు. బిజినెస్‌ లైన్‌, ఎకనమిక్‌ టైమ్స్‌, ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌, తదితర వ్యాపార పత్రికలను చదవచ్చు. రోజూ కనీసం ఒక బిజినెస్‌ వార్తా పత్రికను క్షుణ్నంగా చదివితే మంచిది.

* బిజినెస్‌ ఇండియా, బిజినెస్‌ టుడే, తదితర మేగజీన్లను చదవాలి. బడ్జెట్‌లు, క్రెడిట్‌ పాలసీలు, వ్యాపార పుస్తకాల సమీక్షలు చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఉపయోగపడే బిజినెస్‌ వెబ్‌సైట్లను కూడా చూస్తుండాలి.



చొరవ తప్పనిసరి
ప్రస్తుతం నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాలేజీలో సౌకర్యాలు లేవని బాధపడటం కంటే స్వీయ చొరవతో నేర్చుకోవడానికి గల మార్గాలను అన్వేషించడం ఉత్తమం. తద్వారా తోటి విద్యార్థుల కంటే పోటీలో ముందుండగలరు. ఎంబీఏ లాంటి వృత్తి విద్యా కోర్సులో ఆచరణకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. తరగతి గదిలో నేర్చుకునే సిద్ధాంతాలను లైవ్‌ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, కేస్‌ స్టడీల రూపంలో ఆచరణలో పెట్టడం ద్వారా ఆ అంశాలపై మరింత స్పష్టత ఏర్పడుతుంది. కింది అంశాలపై కూడా దృష్టినిలపాలి.

* గెస్ట్‌ లెక్చర్లకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఒకవేళ మీ కాలేజీలో అలాంటివి నిర్వహించకపోతే, మీరే చొరవ తీసుకొని ఏర్పాటు చేయించడానికి ప్రయత్నించవచ్చు. సబ్జెక్టు, పరిశ్రమల నిపుణులు చెప్పే అంశాల ద్వారా అవగాహన పరిధి విస్తరిస్తుంది.

* సాధారణ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌లకు సరిగా ప్రాధాన్యం ఉండదు. సీరియస్‌గా ఇంటర్న్‌షిప్‌ చేసిన విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. రొటీన్‌ అంశాలపై కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే అంశాలపై ఇంటర్న్‌షిప్‌ చేయాలి.

* మేనేజ్‌మెంట్‌ రంగంలో ఉన్నన్ని సంఘాలు, సంస్థలు మిగతా రంగాల్లో ఉండవేమో! పారిశ్రామిక సంఘాలు, విద్యాసంస్థలు నిర్వహించే సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లకు తప్పనిసరిగా హాజరవ్వాలి. వీటిల్లో సభ్యత్వం తీసుకుంటే ఇంకా మంచిది. ఈ సంఘాలు నిర్వహించే సమావేశాల్లో పరిశోధన పత్రాలు ప్రెజెంట్‌ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోవద్దు.

* మేనేజ్‌మెంట్‌ కెరియర్‌లో ప్రవేశించాక వివిధ దశల్లో చాలా నివేదికలు రాయాల్సి ఉంటుంది. సెమినార్లు, వర్క్‌షాప్‌లలో పేపర్ల ప్రెజెంటేషన్‌ రూపంలో ఇప్పటి నుంచే దీన్ని సాధన చేయవచ్చు. వ్యాపార పత్రికలకు, మేగజీన్లకు ఉత్తరాలు రాయడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు.

* ప్రస్తుత వ్యాపార వాతావరణంలో నెగ్గుకురావాలంటే మేనేజర్లకు అనేక కీలకమైన సామర్థ్యాలు అవసరం. వీటిలో కొన్ని... నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, పీపుల్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌, సమస్యలను సమర్థంగా పరిష్కరించగలగడం, ఒత్తిడిని అధిగమించడం, కుటుంబ జీవితం - విధి నిర్వహణల మధ్య సమతౌల్యం సాధించడం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం.

పోటీలో ముందుండాలంటే...
ప్రస్తుత పోటీ వాతావరణంలో తోటి విద్యార్థులకంటే ముందుండాలంటే అసలు డిగ్రీకి అదనపు హంగులు కూడా అవసరమే. ఎంబీఏతోపాటు కొద్దిపాటి శ్రమతో సాధించగల సర్టిఫికేషన్‌లు చాలా ఉంటాయి. ఎన్‌సీఎఫ్‌ఎం, ఏఎంఎఫ్‌ఐ, సెబీ, తదితర సంస్థలు అందించే సర్టిఫికేషన్‌లకు మంచి విలువ ఉంటుంది. ఈ అదనపు అర్హతలు మిమ్మల్ని మీ క్లాస్‌మేట్ల కంటే పోటీలో ముందుంచుతాయి. మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్లు, రిటైల్‌, తదితర సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ కోర్సులను ఎంచుకోవచ్చు.

* ప్లేస్‌మెంట్ల గురించి కూడా మొదటి నుంచి ఆలోచించాలి. ఈ విషయంలో కాలేజీ నుంచి సరైన సహకారం లేకపోతే విద్యార్థులే ప్లేస్‌మెంట్‌ కమిటీగా ఏర్పడి కంపెనీలతో సంప్రదింపులు జరపవచ్చు.

* ప్లేస్‌మెంట్ల ధోరణిని నిరంతరం గమనిస్తుండాలి. పత్రికల్లో వచ్చే నియామక ప్రకటనలను పరిశీలిస్తే, కంపెనీలు అభ్యర్థుల నుంచి ఎలాంటి అర్హతలు, సామర్థ్యాలు ఆశిస్తున్నాయో అర్థమవుతుంది.

* క్రమం తప్పకుండా లైబ్రరీలో పుస్తకాలు, జర్నళ్లు చదవడానికి, ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌ చూడటానికి కొంత సమయం వెచ్చించాలి.
ఈ కథన  రచయిత...  ప్రొ. ఎం. భాస్కరరావు .

No comments:

Post a Comment