ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 1 December 2011

మార్కులు పెరిగేట్టు...మన భాషపై మనసు పెట్టు!

తెలుగు పాఠ్యాంశాలలోని చాలామటుకు అంశాలు అభ్యర్థులు పాఠశాల, కళాశాల స్థాయుల్లో చదివినవే. అయితే వీటి అవసరం లేక మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్లీ శ్రద్ధ పెట్టాలి.

'మళ్లీ గుర్తుకు తెచ్చుకుందాం.. మళ్లీ తెలుసుకుందాం' అని ఇష్టపడితే తెలుగులో మార్కులు సంపాదించడం కష్టమేమీ కాదు.

అపరిచిత గద్యం, అపరిచిత పద్యం అనేవి పాఠ్యేతర అంశాలు. వీటిల్లో రెండోది కొంచెం కష్టం. అయితే ఈ తెలియని అంశాలలో.. తెలిసినవి ఉంటాయన్నది గ్రహించాలి.

గత ప్రశ్నపత్రం ఆధారంగా అపరిచిత గద్యం, అపరిచిత పద్యం అనేవాటికి ఒక్కొక్కటికి ఆరు మార్కుల చొప్పున మొత్తం పన్నెండు మార్కులున్నాయి.

అంటే, భాషా సాహిత్యాలకు కలిపి మొత్తం 24 మార్కులుంటే ఈ అపరిచిత గద్యం, పద్యాలకే సగం మార్కులు! వీటిల్లో మనం చదువుకునే భాషా సాహిత్యాంశాలే ప్రశ్నలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. గద్యమైనా, పద్యమైనా ఆరు ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయమంటారు. చాలావరకు సమాధానాలు ఇచ్చిన దానిలోనే ఉంటాయి. పద్యంలో కొన్ని ఉంటాయి.

కవులు, కావ్యాలు, రచయితలు, రచనలు, ప్రక్రియలు అనే అంశం రెండోది. నిర్దిష్టంగా సిలబస్‌ లేదు కాబట్టి ప్రాచీన, ఆధునిక కవుల్లో ముఖ్యమైనవారిని తెలుసుకోవాలి. కవికాలం, బిరుదు, ముఖ్యమైన రచనలు.. చదివితే చాలు. కొటేషన్లకి ప్రాధాన్యం లేదని గుర్తించాలి.

ప్రక్రియలు అంటే కావ్యం, ప్రబంధం, శతకం, కథ, నవల, నాటిక వంటివి. వీటిలో ముఖ్యాంశాలు మాత్రమే గుర్తుంచుకుంటే చాలు.

ఇంటర్‌స్థాయిలో వ్యాకరణం
వ్యాకరణాంశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ దాదాపుగా ఇవన్నీ పూర్వం చదివినవే. నిజానికి ఇంటర్‌ స్థాయివే. సంధులు, సమాసాలు, ప్రకృతి-వికృతులు, ఛందస్సు చాలా ముఖ్యం.

* సంధుల్లో సంస్కృత సంధులైన సవర్ణ, గుణ, వృద్ధి, యణా దేశాలు చదివితే చాలు. తెలుగు సంధుల్లో ఉకార సంధి, పుంప్వాదేశం, గసడదవాదేశం, ద్రుత సంధి, త్రిక సంధి, రుగాగమ సంధులకు ప్రాధాన్యమివ్వాలి.

* సమాసాలన్నీ ఇంచుమించుగా చదవాలి.

* ఛందస్సులో వృత్త పద్యాలైన ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం బాగా నేర్చుకోవాలి. వీటి గణాలు, యతి స్థానాలు గుర్తుంచుకోవాలి. ఆటవెలది, తేటగీతి, సీసం వంటి వాటి గణాలు తెలుసుకుంటే చాలు. వృత్త పద్యాలు మాత్రం ఉదాహరణలతో అభ్యాసం చేయాలి.

* కళలు, విభాష, ద్రుతం, పరుషాలు, సరళాలు వంటి కొన్ని పారిభాషిక పదాలను తెలుసుకోవాలి.

* సామెతలు, జాతీయాలు అనేవి గత ప్రశ్నపత్రం ఆధారంగా చూస్తే ప్రత్యేకంగా అడగలేదు. అపరిచిత గద్య పద్యాలనే అడుగుతున్నారని గమనించాలి.
* అలంకారాలలో వృత్త్య్తనుప్రాస, యమకం, అంత్యానుప్రాస, ఉపమ, రూపకం, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, స్వభావోక్తి, శ్లేష ముఖ్యం.

వాక్యభేదాలు
సామాన్యంగా వాక్యంపై ప్రశ్న తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాక్య భేదాలు- వీటిలో నామ్నీకరణ వాక్యం, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, కర్త్రరి, కర్మణి వాక్యాలు చాలా ముఖ్యం.

వీటిపై ప్రశ్న, ఒక వాక్యం ఇచ్చి మరొక వాక్యానికి మార్చమని అడిగేలా ఉంటుంది.

ఉదా. రాముడు అన్నం తిన్నాడు. రాముడు చదివాడు.

దీనిని సంశ్లిష్ట వాక్యంగా మార్చమంటే..

ఉదా. రాముడు అన్నం తిని చదివాడు అనాలి.

ఇదేవిధంగా ప్రత్యక్ష వాక్యం ఇచ్చి పరోక్ష వాక్యానికి మార్చమంటారు.

విషయం ఎక్కువ, మార్కులు తక్కువ
రెండో విభాగం బోధనా పద్ధతులు. ఇందులో ఆరు అంశాలకు ఆరు మార్కులున్నాయి. విషయం ఎక్కువ. మార్కులు తక్కువ. ఇందులో భాషా నైపుణ్యాలు, బోధన పద్ధతులు, మూల్యాంకనం, ఉపకరణాలు చాలా ముఖ్యమైనవి. మొదటి రెండంశాలు ఇంకా ుఖ్యమైనవి.

ప్రశ్నలు ఇలా ఉండవచ్చు.

* విస్తార పఠనానికి అనుకూలమైనది.
1. కావ్యం
2. వాచకం
3. ఉపవాచకం
4. నిఘంటువు (3)

* కిండర్‌ గార్టెన్‌ పద్ధతిని ప్రతిపాదించినవారు
1. ఫ్రోబెల్‌
2. మాంటిసోరి
3. కొఠారి
4. ఎవరూ కాదు (1)

నాటకీకరణ, భాషా నైపుణ్యాల వరుస.. తరగతుల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలు, పద్య గద్య వ్యాకరణ బోధనలు ప్రధానంగా చదవాలి. మూల్యాంకనంలో పూర్వపు పద్ధతుల్ని, ఆధునిక పద్ధతుల్ని తెలుసుకోవాలి. బోధనా పద్ధతులలో కిండర్‌ గార్టెన్‌, మాంటిసోరి, డాల్టన్‌ పద్ధతులపై శ్రద్ధ పెట్టాలి.

మొత్తం మీద కష్టమైనది ఏంటంటే, అపరిచిత పద్యం. దీనికి 7 నుంచి పదో తరగతి వరకు ఉండే తెలుగు వాచకాలలోని పద్యాలను ఒకసారి పరిశీలిస్తే అవగాహనా సామర్థ్యం అలవడుతుంది.

No comments:

Post a Comment