ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday 11 December 2011

అమెరికా విద్యాభ్యాసానికి దరఖాస్తుల తరుణం!

మ కలల కోర్సులు చదవటానికి యు.ఎస్‌.ఎ.కు ఏటా లక్షమందికి పైగా విద్యార్థులు ప్రయాణమవుతూవుంటారు.

అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందటం ఉజ్వల భవితను తీర్చిదిద్దుకోవటంలో మొదటి మెట్టు. ఆ దేశంలో అడ్మిషన్ల ప్రక్రియ చాలా సంక్లిష్టం.

ఈ సందర్భంగా విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలను శుభకర్ ఆలపాటి వివరిస్తున్నారు!

గత ఐదేళ్ళుగా యు.ఎస్‌.ఎ.కు విద్యాభ్యాసం కోసం వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య నిలకడగా పెరుగుతోంది. వీసా అనుమతి పొందేవారి కంటే ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారి సంఖ్య రెట్టింపు ఉంటుంది.

విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవటంతో తొలి అడుగు మొదలవుతుంది. యు.ఎస్‌.ఎ. విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందటం అనిశ్చితం కాబట్టి ముందుజాగ్రత్తగా చాలామంది విద్యార్థులు కనీసం 3-4 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు పంపుకుంటారు. దీనిమూలంగా విశ్వవిద్యాలయాలకు అందే దరఖాస్తుల సంఖ్య భారీగా ఉంటుంది.

ప్రవేశం సాధించటం, వీసా... ఈ మొత్తం ప్రక్రియకు నెలల కాలం పడుతుంది. ముందుగానే విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయటం ఎంతో మేలు. దీనివల్ల ఆఖరి నిమిషంలో పడే అనవసరపు హైరానా తప్పుతుంది; ఆందోళన తగ్గుతుంది.

రెండు సీజన్లు
యు.ఎస్‌.ఎ. విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు రెండు సీజన్లుంటాయి. ఫాల్‌ (సెప్టెంబరు), స్ప్రింగ్‌ (జనవరి). కొద్ది యూనివర్సిటీలు మాత్రం సమ్మర్‌ (మే) కూడా ప్రవేశాలు అందిస్తాయి. వీటిలో అన్ని యూనివర్సిటీలూ, కోర్సులూ ప్రారంభయ్యేదీ, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరేదీ ఫాల్‌లోనే. తమ విద్యాసంవత్సరం ముగిశాక వచ్చే ఈ సమయంలో చేరటానికే విద్యార్థులు మొగ్గుచూపుతుంటారు. బ్యాచిలర్స్‌ డిగ్రీ తర్వాత కాలం వృథా కాకుండా వెంటనే మాస్టర్స్‌లో కొనసాగటానికి వీలవుతుందన్నమాట!

దరఖాస్తు గడువులు
ఈ తేదీలు ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకంగా ఉంటాయి. విశ్వవిద్యాలయ విధానాలూ, నిబంధనల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు.

సాధారణంగా ఉత్తమ ర్యాంకింగ్‌ ఉన్న విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన గడువులు కింది విధంగా ఉంటాయి.
ఫాల్‌: డిసెంబరు 31 స్ప్రింగ్‌: ఆగస్టు1
కొన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు:
ఫాల్‌: మార్చి 1 స్ప్రింగ్‌: అక్టోబరు 1
అంత మంచి ర్యాంకులు లేని విశ్వవిద్యాలయాలకు:
ఫాల్‌: మే 1 స్ప్రింగ్‌: నవంబరు 1

ఒకే విశ్వవిద్యాలయంలో ఒక్కో విభాగానికి ఒక్కో రకమైన గడువుతేదీలు కూడా ఉంటాయి. ఫార్మసీ, హెల్త్‌ సైన్సెస్‌, సైన్సెస్‌ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమవటానికి చాలా తక్కువ వ్యవధే ఉంటుంది. అందుకని ముందుగానే దరఖాస్తు చేయాల్సివుంటుంది.

ఆర్థిక మాంద్యం మూలంగా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల అలభ్యత వల్ల చాలా విశ్వవిద్యాలయాలకు ఫండింగ్‌ అవకాశాలు తక్కువే. ఒకప్పటితో పోలిస్తే ఉపకార వేతనాలు చాలా తక్కువ. వీటి అవసరమున్నవారు తుది గడువు కంటే చాలాముందే దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం.

  ఉపకారవేతనాలతో పాటు ప్రవేశం కావాలంటే చాలా విశ్వవిద్యాలయాలకు వేర్వేరు గడువు తేదీలుంటాయి. వీటి వివరాలను వెబ్‌సైట్లలో కూడా పేర్కొనరు. అందుకే ఉపకార వేతనాలూ, ఫీజు రాయితీలూ కావాలనుకున్నవారు జాప్యం లేకుండా దరఖాస్తు చేయటం చాలా ముఖ్యం. మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి.
యు.ఎస్‌. విద్యార్థి వీసా (ఎఫ్‌ 1) ప్రక్రియ చాలా వ్యవధి తీసుకుంటుంది. ప్రవేశాల దగ్గర్నుంచి వీసా వరకూ 3-6 నెలల సమయం, ఒకోసారి అంతకంటే అధిక సమయం కూడా పడుతుంది. అయితే కొన్నిసార్లు చాలా వేగంగా ఈ ప్రక్రియ పూర్తవటం కూడా జరగొచ్చు.

అన్నీ పరిశీలించాకే...
దరఖాస్తును వివిధ విభాగాలవారీగా సాకల్యంగా సమీక్షించాకే I 20 ను నిర్థారిస్తారు. ఈ నిర్ణయ సమాచారం ఏర్‌మెయిల్‌ ద్వారానే పంపుతారు కాబట్టి సీటు పొందిన విషయం వెంటనే కాకుండా... దాదాపు 20 రోజుల్లో విద్యార్థికి తెలిసే అవకాశముంది.

ఫాల్‌ ఇన్‌టేక్‌లో విద్యార్థికి ప్రవేశంతో పాటు ఇతర అవకాశాలుంటాయి... ఫండింగ్‌, అసిస్టెంట్‌షిప్స్‌, ఉపకారవేతనాలు, ఆన్‌క్యాంపస్‌ వసతి మొదలైనవి. అన్ని దేశాల నుంచీ దరఖాస్తులు వస్తుంటాయి కాబట్టి 'ఇంటర్నేషనల్‌ అడ్మిషన్స్‌ డిపార్ట్‌మెంట్‌' అర్హతలున్న విద్యార్థులందరికీ ప్రవేశాలూ, ఉపకారవేతనాలను ఖరారు చేయలేదు. కారణం- సీట్లు, ఫండింగ్‌, అసిస్టెంట్‌షిప్‌ అవకాశాలు పరిమితం కాబట్టి.

ఏ విద్యార్థి అయినా నవంబరులో, డిసెంబరు ప్రథమ భాగంలో దరఖాస్తు పంపుకుంటే ప్రవేశాలు పొందటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అదే విద్యార్థి కాలయాపన చేసి, అదే విశ్వవిద్యాలయానికి ఏ ఫిబ్రవరిలోనో దరఖాస్తు చేస్తే ప్రవేశం లభించకపోవచ్చు.

యూనివర్సిటీ నుంచి ఫండింగ్‌/అసిస్టెంట్‌షిప్‌ పొందిన విద్యార్థులకు యు.ఎస్‌. ఎంబసీలో ఎక్కువ అనుకూలత ఉండి వీసా లభించే అవకాశం పెరుగుతుంది.

No comments:

Post a Comment