ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 10 October 2011

గ్రూప్‌-2 గెలుపు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలకు మిగిలింది ఐదు రోజులే!

ఇప్పుడున్న కొద్ది సమయం చాలా అమూల్యం. దీన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలి. మరోపక్క ఇటీవలి గ్రూప్‌-1 మెయిన్స్‌ ధోరణులనూ గమనంలోకి తీసుకోవాలి.

సన్నద్ధతకు ఇలా తుది మెరుగులు దిద్దుకుంటేనే ఆశించిన ఫలితం సిద్ధించేది అంటున్నారు... కొడాలి భవానీ శంకర్‌!

రీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో కనీసం 5 శాతం మంది స్వల్ప తప్పిదాల వల్ల విలువైన సమయం నష్టపోవటమే కాకుండా విజయాన్ని కూడా దూరం చేసుకుంటుంటారు.

* పరీక్ష హాల్లోకి కనీసం 20 నిమిషాలు ముందుగా వెళ్ళటం వల్ల వ్యక్తిగత వివరాలను నింపాదిగా నింపటం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

* ప్రశ్నపత్రం ఇవ్వగానే పరీక్ష సిరీస్‌ కోడ్‌ లాంటి సమాచారాన్ని ముందుగా నింపండి.

* మొదటి పేజీ సమాచారం పూర్తయిన తర్వాతే ప్రశ్నల వంక చూడటం ప్రారంభించండి.

* ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించగానే వెంటనే ఓఎంఆర్‌ షీటులో సంబంధిత ప్రశ్నకు ఎదురుగా ఉన్న వృత్తాన్ని నింపాలి. ప్రశ్నపత్రంపై సమాధానాలు గుర్తించి, చివర్లో అన్నీ ఒకేసారి నింపుదామనుకోవటం సరికాదు.

సమాధానాలు ఎలా?
* జనరల్‌స్టడీస్‌ పేపర్లో బాగా సులభమనుకున్న విభాగపు ప్రశ్నలను ముందుగా సాధిస్తే ప్రేరణ పెరుగుతుంది. అయితే వీలైనంతవరకూ మొదటి ప్రశ్న నుంచి గుర్తించటం వల్ల ఒక్కో విభాగపు ప్రశ్నలు ఎక్కడున్నాయో వెతుక్కోవటానికి పట్టే సమయం వృథా కాకుండా ఉంటుంది.

* అన్ని ప్రశ్నలకూ సమాన మార్కులే కాబట్టి ఒక ప్రశ్న చదవగానే సరైన సమాధానం గుర్తించగలమా లేదా అనేది సెకన్ల వ్యవధిలోనే నిర్థారించుకోవాలి. కొంత సమయం తర్వాతనైనా సాధించగలమనుకుంటే అలాగే చేయటం ఉత్తమం.

* సమాధానం కచ్చితంగా 'తెలియదు' అనుకుంటే సమయం వ్యర్థం చేసుకోకుండా తోచిన సమాధానాన్ని ఓఎంఆర్‌ షీట్లో గుర్తించెయ్యటం మంచిది.

* రెండో రౌండులో సాధించదల్చుకున్న ప్రశ్నల వద్ద ఏదైనా గుర్తు పెట్టుకుంటే వాటికోసం వెతికే సమయం తగ్గుతుంది. ఇలా వదిలే ప్రశ్నల సంఖ్య తక్కువుండేలా చూసుకోవాలి.

* ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో 'సరైన సమాధానం కానిది ఏది' అంటూ చూసుకుంటూపోతే (ఎలిమినేషన్‌) మంచి ఫలితాలు సాధించవచ్చు. సరికానివి వదిలెయ్యటం ద్వారా సరైన జవాబును గుర్తించటం తేలికవుతుంది.

మరింత మెరుగైనదే సరైనది
ప్రశ్న చదివాక ఒక సమాధానం చూడగానే కచ్చితం అనిపించొచ్చు. కానీ మిగిలినదానిలో మరోటి 'మరికొంచెం కచ్చితం' అనిపిస్తే? దాన్నే సమాధానంగా గుర్తించాలి.

* 73వ రాజ్యాంగ సవరణ ఎన్ని అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రతిపాదించింది?

ఎ) 2 అంచెలు బి) 3 అంచెలు సి) స్పష్టంగా పేర్కొనలేదు డి) 3 అంచెలు; ఏదైనా రాష్ట్రంలో జనాభా 20 లక్షలలోపుంటే రెండు అంచెలు

ఎ, బి- రెండూ సరైనవే. అయితే డి సమాధానంలో మరింత కచ్చితత్వం ఉంది. కాబట్టి అదే సరైన జవాబు!

గ్రూప్‌-1 మెయిన్స్‌ నేపథ్యంలో...
ఇటీవల జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల ప్రశ్నల తీరుతెన్నులు గ్రూప్‌-2లో కూడా పునరావృతం అవ్వొచ్చు. దాన్ని ఎదుర్కొనే వ్యూహం అభ్యర్థుల వద్ద ఉండాలి.

* గ్రూప్‌-1లో వ్యాస రూప ప్రశ్నల్లో ఊహించనివిధంగా స్థూల అవగాహన అవసరమైన ప్రశ్నలను అడిగారు. ఈ అవగాహన లేకుండా ఏవో కొన్ని వ్యాసాలు ముక్కునపెట్టుకు వెళ్ళినవారు డీలా పడ్డారు. గ్రూప్‌-2లో కూడా స్థూల అవగాహనపై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. అందుకని విహంగవీక్షణంతో స్థూల అవగాహన పెంచుకోవాలి.

* ఏపీ చరిత్రలో ప్రధానంగా లలితకళలు, సాహిత్యం లాంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. గ్రూప్‌-2 2008లో కూడా ఇదే ధోరణి. ఈసారి కూడా ఇది కొనసాగవచ్చు.

* తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో తెలంగాణా సాంఘిక సాంస్కృతిక చైతన్య ప్రాముఖ్యం, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు దారితీసిన క్రమం, సంఘటనలపై కూడా ప్రశ్నలు వచ్చాయి. గ్రూప్‌-2 అభ్యర్థులు ఇలాంటి కోణాలను కూడా క్షుణ్ణంగా స్పృశించటం మంచిది.

* పాలిటీ ప్రశ్నలు కూడా అనువర్తన కోణంలోనే గ్రూప్‌-1 మెయిన్స్‌లో అడిగారు. 2008 గ్రూప్‌-2లో ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. ఈసారి కూడా దాదాపుగా అదే ధోరణి కొనసాగవచ్చు. అయితే విశ్లేషణాత్మక అంశాలపై ఒత్తిడి పెరిగినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి.

* ఎకానమీ పేపర్లో గణాంక సమాచారం కంటే స్థూల అవగాహనకే గ్రూప్‌-1 మెయిన్స్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే గ్రూప్‌-2 ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి స్థూల అవగాహనతో ప్రశ్నలు రాకపోవచ్చు. కాబట్టి కొంతమేర గణాంక ప్రభావం ఉండొచ్చు. అంతమాత్రం చేత గణాంకాలే ప్రిపరేషన్‌కు ఆధారం కారాదు. ఏపీ ఎకానమీ ప్రాథమికాంశాలు కీలకంగా భావించి అధ్యయనం మెరుగుపరచుకోవాలి.

* గ్రూప్‌-1 మెయిన్స్‌ వ్యాసరూప ప్రశ్న సరిగా రాయలేదని చాలామంది తర్వాతి పరీక్షలకు హాజరు కాలేదు. అది సరికాదని వేరే చెప్పనవసరం లేదని గ్రూప్‌-2 అభ్యర్థులు గుర్తించాలి. కఠినంగా ఉంటే అది అందరికీ వర్తిస్తుంది. ఒక పేపర్లో మార్కులు తగ్గినా మరో పేపర్లో పెరగవచ్చు. అందుకని వెనుకంజ వేయకుండా చివరివరకూ పోరాడటం అవసరం.

* మొత్తమ్మీద గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రశ్నల్లో కొన్ని హైస్కూలు విద్యార్థి కూడా రాసేలా ఉన్నాయి. మరికొన్ని దినపత్రికల సమాచారంతో రాయగలిగేలా ఉన్నాయి. కొన్ని అనువర్తన కోణంలో మాత్రమే రాసేలా ఉన్నాయి. గ్రూప్‌-2 ప్రశ్నలు కూడా స్థూలంగా (ప్రాథమికాంశాలు) బేసిక్స్‌+ అనువర్తనం ఆధారంగా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా మానసికంగా సన్నద్ధమైతే విజయం తథ్యం!

* చివరిగా... చదివినదానిలోనే ప్రశ్నలు వస్తాయని భావించి కంగు తినొద్దు. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం గుర్తించగలనని భావించి పరీక్షకు హాజరవటం శ్రేయస్కరం.

1 comment:

  1. నమస్తే సర్,
    ఈ రోజు ఈనాడు పెపర్ లో పొలిస్ జాబ్స్ ప్రకటన వచ్చింది. నాకు, మా ఫ్రెండ్స్ కి పొలిస్ జాబ్ అంటె చాలా ఇష్టం..
    పొలిస్ జాబ్ కి కావలసిన అర్హత, అనగా చదువు , ఉండాల్సిన ఎత్తు, బరువు, గాలి పిల్చినప్పుడు చాతి వెడల్పు, ఇంకా మోదలైనా అర్హతలు తెలియ చేసి మాకు సహకరించగలరు.... ఈ బ్లాగ్ చుస్తున్న పాఠకులు ఎవరికైన తెలిస్తె దయచేసి ఆ వివరాలు పొస్ట్ చేయగలరు...
    ధన్యవాదములు.. (జె.ప్రవీణ్ కుమార్ )

    ReplyDelete