ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday 21 October 2011

ఆస్ట్రానమీ కోర్సు చేయాలంటే?

విద్యార్థి పాఠకులు వివిధ కోర్సులకు  సంబంధించి వ్యక్తం చేసిన సందేహాలకు నిపుణుల సమాధానాలు ఇక్కడ  అందిస్తున్నాం.


* నేను బి.ఎస్‌సి. ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ చదువుతున్నాను. ఇదే స్పెషలైజేషన్‌తో ఎం.ఎస్‌సి. చేయాలనుకుంటున్నాను. ఎక్కడ అందుబాటులో ఉంది?

- అర్చన, హైదరాబాద్‌

మైక్రోబయాలజీలో ఒక ముఖ్యమైన స్పెషలైజేషన్‌ ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ. ఆంధ్రప్రదేశ్‌లో పీజీ స్థాయిలో ఈ స్పెషలైజేషన్‌ను ఏ యూనివర్సిటీలోనూ అందించడం లేదు. పీజీ కోర్సులో భాగంగా ఒక పేపర్‌గా ఈ సబ్జెక్టును చదివే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. అవి... గురు జంభేశ్వర్‌ యూనివర్సిటీ, తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ, మధ్యప్రదేశ్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది. దీని చిరునామా: యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, చెన్నై- 600005.

ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌తో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు, ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమల్లో మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి. ఇతర కంపెనీల్లో బయోఎథిక్స్‌, టాక్సికాలజీ, వైరాలజీ, ఆగ్రోనమీ, క్వాలిటీ కంట్రోల్‌ టెక్నాలజీ, పబ్లిక్‌ హెల్త్‌, బయోమెడికల్‌ టెక్నాలజీ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. పీజీ పూర్తయ్యాక సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ద్వారా ఫెలోషిప్‌ సాధించి పీహెచ్‌డీ చేస్తే మరిన్ని మంచి అవకాశాలను అందుకోవచ్చు.

*  నేను ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ (కెమిస్ట్రీ) చేయాలనుంది. ఓయూలో పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశం ఎలా లభిస్తుంది?
- కె. నాగరాజు, వరంగల్‌

కెమిస్ట్రీలో మంచి స్పెషలైజేషన్‌తో పీహెచ్‌డీ చేయడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలను అందుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి రెండు మార్గాలున్నాయి. ఎం.ఎస్‌సి. తర్వాత పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాయవచ్చు. లేదా సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ నెట్‌/ ఐసీఎంఆర్‌/ డీబీటీ పరీక్షల్లో జేఆర్‌ఎఫ్‌లో ఉత్తీర్ణులవడం ద్వారా ప్రవేశం పొందవచ్చు. సాధారణంగా ఈ అభ్యర్థులను రాత పరీక్ష దశ నుంచి మినహాయిస్తారు. పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. మరిన్ని వివరాలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.


* ఎం.ఎస్‌సి. బయోకెమిస్ట్రీ చేశాను. ప్రస్తుతం పీజీడీసీఏ చేస్తున్నాను. నాకు ఫార్మా మార్కెటింగ్‌లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
- శ్రీనివాసరెడ్డి, అనంతపురం

బయాలజీ, కంప్యూటర్స్‌ నేపధ్యం ఉన్న అభ్యర్థులకు మంచి రంగం... బయో ఇన్ఫర్మేటిక్స్‌. మీరు ఇంకా డ్రగ్‌ డిజైన్‌ లాంటి కోర్సులు చేస్తే ఫార్మా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. బయో ఇన్ఫర్మేటిక్స్‌, డ్రగ్‌ డిజైన్‌ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోన్న కొన్ని ప్రముఖ కంపెనీలు... హెచ్‌హెచ్‌ బయోటెక్నాలజీస్‌, ఆగ్రా; సెల్రిస్‌ ల్యాబ్స్‌, అహ్మదాబాద్‌; స్ట్రాండ్‌ జెనోమిక్స్‌, బెంగళూరు; జెన్‌బయోస్‌, బెంగళూరు; సెంటర్‌ ఫర్‌ బయోఇన్ఫర్మేటిక్స్‌, చెన్నై; బయోమెడ్‌ ఇన్ఫర్మేటిక్స్‌, హైదరాబాద్‌; రిషి బయోటెక్‌, ముంబాయి.

ఫార్మా మార్కెటింగ్‌ రంగం చాలా విస్తృతమైనది. ఫార్మా స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌ చేస్తే ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. నైపర్‌ ఈ కోర్సులకు బాగా పేరున్న సంస్థ. అభ్యర్థి సామర్థ్యాలను బట్టి మార్కెటింగ్‌ రంగంలో వేగంగా ఎదగవచ్చు. నైపర్‌ కోర్సుల వివరాలు సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.


* నేను ఎం.ఎస్‌సి. న్యూట్రిషన్‌ చేయాలనుకుంటున్నాను. మంచి సంస్థలను సూచించగలరు. కోర్సు పూర్తయ్యాక ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి?
- ఆర్‌. స్వర్ణ, విజయవాడ

న్యూట్రిషన్‌లో పీజీ చేయడానికి మనరాష్ట్రంలోనే అనేక ప్రముఖ సంస్థలున్నాయి. వీటిలో అగ్రగామి సంస్థ... నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌), హైదరాబాద్‌. ఈ సంస్థ ఎం.ఎస్‌సి. అప్లయిడ్‌ న్యూట్రిషన్‌ కోర్సును అందిస్తోంది. అనేక సంస్థల్లో ఎం.ఎస్‌సి. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌ సైన్స్‌, న్యూట్రిషన్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ తదితర పేర్లతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


న్యూట్రిషన్‌ సంబంధిత కోర్సులను అందిస్తోన్న మరికొన్ని ముఖ్య సంస్థలు... ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌); ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌); బుందేల్‌ ఖండ్‌ యూనివర్సిటీ, ఝాన్సీ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ); సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్‌ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ టెక్నాలజీ); చౌదరి చరణ్‌సింగ్‌ యూనివర్సిటీ, మీరట్‌ (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెక్నాలజీ); నాగపూర్‌ యూనివర్సిటీ, నాగపూర్‌ (ఎం.ఎ. హోమ్‌ ఎకనమిక్స్‌); తమిళనాడు అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, కోయంబత్తూరు (ఎం.ఎస్‌సి. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌). వీటిలో ఎన్‌ఐఎన్‌, సీఎఫ్‌టీఆర్‌ఐ అత్యుత్తమ సంస్థలని చెప్పవచ్చు. ఇవి సీఎస్‌ఐఆర్‌, ఐసీఎంఆర్‌ పరిధిలో పనిచేస్తున్నాయి. ఫుడ్‌ సైన్స్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఉన్నత కోర్సులు చేయడానికి ఇవి మంచి సంస్థలు.


* నేను ఇంటర్‌ (ఎంపీసీ) ఫైనలియర్‌ చదువుతున్నాను. ఆస్ట్రానమీ అంటే చాలా ఇష్టం. ఈ రంగంలోకి ప్రవేశించాలంటే ఏ కోర్సులు చేయాలి?
- జి. సాకేత్‌, విశాఖపట్నం

ఇంటర్మీడియట్‌ తర్వాత మీరు బీఈ లేదా బి.ఎస్‌సి. ఇంజినీరింగ్‌ చేయాలి. తర్వాత ఆస్ట్రానమీ సంబంధిత స్పెషలైజేషన్‌తో కోర్సులు చేయవచ్చు. మనదేశంలో ఆస్ట్రానమీ స్పెషలైజేషన్‌తో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అరుదు. మాస్టర్స్‌, పీహెచ్‌డీ స్థాయుల్లో అనేక మార్గాల ద్వారా ఆస్ట్రానమీ సంబంధిత కోర్సులు చేయవచ్చు. ఈ కోర్సులను అందిస్తోన్న ప్రముఖ సంస్థలు... ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, బెంగళూరు; ఇండియన్‌ ఇన్  స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు; రామన్‌ రిసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌, బెంగళూరు; ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, పుణె.

ఈ సంస్థలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాక వీటిలో ప్రవేశించవచ్చు. ఐఐటీ జేఈఈ లేదా జామ్‌ పరీక్షల ద్వారా ఏదైనా ఐఐటీలో ఫిజిక్స్‌ లేదా ఫిజిక్స్‌ డ్యుయల్‌ డిగ్రీ కోర్సులో సీటు సాధిస్తే కెరియర్‌ బాగుంటుంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కూడా పైన పేర్కొన్న సంస్థల్లో ఆస్ట్రానమీ సంబంధిత కోర్సులు చేయవచ్చు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవారు డా. యు.ఎస్.ఎన్. మూర్తి.

No comments:

Post a Comment