ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 24 October 2011

రెండు పరీక్షలు దాటితే.. ఉపాధ్యాయ ఉద్యోగమే!

టెట్‌లో సాధించిన మార్కులు డీఎస్‌సీలో అంతిమ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ఈ రెండు పరీక్షల సిలబస్‌లో పోలికలు చాలానే ఉన్నాయి. పోలికలను అనుసంధానించి (ఇంటిగ్రేట్‌) చదవటం ప్రణాళికలో భాగం కావాలి. టెట్‌, డీఎస్‌సీలలో సంబంధం లేని సిలబస్‌ అంశాలున్నాయి. వాటికి ప్రత్యేకంగా చదివే విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు కొడాలి భవానీ శంకర్.

అనుసంధానం
* టెట్‌ పేపర్‌-1 కనీస అర్హత మార్కులు పొందితేనే ఎస్‌జీటీకి అర్హత లభిస్తుంది. పైగా ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది.

* టెట్‌ పేపర్‌-2 కనీస అర్హత మార్కులు పొందితేనే స్కూల్‌ అసిస్టెంట్‌కి అర్హత లభిస్తుంది. పైన పేర్కొన్న రీతిలోనే స్కూల్‌ అసిస్టెంట్‌ ఎంపికలో టెట్‌ వెయిటేజి పొందుతుంది.

అందువల్ల టెట్‌లో ఎంత గరిష్ఠ మార్కులు పొందితే అందుకు అనుగుణంగా మార్కులు డీఎస్‌సీలో కలుపుతారు. అభ్యర్థులు టెట్‌ను ప్రణాళిక ప్రకారం సిద్ధమవ్వడమే తొలి వ్యూహం.

* భాషల ఎంపికకు ప్రమాణాలను జి.ఒ. ఎం.ఎస్‌. నంబర్‌ 51 (ఏప్రిల్‌ 16, 2011) లో పేర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకోవడం కీలకం. భాష-1 కింద ఎంచుకున్న భాష మాధ్యమంగా ఉన్న పాఠశాలలో నియమితులవుతారనే విషయం పరిగణనలోకి తీసుకోవాలి.

* పండిత్‌లు, బి.కామ్‌ మొదలైన విభిన్న వర్గాల అభ్యర్థులు పేపర్‌-1కి హాజరు కావొచ్చు. మిగతా అభ్యర్థుల మాదిరిగానే ఎస్‌జీటీకి ఎంపిక కావొచ్చు.

* 34 ప్రశ్నల వరకూ పెడగాజి విభాగం కింద 2011 టెట్‌ ప్రశ్నపత్రంలో కనిపిస్తున్నాయి. అందువల్ల పెడగాజి సంబంధిత అంశాల అధ్యయనం టెట్‌లో విజయం అందించడమే కాకుండా డీఎస్‌సీ విజయానికి రాచబాట వేస్తుంది.

* భాష-1,2 లలో 'భాషా బోధనా పద్ధతులు' పండిత్‌ కాని అభ్యర్థులకు మింగుడుపడటం కష్టమే. అయినా స్కోరింగ్‌ కోసం వ్యూహం ప్రకారం ప్రిపరేషన్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే!

సిలబస్‌ స్థాయి
* పేపర్‌-1కు ఎనిమిదో తరగతి స్థాయి, పేపర్‌-2 పదో తరగతి స్థాయి (కాఠిన్యత) ఉంటుంది.
* టెట్‌ ఉత్తీర్ణతా ప్రమాణం
* జనరల్‌ అభ్యర్థి: 60 శాతం (90 మార్కులు)
* బీసీ అభ్యర్థి: 50 శాతం (75 మార్కులు)
* ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థి: 40 శాతం (60 మార్కులు)
* వికలాంగులు: 40 శాతం (60 మార్కులు)
* కేవలం అర్హత మార్కులకే పరిమితం కాకుండా గరిష్ఠ మార్కులు పొందేందుకు ప్రయత్నించటం అవసరం.

పరీక్ష వ్యూహం ఏమిటి?
* జనవరి నెలలో టెట్‌ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే డీఎస్‌సీ జరుగుతుంది కాబట్టి టెట్‌లో గరిష్ఠ మార్కులు సాధించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

* రెండు పరీక్షలకు ఉమ్మడిగా ఉన్న అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. అలాగే టెట్‌ ముందుగా జరుగుతుంది కాబట్టి తెలుగుభాష, పెడగాజి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ టెట్‌ను ముందుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.

* టెట్‌ పూర్తయిన తర్వాత జీకే అండ్‌ కరంట్‌ అఫైర్స్‌ లాంటి అదనపు అంశాలపై దృష్టి సారించాలి. ఇలా చేస్తే తేలిగ్గా డీఎస్‌సీని ఎదుర్కోవచ్చు.

* ఇప్పటికే టెట్‌ అర్హత పొందిన అభ్యర్థులు సంతృప్తి చెందకుండా తమ స్కోరింగ్‌ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కనీసం 115కి పైన టెట్‌ స్కోరు ఉండే రీతిలో ప్రిపరేషన్‌ ప్రమాణాలను నిర్దేశించుకోవాలి.

* బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పరీక్ష అర్హత వస్తే వారు తెలుగు, ఇంగ్లిష్‌ బోధనాపద్ధతులపై కూడా దృష్టి సారించాలి (టెట్‌ కోసం). డీఈడీ అభ్యర్థులు డీఈడీ కోర్సులో భాగంగా అన్ని రకాల మెథడ్స్‌ చదువుతారు. అందువల్ల ఎస్‌జీటీ కోసం బీఎడ్‌లు వాటిని చదవకపోతే నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది.

* గ్రామీణ అభ్యర్థులు ఇంగ్లిష్‌ భాష అంశాలపై పట్టు సాధించటం విజయానికి దారితీసే సోపానమని గుర్తించాలి. తెలుగు వ్యాకరణంపై పట్టు లేనివారు టెట్‌ కోసం దీన్ని మెరుగుపరచుకోవాల్సివుంది.

* భాషా పండితులు, పీఈటీలు పేపర్‌-1 (టెట్‌లో) అందరిమాదిరిగానే రాయాల్సిందే. పేపర్‌-2 (టెట్‌లో) సాంఘికశాస్త్ర అంశాల్నే ఎన్నుకోవడం వల్ల టెట్‌ స్కోరింగ్‌ మెరుగుపడే అవకాశం ఉంటుంది.

* సొంతంగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు మారిన పాఠ్యగ్రంథాల ఆధారంగా ప్రిపరేషన్‌ సాగుతోందా లేదా అని పరిశీలించుకోవాలి. పాత నోట్సుల, పాత పాఠ్యపుస్తకాల ఆధారంగా సిద్ధమైతే బావిలో కప్ప మాదిరి పరిస్థితి ఉంటుందని గుర్తించాలి.ఈ అంశాలు గుర్తించి అధ్యయనం చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు సిద్ధిస్తాయి!



టెట్ సిలబస్ మతలబు
ఈ సిలబస్ లో గమనించాల్సిన ముఖ్యాంశాలను వివరిస్తున్నారు వి. బ్రహ్మయ్య.

టెట్‌లోని అన్ని అంశాలూ డీఎస్‌సీ పరీక్షలో ఉపయోగపడతాయి. తొలిసారి జరిగిన టెట్‌ ప్రశ్నలు నిర్దేశిత సిలబస్‌ నుంచే అడిగారు. అయితే అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సింది- టెట్‌ సిలబస్‌ కేవలం డీఎడ్‌, బీఎడ్‌, సైకాలజీ పుస్తకాల్లో పూర్తిగా లభ్యం కాదు. ఇతర ప్రామాణిక పుస్తకాల నుంచో, ఇంటర్నెట్‌ నుంచో విషయసేకరణ చేసుకుని అభ్యసించాలి.
ఉదాహరణకు... విద్యాహక్కు చట్టం-2009, NCF-2005, వైగాట్‌స్కీ, ఛామ్‌స్కీ సిద్ధాంతాలు, వికాస అధ్యయన ఉపగమాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఉపగమాలు మొదలైనవి.

డీఎస్‌సీ పరీక్ష లాగా కేవలం డీఎడ్‌, బీఎడ్‌, తెలుగు అకాడమీ మనోవిజ్ఞాన శాస్త్రం పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడితే టెట్‌లో కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయటంలో అవరోధాలు ఎదురు కావొచ్చు.

* గత ప్రశ్నపత్రం తీరును సూక్ష్మంగా పరిశీలించి ఆ వచ్చిన అవగాహనతో ప్రిపరేషన్‌ సాగించాలి.
* తొలి టెట్‌లో ప్రధానంగా శిశువికాసం-అధ్యయనానికి సంబంధించి ప్రశ్నలు అడిగిన తీరు విశ్లేషణాత్మకంగా, అనుప్రయుక్తానికి చెందినట్టు గమనించవచ్చు. జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేలా కాకుండా తరగతి గది అధ్యయనానికి చెందిన ప్రశ్నలను పరిశీలనా దృష్టితో రాసేలా అడిగారు.

* పెడగాజి విషయంలో దాదాపు ప్రశ్నలన్నీ జ్ఞానాన్ని పరీక్షించేలాగే ఉన్నాయి. ముఖ్యంగా బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు-స్పష్టీకరణలు, శిశుకేంద్ర పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం మొదలైనవి అవగాహన చేసుకుంటే తేలిగ్గా సమాధానాలు రాయవచ్చు.

* తెలుగు భాష 24 మార్కుల కంటెంట్‌ విభాగానికి సంబంధించి వ్యాకరణాంశాలను పదో తరగతి వరకూ క్షుణ్ణంగా అభ్యసించాలి. బోధనా పద్ధతుల్లో డీఎడ్‌ సిలబస్‌ తెలుగు అకాడమీని అనుసరిస్తే అభ్యసనానికి సులువు.

* ఏపీ రాష్ట్ర సిలబస్‌లోని అన్ని టాపిక్స్‌ను కాకుండా టెట్‌కు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారమే అధ్యాయాల వారీగా అభ్యసించడం ఉత్తమం.
* అభ్యసించిన అంశాలను పునశ్చరణ, సాధన, మాదిరి ప్రశ్నపత్రాల సాధన చేస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు.
* ప్రధాన అంశాలను పునరభ్యసనం, పునర్విమర్శ చేయాలి.

1 comment:

  1. టీచర్ ట్రైనింగ్ కోర్సు (T.T.C/DIETCET) నోటిఫికేషన్ ఎప్పుడువెలువడనుంది ? అలాగే నేను ఆంధ్రప్రదేశ్ సార్వత్రక విద్యాలయం ద్వారా ఇంటర్మీడియట్(A.P.S.O.S/(apopenschool.org)) ఏప్రిల్ (2012) లో పరీక్ష రాయబోతున్నాను ! నేను (T.T.C/DIETCET)
    రాయడానికి అర్హుడనేనా ? దయవుంచి తెలుపగలరు!

    మరొక డౌట్ ఓపెన్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సమానమా కాదా ?

    ధన్యవాదములు
    j.s.k.nadh

    ReplyDelete