ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, మరికొన్ని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష... ఆలిండియా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఈ).
11వ ఏఐఈఈఈ పరీక్ష 29 ఏప్రిల్ 2012న జరగనుంది.
దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు రాసే ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఇది. దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. పరీక్ష మీద సరైన అవగాహనతో సిద్ధమైతే ఇందులో విజయం సాధించి మంచి సంస్థలో సీటు దక్కించుకోవడం సులభం!
గత ఏడాది సుమారు పదిన్నర లక్షల మంది విద్యార్థులు ఏఐఈఈఈ రాశారు. ఏఐఈఈఈ 2011 ద్వారా వివిధ రకాల ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 28 వేల సీట్లు భర్తీ అయ్యాయి. ఏఐఈఈఈ 2012కు తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్ష రెండు పద్ధతుల్లో జరగనుంది. అవి...
1) పేపర్-పెన్ పద్ధతిలో జరిగే ఆఫ్‌లైన్ పరీక్ష:
ఇది 29 ఏప్రిల్ 2012న మనదేశంలోని 63 పట్టణాల్లో, దుబాయ్, రియాద్‌లలో జరగనుంది.
2) కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష:
ఇది 7 మే 2012 నుంచి 25 మే 2012 వరకు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 22 నగరాల్లో జరగనుంది. మనరాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలున్నాయి.
ఏఐఈఈఈ 2012 (ఏ పద్ధతిలోనైనా) రాయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. పరీక్ష ఫీజును డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా గానీ, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా గానీ చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు నింపడంలో ఏమైనా ఇబ్బందులెదురైతే గత ఏడాది ఏఐఈఈఈ 2011 అప్లికేషన్‌లు విక్రయించిన సహాయ కేంద్రాల్లో సంప్రదించవచ్చు. ఆ కేంద్రాల్లో దరఖాస్తుల విక్రయం ఉండదుకానీ, ఆన్‌లైన్‌లో నింపడానికి సహాయం లభిస్తుంది.
ఏఐఈఈఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఇంజినీరింగ్ కోర్సులైన బీఈ/ బీటెక్‌లలో చేరదలచుకున్న విద్యార్థులు పేపర్-1ను, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో చేరదలచుకున్నవారు పేపర్-2 రాయాలి. పేపర్-1లో మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో సమాన ప్రాధాన్యత గల ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. పేపర్-2లో మేథమేటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు, డ్రాయింగ్ పరీక్షలుంటాయి. పరీక్ష విధానానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసంwww.cbse.nic.inలేదా www.aieee.nic.in వెబ్‌సైట్ చూడగలరు.
పెరుగుతోన్న ప్రతిష్ఠ
ఇటీవలి కాలం వరకు ఐఐటీ జేఈఈ తర్వాత రెండో ప్రాధాన్యత గల పరీక్షగా ఏఐఈఈఈకి పేరుంది. గత కొన్నేళ్ల నుంచి, ఐఐటీ - జేఈఈతో సమాన ప్రాధాన్యం గల పరీక్షగా ఏఐఈఈఈ గుర్తింపు తెచ్చుకుంది. 2006వ సంవత్సరం నుంచి ఐఐటీ జేఈఈ పరీక్ష ప్రతిష్ఠ క్రమేణా తగ్గుతూ వస్తోంది. పూర్తి ఆబ్జెక్టివ్ తరహా పరీక్షగా మారడం, పరీక్షలో సుమారు 50 శాతం ప్రశ్నలకు నెగటివ్ మార్కులు లేకపోవడం, ప్రశ్నల స్థాయి బాగున్నా, ఊహించి సమాధానాలు రాసే విద్యార్థులకు కూడా ర్యాంకు వచ్చేలా పరీక్ష రూపాంతరం చెందడం లాంటి విషయాలు జేఈఈని నిపుణుల విమర్శకు గురిచేశాయి.
మరోవైపు ఏఐఈఈఈకి క్రమేణా ఖ్యాతి పెరుగుతోంది. ప్లస్ 2 స్థాయిలోనే నాణ్యమైన ప్రశ్నలను రూపొందించడం, ప్రతి ప్రశ్నకు నెగటివ్ మార్కింగ్ ఉండటం వల్ల ఊహించి సమాధానాలు రాయడానికి అవకాశం లేకపోవడం, పరీక్షను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించడం లాంటి అంశాలు ఏఐఈఈఈ ప్రతిష్ఠను పెంచాయి. అంతేగాక, ఐఐటీల సంఖ్యను రెండింతలకుపైగా పెంచినా కొత్త ఐఐటీలకు సరైన భవనాలు, బోధనాసిబ్బంది, వసతులు లేకపోవడం వల్ల... ఐఐటీ-జేఈఈలో 3000 పైన ర్యాంకు సాధించిన విద్యార్థులు, కొత్త ఐఐటీల్లో చేరడానికి బదులు, పేరున్న ఎన్‌ఐటీలు, ఐఐఐటీలలో చేరడానికే ఇష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఐటీలతో సమానంగా ఈ సంస్థలకు కూడా గుర్తింపు ఉండటం వల్ల విద్యార్థులు ఏఐఈఈఈకి కూడా జేఈఈతో సమానమైన ప్రాధాన్యం ఇచ్చి సంసిద్ధులవుతున్నారు.
మనరాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐఈఈఈ పరీక్షపై అవగాహన తక్కువనే చెప్పాలి. రాష్ట్రం నుంచి జేఈఈలో మంచి ర్యాంకులు సాధించినవారికే ఏఐఈఈఈలో కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయిగానీ, జేఈఈలో విజయం సాధించని అభ్యర్థులకు ఏఐఈఈఈలో కూడా మంచి ర్యాంకు రావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఐటీ జేఈఈలో ఏ ర్యాంకూ రాని విద్యార్థులు ఎందరికో ఏఐఈఈఈలో మంచి ర్యాంకులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే... అక్కడి విద్యార్థులు, ఐఐటీ జేఈఈ స్థాయి తమకు లేదనుకుంటే, ఆ పరీక్ష జోలికి వెళ్లకుండా, పదో తరగతి తర్వాత రెండేళ్లూ ప్రత్యేకంగా ఏఐఈఈఈ కోసం తయారవుతున్నారు. మన రాష్ట్రంలోని విద్యార్థులకు తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అంచనా వేసుకోకుండా ఐఐటీలపై మోజుతో జేఈఈ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఓ ఏడాది గడచిన తర్వాత నిరాశ చెంది ఏఐఈఈఈ వైపు దృష్టి సారిస్తున్నారు. సమయం వృధా కావడం వల్ల, విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడినట్టుగా తయారవుతోంది.
జేఈఈ, ఈఈఈ మధ్య వ్యత్యాసం
ఐఐటీ- జేఈఈ, ఏఐఈఈఈ రెండూ దాదాపు ఒకే సిలబస్ మీద ఆధారపడిన ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలే అయినా, ప్రశ్నల రూపకల్పనలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. జేఈఈలో సబ్జెక్టు లోతుల్లోని భావనలపై, చిక్కుముడి ఉన్న ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు సాధారణంగా మార్కెట్‌లో లభించే పుస్తకాల్లో ఉండవు. కాబట్టి పరీక్ష హాల్లో విద్యార్థి తనకు సబ్జెక్టుపై ఉన్న అవగాహనతో, తాను చదువుకున్న భావనలను ఉపయోగించి, సమాధానం కనుక్కోవలసి ఉంటుంది. రెండేళ్లూ కష్టపడి సబ్జెక్టులను క్షుణ్నంగా, ఏ మూలా వదలకుండా అధ్యయనం చేసిన విద్యార్థులే ఇలాంటి ప్రశ్నలు సాధించగలుగుతారు.
ఏఐఈఈఈలో ప్రశ్నలు సబ్జెక్టు మూలాలపై ఆధారపడి ఉంటాయి. జ్ఞాపక శక్తి, వేగాన్ని పరీక్షించే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రశ్నలు, మార్కెట్లో లభించే పుస్తకాల్లోని ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయి. అందువల్ల ఏఐఈఈఈకి ప్రిపేరయ్యే విద్యార్థులు సబ్జెక్టు లోతులకు వెళ్లకుండా, బేసిక్స్, ఫండమెంటల్స్‌ను బాగా చదువుకొని, వాటిపై ఆధారపడిన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. సరైన సాధనతో, ప్రణాళికా బద్దంగా ప్రిపేరైతే సగటు విద్యార్థి కూడా ఏఐఈఈఈలో మంచి ర్యాంకు సాధించవచ్చు.
No comments:
Post a Comment