ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 19 December 2011

గ్రూప్ -1 ఇంటర్వ్యూలో విజయీభవ!


గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక మిగిలింది మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) దశ.

ప్రశ్నలు అడగటం, అభ్యర్థి చెప్పే సమాధానాల్లో కచ్చితత్వం చూడటానికి మాత్రమే ఈ ప్రక్రియ పరిమితం కాదు. అభ్యర్థి మూర్తిమత్వ లక్షణాల పరిశీలన, తద్వారా ఉద్యోగానికి అభ్యర్థి ఎంతవరకూ సరిపోతాడో ఒక నిర్థారణకూ, నిర్ణయానికీ రావటానికి ఇది ఉపయోగపడుతుంది.రాతపరీక్షల ద్వారా బయటపడని మానసిక, శారీరక లక్షణాలను గమనించటం ఇంటర్వ్యూలోనే సాధ్యమవుతుంది.

ఏ మౌఖిక పరీక్షలోనైనా సాధారణంగా ఐదు దశలుంటాయి. ప్రవేశించే దశ (Entry), పరిచయం, లోతైన చర్చ, ముగింపు, నిష్క్రమణ (Exit).

1. ప్రవేశించే దశ
అభ్యర్థి బోర్డు గదిలోకి ఎంత cosy గా ప్రవేశించాడు; పరిసరాలనూ, బోర్డు సభ్యులనూ ఎలా చూశాడు, సభ్యులను ఎలా సంబోధిస్తున్నాడు లాంటివి పరిశీలించి 'తొలి అభిప్రాయాన్ని' ఏర్పరచుకునే అవకాశం ఈ దశలో బోర్డుకు ఉంటుంది. అభ్యర్థి సాధన చేయగలిగితే ఈ దశలో మంచి అభిప్రాయం కలగజేసే వీలుంటుంది.

2. పరిచయం
'మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి' అని అభ్యర్థిని బోర్డు అడగవచ్చు. లేదా బోర్డు చైర్మన్‌ అభ్యర్థి బయోడేటాను క్లుప్తంగా మిగతా సభ్యులకు వినపడేలా చదదవచ్చు. ఆహ్లాద వాతావరణం ఏర్పడేందుకు సులభమైన, అభ్యర్థికి సంబంధించిన ప్రశ్నలనే అడుగుతారు. అభ్యర్థి కుటుంబం, విద్యా ప్రగతి, చేస్తున్న ఉద్యోగం లాంటివి ఈ పరిచయ ప్రశ్నల్లో భాగంగా చేరవచ్చు. దినపత్రికల్లో వస్తున్న వార్తలను ప్రస్తావించవచ్చు.

ఒక బోర్డులో... 'ఈ ఆఫీసుకు మీరెలా వచ్చారు?', 'బస్సులో మీ పక్క ప్రయాణికులను పరిచయం చేసుకున్నారా?' 'హైదరాబాద్‌ బస్సు ప్రయాణం ఎలా ఉంది?' లాంటి పరిచయ ప్రశ్నలు అడిగి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యపై చర్చ కొనసాగించారు.



3. లోతైన చర్చ
ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థి శక్తి సామర్థ్యాలు పరిశీలించేందుకు 'సన్నివేశ' కల్పన జరుగుతుంది. విషయ వివరణ, విభిన్నకోణాల పరిశీలన, వాద ప్రతివాదనలు, ధనాత్మక - సకారాత్మక ధోరణులు మొదలైన అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా భావోద్వేగాల నియంత్రణలో అభ్యర్థి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుంటారు. బోర్డు రకరకాల ఒత్తిడులను ఈ దశలో ప్రయోగించవచ్చు.

లోతైన చర్చ నుంచి బయటపడే లక్షణాలు:. ఒత్తిడికి ప్రతిస్పందన, సహనస్థాయి, స్థిత ప్రజ్ఞత, బలాలు- బలహీనతలు, వినయం, సేవాతత్పరత, నిజాయతీ, దార్శనికత (vision).

4. ముగింపు
చర్చించిన విషయాన్ని అభ్యర్థి ఏ విధంగా ముగిస్తున్నాడు, అతడి అంతిమ భావన ఏమిటి, మొదట తాను కలిగివున్న భావనల నుంచి బయటపడ్డాడా? అసంబద్ధమైన భావనలనే చర్చ ముగింపులో కూడా కలిగివున్నాడా లాంటివి పరిశీలిస్తారు. అభ్యర్థి తన హేతుబద్ధ భావనలను బోర్డు ఒత్తిడి కారణంగా వదులుకున్నాడా, 'తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు' ధోరణితో వ్యవహరించాడా ... ఇవన్నీ గమనిస్తారు.

5. నిష్క్రమణ
బోర్డు చైర్మన్‌ 'ఇక మీరు వెళ్ళవచ్చు' అని చెప్పినపుడు నిదానంగా బోర్డు సభ్యులందర్నీ ఒకసారి చూసి చైర్మన్‌కి 'కృతజ్ఞతలు' తెలియజేసి బయటకు వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పుడు...
* బోర్డు నుంచి పారిపోయినట్టుగా వేగంగా వెళ్తున్నాడా?
* ఇంటర్వ్యూ జరిగినదాన్ని బట్టి అసంతృప్తి/సంతృప్తికి గురై అదే బాధ/ఆనందంతో వెళ్తున్నాడా?
* ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించే అవకాశం మరింత ఉంటే బాగుణ్ణు అనే అభిప్రాయం అభ్యర్థిలో ఉందా?
ఇలాంటివి అంచనా వేసే అవకాశముంది. అందుకే exit behaviour ని సాధన చేయాల్సివుంటుంది.

సిద్ధం కావాల్సినవి...
1) బయోడేటా సమాచారం 2) గ్రూప్‌-1 మెయిన్స్‌ సిలబస్‌లోని పేపర్‌-2, 3, 4 అంశాలు 3) జాతీయ, అంతర్జాతీయ విషయాలు 4) రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 5) సామాజిక అంశాలు 6) తాజా ఆర్థిక పరిణామాలు 7) పార్లమెంటులో ప్రవేశపెట్టిన తాజా బిల్లులు 8) గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల ప్రాథమికాంశాలు


- కొడాలి భవానీ శంకర్

No comments:

Post a Comment