ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday, 18 October 2011

ఖర్చు లేకుండా శాస్త్రవేత్త కావాలంటే... ?


స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీలో శిక్షణ, పరిశోధనలకు మనదేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ... ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ). 

కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటైన ఈ సంస్థలో ప్రవేశం లభిస్తే, ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం లభించినట్లే!

ఐఐఎస్‌టీకి డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా ఉంది. 2012 సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐఎస్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సంస్థ నిర్వహించే 'ఐశాట్‌' (ఐఐఎస్‌టీ అడ్మిషన్‌ టెస్ట్‌)కు బాగా పోటీ ఉంటుంది.

ఈ సంస్థ అందిస్తోన్న కోర్సులు, ఐశాట్‌ 2012 వివరాలు...

సియాలోనే మొదటి స్పేస్‌ యూనివర్సిటీ ఐఐఎస్‌టీ. స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీ, స్పేస్‌ అప్లికేషన్స్‌, తదితర సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ, పరిశోధన కోర్సులను ఐఐఎస్‌టీ అందిస్తోంది. ఈ సంస్థ అందించే ప్రోగ్రామ్‌లలో బాగా ప్రాచుర్యం గల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఐశాట్‌లో మంచి స్కోరు తప్పనిసరి. 2011 అడ్మిషన్ల సమయంలో బీటెక్‌లో మొత్తం 156 సీట్లు ఉన్నాయి. 2012 ప్రవేశాల నాటికి సీట్ల సంఖ్యలో మార్పు ఉండొచ్చు.

ఐఐఎస్‌టీలో నాలుగేళ్లలో బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఇస్రో లేదా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. బీటెక్‌లో కనీసం 6.5 సీజీపీఏ సాధించిన విద్యార్థులు అందరికీ ఇస్రోలో అవకాశం లభిస్తుంది. అభ్యర్థులు కనీసం ఐదేళ్లు తప్పనిసరిగా ఇస్రోలో పనిచేయాలి.

* ఐఐఎస్‌టీ విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయదు. హాస్టల్‌, బోర్డింగ్‌, ట్యూషన్‌ ఫీజులను పూర్తిగా సంస్థ భరిస్తుంది. 10కి కనీసం 6 జీపీఏ సాధించిన విద్యార్థులందరికీ ఈ సౌకర్యం లభిస్తుంది. ఇవిగాక ప్రతి సెమిస్టర్‌కు బుక్‌ అలవెన్స్‌ కింద రూ.3000 ఇస్తారు. ఏదైనా సెమిస్టర్‌లో 6 జీపీఏ కంటే తక్కువ గ్రేడ్‌ సాధిస్తే తర్వాత సెమిస్టర్‌కు హాస్టల్‌, వైద్య, తదితర ఖర్చులను విద్యార్థి భరించాలి.

ఐఐఎస్‌టీలో బీటెక్‌ ప్రోగ్రామ్‌లు...
* బీటెక్‌ (ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌): ఇది నాలుగేళ్ల కోర్సు. సీట్ల సంఖ్య 59. స్పేస్‌ టెక్నాలజీ నిపుణులను తయారుచేయడం దీని లక్ష్యం. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ సైన్సెస్‌, స్పేస్‌ డైనమిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు కూడా ఈ కోర్సులో ఉంటాయి. మనదేశంతోపాటు విదేశాల్లో అందిస్తోన్న ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌లకు ఇది దగ్గరగా ఉంటుంది.
* బీటెక్‌ (ఏవియానిక్స్‌): సీట్ల సంఖ్య 58. వ్యవధి నాలుగేళ్లు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ కూడా ఇందులో అధ్యయనం చేస్తారు. ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌లో ఉపయోగించే డిజిటల్‌ కమ్యూనికేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌లాంటి అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌ అంశాలు కూడా ఉంటాయి.
* బీటెక్‌ (ఫిజికల్‌ సైన్సెస్‌): దీని వ్యవధి కూడా నాలుగేళ్లు. సీట్ల సంఖ్య 39. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, తదితర బేసిక్‌ సైన్సెస్‌ పరిజ్ఞానాన్ని స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీకి వర్తింపచేయడం ఈ కోర్సు లక్ష్యం. రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌, ఎర్త్‌ సిస్టమ్‌ సైన్సెస్‌, తదితర అంశాలను ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు.

ఐఐఎస్‌టీ నిబంధలను అనుసరించి పరిమిత సంఖ్యలో విద్యార్థులను స్పెషలైజేషన్‌లు మార్చుకోవడానికి అనుమతిస్తారు. మొదటి ఏడాది తర్వాత మాత్రమే ఇది వీలవుతుంది.

పరీక్ష విధానం
ఐశాట్‌ 2012 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి... కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌. ఈ పేపర్లకు సంబంధించిన సిలబస్‌ ఐశాట్‌ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షను హైదరాబాద్‌, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తారు.

* 2011 లేదా 2012లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ (ఎంపీసీ) సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా +2 ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌, పదో తరగతిలో కనీసం 70 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 శాతం చాలు) అవసరం.
* అభ్యర్థులు ఐఐఎస్‌టీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 1 నవంబరు 2011
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 31 డిసెంబరు 2011
* ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 6 జనవరి 2012
* హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం: 2 మార్చి 2012
* ఐశాట్‌ 2012 తేదీ: 21 ఏప్రిల్‌ 2012
* ఫలితాల విడుదల: 23 మే 2011

No comments:

Post a Comment