ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 4 October 2011

విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆహ్వానం

న దేశ విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నతవిద్యకోసం వెళ్ళే దేశాల్లో ఆస్ట్రేలియాది మొదటిశ్రేణి. అయితే భారతీయ విద్యార్థులపై జరిగిన దాడులూ, ఇతర కారణాలతో స్తబ్ధత ఆవరించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు సంబంధించి కొత్తగా సంస్కరణలు అమల్లోకి తెస్తోంది. ఇవి ప్రయోజనకరంగా, విద్యార్థులను ఆకట్టుకునేలా ఉన్నాయనీ, ఆస్ట్రేలియా విద్యాపరంగా పూర్వవైభవం సంతరించుకోవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ కథనం రాసినవారు- శుభకర్‌ ఆలపాటి

నాణ్యమైన విద్య మాత్రమే కాకుండా చక్కని జీవనశైలి కావాలనుకునే విద్యార్థులు గమ్యంగా ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఈ మధ్య విద్యారంగంలో ఆస్ట్రేలియా ప్రాభవంకొంత తగ్గినప్పటికీ ప్రాచుర్యం మాత్రం అలాగే ఉంది.
ప్రపంచంలో నివాస యోగ్య ప్రదేశాల్లో అత్యుత్తమమైనవాటి జాబితాను తయారుచేస్తే దానిలో ఆస్ట్రేలియా తప్పనిసరిగా చోటుచేసుకుంటుంది. విద్యార్థులు ప్రామాణిక విద్య నేర్చుకోవటానికీ, విద్యాపరంగా అభివృద్ధి చెందటానికీ, ఆసక్తి ఉంటే వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడటానికీ ఆకర్షణీయమైన అవకాశాలున్న దేశమిది. ఇక్కడి వాతావరణం దాదాపు భారత్‌ తరహాలోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదవటానికి ఎక్కువమంది మొగ్గుచూపటానికి ఇదో ముఖ్య కారణం.

రాజధాని Canberraతో పాటు సిడ్నీ, మెల్‌బోర్న్‌, బ్రిస్‌బేన్‌, పెర్త్‌, అడిలైడ్‌, డార్విన్‌, హోబర్ట్‌ ఇక్కడి ప్రధాన నగరాలు. ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. అందులోనూ అందమైన తీరప్రాంతం పొడవునా జనజీవనం అధికంగా కనిపిస్తుంది.


ఏమిటి ప్రత్యేకతలు?
ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో వినూత్న ఆలోచనాపథం, సృజనాత్మకత, స్వతంత్ర దృక్పథం పెంపొందుతాయనేది ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయం.

బృందంలో భాగంగా పనిచేసే నేర్పు, ప్రభావశీలంగా భావ ప్రకటన, ప్రాయోగిక నైపుణ్యాలు, మేధో సామర్థ్యం... ఇవన్నీ మెరుగుపరుచుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో నెగ్గుకురాగలం. ఆస్ట్రేలియాలో చదువుకునే క్రమంలో విద్యార్థులు వీటిని గణనీయంగా పెంపొందించుకోగలుగుతారు.

ఆధునిక కాలంలో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను నూతన బోధన పద్ధతుల ద్వారా అందించటం ఆస్ట్రేలియా ప్రత్యేకత. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, బహుళ సంస్కృతులకు కేంద్రంగా ఉండటం ఇక్కడి విద్యాసంస్థల విశిష్టత. విదేశీ విద్యార్థులు ఎంచుకోవడానికి విస్తృతమైన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. నవీన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికీ, పరిశోధనలకూ వీలు ఏర్పడుతుంది.

ఏ కోర్సులకు ప్రాధాన్యం?
ఆస్ట్రేలియాలో ఉత్తమ కోర్సులుగా ప్రాచుర్యం పొందినవి: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఫిజియోథెరపీ, మెడిసిన్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఏవియేషన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ టీచింగ్‌, మెడికల్‌ రేడియాలజీ

మనదేశ విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా చేరుతున్న కోర్సులు- బిజినెస్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, సైన్స్‌, హాస్పిటాలిటీ మొదలైనవి. ఇక్కడ విద్యార్థులకు అత్యధిక అవకాశాలు అందించే డిగ్రీ కోర్సులు... బిజినెస్‌ కోర్సుల నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, ట్రేడ్స్‌, ఎడ్యుకేషన్‌ వరకూ అన్ని స్థాయుల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా విద్యాసంస్థలు అందించే డిగ్రీలను అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ గుర్తిస్తోంది. దీనివల్ల ఏ భారతీయ విశ్వవిద్యాలయంలోనైనా తర్వాతి చదువులకూ, ప్రభుత్వోద్యోగాలకూ అవకాశం ఏర్పడుతుంది.

ఆస్ట్రేలియా వ్యాప్తంగా వివిధ వొకేషనల్‌ విద్య, శిక్షణ కళాశాలల్లో చాలామంది విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. నాణ్యమైన విద్యాసంస్థలూ, కోర్సులు అందుబాటులో ఉంచటానికి అక్కడి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం విద్యాసంస్థలన్నీ అక్రిడిటేషన్‌ పొందివుండాలి. అంతర్జాతీయ విద్యార్థులకు అందించే కోర్సులన్నీ తప్పనిసరిగా అనుమతి పొందివుండాలి. కామన్‌వెల్త్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ కోర్సెస్‌ ఫర్‌ ఓవర్‌సీస్‌ స్టూడెంట్స్‌ (CRICOS) లో లిస్టయివుండాలి. విద్యార్థులకు అందించే అర్హతలు ఆస్ట్రేలియన్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌కు తగివుండాలి.
ప్రవేశానికి ఏం కావాలి?
కోర్సుల అవసరాలను బట్టి వివిధ దేశాలూ, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఒక్కోటి ఒక్కోరకమైన ప్రవేశ అర్హతలను నిర్దేశిస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశంలో ఇమిగ్రేషన్‌ విభాగం వారు TOEFLను అనుమతించటం లేదు. కాబట్టి ఇక్కడ చదవదల్చిన విద్యార్థులు IELTS పరీక్ష రాయటం తప్పనిసరి. దానిలో స్కోరు తక్కువ వచ్చినప్పటికీ ఈ దేశాల్లో చదవటానికి ప్రవేశం లభిస్తుంది.

పరిగణనలోకి తీసుకునే స్కోరు: 5- 5.5.

* ఇన్‌టేక్స్‌: ఇక్కడ ఇన్‌టేక్‌ రెండు సీజన్లలో జరుగుతుంది. ఇక్కడి విద్యాసంస్థల ప్రధానమైన ఇన్‌టేక్‌ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి/ మార్చి తొలిభాగంలో జరుగుతుంది. జులై /ఆగస్టు నెలల్లో మరో ఇన్‌టేక్‌ ఉంది. కొన్ని స్పెషలైజ్‌డ్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన కోర్సుల్లో ఈ ఇన్‌టేక్‌లో కూడా ఎక్కువమందే చేరతారు. మే, అక్టోబరు, నవంబరుల్లో ప్రారంభమయ్యే కోర్సులు కూడా ఉన్నాయి.
 
ట్యూషన్‌ ఫీజు/విద్యావ్యయం (AUDఏటా)

అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌:
యూనివర్సిటీలు: 16,000- 27,000
కళాశాలలు: 13,000- 17,000

పోస్టు గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌:
యూనివర్సిటీలు: 17,000- 28,000
కళాశాలలు: 15,000- 21,000
ఆస్ట్రేలియా హై కమిషన్‌ వీసా మార్గదర్శకాల ప్రకారం ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి జీవనవ్యయం 18,000 AUD అవుతుంది.

* ఉపకారవేతనాలు: ఎక్కువమంది అంతర్జాతీయ విద్యార్థులు పూర్తి ఫీజును చెల్లించేవారే. అయితే ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్పులు) దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఇతర సంస్థలెన్నో ఉపకారవేతనాలు అందిస్తున్నాయి. వొకేషనల్‌ విద్య, శిక్షణ, స్టూడెంట్‌ ఎక్స్చేంజెస్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ స్టడీ, రిసర్చ్‌లలో ఈ వెసులుబాటు లభిస్తుంది.

దరఖాస్తు సమయంలో...
ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం కోసం చేసే దరఖాస్తులో సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్ల జాబితా:
బ్యాచిలర్స్‌ అండ్‌ మాస్టర్స్‌ (యూనివర్సిటీ)
* టెన్త్‌ (ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేసినది- సీల్డ్‌కవర్లో)
* 10+2 / డిప్లొమా (ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేసినది- సీల్డ్‌కవర్లో)
* బ్యాచిలర్స్‌ / మాస్టర్స్‌- విడి మార్క్‌షీట్లు
* కన్సాలిడేటెడ్‌ / ప్రొవిజనల్‌ / డిగ్రీ / కోర్సు కంప్లీషన్‌
* IELTS స్కోరు
* రికమండేషన్‌ లెటర్స్‌ (అవసరమైతే)
* స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సస్‌ (అవసరమైతే)
* సీవీ లేదా రెజ్యూమే
* ఎక్స్‌పీరియన్స్‌ లెటర్‌ (ఉంటేనే)
* పాస్‌పోర్ట్‌ జిరాక్స్‌ (తొలి, చివరి పేజీలు)
* ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ సర్టిఫికెట్లు (ఉంటేనే)
* పాస్‌పోర్టు సైజు ఫొటో

No comments:

Post a Comment