ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 3 October 2011

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు... ‘మహారత్న’ఉద్యోగాలు

 ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు ఆకర్షణీయమైన వేతనం, కెరియర్‌ వృద్ధి అవకాశాలతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

దేశ ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోన్న మహారత్న, నవరత్న కంపెనీల్లో స్థిరపడే అవకాశం ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చింది.

బీహెచ్‌ఈఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌, ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, తదితర ప్రభుత్వ రంగ కంపెనీలు (పీఎస్‌యూలు) ఏటా వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ (జీఈటీ)ల నియామకాలను చేపడుతున్నాయి.

ఇంజినీరింగ్‌లో మంచి మార్కులతోపాటు గేట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు.


ఈ కథనం అందించినవారు- వి. రాకేష్‌ కుమార్‌.


ఇంజినీరింగ్‌ కెరియర్‌లో గడచిన ఇరవై ఏళ్లలో అనేక మార్పులు చోసుచేసుకున్నాయి. వేల సంఖ్యలో కాలేజీలు ఏర్పాటుకావడం, ఐఐటీలు, ఎన్‌ఐటీల సంఖ్య బాగా పెరగడం... ఇంజినీరింగ్‌ పట్ల విద్యార్థుల్లో అధికమవుతోన్న ఆసక్తిని నిరూపిస్తున్నాయి. సాంప్రదాయ, సాంప్రదాయేతర కెరియర్‌లలో కూడా ఇంజినీరింగ్‌ అగ్రస్థానంలో ఉంటోంది. ప్రైవేటు రంగంలో అనేక కొత్త విభాగాలు పుట్టుకొస్తూ మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగం కూడా ఇంజినీరింగ్‌ విద్యార్థులను బాగా ఆకర్షిస్తోంది. ఉద్యోగ భద్రత, విధి నిర్వహణలో సంతృప్తి, కెరియర్‌ వృద్ధి అంశాల్లో ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రైవేటు రంగం కంటే మెరుగ్గా ఉండటం వల్ల పీఎస్‌యూ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటోంది.
ఐఐటీలు, పేరున్న ఇంజినీరింగ్‌ కాలేజీల ప్లేస్‌మెంట్లలో కూడా పీఎస్‌యూలు అధికంగా పాల్గొంటున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, తదితర అగ్రశ్రేణి పీఎస్‌యూలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో పాల్గొంటున్నాయి. ఆఫ్‌ క్యాంపస్‌ పద్ధతిలో కూడా వేల సంఖ్యలో ఇంజినీరింగ్‌ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. దీనికి గేట్‌ స్కోరును ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

65 శాతం మార్కులు అవసరం
ఉన్నత శ్రేణి పీఎస్‌యూ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలన్నా, కెరియర్‌లో ఎదగాలన్నా, టెక్నికల్‌ నాలెడ్జ్‌తోపాటు మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలు అవసరం. చాలావరకు పీఎస్‌యూ కంపెనీలు టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అంశాల్లో ప్రత్యేకంగా నియామక పరీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. నియామక పరీక్షల్లో సాధారణంగా సెక్షన్‌లవారీగా కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకుంటాయి. ఎక్కువ శాతం పీఎస్‌యూ కంపెనీలు ఇంజినీరింగ్‌లో కనీసం 60-65 శాతం మార్కులను ప్రధాన అర్హతగా పరిగణిస్తున్నాయి.

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ప్రభుత్వ రంగంలో భారీగా లభిస్తోన్న ఉద్యోగాలు... 
జూనియర్‌ టెలికాం ఆపరేటర్లు,
గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీలు,
జూనియర్‌ ఇంజినీర్లు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏటా దాదాపు మూడు వేల మంది జేటీఓలను నియమించుకుంటోంది. ప్రభుత్వ రంగ కంపెనీలు నియామకాల్లో ఫ్రెషర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇంజినీర్ల నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రధాన కంపెనీలు.... బీహెచ్‌ఈఎల్‌, ఎన్టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సెయిల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ మొదలైనవి. బీటెక్‌/ బీఈలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, మెటలర్జీ, సివిల్‌, తదితర బ్రాంచీలు చదివిన అభ్యర్థులకు ఈ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.


గేట్‌ స్కోరు ఆధారంగా...
బీహెచ్‌ఈఎల్‌, ఎన్టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌, పవర్‌ గ్రిడ్‌ కంపెనీలు గేట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను వడపోత పోస్తున్నాయి. ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్‌ 2012 రాయాలి. అనేక ఇతర కంపెనీలు విడిగా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కంపెనీలు నిర్వహించే పరీక్షల కంటే గేట్‌లో మంచి స్కోరు సాధించడం కొంచెం కష్టతరం. గేట్‌ పరీక్ష ఇతర పరీక్షలతో పోల్చితే ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. అందువల్ల గేట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఇతర పీఎస్‌యూలు నిర్వహించే పరీక్షలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. తద్వారా పీఎస్‌యూల ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవడంతోపాటు, అవసరమైతే మంచి విద్యాసంస్థలో ఎం.టెక్‌., ఎం.ఈ, లేదా పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంటుంది. పీజీ స్థాయిలో వివిధ స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు పొందడానికి కూడా గేట్‌లో మంచి స్కోరు తప్పనిసరి.గేట్‌కు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష విధానం, ప్రశ్నపత్రం స్వభావం, ఇతర వివరాలు 12 సెప్టెంబరు 2011 నాటి 'చదువు' సంచికలో లభిస్తాయి.

అభ్యర్థులు కంపెనీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజులూ చెల్లించనవసరం లేదు. గేట్‌ 2012 రాయడానికి మాత్రమే ఫీజు చెల్లించాలి. గేట్‌కు దరఖాస్తు చేసిన తర్వాత కంపెనీలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

పవర్‌గ్రిడ్‌లో ట్రెయినీ ఖాళీలు
నవరత్న కంపెనీ అయిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కంపెనీ పనిచేస్తోంది. గేట్‌ స్కోరు ఆధారంగా ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) ఖాళీల భర్తీని పవర్‌గ్రిడ్‌ చేపట్టింది. అభ్యర్థులు ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ / బీఎస్‌సి (ఇంజినీరింగ్‌) చేసుండాలి. ఫుల్‌టైమ్‌ కోర్సులు చేసినవారు మాత్రమే అర్హులు. ఏఎంఐఈ ద్వారా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులు కూడా అర్హులు. వీరికీ 65 శాతం మార్కులు అవసరం. ఆయా కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 31 డిసెంబరు 2011 నాటికి 28 ఏళ్లకు మించరాదు.

ఖాళీల వివరాలను జనవరి 2012లో కంపెనీ ప్రకటిస్తుంది. గేట్‌ 2012 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పేపర్‌ (ఈఈ)లోనే గేట్‌ రాయాలి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ మిగతా కంపెనీలకంటే ఆకర్షణీయమైన వేతనం ఇస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో సీటీసీ ఏడాది రూ.6.6 లక్షలు లభిస్తుంది. తర్వాత ఇంజినీర్‌ హోదాలో ఏడాదికి సీటీసీ రూ.12.09 లక్షలు ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులు మూడేళ్లు తప్పనిసరిగా కంపెనీలో పనిచేయాలి. ఈ మేరకు లక్ష రూపాయలకు బాండ్‌ రాయాలి. అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.

* పవర్‌గ్రిడ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4 జనవరి 2012

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2012.

No comments:

Post a Comment